Elsewhere Perhaps…

నువ్వు ఇక్కడ ఉండలేవు. వాళ్ళ వద్దకి వెళ్ళలేవు. హారిబుల్. హారర్ ఇది బహుశా. నీది కాని జీవితాన్ని నువ్వు జీవించడం.  రాత్రికి ఇంత చోటు లేకపోవడం.

You walk, and walk, and find no home at all –

                                                                          -Herman Hesse ”I know, You Walk”

చీకటిగా ఉంది. లోపల. పూర్తిగా కాదు. పల్చని వెలుతురు. కాదు, మసక వెలుతురు. దానిని ‘వెలుతురు’ అని అనాలంటే, పిలవాలంటే నీకు సంకోచం. దానికి ఒక పేరు పెట్టిన మరుక్షణమే అది తన వెలుతురునీ, తన సారాంశాన్నీ కోల్పోతుందని నీ భయం. వెలుతురు వెలుతురుగా మిగలదని, అది మరేదో అయిపోతుందని నీ ఆందోళన. నీ కన్సర్న్. కానీ తప్పదు. ఈ నామ్నీకరణ.  How to escape this naming? This business of naming? This ugly business of framing? Naming as framing … నీకు నిజంగానే తెలియదు. “చిక్కుబడి పోయారు మీరు, పేర్లలలో. కుదించుకుపోయారు అవి ఏర్పరిచే పరిమితులలో” అని నువ్వు అన్నందుకే, వాళ్లకు చెప్పినందుకే ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు. ఉన్నావా? నీకు ఖచ్చితంగా తెలియదు. You doubt it. మరి నీకేం తెలుసు? పూర్తిగా ,  ఖచ్చితంగా? ఖచ్చితంగా కాకపోయినా చూచాయగా? నీకు తెలిసినదల్లా ఇటువంటి గదులు. ఇటువంటి గోడలు. దుమ్ము పట్టి రంగు మారి వెలసిపోయిన గోడలు. వాటిపై ఎన్నడో ఎవరో చవకైన పెయింట్స్ తో వేసిన బొమ్మలు. పాలిపోయిన నీలం రంగుతో ఆ బొమ్మలు పాక్షికంగా చెరిగిపోయి … వేసిన చిత్రకారుడి అప్పటి మానసిక స్థితిని – ఉద్వేగంతో వేసి ఉంటే దానినీ నిరాసక్తంగా గీసి ఉంటే ఆ స్థితినీ, ‘బ్రతకడం’ అనే ఈ దైనందిన యంత్ర కదలికలనీ ఆ బొమ్మలు ఇప్పటికీ దాచుకుని ఉంటాయా? ప్రతిబింబిస్తాయా? అదీ తెలియదు నీకు. కానీ, ఏదో నిన్ను వాటికి ముడి వేస్తుంది. నీ లోపల ఉన్నది ఏదో వాటికి అతుక్కుపోతుంది. ఏమిటి అది? నీలో ఉన్నది? ఆ pulsating throbbing presence? నీకు తెలియదు. పేరు లేకపోతే వెలుతురు వెలుతురు అని నీకు తెలిసేదెలా? (తెలియాలా? ఎందుకు?) పేరు లేకపోతే వెలుతురు వెలుతురు అవుతుందా? మసకగా మిగిలిపోతుందా? నీకు తెలియదు!

‘బార్ లో చీకటి పడుతుంది’ అని మొదలు పెడదామని అనుకున్నావు నువ్వు ముందు. అయితే అది జరగలేదు. ‘అయిదు అవుతున్న బార్. ఆ మసక వెలుతురులో నువ్వు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు?’ అని కూడా మొదలు పెడదామని అనుకున్నావు నువ్వు ఈ అధ్యాయాన్ని. అది కూడా కాలేదు. ‘ఇక్కడికి’ – you wanted to stress on that … ‘ఇక్కడ’ అంటే ఏమిటి, ‘ఇక్కడ’ అంటే ఎక్కడ అని! అలా కూడా చేయలేదు నువ్వు. ఎందుకు అంటే you started hating such metaphors …  not even hate … Perhaps suspicion. అపనమ్మకం వంటిది ఏదో. అప్పటికి వెయిటర్ ఇంకా (మూడోసారి) నీ వద్దకి రాలేదు. మరకలతో ఉన్న టేబుల్ పై మోచేతులు ఆనించి అరచేతిలో చుబుకం ఆన్చుకుని చుట్టూ చూస్తావు – అతి పల్చగా మనుషులు. లెక్క పెడతావు. ఎడమ వైపు కార్నర్ టేబుల్ వద్ద ఇద్దరు. ఖద్దరు చొక్కా. వేళ్ళకు మూడు రింగులు. మెడలో చైన్. ఉబ్బిన ముఖం.  రియల్ ఎస్టేట్ మాటలు. ఏభై ఏళ్ళు.  అతని ఎదురుగా నలభై ఏళ్ల బక్క పల్చని మనిషి. కుడివైపున మరో మూలకి – ముగ్గురు. రెగ్యులర్ గా బార్ లో కనిపించే రెగ్యులర్ ముఖాలు. (నీకు ఏ ముఖం ఉంది? రెగ్యులర్ or ఇర్రెగులర్? అసలు నీకు ముఖం అన్నది ఉన్నదా?  ఉంటే అది ఎవరి ముఖం? నీదేనా? ) వీళ్ళు కాక చెదురు మదురుగా ఏమని పిలవాలో తెలియని వాళ్ళు: ప్లాస్టిక్ టేబుల్స్ వద్ద. వాటిపై సోడా సీసాలు. నీళ్ల బాటిల్స్. ప్లాస్టిక్ గ్లాసులు. పరచిత అపరిచిత వాసన: లోపల …

కాష్ కౌంటర్ వద్ద టీవీ వద్ద చానెల్స్ ను మాటిమాటికీ మారుస్తూ  క్యాషియర్: 26 ఏళ్ళు, బహుశా. చవక దుస్తులు. పల్చని గడ్డం. ముఖంలో ఒక రకమైన కటుత్వం.  క్రూరత్వం. నీకు ఆ ముఖం సుపరచితం. తరచూ చూసే ముఖంలాగే అనిపిస్తుంది నీకు. గుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తావు కానీ తట్టదు ఏమీ నీకు. సన్నని చికాకు మొదలవుతుంది నీలో. గుర్తుకు రానందుకు. ఎక్కడ చూసావు నువ్వు అతనిని? ఆ ముఖాన్ని? pinpoint చేయలేక అసహనం నీలో.  ‘How did he end up here?’ తటిల్లతలో నీకుఅతని గత జీవితమంతా కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుంది …  ఆ యువకుని దిగువ మధ్య తరగతి కుటుంబం. చిరుద్యోగుడైన  తండ్రి. ఇద్దరు అక్కలు. ఒక తమ్ముడు –  (పీక్కుపోయిన అతని తండ్రి ముఖం పీలగా ఉండే అతని రూపం కూడా నీకు  స్పష్టంగా కనిపించింది). అయితే, తల్లి గురించి నువ్వేమీ చెప్పలేవు. నీకేమీ స్ఫురించదు. వెంటనే. మాసిన చీర. ఆకుపచ్చని జాకెట్.  తాగి వచ్చినప్పుడు అతనితో గొడవపడి దెబ్బలు తినీ తినీ వయస్సును పదేళ్లు పెంచిన హింసతో అకాల వృద్ధ్యాప్యం వంటిది ఏదో కమ్ముకుని కుంగిన శరీరం … నిరంతరం ఏదో ఒకదాని గురించి సణుగుతూ ఉండే తన రూపం … ఆ పిల్లవాని కటువైన భావ రహిత ముఖాన్ని చూసినప్పుడు నీకు అదే స్ఫురిస్తోంది … డిగ్రీ ఫెయిల్ అయ్యి – డిగ్రీలోని ఆ మూడేళ్ళూ బజాజ్ పల్సర్ కోసం, ఐ ఫోన్ కోసం ఇంట్లో అమ్మని అడిగీ అడిగీ, అమ్మ నాన్నని అడుగు అన్నప్పుడల్లా అడగలేక ఆ కోపం అంతా ఆమె మీద పెంచుకుని కాలేజ్ లో కాలనీ లో తోటి స్నేహితులతో తిరిగి చెల్లాచెదురై, ఏ అమ్మాయి తోనో ప్రేమలో పడి విరిగి, ఉద్యోగం లేదు అన్నందుకు, ‘నువ్వు దేనికీ పనికి రావు’ అని ఆమె అన్నందుకు ఒక రకమైన అసహ్యం ఆమెపై పెంచుకుని కొట్టి బలాత్కారం చేసి తాగి ఏ అర్ధరాత్రికో ఇంటికి వస్తే అడిగిన తల్లిని చూస్తే జుగుప్స  … నిస్పృహ … విసుగు తో తల్లిని కొట్టి తండ్రితో తన్నులు తిని పడుకుని కక్కుకుని, కక్కుకునీ పడుకుని మళ్ళా లేచి జేబులో పది రూపాయలు లేక రోడ్లపై పడి తిరిగి తిరిగి, సంవత్సరాలు కరిగిపోయిన తాగి పడిపోయిన ఆ బార్ లోనే ఆ ఉద్యోగానికి కుదిరి రిమోట్ ని violent గా వాడుతూ కరకుగా waiters పై అరుస్తో … ఎట్లా వచ్చి చేరింది ఆ క్రూరత్వం అతని ముఖంలో? నువ్వు ఆలోచిస్తావు. క్రూరత్వం కూడా కాదు. నిర్లక్ష్యం? కాదు, అదేదో … something undefinable, inhuman – though the word human is contestable, though what is being human is contestable … అమానవీయమైన అనే పదం కంటే మరొక పదం నీకు తట్టదు. అతని ముఖంలోనే కాకుండా, బయట తారసపడే అనేకమంది యువకుల ముఖాలలోనూ అదే ఛాయ … hardened cruel violent shade … ‘ఇల్లు’ లేకపోవడమేనా అది? ఇల్లు అనేది దొరక్కపోవడమేనా అది? అది సరే కానీ నువ్వు ‘ఇక్కడికి’ వచ్చి ఎలా చేరావు? how did YOU end up here?

రూమి గుర్తుకు వస్తాడు నీకు. ముఖ్యంగా రెండు వాక్యాలు. ఆ క్షణంలో. క్షణంలోనే అన్నీ జరిగే వేళల్లో. క్షణంలోనే అంతా ఉన్నట్టు … తుదీ మొదలూ – మొదలయ్యి వ్యాకోచించి సంకోచించి తిరిగి మొదలయ్యిన బిందువు చెంతనే చేరి ఆ బిందువులోనే అంతం అవ్వడం … What’s THAT point that ‘you’ began? THAT point … మొదలు లేని మొదలు … సూక్ష్మమైన ఆ మొదలు … that point … how did that come about? అతి సూక్షమైన ఆ ‘నువ్వు’, ఆ బిందువు … ఎట్లా మొదలయ్యింది. రూమీనే గుర్తుకు వస్తాడు. ముఖ్యంగా ఆ క్షణంలో – అప్పుడు అక్కడ … in that moment – ఆ రెండు వాక్యాలు గుర్తుకు వస్తాయి నీకు. ప్రార్ధనలాగా నీలో నువ్వు ఆ వాక్యాల్ని మననం చేసుకుంటావు. గొణుక్కుంటావు. ఆ రెండు వాక్యాలు … I didn’t come here of my own accord, and I can’t leave that way / Whoever brought me here, will have to take me home. … వేదన ఉందా ఆ వాక్యాలలో? homelessness ఉందా? తపన? longing for something unknown? నీలో ఉన్నది ఏదో తెరలను తొలగించుకుని దానిలో అదే లీనమయ్యేందుకు పడే తపన? మంచు చేరిన కిటికీ అద్దం వెనుకగా స్పష్టంగా కనిపించే లోకం ఒకటి ఉందా? ఉంటే ఎలా తెలుసుకోవడం? ప్రతీదీ పదాల వడపోతలోంచి మాత్రమే బహిర్గతమవుతున్నప్పుడు ఎట్లా నువ్వు తెలుసుకోవడం? గుంజుతుంది ఏదో నీలోపల. తుంపర వంటిది. దిగులు తడి అంటిన తుంపర వంటిది. అలాంటిది ఏదో నీలోపల మొదలయ్యినప్పుడల్లా నీకు చింత. అది అక్కడితో ఆగదనీ … చిన్న తుంపరతో మిగిలిపోదనీ … కానీ, నువ్వేం చేయగలవు? You – who are homeless – are helpless too …You … home … homeless … homelessness! Perhaps, home is homeless …

నీకు మళ్ళా ఇల్లు గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఉన్న ఇల్లు కాదు. ఎప్పటిదో. ఎన్నో ఏళ్ల క్రితంది. నీకు నువ్వు కూడా గుర్తుకు వస్తావు … వెదురు బద్దల గేటు ముందు నిలబడి సాయంత్రం నుంచి రాత్రి దాకా సాగిన వీధిని చూస్తూ ఎదురు చూసే నువ్వు. ఎన్నేళ్లు నీకు అప్పుడు? ఎలా ఉండేవాడివి నువ్వు అప్పుడు? ఎవరి కోసం ఎదురు చూసావు నువ్వు ఆ చిన్న వయస్సులో? ఎండిన గుండెతో ఎండాకాలమైన హృదయంతో వెదురు బద్దలలో సరిగ్గా దిగని మేకు ఒకటి నీ బొటన వేలుకు గుచ్చుకుని బొటబొటా కారే రక్తంతో? ఎటువంటి నీటి చెలమ కోసం ఎదురు చూసావు? పెదాలు తడిచి గొంతు తడిచి నీలో నీళ్లు చేరి చెట్టు కింది నీడ వంటి శాంతి ఏదో నీలో చేరేందుకు ఎవరికోసం దేని కోసం ఎదురు చూసావు? వంటరిగా సాగిన పొడి వీధుల్లాంటి కళ్ళతో, నీ చేతులని గేటుపై ఉంచి, తలను కుడి అరచేతిపై వాల్చి ఎడమ వైపుకు చూస్తూ ఎవరి కోసం దేని కోసం ఎదురు చూసావు నువ్వు ఉబికే నెత్తురు ఆగి గుంజుతున్న బొటనవేలితో ఒక్కడివే? నీకు ఇప్పుడు ఆ నొప్పి గుర్తుకు లేదు కానీ చివ్వున చేతిని లాక్కుని బొటనవేలిని నోటిలో పెట్టుకుంటే తగిలిన ఆ తడి … ఉప్పగా … అదే రుచి ఇప్పుడూ నీ నోట్లో – ఇక్కడ – ఒక్కడివే ఎదురు చూస్తున్నప్పుడు … కానీ

ఎక్కడికి వెళ్లడం ఇప్పుడు?  సాయంత్రం నుంచి రాత్రిగా మారిన బార్ లోంచి? (ఇట్లా మొదలు పెట్టి ఉండవలసింది నువ్వు ఈ అధ్యాయాన్ని – లేదా దాని శీర్షిక … సాయంత్రం నుంచి రాత్రికి, ఒక బార్ అని) టేబుల్ పై నీళ్లు పడి తడిచిన ఫోన్ తీసి స్క్రీన్ తుడిచి పేర్లు స్కాన్ చేస్తావు. Where to go? ఎవరు రానిస్తారు నిన్నుఈ రాత్రికి? తమ స్థలాలలోకి? భద్రతతో నిండిన తమ లోకాలలోకి? తమలోకి? ఒకవేళ ఎవరైనా అనుమతించినా సిద్ధమేనా నువ్వు? వాళ్ళలోని inner maze లలోకి వెళ్ళడానికి? Are you sure? Are you sure of that? వెళ్లగలవా? నువ్వు? ఎన్నిసార్లని వెళ్ళలేదు! వెళ్లి మెరిసే ఆ రంగురంగుల దారాల చిక్కు ముళ్లలో చిక్కుకుని తప్పిపోయి ఇక ఇంకే మాత్రమూ ఇరుక్కోలేక ఎలాగో ఒకలాగా ఎన్నిసార్లని అక్కడి నుంచి పారిపోలేదు నువ్వు! వద్దు … వెళ్ళవద్దు … వెడితే ఆ maze లలోని తీగలు నిన్ను చుట్టుకుని నీలోకి లోతుగా దిగబడి నువ్వు suffocate అవుతావు. నిన్ను నువ్వే శిక్షించుకుంటావు.  గొంతు చుట్టూ ఆ calculated కోరికల భద్రతా భవిష్యత్తుల చేతివేళ్ళు కలిసి దగ్గరగా చేరి నీకు దగ్గరగా చేరి ఉరితాడు వలె నీ గొంతు చుట్టూ బిగుసుకుని నువ్వు హర్ట్ అవుతావు  … perhaps this is your calculated masochistic desire …  తెలిసినా వెళ్లి ఆ ప్రదర్శనలో భాగమయ్యి పిగిలిపోయి తిరిగి రావడం.  calculated show … calculated show, calculated performance of meeting each other, of those conversations, of affection of love, of sex, of being there… అన్నీ calculated …  ‘ఛత్’ అని అసహనంగా కాస్త పెద్దగానే అనుకుంటావు నువ్వు. నీకంటూ నీదంటూ ఒక చిన్న స్థలం లేకపోవడం విషాదం: ట్రాజెడీ. A room of one’s own … అది లేకపోవడం స్వహింసకి మొదటి మెట్టు అని కూడా అనుకుంటావు నువ్వు. కానీ వెంటనే నీకు అసహనం. ఆ వాక్యం సరిగ్గా సరిపోనందుకు. నువ్వు అనుకుంటున్నదీ అనుభూతి చెందుతున్నదీ … దానిని సరిగ్గా convey చేయనందుకు … అది సరే కానీ is it really about a place? A physical place? A physical space? Is it psychological? Is it an inner need? నీ చుట్టూ నీతో లంకె అయ్యి ఉన్నవాళ్ళ అనుబంధాల అంచనాల shrinking cell లో ఇమడలేక బయటపడలేని నీ బలహీనతనా? … how to be free from encumbering thoughts of the people … నీకు తెలియదు …

నువ్వు ఇక్కడ ఉండలేవు. వాళ్ళ వద్దకి వెళ్ళలేవు. హారిబుల్. హారర్ ఇది బహుశా. నీది కాని జీవితాన్ని నువ్వు జీవించడం.  రాత్రికి ఇంత చోటు లేకపోవడం. నీదైన చోటు లేకపోవడం. ఎక్కడికి వెళ్లినా ఆ చోటు వాళ్లదైన అంచనాలతో వలలా మారి ఎదురు చూస్తూ ఉండటం. ఉచ్చు. హారిబుల్. హారర్. మరెవరివో జీవితాలని నువ్వు గడుపుతూ ఉండటం … ఎక్కడైనా కూలిపోవాలి అనిపిస్తుంది నీకు. తిరిగి లేవలేనంతగా నిద్రపోవాలి అని కూడా అనిపిస్తుంది నీకు.  ఈ రాత్రికి ఎక్కడకని వెళ్లడం? ఎక్కడని పడుకోవడం? ఫోన్ నంబర్స్ కనపడుతున్నాయి. ఎవరికి కాల్ చేయడం? అనేక పేర్లు. అనేక చిరునామాలు. Addresses do not address the problem of addresses అని నీకు తెలుసు కానీ … still … కాల్ చేయాలి. ఎవరికో ఒకరికి.  పడుకోవాలి ఎక్కడో ఒకచోట. తిరిగి లేవలేనంతగా. నీకు తెలుసు అది సాధ్యం కాదని. నీకు తెలుసు కానీ … still … తన పేరు వద్ద ఆగిపోతావు నువ్వు. కాల్ చేయాలా వద్దా అని. బెరుకు. వెళ్లక ముందే, అక్కడికే వెడితే ఏమౌతుందో నీకు తెలుసు. all of it … bit by bit … scene by scene … నీకది ఇష్టం లేదు. కాల్ చేయాలా వద్దా? Hello, are you awake? అని ఒక మెసేజ్ పంపడానికి నిర్ణయం తీసుకుని స్థిమిత పడతావు. Where did I come from, and what am I supposed to be doing? I have no idea. ఈ వాక్యాలు వ్రాసినప్పుడు అతని మానసిక స్థితి ఏమిటి? రూమి. అతను వెదుక్కున్నది ఏమిటి? అతను పొందింది ఏమిటి? అతను కోల్పోయింది ఏమిటి? This drunkenness began in some other tavern. ఆ drunkenness ఏమిటి? ఆ పోయెమ్ ఒక్కటే ఎందుకు అంత బలంగా నీలో నాటుకుపోయింది? ఎందుకు అది నిన్ను వెంటాడుతుంది?  నీకు తెలియదు …

“లోకం ఎట్లా మొదలవుతుందో తెలుసా సార్?” అని చిత్రకొండ గంగాధర్ అడిగాడు నిన్ను ఎన్నేళ్ల క్రితమో ఒకసారి. ఆ రాత్రి ఎక్కడ పడుకోవాలి అనే ‘సమస్య’ అతనికి లేదు. ఇళ్ళు లేని వాళ్ళు ధన్యులు అని ఎక్కడో చదివావు నువ్వు. ఎక్కడో తెలియదు. సౌండ్స్ లైక్ బైబిల్. బిబ్లికల్ భాషలా ఉంది. దాని అర్థం ఏమిటి? నీకు తెలియదు. My soul is from elsewhere, I’m sure of that … రూమి అంటున్నాడు కానీ are you sure? Are you sure of that? (ఈ sure of that అనే టోన్ కూడా నువ్వు మునుపు ఎక్కడో విన్నదే! కానీ ఎక్కడ?) Yes, I am awake. Where are you? అని వచ్చిన రిప్లై కి నీకు తిరిగి ఏం మెసేజ్ పెట్టాలో అర్థం కాదు. Where are you … ఎక్కడ ఉన్నావు నువ్వు? ఎవరైనా ఎక్కడ ఉంటారు? ఎవరైనా … వాళ్ళు ఉండే ఆ స్థలం, ఆ లోపలి స్థలం ఏమిటి? నీటి కింది కాలాలు అని నువ్వు అనుకుంటావు. అంటే ఏమిటో దాని అర్థం ఏమిటో ఆ వాక్యం ఎందుకు తట్టిందో నీకు తెలియదు. Can I come over? నువ్వు రిప్లై చేస్తావు. అది పంపాక వెంటనే మళ్ళీ మెసేజ్ చేస్తావు. Nowhere to go. If you don’t mind, can I come over to your place tonight? మెసేజ్ వెళ్ళింది. నువ్వు వెంటనే రిప్లై ఎక్సపెక్ట్ చేసావు. బదులు లేదు. బదులు లేక … నువ్వు అనుకుంటావు. లోకం దేనితో మొదలు అవుతుందో అని ఆనాడు గంగాధర్ నీకు చెప్పి, వెళ్తున్నా అని నీకు చెప్పకుండా లేచి వెళ్ళిపోయాడు తన చిన్న గోల్డ్ ఫ్లేక్ సిగెరెట్ ప్యాకెట్ అక్కడ వదిలేసి. నువ్వు బదులు ఇవ్వకపోవడం వల్లేనేనా అతను వెళ్లిపోయింది? ఈ లోకం బదులివ్వకపోవడం వల్లనేనా అతను ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది? ఏమో. Who knows … సరైనదా కాదా అన్నది who decides …

… this drunkenness began in some other tavern / When I get back around to that place / I’ll be completely sober … అని రూమి అంటున్నాడు కానీ నిన్ను ఎవరు రానిస్తారు? You can drop in అని తను రిప్లై ఇచ్చిన చాలా సేపటిదాకా నువ్వు అక్కడే కూర్చుని ఉన్నావు. డ్రంక్. నీలోపల నువ్వే మునిగి. నీకు వెళ్లాలని లేదు … కానీ తప్పదు … to sleep … for a roof over your head … ఎందుకంటే నీకు రహదారుల పక్కన షట్టర్లు మూసివేసిన షాపుల ముందు పడుకోవాలని లేదు. ఆత్మహత్య చేసుకోక మునుపు చిత్రకొండ గంగాధర్ వచ్చాడు ఇదే బార్ కి: నీతో. నువ్వు తాగలేదు ఆ రోజు. బాగా అలసిపోయి ఉన్నావు నువ్వు ఆ రోజు. ఎవరినీ వినే ఓపిక కూడా లేదు నీకు ఆ రోజు. ఏదో డిస్టర్బన్స్ లో ఉండి (బహుశా పుట్టుకే ఒక డిస్టర్బన్స్) నువ్వు ఇప్పుడు తాగినట్టు ఆరు పెగ్గులు తాగి “లోకం ఎట్లా మొదలవుతుందో తెలుసా సార్?” అని నిన్ను అడిగిన చిత్రకొండ గంగాధర్. నువ్వు జవాబు చెప్పలేదు. నువ్వు అక్కడ లేవు అప్పుడు. నిన్ను నువ్వు ఎక్కడో కోల్పోయి ఉన్నావు. నిన్ను నువ్వు కోల్పోయి, లోకాన్ని కోల్పోయి తన జీవితాన్ని తనంతట తానే వదిలి వేసుకోబోయే చిత్రకొండ గంగాధర్ని ధ్యాసతో శ్రధ్ధగా వినలేదు నువ్వు. అతను మాట్లాడుతున్నంత సేపూ నువ్వు అతని గరుకైన పెద్ద చేతులు వైపే చూస్తూ కూర్చున్నావు. పీక్కుపోయిన అతని ముఖంవైపూ నింపాదిగా ఉండే అతని కదలికల వైపూ – అతని glazed eyes వైపూ చూస్తూ కూర్చున్నావు. నీకు ఇప్పుడు గుర్తుకు వస్తుంది … అతని కళ్ళని చూసినప్పుడు గడ్డ కట్టిన సరస్సులు తట్టాయి. Not words … an image … మంచు పొగలతో నిండిన గడ్డ కట్టిన సరస్సులు. జీవన వేడిమి లేదు వాటిలో. నిరాసక్తత  … దిగులుతో కూడిన నిరాసక్తత … పిల్లల్ని నోట కరుచుకుని చిన్న స్థలం కోసం వెదుక్కునే పిల్లి కూడా తట్టింది నీకు … ఆ image … నునుపైన దాని ఊదా రంగు  వెంట్రుకలూ, దాని నడకా ఆ కళ్ళూ … అన్నీ స్పష్టంగా నీకు కనిపించాయి. ఎక్కడెక్కడ తిరిగిందో అది గుప్పెడు స్థలం కోసం, తనకు అత్యంత ప్రాణమైనదానిని ఉంచేందుకు, పెంచేందుకు అని నువ్వు అనుకున్నావు ఆ మరుసటి రోజు రోడ్డుపై చీరేయబడిన దాని పిల్లిపిల్ల కనపడినప్పుడు. ఏదో వాహనం వెళ్లగా చితికి రోడ్డుకు అతుక్కుపోయి ఉంది అది. మరి,  చీరుకు పోయి ఉన్నావు నువ్వు కూడా. చిరిగిపోయి ఉన్నావు నువ్వు కూడా బహుశా ఆ రోజు. అందుకే నువ్వు అతనిని అడగలేదు.ఆ అవసరం ఉంది అని కూడా నువ్వు అనుకోలేదు. It is understood without saying a word … it is understood without saying a word that both of you are in the same boat … without a shore … without a home … అతను కూడా ఒక ఇల్లు కోసం వెతుక్కున్నాడా? వెదికీ వెదికీ తిరిగీ తిరిగీ, వెదికీ తిరిగీ, తిరిగీ వెదికీ, ఎక్కడా ఏమీ దొరకక ఎవరికీ ఏమీ కాక ఎక్కడా ఎవరికీ చెందక ఒక్కడే అట్లా మిగిలిపోయి, అలసిపోయి, తనని తాను భరించలేక చివరికి ఆ చెరువే ఇల్లనుకుని అందులోకి నడిచి మునిగిపోయి ఈ బ్రతుకు బరువు నుంచి తేలికై తేలికగా  తేలిపోయి …

***

ఆటోలో ఉన్నావు నువ్వు తన ఫ్లాట్ కి వెళ్లే దారిలో. దాదాపు నలభై నిమిషాలు పడుతుంది ఇక్కడ నుంచి అక్కడికి చేరుకునేందుకు. నవంబర్ గాలి. పదునైనదీ, చల్లనిదీ! నీకు అంత చలిగా ఏమీ లేదు. Drink is working … you are warm … and tender … and vulnerable … రోడ్డుకు ఇరువైపులా దేదీప్యమైన వీధి దీపాల కాంతి. ఆ నారింజ రంగు కాంతి అంటే నీకు చాలా ఇష్టం.  పన్నెండు అవుతుంది. వాహన కాలుష్యం లేని రాత్రి, ఆ బరువు లేని తేలికైనతనంతో మెరుగైన వాసన వేస్తుంది. (ఈ వాక్యం నీకు నచ్చలేదు. దానిని కొట్టివేసి మరోలా రాయాలి అని అనుకుని, మరేదీ అప్పుడు నీకు తట్టక దానిని అలాగే ఉంచివేసావు). Sweater ఉంటే బావుండు అని అనుకున్నావు. గుర్తుందా నీకు? తను నీకొకటి కొని ఇచ్చింది. అది ఎక్కడ వదిలేసావో గుర్తులేదు. “ఎందుకు ఇది?” అని అడిగావు నువ్వు. “నీకోసమే” తను అన్నది “ఈ చలికాలంలో నీకు ఉపయోగపడుతుంది. లవ్ యు”. తన టోన్ – ఆ డ్రై టోన్ – బట్టీ పట్టిన వాక్యాన్ని ఏదో చెబుతున్నట్టు – నీకు నచ్చలేదు. మొదట్లో తన బీయింగ్ అంతటి తోనూ ‘నువ్వంటే ఎంతో ఎంతో ఇష్టం. ప్రేమ’ అని – ఒకరి తరువాత మరొకరికి – తను చెప్పిన ఆ వాక్యం – ఏ ఒక్కరూ ఉండక, నిలబడక – బహుశా అనేకమందికి చెప్పి హర్ట్ అయ్యి అయ్యి క్రమేణా ఆ ఇంటెన్సిటీ అఫ్ ఎమోషన్ పోయి చివరికి ఏమీ లేని ఆ డ్రై టోన్ నే తనకి మిగిలి ఉండవచ్చు. ఐ లవ్ యు అని చాలా యాంత్రికంగా పలికే గొంతొక్కటే మిగిలి ఉండవచ్చు. ఎందుకు తనతో ఎవరూ ఉండలేకపోయారు? లేదా తను ఎందుకు ఎవరితోనూ ఉండలేకపోయింది. Why did those relationships not work out? నీకు తెలియదు. అరుదుగా నవ్వే భావరహితమైన ఆ ముఖమే గుర్తుకు ఉన్నది ఇప్పుడు నీకు ఇది రాస్తున్నప్పుడు. Anyway – what is the point in all that – you never believed in that word ‘love’. It always appeared a strange fictional land with tropes leading to nothing … a no man ‘s land …

ఏమి గుర్తుకు ఉన్నది నీకు ఆ ముఖంలో? పసిడి కాంతి సరే, కానీ ఆ ముఖాన్ని చూడగానే అన్నిటికంటే ముందుగా దృష్టిని ఆకర్షించేది ఏమిటి? ఎత్తైన కనుబొమ్మల కిందుగా ఆ పెద్ద కళ్ళ కిందుగా లోతైన ఛారికలు. మొదటిసారి నువ్వు తనని కలిసినప్పుడు నీ దృష్టి అంతా ఆ కళ్ళు వాటి కింద నిద్రరహిత రాత్రుళ్ళతో ఏర్పడిన నల్లని చిక్కని గీతలు … ‘ఏదో నల్లని స్కెచ్ పెన్ తో కళ్ళ కింద త్రవ్వినట్టు’ (నీకు ఆనాడు ఈ metaphor కూడా అస్సలు నచ్చలేదు) … ఏదో ఆందోళనని కప్పి పుచ్చుకుని స్థిమితంగా కనిపించాలనే ఆందోళన ఆ ముఖంలో. A lot of stress … నువ్వు అనుకున్నావు a lot of stress – continuous stress – over the years … like a worm it is eating her away అని కూడా అనుకున్నావు. బ్రతికి ఉన్న కళ్ళే కానీ బ్రతుకు జాడ లేని బ్రతుకు కాంతి లేని కళ్ళు. glazed. like marble stones … దాదాపు అటువంటి తెల్లని కళ్ళే గంగాధర్ వీనూ. cold … ice cold … dead cold … ఎందుకు అలా అయ్యాయి ఆ కళ్ళు? కళ్ళు మాత్రమే కాదు, తను నీకు షేక్ హాండ్ ఇచ్చినప్పుడు, అదే స్పర్శ … cold … ice cold … dead cold … ఎందుకు అలా? ” Not everyone has luxury of being warm towards the others” ఆ తరువాత మరెన్నడో తను నీతో అన్నది. తాను యుక్త వయస్సులో రాసుకున్న డైరీస్ నీకు ఇచ్చి చదువు అంటే, అప్పటి భావ తీవ్రతల భాషకూ ఆ శైలికీ ఇప్పటి డ్రై టోన్ కీ పోలికే లేదు రాడికల్ చేంజ్ అని నువ్వు తనకి చెప్పినప్పుడు … ‘Not everyone has luxury of being warm towards the others … అయ్యి ఉండవచ్చు. who knows and who decides అని కూడా అనుకున్నావు నువ్వు ఆనాడు –

ఇప్పుడు ఈ రాత్రి ఆటోలో వెడుతూ ఆ luxury of being అనే దగ్గరే ఆగిపోయావు. being కి సరైన తెలుగు పదం చప్పున నీకు తట్టదు. being and nothingness అనే టైటిల్ గుర్తుకు వస్తుంది. ఆ టైటిల్ కీ ఈ రాత్రికీ ఈ ప్రయాణానికీ ఎటువంటి సంబంధం లేదు. (లేదా?) ఇదంతా word association. word-thought association. తెలుస్తూనే ఉంది నీకు. నవంబర్ గాలి: పదునైనదీ, చల్లనదీ. ఈ phrase కూడా ఏదో word associationతో నీకు తట్టినదే. ఆ లింక్ ఇప్పుడు తడుతుంది. ఎక్కడో ఏ అనువాద కవితలోనో ప్రోస్ లోనో చదివావు నువ్వు “నల్లని దానవూ, చురుకైన దానవూ లేదా నల్లని దానివీ చురుకైన దానివీ”  అని లేదా అటువంటివే అయిన వాక్యాలు. ఇప్పుడు ఇక్కడ అవి ‘పదునైనదీ, చల్లనిదీ’ గానూ మారింది. మరుక్షణంలో నీలో చికాకు. there is nothing original. ఒరిజినల్ అనేది అసలు లేనే లేదు. ప్రతిదీ అనువాదమే … అన్నీ అక్కడో ఇక్కడో ఎక్కడో పిక్ అప్ చేసుకున్న పదాలూ phrases ideas concepts నే … ఇర్రిటేషన్ మొదలవుతుంది నీకు. సిగెరెట్ వెలిగించుకుందామని అనుకున్నావు కానీ లైటర్ బార్ లోనే మరచి వచ్చావు. అగ్గిపెట్టె ఉందా అని అడిగి, లేదు అని ఆటో అతను చెబితే దారిలో ఎక్కడైనా ఆపు అని చెప్పి being and smoke అని నవ్వుకుంటావు. Sartre … does he smoke … చేసే ఉండవచ్చు. మందు తాగి స్మోక్ చేసినప్పుడు ఆ టైటిల్ తట్టి ఉండవచ్చు. One becomes philosophical when one is drunk … Normally one knows one IS only in such situations … drunk … when one is in pain … in cold pain … ice cold pain … కానీ ఇదంతా కూడా వర్డ్ ప్లే. ప్రతిదీ అనువాదమయ్యి వాటిలోంచే ఫిల్టర్ అయ్యి … మరో దారి లేదు …

అయిదు అడుగుల మూడు అడుగుల ఎత్తు తను. To be exact 5’3.5 inches. To be exact 161.29 సెంటీమీటర్స్. సన్నటి పొడుగాటి చేతులు. తరచూ ముంజేతుల దాకా ఉండే షెల్వార్ లు కమీజ్ లు వేసుకునేది. చాలా తక్కువ తినేది. కాఫీల మీద బ్రతికేది. అందుకే నైట్స్ నీకు నిద్ర పట్టదు అని నువ్వు చెప్పి ఉన్నావు. Who drinks strong black coffee at 9 in the nights? one cup after the other? తను కప్ పట్టుకునే విధానం గుర్తుకు వస్తుంది నీకు. రెండు చేతులతో దగ్గరగా పట్టుకుని బీన్ బాగ్ లో కూర్చుని – ఆ కాఫీ కప్ ఎలా పట్టుకునేదో అనేది తన మూడ్ కి ఇండికేషన్. ఒకోసారి పగలకొట్టేంత గట్టిగా, మరొకసారి తాకీ తాకనట్టుగా ఇంకొకసారి చాలా సున్నితంగా … ఇక ఎన్నడైనా ఒక చేతితో పట్టుకుని ఉన్నదీ అంటే she is in a very very bad మూడ్ అనీ ఇక ఆ పూటకి నీకు ఒక marathon session of monologue ఉందనీ అర్థం. రెండు గంటలు లేదా మూడు గంటలు. ఆ మారథాన్ సెషన్స్ సాధారణంగా చిన్న ప్రశ్నలతో మొదలవుతాయి. ఉదాహరణకి ‘నిన్న రాలేదే?/ You don’t even remember me, right? / ఏం కావాలి నీకు అసలు లైఫ్ లో? / ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న ముఖంతో ఉంటావు? ఎందుకు? / రేపు వస్తావా? / ఎక్కడికి పోతున్నావు ఈ మధ్య ఉద్యోగం అయ్యాక? / Do you love me? / ఎందుకు చెప్పవు? / Why don’t you say if you love me or not? / చెప్పవే? / మాట్లాడవే? … నీకు ఇప్పటికీ గుర్తున్నాయి ఆ కళ్ళల్లోని నవంబర్ రాత్రుళ్ళు! చీకటి రాత్రుళ్ళు. పదునైనవీ చల్లనివీ …

అనేకసార్లు అటువంటి ప్రశ్నలతో మొదలయ్యి తనతో తానే మాట్లాడుకుంటున్నట్టు ఉండే నీతో చెప్పే గంటా రెండు గంటల ‘సంభాషణ’ తర్వాత – సైలెన్స్. ఆ నిశ్శబ్దం – ఆ రాత్రీ, మరుసటి దినం ఆ మరుసటి దినం కూడా కొనసాగుతూ ఉండేది. తనని విన్నంతసేపు (విన్నావా అసలు నువ్వు?) నువ్వు స్థబ్ధుగా అయిపోయేవాడివి. (వ్యాకరణపరంగా సరైన దేనా ఈ వాక్యం?) నీకేం మాట్లాడాలో తెలిసేది కాదు. Being and nothingness … Satre కి నీకూ తనకీ ఏమి సంబంధం లేకపోయినా ఆ శీర్షికనే పదే పదే తట్టేది నీకు. ఎందుకింత wound? తనలో? దానిని ఆరనివ్వక – చెక్కు కాస్త కడుతున్నంతనే – దానిని పెకిలించి  మళ్ళా దాని గురించే తను మాట్లాడటం … రాయడం …  it is writers’ business … నీకు అది తెలుసు it is none of your business అని కూడా నీకు తెలుసు …still … నువ్వు ఏదైనా తనకి నచ్చ చెబుదామని అనుకున్నప్పుడల్లా తన భాష (పదునైనదీ చల్లనైనదీ … cold … dead cold), తన శరీర భాష ఆ కళ్ళ భాష (cold ice cold) నీకూ తనకీ మధ్య ఒక మందమైన తెర ఏదో వాలినట్టుగా చేసి ఇక నీకు ఏమీ తోచేది కాదు. నువ్వు ఆగిపోయేవాడివి. ఏం చేయాలో నీకు తెలిసేది కూడా కాదు. నువ్వు తన వద్ద లేనప్పుడు – ఆ ఫ్లాట్ లో – ఒకోసారి నీకు రాత్రి రెండింటికి ఫోన్ వచ్చేది. అవతలివైపు నుంచి సన్నగా మెల్లిగా తన గొంతు. like a whisper … ‘ఇంట్లో ఎవరో ఉన్నారు … ముందు గదిలో నుంచి చప్పుళ్ళు వస్తున్నాయి. వెళ్లి చూడాలంటే భయంగా ఉంది … ఎవరో ఉన్నారు …”. ‘ఇంట్లో ఒక్కదానివేగా ఉండేది. ఎవరూ ఉండరు … పడుకో’ అని నువ్వు చెప్పేవాడివి కానీ తన నుంచి వరసగా మెసేజ్ స్ వచ్చేవి. ‘ఎవరో ఉన్నారు flat లో … / నాకు వాళ్ళ మాటలు వినపడుతున్నాయి … ఏదో పడేస్తున్నారు … నాకు భయంగా ఉంది …”/అని. ఆ మెసేజ్ స్ కి ఏమి రిప్లై ఇవ్వాలో తెలియక బెడ్ రూమ్ లో బ్లూ బెడ్ లైట్ వెలుతురులో ఆ మెసేజెస్ టైప్ చేసే తన రూపాన్ని ఊహించుకునే వాడివి. పిచ్చా ఏమైనా తనకి? Is she mad? Or are you mad? and depressed?

సరిగ్గా ఈ కాలంలోనే నీకు ఆ రికరింగ్ డ్రీం మొదలయ్యింది. నిజానికి నీకు నిద్ర అనేది పెద్ద సమస్య. చివరిసారిగా కంటి నిండుగా ఎప్పుడు నిద్రపోయావో నీకు గుర్తులేదు. ఏడో తరగతి? అంతకంటే మునుపు? గదిలో లైటు ఉంటే నీకు నిద్ర పట్టేది కాదు. చిన్న ఇల్లు. అందరూ ఒకే గదిలో – ఇంట్లో ఒకటే మంచం ఉండేది. నీకు ఎంత వయసో ఇప్పుడు గుర్తు లేదు కానీ లైటు కి నిద్ర పట్టక ఏ అర్థరాత్రో కొంచెం కొంచెంగా ఆ  మంచం కిందకి వెళ్లిపోయేవాడికి. బహుశా ఐదో తరగతిలో ఉన్నావు నువ్వు. అయిదా లేక ఆరో తరగతా? మంచం కింద భద్రతగా అనిపించేది ఆ చీకటి. మంచం కిందకి ఒక మూలకి గోడకు తగిలే దాకా జరిగి దానికి ఆనుకుంటే కానీ నీకు నిద్ర పట్టేది కాదు. అప్పటిదాకా ఆ లైటుకు నిద్ర పోలేక నిద్ర రాక నరకం అనిపించేది నీకు. బహుశా అప్పుడే, సరిగ్గా ఆ కాలంలోనే అనుకుంటా నువ్వు – నీతో నువ్వు మాట్లాడుకునే ఆట మొదలు పెట్టింది. కళ్ళు తెరుచుకుని నీతో నువ్వు లోలోపల మాట్లాడుకోవడం … ఇప్పుడు స్ట్రేంజ్ గా అనిపిస్తుంది కానీ అప్పుడు అదే నీకు solace. A healing song to the lonely silence … ఆ వయస్సులో నీకు కలలు వచ్చేవి కావు. కలలు రావడం తనతో ఉన్న రోజులలోనే … ముఖ్యంగా ఆ కల నీకు పదే పదే రావడం మొదలయ్యింది. నీకు బాగా గుర్తు ఆ దినం. ఇప్పటికీ …

నువ్వు ఆనాడు తన ఫ్లాట్ కి చేరేసరికి తలుపు తీసే ఉన్నది. అక్టోబర్ మాసం. రాత్రి పది అవుతుంది. దారిలో కొనుక్కున్న పుస్తకాలు సోఫాలో పెట్టి చూస్తే తను లేదు. వెదుక్కుంటూ చూస్తే చివరికి వంట గదిలో స్టౌవ్ వద్ద నిలబడి … సర్ప్రైస్ ఇద్దామనుకున్నావు నువ్వు. ఏం చేస్తుందా అని వెనుక నుంచి సడీ సవ్వడి లేకుండా లోపలికి వెళ్లి చూస్తే ఒక ట్రాన్స్ లో ఉన్నట్టు నిలబడి ఉంది తను సిమ్ లో వెలుగుతున్న స్టవ్ మంట మీద వేలు పెట్టి క్షణం ఆగాక ఆగి తీయడం … వేళ్ళు ఒకదాని తరువాత మరొకటి అలాగా …. నువ్వు చప్పున వెళ్లి వెనక్కి లాగావు కానీ ఎంత సేపటి నుంచి అలా చేస్తుందో మరి  వేళ్ళు కమిలి ఉన్నాయి. ఎడమచేతి వేళ్ళు. రెండు వేళ్ళకి బొబ్బలెక్కి … నీకు మాట పడిపోయింది. “are you mad?” అని అరిచావు కోపంగా. వణికిపోయావు కోపంతో. ఇంకేమీ మాట్లాడ లేక పోయావు. నువ్వు ఆ రోజు సాయంత్రం వేరే పనిలో ఉండి తన ఫోన్ కాల్స్ అటెండ్ కాలేదు. మెసేజెస్ కి రిప్లై ఇవ్వలేదు. It is as if she is taking revenge for that non responsiveness …. అదేనా? నీకు తెలియదు. తన చేతిని చల్లని నీళ్లతో కడిగి బర్నాల్ రాసి పెయిన్ కిల్లర్ వేసి డైనింగ్ ఏరియా లో ఒక కుర్చీలో కూలబడి భావరహితమైన – cold, ice cold dead cold – తన ముఖాన్ని చూస్తూ కూర్చున్నావు … అదే మొదలు … ఆ రాత్రి ఎప్పటికో నీకు నిద్ర పడితే ఆ కలత నిద్రలో నువ్వు ఆకాశాన్ని అంటే మబ్బుల్ని దాటిన – ఎత్తైన – ఆదీ అంతం లేని అడుగు వెడల్పు ఉన్న గోడపై నడుస్తున్నట్టు కల. సరిగ్గా ఒక్క అడుగు మాత్రమే పట్టేటట్టు ఉన్న ఆ గోడ . ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా కింద ఎక్కడో అగాధంలోకి పడిపోయేలాగా . కల లాగా నీకు అనిపించనేలేదు … it felt so real … so real that reality fades in front of that … అడుగు తీసి అడుగు వేస్తూ క్షణకాలం కాలు తప్పినట్టయ్యి నువ్వు దిగ్గున లేచి కూర్చుంటే నీ ఒళ్ళంతా చమట. కరెంట్ పోయి ఉంది. నీ గుండె చప్పుడు నీకే పెద్దగా వినిపించింది ఆ అర్థరాత్రిలో. లేచి వెళ్లి అపార్ట్మెంట్ బాల్కనీలోంచి బయటికి చూస్తే కొద్ది దూరంలో మరో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయ్యే చోట పనివాళ్ళు వేసుకున్న చితుకుల మంట. ఆరిపోతున్న ఆ మంటలోంచి పొగ … సన్నగా … చిన్నగా పైకి, ఆకాశంలోకి. మిణుకుమంటూ నక్షత్రాలు. ఆ అక్టోబర్ చల్లని గాలిని గట్టిగా నీలోపలికి పీల్చుకుంటే, నీ గుండెలోకి చర్మం కాలిన కమిలిన వాసన. నల్లగా, చంద్రుడు లేని రాత్రి ఆకాశంలాగా … పొడిగా … చల్లగా … ఎంతో పదునుగా …

రోడ్డు వారగా ఉన్న చిన్న బల్లపై flask లో టీ ఇంకా సిగెరెట్స్ అమ్మే వాళ్ళ దగ్గర సిగెరెట్స్ కొనుక్కుని టీ తాగుతావా అని ఆటో అతనిని అడిగి అక్కడే దిగిపోయావు. అక్కడ నుంచి walkable డిస్టెన్స్ తన ఫ్లాట్ కి. నడవాలనిపించింది నీకు. నోరు కొద్ది చేదుగా అనిపించింది. feverish. నిన్న ఉదయం నుంచి అలాగే ఉండింది. Being and fever … being as fever … being feverish … a feverish being … అని అనుకుని నవ్వుకున్నావు. టైం చూస్తే పన్నెండున్నర. చల్లటి గాలి. కానీ you are still warm … and tender … and vulnerable … అక్కడ నుంచి అయిదు నిమిషాల నడక. పది అడుగులు నడిచి అగ్గిపెట్టె కొనుక్కోవడం మరిచావని గుర్తకు వచ్చి వెనక్కు వెళ్లి కొనుకున్నావు. ఆ చిన్న బల్ల వద్ద ఇద్దరు. ఇరవై ఏళ్ల కుర్రవాడు, ఓ యాభై అయిదేళ్ల స్త్రీ. తల్లి కొడుకులు అయి ఉండవచ్చునా? ఏమో. ఆగిపెట్టే ఇస్తూ నవ్వింది ఆ తల్లి. ముడతలు పడిన బక్క పల్చని నల్లని ముఖం తనది. క్షణకాలం పెయిన్ అనిపించింది నీకు. ఏదో గుచ్చుకున్నట్టయియింది లోపల. కలుక్కుమని … చిన్నగా నవ్వి అగ్గిపెట్టె  అందుకుని తన ఫ్లాట్ వైపు – through the inner roads of the colony – నడుస్తావు. through the inner roads … of being … of nothingness … through the inner roads  … మలుపులు తిరిగే వీధిలో ఇరువైపులా నేలపై జలజలాడే నీడలలో వెలుతురూ నీడలూ కలిసిన దారిలో – వీధి నుంచి వీధికి – ఒక వీధి అనేక వీధులుగా మారి తిరిగి వీధిలోనే అంతమయ్యే దారిలో  నీడలు ఊగి తోటి నీడల్లోకి కలిసి తిరిగి విడివడి ఆగిపోయి … అంతటా క్షణకాలం ఆ అర్థరాత్రి ఒక నిశ్శబ్డం … క్షణకాలమే … ఎంతో సుదీర్ఘమైన క్షణకాలం  … వెడల్పుగా మొదలయ్యి సన్నగా మారే వీధిలోంచీ, నీడల్లోంచీ కోసే గాలిలోంచీ మంచుతో తడిచే శరీరంతో చేదైన నోరుతో ఉండీ ఉండీ వచ్చి జలదరింపుకు గురి చేసే వణుకుతో నువ్వు వీధి మలుపు, నువ్వు నీ మలుపు తిరిగితే – through the inner roads – అక్కడ తన అపార్ట్మెంట్. మసక చీకట్లో చిత్తరువు లాగా … వెలసిపోయిన పెయింటింగ్ లాగా …

What is in store for you? There? In that night? At that hour?

***

సంశయంతో అక్కడే నిలబడతావు నువ్వు. వెళ్ళాలా వద్దా అని. అప్పటికి ఇంకా నిర్ణయించుకోలేక. అపార్ట్మెంట్ ముందు ఉన్న చెట్ల వల్ల బూజుగా ఉంది వెలుతురు. ‘బూజు వెలుతురు’ నువ్వు మననం చేసుకుంటావు. నీలోపల కూడా బూజు బూజుగా ఉన్నట్టు అనిపించింది నీకు. నోరు చేదుతో పాటు నీ నాలికపైకి బూజు కూడా చేరినట్టుగా … ఎండిపోయి ఉన్నాయి పెదవులు నీవి. చాలా దాహంగా ఉంది. అపార్ట్మెంట్ గేట్ (నల్లనిది) దగ్గరగా వేసి ఉంది. వాచ్మన్ కనిపించలేదు. బహుశా గ్రౌండ్ ఫ్లోర్లోనే తనకు ఇచ్చిన గది వద్ద ఉండి ఉండవచ్చు. ఎవరు ఉంటారు బయట ఈ చలికి ఈ సమయాన? ఏం చేయాలి? వెళ్ళాలా వద్దా? ఇప్పడు వెడితే – if she’s in one of those bad depressive, sleepless and talkative moods – వినగలవా నువ్వు తనని? ఈ సమయంలో? ఈ పరిస్థితిలో? ఓపిక ఉన్నదా నీకు? To go or not to go that is the question … వెనక్కు వెళ్లే ఓపిక లేదు ముందుకు కదిలే స్పష్టతా లేదు. అక్కడే నిలబడ్డావు చాలాసేపు. uncertain … undecidability … ఇది ఎట్లా వచ్చి చేరింది నీలోకి? ఎక్కడా ఉండాలనిపించకపోవడం? ప్రతిచోటా నువ్వు నీకు పరాయిగా అనిపించడం? కొన్ని క్షణాలు తప్ప ప్రతి క్షణం నువ్వు రెండుగా విడివడి ఆ రెండు అనేకం అయ్యి … scattered గా పిగిలిపోవడం? వెదజల్లబడటం. వెదజల్లబడటం వల్ల మిగిలిపోవడం? Is it ‘her’ problem as well? Not to be at home anywhere or not to be at home with anyone? ఎవరికీ తెలుసు?

కర్టెన్ వేసి ఉంది. యెల్లోయిష్ పాటర్న్ ఉన్న కర్టెన్. It’s her colour. నువ్వు ఎన్నడూ అటువంటి రంగు ని తలుపు కర్టెన్ గా వాడగా చూడలేదు. ఆ కర్టెన్ రంగు తన శరీర రంగునీ గుర్తుకు తెస్తుంది నీకు. మెరుపుతో కూడిన ఆ రంగు తాను నీతో వాగ్వాదానికి దిగినప్పుడల్లా అనేక షేడ్స్ లోకి పరివర్తనం చెందేది. Each shade has its own mood and environment. And texture … and language too.  తన బాల్యంలోని ఘటనలను తను నీకు చెప్పినప్పుడల్లా ఆ రంగు చిక్కగా మారేది. ఏడో తరగతిలో తను ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దారికాచి నోరు మూసి పక్కకు లాక్కువెళ్లి బలాత్కారానికి గురి అయ్యిన దినం గురించి చెబుతున్నప్పుడు ఆ రంగు రాత్రిలాగా మారేది. యెల్లోయిష్ లో యెల్లోనెస్ పోయినట్టు పాలిపోయి ఉండేది.  “సముద్రం అంటే ఇష్టం. ఆ రోజు తరువాత సముద్రం ఎన్నడూ అంతకు మునుపులాగా కనిపించలేదు” తను నీతో అన్నది. ” ఈ కర్టైన్స్ సముద్ర తీరాన ఇసుకను తలపిస్తాయి. ఇష్టం నాకు. అందుకే కొనుక్కున్నాను” అని కూడా తను నీతో చెప్పింది. ఇక్కడికి ఈ నగరానికి రాక ముందు, తను నగరం కాక ముందు జరిగినది … అది … does that incident leave a big indelible mark on her? In her? నీకు తెలియదు. కాలింగ్ బెల్ పదో సారి కొట్టినా ఆ తలుపు తెరుచుకోదు …

ఫోన్ తీసి తనకి కాల్ చేస్తావు. రింగ్ అవుతుంది తన ఫోన్. లిఫ్ట్ చేయదు. పడుకుని ఉందా? అంత త్వరగా పడుకునే అలవాటు లేదు తనకు. ఇన్సొమ్నియా. రెండుసార్లు నువ్వే తనకి నీకు తెలిసిన మెడికల్ షాప్ నుంచి Valium తెచ్చి ఇచ్చావు. Valium వేసుకున్నా నిద్ర వచ్చేది కాదు. మరి? కావాలనే తలుపు తీయడం లేదా? తెలియదు నీకు. దాహం వేస్తుంది నీకు అంత చలిలోనూ. Why doesn’t she respond? Is it some sort of a revenge? A way of saying ‘Look! I can do better than you. I can be better than you in such things’ ఒక్కసారిగా ఏదో అలసట నిన్ను ఆవరిస్తుంది. ఉన్నపళంగా అక్కడే ఆ తలుపు ముంగిట కూలపడి పడుకోవాలి అని అనిపిస్తుంది. అక్కడే. కూలిపోయి. ఈసారి నువ్వు తలుపు గట్టిగా తట్టి చూస్తావు. ‘ఉన్నదా, ఎటైనా పోయిందా?’. మళ్ళా ఫోన్ చేస్తావు. కాలింగ్ బెల్ కొడతావు. తలుపు తడతావు. No answer. లోపల ఎక్కడో కాలింగ్ బెల్ మోగుతుంది కానీ ఆ చప్పుడు నీలో ప్రతిధ్వనిస్తుంది. ఎందుకో చర్చ్ బెల్ సౌండ్ గుర్తుకు వస్తుంది నీకు. an image of vague form of a church as well … ఇప్పడు ఇక్కడ ఈ కాలింగ్ బెల్ చర్చ్ బెల్ లాగా నీకు అనిపించడం వినిపించడం అస్ఫష్టమైన ఒక చర్చ్ రూపం చిత్తరువు లాగా నీకు తట్టడం … what is the connection between these … బయటి వినిపించే శబ్దానికీ నీ లోపలి ప్రతిధ్వనించే శబ్ధానికీ మధ్య నిశ్శబ్దం … you can almost touch it as if it were snow … మంచు … మోయలేని బరువుతో ఎంతో తేలికైన మంచు …

ఎంతసేపు అలా తలుపు కొట్టావో నీకు తెలియదు: గట్టిగా. ఎంతసేపు కాల్ చేసావో నీకు తెలియదు: వరసగా. ఎన్ని మెసేజెస్ desperate గా చేసావో లెక్క కట్టలేదు నువ్వు, వాచ్మన్ వచ్చి నిన్ను కుదిపి సార్ అనేదాకా. స్పృహలోకి వచ్చినట్టు అయ్యి చుట్టూ చూసావు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? ఎవరు నువ్వు? neither you have no answer for yourself or to the watchman. సార్ వేరే ఫ్లాట్ వాళ్ళు కంప్లైన్ చేస్తున్నారు డిస్టర్బన్స్ అవుతుందని. వెళ్లిపోండి సార్ అని అతను చెబుతున్నాడు కానీ నీకు ఏమీ స్పష్టంగా వినిపించడం లేదు. కనిపించడం లేదు. కళ్ల ముందు చీకటి తెరలు వాలినట్టు … చీకట్లో ఒక సముద్రం ముందు ఉన్నట్టుగా కూడా అనిపించింది. deep dark roaring sea … నీలోపల హోరెత్తున ఘోష. అలలు ఎగిసిపడుతున్నట్లు. చీకట్లో. ఎగిసిపడి విరిగి కరిగి తిరిగి అక్కడే తమలోనే తాము అంతమై ఎగిసి. ఏం జరుగుతుందో నీకు అర్థం కాలేదు. as if drained of all the energy … life itself … ‘ఒకసారి ట్రై చేస్తాను’ అని అంటావు వాచ్మన్ తో. నీకు అతనితో ఉన్న పరిచయంతో నేను ట్రై చేస్తాను సార్ అని అతనూ కాలింగ్ బెల్ కొట్టి తలుపు తట్టి ప్రయత్నిస్తాడు కానీ ఆవలివైపు అగాధం. కృష్ణబిలం. Nothing comes out of it … and you don’t know if you deserve it or not … whether you deserve that silence at all … that cold, ice cold, dead cold silence at all …

***

నువ్వు చివరిసారిగా  ఇంకోక్కసారి – ఆ తలుపులు తెరుచుకోవు అని స్పష్టత వచ్చి కూడా – తలుపు తట్టదామని చేతిని తలుపు దాకా పోనిచ్చి కూడా ఆగిపోతావు. బహుశా తను అలసిపోయింది. బహుశా అనేకమంది ఇలాగే అలసిపోయి ఉంటారు: నీతో. వాళ్లకి కావాల్సిందేదీ నువ్వు ఇవ్వలేవు. వాళ్ళు అనుకున్నట్టు నువ్వు ఉండలేవు. నువ్వు ఇవ్వలేకపోవడం వల్ల, వాళ్ళు ఎంతో ప్రయత్నించీ పొందలేకపోవడం వల్ల వాళ్లకి విసుగొచ్చి ఉండవచ్చు అప్పటికే! వస్తువులు కాదు వాళ్లకి కావాల్సింది, నీ ఇష్టాఅయిష్టాలలో మార్పు. To fit into their pattern: of thoughts. To fit into their definitions and identifications:  to fit in and shape your life into a particular pattern which they think is ‘natural’, ‘good’, ‘acceptable’ and IS the only one … నువ్వు అట్లా ఉంటేనే ఆ తలుపులు తెరుచుకోడానికి అర్హత సంపాదించుంటావు అని వాళ్ళు చెప్పకనే చెప్పే క్రూరత్వం. ‘హింస’ అని నువ్వు అనుకుంటావు.   ‘తెరవని తలుపులు’ అని కూడా నువ్వు అనుకుంటావు కానీ, ఆ ఇమేజెస్ ఏవీ నీకు ఆ రాత్రి ఇంత చోటుని ప్రసాదించలేవు. నీ తెలిసినదల్లా నీ ప్రయత్నం అంతా – ఈ ఒక్క రోజుకి, ఈ ఒక్క రాత్రికి బ్రతికి ఉండటం … just to survive, just to survive the night …

ఏమీ చేయలేక ఇక నువ్వు మెట్లు దిగి కిందకి వస్తావు. అటువంటి రాత్రుళ్లు నీకు కొత్త కాదు. అటువంటి రాత్రుళ్ళూ అటువంటి రహదారులూ నీకు కొత్త కాదు. వాటిలో, శిధిలాల వంటి వాటిలో నువ్వు వంటరిగా అప్పటికే పలుమార్లు తిరిగి ఉన్నావు. గాయపడి. తలుపు తట్టిన చప్పుడుకి మెలకువలో ఉండీ కూడా విన్నా విననట్లు ఉండే వాళ్ళ ఉదాసీనతల మృత్యుశీతల క్షణాల మధ్య అనంతంగా వ్యాపించే నిశ్శబ్దంలో నువ్వు అనేకసార్లు వంటరిగా వదిలివేయబడి ఉండటం కొత్త కానే కాదు. You are often left to die … నీకు అది అనుభూతమే. అది నీ జీవితపు ఉపోద్గాతం. A prologue. A prologue that is your epilogue as well. నీ logos అది … మనుషులు ఇళ్ళు. మనుషులు తలుపులు ఉన్న ఇళ్ళు. తడితే తలుపులు తెరుచుకునే ఇళ్లు మనుషులు అని అనుకునే నువ్వు!

ఐదో అంతస్థు నుంచి మెట్లు దిగి, అపార్ట్మెంట్ గేట్ దాటి బయటకి వస్తే ఆదీ అంతం లేనట్టు – రోడ్డు. ఇరువైపులా సాగి ఏదో శిఖరపు అంచున ఆగి – ఎవరో అక్కడి నుంచి దుమికే దాకా అలాగే స్థంబించినట్టు ఉండే రోడ్డు. పోనీలే, కనీసం అది నిన్ను జడ్జ్ చేయదు. నువ్వు వెళ్తావా ఉంటావా అనేది ఏమీ దానికి పట్టదు. ఈ రాత్రికి నువ్వు బ్రతికి బట్టకడతావా లేక కూలిపోతావా అనేది కూడా అది పట్టించుకోదు. అది ఉంటుంది అట్లా. ఉండటమే బహుమతి నీకు అన్నట్లు. నువ్వు తలెత్తి చూస్తే రోడ్డుకు ఇరువైపులా ఉన్న వీధి దీపస్థంబాల కాంతి. సన్నగా మొదలయ్యి వెడల్పుగా మారే ఆ వీధిలో వాటి కాంతి నేలపై ముద్దల్లాగా పిల్లలు అరచేతులతో అలికినట్లు ఉండే రూపాలలాగా  …  అర్థమేమీ లేనివి. అర్థరహితం వల్ల అపార్థం కానివీ! మెస్మరైసింగ్ అవి – అవే ఆ నీడలు! వంటిఒంటి గంట నవంబర్ రాత్రిలో వీచే గాలిలో పేరు తెలియని ఆ చెట్లు కదిలినప్పుడల్లా నేలపై అలా జలదరించే నీడలు – మెస్మరైసింగ్. గుండెల్లోకి ఏదో చెక్కుకు పోతున్నట్లు చేస్తాయి అవి. గలగలలాడే ఆ చెట్లు – కాగితాలు రెపరెపలాడినట్లు, ఆ గాలీ, ఆ పల్చని కాంతీ, మెరుపులో రూపాలు మార్చుకునే నీడలూ వణికించే చలీ మంచు తాకిన ఆ రాత్రి వాసనా … వేటినో ఎన్నింటినో జ్ఞప్తికి తెస్తాయి నీకు. కాదు కాదు, వేటినో కాదు. ఘాడమైన – నువ్వు ఇంతకాలమూ తన్నుకులాడుతున్న అనుభూతిని ఏదో జ్ఞప్తికి తెస్తాయి అవి. Longing. Some undefined longing … a deep, penetrative and destructive longing … self-destructive longing …

నెమ్మదిగా మెయిన్ రోడ్ వైపు నడుస్తావు నువ్వు. అక్కడైతే కానీ ఏదైనా ఆటో దొరకదు కానీ ఎక్కడికి వెళ్లడం? ఎక్కడ పడుకోవాలి ఈ రాత్రి? నీ అడుగులు చప్పుడు నీకే – ఆ వీధిలో చిన్నగా, పెద్దగా – బ్రతికి ఉండి ఏదో చెపుతున్నట్లు ఉన్న నీడల్లో రాలిన ఆకులకు పైగా మట్టిలో – నీకు నువ్వే వినపడుతున్నట్లు. నీకు నువ్వే ఆ నీడల్లాగా ఖాళీ వీధిలాగా త్రవ్వుకుపోయే గాలిలాగా మారి ఎటో కొట్టుకుపోతున్నట్లు … ఎక్కడికి వెళ్లడం? ఇప్పుడు? ఎట్లా ఈ రాత్రిని దాటడం? నడుస్తావు నువ్వు తల వంచుకుని – నీ ముందు కొద్ది దూరంలో మెయిన్ రోడ్. వాహనాల చప్పుడు వినపడుతుంది నీకు. నీ వెనకగా – ఖచ్చితంగా కాదు కానీ – ఎక్కడో లీలగా కుక్క అరుస్తున్న చప్పుడు. అది అరుపా లేక ఏడుపా? ఏమై ఉండవచ్చు. నీకు తెలియదు. ఆక్రందన? ఏమో కానీ ఇది మాత్రం చెప్పాలి సరళంగా – ఎంత మాత్రమూ సరళం కానీ పుస్తకంలో – నీ హృదయం ఆ క్షణాన ఖాళీ! ముక్కలయ్యి కాదు, పూర్తిగా ఖాళీ. Not broken. But, empty. Just empty! ‘విరిగిపోయి ఉంది నీ హృదయం’ అని ముందు నువ్వు రాద్దామనుకున్నావు కానీ, విరిగిపోయి ఉండటమంటే మునుపు అది నిండుగా ఉందని కదా అర్థం. అది కాదు నీ స్థితి అప్పుడు. Empty. Emptiness is older than being broken.  Emptiness is what is there when you clear everything away and look at what remains. ఆ రాత్రి అన్నిటినీ వదులుకున్నావు అని నువ్వు అనుకున్నావు. ఇంటికి రమ్మని పిలిచి – శరణార్థిలాగా నువ్వు వస్తావని తెలిసీ – అంత రాత్రి – ఇంట్లో ఉండీ వాళ్ళు తలుపు తెరవనప్పుడు, చివరిగా నీ జీవితంలో, నీ జీవితం లాంటి దానిలో మిగిలిన – ప్రతిధ్వని లాంటి – ఆ చివరి బంధం ఏదో నీ నుంచి విడిపోయి నువ్వు పూర్తిగా ఖాళీ అయ్యి, ఇక మిగిలినదల్లా ఆ రాత్రీ, ఆ దారీ, గోడలపై ఎగబాకి ఎగిసే మంటల్లాంటి నీడలు, నీకు పైగా – రాత్రి ని పీల్చుకుని ఆ తడితో కదిలే చిన్నగా గలగలమనే ఆకులూ, దిశ లేకుండా వీచి ఆగిపోయే గాలీ. Like your being. Just like meaning. Assembling and dissolving, assembling and dissolving, like something that wants to exist but has not yet decided what form to take … formless … లోలోపలే వలయాలయ్యి, కుంచించుకుపోయి మళ్ళీ వ్యాపించి … రూపరహితమైనదేదో నిన్ను పిలిచినట్టు, ఆ పిలుపుకి నువ్వు తపించి, పిగిలి పొగిలిపోయి, చెక్కుకుపోయి పెన్సిల్ పొట్టులా రాలిపోయి నలుదిశలా వీడిపోయి రూప రహితంగా మారి ఎటో కొట్టుకుపోయినట్లు

 

‘లోకం ఎట్లా మొదలవుతుందో తెలుసా సార్?’ అని అడిగిన చిత్రకొండ గంగాధర్ చాలా సేపు తనలో తాను కూరుకుపోయి ఆనక అన్నాడు ‘ఆకలితో సార్ … పిట్ట పురుగూ పశువు మనిషీ ఆకలితోనే లోకంలోకి వెళ్ళడం.. ‘ రెండు రోజులుగా తినని అతని కడుపులోని ఆకలీ లోపల చెక్కుపోతున్నట్టు ఉండే ఆ స్థితీ నీలోకి చేరినట్టుగా ఉంది. ఎంతో ప్రయాణించి చాలా దూరం వచ్చావు అని అనుకునే లోపలే ఎక్కడ మొదలయ్యావో మళ్ళీ అక్కడే ఉన్నావని గ్రహించిన నిస్పృహ నీలో. తోడి, ఖాళీ చేసి వదిలేసే అలసట నీలో. నిస్పృహ. ఇవన్నీ కూడా కాదు, మరేదో … so, you see నీకు ఇక మిగిలినదల్లా ఈ రాత్రీ, ఈ దారీ. మరి … ఈ రాత్రీ అంతం కాదు. ఈ దారీ అంతం కాదు. నీకు తెలిసిన ‘నువ్వూ’ అంతం కావు. ఏమిటీ చేయడం? అప్పుడు? నీకు ఇల్లు లేనప్పుడు? నీకు నువ్వు లేనప్పుడు? మిగలనప్పుడు?  So, you decide to walk … again … and again …

***

Chapter I of Home: A Memoir (The Years 1996 – 2000)

నోట్:

ఇదొక spiral narrative. ఈ అధ్యాయం – which is a part of a longer text / a ‘book’ – is an attempt to (re)capture those lived times of ‘his’ life or those lived years and that state of mind through a spectrum of memories, of course which one knows cannot be entirely trusted. So ఈ పుస్తకం – దీనిని పుస్తకం అని పిలవగలిగితే, దీనిని ఒక memoir అని అనగలిగితే – is also about ‘trust’, of ‘trustworthiness’. Of memories. Of home and homelessness. Of love and death. Fernando Pessoa, a man with many selves (like all of us who stubbornly deny that ‘fact’) ఇలా అంటున్నాడు ఈ memory machineలోంచి:

These pages are not my confession; they’re my definition. And I feel, as I begin to write it, that I can write it with some semblance of truth.1 (Italics mine)

అని ఇంకా ఇలా కూడా:    … I sometimes find texts I wrote ten, fifteen, or even more years ago. And many of them seem to me written by a stranger: I simply do not recognize myself in them. There was a person who wrote them, and it was I. I experienced them, but it was in another life, from which I just woke up, as if from someone else’s dream. 2

తెలుగు లో రాస్తూ ఇదంతా – ఈ English – ఎందుకు అంటే, ఇదిగో ఇందుకు:

 I don’t write in Portuguese. I write myself. 3

_______________________________________________

1,2 & 3 – these lines are by Fernando Pessoa

శ్రీకాంత్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు