చిన్నదో పెద్దదో తెర కవ్విస్తూనే ఉంటుంది
తెరిచిన పుస్తకాన్ని మూసి చెంతకు చేరమని
కళ్ళు, చెవులు తన కప్పగిస్తే చాలు
తను వినియోగించే పరిమితమైన శక్తినే
కాంతిగా, శబ్దంగా
వివిధ రంగుల విచిత్ర సమ్మేళనంగా మార్చి
కన్ను పోల్చుకోలేని మిలియన్ల చుక్కలతో
వాస్తవిక, అవాస్తవిక లోకాలను
అలవోకగా దృశ్యమానం చేస్తానని.
మూసిన పుస్తకం మూగ భాషలో వాగ్దానం చేస్తుంది
తెరిచి చదివితే చాలు
రెక్కల్లా రెపరెపలాడే పేజీలతో
ఎక్కడికో తీసుకుపోతానని
పదాలను మెట్లుగా పరిచి
ఉన్నత శిఖరాలకు చేరుస్తానని
వాస్తవిక, అవాస్తవిక, అధివాస్తవిక ప్రపంచాలను
నీ మనోయవనిక మీదే ఆవిష్కరించుకొని
నువ్వు మాత్రమే చూడగలిగే
అద్భుతమైన అనుభవాన్ని అందిస్తానని.
ఎటూ తేల్చుకోలేని తరం
లోలకంలా అటు ఇటు ఊగుతుంది
బయటి తెర నుండి బయటపడి
లోపలి తెరనాశ్రయించటానికి
ఎందుకో సందేహిస్తుంది..
*








Add comment