కవిత్వంలో సమకాలీన ధోరణులను గురించి మనం గత కొంత కాలంగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ ధోరణులను గురించి మరికొంత విపులంగా ఇప్పుడు మాట్లాడుకుందాం. సాహిత్యం అంటే వాస్తవికత పునాదులపై ఏర్పడే కాల్పనికత అని మనకు తెలుసు. కవి కల్పనలోని ప్రపంచం ఆశావహమైతే అందంగానూ నిరాశా నిస్పృహల నిలయమైతే దుఖమయంగానూ కనబడుతుంది. కవి దృష్టికూడా వాస్తవం పై ఆధారపడేదే కనుక కవి తన రచనను ఎంత కాల్పనికం అని చెప్పుకున్నా అది సమకాలీన ఆనంద విషాదాల సమాహారంగానే ఉంటుంది. అయితే కవి ప్రకటనను నిర్దేశించే అంశాలు సమకాలీన స్థితి గతుల ప్రభావంతోనే ఉంటాయి.
తెలుగులో మనం పురాణ ప్రబంధ యుగాలనుండి ఆధునికానంతర యుగం వరకు వచ్చిన వివిధ ధోరణులను చూశాం. ఆధునికానంతర నిరాశావహ వినిర్మాణ దశ నుండి ఆధునిక యుగపు ఆకాంక్షల దిశగా పరుగు తీస్తున్న మెటా మాడ్రన్ వ్యక్తీకరణ పరిణామాలను గురించి మాట్లాడుకోక తప్పని సందర్భంలో ఉన్నాం మనం.
కవి ప్రకటన “మన” నుండి “నా” మీదుగా “నీ” వరకు ప్రవహిస్తూ ‘నిన్నూ’ తన ఆలోచనలో భాగం చేయాలని చూస్తున్న సందర్భం ఇది.
మన కాలపు కవి ఆలోచన ఏమిటి? కవి ఆలోచనను ప్రభావితం చేస్తున్న అంశాలు ఏమిటి? అనేది ఇప్పుడు తర్కించవలసిన సందర్భం.
పారిశ్రామిక విప్లవం తర్వాత విశ్వవ్యాప్తం అయిన ఐరోపా మత సంస్కృతి లోని ప్రేమా, కరుణా, అహింసలు వంటి సాధనాలతో, పారిశ్రామిక విప్లవం తెచ్చిన సంక్షోభాలు స్వేచ్ఛా సమానత్వం, హేతువాదం అస్తిత్వ వాదం వంటి సాధనాలతో ప్రపంచ సాహిత్యం ప్రభావితమైతే ఇరవయ్యో శతాబ్దపు ప్రారంభం నుండి వచ్చిన రాజకీయ ఆర్ధిక సామాజిక మార్పులు కూడా సాహిత్యంపై పెను ప్రభావాన్ని చూపాయి..
ఆధునికత అభ్యుదయంతో కలిసి ముందడుగు వేసింది. కవిత్వంలోనూ ఈ చాయలను మనం ప్రపంచ వ్యాప్తంగా చూడొచ్చు. ఆధునికత తెచ్చిన అభివృద్ధి భ్రమలు ఇరవయ్యో శతాబ్దపు తొలి అర్థ భాగానికి తొలగిపోనారంభించాయి. ఆధునికానంతర వాదం అన్ని వ్యవస్థలనూ అపనమ్మకాల మూటలుగా మార్చింది. ఈ అపనమ్మకాలు పునాదులుగా ఆధునికానంతర వ్యవస్థలు ప్రజలలో జాతి, మత, కుల, దేశ, ప్రాంత, లింగ, విద్య, సంస్కృతి, వంటి అనేక అంశాలను విభేదాలు సృష్టించడానికి వినియోగించుకున్నాయి. అసంతృప్తీ, అపనమ్మకం, వంటి లక్షణాలు సృష్టించిన విభేదాలు సమాజాన్నీ, కుటుంబాన్నీ, మనిషి అస్తిత్వాన్నీ ప్రయోజకత్వాన్నీ ప్రశ్నించాయి.
అయితే ఆధునికానంతర ప్రపంచం సృష్టించిన సందిగ్ధత, అసంతృప్తి, వ్యంగ్యం, అపనమ్మకం వంటి విషయాలనుండి ఇరవయ్యో శతాబ్దపు చివరినాటికే మనిషి బయటపడ్డాడు.
మొత్తం ప్రపంచానికి సంక్లిష్ట సమస్యలుగా తలెత్తిన పర్యావరణ సంక్షోభం, పెరుగుతున్న సామాజిక అసమానతలూ, జీవన అభద్రత, ప్రధాన విషయాలయ్యాయి. గత రెండున్నర దశాబ్దాలుగా పోస్ట్ మాడ్రనిజం స్థానంలో మెటా మాడ్రనిజం మనిషి జీవితంలో చోటుచేసుకోవడం మొదలు పెట్టింది. ఇరవయ్యో శతాబ్దపు చివరి రెండు దశాబ్దాలు తెచ్చిన వాతావరణ మార్పు, ఆర్ధిక అస్థిరత, ప్రపంచంలోని పలు దేశాల మధ్య పెరుగుతున్న విభేదాలూ, విరోధాలూ, మార్పుకై సామూహిక ఆరాటాన్ని పెంచుతూ ‘చరిత్ర అంతం’ అయిందన్న పోస్ట్ మాడ్రన్ గతాన్ని ఆశావహ ఆకాంక్షలతో ముంచెత్తుతున్నాయి.
తెలుగు కవిత్వంలోనూ పోస్ట్ మాడ్రన్ నిరాశావహ ఆలోచనలనుండి సామూహిక చేతన పట్ల ఆశావహ దృక్పథంతో వైయుక్తిక ఆకాంక్షలను వ్యక్తం చేస్తున్న దృశ్యాన్ని ఇప్పుడు మనం చూడొచ్చు.
తెలుగు కవులు పోస్ట్ మాడ్రన్ ధోరణికి భిన్నంగా ఆశావహ దృక్పథంతో (మెటామాడ్రనిజం) ఒక నూతనత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు.. ఆధునికతలోని ఆశయాలను, ఆదర్శాలను, మరియు ఉత్తేజాన్ని పునరుద్ధరిస్తూనే, ఉత్తర-ఆధునికతలోని విశ్లేషణాత్మకత, విమర్శనాత్మకత, అనిశ్చితులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగే ఒక కావ్యధార ఇప్పటి కవిత్వం.
మెటా మాడ్రన్ కవిత్వం కేవలం భావోద్వేగాల ప్రవాహంలా కాక ఆధునిక జీవితంలోని సంక్లిష్టతలను, వైరుధ్యాలను, మరియు నిరంతర ఆటుపోట్లను ప్రతిబింబిస్తూనే సమకాలీన సంక్షోభాలకు అవసరమైన సామూహిక చేతనను ఆవాహిస్తోంది. .
మెటా మాడ్రనిజం ఆధునికతలోని ఆదర్శవాదం, నిష్కాపట్యం, మరియు ఉత్సాహం నుండి ఉత్తర-ఆధునికతలోని సందేహం, వ్యంగ్యం, మరియు విడదీయరాని విమర్శనాత్మకత మధ్య ఊగిసలాడే ఒక పెండ్యులమ్ లాంటిది. ఇది ఆశ, నిరాశ, అమాయకత్వం, విజ్ఞత, సానుభూతి, ఉదాసీనత, ఏకత్వం, బహుళత్వం, సంపూర్ణత, విడి సమూహాలు, స్వచ్ఛత కుటిలత, స్పష్టత అస్పష్టత వంటి విభిన్న భావాలను నిరంతరం అన్వేషిస్తూ ఒకేసారి ఆవిష్కరిస్తోంది., భిన్న దృక్పధాలమధ్య, ఆలోచనలమధ్య మధ్య సృజనాత్మక సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తోంది.
తెలుగు కవులు తమ రచనల్లో ఈ మెటా మాడ్రన్ లక్షణాలను విభిన్న రీతుల్లో ఆవిష్కరిస్తున్నారు. జీవితంలోని వాస్తవికతలను నిర్భయంగా ఆవిష్కరిస్తూనే, మానవతా విలువలను, ఆశావహ దృక్పథాన్ని ప్రకటిస్తున్నారు. ఉత్తర-ఆధునికత యొక్క నిర్లిప్తత, వొంటరితనపు ఆక్రోశాలనుండి బయటపడి, నైతికత, సౌందర్యం, ప్రామాణికత, ఆశ మరియు వ్యక్తిగత అనుభూతులకు ప్రాధాన్యతనిస్తున్నారు. లోతైన ఆలోచనలను, భావోద్వేగాలను రేకెత్తిస్తున్నారు.
సమకాలీన తెలుగు కవిత్వంలో రొమాంటిసిజం నుండి శ్రామిక వర్గాల సమస్యల వరకు విభిన్న వ్యక్తీకరణలు కనిపిస్తున్నాయి . ఇప్పుడు రాస్తున్న కవులు మోహన్ ప్రసాద్, శ్రీశ్రీ వంటి ఆధునిక కవుల బావ ప్రకటనా పద్ధతుల నుండి వినూత్నంగా బయటపడి, ఆధునిక ఇతివృత్తాలను తమ కవిత్వంలో ప్రతిబింబిస్తున్నారు. కవిత్వంలో, తమ వ్యక్తిగత అనుభవాలకు, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూనే వాటిని సామాజిక ఆకాంక్షలతో మిళితం చేస్తున్నారు.
మెటా మాడ్రన్ కవిత్వం ఒక నిరంతర ఆలోచనకూ చర్చకూ తావునిస్తూ పాఠకులను సందిగ్ధత నుండి సమగ్రతవైపు చూసే దృష్టి కోణాన్నిస్తోంది. ఆధునిక ఆశ, ఉత్తర-ఆధునిక నిరాశల మధ్య సమతుల్యతను సాధించి, భావోద్వేగ వ్యక్తీకరణపై తీవ్రమైన అధికారాన్ని, స్పష్టతను, సరళతను ప్రదర్శిస్తోంది. ఆధునిక మరియు ఉత్తర-ఆధునిక భావాల అంశాలను మిళితం చేస్తూ, వర్తమాన ఆకాంక్షలను ప్రకటిస్తోంది.
మెటా మాడ్రన్ ఆలోచనల ప్రభావిత కవులు రాస్తున్న కవిత్వం గురించి చర్చించవలసిన సందర్భంలో మనమున్నాం కనుక దీనిగురించి ఇంకొంత ముందుముందు చూద్దాం.
*








చాలా బాగా రాశారు సార్