చెలికాడికి కడసారి….

ఆ రోజుల్లోనే, తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేశారు. భాను కూడా ఆ ఆందోళనలో పాల్గొన్నాడు; అరెస్టయ్యాడు. ఉద్యమకారులందరితోపాటు, అతనూ జైల్లో కొన్నిరోజులున్నాడు.

నిన్న (ఏప్రిల్ 29) సాయంత్రం ఆరు గంటలవుతోందేమో.

నేనూ, యార్లగడ్డ రాఘవేంద్రరావూ, మెహక్ హైదరాబాదీ కలిసి మా చిరకాల మిత్రుడు తెలిదేవర భానుమూర్తిని కడసారి చూసి వచ్చాం. అర్ధరాత్రి గడచిన తర్వాత, నిన్న వేకువ మబ్బులో, బడలికతో అతని గుండె విశ్రమించిందట! మంచుపెట్టెలో భాను, చీకూచింతా లేకుండా, ప్రశాంతంగా నిద్రపోతున్నట్లున్నాడు! రెండుసార్లు గుండెపోటుతో అవస్థ పడినవాడి జాడలేవీ అతని మొహంలో కనిపించలేదు. మండుటెండలో, బతుకుబాటలో నడిచినడిచి అలిసిపోయినవాడిలా వున్నాడంతే!!

భానుమూర్తి “ఈనాడు”, “ఉదయం”, “వార్త” లాంటి పత్రికల్లో పనిచేశాడు; ఓ కవితా సంకలనం, రెండు (?) కథానికా సంకలనాలు, రెండు ఫీచర్ల సంపుటాలూ, ఓ నవల ప్రచురించాడు. “ఊరోల్లు” కవితా సంకలనం తెలంగాణ మాండలికం లో వచ్చిన తొలిపుస్తకం అంటారు. ఇక అతను అనేక పత్రికలోనూ, వెబ్ వేదికలపైనా ప్రచురించిన ఫీచర్లు భానుమూర్తి చిరునామాగా నిలిచిఉంటాయి. మేము ముగ్గురం అతనితో కలిసి పని చేసినవాళ్ళమే. నా వరకూ నాకు, భానుతో యాభైమూడేళ్ళుగా స్నేహం. మిగతా మిత్రులకూ అతను చిరకాల మిత్రుడే! అతని ఇంటికి మేం వెళ్ళడం అదే మొదటిసారి కాదు- మా యిళ్ళకూ అతను వచ్చినవాడే! మా పుస్తకాలు ఆవిష్కరించిన సభల్లో అతనూ మాట్లాడాడు- అతని పుస్తకావిష్కరణ సభల్లో మేమూ పాల్గొన్నాం. మాకు ఉమ్మడి మిత్రులు డజన్లలో ఉన్నారు. వృత్తీ, ప్రవృత్తీ కలిసిన మిత్రుల మధ్యన ఇవన్నీ సాధారణంగా జరిగేవేగా.

నేను 1973లో హైదరాబాద్ వచ్చేనాటికి నాకు పదిహేనేళ్ళు నిండాయంతే! డికెన్స్ “గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్”లో పిప్ లాగా, నగరం ఎలావుంటుందో, అందులో ఏమేముంటాయోనని బెదురుతూ హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఓ స్మాల్ టౌన్ కుర్రాణ్ణి నేను. నా భయాన్ని పోగొట్టిన తొలినాటి మిత్రుల్లో తెలిదేవర భానుమూర్తి ఒకడు. అలా, భానుతో నా స్నేహం గోల్డెన్ జూబిలీ చేసుకుని మూడేళ్ళవుతోంది. అనుకోకుండా ఇద్దరం జర్నలిజంలోనే ప్రవేశించాం. నాలుగున్నర దశాబ్దాలుగా అదే ఉరవడిలో పడి కొట్టుకుపోతూ వచ్చాం. అకస్మాత్తుగా భాను చెప్పకుండా చెయ్యకుండా నిన్న (ఏప్రిల్ 29న) ఒడ్డెక్కేశాడు. రెండు మూడేళ్ళ కిందటే, మా ఉమ్మడిమిత్రుడు సిద్దాబత్తుని లలితానంద్ తొందరపడ్డాడు! ఇప్పుడు భాను….

నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి, ఇప్పటి దాకా ఏటుకూరి ప్రసాద్ గారే నా కేర్ టేకర్! భానుకు కూడా అప్పటినుంచీ ఆయనే కేర్ టేకర్! మాతో బాటు లలితానంద్, బిగుళ్ళ ఈశ్వర చక్రవర్తి కూడా ప్రసాద్ గారి “కేర్” లోనే ఉండేవాళ్లు . అదే మేం నలుగురం ప్రాణమిత్రులం కావడానికి మొదటి కారణం. మమ్మల్ని ఆయన అలా చేరదీశారనే, ప్రసాద్ గారిని రాంభట్ల-మల్లారెడ్డి-బూదరాజు మేస్టార్లు “బాలసంఘం” నాయకుడనేవారు. మా బాలసంఘంలో, అందరికన్నా పెద్దవాడు బాల్ కృష్ణ కులకర్ణి. కాచినేని రామారావు, ఆర్వీ రామారావు, దేవులపల్లి రామారావు అభ్యుదయ రచయితల సంఘం ఆఫీసులో వుండే “నార్ల చిరంజీవి గ్రంథాలయం”లోనే మాకు పరిచయం.

భానుమూర్తి లోని రెండు ముఖ్యమైన కోణాలను ప్రస్తావించకుండా అతని కథ ముగించడం అసాధ్యమే కాదు, అన్యాయం కూడా! విద్యార్థి దశలోనే భాను మంచి కవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ రోజుల్లోనే, తెలంగాణ ఆందోళనలోనూ పాల్గొన్నాడు. ఉద్యమకారులందరితోపాటు, అతనూ జైల్లో కొన్నిరోజులున్నాడు. మన నాయకమ్మన్యులు ఆ ఆందోళనకు ఏ గతి పట్టించారో తెలిసిందేగా.

ఇక, బియ్యెస్సీ పట్టా పుచ్చుకున్న తర్వాత, ఆ కాలపు యువకులు అందరిమాదిరే, భానుమూర్తి ఎ.పి.పి.ఎస్.సి పరీక్షకి గట్టిగా ప్రిపేర్ అయ్యాడు. కమర్షియల్ ట్యాక్సెస్ శాఖలో ఉద్యోగం సంపాదించాడు కూడా. కానీ, సహోద్యోగుల అవినీతికి సహకరించనందు వల్ల అతన్ని వాళ్ళు వేటాడి, వేధించారు. అలాంటిచోట పనిచేయకూడదని భాను ఉద్యోగం వదిలేశాడు. తర్వాత అతను పడరాని పాట్లు పడ్డాడు కూడ. ఈ పరిస్థితుల్లో అతన్ని ఆదుకున్నది సాహిత్యమే! తిరిగి నార్ల చిరంజీవి గ్రంథాలయానికి రావడం మొదలుపెట్టాడు. ఏటుకూరి ప్రసాద్ గారి ఇంట్లో కొందరు మిత్రులకు భాను తన కవితలు చదివి వినిపించేవాడు. అప్పట్లో “ఆంధ్రప్రభ”లో పనిచేశే ఆర్వీ రాముడు, మోహన్ కూడా ఆ కవితలు విన్నవాళ్ళలో ఉన్నారు. అదే “ఊరోల్లు” కవితాసంపుటిగా వచ్చింది. అందులోని “డప్పుగొట్టు తాతా డప్పు గొట్టు, దొర కొడ్కు పెండ్లైతున్నది” అనే కవిత సూపర్ హిట్. పూర్తిగా తెలంగాణ మాండలికంలోనే వచ్చిన తొలిసంపుటి అదేనేమో.

ప్రసాద్ గారి ప్రోత్సాహంతోనే, తెలుగు ఎం.ఏ. పరీక్షకి కట్టాడు. అప్పటికి ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఏ. చదువుతున్న నా నోట్స్, పుస్తకాలూ తీసుకునేవాడు. ఈ ఏర్పాటు ఏటుకూరి ప్రసాద్ గారు చేసిందే! రెండేళ్ళ తర్వాత, నేను “ఈనాడు”లోంచి బయట పడ్డానికి కొద్దిరోజులముందు, భాను అందులో చేరాడు. అలా, నాకన్నా అయిదేళ్ళు పెద్దవాడైన భాను, నాకు చదువులోనూ, జర్నలిజంలోనూ కూడా ఒక ఏడాది జూనియర్ అయ్యాడు.

భానుమూర్తి సాదాసీదా సబ్ ఎడిటర్ కాడు! అతనిలోని సృజనాత్మకత భానూను గొప్ప కాలమిస్టులతో పోటీపడి నిలబడేలా చేసింది. కె.ఎన్.వై.పతంజలి, నామిని, గోపి, కె.ఆర్. మూర్తి లాంటి పెద్ద ఉద్యోగతులు రాస్తూ ఉండిన కాలమ్స్ ‘పతంజలి భాష్యం‘, ’పచ్చనాకు సాక్షిగా’, ’ఎట్టా‘, ‘సరదాల పరదాలు” లాంటివాటిని తట్టుకుని అతని ’పలుకుబడి’ తెలుగునేల నలుచెరగులా పాకింది. అదీ తెలిదేవర భానుమూర్తి సత్తా! ‘చల్నేదో బాల్ కిషన్’, ‘నెమలీక’ కూడా పెద్ద ‘హిట్స్‘. ఇక ’గులేర్‘, ‘ఆక్సిజెన్ బార్’, ‘లత్కోర్ సాబ్’ లాంటి సృజనాత్మక రచనలూ సుప్రసిద్ధాలే.

భాను వ్యక్తిత్వంలోని ఓ ముఖ్యమైన విశేషం నాకు చాలా నచ్చింది! స్థూలంగా దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ అనొచ్చు. మూడు నాలుగేళ్ళ కిందట భానుమూర్తి భార్యాసమేతంగా చిన్నకొడుకు చైతన్య ఇంట్లో ఉండేందుకు యు.ఎస్. వెళ్ళాడు. అతనికి అక్కడ బొత్తిగా కాలక్షేపం అయ్యేది కాదట. నాకు తరచు ఫోన్ చేసి ఓ నవల రాయాలనుకుంటున్నానని చెప్పేవాడు. దాన్ని ఎలిగరీగా రాయాలన్నది అతని ఉద్దేశం. కిషన్ చందర్ రాసిన “గాడిద ఆత్మకథ” సిరీస్ లాంటివి తెలుగు రాజకీయుల్ని ఉద్దేశించి రాయాలనుకున్నట్టున్నాడు. ఆ కథకి తెలంగాణ మట్టివాసన ఉండాలన్నది మరో కోరిక. ఫలితంగా రూపుదిద్దుకున్నదే ‘లత్కోర్ సాబ్‘. మిత్రులు శివాజీ గారితో కూడా ఈ నవల ప్లాట్ గురించి మాటాడినట్టున్నాడు. అయితే, కొసకి అది తను కోరుకున్న రూపంలో రాలేదని చిన్నపాటి అసంతృప్తి మిగిలింది భానుమూర్తికి.

కొంతకాలంగా మిత్రులు జయధీర్ తిరుమలరావుతో, కలిసి తెలంగాణ సాహిత్య ఉద్యమంలో కూడా భానుమూర్తి ప్రధాన బాధ్యతలు నిర్వహించాడు. నేను అదే టైంలో మద్రాస్ వెళ్ళివున్నందువల్ల వివరాలు పెద్దగా తెలియవు. తెలియని విషయాలు అలా ఉంచుదాం- నాకూ, మీకూ,భానును తెలిసిన ప్రతి ఒక్కరికీ బాగా తెలిసిన విషయం చెప్పుకుని ముగిద్దాం. తెలిదేవర భానుమూర్తిలోని ‘మంచి మనిషి‘గురించి కొత్తగా ఎవరికీ చెప్పనవసరంలేదు. అలాగే, అలాంటి వాళ్ళు నానాటికీ అరుదై పోతున్నారనీ చెప్పనక్కరలేదు! ఆ మధ్యన గోపనపల్లిలో మేం మొదలుపెట్టిన “రీడర్స్ క్లబ్”కు ఓ సారి వచ్చి మాట్లాడమని భానూను అడిగా. “ఎండలు తగ్గిననంక అట్లనె వద్దాం తియ్ గనీ కాస్త జాగర్తగా ఉండు తమ్మీ!” అని తేల్చేశాడు. సైలెంట్ గా ఇంతపని చేస్తాడని మాత్రం అనుకోలేదు!!

*

ఫోటోలు: అన్వర్ ఆర్టిస్ట్ 

ఈ కింద అన్వర్ రాసిన  రైటప్ కూడా సందర్భోచితంగా వుంటుందని మీకు అందిస్తున్నాం.

తెలంగాణ భాష మొదటి ముద్ద

ఎక్కడో 1980 ల్లో కూర్చొన్న రాయలసీమ పిల్లలకు తెలంగాణ భాష మొదటి ముద్ద తినిపించిన గురువు, మిత్రుడు, నవ్వే మనిషి, నవ్వించే మానవుడు శ్రీ తెలిదేవర భానుమూర్తిగారు ఈ ఉదయం మరణించారని వార్త తెలిసింది. మొదట నేను ఆయన పాఠకుడిని. ఆ తరువాత కాలం కలిసి వచ్చి ‘వార్త’ దినపత్రికలో నా చిన్ననాటి హీరోతో కలిసి పని చేశాను. ఆయన కాలమ్స్ కు లెక్క లేనన్ని బొమ్మలు వేశాను.

రాతలతో, బొమ్మలతో కలిసి చాలా దూరాలు ఆయనతో నడిచాను, కలిసి సుభా , దుపహర్, శ్యామ్ ల వేళల చాయ్ ల మీద చాయ్ లు తాగాము. ఆయన పాన్ తినేవాడు, నేను ఆయనకు పాన్ తెచ్చేవాడిని. 2003 సంగతి ఇది. అప్పట్లో నావద్ద ఒక చిన్ని బుల్లి సోనీ కెమెరా ఉండింది. దానితో ఆయన ఫోటోలు ఎన్ని తీశానో లెక్కే లేదు. ఆ తరువాత తరువాత రోజుల్లో కూడా భానుమూర్తి గారు తరచుగా నాకు ఫోన్ చేసే వాళ్లు. నా రాతల గురించి మాట్లాడేవారు . త్వరగా పుస్తకం తీసుకు రాబ్బాఅనేవారు. ఆర్టిస్ట్ మోహన్ గారి తర్వాత ‘అబ్బా’ అనే పిలుపును అంతగా అరగదీసింది భానుమూర్తి గారే.

భానుమూర్తిగారు గంధం వంటి చల్లని మనిషి. మెత్తని మనిషి, సన్నగా నవ్వే మనిషి, ఏ మనిషి గురించి, మరే విధం గురించి కూడా నోరుజారని మంచి మనిషి. మంచి రచయిత, మంచి గురు మిత్రుడు. మంచి వాళ్ళతో ఈ లోకానికి పెద్దగా పని ఉండటం లేదు.

సెలవు సార్ భాను మూర్తి గారు.

మందలపర్తి కిశోర్

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మనోచరుడు, సహచరుడుగా భానుమూర్తి మాలోనే కాదు. .. ఎంతమందిలో. .. ఎక్కడెక్కడి ఎందరెందరిలో నిశ్శబ్దంగా పీట పరచుకుని కూర్చున్నాడో- నిన్న సోషల్ మీడియాలో. . ముఖ్యంగా ఫేస్బుక్ లో వెల్లువెత్తిన నివాళి వ్యాసాలు, స్మృతులు, తలపులు పట్టి చూపించాయి. ఇప్పుడీ కిషోర్ నివాళి తరంగం కూడా అదే పని చేసింది. భానుమూర్తి ఎప్పుడూ నిశ్శబ్దసాగరమే. సాహితీలోకంలో, ఏ విధంగా చూసినా ఎలాంటి గౌరవం, గుర్తింపు దక్కనివాడు, దక్కించుకోలేకపోయినవాడు. అందుకు గల కారణాలు ప్రత్యేకంగా చెప్పలా? అతడికి అవి దక్కించుకునేంత సమర్ధత లేకపోవడం అతడి తప్పు కాదు. . అది సాహితీలోకం తప్పు. . ఆ లోకపు దౌర్భాగ్యం. . అంతే.
    మలిదశ తెలంగాణ ఉద్యమం కాలంలో ఎంతెంతో గుర్తింపు పొందిన అరకొర సాహితీకారులు చాలామందే ఉన్నారు. ఆ సంగతి అలా ఉంచుదాం. .. ఆ కాలంలో, అనంతరకాలంలో తెలంగాణ మాండలికాన్ని తెలంగాణ భాషగా గుర్తించాల్సిందే అని పట్టు పట్టినవాళ్ళుగాని, తెలంగాణ భాష సొబగు, సోయగం, దాని ప్రయోగరీతి, ప్రాచుర్యం అంటూ వ్యాసాలు రాసినవాళ్ళలో , ఉపన్యాసాలు దట్టించినవాళ్ళలో, పుస్తకాలు అచ్చేసుకుని బాకాలూదుకున్నవాళ్లలో భానుమూర్తిని తలచుకున్నవాళ్లెంతమంది? అతడు నాటిన పాదుల్ని, సాకిన మొక్కల్ని, పెంచిన వృక్షాల్ని .. మొత్తంగా పెంచిన వనాల్ని గుర్తించిన వాళ్లెంతమంది? వాటికి తమ అక్షరాల్లో స్థానం కల్పించినవాళ్లెంతమంది? ఒక్కటడగనా. . అసలు వాటి గురించి తెలిసినవాళ్లెంతమంది?
    ఎవరూ ఊహించని 1970వ దశకం పూర్వార్థం, లేదా 1980 దశకం ప్రథమపాదంలోనే – ఇప్పుడందరూ ఉచ్చరిస్తున్న ( ఉద్దేశపూర్వకంగానే అంటున్నా ) తెలంగాణ భాషను జై పతాకగా ఎగురవేసి, అప్పటినుంచి దాన్నలాగే మోసుకు తిరిగిన అక్షరకారుడికి ఏం గౌరవం దక్కింది? ఎవరూ గుర్తించి సరైన పీట పరిచారు? అసలు ఉద్యమకాలం లోనే ఇక్కడి సాహితీలోకం. . . పోనీ ఆ తర్వాతైనా భుజాలమీద మోసి గండపేరుండాలు తొడగాలి కదా. . అందుకు అసలైన అర్హుడు కదా భానుమూర్తి. .. తెలిదేవర భానుమూర్తి.
    ఎన్ని పరిశోధనా( శోకనా) వ్యాసాలు, ఎన్నెన్ని గ్రంథాలు
    ( సంగ్రహణలు )వచ్చాయి… తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పురుడు పోసుకున్న పుస్తకాలు, పాఠ్యంశాలు, గైడ్లు ఎన్ని, ఎన్నెన్ని. . వాటిల్లో ఒక్కటంటే ఒక్కదాంట్లో భానుమూర్తి గురించి, అతడు తెలంగాణ భాషకు పొదిగిన రవ్వలకిరీటం గురించి ఒక్కమాటైనా ఉందా?
    అసలు ఒక్కమాట చెప్పండి. . ఈ నేలన మహామేధావులు, మేధావులైన వ్యాసకర్తలు, పరిశోధకులు, గ్రంథకర్తలు, కథకులు, నవలాకారులు – తమ రచనలన్నిటినీ అచ్చంగా. . అచ్చమైన తెలంగాణా భాషలో రాయలేదేం .. రాసి మెప్పించలేదేం? చేతకాకనా, లేక, భానుమూర్తిలా మొత్తంగా అలా రాయలేకనా, రాసి మెప్పించలేకనా .. ఆ నమ్మకం లేకనా?
    తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలుగు మహాసభలు జరిగాయిగా. మరి ఆ సభల్లో తెలిదేవర భానుమూర్తి ఎక్కడా కనిపించలేదే, వినిపించలేదే, ఎలాంటి పురస్కారమూ అందుకోలేదే. . అసలు ఆనాటి సాహితీ పీఠాధిపతులకు, వాళ్ళ వందిమాగధులకు భానుమూర్తి వైశిష్ట్యం, అతడి అక్షరాలు చిమ్మే కాంతులు, సొగసుల గురించి అసలు తెలిసిచచ్చా?
    అసలు తెలంగాణ సాహిత్య అకాడమీ సారథులేం చేశారు? వాళ్లకి తెలిదేవర భానుమూర్తి ఎవరో అసలు తెలుసా? తెలిస్తే ఎందుకు ఉపేక్షించారు? అతణ్ణి ఏ సందర్భంలోనూ ఎందుకు గుర్తించలేదు, గౌరవించి తమ ఔన్నత్యాన్ని ఎందుకు చాటుకోలేదు. అది సాహిత్య అకాడెమీ ప్రథమ కర్తవ్యం కదా? ఇప్పటికైనా అతడి పేరు శాశ్వతంగా వెలిగిపోయేలా ఏటా నిర్వహించే ఏదైనా కార్యక్రమాన్ని చేపట్టడమో, లేదా ఏదైనా అవార్డు ప్రవేశపెట్టడమో చేయడం మంచిది.

    అరెరే, తెలంగాణ సాహితీలోకానికి భానుమూర్తి ఎందుకని ఏమీ కాకుండాపోయాడు? ఎరుకలేకా . . మరచిపోయా… భుజకిరీటాలు సొంతంగా తొడుక్కునో, తొడిగించుకునే సామర్థ్యం లేకనో అలా మిగిలిపోయాడా? అవును, అతడు అతి సామాన్యుడు, అన్నివిధాలుగా. అందులోనూ పనికిమాలిన చాదస్తపు విలువలు కలిగినవాడాయే. ఎవరి దురదతీటను గోకిగోకి తీర్చి తరించే నైపుణ్యాలసలే లేనివాడాయే మరి. బతుకుపరంగానే కాదు. . రచనలమీద మెతుకులేరుకోవడం లోనూ అతిసామాన్యుడే. . మహాబడుగుడే.
    తెలిదేవర భానుమూర్తి ఈ లోకం సరిహద్దు దాటిపోయిన నిన్నటి వేళ, నాకు మహాదాశ్చర్యం కలిగించిన విషయాలు రెండు.. అతడంటే ఏమిటో తెలిసిన, అతడి రచనల వైశిష్ట్యం తెలిసిన పత్రికారంగపు మేధావులు, తెలంగాణ సమాజానికి ఆలోచనను నేర్పే చింతనాపరులు ఎవరూ భానుమూర్తికి మాటవరసకైనా నివాళి అర్పించకపోవడం మొదటిది.
    మనం స్పందించకపోతే బాగోదేమో అనుకుంటూ అక్కడా ఇక్కడా ఫేస్బుక్ పోస్టుల్ని చూసి. . వెనుకబడిపోకుండా ఉండాలి కదా అనుకుంటూ సాహితీవేత్తలు, సాహితీపిపాసకులుగా ముద్రపడ్డ కొందరు పోస్టుల్ని పెట్టడం – రెండోది.

    తెలిదేవర భానుమూర్తి సాహితీ సామాన్యుడు. .
    సాహితీకూలీ.. ఎవరో పనిగట్టుకుని తెరిచిచూపించేదాకా ఆల్చిప్పలో ముడుచుకుని ఉండిపోయే మామంచి ముత్యం. ఇక్కడి నేలమీది అక్షర “ప్రియులందరూ చిరకాలం ధరించి తీరాల్సిన పచ్చలదండ.

  • గొప్ప మిత్రునికి ఘనమైన నివాళి. సెలవు భానుమూర్తి గారు. మిమ్మల్ని కలవలేకపోవడం దురదృష్టం.
    అవధాని

  • దురదృష్ట మేమిటంటే
    వ్యక్తుల గొప్పదనం
    బతికున్నప్పుడు తెలుసుకోలేక పోవటం..
    భానుమూర్తిగారికి నివాళి

  • I was a colleague of Bhanu Murthy and I read his writings of Telengana Mandalikam even before I joined Udayam.
    So, after joining one day while he was getting down from bycycle inside the compound of Udayam, while he was alighting, 29 year old Raja Gopal , (Gopal Venuraja Rao) asked him “Why the hell he should come on a bycycle? ” Bhanu murty told me for the purpose of his good health and according to the advice of doctors! But I didn’t leave him there. I told him I was reading his articles much before I joined journalism and as I had a chequered career I was a medical representative just a few months before that point of time. At that time I believe, he told me that he was actually an official from central excise department. So I explained and commented ” what the hell? Such a lucrative job” Bhanu Murthy told me that he was addicted to drinking and became alcoholic primarily because he was freely offered good quality liquor and confessed to me that his family members pressurized him to leave the job for good. And he left. I probably told him ( now I am 68 years old) at that time that he did a good thing or may be I thought like that.
    I found as the time passed on and every time as he was alighting from his cycle he would wish me with some type of wariness or respect , at least a few of his faults.
    He lacked leadership qualities and he aroused jealousy in some colleagues.
    He did not do much reasearch in to Telengana Mandalikam. It is because it is conspicuously different in many districts of Telengana and even talukas of different districts. He could have written wonderful books on this subject but he never was very much close to me and neither he was with anyone else.
    For example people of Huzurabad talk very differently including their idiomatic expressions from vemulawada of Karimnagar which is so much near.
    Bhanu Murthy made a few more mistakes according to my observation which may be wrong.
    In one or two articles I read they were like parody of the life style of villager of Telengana. He should have taken care of the content rather than the language ( Mandalikam) .
    Leadership doesn’t mean winning politics. It means you should be able to attract newly introduced people belonging to your category.That which is sorely lacking in him according to tme, and God forgive me I may be wrong.
    Still I felt terribly sad when I heard that he was no more. May God give him peace.

  • చాలా బాగా రాశారు. మంచి మనిషి భానుమూర్తి గారికి నివాళులు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు