నాది చాలా చిన్న ప్రపంచం. స్కూల్, కొద్దిమంది ఫ్రెండ్స్, నేను. అంతే! రోజూ అదే రొటీన్. స్కూల్‌కి వెళ్లడం, టీచర్లు చెప్పింది వినడం, ఎగ్జామ్ రాయడం, మార్కులు తెచ్చుకోవడం. ఆ చిన్న ప్రపంచంలో నేనొక ‘టాప్ స్టూడెంట్’. ఎవ్వరూ నన్ను ఓడించలేరు. ఎవ్వరూ నన్ను ఛాలెంజ్ చేయలేరు. అందుకే నా మనసులో ‘నేనే బెస్ట్’ అనే చిన్న అహంకారం.
ఒకసారి మా సార్ ఒక సామెత చెప్పారు – “గుంటలో ఉన్న కప్పకి సముద్రం తెలియదు.” అప్పుడు నవ్వుకున్నాను కానీ, ఆ సామెత నాకోసమే అని అర్థం కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది.
నాకు తెలిసింది నా మార్కులు, నా చిన్న విజయాలు మాత్రమే! జీవితం ఎంత పెద్దదో, ఎంత కఠినమైనదో, ఎంత అందమైనదో అప్పుడు నాకు తెలియదు.
ఇంజినీరింగ్ కాలేజీలో అడుగు పెట్టిన రోజు. నా జీవితంలో మొదటిసారి పెద్ద మార్పు జరిగింది. మొదటి రోజు క్యాంపస్‌లోకి వెళ్లినప్పుడు ఒక్కసారిగా ఆగిపోయాను. అంత పెద్ద బిల్డింగ్, చుట్టూ వందలాది మంది స్టూడెంట్స్, ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో నడుస్తున్నారు. ‘ఇదేనా నా కొత్త ప్రపంచం’ అనిపించింది.
క్లాస్‌రూమ్‌లో కూర్చుని చుట్టూ చూశాను. ఎవరో కోడింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకొకరు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ గురించి మాట్లాడుతున్నారు. ‘నేను ఇప్పటికే ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అలాగే ఆన్‌లైన్ కోచింగ్ తీసుకుంటున్నాను’ అని మరొకరు మాట్లాడుకుంటున్నారు.
‘నేను టాప్ అనుకున్నది, నా చిన్న ప్రపంచంలో మాత్రమే’ అని నాకు రియలైజేషన్ వచ్చింది ఆ రోజు. నా అహంకారం కొంచెం తగ్గింది. మొదటి సంవత్సరం కొత్త ఫ్రెండ్స్, కొత్త అనుభవాలు, కొంచెం భయం, కొంచెం ఉత్సాహం. రెండో సంవత్సరం. నా జీవితాన్ని పూర్తిగా మార్చిన సంవత్సరం.
ఒక మధ్యాహ్నం కాలేజీ నోటీస్ బోర్డ్ దగ్గర నిలబడి ఉన్నాను. చుట్టూ స్టూడెంట్స్ పరుగులు పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. అప్పుడే నా కళ్లకు ఒక నోటీస్ కనిపించింది. ‘ఎన్‌సీసీ నమోదు ప్రారంభం’ అని. కొద్దిసేపు దాన్ని చూస్తూనే ఉన్నాను. ఎన్‌సీసీలో చేరాలా, వద్దా అని ఆలోచిస్తున్నాను. లోపల ఏదో చిన్న ఎగ్జైట్‌మెంట్. ఒకసారి ప్రయత్నిద్దాం అనుకున్నాను.
పరీక్ష రోజు వచ్చింది. ఫిజికల్ టెస్ట్ కోసం రన్నింగ్ చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమైంది. కాళ్లనొప్పి వచ్చింది. ‘ఇది నా వల్ల కాదేమో…’ అనిపించింది. కానీ ఎక్కడో లోపల నుంచి ‘ఆగకు..’ అనే గొంతు వినిపించింది. రన్నింగ్ కొనసాగించాను. కాళ్లు నొప్పి పుడుతున్నాయి. శ్వాస కష్టంగా తీసుకుంటున్నాను. అయినా ఆగలేదు. ముందుకు సాగాలని నాకున్న ఉత్సాహం చెప్పింది. చివరికి పూర్తి చేశాను. సంతోషం, అలసట అల్లరిగా కలిసిపోయాయి.
కొన్ని రోజులు తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. లిస్టు ముందు నిలబడి నా పేరు వెతుకుతున్నాను. ముందు వరుసలో లేదు మధ్యలో లేదు, చివరిలో– ‘భరత్’ అనే పేరు. అది చదివినప్పుడు మనసంతా ఉల్లాసంతో నిండిపోయింది. అలసట మొత్తం మర్చిపోయి, లోపలి సంతోషం బయటకు రావడం అద్భుతం.
నా వరకూ అది చిన్న విజయం కాదు. చాలా ముఖ్యమైన సాధన! చాలామంది దీన్ని సాధించలేరు. శ్రద్ధ, ప్రయత్నం ద్వారా ఇది సాధించడం నిజంగా అసలైన విజయం. ఎన్‌సీసీలో నేర్చుకున్నది పుస్తకాలలో ఉండదు. దేశభక్తి, క్రమశిక్షణ, కష్టపడేతత్వం, నాయకత్వ లక్షణాలు, ఇతరలకు సాయం చేయడం, ఇతరుల కోసం స్పందించడం..ఇవన్నీ అక్కడ నేర్చుకోవచ్చు.
ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం. జూనియర్లు ఎన్‌సీసీలో చేరారు. అందరం గ్రౌండ్‌లో ఒకటి, రెండు రౌండ్లు వేశాం. ఆ తర్వాత కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి “అన్నా! నీళ్లు కావాలా?” అని అడిగింది. ఎవరీ అమ్మాయి? టక్కున వచ్చి ఇలా అడుగుతోందని ఆశ్చర్యంగా చూశాను.
“వద్దు” అన్నాను.
తను నవ్వుతూ “సరే అన్నా” అని వెళ్లిపోయింది. ఆ తర్వాత రోజు నుంచి తను కనిపించి నవ్వుతూ పలకరించేది. “అన్నా! తిన్నావా?” అని తప్పకుండా అడిగేది. మొదట్లో ఆశ్చర్యంగా అనిపించినా తర్వాత అలవాటైపోయింది.
ఒక రోజు నేను లంచ్ బాక్స్ తీసుకురాలేదు. గ్రౌండ్‌లో ఒంటరిగా కూర్చున్నాను. “ఏమైందన్నా! తినట్లేదే?” అని అడిగింది తను.
“బాక్స్ తీసుకురాలేదు” అన్నాను.
ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బాక్స్ నా చేతిలో పెట్టి, “నువ్వు తినన్నా! నువ్వు తినకపోతే నాకు బాధగా ఉంటుంది” అంది. ఆ క్షణం నా గుండెలో చిన్న కదలిక. ఇది సాధారణ స్నేహబంధం కాదు. ఇంట్లో అమ్మ అందించే ప్రేమ. తన నాకు అమ్మ తర్వాత అమ్మలా అనిపించింది. ‘అమ్మ ప్రేమ ఎక్కడైనా ఒకటే. రూపం మాత్రమే మారుతుంది’ అనుకున్నాను.
***
“ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం” అని ఎన్‌సీసీ మేడమ్ చెప్పగానే మా అందరిలో కొత్త ఉత్సాహం మొదలైంది. రోజూ క్లాస్‌లు, పాఠాలు, అవే రొటీన్ పనులతో సాగే మా జీవితానికి ఇదొక చిన్న బ్రేక్‌లా అనిపించింది. నాగార్జునసాగర్ ట్రిప్ రోజు ఉదయం అందరం వ్యాన్ దగ్గర కలుసుకున్నాం. అందరూ ఫ్రెండ్స్‌తో నవ్వుతూ ఫొటోలు తీసుకున్నాం. ప్రతి ఒక్కరి కళ్లలో ఆనందం, ఉత్సాహం కనిపించింది.
వ్యాన్ స్టార్ట్ అయ్యాక, ఎవరో స్పీకర్‌లో పాటలు ప్లే చేయడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పాటలు, డ్యాన్స్‌లు, చప్పట్లు, నవ్వులు.. ఒక పండుగలా అనిపించింది. అందరి ఉత్సాహం ఒకరికొకరు పంచుకుంటూ ప్రయాణం మరింత సంతోషంగా సాగింది. ఆ క్షణాల్లో మనం ఎక్కడికి వెళ్తున్నామన్నదానికంటే, ఎవరితో వెళ్తున్నామన్నది ముఖ్యం అనిపించింది.
కొన్ని గంటల తర్వాత నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గరకు చేరుకున్నాం. ఆ భారీ నిర్మాణం చూసి కొన్ని క్షణాలు మాటలు రాకుండా ఆగిపోయాను. నీటిని నిల్వ చేయడానికి అంత పెద్ద కట్టడం. ‘మనిషి ఎంత గొప్పగా ఆలోచించగలడో, సృష్టించగలడో!’ అని ఆశ్చర్యం కలిగింది. ప్రకృతి అందాలు, మనిషి సృష్టి – రెండూ కలిసిన ఆ ప్రదేశం మనసుకు ఒక కొత్త అనుభూతినిచ్చింది.
తర్వాత నాగార్జునకొండకు వెళ్లినప్పుడు, చరిత్ర నా ముందే నిలబడి ఉన్నట్టుగా అనిపించింది. అక్కడి నిశ్శబ్దం, గాలి, ఆ పాత నిర్మాణాలు – అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించాయి. ప్రతి అడుగులోనూ గతకాలం కథలు వినిపిస్తున్నట్టు అనిపించింది. సమయం కూడా నెమ్మదిగా సాగింది.
మూడు గంటల తర్వాత అందరికీ ఆకలేసింది. చిన్న ఊరి దగ్గర ఆగి ఒక ఇంటి ముందు కూర్చున్నాం. పక్కనే ఉన్న చిన్న కిరాణా షాప్ ఉంది. మేం తీసుకొచ్చిన బాక్సులు తెరిచి అందరం పంచుకుంటూ తిన్నాం. చపాతీ, పులిహోర, స్నాక్స్..కలిసి తినడం వల్ల వాటి రుచి మరింత పెరిగింది. నవ్వులు, సరదా మాటలు, చిన్న చిన్న జోకులు.. నిజమైన ఆనందం ఏమిటో ఆ క్షణాలు మాకు చూపించాయి. ఆ అనుభవం జీవితాంతం గుర్తుండిపోయేలా మారింది.
ఆనందం ఖరీదైన ప్రదేశాల్లో, పెద్ద పెద్ద సౌకర్యాల్లో ఉండదు. మనసుకు దగ్గరైన వారితో పంచుకున్న నిజమైన క్షణాల్లోనే ఉంటుంది. ఆ అనుభవం నాకు జీవితాన్ని కొత్త కోణంలో చూడటం నేర్పించింది. పంచుకున్న భోజనం బంధాన్ని మరింత బలంగా చేస్తుంది.
కాలేజీ చివరి రోజులు. జీవితంలో ముఖ్యమైన దశ ముగియబోతోంది. నాలుగేళ్ల జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా కళ్ల ముందే తిరుగుతున్నాయి. అందరూ నవ్వుతూ, ఫొటోలు తీసుకుంటూ, కాలేజీలో చివరి రోజుల్ని ఆనందంగా గడపాలని చూస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న. ‘ఇకపై జీవితం ఎలా ఉండబోతుంది?’
తరగతి గదిలో చివరి బెంచ్ మీద సరదా మాటలు, ప్రొఫెసర్ల గురించి చేసుకున్న కామెంట్స్, అటెండెన్స్ కోసం చేసిన చిలిపి పనులు..ఇవన్నీ ఇప్పుడు గుర్తొస్తే నవ్వు తెప్పిస్తున్నాయి. క్యాంటీన్‌లో కూర్చుని తాగిన టీతో చెప్పుకున్న కబుర్లు, ఫ్రెండ్స్‌తో పంచుకున్న రహస్యాలు, చిన్న చిన్న గొడవలు.. ఇవన్నీ జీవితంలో మళ్లీ రావని మనసులో తెలియని బాధ మొదలైంది.
ఫ్రెండ్స్‌తో నవ్వులున్నాయి. ఆనందం ఉంది. లోపల మాత్రం ఆందోళన వెంటాడుతోంది. ‘ఉద్యోగం వస్తుందా? భవిష్యత్తు ఎలా ఉంటుంది?’ ఈ ఆలోచనలు మనసును నిశ్శబ్దంగా కలవరపెడుతున్నాయి. అలాంటి కలగాపులగపు ఆలోచనల మధ్యలోనే నా జీవితంలో ఓ కొత్త మలుపు.
***
తెలియని పర్సన్ నా ప్రొఫైల్ ఫాలో అయినట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో నోటిఫికేషన్. పెద్దగా పట్టించుకోలేదు. ఈ మధ్య తెలియనివాళ్లు చాలామంది ఫాలో అవుతున్నారు. ఎవరో చూద్దామని చూశాను. వివరాలేమీ లేవు. ‘ఏదో ఫేక్ ప్రొఫైల్’ అనుకుని పక్కన పెట్టేశాను. కొద్దిసేపటికి మొబైల్‌కి ఒక మెసేజ్, ‘నన్ను గుర్తుపట్టలేదా?’ అని.
నాలో ఆసక్తి మొదలైంది. ఎవరీ వ్యక్తి? ఎక్కడైనా చూశానా? ఎవరైనా సరదాగా చేస్తున్నారా అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. ‘హూ ఈజ్ దిస్?’ అని రిప్లై ఇచ్చాను. సమాధానం రాలేదు.
‘రిప్లై ఎందుకు ఇవ్వడం లేదు?’ అని మళ్లీ మెసేజ్ చేశాను.
మొబైల్ వైపే చూస్తున్నాను. నో రిప్లై. విసుగొచ్చింది.
‘నీ క్లాస్‌మేట్ మాధురి రిలేటివ్‌ని. సిస్టర్ అవుతాను’ అని కాసేపటికి రిప్లై ఇచ్చింది.

అది చదివిన వెంటనే నా ఎక్స్‌ప్రెషనన్స్ మారిపోయాయి. నా ఆసక్తి గంభీరంగా మారిపోయింది. ఇదంతా నిజమేనా? తను నాకెందుకు మెసేజ్ చేసింది?
వెంటనే మాధురికి మెసేజ్ చేశాను. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియని వ్యక్తి నుండి మెసేజ్ వచ్చింది. మీ రిలేటివ్ అంటోంది. నిజమేనా?’ అని అడిగాను.
‘అవును. రిలేటివే!’ అని చెప్పింది. అది చాలా చిన్న విషయమైనా ఎందుకో చాలా ముఖ్యంగా అనిపించింది. తన సమాధానం నా ఆందోళన కొంత తగ్గించింది.
తను మాధురి చెల్లెలన్న విషయం సరే, కానీ నాకెందుకు మెసేజ్ చేసింది? ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? ఊరికే మాట్లాడాలని అనుకుంటోందా? నాలో రకరకాల ప్రశ్నలు. ఆ రోజు నుండి నా ఆలోచనలు, నా జీవితం కొంచెంకొంచెంగా మారబోతున్నాయని ఆ క్షణంలో నేను ఊహించలేదు.
ఆ రోజు నుంచి తనతో చాటింగ్ మొదలైంది. ‘హాయ్! ఏం చేస్తున్నావ్?’ అని చిన్నగా మొదలైన సంభాషణ రోజులు గడుస్తున్న కొద్దీ మరింత గాఢంగా మారిపోయింది. తనది మా ఊరే. ప్రస్తుతం హైదరాబాద్‌లో హాస్టల్లో ఉండి చదువుకుంటోంది.
“నువ్వు చాలా సైలెంట్‌గా ఉంటావ్ కదా…” అని ఓ రోజు చాట్ మధ్యలో అడిగింది ఒక రోజు. చిన్నగా నవ్వుకున్నాను.
“అంతేనేమో! కొన్నిసార్లు సైలెంట్‌గా ఉంటే బాగుంటుంది…” అని రిప్లై ఇచ్చాను.
చిన్న గ్యాప్ తర్వాత “నాకు నువ్వంటే స్పెషల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది” అని మెసేజ్ చేసింది.
అది చాలా సాధారణమైన వాక్యం. అయినా అది నా మనసుకేదో కొత్త అనుభూతినిచ్చింది. ఆ వాక్యం చదివిన వెంటనే నా ముఖంపై చిన్న స్మైల్. ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే నాలాంటి వాణ్ని ఆసక్తిగా గమనించడం ఆనందం కాక మరేంటి? తనిచ్చిన ఆ కాంప్లిమెంట్ నా గుండె వేగాన్ని మరింత వేగంగా మార్చింది. ఆ చిన్న వాక్యంతోనే ఆమె నాకు చాలా ఆత్మీయంగా అనిపించింది. మా చాటింగ్ నిమిషాలు దాటి గంటల్లోకి మారిపోయింది. ఆమెతో రోజూ గంటలకొద్దీ చాట్ చేయడం అలవాటుగా మారింది.
‘నీ బర్త్‌డే ఎప్పుడు?’ అడిగిందొక రోజు.
‘ఇంకో నాలుగు రోజుల్లో’ అని రిప్లై ఇచ్చాను.
‘ఎలా సెలబ్రేట్ చేస్కుంటున్నావ్?’ అని అడిగింది.
‘ఫ్రెండ్స్‌తో సింపుల్‌గా’ అన్నాను.
కొద్దిసేపు తను నుంచి ఏ మెసేజ్ రాలేదు. ఆ తర్వాత ‘ఒకసారి మనం కలుద్దామా?’ అని మెసేజ్ వచ్చింది. నా గుండె ఒక్కసారిగా కదలిక మానేసింది.
ఒంటరిగా ఒక అమ్మాయిని ఎప్పుడూ కలవలేదు. కొంచెం భయంగా ఉంది. ‘నో..నేనిలా కలవను’ అని రిప్లై ఇచ్చాను.
‘సరే! నో ప్రాబ్లమ్. తర్వాత ఎప్పుడైనా కలుద్దాం.’
ఆ రోజు చాట్ ముగిసింది. కానీ ఆ ఆలోచన నా మనసులో మిగిలిపోయింది. కొన్ని పరిచయాలు మాటలకంటే ముందే మనసులో స్థానం సంపాదిస్తాయి.
***
నా బర్త్‌డేని స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకుంటున్నాను. కేక్ కటింగ్, ఫొటోలు తీసుకోవడం, నవ్వులు, సరదాలు..అన్నీ సాగుతున్నాయి.
మొబైల్ చూశాను. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని తన మెసేజ్ ఉంది. చాలా సాధారణమైన మెసేజ్. నా మనసుకు చాలా ప్రత్యేకంగా అనిపించింది.
కొద్దిసేపటి తర్వాత ఇంకో మెసేజ్..‘ఇవాళ కలిస్తే బాగుండేది.’
‘ఫ్రెండ్స్‌తో ఉన్నాను’ అని రిప్లై ఇచ్చాను. ఆ రోజు ముగిసింది. ఆమెను కలవాలనే ఆలోచన మాత్రం నా మనసులో మిగిలిపోయింది.
కొన్ని రోజుల తర్వాత ‘ఒకసారి హైదరాబాద్ రా! కలుద్దాం’ అని మెసేజ్ చేసింది. నా మనసులో సందిగ్ధం. వెళ్దామా? వద్దా? ఈ విషయం నా ఫ్రెండ్‌కి చెప్పాను.
“అరేయ్! ఒక అమ్మాయి కలవాలని అడుగుతోందిరా! హైదరాబాద్ రమ్మంటోంది. నాకా ఊరు తెలియదు. నువ్వు నాకు తోడొస్తావా?” అన్నాను.
అతను నవ్వుతూ “అయ్యో హీరో! వస్తాను కానీ నాకు వేరే వర్క్ ఉంది. నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను. నీ మీటింగ్ అయిపోయాక కాల్ చేయ్, అప్పుడొస్తాను” అన్నాడు.
హైదరాబాద్ వస్తున్నానని తనకి మెసేజ్ చేశాను. బస్‌లో కూర్చుని కిటికీ బయటకు చూస్తున్నాను. తనను కలిసే క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. ‘ఇది కరెక్టేనా?’ మనసులో ఏదో భయం.
కాఫీ షాప్‌కి రమ్మంది తను. నాతో అక్కడి దాకా వచ్చి మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళాను. తను అక్కడుంది. నన్ను చూసి లేచి నిలబడి, “నేనే ఆషూ. నువ్వు భరత్ కదా?” అంది.
ఆ గొంతులో ఆత్మవిశ్వాసం, ముఖంపై నిజమైన నవ్వు. ఆ క్షణం నా టెన్షన్ తగ్గిపోయింది. రిలాక్స్ అయ్యాను. కొద్దిసేపు మామూలుగా మాట్లాడాం. నిమిషాలు క్షణాల్లా గడిచిపోతున్నాయి.
‘నేను వస్తున్నాను’ అని నా ఫ్రెండ్ కాల్ చేశాడు. “చాలా టైమ్ అయ్యింది. ఫ్రెండ్ వస్తున్నాడు. నేను వెళ్లాలి” అన్నాను.
ఆమె బ్యాగ్ నుండి ఒక చిన్న గిఫ్ట్ తీసి ఇచ్చింది. “హ్యాపీ బర్త్‌డే. ఆ రోజు ఇవ్వలేకపోయాను. అందుకే ఈ రోజు ఇస్తున్నాను” అంది.
ఆ గిఫ్ట్‌ను తీసుకున్నాను. నా పుట్టినరోజు అయిపోయి నెలలు దాటిపోయింది. ఆ రోజు ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఇప్పుడు ఇస్తోంది. నా మనసులో ఎన్నో ప్రశ్నలు. నా మీద ఇంత ప్రేమ ఎందుకు? ఇంతలా నా గురించి ఆలోచిస్తోందా? తనిచ్చిన ఆ వస్తువు కంటే తను నా మీద చూపిస్తున్న ప్రేమ ఎక్కువ ఆనందాన్నిస్తోంది.
ఆ రోజు ఆమె నా గుండెను ఆక్రమించినట్టు అనిపిస్తోంది. కానీ నా మీద తను చూపించే ఈ ప్రేమకు కారణమేంటో మనసు తేల్చుకోలేకపోతోంది. ఆ విషయం తెలుసుకోవాలన్న ఆసక్తి, ఉత్సాహం, అస్పష్టత.. అన్నీ కలిసి ఇంటికి వెళ్లాక మెసేజ్ చేసి నేరుగా అడిగాను. ‘నాకు గిఫ్ట్ ఎందుకు ఇచ్చావ్? ఎందుకు నా మీద ఇంత ప్రేమ?’
చాలాసేపటి వరకు టైపింగ్ అని వచ్చింది వాట్సాప్‌లో. కానీ తన నుంచి మెసేజ్ రావట్లేదు. మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ‘నిన్ను చూసేందుకు అప్పుడప్పుడూ మీ కాలేజీకి వచ్చేదాన్ని…’ అని తన నుంచి మెసేజ్ వచ్చింది.
నేను ఆశ్చర్యపోయాను. తరువాత మరో మెసేజ్ వచ్చింది. ‘అది అలవాటైపోయింది. ఇప్పుడు నిన్ను మిస్ అవుతున్నా…’
ఆ వాక్యం చదివాక కొన్ని సెకండ్ల నిశ్శబ్దం. ‘నాకు నువ్వంటే ఇష్టం. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను’ అని మరో మెసేజ్. నా చేతులు వణికాయి.
ఇన్ని నెలల తర్వాత తన మనసులో మాట బయటకొచ్చింది. తన మీద నాకున్న ఫీలింగ్ చెప్పేయాలనుకుంటున్న టైమ్‌లో మైండ్ ప్రాక్టికల్‌గా ఆలోచించింది. ‘వాళ్ళు చాలా రిచ్. మాది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఇద్దరి ప్రేమ సక్సెస్ అవుతుందా?’
నా హృదయం ఆమె ఆలోచనతో నిండిపోయింది. అయినా కొన్ని రోజులు తనకు దూరంగా ఉన్నాను. మెసేజ్ చేయలేదు. తన మెసేజులకు రిప్లై ఇవ్వలేదు. తను మాటిమాటికీ గుర్తొచ్చేది. తన మాటలు, తను నా మీద చూపించిన ప్రేమ, తనిచ్చిన గిఫ్ట్, ఆ అనుభూతులు.. అన్నీ నన్ను డిస్టర్బ్ చేశాయి.
కొన్ని రోజుల తర్వాత తన చేసిన మెసేజ్ చూశాను. ‘ప్లీజ్! ఒకసారి హైదరాబాద్ రా. ఈసారి ఒక్కడివే రా!’ అని ఉంది. ‘సరే’ అని రిప్లై ఇచ్చాను.
‘నేనెప్పుడూ ఒంటరిగా హైదరాబాద్‌కి రాలేదు. నాకు బస్ రూట్లు తెలియవు’ అన్నాను.
‘నువ్ హైదరాబాద్ బస్సెక్కి ఇక్కడికి రా! నేను స్టాప్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తాను’ అని చెప్పింది.
ఒక్కసారిగా చాలా ధైర్యం వచ్చింది. ఒంటరిగా బయల్దేరాను. కొంచెం భయం కూడా ఉంది కానీ, ఎక్కువగా ఉత్సాహం, ఆనందం నిండిపోయింది. ఫోన్ తీసి ఇయర్ బడ్స్ పెట్టుకొని ‘ఆరెంజ్’ సినిమా పాటలు వింటూ పడుకున్నాను. హైదరాబాద్ వచ్చేసింది.
ఆషూ అప్పటికే పది మిస్డ్ కాల్స్ చేసింది. ‘ఎక్కడున్నావ్?’ అని మెసేజ్ పెట్టింది. నేను నా లొకేషన్ చెప్పాను. కొద్దిసేపటికి ఆమె నా ముందు నిలబడింది. ఆ క్షణంలో నా మనసు, నా ఆలోచనలు ఒక్కసారిగా బ్లాంక్ అయ్యాయి. నన్ను చూసి స్మైల్ ఇచ్చింది.
“నాకు చాలా ఆకలి ఉంది” అన్నాను.
“రా! నేను బిర్యానీ తినిపిస్తా” అంది.
గ్రాండ్ హోటల్ అనే రెస్టారెంట్‌కి వెళ్ళాం. పేరుకి తగ్గట్టుగా గ్రాండ్‌గా ఉంది. తనే వెయిటర్‌కి ఆర్డర్ చెప్పింది. తను చేస్తున్న ప్రతి పని నా గుండె లోతుల్లోకి మెల్లగా చేరుతోంది. నాలో కొత్త భావాలు నింపుతోంది.
తరువాత కాఫీ షాప్‌కి వెళ్లాం. ఈసారి నేను కాఫీ తీసుకొని వచ్చాను. ఆమె తాగలేదు. “ఎందుకు?” అని అడిగాను.
“మీగడ ఉంటే నాకు నచ్చదు” అంది. నాకు అర్థం కాలేదు. మళ్లీ ఇంకో కాఫీ తీసుకెళ్లాను. ఆమె నవ్వింది. ఆ నవ్వులో ఒక స్థిరమైన గాఢత కనిపించింది. మనసుల మధ్య మాటలు అవసరం లేకుండా, ఇంటర్నల్ భావాలు వ్యక్తమయ్యాయి. తను నా చేతిపై చేయి వేసింది. తన చేయి కొంచెం వణుకుతోంది.
“నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అంది. ఆ మాట చెప్తున్నప్పుడు ఆమె కళ్ళలో నీళ్లు నిండాయి. అది తను గుండెలో నుంచి వచ్చిన నిజమైన భావం.
నా మనసు గందరగోళంగా మారింది. భావోద్వేగాల బరువుతో నిండిపోయింది. భయంగా కూడా అనిపించింది.
“నేను వెళ్లాలి” అని చెప్పి బయటకు వచ్చాను.
తను అక్కడే నిలబడి ఉంది. వెనక్కి తిరిగి చూసే సాహసం చేయలేకపోయాను.
‘ప్రేమ మన ముందు నిలబడినప్పుడు, దాన్ని అంగీకరించడానికి ధైర్యం అవసరం.’
***
కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా అడుగులు ముందుకు పడుతున్నాయి. నా మనసు మాత్రం అక్కడే ఆగిపోయింది. తను, తన మాటలు, తన కళ్లలో కనిపించిన ప్రేమ..అన్నీ మళ్లీ మళ్లీ గుర్తొస్తున్నాయి.
దగ్గర్లో కనిపించిన బస్టాప్‌లో బస్ ఎక్కి, వాళ్లనీ వీళ్లనీ అడిగి బస్టాండ్ చేరుకున్నాను. ఎలాగో ఇంటికి వచ్చేశాను. ఆ రాత్రి మంచం మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తున్నాను. నా మనసులో ఒకే ప్రశ్న – ‘అది నిజమైన ప్రేమేనా లేక ఒక క్షణిక భావోద్వేగమేనా?’
నా గుండె ఒక్కటే చెప్తోంది. ‘ఆమె నిజంగా నన్ను ప్రేమిస్తోంది’. కానీ నా బుద్ధి మాత్రం ‘భవిష్యత్తు గురించి ఆలోచించు’ అంటోంది. ఆ రాత్రి నాకు నిద్రే పట్టలేదు. ఉదయాన్నే లేచి రెడీ అయ్యాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నా కాళ్ళు నన్ను దేవాలయానికి తీసుకెళ్లాయి.
దేవుడి ముందు నిలబడ్డాను. కళ్ళు మూసుకొని, మనసులో మెల్లగా అనుకున్నాను. ‘ఇది నిజమైన ప్రేమ అయితే, ఆ ప్రేమను నా జీవితంలో ఉంచు’.
ఎటువంటి సందేహం లేకుండా ఫోన్ తీసుకున్నాను. ‘నాకూ నువ్వంటే ఇష్టం’ అని మెసేజ్ టైప్ చేసి పంపాను.
ఆ ఒక్క మెసేజ్ నా జీవితాన్ని మార్చేసింది. కొద్దిసేపటికి తన నుండి వీడియో కాల్ వచ్చింది. స్క్రీన్ పై తన ముఖం కనిపించింది. కళ్లలో నీళ్లు. ముఖంలో ఆనందం. “థ్యాంక్యూ” అని ఏడుస్తూ చెప్పింది.
నేను మౌనంగా ఉన్నాను. కానీ లోపల ఒక కొత్త, వింతైన అనుభూతి. ఆ రోజు మా ప్రేమ బంధం అధికారికంగా మొదలైంది. కొన్ని అంగీకారాలు మన జీవితానికి కొత్త అర్థాన్ని ఇస్తాయి.
రోజూ గంటలకొద్దీ మాట్లాడుకుంటున్నాం. కొన్ని రోజులు తర్వాత తన బర్త్ డే వచ్చింది. “ఈసారి ఫుల్ డే నువ్వు నాతోనే ఉండాలి” అని ప్రేమగా ఆర్డరేసింది.
“సరే…” అన్నాను.
కోటి బస్టాప్ చేరుకున్నాను. ఎక్కడ చూసినా జనం. తను ఎక్కడుందో కనిపించడం లేదు. చుట్టూ చూస్తున్నాను. పీచ్ కలర్ లాంగ్ ఫ్రాక్, చిన్న హ్యాండ్‌బ్యాగ్ వేస్కొని, చేతికి వాచ్, ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని, కళ్ళు మాత్రమే కనబడేలా కళ్ళకి మస్కారా పెట్టుకొని ఒక అమ్మాయి దూరం నుండి నన్ను గమనిస్తూ ఉంది.
అంతలోనే ఆషూ నుంచి కాల్ వచ్చింది. తనతో కాల్ మాట్లాడుతూ ఆ లాంగ్ ఫ్రాక్ అమ్మాయిని చూస్తూ ఉన్నాను. తను కూడా ఎవరితో ఫోన్‌లో మాట్లాడుతుంది. ‘తనేనా ఆషూ?’ అనిపించింది. తను అయ్యుండదులే అనుకొని ఆషూ కోసం చూస్తూ ఉన్నాను.
ఇంతలో ఆ అమ్మాయి వెనక నుండి వచ్చి నా చెయ్యి పట్టుకుంది. “హే…ఎవరూ!” అని షాక్‌తో అంటుండగానే తను స్కార్ఫ్ తీసింది. నన్ను చూస్తూ ఆషూ నవ్వింది.
“నేను అప్పట్నుండి నిన్ను చూస్తూనే ఉన్నా. నువ్ మాత్రం ఎటో చూస్తున్నావ్” అంది. ఇద్దరం ఒక్కసారిగా నవ్వుకున్నాం.
తను క్యాబ్ బుక్ చేసింది. ఇద్దరం క్యాబ్ ఎక్కాం. “బస్సులో వెళ్లొచ్చు కదా!” అన్నాను.
“బయట చాలా ఎండగా ఉంది. నువ్ ఎండలకు తట్టుకోలేవ్” అంటూ నా ముఖానికి పట్టిన చెమటను తన స్కార్ఫ్‌తో తుడిచింది.
నన్ను గోల్కొండకు తీసుకెళ్ళింది. మెట్లు ఎక్కుతున్నాం. సూర్యుడు మండిపోతున్నాడు. అలిసిపోయి నీడ ఉన్న చోట కూర్చున్నాం. నేను ఏదో మాట్లాడుతున్నాను. తన ఒక్కసారిగా సైలెంట్ అయ్యి నన్నే చూస్తోంది.
“ఏమైంది? ఎందుకలా చూస్తున్నావ్?” అని అడిగాను.
“నువ్వు మాట్లాడుతుంటే భలే ముచ్చటగా ఉంటుంది. అలాగే చూస్తూ ఉండిపోవాలని ఉంది” అంది.
ఆ మాటతో నా మనసంతా ఆనందం నిండిపోయింది.
****
ఆమెను కలిసిన తర్వాత నా మొదటి బర్త్‌డే అది. “ఒక ప్లేస్‌కి వెళ్దాం వస్తావా? చాలా మంచి డివోషనల్, హిస్టారికల్ ఫీల్ ఉంటుంది” అని పిలిచింది. “నువ్వు ఉదయం ఏడు గంటలకల్లా హైదరాబాద్‌కి రీచ్ అవ్వాలి” అంది.
“ఎక్కడికి తీసుకెళ్తావ్?” అని అడిగితే “సర్‌ప్రైజ్” అని నవ్వేసింది.
ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తూనే ఉన్నాను.
తెల్లవారుజామున మూడు గంటలకే లేచి, త్వరత్వరగా రెడీ అయ్యి, కాఫీ తాగి నాలుగ్గంటలకు వెంకటాద్రి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేశాను. 6:20కి హైదరాబాద్ చేరుకున్నాను. తను కూడా రెడీ అయ్యి ఏడు గంటలకల్లా కాచిగూడ రైల్వేస్టేషన్‌కి వచ్చింది. ఇద్దరం అక్కడే టిఫిన్ చేశాం. 7:45కి గుంటూరు ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. ఎక్కేశాం.
ఎక్కడికి వెళ్తున్నామో తను చెప్పలేదు. ఆవలింతలు వస్తుండటంతో నేను కళ్లు మూసుకొని మెల్లగా నిద్రలోకి జారిపోయాను. పది గంటలకు నన్ను నిద్ర లేపింది. “మన స్టాప్ వచ్చింది” అంది.
అది వరంగల్ రైల్వేస్టేషన్. తను నన్ను రామప్ప గుడికి తీసుకువెళ్తోందని అర్థమైంది. ఎప్పుడో ఒకసారి మాటల్లో ‘రామప్ప గుడికి వెళ్లాలని ఉంది’ అన్నాను. ఆ మాట గుర్తుపెట్టుకుని, ఎలా వెళ్లాలో మొత్తం ప్లాన్ చేసుకుని నన్ను తీసుకొచ్చింది. స్టేషన్ బయట టీషాప్ దగ్గర నేను టీ, తను కాఫీ తాగాం. అక్కడి నుంచి ఆటోలో రామప్ప గుడికి వెళ్లాం. మొదటిసారి ఆలయం లోపలికి అడుగు
పెట్టినప్పుడు మనసులో చిన్న కుతూహలం. కళ్ల ముందున్న ఆ అద్భుతం మాత్రం మాటల్లో చెప్పలేనిది. ఆ గుడి చరిత్ర, ఆ గాలిలో ఉన్న పాతకాలపు స్పర్శ ఒక్కసారిగా నన్ను వేరే లోకానికి తీసుకెళ్లినట్టు అనిపించింది. ప్రతి శిల్పం, ప్రతి రాయి ఒక కథ చెబుతున్నట్టే అనిపించింది. ఫొటోలు తీసుకున్నా ఆ ఫీలింగ్ మాత్రం హృదయంలోనే నిలిచిపోయింది. ‘ఇంత అద్భుతం మన దగ్గరే ఉంది. ఇంతవరకు ఎలా మిస్ అయ్యాను!’ అనిపించింది.
తర్వాత వరంగల్ కోట చూశాం. బాగా ఆకలేసి, దగ్గరలోని ఒక హోటల్లో వేడి వేడి పూరీ తిన్నాం. ట్రైన్‌కి ఇంకా టైమ్ ఉండటంతో దగ్గరలోని జూపార్క్ కూడా చూసి, మళ్లీ స్టేషన్‌కి వచ్చి ట్రైన్ ఎక్కాం.
రోజంతా తిరిగిన అలసటతో ఇద్దరం నిద్రపోయాం. కాచిగూడ స్టేషన్‌కి వచ్చాక, తనతో గడిపిన ఆ రోజు జ్ఞాపకాలతో నేను మా ఊరికి ట్రైన్ ఎక్కాను. తను హాస్టల్‌కి వెళ్లిపోయింది. ఆ రోజు నా జీవితంలో మాటల్లో చెప్పలేని అనుభూతిని మిగిల్చింది. గిఫ్ట్‌ల కంటే గొప్ప జ్ఞాపకంగా మారిపోయింది.
***
మరోసారి గోల్కొండ వెళ్లాం. సూర్యుడు ఆకాశంలో నెమ్మదిగా రంగులు మార్చుకుంటూ ఉండగా మేం కిందకు దిగుతున్నాం. దారిలో ఒక ఫొటోగ్రాఫర్ కనిపించాడు.
“ఒక ఫోటో తీసుకుందాం…” అంది తను. మొత్తం గోల్కొండ వ్యూ బ్యాక్‌షాట్‌లో పడేలా ఫొటో తీసుకున్నాం. ఆ ఫోటో మీదున్నది ఇమేజ్ కాదు, మా మధ్యలోని మధురక్షణం, మా భావోద్వేగాల ప్రతిబింబం, మర్చిపోలేని మెమొరీ.
తర్వాత ఒక చిన్న హోటల్లో కూర్చున్నాం. రాండమ్ టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం. ఒకరి గురించి ఒకరం తెల్సుకుంటున్నాం.
“నీ డ్రీమ్ ఏంటి?” అని అడిగింది.
“సింపుల్ అండ్ పీస్ఫుల్ లైఫ్” అని చెప్పాను.
తను నవ్వింది. ఆ నవ్వులో దగ్గరితనం ఉంది.
“నీతో ఉంటే అస్సలు బోర్ కొట్టదు. ప్రతి రోజూ కొత్తగా ఉంటుంది” అని చెప్పింది.
ముందు విన్నప్పుడు జోక్‌లా అనిపించింది కానీ, లోతైన స్వరంతో చెప్పిన ఆ మాట ప్రత్యేకమైన భావంలా అనిపించింది. పదాలు చిన్నవే, కానీ ఆ నవ్వులో మాధుర్యం, స్వరంలో గాఢత కలిసినప్పుడు లోతైన ఫీలింగ్ ఇస్తుంది.
సాయంత్రమయ్యింది. రోడ్డుపై నడుస్తూ ఉంటే చల్లగాలి మా ముఖాలను తాకుతోంది. తన నాకు దగ్గరగా నడుస్తోంది. మా మధ్యలో కొన్ని మౌనక్షణాలు. చీకటి ఆకాశం, రోడ్ మీద లైట్లు. మా గుండెల్లో సవ్వడి ఎక్కువవుతూ మా బంధాన్ని మరింత దగ్గరగా చేస్తోంది. తను నా చెయ్యి పట్టుకుంది. అది చిన్న చర్య మాత్రమే. కానీ అలా పట్టుకోవడంలో నమ్మకం, దగ్గరితనం కలిసిన బలమైన భావం.
***
ఆ రోజు తర్వాత మేమిద్దరం తరచూ కలుస్తున్నాం. బావర్చి రెస్టారెంట్ తన ఫేవరెట్ ప్లేస్. ‘అక్కడ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది’ అని చెప్తూ ఉండేది. ఎప్పుడూ జనాలతో ఎక్కువ రద్దీగా ఉండేదక్కడ. అక్కడికెళ్లి ఫుల్ బిర్యానీ ఆర్డర్ పెట్టాం. చాలాసేపు వెయిటింగ్ తర్వాత బిర్యానీ వచ్చింది. ఇద్దరం షేర్ చేసుకున్నాం. లాస్ట్ పీస్ నీదంటే నీదని ఇద్దరం గొడవపడ్డాం. అందులో ప్రేమ ఉంది. తర్వాత ఐమ్యాక్స్‌లో సినిమా చూడాలని బయలుదేరాం. మేం వెళ్లేసరికి మధ్యాహ్నం 2:30 అయ్యింది. బాలీవుడ్ మూవీకి మాత్రమే టికెట్స్ ఇస్తున్నారు.
‘రోహి’ అని హర్రర్ మూవీ. తనకి హర్రర్ మూవీస్ అంటే చాలా భయం. నాకేమో అవంటే చాలా ఇష్టం. వెళ్దామా, వద్దా అని అడిగాను.
“నువ్ ఉన్నావ్ కదా పక్కన, భయం లేదులే. వెళ్దాం” అంది.
టికెట్ తీస్కొని లోపలి వెళ్ళాం. హర్రర్ సీన్స్ మొదలయ్యాయి. భయంగా ఉందంటూ తన తల నా భుజంపైన పెట్టి, తన రెండు చేతులు కళ్ళకి అడ్డంగా పెట్టుకుంది. ఆ చేతివేళ్ళ గ్యాప్‌లోంచి భయపడ్తూ, ఉలిక్కిపడుతూ సినిమా అంతా చూసేసింది. నాతో ఉంటే తనెంత కంఫర్ట్‌గా ఫీలవుతుందో ఆరోజు బాగా అర్థమైంది. ‘ఎవరైనా మన మీద ఆధారపడితే అది ప్రేమలోని అందమైన అనుభూతి’ అనిపించింది.
***
అన్నీ పర్ఫెక్ట్‌గా జరుగుతున్నాయని అనుకునేలోపే అనుకోని పెద్ద కుదుపు. 2020లో దేశాన్ని కరోనా ఒక్కసారిగా స్తంభింపజేసింది. మొత్తం లాక్‌డౌన్. ఎవరూ బయటకు వెళ్లే వీలు లేదు. ‘హైదరాబాద్‌లో హాస్టల్ ఖాళీ చేయాలని వార్డెన్ చెప్పాడంటూ’ ఆషూ నాకు సడన్‌గా కాల్ చేసింది.
“ఇక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేయ్” అని అడిగింది. నిమిషం కూడా ఆలోచించకుండా బస్సు ఎక్కేశాను. వాళ్ళ కాలేజీ దగ్గరున్న ఓ కాఫీషాప్ దగ్గర తను వెయిట్ చేస్తోంది. అప్పటికే తన లగేజ్ అంతా సర్దిపెట్టుకుంది.
ఇద్దరం కలిసి మా ఉరి బస్సు ఎక్కేశాం. లగేజ్ పెట్టడానికి కూడా స్థలం లేదు. కాస్త ముందుకి వెళ్ళాక కొందరు దిగారు. ఒక సీట్ ఖాళీ అయ్యింది. వేరే అమ్మాయి వచ్చి కూర్చోబోయింది. తను నాకోసం ఆమెతో గొడవ పడి సీట్ సంపాదించింది. తననే కూర్చోమని చెప్పాను.
బస్సు ఇంటికి దగ్గరవుతున్న కొద్దీ తను నాకు దూరమవుతున్న ఫీలింగ్ కలుగుతోంది. నేను ముందు స్టాప్‌లో దిగేశాను. తనని వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్లారు.
తను ఇంటికెళ్లిన కొన్ని రోజుల దాకా కాల్స్ అండ్ మెసేజెస్ వచ్చేవి. ఆ తర్వాత కాల్స్ తగ్గిపోయాయి. మెసేజ్ కూడా చేయడం లేదు. తన నుంచి ఎప్పుడు మెసేజ్ వస్తుందా అని ఫోన్ పట్టుకొని రోజంతా చూస్తూ ఉండేవాణ్ని.
లాక్‌డౌన్ వల్ల బయట ప్రపంచం ఆగిపోయింది. కానీ నా లోపల మాత్రం యుద్ధం మొదలైంది. తను వాళ్ల ఫ్యామిలీతో బిజీగా ఉండేది. నేను మాత్రం నా ఫోన్ స్క్రీన్ చూస్తూ, తను ఎప్పుడు మెసేజ్ చేస్తుందా అని చూస్తూ ఉండిపోయాను. తన నుంచి మెసేజ్ రాకపోయేసరికి నేనే ‘గుడ్ మార్నింగ్’ అని మెసేజ్ పంపేవాణ్ని. మెసేజ్ చూసినా తన నుంచి రిప్లై లేదు. బిజీగా ఉండి ఉంటుందిలే అనుకున్నాను.
“నువ్వు బాగా బిజీ అయిపోయావ్. ఫోన్ లేదు, మెసేజ్ లేదు” అని ఫోన్ చేసి అడిగేశాను. “అలాంటిదేం లేదు. నువ్వే ఎక్కువగా ఉహించుకుంటున్నావ్” అని కాల్ కట్ చేసింది.
రోజూ ఇలాగే జరుగుతోంది. ఒక రోజు చాలా విసుగొచ్చి “నువ్వు మారిపోయావ్. నాకు దూరమవుతున్నావ్. ఇదంతా కావాలనే చేస్తున్నావ్” అన్నాను. మా మధ్య గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. దూరం పెరిగితే ప్రేమను నిలబెట్టుకోవడం చాలా కష్టం అనిపించింది.
తన నుంచి మెసేజులు రావడం లేదు. కాల్ చేస్తే ‘బిజీగా ఉన్నాను. తర్వాత మాట్లాడదాం’ అని కాల్ పెట్టేసేది. ఒక రోజు రాత్రి తన వాట్సాప్ ప్రొఫైల్ ఓపెన్ చేశాను.
తను ఆన్‌లైన్‌లో ఉంది. ‘నువ్ నార్మల్‌గానే ఉన్నావా?’ అని మెసేజ్ చేశాను.
‘అయామ్ ఫైన్’ అని కొద్దిసేపటి తర్వాత మెసేజ్ వచ్చింది. తన మనసు నాపై లేదని అనిపించింది. ఆ మాటలు కూడా ఖాళీగా అనిపించాయి.
ఆ రోజు లోపల ఏదో విరిగిపోయిన భావన. ముందున్న అమ్మాయేనా తను? అదే ముఖం, అవే కళ్ళు. ఒకప్పుడు నాకోసం కన్నీళ్లు కార్చిన కళ్లవి. ఇప్పుడు ఆ కళ్ళలో నా మీద ప్రేమ, నమ్మకం కనిపించడం లేదు. నా చేతిని గట్టిగా పట్టుకుని “నిన్ను వదలను” అని చెప్పింది తను. ఆ క్షణాలు అబద్ధం కావు కదా? అవి నిజమే! నా హృదయంలో ఆ మాటలింకా బ్రతికే ఉన్నాయి. కానీ ఇప్పుడు తన మాటల్లో ఒకప్పటి ‘మనం’ అనే ఫీలింగ్ లేదు. ఆ చూపుల్లో ఆప్యాయత లేదు. ఆ దగ్గరితనం మాయమైంది. నా గుండె ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. కోపం కంటే బాధే ఎక్కువగా ఉంది.
‘మన మధ్య ఏం మారిపోయింది?’ అని తనను అడగాలనిపించింది. కానీ సమాధానం వినడానికి నా మనసు సిద్ధంగా లేదు. ఇప్పుడు నేను చూస్తున్న ఆషూ ఆ పాత ఆషూ కాదు. ఆ పాత అమ్మాయిని నేను చాలా మిస్ అవుతున్నాను. మాటలు తగ్గిన చోట అనుమానాలు పెరుగుతాయి.
***
రోజుకో గొడవ. మొదట్లో అవి చిన్న విషయాలే!
“ఎవరితో మాట్లాడుతున్నావ్?”
“ఎక్కడికి వెళ్తున్నావ్?”
“అసలు నన్ను పటించుకోవడం లేదు.”
నేను ఆ ప్రశ్నలు అడిగింది ప్రేమతోనే, తన గురించి ఆరాటంతోనే. కానీ తనకవి ప్రేమలా కాకుండా అనుమానంలా కనిపించాయి. నేను తనను కంట్రోల్ చేయాలనుకున్నట్టు అనుకుంది.
“నన్ను అనుమానిస్తున్నావ్ కదా?” ఆమె మాటల్లో అసహనం. నా మనసులో బాధ. ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ మాటలు మమ్మల్ని దూరం చేస్తున్నాయి.
“నువ్వు ముందులా లేవు” అని ఒక రోజు చెప్పింది. ఆ మాట విన్న క్షణం నా లోపల ఏదో శోకం. నేను మారలేదు, నా ప్రేమ మారలేదు, తన మీద నా కేర్ తగ్గలేదు. మారింది పరిస్థితులు మాత్రమే. మా మధ్య హాయిగా మాట్లాడుకునే సమయం మారింది. మా మాటల వెనక ఉన్న అర్థం మారింది. ఇప్పుడు మా మాటలు అపార్థంతో మొదలై గొడవతో ముగుస్తున్నాయి.
కాల్ కట్ అయిన తర్వాత ఆ నిశ్శబ్దం చాలా గట్టిగా వినిపిస్తోంది. ఫోన్ స్క్రీన్‌ని చూస్తూ మా చివరి సంభాషణ గుర్తుచేసుకున్నాను. నా మనసుని ఒక ప్రశ్న అడిగాను. “ఇది..ఇలా ఎలా అయింది?”
గంటల తరబడి మాట్లాడుకున్నవాళ్ళం ఇప్పుడు కొన్ని నిమిషాల్లోనే ఒకరికి ఒకరం దూరం అవుతున్నాం.
తనకు ఫోన్ చేశాను. చాలా ప్రశాంతంగా, ఎలాంటి అహంకారం లేకుండా అడిగాను. “మన మధ్య ఏం జరుగుతోంది?”
కొన్ని సెకండ్ల నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దమే ఒక సమాధానం లాగా అనిపించింది. “నథింగ్” అంది తను. ఆ నథింగ్‌లో చాలా అర్థం ఉంది. చెప్పలేకపోయిన తన ఫీలింగ్స్, మెల్లగా తగ్గిపోతున్న క్లోజ్‌నెస్ కనబడుతోంది. నథింగ్ అంటే ఇప్పుడేమీ లేదని కాదు, ఇంక చెప్పడానికి ఏమీ మిగల్లేదన్న భావన. అది ముగింపు కాదు, ఒక హెచ్చరిక. మనం దూరమవుతున్నాం అనే సంకేతం.
నా మనసు మాత్రం ఒకటే అంటుంది. ‘ఇంకా ఆలస్యం కాలేదు. మనం మళ్లీ ముందులా అవ్వగలం. కానీ ఇద్దరం ప్రయత్నిస్తేనే..’. ప్రేమలో విరిగేది హృదయం మాత్రమే కాదు, నమ్మకం కూడా!
***
ఒక సాయంత్రం నా ఫోన్ రింగ్ అయ్యింది. తనే. గొంతు చాలా మెల్లగా, కాస్త గందరగోళంగా ఉంది. “ఒక విషయం చెప్పాలి” అంది. నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది.
“ఏమైంది?” అని అరిచా. నా గుండె వణుకుతోంది. కొంతసేపు మౌనం. అంతలోనే నా లోపల భయం పెరిగిపోయింది.
“మా ఇంట్లో నా మ్యారేజ్ గురించి డిస్కస్ చేస్తున్నారు” అంది. ఆ ఒక్క వాక్యంతో ఒక్కసారిగా నా ఆశలు, కలలు, ఆలోచనలు అన్నీ భళ్లున బద్దలయ్యాయి.
“మరి… మనం?” అని అడిగాను. నా గొంతు వణుకుతోంది.
“మన పెళ్లి జరగదు. నాన్న ఒప్పుకోవడం లేదు” అని చెప్పింది. ఆ మాటలు వినగానే నా చేతులు చల్లబడ్డాయి. సంవత్సరాలుగా పోగుచేసుకున్న ప్రేమ ఒక్కసారి మాయమైనట్లు తను మాట్లాడుతోంది.
“ట్రై చేద్దాం. ఒప్పించేలా చేద్దాం” అన్నాను తనను వేడుకుంటున్నట్టు.
తను మాత్రం ఇక సాధ్యపడదన్నట్టు “ఇది వర్కవుట్ కాదు” అని చెప్పింది. ఆ రోజు ఒక చేదు నిజాన్ని నేను అంగీకరించాల్సి వచ్చింది. మనలో ఎంత ప్రేమున్నా, అది మన ఆశించిన దారిలో సక్సెస్ కాదు. ప్రేమ కంటే కుటుంబం, సమాజం, పరిస్థితులు, కనిపించని గోడ మా మధ్య ఉన్నట్టు నాకనిపించింది.‘కొన్ని మాటలు… ఒక్క క్షణంలో మన జీవితాన్ని మార్చేస్తాయి’
***
‘చివరిగా ఒకసారి కలుద్దాం’ అని కొన్ని రోజుల తర్వాత తన నుంచి మెసేజ్ వచ్చింది.
‘ఎక్కడ?’ అని అడిగా.
‘హైదరాబాద్ బస్టాండ్’ అని రిప్లై ఇచ్చింది.
‘నేను నీకిచ్చిన గిఫ్ట్స్ పట్టుకొనిరా! నువ్ నాకు ఇచ్చిన గిఫ్ట్స్ కూడా తీస్కొని వస్తా’ అంది.
‘ఎందుకు?’ అని అడిగా.
‘నువ్ తీస్కొనిరా! వచ్చాక చెప్తా’ అంది.
హైదరాబాద్ వెళ్లాను. బస్సు దిగి చుట్టూ చూశాను. చాలామంది జనం ఉన్నారు. అంతమందిలో కూడా నా కళ్లకు తను మాత్రమే కనిపించింది. నాలో ఇంకా ఎక్కడో చిన్న ఆలోచన. ఏదైనా జరిగి మేమిద్దరం మళ్లీ ఒకటవుతామేమో అన్న చిన్న ఆశ. ఆమె చేతిలో ఒక బ్యాగ్. అది చూసి నా ఆశలన్నీ ఒక్కసారిగా ధ్వంసమయ్యాయి. నన్ను చూసి ఆమె ఒక బలవంతపు నవ్వు నవ్వింది. అది నవ్వు కాదు, తన ఆలోచనను దాచుకునే ప్రయత్నం మాత్రమే.
“నేను ఇచ్చిన గిఫ్ట్స్ ఇవ్వు” అంది. నా గుండె ఆగిపోయినట్లయ్యింది. ఆమె ఆ గిఫ్ట్స్ అన్నీ తీసుకొని పక్కనే ఉన్న డ్రైన్‌లో పడేసింది. నా ప్రేమను తూట్లు పొడుస్తున్నట్టు అనిపించింది.
“ఏంటిరా ఇలా చేస్తున్నావ్?” అని వణుకుతున్న గొంతుతో అడిగాను. ఆమె చూపు, మాటలు, హృదయం అన్నీ కలిసి “ఇంక మనిద్దరం కలవడం అసాధ్యం” అంది. మేం కలిసి తీసుకున్న ప్రతి ఫోటో, ప్రతి జ్ఞాపకం కాలువలో పారేసింది. అవి కేవలం వస్తువులు కాదు, నా భావాలు, నా ఆశలు, నా ప్రేమ..అన్నీ ఆ క్షణంలో చీకట్లో కలిసిపోయాయి.
“నా గిఫ్ట్స్?” అని అడిగాను. “అవన్నీ ముందే పారేసి వచ్చాను” అని చెప్పింది. నా ఫోన్ ఇమ్మని అడిగింది. ఇచ్చాను. ఫోన్‌లో మా ఇద్దరి చాట్, మెసేజెస్ ఒక్కొక్కటీ డిలీట్ చేసింది. నా గుండెలో ఒక్కో ముక్క తీసేస్తున్నట్టు అనిపించింది.
‘జ్ఞాపకాలు చెరిపేయడం సులభం కాదు. వాటిని చెరిపే ప్రయత్నం చాలా బాధాకరంగా ఉంటుంది.’
***
ఆమె వెళ్లిపోతున్నప్పుడు నా హృదయం ఆగిపోయినట్టు అనిపించింది. తనను ఆపేందుకు నాకున్న చివరి అవకాశం.
“మనం ఎప్పట్నుండో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్‌కి వెళ్దాం అనుకన్నాం కదా? ఇప్పటివరకు పోలేదు. ఇదే మనిద్దరం కలిసే లాస్ట్ మీటింగ్. ప్లీజ్! ఒకసారి వెళ్దాం” అని తనని బతిమాలాను.
“ఏ దేవుణ్ని మొక్కినా మనం విడిపోక తప్పదు” అని తేల్చి చెప్పేసింది తను.
“లాస్ట్ విష్. జస్ట్ వెళ్లి వచ్చేద్దాం” అని చెప్పా, సరే అని వచ్చింది.
ఇద్దరం కలిసి బస్సులో వెళ్లాం. లోపల కొండంత బాధతో అమ్మవారి దర్శనం చేసుకున్నాను. నా గుండెను అమ్మవారి దిక్కు ఉంచి ‘ఇంకో ఛాన్స్ ఇవ్వు తల్లీ..’ అని ప్రార్థించాను. ఆషూ నిశ్శబ్దంగా కళ్లు మూసుకుని ఏదో మొక్కుకుంటోంది. దర్శనం అయ్యాక కళ్లు తెరిచి నన్ను చూసింది.
“ఇక్కడితో ఇక మన ట్రావెల్ ఆపేద్దాం” అంది. ఆ మాట నా హృదయాన్ని చావు అంచులకు తీసుకెళ్లింది. తను వెళ్ళిపోయింది. నేను అక్కడే నిలబడి ఉన్నాను. చుట్టూ జనం ఉన్నారు. గంట కొడుతున్నారు. అమ్మవారిని మొక్కుకుంటున్నారు. నాకు మాత్రం ఏమీ వినిపించడం లేదు. గుండె అంతా ఖాళీగా మారిపోయింది. కళ్ళలో నీరు. నా లోపల ఉన్న ఒక భాగాన్ని, నా జీవితంలోని ఒక ఖండాన్ని, నా ప్రేమ, ఆశ, కలలు..అన్నింటినీ కోల్పోయాను.
అది ముగింపు కాదు, నా జీవితంలో ఒక తాత్కాలిక విరామం. నన్ను కొత్తగా, మరింత గట్టిగా నిలబెట్టే విరామం. కానీ ఆ ఖాళీ, ఆ నిశ్శబ్దం ఎప్పటికీ మరువలేనిది. కొన్ని ప్రేమలు కలిసి ఉండకపోయినా మనలోనే మిగిలిపోతాయి.
****
జీవితం మామూలగా నడుస్తోంది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను. ప్రతి రోజూ ఒకేలా ప్రారంభమవుతోంది. చేతిలో ఫోన్.
‘ఏమైనా మెసేజ్ వస్తుందా?’ అని చూడటం నా మొదటి పని. బ్లాక్ స్క్రీన్ తప్ప ఏమీ మారేది కాదు. అది నా లోపలున్న ఖాళీలా, నా గుండెలోని శూన్యంలా అనిపిస్తుంది.
నా ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు. “రారా బయటకి. మనం చిల్ అవుదాం” అంటున్నారు. “బిజీ ” అని చెప్తున్నాను, కానీ అది నిజం కాదు. నిజం ఏమిటంటే, నేను ఎవర్నీ కలవలేకపోతున్నాను. వాళ్లతో మాట్లాడటం, నవ్వడం, సరదాగా ఉండటం… ఇవన్నీ ఇప్పుడు భారంగా అనిపిస్తున్నాయి.
రాత్రి పడుకునే సమయంలో తన నవ్వు, తన మాటలు..అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటాయి. ప్రతి మెమొరీ ఒక సినిమాగా కనిపిస్తుంది. ‘మళ్లీ ఆమెను చూడగలనా? ఇప్పుడది అసాధ్యం’ అని తల్చుకుంటే నా నిద్ర ఎగిరిపోతుంది. బయటకు మామూలుగా ఉన్నట్టు కనిపిస్తాను, నవ్వుతాను, మాట్లాడతాను. కానీ లోపల పూర్తిగా ఖాళీ. నా గుండెలోని ఒక భాగం ఆమెతో కలిసిన ఆ చివరిక్షణంలోనే మాయమైపోయింది.
రోజులు గడిచిపోతున్నాయి. ఆ ఖాళీ మాత్రం పోవడం లేదు. నార్మల్‌గా ఉండటం అలవాటు చేసుకున్నాను. తనను మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్న రోజులవి. ఎవరైనా మన జీవితంలో లేకపోయినా, మనలో మాత్రం ఎప్పటికీ ఉంటారన్నది నిజం.
***
నెలలు ఎడతెరిపి లేకుండా కదులుతున్నాయి. జీవితంలో ముందుకు సాగుతూ అడ్జస్ట్ అవుతున్నాను. అదంత సులభం కాదు, కానీ తప్పదు.
నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. అమెజాన్ కంపెనీలో ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్‌గా ఉద్యోగం. జాయిన్ అయ్యాను. మొదటి రోజు ఆఫీసులో అడుగుపెట్టాను. కొత్త కొలీగ్స్, కొత్త వాతావరణం, కొత్త ఛాలెంజెస్. నేను బిజీ అవ్వడానికి, నా మనసును ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను.
కానీ చిన్న ట్రిగర్ వచ్చినా అవుటాఫ్ కంట్రోల్ అయ్యి నా మనసులోని బాధ బయటికి తన్నుకొచ్చేది. కాఫీని చూసినా, బిర్యానీ వాసన పీల్చినా గతంలోకి వెళ్లిపోయేవాణ్ని.
లంచ్ టైంలో కొలీగ్స్‌తో కూర్చొని భోజనం చేస్తున్నాను. వాళ్ళు జోక్స్ వేస్తున్నారు. నేను నవ్వుతున్నాను కానీ, ఆ నవ్వు నిజమైన నవ్వు కాదు. అదొక ఫేస్ మాస్క్. జాబ్ కోసం నేను నటించే నటన మాత్రమే. అద్దంలో చూడగానే ‘ఇది నిజంగా నేనేనా?’ అనే ప్రశ్న నాకే కలుగుతుంది. నాకు తెలిసిన ‘నేను’, ఇప్పుడు ఉన్న ‘నేను’ మధ్యలో గ్యాప్ ఉందనిపిస్తోంది. బాధతో జీవించడం నేర్చుకున్నప్పుడు మనిషి నిజంగా బలంగా మారుతాడు.
***
సంవత్సరం గడిచింది. సమయం ఏమాత్రం ఆగదు. కొన్ని భావాలు మాత్రం అలాగే ఉంటాయి. ఒక రోజు ఫ్రెండ్ కాల్ చేశాడు. “రేపు తన పెళ్లి” అని చెప్పాడు. ఆ మాట విని తట్టుకోలేకపోయాను. మనసులో బాధ తగ్గట్లేదు. గుండె బరువెక్కినట్టు అనిపించింది. తన పెళ్లి హైదరాబాదులోనే అని తెలిసింది. నేనిక్కడే ఉంటే తన పెళ్లికి వెళ్లాలని అనిపిస్తుంది. అక్కడికి వెళ్లి ఏదైనా గొడవ చేయాలని అనిపిస్తుంది. గతం గుర్తుకొస్తే నా మనసు నా కంట్రోల్లో ఉండదు. అందుకే రేపు నేను ఇక్కడ ఉండకూడదు.
***
నా మనసంతా వేదనతో నిండిపోయింది. ఏదో అస్పష్టమైన బాధ. బైక్ తీసుకుని ఒంటరిగా జర్నీ స్టార్ట్ చేశాను. ఎటు వెళ్తున్నానో తెలీదు. వెళ్తూ, వెళ్తూ శ్రీశైలం రూట్‌కి వచ్చేశాను.
ఆకాశంలో వెలిగిపోతున్న సూర్యుడు. ఒంటికి తాకుతున్న చల్లగాలి. చుట్టూ వాతావరణం చాలా బాగుంది. కానీ నా మనసంతా దిగులు. ఒక టీషాప్ కనిపిస్తే ఆగాను. ఉదయం నుంచి ఏమీ తినలేదు. నీరసంగా అంది. ముందుకి వెళ్ళాలంటే ఏదో ఒకటి కడుపులోకి పోవాలని, టీ తాగి ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటరయ్యాను.
దట్టమైన నల్లమల్ల అడవి. చుట్టూ చెట్లు. ఆ అడవిలో బైక్ నడుపుతూ పోతుంటే ఒక రకమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. కాసేపటికి ఉన్నట్టుండి వాతావరణం మారిపోయి, వర్షం కురవడం మొదలైంది. లైట్‌గా చినుకులు పడుతున్నాయి. ఫర్లేదని అలాగే ముందుకు వెళ్లాను. కొద్ది క్షణాల్లో అది భీకర వర్షంగా మారింది. బైక్ స్లో చేశాను. ఒక చెట్టు దగ్గర బైక్ ఆపి, అక్కడే నిల్చుండిపోయాను. ఉరుములు, మెరుపులతో వర్షం ఇంకా పెద్దగా కురవడం మొదలైంది.
చుట్టూ చూశాను. ఎక్కడా మనిషి జాడ లేదు. నేనొక్కణ్నే ఈ అడవిలో ఉన్నట్టు అనిపించింది. రేపు తనకి పెళ్లి జరుగుతోందనే విషయం తలచుకుంటూ వర్షం తగ్గేవరకూ ఏడుస్తూనే ఉన్నాను. నా కన్నీటి ధారలు ఆ వర్షం నీటిలో కలిసిపోయాయి. నాకు దగ్గర్లో ఒక పిడుగు పడి కార్చిచ్చు అంటుకుంది.
మూడు గంటలపాటు ఏడుస్తూనే ఉన్నాను. ప్రతి వర్షపు చినుకు నాకు ఒకటే చెప్తున్నట్టు అనిపించింది. ‘నువ్వు బలహీనుడివి, కానీ నువ్వు జీవించాలి.’ ఈ ఒంటరితనం, బాధ, ఆపలేని దుఃఖం..ఇవన్నీ మరొకరికి అర్థం కాకపోవచ్చు. కానీ నాలోని బాధను దిగమింగుకోవాల్సిన సమయం ఇది.
వాన మెల్లగా తగ్గుతూ ఉంది. మేఘాలు తొలగిపోయి ఆకాశంలో వెలుగు తొంగిచూసింది. గట్టిగా పీల్చుకొని, హెల్మెట్ పెట్టుకుని బైక్ స్టార్ట్ చేశాను. నా లోపల ఒక కొత్త బలం పుట్టుకొచ్చింది. నాలో కొత్త ఆశను నింపింది.
రాత్రి శ్రీశైలం చేరుకున్నాను. రూమ్ తీసుకొని ఫ్రెషప్ అయ్యాను. పంచె కట్టుకొని స్వామి దర్శనానికి వెళ్ళాను. దర్శనం త్వరగానే అయిపోయింది. బయట ఒక దోసె తినేసి వచ్చి రూమ్‌లో పడుకుండిపోయాను. ఫోన్ ఆన్ చేశాను. చాలా మిస్డ్ కాల్స్ వచ్చాయి. నేను శ్రీశైలం వెళ్తున్న విషయం నా ఫ్రెండ్స్‌కి గానీ, మా ఇంట్లోవాళ్లకి గానీ చెప్పలేదు. ఎటు వెళ్తున్నానో నాకే తెలియనప్పుడు ఎవరికి ఏం చెప్తాను?
వాట్సాప్ ఓపెన్ చేసి చూశా. తనకు పెళ్లయిపోయింది. ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అని తన ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టారు. ఫోన్ విసిరేశాను. ఇపుడు నా బాధ తీర్చడానికి ఎవరూ లేరు. నా బాధ నేనే తీర్చుకోవాలి, నా కన్నీరు నేనే తుడుచుకోవాలి, నన్ను నేనే ఓదార్చుకోవాలి. అలా నాకు నేను సర్ది చెప్పుకొని పడుకున్నా. ‘కొన్ని బాధల బయటకి వచ్చాకే మనసు తేలికవుతుంది.’
***
ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి మళ్లీ బైక్ స్టార్ట్ చేశాను. అది తిరుగుప్రయాణం మాత్రమే కాదు, నాలో మార్పులకు నాంది.
ఇంకా నిద్ర సరిగ్గా లేక నా కళ్ళు బరువుగా ఉన్నాయి. మనసు ఇంకా భారంగా ఉంది. బైక్ నడుపుతున్నాను. ఆలోచనలు ఎక్కడికో వెళ్తున్నాయి. గుండె లోపల ఇంకా బాధ సలుపుతూనే ఉంది. ఆ ఆలోచనలతోనే బైక్ ఇంకా స్పీడ్ పెంచాను. కన్నీళ్లతో కళ్లు నిండిపోయి కళ్ళ ముందు ఏదీ కనపడడం లేదు.
ఎవరో నన్ను పిలుస్తున్నట్టు అనిపించి వెనక్కి తెరిగి చూశాను. బైక్ ఒక్కసారిగా ఎదురుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ మీదకు వెళ్లి కంట్రోల్ తప్పి ఎగిరి కిందపడింది. నేను రోడ్డుపై పడిపోయాను. కుడిచెవి దగ్గర, ముక్కు నుంచి రక్తం కారుతోంది.
ఒంటికి నొప్పి తెలుస్తున్నా, మనసు మాత్రం ఇంకా స్పర్శ తెలియనట్టుగానే ఉండిపోయింది. అప్పుడే ఒక కుటుంబం నా దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చింది.
“ఏమైంది బాబూ? అంత స్పీడేంటి? ముందు స్పీడ్ బ్రేకర్ ఉందని అరుస్తున్నా నువ్ వినిపించుకోలేదు” అని ఆందోళనగా అడిగారు. రక్తం కారుతుండటంతో వాటర్ బాటిల్ తీసుకొచ్చారు. మెల్లగా లేచి, ఆ నీళ్లతో ముఖం కడుక్కొని నీళ్లు తాగాను.
ఇంకా చెవి నుంచి రక్తం వస్తుండటంతో వారిలో ఒక చిన్నపాప నన్ను చూస్తూ, తన చేతిలో ఉన్న హ్యాండ్ కర్చీఫ్ ముందుకు చాపింది. “బ్లడ్ వస్తోంది. ఈ కర్చీఫ్‌తో తుడుచుకో” అని అమాయకంగా చెప్పింది.
ఆ చిన్న సాయం, అమాయకత్వం చూసి ఆశ్చర్యమేసింది. అది కేవలం హ్యాండ్ కర్చీఫ్ కాదు. నా గుండెకి తాకిన ఒక మృదువైన స్పర్శ. తన మాటల్లో నా మీద చూపించిన ఆ ప్రేమ చూస్తుంటే, ఆషూ నాపైన చూపించిన ప్రేమ గుర్తొచ్చింది.
తన జ్ఞాపకం మళ్లీ నా ముందుకొచ్చింది. కానీ ఈసారి బాధ లేదు. ‘మనం ప్రేమించిన మనిషి మన జీవితంలో లేకపోయినా, తన ఉనికి పూర్తిగా మాయమవదు’ అని అర్థమైంది. ప్రేమ మనకు మరో రూపంలో వస్తుంది. మరో మనిషి ద్వారా మనకు అందుతుంది. ఆ రోజు నేను ఆ విషయం అర్థం చేసుకున్నాను.
ఆషూ ఇప్పుడు నా జీవితంలో లేకపోయినా తను చూపించిన ప్రేమ, తనతో గడిపిన క్షణాలు అన్నీ సజీవంగా నా లోపలున్నాయి. అవి నన్ను ముందుకు నడిపిస్తాయి. నేను బాధతో ఆగిపోకూడదు, ధైర్యంగా ముందుకు వెళ్లాలి. తన జ్ఞాపకాలను హృదయంలో పెట్టుకుని, ఆ ప్రేమను నా బలంగా మార్చుకోవాలి. ఆమె ఉనికిని కొత్త రూపంలో స్వీకరించి, ఆ జ్ఞాపకాలతో ముందుకు సాగాలి. ప్రేమ ఎప్పటికీ ముగిసిపోదు. అది రూపం మార్చుకుంటుంది.
ఆ పాప ఇచ్చిన కర్చీఫ్‌ని ప్రేమగా తీసుకున్నాను. వాళ్లకి ‘థ్యాంక్స్’ చెప్పి నిదానంగా నా బైక్ ఎక్కాను. ఇంక జీవితంలో వెనక్కి చూసే అవసరం లేదు. నా ప్రయాణం ముందుకే అని నిశ్చయించుకున్నాను.
***
హర్రర్ జాన్రాలో నవల రాస్తున్నా!
- హాయ్ భరత్! మీ గురించి చెప్పండి.
హాయ్! మాది మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం. నేను పుట్టి పెరిగింది అక్కడే. ఇంజినీరింగ్ చేసి, ఆ తర్వాత ఎంబీఏ చేశాను. ప్రస్తుతం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో బ్యాంకింగ్ విభాగంలో కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగం చేస్తున్నాను.
- చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే అలవాటుండేదా?
చిన్నప్పుడు ఓసారి నాకు చికెన్ పాక్స్ వచ్చింది. 15 రోజులు ఇంట్లో నుంచి బయటికి వెళ్లే వీలు లేదు. ఆ టైంలో స్కూల్ పుస్తకాలు చదవాలని అనిపించలేదు. వేరే పుస్తకాలేమైనా చదువుతానని మా నాన్నతో అంటే, ఆయన లైబ్రరీకి వెళ్లి పిల్లల కథల పుస్తకాలు తీసుకొచ్చారు. అవి చదువుతూ ఇంట్లో ఉన్నాను. అలా పుస్తకాలు చదవడం అలవాటైంది. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లినప్పుడు కోఠిలో పుస్తకాలు కొనేవాణ్ని. పాత పుస్తకాలు అక్కడుంటే ఎవరో కొని బజ్జీల పొట్లానికి వాడతారేమోనని, వాటిని కొని భద్రంగా దాచుకునేవాణ్ని.
- కథ రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్‌కి కథలు చెప్పేవాణ్ని. వాళ్లు షార్ట్ ఫిల్మ్ తీయాలనుకొని, నాకొక కథ చెప్పి డైలాగ్స్ రాసివ్వమన్నారు. అలా ‘రివెంజ్’ అనే పేరుతో 50 పేజీల స్క్రిప్ట్ రాశాను. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ ప్రయత్నం ట్రైలర్ వరకే ఆగిపోయింది. ఆ తర్వాత మరో ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ కోసం నన్ను కథ అడిగి తీసుకున్నాడు. కానీ నేననుకున్నట్టు ఆ షార్ట్ ఫిల్మ్ రాలేదు. డిసప్పాయింట్ అయ్యాను. ఇదంతా 2018 నాటి మాట. ఆ తర్వాత ఇప్పటివరకూ ఏమీ రాయలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ఈ కథ రాశాను.
- ‘నా జీవితంలో ఆమె కథ’కు నేపథ్యం ఏమిటి?
ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉంటాయి. కొన్ని బయటికొస్తాయి, కొన్ని బయటకు రావు. ప్రేమలో ఓడిపోయినా కుంగిపోయి, అక్కడే ఆగిపోకుండా జీవితంలో ముందుకు సాగిపోవాలన్న ఆలోచనతోనే ఈ కథ రాశాను. నిజానికి ఈ కథ రాయాలని 2021లోనే అనుకున్నాను. కానీ కథలెలా రాయాలో అప్పటికి నాకు తెలియదు. ఈ మధ్య ‘జిందగీ’ అనే కథాసంపుటిలో ఇమ్మానియేల్ రాసిన ‘తార’ అనే కథ చదివాను. అది చదివాక కథ రాయడంపై కొంత అవగాహన వచ్చింది. ఆ తర్వాత ఈ కథ రాశాను.
- ముందు ముందు ఎలాంటి రచనలు చేయాలనుకుంటున్నారు?
నాకు హర్రర్ జాన్రా అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ఆ జాన్రాలో ఓ నవల రాస్తున్నాను.
*








This story is a beautiful reminder that even when we are drowning in our own tears, life finds a way to reach out to us. That moment with the little girl offering her handkerchief was so symbolic—it’s like the universe saying that love always finds its way back to us, even through a stranger. It’s hard to let go of the ‘what ifs,’ but carrying those memories as strength rather than a burden is the greatest tribute to a lost love. Beautifully written🧿💛.