మరణం చివరి బిందువు కాదు

రణం చివరి బిందువు కాదు—
ఒక వాక్యం పూర్తయ్యే చోట,
మరో అర్థం మొదలవుతుంది.

 

ఇరాన్‌లో మరణం చివరి బిందువు కాదు—
ఒక గుండె ఆగిన క్షణంలో
వేల గుండెల్లో రగిలే అగ్ని కణం.

 

షహీద్ అనేది
చనిపోయిన శరీరం కాదు,
మనతో కలిసి బతికే జ్ఞాపకం.

 

పోరాటంలో రక్తం వృథా కాదు
నేలతో కలసి
దావానలంలా ఎగసిపడుతుంది.

ప్రాణం వృథా కాదు—
గాలిలో కలసి
సీముర్గ్‌లా[i] మళ్లీ లేస్తుంది.

 

మరణం ఇక్కడ భయం కాదు—
ఒక ప్రతిజ్ఞ.

 

మరణం ఇక్కడ విరమణ కాదు—
“న్యాయం కోసం జీవించాం,
అదే న్యాయం కోసం మరణించాం”
ఒక సాక్ష్యం.

 

మరణం ఇక్కడ వైఫల్యం కాదు—
మన విశ్వాసాల్లో
మళ్లీ శ్వాసగా మారుతాం—
ఒక వాగ్దానం.

ప్రతిఘటన పాటగా పుడుతుంది,
పాట తిరిగి ప్రతిఘటనగా ఎదుగుతుంది—

కవి యుద్ధమవుతాడు,
యోధుడు పద్యమవుతాడు,

ఒక మాటగా కాదు,
ఒక ఊపిరిగా.

 

ఇరాన్ గాలి—
వేదనను ఊపిరిగా మార్చింది.

 

ఇరాన్ నేల—
నిరాకరణలోనూ నాగరికతను నిలబెట్టింది.

 

ఇరాన్ జ్ఞానం—
శతాబ్దాల్ని దాటి
భవిష్యత్ తరాలకు వెలుగై నిలిచింది.

 

ఇరాన్ ఇప్పుడు—
కొత్త ప్రపంచపు యుద్ధభూమి.

 

నమ్మకం – నైపుణ్యం—
కదన రంగం – కళాత్మకం,
విరుద్ధాల్లో నిలిచిన దేశం.

 

కాఠిన్యం – కారుణ్యం—
అదే ఇరాన్.

 

ఇక్కడ పర్వతాలు—
గాయాల్ని దాచుకొని గర్జిస్తున్నాయి.

 

జాగ్రోస్[ii]
ఇరాన్ దేహం,
మడతలు మడతలుగా అల్లుకుపోయిన శిలా తరంగం.

ఇరాన్ పశ్చిమ పర్వత శ్రేణి,
ఎత్తు వొంపుల్లో ఉదయించే ప్రతిఘటన ప్రతిబింబం,
గరుకు రాళ్లలో విరబూసిన నిశ్శబ్ద సౌందర్యం,
బాంబుల విస్ఫోటనాలకూ చలించని పరిమళం.

 

ఇక్కడ సముద్రాలు—
పోరాట అలలను ఎత్తుకుని ముద్దాడుతాయి.

 

కాస్పియన్[iii]
ఇరాన్ ప్రాణం,
కాలాన్ని మోసుకుంటూ కదిలే జల తరంగం.

ఊపిరి విప్పుకున్న ఇరాన్ సముద్రం,
మృత భూమికి జీవం ఇచ్చే తడి స్పర్శ.

 

హోర్ముజ్[iv]
ఇరాన్ నాడి,

ప్రపంచ ప్రవాహానికి దారి చూపే జలసంధి.
నీలి జలాల నిగూఢ మార్గం,
ద్వీపాల నీడల నిశ్శబ్ద సంకేతం,
ఇరాన్‌కు ప్రకృతి తొడిగిన సముద్ర కవచం.

లొంగని పోరాట శిఖరం – ఇరాన్ శిరస్సు,
పగుళ్ల గుండెల్లో కూడా
పిడికిళ్లుగా ఎగిసే ఆత్మగౌరవం,
ఇరాన్‌కు మరణం లేదు.

 

వినండి—
నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ
ఇరాన్ గర్భాల్లో కదులుతున్న
కొత్త చరిత్రల కేకల్ని వినండి.

 

చూడండి—
విరిగిన శిలల నుండి
మొలకెత్తుతున్న
ఇరాన్ స్వప్నాల్ని చూడండి.

 

సలాం, సలాం—
ఇరాన్‌కు సలాం,
ఇరాన్ సహనానికి సలాం,
ఇరాన్ ధైర్యానికి సలాం.

ఇరాన్ నిలవాలి,
ఇరాన్ గెలవాలి.

 

ఇరాన్ చెప్పేది ఒకటే—
సృష్టిని విధ్వంసం ఓడించలేదు,
బాంబులు ఇరానియన్లను భయపెట్టలేవు,
జీవితాన్ని మరణం ఆపలేదు,
సత్యం ఎప్పటికీ చచ్చిపోదు.

 

ఇరాన్ చెప్పేది ఒక్కటే—
మరణం చివరి బిందువు కాదు,
మరో అర్థం—ఇప్పుడే మొదలవుతోంది.

*

 

[i] సీముర్గ్ (Simurgh)

పర్షియన్ పురాణాల్లో జ్ఞానం, పునర్జననం, మార్పుకు ప్రతీకగా నిలిచే పౌరాణిక పక్షి.

[ii] జాగ్రోస్ (Zagros Mountains)
ఇరాన్ పశ్చిమ ప్రాంతంలో విస్తరించిన ప్రాచీన పర్వత శ్రేణి. చరిత్రపరంగా ఇవి సహజ రక్షణ గోడగా నిలిచి, జీవనోపాధి, ప్రతిఘటన, సంస్కృతి వికాసానికి ఆధారంగా ఉన్నాయి.

[iii] కాస్పియన్ (Caspian Sea)
ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్భూభాగ సముద్రం. ఇరాన్ ఉత్తర భాగానికి ఆనుకుని, సస్యశ్యామల తీరాలు, జీవవైవిధ్యం, నీటి సంపదకు మూలంగా నిలుస్తుంది.

[iv] హోర్ముజ్ (Strait of Hormuz)
ఇరాన్ మరియు ఒమాన్ మధ్య ఉన్న సన్నని జలసంధి. ప్రపంచంలోని చమురు రవాణాలో కీలక మార్గంగా, అంతర్జాతీయ వాణిజ్యం మరియు భౌగోళిక రాజకీయాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం

 

Image: Marco Bruno

Lelle Suresh

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇరాన్ యుద్ధ గీతిక! చాలా బావుంది

  • మరణం ఇక్కడ వైఫల్యం కాదు,
    సముద్రాలు పోరాట అలలను ఎత్తుకుని ముద్దాడతాయి.. సూపర్ 👏బావుంది సురేష్ గారు

  • గ్రేట్ పోయెమ్.
    ఇరాన్ యుద్ధం మీద వచ్చిన కవితల్లో తాత్విక గాఢత కలిగిన కవిత.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు