బషీర్ బద్ర్ జ్ఞాపకాల వెలుగులో..

“ఇళ్లపై పేర్లు ఉన్నాయి, ఆ పేర్ల పక్కన పెద్ద పెద్ద పదవులు (హోదాలు) ఉన్నాయి, కానీ నేను ఎంతో వెతికాను… ఎక్కడా ఒక ‘మనిషి’ మాత్రం కనిపించలేదు.”

కొన్ని జ్ఞాపకాల వెలుగులోనే మనం జీవితమంతా గడుపుతాం. అవి జ్ఞాపకాలా లేక రెపరెపలాడుతున్న మన ప్రాణపు సవ్వడులా.. అనిపించినప్పుడల్లా తలుచుకున్నప్పుడల్లా బషీర్ బద్ర్ అనే కవి గుర్తుకు వస్తాడు. అవును, జ్ఞాపకాల తాలూకు వెలుగును మనతోనే ఉండనివ్వాలి.  లేకపోతే జీవితపు సాయంకాలం ఏ సందులో ముగుస్తుందో ఎవరికి తెలుసు? (ఉజాలా అప్నీ యాదోం కె హమారే సాథ్ రహనేదో) అన్నాడాయన.

గురువారం బషీర్ బద్ర్  జీవితపు సాయంకాలం కూడా ముగిసిపోయింది. 91 సంవత్సరాల వయస్సులో మరణించిన ఆయన స్వాతంత్ర్యానికి పూర్వం, ఆ తర్వాత జరిగిన అనేక సామాజిక పరిణామాలకు వారధిగా నిలిచిన, దేశ అసలైన సంస్కృతికి ప్రతినిధులైన కవుల్లో ఒకరు. ఆయన మరణంతో ఆ తరం దాదాపు అంతరించిపోయిందనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఆయన స్మృతుల్నీ, జ్ఞాపకాల్నీ కోల్పోయి జీవచ్ఛవంలా ఉన్నారని, తానెవరో, తన కవితలేవో తెలియని స్థితిలో ఉన్నారని తెలిసింది. “జీవన్ కే సఫర్ మే ముఝే కోయి భీ నా మిలా, హంరాహ్ తో మిల్తే హై సఫర్ యాద్ నహీ రహతా” (జీవన  ప్రయాణంలో నాకు ఎవరూ తోడుగా నిలవలేదు; దారిలో ఎంతోమంది కలిసి నడుస్తారు కానీ, ప్రయాణం ముగిసాక ఆ జ్ఞాపకాలు ఎవరికీ గుర్తుండవు.) అని రాసుకున్నట్లే జ్ఞాపకాలతో పాటు ఆయనా అదృశ్యమయ్యారు. ఏడ్చేవారంతా అల్లకల్లోలం సృష్టిస్తున్నారు, కానీ, జీవితాంతం మేల్కొన్న ఆ వ్యక్తి మాత్రం ప్రశాంతంగా నిద్రిస్తూనే ఉన్నాడు.” (ఉమ్ర్ భర్ జగ్ నే వాలా పడా సోతా రహా..) అని ఆయన చెప్పినట్లే ఆయన శాశ్వతంగా నిద్రపోయారు.

ఒక రకంగా ఆయన అదృష్టవంతుడు. ఒకో సారి చుట్టూ ఏమి జరుగుతుందో తెలియకపోవడమే మంచిదేమో  (కోయి హాత్ భీ నా మిలాయేగా జో గలే మిలోగే)అని ఆయన ఎప్పుడో బాధపడ్డారు. “నువ్వు ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకోవాలని వెళ్తే, ఇక్కడెవ్వరూ నీతో కనీసం చేతులు కూడా కలపరు. ఇది కొత్త తరం మనుషుల నగరం, ఇక్కడ కొంచెం దూరం పాటిస్తూనే కలుస్తూ ఉండు.” అని ఆయన ఎప్పుడో రాశారు. ఇప్పుడు యాంత్రిక జీవనమే కాదు, జీవన విధ్వంసం కూడా రాజ్యమేలుతోంది. తాను ఏ విద్వేష భావనలనుంచి  బయటపడి ప్రశాంత జీవనం గడిపేందుకు మీరట్ ను విడిచిపెట్టి భోపాల్ కు చేరుకున్నారో,  ఆ భావనలు దేశమంతా ప్రబలిపోతున్నాయని తెలియకపోవడం ఎంత అదృష్టం? నిన్ను పూర్తిగా మరిచిపోయిన వారిని మరిచిపోయే శక్తినివ్వమని (తుమ్హే జిస్ నే దిల్ సే భులా దియా, ఉసే భూల్ నే కే దువాకరో) ఆయన భగవంతుడిని ప్రార్థించాడు. బహుశా అల్లా కరుణించి ఆయనకు మరణించేంతవరకూ  అల్జీమర్స్ ప్రసాదించాడేమో.

అవును. బషీర్ బద్ర్ పేరు వింటే మీరట్ మత కల్లోలాలు గుర్తుకు వస్తాయి.

1987లో మీరట్ లో జరిగిన మత కల్లోలాల్లో ఆయన ఇంటినీ, రచనల్నీ దుండగులు ధ్వంసం చేశారు. శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో జన్మించిన బషీర్ భద్ర్ మీరట్ లో లెక్చెరర్ గా పనిచేస్తున్న రోజులవి. తాను జన్మించిన అయోధ్యలోనే రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం ప్రజ్వరిల్లుతుందని,  ఆ వివాదమే కార్చిచ్చులాగా తాను జీవిస్తున్న మీరట్ ను చుట్టుముడుతుందని ఆయన గ్రహించలేదు  1987 మే, జూన్ నెలల్లో జరిగిన ఈ అల్లర్లలో అనేక మంది హిందూముస్లింలు మరణించారు. అయితే  శాంతి భద్రతలను కాపాడాల్సిన పిఏసి దళాలే మీరట్ లోని మలియానా, హాషింపురా గ్రామాల్లో అనేకమంది ముస్లింలను కాల్చి చంపి కాలువల్లో విసిరేశారని వార్తలు వచ్చాయి. అప్పుడు ఆ దారుణోదంతాలపై నివేదికలు సమర్పించిన వారిలో మానవహక్కుల సంఘం నేత బాలగోపాల్ కూడా ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 2018 అక్టోబర్ లో ఢిల్లీ హై కోర్టు 42 మందిని చంపినందుకు 16 మంది పిఏసి సిబ్బందికి యావజ్జీవ శిక్ష విధించింది.

లోగ్ టూట్ జాతీ హై ఎక్ ఘర్ బనానే మే

తుము తరస్ నహీ ఖాతే బస్తీయా జలానే మే

(“ఒక ఇల్లు కట్టుకోవడానికి మనుషులుసర్వస్వం ధారపోస్తారు, కానీ నువ్వు  (బస్తీలనే తగలబెట్టేందుకు ఏమాత్రం  జాలి చూపవు.”)

అని  మీరట్ అల్లర్ల గురించే బషీర్ భద్ర్ రాశారు.

ఎవరైనా ఏమైనా వాస్తవాలు మాట్లాడితే వారిని తిరుగుబాటుదారులనో, సంఘ వ్యతిరేక శక్తులనో ముద్రవేసే పరిస్థితులను బషీర్ ఆనాడే గమనించాగు.

“మై బోల్తా హు తో ఇల్జామ్ హై భగావత్ కా.” అన్న ఘజల్ లో ఈ పరిస్థితులను చిత్రించారు. “నేను మాట్లాడితే తిరుగుబాటు చేశానని నింద వేస్తారు  మౌనంగా ఉంటే కళ్ళముందు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఏమీ చేయలేకపోతున్నానే అనే ఒక తీవ్రమైన నిస్సహాయత  ఆవేదన మనస్సాక్షిని తొలిచేస్తుంటాయి.” అని ఆయన రాశారు. సత్యాన్ని మాట్లాడడానికీ, మౌనంగా భరించడానికీ మధ్య నలిగిపోయే మేధావి స్థితిని ఆయన కేవలం రెండు పంక్తుల్లో అద్భుతంగా ఆవిష్కరించారు. “తన కన్నీటి ప్రవాహం కూడా ప్రవహించే నీటి లాగా తన దారి తానే వెతుక్కుంటుంది.” అని రాశారు.

బషీర్ 12 ఏళ్ల వయస్సులోనే 1947  దేశ విభజన నాటి దారుణాలు, అల్లర్లు ఆయన మనసుపై చెరగని ముద్ర వేశాయి.ఏడేళ్ల వయసు నుంచే కవితలు రాస్తున్న  బషీర్ గజళ్లు మారుతున్న రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వాతావరణానికి అద్దం పట్టాయి. సయ్యద్ మహమ్మద్ బషీర్ నుంచి బషీర్ బద్ర్ (బషీర్ చంద్రుడు) గా మారిన ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే ముషాయిరాలు, కవితల పోటీలలో అసాధారణ ప్రతిభ ప్రదర్శించి ఎన్నో పురస్కారాలు  పొందారు. ఆయన అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్న కాలంలోనే, ఆయన రాసిన కొన్ని కవితలను ఎం.ఏ (ఉర్దూ) సిలబస్‌లో చేర్చారు. గజళ్లపై పర్షియన్ భాషా ప్రాబల్యాన్ని పక్కన పెట్టి, సామాన్య పాఠకుడికి సైతం అర్థమయ్యే సరళంగా భాషను ఎంచుకోవడం ఆయనకు జనాదరణ కల్పించింది. హిందీ, బ్రజ్, అవధ్ మాండలికల్ని ప్రవేశపెట్టి  ఆధునిక ఉర్దూ కవుల్లో ఒకరుగా ఆయన తన గజళ్లకు ఒక ప్రత్యేకత కల్పించారు. అప్పటి వరకూ ఎవరూ సృష్టించని ప్రతీకల్ని పరిచయం చేశారు.  “ఉర్దూ గజల్ చరిత్రలో నాది ప్రత్యేకమైన మలుపు. నా శైలే గజల్ శైలి..”అని ఆయన ధైర్యంగా ప్రకటించారు. పర్షియన్, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో నిష్ణాతులైన ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డు, పద్మశ్రీతో పాటు వందలాది అవార్డులు లభించాయి. ఆయన కవితలు ఏడు సంపుటాలుగా వెలువడ్డాయి.

సాంప్రదాయ పరిధులను దాటి అభ్యుదయం, ఆధునికత వంటి సిద్దాంతాల చట్రంలో ఇరుక్కోకుండా సామాన్య మానవుడి దైనందిన అనుభవాలను అందంగా, కవితాత్మకంగా వ్యక్తీకరించారు. పాకిస్తాన్ లో ఫైజ్ సృష్టించిన ఒరవడిని ఆయన భారత్ లో ముందుకు తీసుకెళ్లారు. గాలిబ్ తర్వాత కవితలు జనం నోళ్లలో నానేలా చేసిన ఘనత ఆయనకు దక్కింది

బషీర్ బద్ర్ కవితలు మనిషిలోని మానవీయ కోణాన్ని, సున్నితత్వాన్ని, స్వేచ్ఛా ప్రియతను ప్రస్ఫుటిస్తాయి.  మనిషి కోసం ఆయన జీవితాంతం అన్వేషించారు. “నీ తోటి ప్రయాణీకుడు (హమ్ సఫర్ ) ఎక్కడ అని ఒకప్పుడు కలిసి నడిచిన దారులు అడుగుతున్నాయ”ని ఆయన వాపోయిన సందర్భాలు ఎన్నో. “మనిషి కోసం ఆయన జీవితాంతం అన్వేషించారు. ఈ విశాల విశ్వంలో ఒక మనిషిని చూపించమని నేను భగవంతుడిని అడిగాను. కాని అతడు నాకు దక్కలేదు”  అని వాపోయారు.

“ఇళ్లపై పేర్లు ఉన్నాయి, ఆ పేర్ల పక్కన పెద్ద పెద్ద పదవులు (హోదాలు) ఉన్నాయి, కానీ నేను ఎంతో వెతికాను… ఎక్కడా ఒక ‘మనిషి’ మాత్రం కనిపించలేదు.” అని ఆయన మరో కవితలో వేదన చెందుతారు.

మనం మన ఆత్మీయులను కంటి నిండా చూసుకోవాలనుకుంటాం. మనసు విప్పి మాట్లాడుకోవాలనుకుంటాం కలుసుకోవాలనే కోరిక మనను వెంటాడుతుంది. (న జీ భర్ కే దేఖా న కుచ్ బాత్ కీ ,బడీ ఆర్జూ థీ ములాఖాత్ కీ ) అని ఆయన తన్లాడుతారు. “నగరంలో ఎందరో నా ప్రాణ స్నేహితులున్నారు. కాని వారికి నా సమాచారం లేదు, నాకు వారి చిరునామే తెలియదు”  అని ఆరాటపడతారు.  వందలాది మంది మధ్య జీవిస్తున్నా, మనిషి ఒంటరిగా మారిపోతున్నాడని బాధపడ్డారు.

“ముసాఫిర్ హేం హం భీ ముసాఫిర్ హో తుమ్ భీ” అన్న బషీర్ అందరం యాత్రికులమే. కాని ఎక్కడో ఒక చోట కలుసుకుంటాం.. అన్నారు. “కీర్తి శిఖరాలు క్షణికమైన దృశ్యాలు మాత్రమే. మనం ఎక్కిన కొమ్మ ఎప్పుడైన విరిగిపోవచ్చు.” అని ఆయన కీర్తి కోసం ఆరాటపడేవారిని హెచ్చరించారు. “ఖాళీ సమయం  దొరికితే, నీటిపై రాసిన రాతలను చదవడానికి ప్రయత్నించు, ఎందుకంటే ప్రతి నదీ… తన ప్రవాహంతో వేలాది సంవత్సరాల చరిత్రను (కథను) రాస్తూనే ఉంటుంది” అని ప్రకృతిలో చరిత్రను చూడమని చెప్పారు.

” ఉడ్ నే దో ఫరీదోంకో అభీ షోఖ్ హవామే అన్న కవితలో “పక్షులను (పిల్లలను) ఈ చంచలమైన గాలిలో కాసేపు ఎగరనివ్వండి, ఎందుకంటే గడిచిపోయిన  బాల్యపు రోజులు మళ్ళీ తిరిగిరావు.” అని ఆయన  పిల్లల గురించి అనవసరంగా బాధపడే పెద్దలకోసం రాశారు.

బషీర్ బద్ర్ లో ఒక అద్భుతమైన రొమాంటిక్ కవి కూడా ఉన్నారు.

“నువ్వు నా హృదయాన్ని ఎంతగానో దహించివేస్తావు, అయినా కూడా ఎంతో మనోహరంగా కనిపిస్తావు.”,  “నేను నిద్రపోయినప్పుడు నా కనులపై నీ పెదవులను ఉంచు… రెప్పల వెనుక కూడా గుండె కొట్టుకుంటుందని అప్పుడు నమ్మకం కలుగుతుంది.” లాంటి అందమైన  వాక్యాలు ఆయన గజళ్లలో సవ్వడి చేస్తాయి. “పుస్తకంలో తలదూర్చినా ప్రేమికుడికి ప్రియురాలి ముఖం తప్ప మరేమీ కనపడదు.  పుస్తకం లాంటి ఆ ముఖం నా కళ్లముందే ఉండిపోయింది. నా చదువు అందంగా సాగింది” (వో చెహరా కితాబీ రహా సామ్నే. బటీ ఖూబ్ సూరత్ పడాయీ హువీ) అన్న వాక్యం గుండె లయ తప్పేలా చేస్తుంది. “ప్రేమ అనేది ఒక సువాసన (ఖుష్బూ) లాంటిది, అది ఎల్లప్పుడూ మనతోనే నడుస్తుంది, అందుకే, ఏ మనిషీ ఏకాంతంలో (ఒంటరితనంలో) కూడా ఒంటరిగా మిగిలిపోడు.” అని రాసుకున్నారు. “నువ్వు కోపంగా ఉంటే కోపాన్ని దాచకు. అప్పుడే కదా నేను నిన్ను బతిమిలాడే అవకాశం దొరుకుతుంది.” అన్నారు.

మత విద్వేషాల మధ్య పుట్టి, వాటి ప్రభావానికి లోనైనా బషీర్ భద్ర్ జీవితాంతం మనుషుల మధ్య స్నేహాన్నే వాంఛించారు. “శత్రుత్వపు ప్రయాణం ఒకట్రెండు అడుగులు మాత్రమే సాగుతుంది, ఆ తర్వాత (పోరాడి పోరాడి) నువ్వూ అలసిపోతావు, నేనూ అలసిపోతాను” అన్నారు. .”నఫ్రత్‌ను (ద్వేషాన్ని) ఏడు సందూకాల్లో కుక్కి భూస్థాపితం (దఫన్) చేసేయండి, ఈ రోజు మనిషికి ప్రేమ (మొహబ్బత్) అవసరం ఎంతైనా ఉంది.” అని రాశారు. “దీపాలను (ఆశలను) నీ కళ్ళల్లో జాగ్రత్తగా దాచి పెట్టుకో, ఎందుకంటే ముందు ముందు చాలా దూరం వరకు కేవలం చీకటి మాత్రమే ఉంటుంది” అని హితవు చెప్పారు.

ఆయన కవితలు రాజకీయ నాయకుల పెదాలపై తచ్చాడుతూనే ఉంటాయి.

దుష్మనీ జమ్ కర్ కరో లేకిన్ యే గుంజాయిష్ రహే,

జబ్ కభీ హమ్ దోస్త్ హోజాయే తో షర్మిందా నా హోనా

( శత్రుత్వాలు గట్టిగానే ప్రదర్శించండి. కానిమళ్లీ ఎప్పుడైనా స్నేహితులమైతే, ఒకర్ని చూసి ఒకరు సిగ్గుపడకుండా చూసుకోండి) అని రాసిన ఈ కవితను 1972లో భారత పాకిస్తాన్ ల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరినప్పుడు భుట్టో ఈ కవితను ఇందిరాగాంధీకి గుర్తు చేశాడని అంటారు.

ఇదే కవితను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  2018 సెప్టెంబర్ 6న పార్లమెంట్ లో చదివారు. మరునాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా బషీర్ భద్ర్ కవితతోనే ఖర్గేకు సమాధానమిచ్చారు. “జీ బహుత్ చాహ్తా హై సచ్ బోల్నే, క్యాకరే హౌస్లా నహీ హోతా” (సత్యం మాట్లాడాలని మనస్ఫూర్తిగా అనుకుంటాను కాని ఏం చేయాలి. ధైర్యం చాలడం లేదు) అని ఎత్తిపొడిచారు.

కవులు మరణించిన తర్వాత రాజకీయ నాయకులు నిస్సిగ్గుగా వారి కవిత్వాలను తమ రాజకీయాలకు ఉపయోగించుకునేందుకు ఏ మాత్రం వెనుకాడరు. కాని కవులు బతికున్నప్పుడు ఈ నేతలే వారి హృదయాలపై నడుచుకుంటూ వెళతారు.  “నిజం అనేది రాజకీయాలనుంచి న్యాయవ్యవస్థ వరకు బిజీగా చిక్కుకుపోయింది. అబద్దాలే  చెప్పండి. అబద్దాల్లోనే ప్రేమ అపారం”  (సచ్, సియాసత్ సే అదాలత్ తక్ బహోత్ మస్రూఫ్ హై, ఝూఠ్ బోలో, ఝూఠ్ మే అబ్ భీ మొహబ్బత్ హై బహుత్!) అని బషీర్ బద్ర్ ఊరికే రాయలేదు.

*

బషీర్ కవిత ఒకటి: 

గజల్ సాయంత్రాలు కొన్ని 

కళ్లలోనే వుండిపోయాడు కానీ
గుండెల్లోకి ఎప్పుడూ చూడలేదు.

నౌక మీదనే బహు దూరాలు వెళ్ళాడేమో
కానీ, సముద్రాన్ని ఎన్నడూ చూడలేదు.

ఎక్కడయినా చుక్కలా రాలిపడ్డానా
ఎగాదిగా చూస్తారు అందరూ

పగటి బతుకులోనే గడిచిపోయింది కాలమంతా
కాసింత నీడ ఎలా వుంటుందో తెలియలేదు.

నడుస్తూనే వున్నాను అనంతంగా
మైలు రాయి వొక్కటయినా ఇందాకా  చూడలేదు.

గుబాళించే ఈ పూలన్నీ నావి కావు
నేను పడుకుని వున్న ముళ్ళ పడక నువ్వు చూడలేదు.

నన్ను ప్రేమించిన ప్రతి వొక్కరూ అంటారు
నేనొక బండ రాయినని!

 కాలుతున్న  కొవ్వొత్తిని కదా,
నన్నెవరూ తాకి చూడలేదు.

తెలుగు: అఫ్సర్ 

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు