శిశిరగీతి

నిద్రించని నగరానికి ముప్పై అంతస్తుల ఎత్తున ఉన్న ఎపార్టుమెంట్ బాల్కనీలో కూర్చుని కళ్ళు మూసుకుని ఆలోచనల కొలనులో ఒంటరిగా ఈదుతున్నాడు మానవ్. అది న్యూయార్క్ Manhattan అప్పర్ ఈస్ట్ సైడ్ ఫిఫ్త్ ఏవెన్యూలో ఖరీదైన అపార్టుమెంట్. వీధిలో కదలాడుతున్న వాహనాల చప్పుడు అపశృతుల సంగీత కచేరీలాగా, అవ్యవస్థితంగా కొట్టుకుంటున్న గుండెచప్పుడులాగా ఉంది. అతని వెనకాల గది సన్నని, గోమేధికంరంగు దీపకాంతిలో, ప్రియురాలి వెచ్చని హస్తస్పర్శలాగ ప్రశాంతంగా ఉంది. ఆ గదిలోని సోఫాలో నిశ్శబ్దంగా కూర్చున్న శిశిర నెమ్మదిగా లేచి అరలో ఉన్న మెత్తటి కాశ్మీర్ శాలువా తీసింది. బాల్కనీలో కూర్చున్న మానవ్ భుజాలమీద కప్పింది. తన సున్నితమైన వేళ్ళు మృదువుగాఅతని వీపుమీద తగిలిస్తూ, “నేనున్నాను నేస్తమా!” అన్నట్టుగా వెన్ను నిమిరింది.

నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసన్నట్టుగా అతని ముఖంలోకి చూస్తూ, నువ్వు ఏం చెయ్యమంటే అది చెయ్యటానికి సిద్ధంగా ఉన్నానన్న భావం ముఖంలో చూపిస్తూ స్థిరంగా నిల్చుంది శిశిర. మానవ్ ఏదో అనబోయి కాస్త సంకోచిస్తున్నట్టుగా అనిపించటంతో “ఆకాంక్ష గురించి ఆలోచిస్తున్నావు కదూ! ఆమెను నువ్వు మర్చిపోతే తప్ప నీకు ప్రశాంతత దొరకదేమో మానవ్” అంది. “ఆకాంక్షని మర్చిపోవటం కోసమని నిన్నేవిధంగా సుఖపెట్టగలనో నువ్వు అడుగు. అది చెయ్యటానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని నీకు తెలుసును” అంటూ నెమ్మదిగా అతని ప్రక్కన కుర్చీలో కూర్చోటానికి దగ్గరకి వచ్చింది.

“ఇవ్వాళ ఆఫీసు నుంచి వస్తుంటే దారిలో సెంట్రల్ పార్కు దగ్గర ఆకాంక్ష కనిపించింది” మానవ్ అన్నాడు.

“ఓ అలాగా !” శిశిర ఆశ్చర్యపోతూ – “చాలా కాలం అయ్యాక కనిపించింది కదూ! తనని చూసి నాలుగు సంవత్సరాల రెండు నెలల పదిరోజులయ్యింది కదూ? ఒక్కతే ఉందా లేక వేరెవరితోనైనా ఉందా? ” ప్రక్కన కూర్చుని, అతని చెయ్యి పట్టుకుని మృదువుగా నొక్కి అడిగింది.

అలవాటైన శిశిర మాటల్లోని ఖచ్చితత్వానికి ఆశ్చర్యపడలేదు మానవ్. “అవును, తను నన్ను విడిచి వెళ్ళిపోయిన తరవాత ఇదే మొదటి సారి చూడటం” అన్నాడు.

“ఆమె ఎలా ఉంది? ఒక్కతె ఉందా? లేక ఎవరితోనైనా ఉందా?” అని మళ్ళీ అడగబోయి, మానవ్ ని ఊదరకొట్టకూడదని మౌనంగా అతని ముఖంలోకి చూస్తూ “నువ్వు చెబితే వినటానికి నేనున్నా”నన్నట్టుగా చెక్కిలి మీద చెయ్యానించుకుని చూసింది.

శిశిరలో ఉన్న ఆ పరిగణిత ప్రవర్తన అతనకి మొదట్లో నచ్చినప్పటికీ ఇప్పుడిప్పుడే అందులోని యాంత్రికత ఇబ్బందిగా అనిపిస్తోంది మానవ్ కి. “తనకిప్పుడు మళ్ళీ పెళ్ళయిందనుకుంటా. ఇద్దరు కవలలు కూడా పుట్టినట్టున్నారు. ఒక పాప, ఒక బాబు. సుమారు రెండేళ్ళుంటాయి పిల్లలకి. ఆమె పోలికలే పిల్లలకి. ఆమె భర్తతో చాలా సంతోషంగా ఉందనుకుంటా!” గుండెల్లో కాస్తంత నిరాశ, గొంతులో కాస్తంత విసుగు పైకి కన్పించకుండా ఆపలేకపోయాడు.

శిశిరకి అన్నీ తెలుసును – పిల్లలకి రెండేళ్ళ మూడు నెలల, ఏడు రోజులు. భర్త పేరు ఆనంద్. వాళ్ళు ఆల్బనీలో ఉంటారు. అతను NYUలో అస్సొసియేట్ ప్రొఫెసర్. ఆకాంక్ష కూడా అక్కడే ఆస్ట్రోఫిసిక్స్ లో అస్సొసియేట్ ప్రొఫెసర్ గా చేస్తోంది. మానవ్ తో తను ఈ అపార్టుమెంట్ కి వచ్చిన వెంటనే అవన్నీ తను తెలుసుకుంది. మానవ్ ని సుఖపెట్టటం మాత్రమే తన ముఖ్యమైన బాధ్యత. అందుకే ఆకాంక్ష గురించిన ఎన్నో విషయాలు సేకరించింది.  తను నేర్చుకున్న విషయాలని మానవ్ ని సంతోషపెట్టటానికి తను ఎలాగ ప్రవర్తించాలి అన్న విషయం నేర్చుకోవటం కోసమే ఉపయోగించుకుంటోంది.

ఆకాంక్షతో విడిపోవడానికి దారితీసిన కొన్ని సంఘటనలను మానవ్ గుర్తు చేసుకున్నాడు. ఎన్నడో చదివిన కథలోని సన్నివేశాలు స్పష్టంగా మెదిలినట్టుగా వెంటవెంటనే గుర్తుకొచ్చాయి. ఒకరోజు మానవ్ పని నుండీ వచ్చేసరికి రోజూకంటే ఎక్కువ ఆలస్యం అయింది. ఆకాంక్ష తమ ఇద్దరికీ భోజనం సిద్ధంచేసి, ఎదురుచూస్తోంది.  ఇలాగ మానవ్ పని నుంచి ఆలస్యంగా రావటం, ఆకాంక్ష రిసెర్చ్ లో మునిగి యూనివర్సిటీనుంచి ఆలస్యంగా రావటం వారిద్దరికీ అలవాటే. కానీ ఆ రోజు ప్రత్యేకమైన రోజని ముందుగానే  మానవ్ కి గుర్తు చేసింది ఆకాంక్ష.  ఆరోజుకి సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరూ కలిసి ఉందామని నిర్ణయించుకున్న రోజు. కలిసి ఉంటున్నారన్న మాటే కానీ ఇద్దరూ ఎవరి లోకాల్లో వారు తీరికలేకుండా ఉంటారు. ఇద్దరూ వాళ్ళ కెరీర్ ముఖ్యం అని భావిస్తున్నారు. ఈ రోజుల్లో చాలా జంటల్లాగే ఒకరి మీద ఒకరు, ఆర్ధికంగా ఆధారపడి లేరు. ఆర్ధిక ఆధారత్వం ఒక్కటే ఇద్దరి మనుషులని దగ్గరకు తీసుకుని రావలసిన రోజులెప్పుడో గతించాయని ఇద్దరికీ తెలుసును. కనీసం ఇలాంటి ప్రత్యేకమైన రోజులలోనైనా కలిసి సమయం హాయిగా గడపాలనీ, యాంత్రికంగా జీవితం గడపటం తనకిష్టం ఉండదనీ ఆకాంక్ష చాలా సార్లు చెప్పింది. కొద్ది రోజుల క్రితం సంభాషణ ఇలా జరిగింది.

నాకు పిల్లలంటే చాలా ఇష్ఠం అని చాలా సార్లు నీకు చెప్పాను మానవ్.

అవును ఆకాంక్షా, కానీ ఇప్పుడే వద్దు కొంత కాలం అయ్యాక ఆలోచిద్దాం.

మనకు పుట్టిన పిల్లలే కానక్కరలేదు, పోనీ చిన్నపిల్లలెవరినైనా పెంచుకుందామా?

దానికి చాలా రూల్స్, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ లీగల్ తలకాయ నొప్పంతా భరించటం నా వల్ల కాదు.

మన మధ్యనున్న స్నేహం, సాన్నిహిత్యం, స్పర్శ, పలుకరింతలతో పాటుగా procreation అతిముఖ్యమైన అంశం. మానవ్. అంతా యాంత్రికంగా మారిపోతున్న సమాజంలో మరమనుషులకీ, మనకీ తేడా ఆ ఒక్కటే.

మానవ్ మౌనం.

మనపిల్లలు అన్న భావన చాలా లోతైనది మానవ్.

కాలం మారిపోతోంది ఆకాంక్షా. దానితోపాటు మనం కూడా మారాలి.

పార్కుల్లోనూ, వృద్ధాశ్రమాలలోనూ కనిపించే ముసలివాళ్ళని చూస్తున్నప్పుడు, మనం కూడా అలా అయిపోతామేమోనని నాకు భయం మానవ్.

దానికీ పిల్లలకీ సంబంధం ఏమిటి?

అది జరగకుండా ఉండాలంటే మన జీవనవిధానం మార్చుకోవాలి. మనం పిల్లల్ని, కని, పెంచి బాధ్యతగల చక్కటి ప్రపంచపౌరులుగా తీర్చిదిద్దితే, వాళ్ళు మనల్ని వృద్ధాప్యంలో కనీసం పలకరించటానికైనా, అప్పుడప్పుడూ చూడటానికైనా వస్తారేమోనని ఆశ.

దాంట్లో ఏమీ గారెంటీ లేదు అదంతా వట్ఠి పాతకాలపు భావన. ఇంకొక మనిషి మనల్ని చూస్తాడని అనుకోవటం మన భ్రమే.

జీవితంలో గారెంటీ దేనికీ లేదు, మానవప్రయత్నం మనం చెయాలి. పరీక్ష పాసవ్వటం గారెంటీ లేదని exam తీసుకోవటం మానేస్తామా?

ఐనా పిల్లల్ని పెంచటం ఇప్పుడే కాదు, నా కెరీర్ లో ఇంకొన్ని మెట్లు పైకెక్కితే కానీ పిల్లలమీద  సమయం వెచ్చించలేను. నువ్వు కూడా Astrophysics లో రీసెర్చ్ చేస్తున్నావు కదా. అది ఓ స్టేజికి రానీ.

సముద్ర కెరటాలు తగ్గేవరకూ స్నానం చెయ్యటం ఆపుకుంటే ఇక నాకు మెనోపాస్ సమయం వచ్చేస్తుంది.

నువ్వు మరీ exaggerate చేస్తున్నావు. ఐనా ఇప్పుడు కాదని చెప్పానుకదా..

మరింకెప్పుడు?

ఏమో తెలియదు!

వారి ఆలోచనల్లోని ఆ తేడాయే వారిద్దరి మధ్యా దూరాన్ని కలగజేస్తోంది. ఇంక ఇవ్వాళ మానవ్ ఇంటికి వచ్చాక ఆ టాపిక్ మీదే డిస్కస్ చెయ్యాలని ఎదురుచూస్తోంది. నిజానికి గత రెండు నెలలుగా మంచి అవకాశంకోసమని ఎదురుచూస్తూనే ఉంది. ఏ రోజూ కుదరటంలేదు.  పిల్లల విషయంతో పాటుగా, తమ యిద్దరిమధ్యా పెరుగుతున్న అనాసక్తి గురించి ఆ రోజు మానవ్ తో మాట్లడదామనుకుంది. కానీ మానవ్ చాలా ఆలస్యంగా అలిసిపోయి ఇంటికి వచ్చాడు. అందుకని, ఆ రాత్రి మౌనంగా, ఉదాసీనంగా పలుకరించి ఆట్టే మాట్లాడలేదు. అది వారాంతమే కావటంతో మర్నాడు ఉదయం కాఫీ, బ్రేక్ ఫాస్ట్ అయ్యాక నెమ్మదిగా సంభాషణ మొదలుపెట్టింది. ఆ సంభాషణ మొదలౌతూనే తప్పుదారి పట్టింది. వెయ్యి అడుగుల ప్రయాణంలో మొదటి అడుగులోనే కాలి మడమ బెణికినట్టయ్యింది. మాటలలో డిస్క్రీషన్ కన్నా డెసిబల్స్ ఎక్కువైపోయాయి. ఫలితంగా పక్షి ఎగిరిపోయింది.

ఆ ఒక్క సంఘటన వలన తాము విడిపోలేదు, అది కొంత కాలంగా కొనసాగిన తన నిర్లక్ష్యం అయిఉండవచ్చును. తాను రాబోయేకాలం గురించి సరైన అవగాహన పెంచుకోక, తాత్కాలికంగా  వర్తమానకాలంలో బతికేయటమే ఆకాంక్ష తనని విడిచి వెళ్ళిపోటానికి కారణమని అతనికి అర్థమయ్యింది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అదే అతని మానసిక క్షోభకి కారణం.

ఆకాంక్ష తనని వదిలి వెళ్ళిపోయిన తరవాత కొద్ది నెలలకి ఒంటరితనం ఏమిటో తెలిసివచ్చింది. దగ్గరవాళ్ళని కోల్పోయినప్పుడే వారి సాన్నిధ్యంలోని విలువ, వారి మాటలలోని మాన్యత  తెలిసివస్తుంది. కానీ అప్పటికే ప్రాణ నేస్తం పచ్చిక బయళ్ళు వెదుక్కుంటూ  గూడు వదిలిపోయింది. అప్పుడు తన  ఆఫీసులో కొలీగ్ ఒకతను చెప్పిన సలహా మీదట తన ఇష్టాయిష్టాలకి అన్నివిధాలా సరిపడే శిశిరతో కలిసి ఉండటం మొదలుపెట్టాడు.

శిశిర ఎంత విధేయతగా, ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ, మానవ్ మనసులో ఇంకా అసంతృప్తి, ఒంటరితనం పోలేదు. ఎప్పుడూ క్రిక్కిరిసిన జనసమ్మర్దంతో హడావిడిగా ఉండే ఆ నగరంలో కూడా అతనిని విడవని ఒంటరితనం, మ్యుటేట్ అయిన రోగంలాగ పీడిస్తోంది.

శిశిర స్పర్శలో ఉష్ణోగ్రత సరిగానే ఉన్నప్పటికీ, ఆకాంక్ష తనని పరవశంతో స్పృశించినపుడు కలిగిన వెచ్చని అనుభూతి కలగటంలేదు. శిశిరతో తన కోరికలన్నీ తీరుతున్నప్పటికీ, ఆకాంక్షతో అయినప్పుడులా తన శరీరంలోని తాపం చల్లారటంలేదు. తను కోపగించుకుంటే, శిశిర ఎదురు సమాధానం చెప్పకుండా తలవంచుకుని సారీ చెప్పినప్పటికీ అతని మనసులోని అలజడి తగ్గటంలేదు. శిశిర లో తప్పుపట్టటానికి ఏమీలేనప్పటికీ అతనిలో ఏదో తీరని లోటు. శిశిర, మానవ్ ల మధ్య ఉన్నది ప్రేమా,  అవసరాలకోసం కలిగిన అలవాటా? లేక వాటికన్నిటికీ అతీతమైన మానవ పరిణామ దశా?

ఒకవైపు ఆకాంక్ష గుర్తుకొస్తుండగా, శిశిరకి దగ్గరగా చేరి ఆమెను హత్తుకుని, మెడ మీద తన పెదవులానించబోయాడు. శిశిర చెవి వెనకాతల చిన్న LED దీపం అప్పుడే ఆకుపచ్చరంగు నుంచి, నారింజ రంగులోకి మారింది. అకస్మాత్తుగా ఆలోచనల ఉప్పెన పెల్లుబికింది. తన జీవిత భాగస్వామి ఒక Humanoid, తన ఇష్టాయిష్టాలకి తగ్గట్టుగా ప్రోగ్రామ్ చేయబడిన ఒక ప్రతిధ్వని, ఒక ఘనీభవించిన ఉదాసీనత, ఒక ఖాళీపాత్ర, తాను ఆన్ లైనులో ఆర్డరు చేసిన అప్లయన్స్.  అంతే కానీ, తనని సహజంగా అభిలషించే ఆకాంక్ష కాదనీ, తనని ప్రతిఘటించే ప్రతిస్పందన కాదనీ, నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉన్న చైతన్యం కాదనీ, రుధిరస్వేదాశ్రువులున్న ఆలోచనల ఆకృతి కాదనీ ఒక్కసారిగా గుర్తువచ్చింది.

అంతే హఠాత్తుగా పెల్లుబికిన ఒళ్ళు తెలియని కోపంలో, ఔచిత్యమెరుగని ఆవేశంలో శిశిర మెడ మెలిదిప్పాడు మానవ్. ఆమె మెడభాగంలో ఉన్న లోహం ముక్కలు కొన్ని, ప్లాస్టిక్ మరలు కొన్ని విరిగి నేలమీద పడ్డాయి. మంచుముక్కలు విరిగినప్పుడు వచ్చే శబ్దంలాంటి ఒక వింతశబ్దం ఆ గదిలోవ్యాపించింది. శిశిర ముఖంలో కొంత అవమానం, కొంత జాలి మిశ్రితమై, జీరపోయిన ఎలెక్ట్రానిక్ వాయిస్ తో అంది –

“నువ్వు కూడా నాలాగే లోపల విరిగి ఉన్నావు, నీకూ నాకూ తేడా ఏమిటి – ఇక నువ్వు మానవుడిగా ఉండటంలో అర్ధం ఏముంది? ఐనా నన్నేం చేసినా ప్రతిఘటించలేననేగా నీ –? నువ్వొక — …” మాటలు బ్రేక్ అవుతూ, వాక్యం పూర్తవకుండానే శిశిర చెవి వెనుకనున్న LED ఆరిపోయింది.

*

ఓరుగంటి వేణుగోపాల కృష్ణ

వేణుగోపాల కృష్ణ ఓరుగంటి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు