జూలై ఇరవై తేదీన ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ‘ఛలో సంసద్’ అంటూ మార్చ్ చేస్తున్న యువతపై పోలీసులు చేసిన పైశాచిక హింస నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ వీడియోలు చూసి నా మనస్సు ద్రవించిపోయింది. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకుంటే ఆ హింసాత్మక దృశ్యాలే కళ్లముందు కదలాడాయి. మరుసటి రోజు ఆదివారం కూడా అదే పరిస్థితి… గుండెలో ఏదో తెలియని భారం, ఆవేదన.
రెండు రోజుల మానసిక సంఘర్షణ తరువాత, అజీనాతో “ఢిల్లీ వెళ్దాం అనుకుంటున్నాను” అని నా నిర్ణయాన్ని చెప్పాను. తను ఏమాత్రం ఆలోచించకుండా, “మీ ఇష్టం, వెళ్లి రండి… కానీ జాగ్రత్త! పరిస్థితి బాగాలేదు కదా ” అని చెప్పింది. సామాజిక సమస్యల పట్ల మనతో పాటు సమానంగా స్పందించే, మన సిద్ధాంతాలను గౌరవించే భాగస్వామి దొరకడం నిజంగా అదృష్టం.
వెంటనే గురువారం రాత్రి రియాద్ నుంచి ఢిల్లీకి, మళ్లీ ఆదివారం తెల్లవారుజామున రిటర్న్ ఫ్లైట్ బుక్ చేశాను.
టిక్కెట్లు బుక్ చేసిన క్షణం నుంచే వరుసగా ఆందోళన కలిగించే వార్తలు. ఢిల్లీలో NSA (జాతీయ భద్రతా చట్టం) అమలుచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు… ఢిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేత… ఇంటర్నెట్ కనెక్టివిటీ బంద్… రోడ్ బ్లాక్స్… జంతర్ మంతర్ వైపు వెళుతున్న వాళ్ళను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్న పోలీసులు… ఫేషియల్ రికగ్నిషన్ వ్యాన్లు… ఢిల్లీ నలుమూలలా భారీగా CRPF బలగాల మోహరింపు.
ఈ వార్తలు చదువుతుంటే కాసింత భయం వేసింది. తప్పుడు నిర్ణయం తీసుకున్నానా? తొందరపడి టికెట్స్ బుక్ చేశానా? ఇలా రకరకాల ఆలోచనలు. ఒకానొక దశలో టికెట్స్ క్యాన్సిల్ చేసేదాకా వెళ్లి ఆగిపోయాను. ఆ ‘క్యాన్సిల్’ బటన్ మీద వేలు వేయబోతుంటే… ఢిల్లీ వీధుల్లో గాయపడ్డ యువతీ , యువతుల మొహాలు నా కళ్లముందు మెదిలాయి. “ఏదైతే అది అయ్యింది, వెళ్లి తీరాల్సిందే!” అని గుండె ధైర్యంతో బయలుదేరాను.
శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ ఎయిర్పోర్ట్ బయటకు రాగానే ఒంట్లో ఒక రకమైన జలదరింపు ,కడుపులో ఒక సన్నని భయం. ట్విట్టర్లో ఢిల్లీ మెట్రో లేటెస్ట్ అప్డేట్స్ చూశాను. ఉదయం 7:30 నుంచి జంతర్ మంతర్ చుట్టుపక్కల ఉన్న మెట్రో స్టేషన్స్ క్లోజ్ చేస్తున్నట్లు వార్త. అప్పుడు సమయం నాలుగు. మెట్రో స్టేషన్ వైపు వెళ్లి, “మొదటి మెట్రో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?” అని అక్కడున్న ఒక ఆటో డ్రైవర్‌ను అడిగాను. “పావు తక్కువ ఐదుకు” అన్నాడు.
ఇంకా టైం ఉండటంతో వెళ్లి ఒక వేడి వేడి చాయ్ తాగాను. కాసేపు మెట్రో వెయిటింగ్ ఏరియాలో ఫోన్ ఛార్జ్ పెట్టుకుని కూర్చున్నాను.
సమయం 4:30. మెట్రో టికెట్ కోసం వెళ్ళాను… లైన్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మెట్రో పనిచేస్తుందా లేదా? టికెట్ ఇస్తారా లేదా? ‘శివాజీ స్టేడియం’ (జంతర్ మంతర్‌కు అత్యంత దగ్గరైన స్టేషన్) పేరు చెప్పగానే ఏమైనా అనుమానం వస్తుందా? ఇలా రకరకాల ఆలోచనలు.
కౌంటర్ వద్దకు వెళ్లి “శివాజీ స్టేడియం” అన్నాను. “46 రూపీస్” అన్నాడు. ఫోన్‌పే అనగానే క్యూఆర్ కోడ్ చూపించాడు. స్కాన్ చేసి, గ్రీన్ టిక్ మార్క్ రాగానే… నా చేతికి టికెట్ ఇచ్చాడు. అది చేతిలోకి తీసుకోగానే ప్రాణం లేచివచ్చినంత పనైంది.
ఎయిర్పోర్ట్ నుంచి మూడు స్టేషన్ల తరువాత శివాజీ నగర్. మెట్రో గేట్లు తెరుచుకున్నాయి. మెల్లగా ఒకదాని తరువాత మరొక ఎస్కలేటర్ ఎక్కుతూ ఎగ్జిట్ గేటు వైపు వచ్చాను. గేటు దగ్గర ముగ్గురు CRPF జవాన్లు కూర్చొని ఉన్నారు. వాళ్ళని దాటుకుని బయటకు అడుగు పెట్టాను.
బయట చిన్న చిన్న పిట్టగోడలపై చాలా మంది యువకులు పడుకుని ఉన్నారు. తల కింద ఒక బ్యాగ్, మొహం మీద తెల్లని గమ్చా కప్పుకుని నిద్రపోతున్నారు. జులై నెల… వర్షాల జాడ లేదు. వేడి గాలి, విపరీతమైన ఉక్కపోత.
జంతర్ మంతర్ వెళ్ళడానికి ఎటు వైపు నడవాలో చూద్దామని ఫోన్ తీశాను, మ్యాప్స్ ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడే గుర్తొచ్చింది, జంతర్ మంతర్ రెండు కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సర్వీస్ కట్ చేశారని.
అలానే నడుస్తూ ముందుకు వెళ్ళాను. రోడ్ల పక్కన, ఫుట్ పాతుల మీద యువత అలసిపోయి పడుకుని ఉన్నారు. వాళ్ళని చూస్తూ నడుస్తుంటే మనస్సు భారంగా అనిపించింది. ఎదురుగా కొంతమంది యువకులు చేతిలో విసనకర్రలతో నడుస్తూ వస్తున్నారు. వాళ్ళని దారి అడిగాను. “కొంచెం ముందుకు వెళ్లి, గోల్ చక్కర్ దగ్గర రైట్ తిరగండి, మీరు ప్రొటెస్ట్ లోకి ఎంటర్ అవుతారు. జనమే మిమ్మల్ని తీసుకువెళతారు ” అన్నారు.
పార్లమెంట్ స్ట్రీట్ రోడ్డు చేరుకున్నాను. ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు, మధ్యలో డివైడర్. నడుచుకుంటూ వెళ్తుంటే డివైడర్ల మీద, ఫుట్ పాత్ మీద, మూసి ఉన్న షాపుల ముందు ఎక్కడ చూసినా పడుకుని ఉన్న యువత. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వారిలో చాలామంది అమ్మాయిలు కూడా ఉన్నారు.
టాల్ స్టాయ్ రోడ్డు చేరుకునేసరికి… రోడ్డుకు ఇరువైపులా ఉన్న గోడలపై రకరకాల పెయింటింగ్స్, గ్రాఫిటీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్. ఒక్కొక్కటీ చూసుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ మెయిన్ ప్రొటెస్ట్ సైట్‌కు చేరుకున్నాను.
అప్పటికి సమయం ఉదయం ఆరు గంటలు. ప్రొటెస్ట్ స్టేజి మీద సౌరబ్ దాస్ పడుకుని ఉన్నాడు. స్టేజికి ముందు ఉన్న ఏరియాలో నిరసనకారులు నేలమీద పడుకుని ఉన్నారు. వేడి, ఉక్కపోత, గాలి ఆడటం లేదు. ఆ పడుకుని ఉన్న వాళ్లకు కొంతమంది యువకులు విసనకర్రలతో గాలి విసురుతున్నారు.
ఒక ముస్లిం కుర్రవాడు… తలకు టోపీ, తెల్లని కుర్తా పైజామా, మెడలో జాతీయ జెండా వేసుకుని తోటి వారికి విసనకర్రతో గాలి విసురుతున్నాడు. ఆ దృశ్యం నన్ను కట్టిపడేసింది. నేను కూడా వెంటనే ఒక విసనకర్ర తీసుకుని నా ముందు పడుకుని ఉన్న వాళ్లకు గాలి విసరడం మొదలుపెట్టాను.
కాసేపటికి నినాదాలు మొదలయ్యాయి. “ఇంక్విలాబ్ జిందాబాద్!” “ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా దో!” ఒక్కసారిగా నా ఒంట్లో కరెంటు పాకినట్లు అనిపించింది. నేను కూడా గొంతుకలిపి నినాదాలు చేయడం మొదలుపెట్టాను.
ప్రొటెస్ట్ స్టేజి నుంచి ఒక వంద మీటర్ల దూరం వరకు ‘మెయిన్ ప్రొటెస్ట్ ఏరియా’. దీనిలోకి రావడానికి సెక్యూరిటీ బారికేడ్లు, మెటల్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు ఉన్న ఎంట్రన్స్ నుంచి రావాలి. ఇక్కడనుంచి ఆ బయట టాల్ స్టాయ్ రోడ్డు, పార్లమెంట్ స్ట్రీట్ వరకు సెకండరీ ప్రొటెస్ట్ ఏరియా .
మెయిన్ స్టేజి మీద CJP వాళ్ళు ఉంటే, కింద వివిధ విద్యార్థి సంఘాలు (AISA, SFI, DYFI, DSA etc) వాళ్ళ డేరాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. నా దృష్టిలో ఈ వామపక్ష విద్యార్థి సంఘాలు, నాయకులు ఈ ప్రొటెస్ట్‌లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. వీళ్ళ స్లోగన్స్, పోస్టర్స్, డప్పులు వాయిస్తూ పాడుతున్న పాటలు విరామం లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి.
అక్కడే చిన్న మెడికల్ క్యాంపు. అవసరమైన వాళ్లకు వాలంటీర్లు మందులు ఇస్తున్నారు. ఇంతలో ఒక యువకుడు నా చేతిలో ఒక నీళ్ల బాటిల్ పెట్టి, “నీళ్లు ఎక్కువగా తాగండి, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది” అని ఆప్యాయంగా చెప్పి వెళ్ళిపోయాడు. మరో యువకుడు తను ఇంటినుండి తెచ్చిన శెనగలు పంచుతున్నాడు. ఇంకొకరు విసనకర్రలు పంచుతున్నారు.
ఉదయం తొమ్మిది అయ్యేసరికి జనం తాకిడి పెరిగింది. నినాదాలు జోరందుకున్నాయి. అంతా కోలాహలంగా ఉంది. టీ, నాష్టా కోసం నిరసనకారులు లైన్లలో నిలబడి ఉన్నారు. ఇంతలో నాకు జునైద్ భాయ్ కనిపించారు. ఈ పోరాటం మొదలైన మొదటి రోజు నుండి తిండి, తాగునీటి ఏర్పాట్లు చూస్తున్న వ్యక్తి ఆయన. నేను మెయిన్ ఏరియా నుంచి బారికేడ్ల దగ్గరకి వెళ్లి “జునైద్ భాయ్” అని పిలిచాను. ఆయన రాగానే, తను చేస్తున్న ఈ నిస్వార్థ సేవకు కృతజ్ఞతలు తెలిపి, “నేను రియాద్ నుంచి వచ్చాను” అని చెప్పగానే… నన్ను ఆప్యాయంగా దగ్గరకి తీసుకుని భుజం తట్టాడు. అతనితో ఒక ఫోటో దిగి మళ్ళీ లోపలికి వచ్చేశాను.
నేను ప్రొటెస్ట్ ఏరియా మొత్తం తిరుగుతూ గమనిస్తూ ఉన్నాను. ఇది ఒక ట్రెడిషనల్ ప్రొటెస్ట్ లాగా అయితే అస్సలు నడవట్లేదు. ఇప్పటిదాకా సమ్మెలు, నిరసన కార్యక్రమాలు అంటే జనాలు టెంట్లు వేసుకుని కూర్చుని ఉంటారు, సైలెంట్‌గా, సీరియస్‌గా మొహాలు పెట్టుకుని నినాదాలు ఇస్తుంటారు, వేదిక మీద నుంచి నాయకులు మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ వాతావరణం దానికి పూర్తి భిన్నంగా ఉంది.
ఈ ‘జెన్ జీ’ (Gen-Z) తీరే వేరు. వాళ్ళు పాటలు పాడుతున్నారు, కామెడీ చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు… గ్రూపులుగా చేరి గేమ్స్ ఆడుతున్నారు. ఒక ఉద్యమాన్ని కూడా వాళ్ళు ఒక ఫెస్టివల్ లాగా, ఒక ఫీస్ట్ లాగా మార్చేశారు. ఈ ప్రొటెస్ట్‌ను మిగతా సాంప్రదాయ సమ్మెల నుంచి వేరు చేసేది ఇదే. అయితే, ఈ సందడి వెనుక వాళ్ల ఉద్దేశం గాలికి పోలేదు. మనసులో ఉన్నది ఉన్నట్లుగా, కుండబద్దలు కొట్టినట్లుగా, ఎవరికీ భయపడేది లేదు అన్నట్లుగా ముఖం మీదే మాట్లాడుతున్నారు. వాళ్ళు దేనికోసం వచ్చారు, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అనే విషయాలపై వాళ్లకున్న ‘క్లారిటీ ఆఫ్ థాట్’ నాకు చాలా బాగా నచ్చింది. “ఈ జనరేషన్‌కి రాజకీయాలు, దేశం, సమాజం గురించి పట్టవు” అని నాలో ఉన్న ఒక అపోహ ఈరోజుతో బద్దలైంది.
నేను గమనించిన మరొక ఆసక్తికరమైన విషయం: ఉర్దూ భాష మీద ప్రభుత్వం ఒకవైపు వివక్ష చూపిస్తుంటే, ఈ ప్రొటెస్ట్‌లో ఎక్కువగా వాడుతున్న నినాదాలన్నీ ఉర్దూ కవిత్వం, భాషలోనివే కావడం! “ఇంక్విలాబ్ జిందాబాద్” “బోల్ కే లబ్ ఆజాద్ హై తేరే…” “తానాషాహీ నహీ చలేగీ…”
ఈ నిరసనల్లో ఎంతోమంది LGBTQ+ కమ్యూనిటీ యువతను చూశాను, వారితో మాట్లాడాను. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే… ఢిల్లీ చుట్టుపక్కల నుంచి వచ్చిన ఆధునిక యువతకు, యూపీ, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన యువకులకు ఎంతో తేడా. ఇద్దరి వస్త్రధారణ, భాష, స్లాంగ్ వేరు కావచ్చు, కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలు, వాళ్ళ అసంతృప్తి, ఈ ప్రభుత్వం పట్ల వాళ్లకున్న నిరసన మాత్రం ఒక్కటే! ఇక్కడ యువతే కాదు… వయసు మళ్ళిన వృద్ధులు, చంటి పిల్లలను ఎత్తుకుని వచ్చిన తల్లులు కూడా ఉండటం ఈ పోరాట తీవ్రతకు అద్దం పట్టింది.
మధ్యాహ్నం అయింది. ఉదయం కంటే ఎన్నో రెట్లు కోలాహలంగా ఉంది. పాటలు, డ్యాన్సులు, నినాదాలు. నేను AISA టెంట్ వైపు వెళ్ళాను. అక్కడ నేహా బోరా ఎవరికో ఇంటర్వ్యూ ఇస్తూ కనిపించింది. అక్కడ అరగంటకు పైగా ఎదురుచూసి, ఆమెను కలిసి, ఇరవై ఆరు రోజుల పాటు తను చేసిన నిరాహార దీక్షకు కృతజ్ఞతలు తెలిపి ఫోటో దిగాను.
విపరీతమైన వేడి, ఉక్కపోతకు చెమటలో పూర్తిగా తడిసిపోయాను. కాసేపు ఓక డేరా కింద కూర్చున్నాను. పక్కనే మహారాష్ట్ర నుంచి జనరల్ డబ్బాలో రెండు రోజుల పాటు ప్రయాణం చేసి వచ్చిన ఒక వ్యక్తితో మాట కలిపాను. ఇంతలో ఎవరో వచ్చి మా చేతిలో ఒక పిజ్జా స్లైస్ పెట్టి వెళ్లారు. అదే ఆ రోజు నా మధ్యాహ్న భోజనం!
చీకటి పడగానే వాతావరణం మరింత ఉత్తేజభరితంగా మారింది. టాల్ స్టాయ్ రోడ్డు నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వరకు నడుస్తూ చూస్తున్నాను. బయట వాతావరణం ఒక జాతరలా ఉంది. డీజేలు పెట్టి పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. మరికొందరు అదే రోడ్డు మీద క్రికెట్ ఆడుతున్నారు. కెమెరాలు, మైకులు పట్టుకుని, యువతను ఇంటర్వ్యూ చేస్తూ యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా వాళ్ళు. ఇంతలో ఎవరో దేశంలో ఎదో ప్రాంతం నుంచి ఆర్డర్ చేసిన జొమాటో ఆర్డర్ చేతికి ఇచ్చారు. చోలే , భటూరే, పక్కనే ఫుట్ పాత్ మీద కూర్చొని , ముగ్గురితో షేర్ చేసుకుంటూ తిన్నాను. అదే నా రాత్రి భోజనం.
రాత్రి పదకొండు గంటలయ్యింది. అక్కడి నుంచి వెళ్లాలని లేదు కానీ, శరీరం సహకరించకపోవడంతో పహార్ గంజ్ ఏరియాలో హోటల్ బుక్ చేసుకుని వెళ్లి పడుకున్నాను.
మరుసటి రోజు ఉదయం పదింటికల్లా మళ్ళీ జంతర్ మంతర్ చేరుకున్నాను. శనివారం కావడంతో అప్పటికే జనం పోటెత్తారు. మెయిన్ ఏరియాలోకి వెళ్ళడానికి చాలా పెద్ద లైన్ ఉంది. లోపలికి వెళ్ళలేకపోయాను. దాంతో టాల్ స్టాయ్ రోడ్డు మీదే తిరుగుతూ అక్కడి యువతతో మాట్లాడుతూ గడిపాను.
మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో వాతావరణం వేడెక్కింది. టాల్ స్టాయ్ రోడ్డు మీద పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి లాఠీ ఛార్జ్ చేశారు, టియర్ గ్యాస్ వదిలారు. యువత చెల్లాచెదురుగా పరిగెత్తారు. క్షణాల్లోనే ఉద్రిక్తత…
నేను టాల్ స్టాయ్ రోడ్డుమీద ఉన్న ఒక కాఫీ షాపులో వెళ్లి కూర్చున్నాను. తర్వాత కాసేపటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, ప్రభుత్వం డిమాండ్లను ఒప్పుకుంది అనే వార్తతో సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి! యువతలో ఆనందం, డ్యాన్సులు, ఒకరికొకరు మిఠాయిలు పంచుకోవడం. నేను కాఫీ షాపులోంచి బయటకు వచ్చి మళ్ళీ ఆ యువ సందోహంలో కలిసిపోయాను. ముప్పై ఐదేళ్ల నేను ఈ రెండు రోజులపాటు ఒక టీనేజర్ గా మారిపోయాను.
అక్కడే సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఉండి, ఆ సంబరాల్లో పాలుపంచుకుని… బరువెక్కిన, సంతృప్తితో నిండిన హృదయంతో ఎయిర్పోర్ట్ కి బయలుదేరాను.
తెల్లవారుజామున నాలుగు గంటలకు నా ఫ్లైట్. విమానం గాల్లోకి ఎగరగానే ఒకవేళ జులై ఇరవై నాటి హింస మళ్లీ చెలరేగి ఉంటే? నన్ను నిర్బంధించి ఉంటే? నాకేమైనా జరగరానిది జరుగుంటే ? ఈ ఆలోచన రాగానే ఒళ్లు జలదరించి చిరు చెమటలు పట్టాయి. కానీ… ప్రజాస్వామ్యం కోసం గొంతెత్తిన ఆ యువత మధ్య నిలబడినందుకు, వారి పోరాటంలో నా వంతుగా ఒక చిన్న భాగమైనందుకు ఆ భయాన్ని మించిన విపరీతమైన గర్వం, తృప్తి నాలో మిగిలింది. ఆ ఎమోషన్స్‌ను మోసుకుంటూ తిరిగి రియాద్ చేరుకున్నాను.
ఈ పిల్లలు సాధించింది ఏమిటి? అసలు ఒక రాజీనామాతో ఏమవుతుంది? ఈ ప్రశ్నలు పక్కనపెడితే ఈ పిల్లలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రజాస్వామ్యానికి ఊపిరి పోశారు.
అరుంధతీ రాయ్ మాటల్లో చెప్పాలంటే ఈ నిరసన కేవలం ఒక మంత్రి పదవికో, విద్యార్థుల డిమాండ్లకో పరిమితమైనది కాదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ఇప్పుడు చాలా చిన్న విషయం. తమ తల్లిదండ్రుల తరం ఎప్పుడో వదులుకున్న ‘భారతదేశ ఆత్మగౌరవాన్ని’ ఈ యువత మళ్లీ చేజిక్కించుకుంది.
తమ హుందాతనంతో, అసాధారణమైన ధైర్యంతో, వినూత్నమైన హాస్యంతో… ఈ దేశానికి వాళ్ళు నేర్పించిన అతిపెద్ద పాఠం “ఎలా భయపడకుండా ఉండాలో” చూపించడమే. ఇది వారు మనకు ఇచ్చిన అమూల్యమైన బహుమతి. దాన్ని సరిగ్గా కాపాడుకోవడం ఇక మన బాధ్యత.
ఎన్నికల వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఇక తమను ఎవరూ ఏమీ చేయలేరు అనుకుంటున్న ఒక అహంకారపూరిత ప్రభుత్వానికి ఈ జెన్ జీ యువత పెట్టిన ఈ వాత , ఒక నిజమైన హెచ్చరిక.
ఇవి నా జీవితంలో ఎప్పటికీ చెరిగిపోని, మర్చిపోలేని అద్భుతమైన రెండు రోజులు!
ఇప్పుడు కూడా జంతర్ మంతర్ వద్ద నాకు బాగా నచ్చిన ఈ నినాదం ఇంకా నా చెవుల్లో మారు మోగుతోంది..
బిర్శా
ఫూలే
అంబేద్కర్…
అంబేద్కర్… అంబేద్కర్…
ఇంక్విలాబ్ జిందాబాద్.
*








జంతర్ మంతర్ నిరసనలో కొంతమంది యువతీ యువకులు మాట్లాడిన అతి జుగుప్సాకరమైన, అసభ్యకర పదజాలం, దారుణమైన తిట్లు సామాజిక మాధ్యమాలలో కొన్ని వీడియోలు వచ్చాయి. ఇది సమాజంలో నైతిక పతనానికి సూచన.
వెళ్ళలేకపోయానని అసంతృప్తిగా ఉంది. మీరు చూపించిన దృశ్యాలతో ఊరటగా అనిపించింది. థాంక్యూ సంజయ్.
మీరన్నది నిజం. ఆ పిల్లల శ్రమ ఫలితాన్ని కాపాడుకోవటం ఇప్పుడు సమాజం బాధ్యత.