కవిత్వంలో సెంటిమెంట్ ని అపారంగా కొల్లగొట్టుకున్న సార్వకాలికమైన కవితావస్తువులు ఏవన్నా ఉన్నాయంటే అవి అమ్మా,నాన్నలే. ఒక సమ్మోహనశక్తితో కవుల కవిత్వంలో నిలబడగలిగినా కవితా వస్తువులు అవి రెండే.
అమృతం దొరికితే పంచుకునే వాళ్ళు దేవతలు. అదే అమృతం దొరికితే పిల్లకీ పెట్టేవాళ్ళు అమ్మా నాన్నలు అని ఎక్కడో చదివాను.అలా పిల్లల్ని ప్రేమించే అమ్మా నాన్నలు కోరుకునేది వాళ్ల క్షేమాన్నే కదా! కాంక్షించేది పిల్లల అభివృద్ధినే కదా!
అమ్మా,నాన్న పదాల్లో ఉండే అమృతత్వంతో పాటు వాళ్ల జీవన సమరంలో ఎదురయ్యే కష్టాలకూ కడగండ్లకూ నూతనార్థాలతో,కొత్త ఉపమానాలతో,నవ్య భావనలతో కవిత్వం రాసిన కవులు అనేకులున్నారు. కానీ పిల్లల జీవితాల్లోని కాంతిని, వాళ్ళ ముఖాల్లో వెలుగును చూడాలనుకుండే తల్లి,తండ్రిని కవిత్వం చేసిన వాళ్ళు కొందరే.
అమ్మ ముఖంలో కాంతిని, నాన్న ముఖంలో కాంతిని, పుస్తకాల ముందటి పిల్లల ముఖంలో కాంతిని ఒక చిన్న కవితలో చూపిన కవి ఒకరున్నారు. ఎలాంటి ప్రతీకలు లేకుండా మాములు మాటలతోనే పిల్లలపై ఉండే అమ్మా నాన్నల ప్రేమ గాఢతను తన కవితతో దీపం పట్టి చూపించిన కవి ఒకరున్నారు.
దీపం వెలిగించే అమ్మ ముఖంలోకి ప్రేమగా చూస్తూ “ దీపం ఆరిపోక ముందే భోజనం పెట్టేద్దాం పిల్లలకీ” అన్ననాన్న మాటల్ని ఆసరాగా తీసుకొని రాసిన ఒక కవితను ఇటీవలే చదివాను. ఇల్లు ఇల్లంతా వెలుగు కొలనై అలలు అలలుగా కదలాడే కాంతివంతమైన ప్రేమని ఒక దీపంలా వెలుగుతున్నట్లు కనిపింప చేస్తాడు కవి మనకు ఆ కవితలో.
ఆ కవిత ఏదంటే “వెలుగు కొలను” అనేది. ఆ కవితను రాసింది కేంద్ర సాహిత్య యువ పురస్కారాన్ని అందుకున్న పల్లిపట్టు నాగరాజు. కవిత్వ నిర్మాణంలో మంచి పట్టు ఉన్న కవి నాగరాజు.నాగరాజు తొలి కవితా సంపుటి “ యాలై పూడ్సింది “ . ఈ మధ్యే నాగరాజు వెలువరించిన కవితా సంపుటి “ నీలికళ్ళ నేల “. “యాలై పూడ్సింది” – కవితా సంపుటిలోని కవిత్వంతోనే కవితా ప్రియుల హృదయాలలోనో మంచి కవిగా ముద్ద్ర వేసుకున్నాడు నాగరాజు.
రాజకీయ కవిత్వాన్ని ధిక్కార స్వరంతో రాస్తున్న యువ స్వరం నాగరాజు. దళిత సామాజిక చైతన్య ఉద్యమాన్ని, ఆత్మ గౌరవ పోరాటాన్ని తన కవిత్వ రథానికీ రెండు చక్రాలుగా చేసుకొన్న కవి నాగరాజు. ‘మందు తాగుతూ నువ్వూ నేను/మతం తాగుతూ దేశం/ కొచెం కొంచెం మార్చురీ గదిలా దేశం” కాలిరిగిన కాలానికీ ఏదో ఒక కట్టు గట్టాలా” అంటూ కవిత్వం రాసే నాగరాజు కలం “ వెలుగు కొలను” లాంటి కవిత రాయడం ఆశ్చర్యమేమి కాదు నాకు .
మనసు కోసే కవితలు,మనసు దోచే కవితలు కూడా రాయడంలో పల్లిపట్టు కు గట్తి పట్టుంది.లోపల రగిలే అరణ్యాల భాషే కవిత్వంగా, లోపల దూకే నయాగరాల మెరుపే కవిత్వం చేయగల పల్లిపట్టుకు మెడచుట్టు సుగంధాలద్దుతూ రెండు లే వెచ్చని పూలతీగల్లాంటి చేతులు వేసే పిల్లల గురించి తెలుసు. ఇల్లంతా ముద్దు మందారాల తోటై విరిసే పిల్లల మనసూ తెలుసు. అందుకే అప్పుడప్పుడు వెలుగు కొలను లాంటి కాంతి పుంజాల తోరణమైన కవిత్వం రాశాడు.
ఈ కవితలో ఓ నాన్న,వేదననో, ఓ అమ్మ రోదననో చిత్రించలేదు. పిల్లల పట్ల అమ్మా నాన్నల ప్రేమ హృదయాన్ని విప్పి చెప్పాడు. పిల్లల లేత వీపులపై వాతల్లా తేలే అమ్మా నాన్నల కోపాన్ని పల్లి పట్టు నాగరాజు చిత్రిక పట్టలేదు ఈ కవితలో. పిల్లల ముఖంలో వెలిగే కాంతిని కవిత్వం చేశాడు నాగరాజు. పిల్లల ముఖంలో వెలిగే పుస్తక కాంతిని చూపించాడు ఈ కవితలో.
అమ్మా నాన్నల మీద ఆధారపడ్డ పిల్లలకు చదువు ఎంత అవసరమో ఈ కవిత లోని ఆఖరి వాక్యాలు చెప్పకనే చెబుతున్నాయి. చీకటి అజ్ఞానానికీ ప్రతీక. వెలుగు జ్ఞానానికీ సంకేతం. అందుకే నాగరాజు ఇట్లా అంటాడు.
“ బిడ్డలు చీకట్లో వుంటే
ఏ తల్లిదండ్రులు ఇష్టపడతారు?
చీకట్లో ఏ పిల్లలైనా చదువుకోగలరా?”
అజ్ఞానంలో పిల్లలు ఉండరాదన్న భావనతో పాటు పిల్లల ముఖంలో కాంతి ఉండాలంటే అమ్మా నాన్నల ముఖాలు కూడా కాంతివంతంగా ఉండాలన్న ఆలోచనను ఈ కవితలో కవి ప్రస్ఫుటం చేస్తున్నాడు.అంటే అమ్మా నాన్నలు కూడా చదువు ఇచ్చే జ్ఞానపు వెలుగులో ఉండాలని కవి ఉద్దేశ్యం.
అట్లా ఉన్నప్పుడే ఆ ఇల్లంతా వెలుగు కొలనై అలలు అలలుగా కదులుతుందని కవి అంటాడు. ఇల్లే కాదు జీవితమంతా వెలుగుల కొలను కావాలంటే ఏ పిల్లలైనా చదువుకోవాలన్న ఒక భావాన్ని కవి చదువరుల గుండె గూట్లో దీపం పెట్టి మరీ చెబుతాడు ఈ కవితలో.
దీపాల్లా వెలిగే అమ్మ కళ్ళను , ఆ కళ్ళ కాంతి కారణంగా వెలిగిపొయే అమ్మ ముఖాన్ని , ఆ ముఖంలో నెలకొన్న కాంతివంతమైన ప్రేమను కవి ఈ కవితలో చూపెట్టడమే కాకుండా దీపాలు ఆరిపోక ముందే పిల్లలకు అన్నాలు పెట్టాలన్న స్పృహను ఈ కలిగించడం ఈ కవితలోని ఒక వెలుగు.
పుస్తకాలు ముందరేసుకొని చదివే పిల్లల ముఖంలోని దీపపు కాంతి వాళ్ల జీవితాల్లో వెలుగుల్ని నింపే చదువేనని చెప్పడం కవితలో ఒక కొసమెరుపు. భావాల పై పై స్వభావాన్ని చెప్పేవి కాక, పాఠకుల మనో భావాలపై బహువిధ ప్రభావాన్ని కలిగించే సున్నిత కవిత రాసిన పల్లిపట్టుకు అభినందనలు.
వెలుగు కొలను
- పల్లిపట్టు నాగరాజు
దీపం వెలిగిస్తున్న
అమ్మ ముఖంలోకి చూస్తూ
దీపం ఆరిపోకముందే
భోజనం పెట్టేద్దాం పిల్లలకీ
అంటాడు నాన్న
అలవాటుగా సరేనంటూ
సన్నగా నవ్వే అమ్మ కళ్ళు కూడా
దీపాలవితాయప్పుడు!
అమ్మ ముఖంలో కాంతి
నాన్నముఖంలో కాంతి
పుస్తకాల ముందటి
పిల్లల ముఖమ్లో కాంతి
ఆ ఇల్లంతా వెలుగు కొలనై
అలలు అలలుగా కదులుతుంది
ప్రేమ కాంతివంతం
బిడ్డలు చీకట్లో వుంటే
ఏ తల్లిదండ్రులు ఇష్టపడతారు
చీకట్లో ఏ పిల్లలైనా చదువుకోగలరా?
*








బాగుంది.
“వెలుగు కొలను” కవిత నా బాల్యాన్ని గుర్తు చేసింది ఇక్కడ నాన్న స్థానంలో అవ్వ ఉండేది. కళాత్మకంగా గుర్తుచేసిన పల్లిపట్టుకు “వెలుగు కొలను”కు దివిటీ పట్టి చూపిన రాజారామ్ కు అభినందనలు–చం.