Zen-Z పబ్బులు వదిలి భజనలకు వెళ్తున్నారు. ఇది కేవలం మారుతున్న అలవాటు కాదు. మనిషికి ఉమ్మడి నమ్మకం అవసరం అని అర్థమవుతున్న సూచన.
ఈ మధ్య చదివాను Zen- Z మారుతున్న దృక్పధాల గురించి. వాళ్ళకి అనిపిస్తోంది “పబ్బులో ఏదో తక్కువగా అనిపిస్తోంది, భజనలో ఏదో దొరుకుతోంది.” అది మత విశ్వాసం అని అనుకోలేము. కానీ ఆ వాతావరణంలో ఏదో ఉందని వాళ్ళకి అర్థం అవుతోంది. ఆ “ఏదో” ని అర్థం చేసుకోవాలంటే, మనిషి చరిత్రలో చాలా వెనక్కు వెళ్ళాలి.
Yuval Noah Harari తన పుస్తకం Sapiens లో ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు. దాదాపు 70,000 సంవత్సరాల క్రితం మనిషి మెదడులో ఒక పెద్ద మార్పు వచ్చిందని. అప్పటి నుండి మనిషి abstract గా ఆలోచించటం మొదలు పెట్టాడని, సంక్లిష్టమైన భాష మాట్లాడగలిగాడని. అన్నింటికంటే ముఖ్యంగా, shared myths తయారు చేయగలిగాడు. ఇవి కంటికి కనిపించవు, చేతికి అందవు. కానీ లక్షల మంది నమ్మినప్పుడు నిజంగా పని చేస్తాయి.
కుంభమేళా పై బ్రిటిషు మానసిక శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన విశయాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. కుంభమేళా వంటి భారీ సమూహాలలో వ్యక్తులు తమ స్వంత ప్రయోజనాల కంటే సామూహిక గుర్తింపుకు (Collective Identity) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మిలియన్ల కొద్దీ ప్రజలు ఒకే పవిత్ర లక్ష్యం కోసం ఒకచోట చేరినప్పుడు, అక్కడ ఒక అద్భుతమైన సామాజిక అనుబంధం ఏర్పడుతుంది. ఇది కేవలం జన సమూహం మాత్రమే కాదు, ఒక గొప్ప “ఆధ్యాత్మిక కుటుంబం” అనే భావనను కలిగిస్తుంది అనేది పరిశోధన సారాంశము.
కథ వేరు, ఆ కథపై నమ్మకం వేరు
Narrative అంటే మనం చెప్పే కథ.
“మన ఊరిలో ఒక దేవత ఉంది, ఆమె మనల్ని కాపాడుతుంది” అని చెప్పడం కథ మాత్రమే. కానీ shared myth అంటే ఆ కథను వినే వెయ్యి మంది లో ప్రతి ఒక్కరూ “అవును, నేను కూడా నమ్ముతున్నాను” అని తమ తమ అంతరాల్లో భావించటం అనేది సమిష్టి నమ్మకం అంటే shared myth. అలా కథ (అది కల్పితమో , వాస్తవమో) వస్తువు నుంచి నమ్మకం అనేది పుడుతుంది.
డబ్బును చూడు. “ఈ కాగితం విలువైనది” అని ఒక్కరు చెప్తే అది కేవలం కథ. కోటి మంది నమ్మినప్పుడు ఆ కాగితం నిజంగా విలువైనదిగా పని చేస్తుంది. దేశం, మతం, కులం, జాతీయత, అన్నీ ఇలాంటివే. ఇవి భౌతికంగా ఎక్కడా లేవు, కానీ లక్షల జీవితాలను నడిపిస్తాయి.
“కథ మనల్ని తెలుసుకోనిస్తుంది. ఉమ్మడి నమ్మకం మనల్ని కట్టిపడేస్తుంది.”
కథ మారవచ్చు, పక్కన పెట్టవచ్చు. కానీ ఒక shared myth సమాజంలో లోతుగా వేళ్ళూనుకున్నప్పుడు దాన్ని తీసేయడం దాదాపు అసాధ్యం. ఆ నమ్మకం లేకపోతే ఆ సమూహం ఉనికే ప్రశ్నార్థకమవుతుంది.
అందరి నమ్మకం నుండి చిన్న చిన్న నమ్మకాల వైపు
చాలా కాలంగా shared myths పెద్ద స్థాయిలో పని చేశాయి. ఒక మతం, ఒక రాజు, ఒక భావజాలం, ఇవి కోట్ల మందిని ఒకే దిశలో నడిపించేవి. అది అందరూ ఒప్పుకునే నమ్మకాల కాలం. కానీ internet వచ్చాక మనుషులు చిన్న చిన్న గుంపులుగా విడిపోయారు. ప్రతి గుంపుకి సొంత నమ్మకాలు తయారయ్యాయి. ఒక్క సార్వత్రిక సత్యం కాదు, వందల విశేష సత్యాలు. ఒక్క దేవాలయం కాదు, వందల WhatsApp గుంపులు. ఇది ఒకవైపు స్వేచ్ఛగా అనిపిస్తుంది. కానీ సమాజంలో చిన్న చిన్న ముక్కలవడానికి కూడా దారి తీస్తుంది.
నమ్మకం ఒక ఆట అయింది
నేటి డిజిటల్ యుగంలో ఆధ్యాత్మికత, నమ్మకం అనేవి ఒక ‘ఆట’ (Gamification) లాగా మారిపోతున్నాయి. ఒకప్పుడు భక్తి అనేది వ్యక్తిగత అనుభూతిగా ఉండేది, కానీ ఇప్పుడు అది పాయింట్లు, స్థాయిలు (Levels), బహుమతుల చుట్టూ తిరుగుతోంది. వివిధ మతపరమైన యాప్‌లు ‘డైలీ స్ట్రీక్స్’ వంటి ఫీచర్ల ద్వారా ప్రతిరోజూ ప్రార్థన చేయడాన్ని ఒక టాస్క్ లాగా మారుస్తున్నాయి. దీనివల్ల ఆధ్యాత్మిక సమూహాలలో ఒక రకమైన పోటీ నెలకొంది. అనుచరుల సంఖ్య, షేర్లు, సోషల్ మీడియాలో లభించే గుర్తింపు ఆధారంగా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్థాయిని అంచనా వేస్తున్నారు. ఒక భావజాలాన్ని పాటించే గుంపులో వైరల్ అయితే “నాయకుడు” అవుతావు. ఈ gamification వల్ల నమ్మకం మరింత అలవాటుగా మారుతోంది. నమ్మడం తక్కువ, నమ్ముతున్నట్టు నటించడం లేదా బయటకు ప్రదర్శించుకోవడం ఎక్కువవుతోంది. ఫలితంగా, అంతర్గత పరివర్తన కంటే బాహ్య ప్రపంచంలో లభించే డిజిటల్ గుర్తింపుకే ప్రాధాన్యత పెరిగి, నమ్మకం అనేది కేవలం ఒక అలవాటుగా లేదా ఒక సాంకేతిక లెక్కగా మిగిలిపోతోంది.
నేటి Gen-Z తరం పబ్బుల కంటే భజనలు లేదా ఆధ్యాత్మిక కూటముల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం అక్కడ దొరికే తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం (Sense of Belonging). పబ్బులలో సంగీతం, సందడి ఉన్నప్పటికీ, మనసుకి కావాల్సిన ప్రశాంతత లేదా ఒక సమూహంలో అంతర్భాగమయ్యామనే అనుభూతి అక్కడ కరువు అవుతోంది. కానీ ఆధ్యాత్మిక సమూహాలలో అందరూ కలిసి చేసే కీర్తనలు, ప్రార్థనలు వారిలో ఒంటరితనాన్ని పోగొట్టి, ఒక గొప్ప సామూహిక శక్తిలో తాము కూడా భాగమేననే భరోసాను ఇస్తున్నాయి. ఈ తరం యువత కేవలం వినోదమో, ఆధ్యాత్మికమో కాకుండా, తాము ఎక్కడికి చెందుతామో (Where they belong) తెలుసుకోవడానికి, ఆ గుంపులో లభించే ఒక రకమైన సామాజిక భద్రత కోసమే ఇటువైపు అడుగులు వేస్తున్నారు. మనిషి బతకడానికి ఉమ్మడి నమ్మకం అవసరం.
ఒంటరిగా బతికే మనిషికి అర్థం ఏముంటుంది? పని చేయడం ఎందుకు? త్యాగం చేయడం ఎందుకు? ఇలా ఆలోచిస్తూ పోతే shared myth మనకు ఒక పెద్ద లక్ష్యం ఇస్తుంది. “నేను దేనికో భాగం” అనే భావన ఇస్తుంది.
మనిషికి చెందడం అవసరం. అర్థం అవసరం. ఆ రెండూ shared myths ద్వారా దొరుకుతాయి. మతం, దేశం, కుటుంబం, భావజాలం, వ్యాపార గుర్తింపు, అన్నీ ఒక్కో నమ్మకం. మనిషి జీవితమంతా ఒకటి పోతే మరొకటి పట్టుకుంటాడు.
“నా జీవితానికి అర్థం ఏంటి?” అనే శూన్యత నేటి ప్రపంచంలో చాలా మంది అనుభవిస్తున్నారు. దాన్ని నింపడానికి కొత్త నమ్మకాలు వెతుకుతున్నారు. పబ్బులు కాదు, భజనలు. కొనుగోలు సంస్కృతి కాదు, సమూహం.
ఇప్పుడు నమ్మకాలు తయారు చేసేది algorithm
చరిత్రలో నమ్మకాలు తయారు చేసినవారు ఎవరు? ప్రవక్తలు, రాజులు, కవులు, కథకులు. వారు కథలు చెప్పారు, ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు ఆ శక్తి నెమ్మదిగా AI algorithms చేతికి వెళ్తోంది.
TikTok algorithm నీ మనోస్థితి చూసి, నీకు ఏ విషయం చూపించాలో నిర్ణయిస్తుంది. ఆ విషయం నీలో నెమ్మదిగా ఒక ప్రత్యేకమైన ప్రపంచ దృష్టి నిర్మిస్తుంది. ఆ దృష్టే నీ వాస్తవం అవుతుంది. నువ్వు స్వయంగా ఎంచుకోలేదు, algorithm ఎంచుకుంది.
పాతకాలంలో ఉమ్మడి నమ్మకాలు సమూహం నుండి వచ్చేవి. ఇప్పుడు అవి మన గురించి సేకరించిన సమాచారం నుండి తయారవుతున్నాయి. పాత నమ్మక నిర్మాతలు నీతో ముఖాముఖి మాట్లాడేవారు. Algorithm నిన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటుంది. నీ బలహీనతలు తెలుసు, నీ భయాలు తెలుసు, నీకు ఏ కథ నచ్చుతుందో తెలుసు. అందుకే algorithm ద్వారా వచ్చే నమ్మకాలు చాలా శక్తివంతంగా, చాలా విభజించేవిగా ఉంటాయి.
నమ్మకం పరిణమిస్తూనే ఉంటుంది
వ్యవసాయ సమాజంలో భూమి దేవత. పారిశ్రామిక యుగంలో దేశం.
సమాచార యుగంలో వ్యాపార గుర్తింపులు, అభిమాన గుంపులు.
AI యుగంలో వ్యక్తిగతమైన algorithms. ప్రతి కాలానికి తన నమ్మకం ఉంటుంది. కానీ మూల అవసరం మారలేదు, మనిషికి ఉమ్మడి నమ్మకం అవసరం.
రాబోయే కాలంలో AI మన నమ్మకాలను పూర్తిగా వ్యక్తిగతంగా మార్చేస్తే ఏం జరుగుతుంది? ప్రతి మనిషికి వేరే నమ్మకం ఉంటే, మనం కలిసి ఏదైనా నిర్మించగలమా? ఇది రాబోయే అతిపెద్ద సమాజ సవాలు.
అందుకే ఆ Zen- Z పబ్బు వదిలి భజనకు వెళ్ళడం చిన్న విషయం కాదు. వారు algorithm ఒంటరితనం నుండి బయటపడి మానవ అనుబంధం వెతుకుతున్నారు. ఒక ఉమ్మడి నమ్మకంలో కలవాలని ప్రయత్నిస్తున్నారు. అది సహజంగా, లోతుగా మానవీయంగా ఉంది.
Shared myth మనల్ని మనుషులుగా చేసింది. అది మారవచ్చు, పరిణమించవచ్చు. కానీ అది పోతే, మనం ఒకరికొకరు అపరిచితులం మాత్రమే.
– కథ మారుతుంది, నమ్మకం మిగులుతుంది.
*








రిలేషన్స్ రీల్ చట్రంలో ఇరుక్కున్నాయి
—————
చేతివేళ్లు కీ బోర్డు వాయిస్తున్నాయి
కనుగుడ్లు నాట్యం చేస్తున్నాయి
మెదడు ఏదో బురదలో దొర్లుతున్నది
రిలేషన్స్ రీల్ చట్రంలో ఇరుక్కోగా
28 రోజుల ప్యాకేజీ బలపడ్డది
సిగ్నల్ పుల్లలు దిశా నిర్దేశం చేస్తుంటే
ఛార్జింగ్ గీతలు సమయాన్ని గుర్తు చేస్తున్నాయి
ఫోన్ రింగ్ చెవికి సంగీతమైంది
మాట వినిపిస్తుంది తప్ప
మనిషి జాడలేదు
జేబులోని సెల్ బంధానికి బంధీనయ్యాను
అద్భుతంగా చెప్పారు. Shared myth మనసుకి oka స్వాంతన ఇస్తుంది.