“నీలో ఇలా పెర్ఫార్మెన్స్ ఆంగ్జయిటీ ఫస్ట్ టైమ్ చూస్తున్నా” అంటూ ఆమె మాల్బరో సిగరెట్ పొగలు గాల్లోకి వదిలేసింది. కొంత పొగ చెమటపట్టిన నా మొహమ్మీద జిడ్దులాగా అంటుకుంది.
“ఏమో మనసేం బాలేదు ఈరోజు. ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు.”
మార్ఫియస్ లార్జ్ సిప్ డైరెక్ట్‌గా గొంతులోకి ఒంపుకున్నాను. అప్పటిదాకా నగ్నంగా కాఫీ రంగులో మెరుస్తున్న ఒంటిమీద పొడుగాటి తెల్లటి టీషర్ట్‌ని తగిలించుకుని, చెదిరిపోయిన జుట్టుని ముడివేసుకుని నా కళ్లలోకి సూటిగా చూస్తూ కచ్చగా అడిగింది.
“Hey, what the fuck is that? రా తాగేస్తున్నావ్. ఏమైనా ఉంటే చెప్పుకో.”
వెంటనే ఆమె ఒళ్ళో వాలి కళ్ళలోకి చూసాను. నీలి కళ్లు. చెంపల మీద ఎస్ ఆకారంలోకి ఇంకా పూర్తిగా రూపుచెందని రెండుమూడు తడి వెంట్రుకలు. నుదుటిమీద అక్కడక్కడా చెమటబొట్లు. రూమంతా తన నోటి నుండి వెలువడ్డ సిగరెట్ పొగ. మాల్బరో, మార్ఫియస్ కలిసిపోయి మనసంతా మత్తుగా మండిపోతోంది. చేతివేళ్ళు జుట్టులోకి పోనిచ్చి నా తల నిమురుతూ ఉంది.
“ఎందుకు ఎప్పుడూ వాడి గురించే తలుచుకుంటావ్. జరిగిందేదో జరిగింది. నాతో ఉన్నప్పుడు మరొక మగాడి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే నాకూ నీ గురించి వేరే అనుమానాలు వస్తున్నాయి” కన్ను కొట్టి నవ్వింది.
ఆ నవ్వు నాకు భలే ఇష్టం. రెండేళ్ల క్రితం అగాథపు లోతుల్లో కూరుకుపోయిన నా నవ్వుని వెలికితీసింది ఇదే నవ్వు. మందుకి బానిసనై పిచ్చి గడ్దమేసుకొని ఊరి నుండి ఊరికి బైరాగిలా తిరుగుతూ ఉండగా రైల్లో పరిచయమైంది. అప్పటినుండి ఇప్పటిదాకా నన్నే అంటిపెట్టుకొని ఉంది. ఆమె ప్రేమతో నా ఒంటరితనాన్ని పూర్తిగా బద్దలుకొట్టింది. నా ఉనికిని గుర్తుచేస్తూ నన్ను నన్నుగా ప్రేమించే ఈ అమ్మాయి ముందు నా మనసులోని చీకట్లను ఈ రాత్రి ఎలాగైనా పరుచుకోవాలి. లోలోపల మిణుకుమిణుకుమంటూ వెలుగుతూ ఆరే మిణుగురు పురుగుల్ని ఆమె మీదికి ఒక్కసారిగా విదిలించేయాలి.
ఆమె నా పెదాల మధ్య సిగరెట్ పెట్టి పీల్చమనగానే సాలోచనగా ఉన్న నాకు ఒక్కసారిగా గొంతులో పొలమారినట్టయి దగ్గు పెల్లుబికి వచ్చింది.
“Are you alright? ఎప్పుడూ చూళ్ళేదు నిన్నిలా. వాడి గురించేనా మళ్ళీ? అదైనా చెప్పి చావు.”
“నా తప్పు కూడా ఉంది కదా. ఈ మధ్య ఎందుకో…”
గోడ మీద ‘చలం’ ఫోటో ఉన్న కాలెండర్ వైపు చూస్తూ అన్నాను. కాలెండర్‌లో ఎప్రిల్ 22 అని డేట్ చూడగానే నా మొహమ్మీద ఎవరో చాచిపెట్టి కొట్టినట్టయింది. వాడితో ఆఖరిసారి మాట్లాడిన రోజది. వానతో తడిసిన నేల వాసనలతో నిండిన ఏకాంతపు రాత్రులు, ఆ రాత్రుల్లో దిగులు గుండెలో పరుచుకున్న శూన్యాలు, ఆ శూన్యాలని కట్టిపడేస్తూ నా కాలాన్ని ఖర్చు చేసిన వాడి ఆలోచనల సంకెళ్లు, ఆ సంకెళ్లలో నా ఉనికిని బిగిస్తున్న వాడి రూపం. కంటి కింద చర్మం ముడుచుకుపోయి విడిచిన ఒకానొక మడత. పెదాల దగ్గర కూడా ఇంచుమించు అలాంటిదే ఇంకో మడత. ఈ రెండు మడతల్లో వాడి ముఖం నవ్వుగా వెలిగిపోతుంది.
ఉన్నపళంగా పెదాలు తడవ్వడం తెలిసింది. నన్ను ఈ లోకంలోకి తీసుకురావడానికన్నట్టుగా ఆమె పెట్టిన ఘాటైన ముద్దు. వాడి కళ్లలో ఉండే కళ ఆమె కళ్లలో కనిపించడం లేదు. వాడి మొహంలో కనిపించే వెలితి ఈమె మొహంలో ఇసుమంతైనా లేదు.
“జీవితాల్లోకి ఎవరెవరో వస్తూ పోతుంటారు. వాళ్లు వెళ్లిపోవడానికి మనమే కారణం అనుకోవడం నా దృష్టిలో అబ్సొల్యూట్ ఫూలిష్నెస్.” ఆమె గొంతులో చిన్నపాటి విసుగు.
“వంద చెప్తావ్ నువ్వు. నీదేం పోయింది.”
“ఇప్పుడేమంటావ్ ఇంతకీ? వాడు ఈ ప్రపంచం నుండి తప్పిపోయి బైరాగిలాగా ఎక్కడికో వెళ్ళిపోవటానికి నువ్వే కారణమంటావా?”
“అలా అని కాదు కానీ ఎందుకో ఆ రోజు నుండి వాడిని వదిలేయకుండా ఉండాల్సింది అనిపిస్తుంది.”
“అప్పుడు న్యాచురల్లీ నీకు రోజుకో లిప్ కిస్ తప్పేది కాదు కదా.”
వాడితో ముద్దు అన్న ఊహ ఆమె మాటల్లో వినగానే గొంతు ఎండిపోయినట్టనిపించింది. ఇద్దరమూ నవ్వుకున్నాం. టేబుల్ మీదున్న ఖాళీ బాటిల్ తీసుకొని కిచెన్‌లోకి వెళ్లి నీళ్లు నింపుకున్నాను. పిల్లిలాగా వెనకాలే వచ్చి నవ్వుకుంటూనే నా భుజమ్మీద పంటిగాటుని పెట్టింది. అసలే ఏప్రిల్ ఎండలు, దహించుకుపోతున్న శరీర దాహాలు. చెమటలు కక్కుతున్న చర్మానికేమో రాపిడిలో పుట్టే సుఖం తప్ప ఎండమావులు తెలీవు మంచుపూవులు తెలీవు.
“మనుషులు మన జీవితాల్లోకి వాళ్ల బాధల్ని పంచుకోవడానికి వస్తారో లేక మనకుండకనే ఉన్న దుఃఖాన్ని ఇంకా పెంచడానికి వస్తారో తెలీదు” అంటూ చల్లటి మంచినీళ్లు గొంతులోకి ఒంపుకున్నాను.
విండో కర్టెన్‌ని ఒంటికి చుట్టుకుని అక్కడక్కడే గిరగిరా తిరుగుతూ చిన్నపిల్లలాగా ఆటలాడుతుంది. నా మాటలకి సమాధానంగా ఏదో చెప్తూనే ఉంది. నాకవేమీ చెవికెక్కడం లేదు. ఎదురుగా ఉన్న అద్దంలో తన సిల్హౌవెట్ కదలికల్ని తదేకంగా చూస్తున్నాను. కొంతసేపయ్యాక ఆమె అడుగుల చప్పుడు నా శరీరానికి దగ్గరయ్యింది. చెమటలు పట్టిన వేళ్ళతో తన అరచేతిని నా అరచేతితో జతచేస్తూ ఉంటే పచ్చిగడ్డి మీద పొగమంచు పరుచుకున్నట్టుంది.
ఆ తేమని ఆవిరి చేస్తూ ఆ క్షణం నూనూగు మీసాల కింద విచ్చుకున్న వాడి నవ్వులగలగలలు వినిపించాయి నాకు ఏ లోకాలనుండో. కిటికీ బయట వీధిదీపాల వెలుగులో నిశ్చలంగా నిలబడ్ద వేపచెట్టుని ఊపేస్తూ ఎగసెగసిపడుతున్న వేడిగాలి వీచికలు.
“సరే నేను పడుకుంటా. మరచిపోకుండా టాబ్లెట్ వేసుకొని నువ్వూ పడుకో. అతిగా ఆలోచించకు. ఇందాక నేను బానే ఎంజాయ్ చేసాను. Don’t feel so bad about it. Good night” అని నన్ను నా ఆలోచనలకి పూర్తిగా వదలేసి వెళ్ళిపోయింది.
****
బెడ్ లైట్ కట్టేసి, ఆంగ్జయిటీ టాబ్లెట్ వేసుకొని రైటింగ్ డెస్క్ మీద కూర్చున్నాను. చీకట్లో టేబుల్ లాంప్ వెలుతురు చెక్కుమని మెరుస్తుంది. లేత పసుపు వర్ణపు వెలుతురు నా ఒళ్లో పడుతూ నన్ను కౌగిలించుకున్నట్టు కనబడుతుంది. జుయ్యంటూ ఒక దోమ అక్కడక్కడే తిరుగుతుంది. కంటి మీదా, చెంప మీదా, చెవుల చుట్టూ ఒకటే కుడుతూ ఉంది. నుదుటి మీద వాలేసరికి చూసి చూసి చిరాకేసి అరచేత్తో ఒక దెబ్బ వేసాను. నా నుదుటి పై దోమ రక్తం, అరచేతికి అంటుకున్న దాని అస్థిపంజరం. వెనకాల బెడ్ మీద చీకట్లో ఆమె అటూ ఇటూ కదులుతూ ఉంది. ఏదో కలవరింత కాబోలు. అంతలోనే గురకపెడుతూ తాను కంటున్న కలలోకి వెళ్లిపోయినట్టుంది. నాకేమో రాత్రుల్లో సెక్స్ చేసిన వెంటనే నిద్రపోకుండా ఇలా టేబుల్ లాంప్ కింద కూర్చుని డైరీలో ఏదోకటి రాయడం అలవాటయిపోయింది.
ఈరోజెందుకో వాడు తెగ గుర్తుకొస్తున్నాడు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో! అసలున్నాడో లేడో.
అల్మారాలో అడుగున దాచిన పాత నీలిరంగు డైరీని బయటికి తీసాను. Solitude అని ఇటాలిక్‌లో ఫ్రంట్ కవర్ మీద రాసి ఉంది. మూడేళ్ల క్రితం సీ యే కోర్స్ నుంచి డ్రాపౌట్ అవ్వక ముందటి రోజులు. ఆ పేజీలు తిరగేస్తూ ఉంటే వీడి తాలూకు జ్ఞాపకాల పొరలు ఒక్కొక్కటీ తరచి తరచి ఒలుస్తూ ఉన్నట్టుంది. తలలో ఒక పుండు లాంటి నిజం క్షణక్షణం తడుతూనే ఉంది.
****
గుండ్రటి కళ్లు. పెన్సిల్‌తో గీసినట్టు సన్నగా ఒంపు తిరిగిన కనుబొమలు. నురగలు కక్కుతున్న కాఫీ రంగులో మెరుస్తున్న మొహం. సిగరెట్ పొగ చూరి అప్పుడే నలుపెక్కుతున్న కింది పెదవి. పొట్టి మనిషి. భూమికి అంటీ అంటనట్టు కాలివేళ్ళ మీద నడక. మంచి డ్రెస్సింగ్ సెన్స్, స్టైలుకేం తక్కువ లేదు. అమ్మనాన్న లేరు. చిన్నప్పటినుండి పెద్దనాన్న వాళ్ళు పెంచారు కానీ వాడిది అంతా ఎవర్నీ లెక్కచేయని మనస్తత్వం. ఇంట్లో ఉండడం వాడికి చిరాకేమో. ఎప్పుడూ రోడ్ల మీదే కనిపిస్తాడు. క్లాసుల్లో ఎప్పుడు ఉంటాడో, లైబ్రరీలో ఎప్పుడు కనిపిస్తాడో, ఒక్కోసారి పది రోజులదాకా మొత్తానికే కనిపించకుండా పోతాడో తెలీదు. ఎందుకో తెలియకుండానే వాడి పట్ల ఎక్కువగా ఫాసినేట్ అవుతున్నాను. వాడిని కలవాలని, వాడితో మట్లాడాలని ఈ మధ్య ఎందుకో నా మనసు తహతహలాడుతోంది.
****
ఒక రోజు లైబ్రరీలో ఏదో పుస్తకం చదువుతూ కనిపించాడు. ఆకుపచ్చరంగు అట్ట మీద చూస్తే ‘చలం’ ఆత్మకథ అని టైటిల్ కనిపించింది. తెల్లగడ్డంతో నవ్వుమొహంతో ఒక పెద్దమనిషి. అకాడెమీ పుస్తకాల్నే నములుతున్న నాకు ఆత్మకథల్ని నమిలే అతన్ని చూడగానే భలే ముచ్చటేసింది. ఫ్రెంచ్ గడ్డం, పోనీటైల్, రిమ్డ్ గ్లాసెస్‌తో పుస్తకంలో తల దూర్చేసి అప్పుడప్పుడూ నోట్స్‌లో ఏదో శ్రద్ధగా రాసుకుంటూ ఉన్నాడు. ఎదురుగా కూర్చుని అతన్నే చూస్తున్న నేను ఎందుకో డెస్పరేషన్ ఆపుకోలేక అతని పక్క సీట్లో కూర్చొని “హే బ్రో” అని పలకరించాను. అతని ఒంటి నుండి వచ్చే పెర్ఫ్యూం వాసన మత్తుగా ఉంది.
నన్ను చూస్తూ ‘ఏంట’న్నట్టు కళ్లెగరేశాడు.
“ఎప్పుడూ లైబ్రరీలోనే కనిపిస్తున్నావ్. సబ్జెక్ట్ ఎక్కట్లేదా?”
“అవును. రెండుసార్లు అటెంప్ట్ ఇచ్చాను. లాంగ్ టర్మ్. ఈ థర్డ్ అటెంప్ట్ కూడా ఏమీ ఎక్కట్లేదు. ఇక ఈ అకాడెమియా పంచాయితీలు మొత్తానికే వదిలేస్తాను. I happened to understand that my soul is not into it.”
“మరి నీకేమిష్టం?”
“ఇది అని ఏం లేదు. ఎక్కడికైనా దూరంగా వెళ్లాలని ఉంది. ఇదిగో ఈయనలాగా… కుదిరితే సరాసరి రమణాశ్రమానికే” అంటూ కవర్ పేజీ మీదున్న ఆ పెద్దాయన మొహమ్మీద చేత్తో సుతారంగా మీటాడు.
అతని కళ్లలో అందరిలా కాకుండా వేరేలాగా బతకాలన్న ఆరాటం కనిపిస్తోంది. ఏదో కావాలని, జీవితంలో ఇంకేదో ఉందని, దాని అంతు ఎలాగైనా చూడాలని వెంపర్లాడే మనుషులంటే భలే ఇష్టం నాకు.
“పేరెంట్స్ లేరట కదా నీకు. ఫ్రెండ్స్ అంటుంటే విన్నాను. మొన్నీమధ్య ఫుట్పాత్ మీద పడుకుండడం చూసాను. ఎందుకలా? శుభ్రంగా ఏదో హాస్టల్లో ఉండక.”
“నాకు మనుషులతో పెద్దగా సరిపడదు. ఎవరితోనూ మంచిగా మసులుకోలేను. ఎక్కడ పడితే అక్కడే. ఫ్రెండ్స్ రూముల్లోనే ఎక్కువగా ఉంటాను.”
“మీ పెద్దనాన్న పెద్ద బిజినెస్ టైకూన్ అట కదా. వాడుకోకపోయావ్ డబ్బులు” అని నవ్వాను.
“లేదు. వాడొక వేస్ట్ కాండిడేట్. మా అమ్మతో అఫైర్ పెట్టుకున్నాడు. వాణ్ణి చంపలేక చస్తున్నాన్నేను” అని నవ్వాడు.
అంతలోనే మళ్ళీ “Hey do you take dope?” అంటూ కుర్చీలో నుంచి లేచాడు.
“Yes I do. You mean Marijuana?” అంటూ అతని పొడవాటి నల్లని చేతివేళ్లని చూస్తూ అన్నాను.
అతన్ని ఇంతకుముందే ఏదో జన్మలో కలుసుకున్నట్టు ఒక దగ్గరితనమేదో తెలుస్తూ ఉంది.
“Yes bro. Let’s fucking have it. నా దగ్గర గ్రీన్ లీఫ్ ఉంది. నీ రూంలో కొడదామా?” అంటూ నా భుజమ్మీద చేయేసాడు. వెన్నులో ఒక్కసారి జలదరించినట్టయింది. ఎంతోమంది నా మీద చేతులేసారు కానీ ఈ స్పర్శ చాలా కొత్తగా ఉంది.
“తంతారు మా హాస్టల్ వాళ్ళు. మళ్ళీ ప్రాబ్లం అవుద్ది నాకు. బయటే కానిద్దాం” అని నాలో మసులుతున్న భావోద్వేగాలను బయటికి కనిపించకుండా దాచేసాను.
“సరే అయితే. ఆక్సిజన్ తీసుకోడానికి పోదాం పద.”
నిశ్శబ్ద మందిరం నుండి బయటపడ్దాము.
****
పాడుబడ్ద రంగు వెలిసిన సిమెంట్ ఫాక్టరీ బిల్దింగ్. సగం కూలిపోయి శిథిలావస్థలో గోడపగుళ్లు, ఆ పగుళ్ల నుండి దయ్యం చేతుల్లాగా బయటికి పొడుచుకు వచ్చిన పేరు తెలియని చెట్టు తాలూకు నల్లటి ఎండుకొమ్మలు. అటుపక్కగా గాలికి రాలిపడుతున్న చింతకాయలు. వెనకాల హొరైజన్స్‌లో ఆకాశమంతా పలచబడుతున్న నారింజ కాంతి అక్కడక్కడా వెలుగుతూ ఉంది. రంగులు విడుస్తూ అస్తమిస్తోన్న సూర్యుడి వైపు ఒక పక్షుల గుంపు పయనమవుతుంది. ఆ పక్షులవైపు నన్ను చూడమన్నాడు.
జేబులో నుండి రెండు మాల్బరో సిగరెట్స్ తీసి, సిగరెట్‌లో ఉన్న తంబాకుని ఒంపేసి, క్రష్ చేసిన గ్రీన్ లీఫ్‌ని అందులోకి కుక్కేసి, ఒకదానికి నిప్పంటించి పఫ్ చేశాడు. కళ్ళు తేలేస్తూ, పెదాలు వణుకుతూ, పొగనంతా గాల్లోకి వదులుతూ తన్మయత్వం పొందుతున్నాడు. నేను కూడా రెండు దమ్ములు లాగేసరికి ఎముకలు చల్లబడ్డట్టు, చర్మం తడిసిపోతున్నట్టు, గుండెచప్పుడు నెమ్మదించినట్టు, ఈ క్షణం కదా అసలైందీ అనిపించే చెప్పనలవి కాని మైకం. ఇంతకుముందెన్నడూ ఇంతలా మత్తెక్కే పదార్థం తీసుకోలేదు.
ఈ గంజాయాకుని ఏ అడవిలో నుండి తెంపుకొచ్చాడో మహానుభావుడు!
మబ్బుపట్టిన ఆకాశంలో వర్షం పడే సూచనగా అక్కడక్కడా తేమగాలి. ప్లాస్టిక్ కవర్ ఒకటి గాల్లో పల్టీలు కొడుతూ, తేలుతూ ధూళిమేఘాల్లోకి కనిపించకుండా వెళ్ళిపోయింది. దూరంగా నెమలి అరుపు చెవిలో ఎకో లాగా మోగుతుంది. పిల్లి మియావ్ అని పెద్దగా అరిస్తే ఇలాగే ఉంటుంది కాబోలు.
“ఎప్పటికైనా వాడిని చంపేయాలి. అందుకే బయటే ఉండి రకరకాల స్కెచ్చులేస్తున్నా” అని నెమలితో పాటు వాడు కూడా అదే గొంతుతో అరుస్తున్నాడు. వాడి మాటల్ని, ఆనందాన్ని చూస్తూ ఇంకో పఫ్ తీసుకొని బుడగల్లాంటి పొగని గాల్లోకి వదిలాను.
ఒక్కొక్క పఫ్ కొడుతూ ఉంటే అంచెలంచలుగా ఒంటి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. చేతులూ కాళ్ళూ కలిసిపోయి వెల్లకిలా పచ్చగడ్డి మీద వాలిపోయాను. గంజాయి దమ్ముకి బానిసగాడేమో, వాడి ఒళ్లు కాస్తైనా తూలట్లేదు. రాతిబండ మీద నిలుచొని రెండు చేతులు గాల్లోకి చాపి నల్లబడుతున్న మేఘాలకేసి చూస్తూ గట్టిగట్టిగా అరుస్తూనే ఉన్నాడు. గాలి నా మొహమ్మీద నీళ్ళలాగా కదులుతుంది. శరీరమంతా మాటల్లో చెప్పలేని హాయి. నెమ్మదించిన నా గుండె చప్పుడు కూడా బయటికే స్పష్టంగా వినిపిస్తోంది.
“రేయ్. You can’t get away from me… బాస్టర్డ్ పెద్దనాన్నా.”
వాడి అరుపులు నా చెవుల్లో మార్మోగుతున్నాయి. వాడి చేతివేళ్ల మధ్య వర్షపు చినుకులకు తడుస్తూ ఎప్పుడో ఆరిపోయిన సిగరెట్ పీక.
“నీక్కావాలంటే చెప్పు. నేనూ నీకు తోడు వస్తా” అంటూ ఎందుకో అసంకల్పితంగానే నోటికి వచ్చేసింది.
వాడి వైపు భారంగా కాళ్లీడుస్తూ ఉంటే గడ్దిపోచలు నా అరికాళ్లకి సూదిమొనలు గచ్చుతున్నట్లున్నాయి.
“So you are my partner in crime అన్నమాట” అని వెనక్కి తిరిగి నవ్వాడు.
అప్పటిదాకా కురుస్తున్న వర్షపు జల్లు కాస్తా హోరందుకుంది. గాలివానకి రెండో సిగరెట్ నిప్పంటించరావట్లేదు నాకు. అతను చేతివేళ్ళని సున్నాలాగా చుట్టేసి సునాయాసంగా అంటించాడు.
****
రాత్రుళ్ళు కార్నెట్టో బటర్‌స్కాచ్ ఐస్క్రీం కోసం నడుస్తూ రోడ్డు మీదికి రావడం అలవాటు. వెన్నెల రాత్రి. పేవ్‌మెంట్ మీద వాడు కాళ్ళు బార్లా చాపుకొని దుమ్ముపట్టిన బట్టలతో కనిపించాడు. అటు పక్కనే బిచ్చగాళ్ళు, బికారులు ఎంతో మంది చినిగిన గుడ్డపేలికలను అరకొరగా కప్పుకొని పడుకున్నారు. వీడు మాత్రం మొహమ్మీద కురిసే వెన్నెల వెలుగులో ఆకాశంలో చుక్కలకేసి చూస్తూ ఏ బాధా లేకుండా ఎంతో హాయిగా కనిపించాడు. ఏం ఆలోచిస్తున్నాడు ఇంతకీ? పెద్దనాన్న గురించేనా? ఇల్లు ఉండి కూడా వాటర్ బాటిల్ తల కింద దిండులా పెట్టేసుకుని ఇలా నిద్రలేమితో కిందామీదా పడుతున్న వీడి విపరీతమైన వాలకం చూసి నవ్వాలో ఏడవాలో అర్థమే కాలేదు నాకు.
చెప్తే వినే రకం కూడా కాదు. ఉత్తి స్టబ్బర్న్ మనిషి. జీవితం మిగిల్చిన గాయాలకి ఖంగుతిని అక్కడికక్కడే ఆగిపోయి నోరుమూసుక్కూర్చునేవాడు అంతకన్నా కాదు. ఎవర్నీ పెద్దగా లెక్కచేయడు. అదే వాడిలోని ఆకర్షణ. భవిష్యత్తులో ఎప్పుడైనా నేను ఎవరినైనా వెతుక్కుంటూ వెళ్లి కలవాలనుకునే మనిషి ఉంటే అది వీడేనేమో అనిపిస్తుంది. ఎక్కడుంటాడో, ఏం చేస్తుంటాడో అసలు అర్థమే కాదు. పిచ్చి మనిషి. వీడి గురించి ఆలోచిస్తేనే బెంగగా ఉంటుంది. వీడంటే ఎందుకంత ఇష్టమో కూడా నాకు నేను చెప్పుకోలేకపోతున్నాను. కానీ వీడు ఎప్పుడు గుర్తొచ్చినా గంజాయి దమ్ము గుండెలోకి గట్టిగా లాగినప్పుడు ఒంటి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకునే లాంటి ఫీలింగ్ కలుగుతుంది.
****
ఈరోజు మర్కెంటైల్ లా క్లాస్ జరుగుతుంటే అరగంట ఆలస్యంగా వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. లెక్చరర్ గట్టిగట్టి అరుపులతో క్లాస్రూమ్ అంతా దద్దరిల్లుతుంది. అప్పుడే క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉండి, అంతలోనే అందరూ పగలబడి నవ్వుతున్నారు. మనసంతా వాడి కళ్ల మీదే. ఇంతకీ వీడు ఏం చేస్తున్నాడనేసి చూస్తే, పక్క వరసలో కూర్చున్న ఒక అమ్మాయి కళ్ళని టెక్స్ట్ బుక్ చివరి పేజీలో బొమ్మగా గీస్తున్నాడు. బ్లూ, బ్లాక్ ఇంకులతో ఏకాగ్రతతో ఔట్లైన్ వేస్తున్నాడు. ఆ కనుబొమల స్ట్రోక్స్ చూస్తుంటే మనసు ఎందుకో చివుక్కుమంది. క్లాస్ అయిపోయాక బ్రేక్ టైంలో అమ్మాయిలందరూ బయటికి వెళ్ళారు. మైమరచిపోయి వాడినే చూస్తున్న నన్ను గమ్మునుండమంటూ ఆ అమ్మాయి బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి అందులోని సానిటరీ పాడ్ మీద ‘ఐ లవ్ యు’ అని రాసి కళ్ల బొమ్మున్న కాగితమ్ముక్క కలిపేశాడు. హాస్టల్‌కి వచ్చాక ఆ రాత్రి ఏమీ తినాలనిపించలేదు
సాయంత్రం ఆ అమ్మాయితో ఇందిరా పార్క్‌లో కనిపించాడు. ఫ్రెంచ్‌లో ముద్దు పెట్టుకుంటున్నారు. ఏం చేయాలో తెలీక అక్కడి నుండి నేరుగా నాలుగు మైళ్లు నడిచి శివుని గుడికెళ్లి చీకటిపడేదాకా అక్కడే ఉండిపోయాను. మర్నాడు ఆ అమ్మాయి నన్ను వాడి వేరెబౌట్స్ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది. నాక్కూడా తెలీదని ఆమెతో అన్నాను. వరసగా మూడురోజులు వాడి గురించి అడుగుతూనే ఉంది. మధ్యలో వాడిని కలిసినప్పుడు నేను చూసింది కానీ ఆ అమ్మాయి చేసిన ఎంక్వైరీ గురించి కానీ వాడికేం చెప్పలేదు. ఎందుకో చెప్పాలనిపించలేదు.
****
వారం గడిచాక ఆ అమ్మాయి పూర్తిగా వాడి గురించి మరిచిపోయిందని అర్థమైంది. అది తెలిశాక నాకు లోలోపల ఒక తెలియని రిలీఫ్. ఎంత హాయిగా అనిపించిందో మాటల్లో చెప్పలేను.
****
వాడు నన్ను దాటేస్తున్నట్టు అనిపిస్తోంది. ముందులాగా పెద్దగా పట్టించుకోవట్లేదు. నాతో స్నేహం వాడికి బోర్ కొట్టిందా? ఫోన్ చేసినా ఎత్తడం లేదు. ఇంటికి వెళ్లి కనుక్కుందామంటే వాడి గురించి తెలీదని మొహమ్మీదే తలుపేసాడు వాడి సైకో పెద్దనాన్న.
****
నాకర్థమయ్యింది. ఎక్కడికో వెళ్లిపోయాడు వాడు. రాత్రి నుండి ఒకటే బెంగ. అన్నం తినాలనిపించట్లేదు. చదువెక్కట్లేదు. ఎవరికీ కనిపించకుండానే దూరంగా వెళ్లిపోయాడు. ఎదవ!
****
సరిగ్గా నెల రోజులకు నాకు వాడు ‘హిమాలయ’ బార్‌లో కనిపించాడు. అర్థంకాని విషాదంతో సఫర్ అవుతున్నట్టు వాడి కళ్లు. వాడి ధ్యాసలోనే ఉంటూ నిద్రలేమి కళ్ళతోనేమో నేను. ఒకడికి ఎద్దుంటే ఇంకోడికి బుద్ధుండదు అంటే ఇదేనేమో.
“ఏంటి ప్రేమించలేదా ఆ అమ్మాయిని? నీ గురించి అడిగింది.”
మార్ఫియస్ పెగ్గు కలుపుతూ అడిగాను. కాస్త బక్కచిక్కిపోయాడు.
“ఆ అమ్మాయి సంగతి వదిలెయ్. అదేదో సరదాకి. వర్ణ గురించి చెప్పేవాణ్ణి గుర్తుందా? వర్ణ… వర్ణ. అది కదా అసలైందీ.”
ఎటు తిరిగీ నాతో మామూలుగా మాట్లాడుతున్నందుకు ఆనందించాలో ఎప్పుడూ ఆడవాళ్ల ప్రస్తావన తెస్తున్నందుకు బాధపడాలో తెలియటం లేదు.
అంతలో వాడే “గుండెల్నిండా ప్రేమించాను దాన్ని. పదేళ్ళు కలిసున్నాం ఊహ తెలిసినప్పటినుండి. దాన్నే పెళ్లి చేసుకుంటాననుకున్నాను” అన్నాడు.
నేను పోసిన రా పెగ్గుకి ఇంకాస్త కలుపుకొని ఒకేసారి గొంతులో పోసుకున్నాడు. వెనకాలకి తల వాల్చి నోరు పెద్దగా తెరిచి ఊపిరి తీసుకుంటున్నాడు. గొంతు దగ్గర గుటకపడుతూ ఉంది. లోలైట్‌లో పోనీటైల్ ముడి విప్పేసి భుజాల మీద్దాకా ఉన్న జుట్టుని ఒక్కసారిగా విదిలించాడు. కళ్ళు తిరిగినట్టయి టేబుల్ మీద తల పెట్టేసి, కళ్లు, నోరూ తెరిచి శూన్యంలోకి చూస్తున్నాడు. ఆ స్థితిలో వాడిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. దగ్గరికి తీసుకొని ముద్దు చేయాలని ఎంతో కోరికగా ఉంది. వాడు ఏమనుకుంటాడో ఏమో అనేసి లోపలే దాచేసాను.
“ఏంటి సార్.. లోపల సుళ్ళు తిరుగుతున్నట్లుంది మార్ఫియస్” అని అనగానే వెంటనే లేచి వాష్రూమ్‌లోకి పరిగెత్తుకెళ్లాడు. వెనకాలే వెళ్ళి వాడి చెవులు గట్టిగా మూసి పట్టుకున్నా. తాగిందంతా సింక్‌లో కక్కుకున్నాడు. తలెత్తి గోడకున్న తుప్పు పట్టిన అద్దంలోకి చూస్తూ భుజాలెగరేసి బిగ్గరగా నవ్వుతున్నాడు. కళ్లేమో ఎర్రగా. మొహమంతా మాసినట్టు, కొన్నేండ్ల బాధని గుండెల్లో మోస్తున్న నిద్రలేమి ఛాయలు. గతకాలపు గాయపు గురుతులు కొట్టొచ్చినట్టు తెలుస్తున్నాయి ఆ మొహంలో.
టేబుల్ మీద కూర్చున్నాక ఐదు నిమిషాలకి మళ్ళీ ఒక నార్మల్ పెగ్గు కలుపుకొని ఇప్పుడు కాస్త నిదానంగా తాగుతున్నాడు.
“డోంట్ వర్రీ. నేను బానే ఉన్నాను” అంటూ రీ అష్యూరెన్స్ ఇస్తున్నాడు.
“వర్ణకి ఏమైంది మరి.. వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుందా?” అంటూ అక్కరగా అడిగాను.
“చచ్చిపోయింది.”
“ఎలా?”
“హెచ్ ఐ వి.”
“What the fuck!”
“Transmitted from her father. తనకంటూ మిగిలిన ఒక్కగానొక్క నాన్నకి సపర్యలు చేస్తూ ఉండగా రక్తం అంటో ఇంకేదైనానో.. ఏమో మరి. ఏదైతేనేం. వర్ణ అయితే ఇక లేదు.”
“I am so sorry. It’s devastating.”
“Why should you be sorry? Shit happens in life. చల్తా..”
“కదా.. మరి నువ్వు కూడా మూవాన్ అవ్వచ్చు కదా.”
“కొంచెం కష్టంగా ఉంది. టైమ్ పట్టుద్దేమో. మా పెద్దనాన్నని చంపేశాక కాస్త విముక్తి దొరుకుద్దేమో నాకు తెలిసి” అని నవ్వేశాడు.
అప్పటిదాకా మాట్లాడుతున్న విషయాలు అసలేమీ గుర్తులేనట్టే గుండెలనిండా నవ్వాడు.
ఆ నవ్వు ఉంది చూడు… దాని కోసం ఏమైనా చేసేయచ్చు.
“మరి రమణాశ్రమం అంటూ ఏదో వాగావ్?” అని దెప్పిపొడిచాను.
“అదా… అదింకో రకం విముక్తి” అని తీసిపడేసాడు.
“తమరికి నమ్మకం లేదేమో కదా దేవుడి మీద.”
“దేవుడి గురించి కాదు.. మనుషుల నుండి దూరంగా. నాతో నేను గడపడానికి. నాకేమీ అంటని మలినాలకి, నాకు మాత్రమే తెలిసిన నిశ్శబ్దానికి దగ్గరగా ఉండడానికి వెళ్ళాలి అక్కడికి.”
“సాధువుల్లాగా మాట్లాడుతున్నావ్. కొంచెం చూస్కో” అంటూ లోపల వీడు ఎక్కడ దూరమయిపోతాడోనన్న బాధ తొలుస్తూ ఉంటే లోలోపలే కప్పెట్టేసి బయటికి నవ్వు నటిస్తూ మాట్లాడుతున్నాను..
“ఈ పశువుల మధ్య బ్రతికేకన్నా అక్కడే నయం.”
“You are generalising things… Take it easy, my boy.”
“నా మనసు ఒకటి చెప్తుంది. మెదడు ఇంకోటి చేయమంటోంది. మధ్యలో ఏదో అడ్డు లాగా తడుతూనే ఉంది. నన్నింకేదో లోపలి నుండి తినేస్తూ ఉంది. ఇక్కడున్నంతకాలం నేను నాలాగా అసలే ఉండలేను. చంపడానికి పూనుతుంది మనసు. మా నాన్న కూడా నాలాగే ఆలోచించి ఉంటాడా? మరి ఆయన అలా ఎలా వెళ్ళిపోయి ఉంటాడు? అమ్మ ఉరిపెట్టుకునే ముందు ఏం ఆలోచించి ఉంటుంది? దీనంతటికీ కారణం కామమే కదా? ఈ శరీరం… కామం… స్వార్ధం…మోసం. అన్నీ పక్కపక్కనే అంటిపెట్టుకుని ఉన్నాయి కదూ. ఏదేమైనా సోల్ ని చావనివ్వను” అంటూ అంతరాంతరాల్లో దాగున్న ప్రశ్నల్ని, ఆవేశాన్నంతా వెళ్లగక్కుతూ ఇంకో సిగరెట్ ముట్టించాడు.
“పరవాలేదు కొంతమందిని చంపినా న్యాయమేనేమో. పెద్దనాన్న లాంటి వాళ్ళని ముఖ్యంగా” అంటూ వాడు తాగుతున్న సిగరెట్ని తీసుకుని గట్టిగా పీల్చాను. వాడి పెదాల్ని ముద్దు పెట్టుకున్నట్టే అనిపించింది.
“Don’t give in to the passion of crime. It’s an empty fascination, dude” అని ఫిలాసఫి మొదలెట్టాడు.
నాకు ఆ మాటలకి ఎక్కడలేని కోపం తన్నుకొచ్చింది.
“ఎవడు ఎవడికి నిప్పంటిస్తున్నాడో చూసుకొని మాట్లాడు. చలం అంటావ్, చంపేయాలంటావ్. అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనంటావ్, మర్డర్ స్కెచ్చులేస్తున్నా అంటావ్. అసలు ఇంతకీ నీకేం కావాలి?”
“I don’t even know what I want in life. I’m an egotistic bastard. Let me die in peace. నాకు ఎవడి సహాయమూ అక్కర్లేదు” అని వాడి కోపాన్ని నా మీదికి కక్కేసాడు.
ఆ కళ్లలో callousness కొట్తొచ్చినట్టు కనిపించింది. పడగెత్తిన పాము గుర్తొచ్చింది ఆ క్షణం.
“అది సరే కానీ… మీ నాన్నకి ఏమైంది మరి ఆ తర్వాత?” వాడి ఆలోచనల్ని మళ్ళీ గతం వైపు మళ్లించాను.
సిగరెట్ పూర్తయ్యేదాకా ఇద్దరి మధ్య నిశ్శబ్దం. వాడి కళ్లు ఎర్రబడుతున్నాయి.
“వాళ్ళిద్దరూ కలిసి పడుకుంది చూసి నాన్న ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడు. నాకు పన్నెండేళ్ళు అప్పటికి. రెండేళ్ల తరువాత అమ్మ సగం మెంటల్ పేషెంట్ అయింది. నాన్న తిరిగి రాడన్న విషయం అమ్మకి అర్థమయింది. ఒక అర్థరాత్రి లేచి కిచెన్ రూంలోనే ఉరిపెట్టుకుంది.”
“అది అప్పట్లో జరిగింది కదా… అయిందేదో అయిపోయింది. నువ్వు నార్మలైజ్ అవ్వచ్చు కదా. గతం నెమరేసుకుంటూ ఉంటే ఏమొస్తుందిప్పుడు? మీ నాన్నలాగే నువ్వూ ఏదో కారణం వెతుక్కొని ప్రపంచం నుండి తప్పుకోవడానికి చూస్తున్నావ్. పెద్ద తేడా లేదు. అప్పుడు మీ నాన్న… ఇప్పుడు నువ్వు.”
“నీకు చెప్పినా అర్థం కాదు. You are not in my shoes.”
“అది ఒక లేమ్ ఎక్స్క్యూజ్ నా వరకైతే. నేనొకటి చెప్పాలా… మనసుకి ఏం అనిపించిందో అదే చేసేయ్. అట్లీస్ట్ ప్రశాంతంగా అయినా ఉంటావు.”
“ఫిలాసఫీ నువ్వు కూడా మాట్లాడుతున్నావా అయితే.. ఏంటిప్పుడు.. చంపమంటున్నావా?”
“లేదు చంపేద్దామంటున్నా.”
“సరే అయితే. రేప్రొద్దున మనం ఎప్పుడూ గంజాయ్ కొట్టే ప్లేస్‌కి వచ్చేయ్.”
“కచ్చితంగా.”
****
ఆరోజు వాడితో జరిగిన ఆఖరి సంభాషణ తర్వాత డైరీలో పేజీలు కూడా ఖాళీ అయ్యాయి నా అంతరంగంలాగే. దిగులుగా డైరీ మూసేశాను. ఎన్ని చోట్ల వెతికానో, ఎంత కాలం వెతికానో, ఎన్ని వెతుకులాటల మధ్యలో వెతికానో కానీ.. వాడైతే ఎన్నడూ ఎక్కడా కనపడలేదు. ఆ శిథిలావస్థలో ఉన్న పాడుబడ్ద ఓల్డ్ ఫాక్టరీ బిల్డింగ్ వాడిక రాడన్నట్టు చిన్నబోయింది. ఎంతో ఆశగా నా లోపలున్న ప్రేమ వాడితో చెప్పాలనుకున్నాను. ‘ఇలా ఉందిరా నీ మీద’ అని. కానీ ఏడి? రాడే. లేడే!
*****
ఫోన్ అలారం మోగింది. మూన్ లైట్ సొనాటా. టైం మూడూ మూడయ్యింది. మైనర్ పియానో కదలికలకి వెనకాల బెడ్ మీద ఆమె నిద్రలో కదిలింది. తన నీడ నా వైపే నడుచుకుంటూ రావడం తెలుస్తూ ఉంది. నీడలు చీకట్లో చిక్కబడుతున్నాయి. తల నిమురుతూ, నా భుజం మీద తలవాల్చి “ఇంకా పడుకోలేదా?” అంది.
ఇప్పుడు గానీ నిజం దాస్తే నా మనసులో బరువు మోయలేనంతగా తోస్తుందేమోనని ఇప్పుడిప్పుడే స్పష్టమవుతుంది. అబద్ధాలతో నెట్టుకొచ్చే కాలం దాటిపోయింది. నా జీవితంలో నన్ను అంటిపెట్టుకున్న ఒక్కగానొక్క ఈ అమ్మాయి దగ్గర అంతటి నిజాన్ని దాచి బతకడం నాకు చాతకావటం లేదు.
“నీకు ఇన్నిరోజులూ ఒక విషయం చెప్పలేదు” ముక్తసరిగా అని ఆమె కళ్లలోకి చూసాను.
“ఏంటి, నువ్వు బైసెక్షువల్ అనా?”
“నో… అది నీకర్థమైందని నాకు ముందే తెలుసు.”
చెంప మీద ముద్దు పెట్టి గుండెల మీదికి నా మొహాన్ని లాక్కుంది.
“మరి?”
మొహం అంతా చల్లగా, వెచ్చగా ఒకేసారి ఏదో వింత భావన తెలుస్తుంది. ఆమె కౌగిల్లో ఏదో ఉంది.
“గతంలో నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను ఈరోజు క్షమిస్తావా?” ఆమె గుండెచప్పుడ్ని వింటూ అడిగాను.
“తప్పకుండా. ఆ గతంలో నేను లేను కదా. అది నీది. చెప్పాలనిపిస్తే చెప్పు. నేను ఎప్పటికీ నీ దాన్నే.”
ఆమె గుండె మీద నుండి సరాసరి డెస్క్ మీద తల వాల్చాను. కళ్ళు మూసుకుంటే వాడి నవ్వు, కళ్లు తెరిస్తే ఆమె కౌగిలి గుర్తుకొస్తున్నాయి.
“వాడి పెద్దనాన్నని చంపేసాను నేను,” మొహంలో ఏ భావమూ పలక్కుండా ముక్తాయించాను.
“ఏంటీ?” అని నమ్మలేనట్టు అడిగింది.
పది సెకండ్ల నిశ్శబ్దం. టేబుల్ లైట్ వెలుగు ఆమె మొహమ్మీద ఆబ్లిక్‌గా పడుతుంటే పసుపు వర్ణపు ఛాయలతో వెలిగిపోతూ ఉంది.
“అవును. ఏదో ఛాన్స్ వచ్చింది. ఈరోజు వరకు వాడికి కూడా తెలీదు కారణం నేనే అని.”
“అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇన్నిరోజులు ఏదో సరదాగా అంటున్నావనుకున్నా. ఎవరి చావు వాళ్ళు చస్తారు. ఎందుకలా మీదకి పోయి మరీ చంపడం. దాని వల్ల నీకేం ఒరిగింది? మనస్సాక్షి అనేది ఒకటి ఉందని మర్చిపోయావా!”
“మనశ్శాంతి అనేది ఒకటే కావాలని మనసు మొత్తుకుంది ఆ క్షణం.”
“ఉందా మరి ఈరోజు.. మనశ్శాంతి?”
“చూస్తున్నావ్ కదా.”
“పోలీసులకు డౌట్ రాలేదా?”
“ఊరెళ్ళి రోజూ వెతికేవాణ్ణి న్యూస్పేర్లలో చావు వెనక కారణం ఏమైనా మెల్లిగా లీక్ అవుతుందా అని” డైరీ మీద వేళ్ళతో రాస్తూ అన్నాను.
“అసలెలా చంపేశావ్?” భయంతో వణుకుతూ ఆమె గొంతు.
గుండెలో బరువుని దించేసుకునే ముందు మిగలబోయే ఖాళీ ఆ గదిలో పరుచుకుంది.
“తాగే మందులో పురుగుల మందు వేసాను.” ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పేశాను. ఆమె కళ్లలో భయం లేదు, కోపం లేదు, శాంతి కూడా లేదు. అంతకుమించి మరేదో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ అదేంటో తెలీదు.
“ఆయన అంత సోయి లేకుండా ఉన్నాడా?” అని ఎదురుప్రశ్న.
“ఆరోజు ఎందుకో బాగా ఏడ్చాడు. వాణ్ణి గుర్తుతెచ్చుకుని. వాడూ నేనూ ఎప్పుడూ తాగే హిమాలయ బార్లోనే ఆ మనిషిని కలిసాను. వాడేమో ఇంట్లో నుండి వెళ్ళిపోయి అప్పటికే ఆరు నెలలయింది. వెక్కి వెక్కి ఏడ్చాడు.”
“అలా ఏడుస్తునప్పుడు ఎలా కలపాలనిపించింది. మనిషి లక్షణాలే లేవు నీకు.”
“ఆ క్షణం నాకు ఏం అయిందో ఈ నాటికీ తెలీదు. నీకు చెప్పినా అర్థం కాదు. You are not in my shoes.”
నా కళ్ళలో వాడి మొహమే కదులుతుంది. పోనీటైల్. ఆ కళ్లు. పెదాల మీద వాడి నవ్వు.
“ఇలా నిన్ను ఇందులో ఇరికించి, అలా చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతే వాడిని నువ్వు వెతకలేదా మరి?”
“వెతికాను. దొరికాడు కూడా.”
“ఎక్కడ?”
“రెండేళ్లకి. అరుణాచలంలో. చలం సమాధి దగ్గర.”
“చచ్చిపోయాడా?” అంటూ భయంభయంగా అడిగింది.
“లేదు. కానీ వాడు లేడు. వాడి శరీరం లేదు. వాడెప్పుడూ పడుకునే చింతచెట్టు ఇదేనని చూయించారు. చెట్టుతొర్రలో వాడి కళ్లద్దాలు ఉన్నాయి.
“రేయ్… నిజంగా భయంగా ఉంది” అంటూ కాస్త వెనక్కి నడిచి గోడకి ఆనుకొని నిలుచుంది.
అంచెలంచలుగా ఆమె వెన్నులో వణుకు, నా గుండెల్లో తేలికదనం.
“భయపడకు. ఆరోజు అక్కడి వాళ్లని వాడి గురించి అడిగాను. ఫ్రెంచ్ గడ్డం, పిలక జుట్టు, గుండ్రంగా నల్లటి ముఖంతో ఎవరైనా కనిపించారా అని. కుంటలో శవమై తేలాడు అని ఒకరిద్దరు చెప్పారు. ఇంకొకరేమో ‘వాడు ఇక్కడ కొంతమందితో గొడవలు పెట్టుకొని వేరే ఊరికి వెళ్ళాడు’ అని చెప్పారు. తెల్లటి పొడవాటి గడ్డంతో సాధువు ఒకాయన వచ్చి నా కళ్ళలోకి చూసి ‘వాడు పగని మోసాడు. నువ్వు ప్రేమని మోసావ్. మీ ఇద్దరికీ దక్కాల్సింది దక్కలేదు. ఎందుకంటావ్? రెండూ పెనవేసుకుని ఉన్నాయి గనక’ అని ఎంతో తేలికగా ముక్తాయించాడు.
అటుపక్కనే నీళ్ల పంపు, కాళ్లు కడుక్కునే చోటు. సమాధి గోడల చుట్టూ పెచ్చులూడిపోయిన నారింజ రంగు గోడ. దాని మీద తెల్లటి అక్షరాలతో వాడి అందమైన గుండ్రటి చేతిరాత.
‘ఎప్పటికైనా నా మనసులోని మలినాన్ని కడిగేసుకోగలనా?’ అని రాసి, అక్కడక్కడా మలిపేసి ఉంది.
****
ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. నాకు ఎందుకో ఆ క్షణం ఆమెకి క్షమాపణ చెప్పాలని, సంజాయిషీ ఇచ్చుకోవాలని అనిపించలేదు. ఆమె చేతులు వణుకుతూ ఉన్నాయి. అరచేతుల్ని నా మొహానికి రాసుకున్నాను. కొట్టాలనిపిస్తే కొట్టమన్నాను. ఆమె చేతులు విదిలించుకొని బెడ్ వైపు నడిచింది. ఆంక్సయిటీ టాబ్లెట్ ఇచ్చి వేసుకొమ్మన్నాను. ఇకపై ఏ నిర్ణయం అనేది తన మనసుకే వదిలేయాలని ఆమెని దాటుకుంటూ కప్బోర్డ్ వైపు నడిచాను. కప్బోర్డ్ తెరవగానే కుప్పలుతెప్పలుగా పుస్తకాలు. ఈ పుస్తకాలు చూస్తే చాలు వాడి ఊపిర్లన్నీ ఒక్క దగ్గర వచ్చి పడినట్టు ఉంటుంది. చిన్న లాకర్ బాక్స్‌లో వాడి కళ్లద్దాలు. వణుకుతున్న చేతులతో కళ్లద్దాలు తీసుకొని నా కళ్ళకి పెట్టుకున్నాను. వాడి కళ్లని ముద్దుపెట్టుకున్నట్టు ఉంది.
****
భారంగా అడుగులేస్తూ కిటికీ దగ్గరికి వెళ్లాను. వెనకాలున్న టేబుల్ లైట్ వెలుగు వీపు మీద పడి, నేను ముందుకి నడుస్తూ ఉంటే నా నీడ కిటికీ పరదాల మీద నిలువుగా సాగుతుంది. కిటికీ తలుపులు తెరిచి బయటకి తల పెట్టి చూస్తే యూకలిప్టస్ చెట్టు గాలికి ఊగుతూ ఉంది. ఆకుల గుండా లీలగా దాగుడుమూతలాడుతూ కనిపిస్తున్న నెలవంక. అక్కడక్కడా పొడుచుకొని చుక్కలు. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. వెనకాల నుండి ఆమె ఏడుస్తున్న మూలుగు వినిపిస్తుంది.
ఎక్కడి నుండో వస్తున్న గాలివాన ఉన్నపళంగా మొహమ్మీద కుమ్మరించినట్టయింది. యూనిఫాంగా పరుచుకుని ఉన్న వీధిలైట్ల వెలుగులో ఒక ప్లాస్టిక్ కవర్ రోడ్డు మధ్యలో గాల్లో సుళ్ళు తిరుగుతోంది. ఎక్కడో కనిపించకుండా మూలచివర్లో అరుపో ఏడుపో తెలియని కుక్క మూలుగు ఒకటి అదే పనిగా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు కుక్క మూలుగు కాస్తా నెమలి కూతలాగా చెవుల్లో గట్టిగా వినబడుతోంది. సిగరెట్ ముట్టించాను. వాడితో కలిసి గంజాయి దమ్ము గుండెల్లోకి లాగినప్పుడు కలిగిన తన్మయత్వపు నిట్టూర్పులు గుర్తుకొచ్చాయి. ఆ క్షణం నా శరీరం మీదున్న వెంట్రుకలు ఒక్కొక్కటీ మెల్లిగా నిక్కబొడుచుకున్నాయి.
*








Beautiful & Painful Story ❤️💔 Congrats Satya Tej, Thank You Saranga.
Superb teja