రాజు జీవించె రాతి విగ్రహములందు – సుకవి జీవించె ప్రజల నాల్కలయందు. ‘కలల సందుక’ కవిత్వ సంపుటి చూసిన వెంటనే నాకు కలిగిన అనుభూతి ఇది. హైదరాబాద్ కవుల వేదిక నిర్వహిస్తున్న ఏనుగు నరసింహారెడ్డి కీ.శే. మండల స్వామి , గజ్జెల రామకృష్ణ మొదలగు కవులను, రచయితలను ప్రోత్సహించి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేయడానికి దోహదపడ్డారు. ఒక కవి తాను రాయడమే కాకుండా రాస్తున్నవారిని ప్రోత్సహించడం కూడా గొప్పది.
నిజానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం జరుగుతున్నప్పుడు మన తెలంగాణ కవులు, రచయితలు పట్టుమని పదిమంది కూడా మనకు తెలియని పరిస్థితి. ఈ స్థితి మనందరికీ అనుభవంలోనిదే. ఈ విషమ పరిస్థితుల్లో మట్టిలో మాణిక్యాల్లాంటి మన కవులను, రచయితలను వెలికి తీయడానికి తెలంగాణ సాహిత్యలోకం పెద్ద యజ్ఞమే చేయాల్సి వచ్చింది. వర్తమానంలో మండల స్వామి సాహిత్య విషయంలో ఈ పరిస్థితి రాకుండా ముందుచూపుతో కృషిచేసిన, చేస్తూ ఈ బాధ్యతను భుజానికెత్తుకున్న ఏనుగు నరసింహారెడ్డి , సృజన సాహితీ బాధ్యులు సాగర్ల సత్తయ్య , పెరుమాళ్ళ ఆనంద్ అభినందనీయులు.
ఈ కవిత్వంలో ఉండేలు దెబ్బల సలపరింత ఉంది. ఆత్మగౌరవ పోరాటమూ ఉంది. రేపటిని శాసించే వెలుగు సంతకం కావాలనే ఆశ కూడా ఉన్నది. మండల స్వామి తన సామాజిక నేపథ్యంలోంచి రాసిన కవిత “కిరాయింటికై గిరికీలు కొట్టే / దళిత రింగన్నల ముఖాలపై / కులకూట విషాన్ని చిమ్మే / విశాల హృదయ గుమ్మాలెన్నో” కులం పిచ్చి కుక్కలా తరుముతుంటే వ్యంగ్యంతో కూడిన నిరసన కవిత్వమైపోతాడు. ” పుల్లల పిల్లల బలగాన్ని / పుల్లవిరుపు మాటలొద్దు” అని మన భుజం తట్టి మరీ చెప్తున్న కవితలో మురికిని, చెత్తాచెదారాన్ని ఊడుస్తున్న చీపురు కట్ట మీద మన దృష్టిని సరి చేస్తున్నాడు. పట్టణీకరణ కొండచిలువై పల్లెలను మింగేస్తున్న సందర్భంలో మేఘ మథనమా ? మేధో మథనమా ?? ఏం చేయాలో చెప్పండి అని ఈ వ్యవస్థను నిలదీస్తున్నాడు. మీ క్షేమంకై ఎప్పుడైనా దండేత్తే దండకారణ్యాన్ని కానీ “మీ బహుముఖ ప్రజ్ఞతో / నా మూలాలను నాశనం చేస్తున్నారు” మన హృదయాల్లో పత్రహరితాన్ని ధ్వనింపచేసే కవిత.
ఈ సంకలనంలోని ‘చమట సుక్క’ కవిత చదువుతుంటే శ్రీశ్రీ మహాప్రస్థానం లోని “ప్రతిజ్ఞ” కవిత “సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు” గుర్తుకొస్తుంది. ఎందుకంటే అన్ని కుల వృత్తుల సాధక బాధకాలను ఈ కవితలో మండల స్వామి ఏకరువు పెట్టాడు. తమ స్వేదానికి వెల తక్కువైన మేర, మంగళి, మేస్త్రి, చాకలి, గౌడ, కూలీ, లారీ డ్రైవర్ మొదలగు కుల వృత్తుల; ఉపాధుల శ్రమ బేలగా బెంగటిల్లుతూ , ఆశతో అంగలారుస్తున్న ఆకలి పోరాటం ఈ కవిత్వంలో ఉన్నది.
పాఠశాల విద్యార్థుల మీద జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో రాసిన కవిత ‘మరుభూమి’. ఈ కవితలో
“కోట్లాది కలల సంతకాలు / కలవరపడిన నల్లబల్లలు /కకావికలమైన పలకలు / శాంతి వనంపై / విష సర్పాలు చిమ్మిన / నెత్తుటి ప్రవాహం / ఎదురీదలేని పచ్చి గుడ్లను / కరిగేసుకున్న మరుభూమి / బలపాల మీద బ్రహ్మాస్త్రాలు / బండల మీద సరికొత్త యుద్ధమేఘాలు !” ఈ కవిత చితికిన బాల్యపు డాక్యుమెంటరీ. పసి ప్రాయాలపై జరుగుతున్న కీచక పర్వాలకు విలవిల్లాడుతూ ఒడుపుతో ఉక్కు పిడికిళ్ళు ఎత్తి అభ్యుదయ గర్జన చేసిన కవిత్వం ఇది. అబలలు ఆయుధాలై అవతరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాడు.
ఆకాశ హర్మ్యాలు నిర్మించినప్పటికీ జానెడు జాగకు నోచుకోని అజ్ఞాత కూలీలను అమావాస్య చంద్రుడితో పోల్చి బాధపడతాడు కవి. త్యాగమటే అది గొప్పగా చెప్పుకునేది కాదు ప్రగతి పత్రమై, బుద్ధుడి జ్ఞాన రూపమై దానంతట అదే వెలిగిపోవాలి. ‘రంగుల లోకంలో ఏ రంగంటని / తెల్లపావురాలెగరేయాలి ‘ వెంటాడుతున్న రంగుల మాయాలోకాన్ని అధిగమించినప్పుడే మనం త్యాగాలకు చిరునామాలవుతం అంటున్నాడు కవి. ఆర్థిక గాళాలకు చిక్కి ఆగమవుతున్న ఈ ఆధునిక మానవుల గురించి రాస్తూ “అసూయ అడ్డు గోడలు దాటి / మానవ చౌరస్తాకి చేరువై / త్యాగ చరిత్రను తడిమేదెన్నడో” అంటూ ఆందోళన చెందుతున్నాడు.
జాతీయ రహదారులపై రాసిన కవితలో “పట్టణాల పరామర్శ నుండి /పల్లెలకు ప్రణమిల్లే దాకా /జీవనదుల వలె / ట్రాఫిక్ ను అవిశ్రాంతంగా మోసుకెళ్ళే బంగారు బాటను ” ఆ బాట మీదుగా ఈ కవిత్వ రైడ్ చేస్తున్నాడు కవి. శ్రామిక ఇంజనీరు, గుండు ధారమయిన తండ్రి జ్ఞాపకాల కలల సందుకలోని శ్రమ కేతనాన్ని తెలుగు సాహిత్య రహదారిపై ఎగరేసిన మండల స్వామి దృష్టిలో కవిత్వం అంటే నిత్య చైతన్య ప్రవాహిక. ఒక చల్లని ఓదార్పు. స్వస్థత చేకూర్చే చింతనా కేదారం. ఈ కలల సందుకలోని కవిత్వం కూడా ఈ కొలమానంతోటే నడిచింది. మండల స్వామి కవిత్వ భాషలో చెప్పాలంటే ఈ కవితా సంపుటి భావాల తొలకరులను పీల్చేసిన ముత్యపు చిప్ప.
మండల స్వామి ఆనంద సాగరాన్ని పూర్తిగా ఈదకుండానే కనుమరుగైన కవి. మధుర స్వప్నాల మధ్యలో దిగ్గున లేచి దివికేగిన రవి. నదులు, పొలాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సాహిత్య పుణ్యక్షేత్రాల మీదుగా మండల స్వామి రాసుకున్న రక్తసంబంధ భద్ర గీతం మధ్యలోనే ఆగిపోయిన విషాదం. ఈ ‘కలల సందుక’ కవి మండల స్వామి ఈరోజు భౌతికంగా మన మధ్య లేరు. కానీ ఒక కథా రచయితగా, ఒక కవిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా గ్రామ నామాల పీహెచ్ డీ పరిశోధన విద్యార్థిగా ఎప్పుడూ మనతోటే ఉంటాడు. మనలోనే ఉన్నాడు.
ప్రతులకు : పెరుమాళ్ళ ఆనంద్ – 9985389506
వెల : రూ.100/- పేజీలు: 86.








Add comment