తండా హరీష్ గౌడ్ కవితలు రెండు

ఏడ్పుతుఫాను చెలరేగినప్పుడు
మనతోపాటు నవ్విన
కుటుంబ మనిషి
ఈ భూమి అంచులమీంచి
మళ్ళీ కనిపించకుండా జారిపోవోచ్చేమో

1

AI బొమ్మ
చిమ్మ చీకటి కొమ్మమీద
సాంకేతిక వెన్నెల చిత్రం
మిరిమిట్లు గొలుపుతుంది
ప్రకృతి తలుపులు తెరుచుకుని వచ్చిన
ఉదయకాలం
పరిగడుపున్నే
చాట్ జిపిటి మాత్ర వేసుకుంది
వరి కంకులు గొలుసులు గొలుసులుగా మారి
మడులకు దండలేస్తున్న దృశ్యం
శరీరం మీద చర్మం పొలుసులు పొలుసులుగా ఊడి
నెర్రెలు బాసిన మరో దృశ్యం
ఊసులు పట్టిన కళ్ళల్లో ఏమీ లేనట్టుగా
లేని మనిషి భుజం మీద చెయ్యేసి ఫోటో దిగినట్టుగా
చిత్రం వెనకాల మరో చిత్రం
మనిషి వెనకాల మరో తీరం
కొత్త తెరమీద మేకప్ అవసరం లేని
సహజనటుల బొమ్మలు
నీదో నాదో తేల్చుకోలేని ఊగిసలాటల మధ్య సెకనుకో ముఖం
నిన్ను నువ్వు గుర్తు పెట్టుకోవాలంటే
నీ అసలు ముఖపు ఫ్రేమును
దాచిపెట్టుకోవాల్సిన సమయం
పొడవు, వెడల్పుల లెక్కింత
రంగు, రుచి ,చిక్కదనాల ప్రోగ్రామింగ్
ముఖం మీద ముడతల తొలగించే ఫోటోషాప్ ఇస్త్రీ
వయసు దారి మళ్లించే ప్రకృతి వర్ణచిత్రాలు
హీరో నువ్వే
నచ్చిన హీరోయిన్ నీ పక్కనే!
చేతి మునివేళ్ల మధ్యలోంచి
మొలుచుకొచ్చిన బొమ్మే
ఈ కాలం పిల్లలకు
బిందువు… సింధువు
ఇంటి ముందున్న
చల్లని నీడల ‘వేపచెట్టు’ పేరును
AI నే వెతికి పెట్టాలి
కాలం నిచ్చెనమీది కెక్కి
ఆకాశం వైపుగా అడుగులు వేయకపోతే
ముందుకు సాగలేము
సాంకేతికతా వెలుగును
కళ్ళకద్దుకోవాల్సిన ఎమర్జెన్సీ కాలమిది
చేతితో తినలేక
నమిలించుకొని
నోట్లో ఊపించుకునేంతగా చేసే
అతి సోమరితనపు వ్యవసాయం కూడా
పంటకు పట్టిన చీడపురుగే
కరిగిపోతున్న క్షణాల మధ్య
కాంతివంతమైన పట్టకం
ఈనాటి సాంకేతికత
ప్రేమతో ఆలింగనం చేసుకందాం
మాయావలలో చిక్కుకోకుండా
మరో ప్రపంచంలోకి అడుగిడుదాం
2
ఈ పిచ్చిబుర్రకు తట్టలేదు
రెమ్మలన్నీ కలిసి ఓ పువ్వయినట్టు
గువ్వపిల్లల కనిపెట్టుకునే గూడయినట్టు
కువకువల గొంతుకలోంచి
ప్రేమ కబుర్ల ముచ్చట్లు
ఇంటినిండా కురిశాయి
కంటికొలుకుల్లోంచి పుట్టుకొచ్చిన
ఆనందభాష్పాలు
రెప్పలమీద నాట్యమాడి ఆడి
అలసిపోయాయి
ఆ పండుగపూట
మా కుటుంబమంతా కలిసి
గడిచిన కాలపు అనుభూతులను
గటగట తాగేశాము
గాలి ఉన్నంతవరకే
గడ్డిపరక ఊగుతుందన్న
సత్యం తెలుసు
అరక ముందుకు సాగాలంటే
నేలలో కాస్త తడిదనం ఉండాలన్న
సూత్రము తెలుసు
ఇంట్లో కుండపోత నవ్వుల్ని
కురిపించి వచ్చాము కానీ
చేతితో చెయ్యిపట్టుకున్నప్పుడో
పక్కపక్కనే కూర్చోని
ముచ్చట్లు చెప్పుకున్నప్పుడో
ఒకర్నొకరం చూసుకుంటూ
తనివితీరా ఏడ్వటం
ఎందుకు మర్చిపోయామో
అస్సలు ఈ పిచ్చిబుర్రకు తట్టలేదు
నవ్వులనావలో పయనించడానికి
ఎప్పుడయినా
ఎక్కడయినా
ఓ తోడు దొరుకుతుంది
ఏడ్పుతుఫాను చెలరేగినప్పుడు
మనతోపాటు నవ్విన
కుటుంబ మనిషి
ఈ భూమి అంచులమీంచి
మళ్ళీ కనిపించకుండా జారిపోవోచ్చేమో
కలిసినపుడు నవ్వులమాలలల్లుకొని
చిరునవ్వుముఖాలనే చూడాలనుకోవద్దు
ఎదురుగా ఉన్న మనిషిని
గుండెలకు హత్తుకొని
ఏడ్పుచుక్కలను కూడా మొలిపించుకోవాలి
గట్టుమీద ఉన్నంతసేపు
లోతు తెలియదు
నువు లోతు తెలుసుకోవటం
ఆలస్యమయితే
ఉన్న ఆ కాస్త గట్టు కూడా కూలిపోవచ్చు!
*

తండ హరీష్ గౌడ్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు