మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి “కృష్ణా తీరం” ధారావాహిక

అనిత సోమంచి స్వరంలోంచి – మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి “కృష్ణా తీరం” ధారావాహిక సారంగ చానెల్ లో వినండి

మల్లాది వారి కృష్ణా తీరం ….ధారావాహిక ప్రారంభం

ఒక చిన్నప్పటి జ్ఞాపకం!

మా అమ్మా నాన్న ఈ నవలలో వచ్చే భోజనాల వర్ణన గురించి చాలా ఇష్టంగా మాట్లాడుకునేవారు. కేవలం వంటకాల గురించి కాదు — వాటిని చెప్పిన తీరు, అందులోని లయ, ఆ ఆత్మీయత గురించి.

తర్వాత జీవితం గడుస్తూ ఉండగా ఆ జ్ఞాపకం వెనక్కి వెళ్లిపోయింది. కానీ ఇటీవలి కాలంలో నాకు ప్రాంతీయ వంటలు, సంప్రదాయ ఆహార సంస్కృతి, ఒక్కో ప్రాంతానికి ఒక్కో రుచీ, జీవనశైలీ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. అప్పుడు ఈ నవల మళ్లీ నా ముందుకొచ్చింది.

ఒకటి కాదు, రెండు మూడు సార్లు మళ్లీ చదివాను.

ఇంకో ముఖ్యమైన కారణం — మా అమ్మ చివరి కాలంలో ఆడియో కథలు వినడంపై చాలా మక్కువ పెంచుకున్నారు. యూట్యూబ్‌లో కథలు వింటూ కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా ఉండేవారు. అలాగే ఇప్పుడు చాలా మంది చదవడం కంటే వినడానికే ఎక్కువగా దగ్గరవుతున్నారని కూడా గమనించాను.

అప్పుడు నాకు కూడా నా గొంతుతో చదవాలి, రికార్డు చేయాలి అనిపించింది. ఎందుకో తెలియదు కానీ చదవాలని బలంగా అనిపించింది.

ఈ నవలలో నాకు అత్యంత ఆసక్తికరంగా అనిపించేది దాని పాత్రల స్వభావం. కథానాయకుడు అన్నప్పగారు — సాధారణంగా మనం ఊహించే హీరోలా ఉండరు. మధ్యవయస్కుడు, పెద్దగా హీరోయిజం చూపించడు, కొన్నిచోట్ల అసలు కథని నడిపే వ్యక్తికంటే జీవితం చూస్తున్న ఒక పరిశీలకుడిలా, కథ చెప్పేవాడిలా మారిపోతాడు. కానీ అదే సమయంలో చాలా విషయాలను చాలా నిశ్శబ్దంగా, లోతుగా అర్థం చేసుకుంటూ పరిష్కరిస్తూ ఉంటాడు.

హీరోయిన్ కూడా సాధారణమైన “నాయిక” కాదు — పనిమనిషి అమ్మాయి. కానీ ఆమె ఆలోచించే విధానం చాలా భిన్నంగా, స్వతంత్రంగా ఉంటుంది. ఇప్పటికీ కొత్తగా అనిపించే వ్యక్తిత్వం. ఈ నవల ద్వారా అప్పటి బ్రాహ్మణ సమాజాల గురించి కూడా నాకు ఒక భిన్నమైన కోణం కనిపించింది.

కేవలం కట్టుబాట్లు మాత్రమే కాదు — వాళ్లలో ఉన్న హృదయ వైశాల్యం, కొత్త విషయాలను అంగీకరించే తీరు, వేర్వేరు మనుషుల్ని అర్థం చేసుకునే శక్తి కూడా కనిపిస్తుంది. ప్రధాన స్రవంతికి భిన్నంగా జీవించే వ్యక్తులు కూడా ఇందులో కనిపిస్తారు. వాళ్ల ద్వారా జీవితం ఎంత రకాలుగా ప్రవహిస్తుందో, ఎంత విభిన్నమైన ఆలోచనలు ఉంటాయో నవల ఎంతో సహజంగా చూపిస్తుంది.

కొన్ని చోట్ల చదువుతుంటే బెంగాలీ సాహిత్యాన్ని గుర్తు చేసే openness కూడా అనిపించింది. ఈ నవల గొప్పదనం ఏమిటంటే — పెద్ద డ్రామా లేకుండా, గట్టిగా హీరోయిజం చూపించకుండా, చాలా సాధారణ మనుషుల ద్వారా ఎంతో లోతైన ప్రపంచాన్ని మన ముందుంచుతుంది.

*

అనిత సోమంచి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు