అప్పటికి నాలుగు గంటలైంది భూటాన్ ఇమిగ్రేషన్ ఆఫీస్ ముందు నించుని. పరుగులు తీయడం అలవాటైన జీవితం. అంతంతసేపు వెయిట్ చెయ్యడంతో కుదురుగా వుండలేక అసహనంగా చుట్టూ చూసింది ‘సౌ’. బృందాలుగా వచ్చిన వాళ్లంతా గోలగా మాట్లాడుకుంటూ, భూటానీల సాంప్రదాయ దుస్తులను ఆసక్తిగా చూస్తూ వున్నారు. మగవాళ్లు బాత్ రోబ్ లాంటిదాన్నివేసుకుని, నడుముకు ఒక క్లాత్ బెల్ట్ కట్టుకున్నారు. వాళ్లు వాడే వాలెట్, మొబైల్ ఫోన్లు, ట్రావెలర్స్ డాక్యుమెంట్లు అన్నీ ఆ రోబ్ లో పొట్ట దగ్గర పెట్టుకుంటున్నారు. టోటల్ హాండ్స్ ఫ్రీ. మనసులోనే నవ్వుకుంటూ మరోసారి కళ్లు చికిలించి ఆఫీస్ బ్యాక్ డోర్ వైపు చూసింది. గైడ్ జాడ లేదు. తాను ప్లాన్ చేసుకున్న ప్రకారం సాయంత్రం ఐదు గంటలకంతా థింపూ చేరుకోవాలి. ఇప్పుడు మధ్యాహ్నం మూడవుతోంది. ఈ రోజు పూర్తిగా వృధా.
తాను డైరెక్ట్ గా పారో ఎయిర్ పోర్టుకు వెళ్లిపోవాల్సింది. ఫుంట్సోలింగ్ నుంచి థింపు రోడ్డు ప్రయాణం అద్భుతంగా వుంటుందని, కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా అదేరూట్ తీసుకోమని తన స్నేహితుడు నిక్ చెప్పబట్టి బెంగుళూరు నుంచి బాగ్దోగ్రా ఫ్లై చేసింది. ఫుంట్సోలింగ్ లో రాత్రి బస. ఉదయాన్నే లేచి ఒక గంట లోపు ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని థింపూ బయలుదేరాలని ప్లాన్. సోమవారం కావడంతో విపరీతమైన రద్దీవుంది. టెక్నాలజీ భూటానీల జీవితాల్లోకి ఇప్పుడిప్పుడే విస్తరిస్తుండటంతో నిపుణుల కొరత వున్నట్టుంది. ఒక్కో బయోమెట్రీ ఎంట్రీ పూర్తి చేయడానికి కనీసం మూడు నుంచి నాలుగు నిముషాలు తీసుకుంటున్నారు. కేవలం మూడు కౌంటర్లు వున్నాయక్కడ. ఖచ్చితంగా లంచ్ టైమ్ కి కౌంటర్లు మూసేశారు. ఇలాగే పని కొనసాగితే సాయంత్రం ఐదు తరువాత ఏమీ చేయలేమనే విషయం అర్థమయ్యాక రద్దీతో సౌ కి మరికాస్త టెన్షన్ పెరిగింది.
సౌ ఆధునిక భావాలున్న ముప్పైరెండేళ్ల యువతి. ఆకర్షణీయంగా వుంటుంది. ఎవర్నీ లెక్కజేయనట్టు ఆమె చూపు, నడక, ప్రవర్తన కొత్తవాళ్లకు ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తిని రేకెత్తిస్తాయి. సౌ పుట్టిన ఐదేళ్లకు కుటుంబం మొత్తం బెంగుళూరు నుంచి అమెరికా వెళ్లి అక్కడే సెటిలయ్యారు. చిన్నప్పటి నుంచి సౌ కి పర్ఫెక్షన్, సమయపాలన ఉచ్ఛ్వాసనిశ్వాసల్లా దినచర్యలో భాగమైపోయాయి. ఏదైనా అనుకున్న సమయానికి జరగకపోయినా, సరిగ్గా ప్లానింగ్ లేకపోయినా ఆమెకు పిచ్చిపట్టినంత పనౌతుంది.
చిన్నప్పుడు సెలవల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు బంధువుల వూళ్లకు వెళ్ళేది. ఒకటి రెండు రోజులకంతా బోర్ కొట్టేసి బెంగుళూరులో అమ్మమ్మ దగ్గరికి వచ్చేసేది. టీవీ, సినిమాలు చూడ్డం, షాపింగులు చేయడం మినహా ఇండియాలో ఏమీ చేయలేమని అనిపించి కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియా వెళ్లాలంటేనే విముఖత చూపించేది. ఇక చదువు పూర్తయ్యాక ఇంటినించి బయటకొచ్చి స్వతంత్రంగా వుండటం ప్రారంభమయ్యాక పూర్తిగా అటు వెళ్లడమే మానుకుంది. సౌ స్కూల్ మేట్ నిక్ ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతాడు. ప్రస్తుతం భూటాన్ లో యువతకు ఉపాధికల్పన శిక్షణనిచ్చే ఒక ప్రాజెక్ట్ చూస్తున్నాడు. దానికి కావల్సిన టెక్నికల్ హెల్ప్ చెయ్యమని సౌ ని అర్థించాడు. అమ్మమ్మను చూసి కూడా దాదాపు మూడేళ్లయింది. రెండూ ఒకేసారి పూర్తిచేసెయ్యచ్చని మూడువారాల సెలవు మీద ముందు బెంగుళూరు చేరుకుంది. అక్కడో వారం వుండి, నిక్ భూటాన్ ట్రావెల్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశాక బయల్దేరి ఇక్కడికొచ్చింది. ఈ గైడ్ ని చూస్తేనేమో ఏమాత్రం టెన్షన్ పడకుండా తీరుబడిగా కూర్చున్నాడు. ఏరోజైనా ఎక్కడైనా ఇంత వెయిట్ చేసిందా తను. ఎప్పుడైనా ఎయిర్ పోర్ట్ లో వుండాల్సొచ్చినా అక్కడి నుంచి కూడా ఆఫీస్ వర్క్ చేసుకునేది. వీళ్లిలా ఇంత తీరుబడిగా కూర్చుని సమయాన్నంతా వృధా చెయ్యడం ఆమెకు నచ్చలేదు.
ఫోన్ తీసి గైడ్ కి కాల్ చేసింది. నో రెస్పాన్స్. తానీ పరిస్థితిలో వుండడానికి కారణం నిక్. నిక్ నెంబర్ కి ‘ _క్ యూ’ మెసేజ్ పంపి అక్కడే ఒక చిన్న గోడమీద స్థలం చూసి సర్దుకుని కూర్చుంది. అసలు ఇప్పుడు ఈ ట్రిప్ వేసేంత తీరిక ఆమెకు లేదు. కొత్తప్రాజెక్టు ప్రపోజల్స్ వస్తున్నాయి. ఆఫీస్ లో సౌ పై డిపెండన్సీ ఎక్కువ. కానీ రీసెంట్ గా నాలుగేళ్ల లివిన్ రిలేషన్ లో వున్న బాయ్ ఫ్రండ్ ఎరిక్ తో బ్రేక్ అప్ ఎనౌన్స్ చేసింది. మంచివాడే. కానీ వుద్యోగం, సెటిల్ మెంట్ పై ఆసక్తిలేదు. ఆర్నెల్లకో జాబ్ మారడం అలవాటుగా చేసుకున్నాడు. అతడితో జీవితం ప్లాన్ చేసుకోడం సూయిసైడ్ లాంటిదని అన్పించింది సౌ కి. అలాంటి ఇన్ సెక్యూర్డ్ లైఫ్ సౌకి నచ్చలేదు. పని చేయాలి. డబ్బు సంపాదించాలి. కావల్సిన వస్తువులన్నీ, తనకు నచ్చినవన్నీ సమకూర్చుకోవాలి. అందరూ అసూయపడేలా బ్రతకాలి. ఇదీ ఆమె కోరిక. చూస్తుంటే ఎరిక్ తో తననుకున్న జీవితం సాధ్యమయేలాలేదు. ప్లానింగ్ అస్సలు లేదు. పైగా సంపాదించిన అరా కొరా బీదాబిక్కికి డొనేట్ చేసేస్తాడు. చాలా రోజులు ఇదే విషయంపై వాగ్వివాదం జరిగాక కూడా మనిషిలో ఎలాంటి మార్పు కనిపించక పోయే సరికి సన్నిహిత మిత్రులతో పార్టీ ఏర్పాటు చేసి బ్రేకప్ ఎనౌన్స్ చేసింది.
ఎంత మామూలుగా వుండాలన్నా నాలుగేళ్ల సాన్నిహిత్యం. పదే పదే ఏవో జ్ఞాపకాలు డిస్టర్బ్ చేసేవి. అమ్మానాన్న కూడా సౌ ఇంక ఎరిక్ తో లైఫ్ సెట్ చేసుకుందని సంతోషంగా వున్నారు. విడిపోయినట్టు తెలియగానే చాలా అప్ సెట్ అయ్యారు. సంపాదన, ఉద్యోగం పైన వున్న శ్రద్ద వ్యక్తిగత జీవితంపై కూడా చూపమని చెప్పీ చెప్పీ విసిగిపోయారు. ఇండియాలో వుండుంటే ఈ పాటికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేసే వాళ్లం కదా అని బాధపడ్డారు.
వారినుంచి వొచ్చే పరామర్శ ఫోన్ కాల్స్, మంచి వ్యక్తిని దూరం చేసుకున్నావని స్నేహితులు చేసే కామెంట్స్ ఆమెకు చికాకు పుట్టించాయి. ఎందుకో అందరూ ఇంత డ్రామా చేస్తారు, వాస్తవాన్ని అర్థం చేసుకోరు అనుకుంటుందామె. కాస్త ఆ వాతావరణం నుంచి బయటపడాలనే నిక్ ప్రపోజల్ కి ఒప్పుకుంది. లేకపోతే రూపాయి ఆదాయం లేదు ఈ పనివల్ల. కేవలం కొంత స్థలం మార్పు. అంతే.
“మాడమ్ సౌ! అవర్ టైమ్ టు గో ఫర్ బయోమెట్రిక్స్” దగ్గరగా మాట వినబడటంతో గతం నుంచి బయటకొచ్చింది. యాంగ్ చెన్. ఈ పది రోజులు తనకు గైడ్. మంచివ్యక్తి అని, సీనియర్ గైడ్ అని నిక్ చెప్పాడు.
లోపలికి వెళ్లి ఫార్మాలిటీస్ పూర్తిచేసి, లోకల్ సిమ్ కార్డు, కొంత కరెన్సీ ఎక్స్ఛేంజ్ చేసుకుని బయటపడింది. ఐదు కావస్తోంది. మొత్తం చీకటిపడిపోయింది. ఇంకేం ఎంజాయ్ చేస్తాం .. రోడ్ ట్రావెల్ ని. కనీసం రాత్రికి థింపూ చేరుకుంటే రేపు పొద్దున్నుంచి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చని అనుకుంది. హోటల్ చెకవుట్ చేసి, మూడు లేయర్స్ గా థర్మల్స్ తో వొంటిని కవర్ చేసుకుని టాక్సీ ఎక్కింది.
డ్రయివర్ నేపాలీ. వారిద్దరూ ఏదో మాట్లాడుకుంటుంటే కాసేపు వినడానికి ప్రయత్నించింది. పాటలు కూడా ఏదో నేపాలీ సినిమాలోవి. ఏమీ అర్థం కావడం లేదు. బోర్ కొట్టి పక్కనే వున్న బ్యాక్ ప్యాక్ మీద పడుకుని నిద్రపోయింది.
రాత్రి పదకొండున్నర సమయంలో థింపూలో ముందుగా బుక్ చేసుకున్న హోటల్ చేరుకున్నారు. గైడ్ కి కూడా అక్కడే గది. డ్రయివర్ మాత్రం పొద్దున వొస్తానని వెళ్లిపోయాడు. రాగానే ల్యాపీ ఆన్ చేసుకుని పనిలో మునిగిపోయింది సౌ.
పొద్దున ఎనిమిది గంటలకు బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర విష్ చేశాడు యాంగ్ చెన్. నిక్ ఆఫీసులో దించేశాక సాయంత్రం వరకు తన అవసరం వుండదు కనుక, సాయంత్రం ఐదు తర్వాత కలుస్తానని చెప్పాడు. యాంగ్ చెన్ కాస్త సన్నగా, ఆరోగ్యంగా వుంటాడు. కళ్లు ఎప్పుడూ నవ్వుతున్నట్టే వుంటాయి. చాలా నెమ్మదిగా వుంటాడు. ఏ విషయానికీ ఆత్రపడడు. సిక్కింలో డిగ్రీ చదివాడు. గైడ్ గా స్థిరపడ్డాడు. ఇంగ్లీషు, హిందీ బాగా మాట్లాడుతాడు.
ఇమిగ్రేషన్ ఆఫీసులో బయోమెట్రిక్స్ ఇచ్చేసి బయటకొస్తుంటే అడిగాడు నిన్న. సౌందర్య అని అంత అందమైన పేరు పెట్టుకుని సౌ అని పిలిపించుకుంటారెందుకని.చిన్నగా నవ్వి వూరుకుంది. అంత పొడుగు ఇండియన్ నేమ్ పిలవడం కష్టం. పైగా అందరూ దాన్ని షార్ట్ చేసేసి సౌ అంటుంటే తనకు కూడా బాగా నచ్చింది. ఇప్పుడు పాస్ పోర్టులో తప్ప పూర్తిపేరు ఎక్కడా లేదు. సౌందర్య చాలా ఓల్డ్ నేమ్. ఐ డోంట్ లైక్ ఇట్ ఎనీ మోర్ అనుకుంది. అయినా నా పేరుతో ఇతగాడికేం పని? ఆఫీసులో దింపేసి వెళ్తున్న యాంగ్ చెన్ ని వెనుకనుంచి చూస్తూ నిన్నుకూడా ‘ యా ‘ అని పిలిస్తే నాకు కాస్త సులభంగా వుంటుందని అనుకుని నవ్వుకుంటూ పనిలో పడిపోయింది.
సాయంత్రం ఐదు గంటలకు వొచ్చి పికప్ చేసుకున్నాడు. చీకటైపోయింది. ఇప్పుడు మీరేమీ చూడలేరిక్కడ. షాపింగ్ చేసుకోవచ్చు. లేదా హాట్ స్టోన్ బాత్ కి తీసుకెళ్తానన్నాడు. ఇప్పుడు షాపింగ్ చేసే ఓపికైతే లేదు. హాట్ స్టోన్ బాత్ కే వెళ్దామంది. నదిలో నీటిని నింపిన టబ్ లో అక్కడ ప్రత్యేకంగా దొరికే ఒక హెర్బ్ ని కలిపి బాగా కాల్చిన హిమాలయన్ రాక్ ను వేసి నీటిని వేడి చేస్తున్నారక్కడ. అందులో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదని చెప్పాడు యాంగ్. టబ్ లో పడుకుని ఆ నీటి వెచ్చదనాన్ని, సువాసనను ఆస్వాదిస్తూ వున్నా పది నిమిషాలకంతా బోర్ కొట్టి ఇక చాలనిపించింది ఆమెకి. ఎంత సేపు పడుకుంటాం ఇలా? మరో ఐదు నిముషాలకు పూర్తి చేసి బయటకొచ్చేసింది.
‘అదేంటి మేడం? అప్పుడే వొచ్చేశారు? మీకు నచ్చలేదా?’ అడిగాడు యాంగ్ పైన్ కప్పులో వేడి వేడిగా బటర్ టీ అందిస్తూ.
‘అదేం లేదు. ఇంతకంటే ఎక్కువ సేపు నేను వుండలేను. నా స్నానం ఐదు నిముషాలే’ అంది నవ్వుతూ
‘ కనీసం గంటసేపు ఈ టబ్ లో వుంటారు సాధారణంగా. నీళ్లలో వేడి తగ్గిపోతే బయటినుంచి హాట్ స్టోన్ వేస్తూ వుంటారు’ వివరించాడు.
తర్వాత అట్నుంచి అటే హోటల్ కి వెళ్లి డిన్నర్ చేశారు. ప్రతి రెస్టారెంట్ లోనూ లిక్కర్ దొరుకుతోంది. బీఫ్, పోర్క్ ఎక్కువ వారి మెన్యూలో. తనకూ అమెరికాలో బాగానే అలవాటు వుండటంతో కాస్త డ్రూక్ విస్కీ కూడా తీసుకుంది.
ఇద్దరూ కలిసి అప్పటికి రెండు రోజులు కావడంతో ఇద్దరూ కాస్త కంఫర్టబుల్ గానే మాట్లాడుకుంటున్నారు.
‘మీకు పెళ్లయిందా?’ అడిగింది
‘లేదు. కానీ చేసుకుంటే ఒక్కర్నే చేసుకుని తనతోనే లైఫ్ అంతా వుంటాను’ చెప్పాడు.
‘వాట్! ఒక్కర్ని కాకుండా ఇంకెంతమందిని చేసుకుంటారు’
‘యా! ఇక్కడ కొందరు నాలుగు పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు. చట్టసమ్మతం. కానీ నేను మా దేశపు రాజు లాగే ఒక్కరినే ప్రేమించి తనతోనే జీవితమంతా వుండిపోతా’
‘అవునా! కానీ ఎందుకలా? అవకాశం వున్నప్పుడు ఎవరైనా వొదులుకుంటారా!’ ఆటపట్టిస్తూ అంది.
‘అవకాశాల కోసం ఆరాట పడటం, ఇంకా ఇంకా కావాలనుకోడం … వీటికి అంతమెక్కడ? వున్నదాంతో సంతృప్తి పడటం మనసుకు చాలా ప్రశాంతతనిస్తుంది. మనసు నిండే ఒక్క స్నేహం చాలదూ జీవితానికి’
అతని మాటలు వింటూ మౌనంగా డిసెంబర్ చలి రాత్రిలో కలిసి నడుస్తుంటే ఆమెకు ఎన్నడూ కలగని వింత హాయి కలుగుతోంది. ఆ వాతావరణమే చాలా భిన్నంగా, ఆహ్లాదకరంగా వుందామెకు.
‘మీ గురించి చెప్పలేదు?’ అడిగాడు
‘నాకు పెళ్లి పేరుతో స్వేచ్ఛను చంపుకోవడం ఇష్టం లేదు. నాలుగేళ్లు ఒకరితో కలిసి వున్నాను. ఇద్దరి అభిప్రాయాలూ కలవలేదు. విడిపోయాం. ఇన్ ఫాక్ట్ నేనే ఆ బంధం నుంచి బయటకొచ్చేశాను. ఇప్పుడప్పుడే ఇంకో ప్రేమపైనో, పెళ్లి పైనో నా మనసు వెళ్ళదు. ఐ నీడ్ సమ్ స్పేస్.’ చెప్పి నవ్వుతూ ‘మీకు ఎందరినైనా పెళ్లి చేసుకునే ఆప్షన్ వున్నట్టే నాకూ వుంటే ద్రౌపది లాగా ఐదుగురిని చేసుకునేదాన్నేమో’ అల్లరిగా అంది. అలా అంటున్నప్పుడు యాంగ్ చూపుల్లో కలిసిన చూపులు వెనక్కులాక్కోవడానికి ఆమెకు కొంత సమయం పట్టింది. ఎందుకో అలా చూస్తాడు, నేరుగా మనసులోకి.. అనుకుంది.
తర్వాత రెండురోజులు ఫుల్ గా పని. పూర్తి పూర్తయిన తర్వాత నిక్ కి ఫోన్ చేసి మూడు రోజులు భూటాన్ లోని టూరిస్ట్ ప్లేసెస్ చూడాలనుకుంటున్నట్టు చెప్పింది.
మొదటి రోజు పారో దగ్గరున్న టైగర్స్ నెస్ట్ ట్రెక్కింగ్. ఉదయం ఎనిమిది గంటలకు అక్కడికి చేరుకోగానే అంత పైకి ఎక్కగలనా అన్న గుబులు మొదలైంది సౌ లో. చాలా నిటారుగా వుంది. బేస్ పాయింట్ దగ్గర వంద రూపాయలు యిచ్చి రెండు ట్రెక్కింగ్ స్టిక్స్ తీసుకుని నడక మొదలు పెట్టారు. అక్కడున్న ప్రేయర్ బెల్స్ ని తిప్పి ప్రార్థన చేసుకున్నాడు యాంగ్. సౌని కూడా తిప్పమన్నాడు. ప్రేయర్ బెల్స్ మీద వున్న మంత్రాక్షరాలు పఠించినంత పుణ్యం వస్తుందని, అందరూ వాటిని చదివి ప్రార్థన చేసుకోలేరు కాబట్టి బెల్స్ ని తిప్పితే సరిపోతుందన్నాడు. దేవుడంటే నమ్మకం లేకపోయినా సరదాగా లైన్ గా వున్న బెల్స్ ని చివరివరకూ తిప్పి నడక ప్రారంభించింది. పది నిముషాలు నడిచేసరికి ఈ నడకెంత కష్టమో అర్థం అయ్యింది. తాను అంతపైకి ఎక్కడం సాధ్యం కాదని, గుర్రంపై వస్తానని యాంగ్ కి చెప్పింది. మనసు ప్రశాంతంగా వుంచుకుని దేవుడిని తలుచుకుంటూ ఎక్కితే శ్రమ తెలియదని, ప్రయత్నించమని చెప్పాడు. మరో ఐదునిముషాలు నడిచాక ఇక తనవల్ల కాదని కూర్చుందామె. ఆమెను గుర్రం ఎక్కించి, తాను పైన కలుస్తానని చకచకా నడిచిపోతున్న యాంగ్ ని, తల్లులతో కలిసి నడుస్తున్న చిన్నారులను చూస్తూ చిన్నప్పటి నుంచి వీళ్లకు కొండలెక్కడం అలవాటు కాబోలనుకుంది సౌ.
గుర్రమెక్కి సరిగ్గా పది నిముషాలు ప్రయాణించేసరికి ఇక అక్కడినుంచి అవికూడా ఎక్కలేవని, నడిచే వెళ్లాలని గుర్రాన్ని తీసుకొచ్చిన అమ్మాయి చెప్పడంతో అక్కడే దిగేసి డబ్బులిచ్చి పంపేసింది. కొండచివరగా గుర్రం నడుస్తుంటే కింద పడిపోతానేమోనన్న భయంతో అప్పటివరకు మనసును ఉగ్గబట్టుకుని కూర్చున్న సౌ హమ్మయ్య అని దిగగానే గట్టిగా ఊపిరి పీల్చుకుని యాంగ్ కోసం చూసింది. ఎక్కడా కనిపించలేదు. అక్కడే వున్న బెంచ్ పై కూర్చుంది. చాలా చలిగా వుంది. తొందరలో గ్లవ్స్ మర్చిపోయి వచ్చింది. అరచేతులు రుద్దుకుంటూ వెచ్చచేసుకుంటుంటే యాంగ్ వచ్చాడు.
‘ఇంకా ఎంత దూరం ఎక్కాలి ‘ అడిగింది
‘అసలు ప్రయాణం ఇంకా ప్రారంభించనేలేదు మనం’ నవ్వాడు
‘అందుకే నడిచే ఎక్కుదాం అన్నా. పావు దూరం కూడా రాలేదు మనం. పదండి నడుద్దాం’ అంటూ వాకింగ్ స్టిక్ చేతికిచ్చాడు.
మరో అరగంట నడిచాక ఇకనడవలేక కూర్చుండిపోయింది. చలి, ఆయాసం.
‘నేనిక నడవలేను. తిరిగి వెళ్లిపోదాం’ అంది. పక్కనే కూర్చుని మంచినీళ్ల బాటిల్ అందించాడు.
‘మరేం పర్వాలేదు. చిన్నగా వెళ్దాం. నేనున్నానుగా మీకు తోడుగా. భూటాన్ వచ్చి ఈ ట్రెక్ చెయ్యకుండా వెళ్లరు ఎవరూ’
‘మీకు అలుపు తెలియకుండా మా రాజు ప్రేమకథ చెప్పనా’ అడిగాడు.
ఏడేళ్ల వయసులో తనను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన చిన్నారికిచ్చిన మాటనిలబెట్టుకుని, పెద్దయ్యాక ఆమెనే పెళ్లి చేసుకున్న రాజు గురించి, ఆ రాజంటే ప్రజలకున్న ఇష్టం గురించి చెప్తుంటే ఆశ్చర్యంగా విన్నది.
దేశ ప్రగతిని తలసరి ఆదాయంతో కాకుండా ప్రజల సంతోషంతో కొలుస్తారని చెప్పాడు. చదువుకోవడానికి బయటికెళ్లిన తనకు అక్కడి జీవితాల్లోని అనవసర ఆరాటం, డబ్బుకోసం పడే తపనా చూసి నచ్చక తిరిగొచ్చేసినట్టు చెప్పాడు.
‘నాకు ప్రకృతిలోని ప్రతి చిన్న భాగమూ నచ్చుతుంది. ఈ సృష్టిలో మనుషులెంత ముఖ్యమో ప్రతి చిన్న ప్రాణమున్న జీవి, ప్రాణంలేని ప్రతి వస్తువూ అంతే ఇంపార్టెన్స్ వున్న అంశాలని అనిపిస్తాయి. నేను చేసే ప్రతి పనీ పూర్తిగా మనసుపెట్టి చేస్తాను. ఎవరి ప్రోద్భలం తోనో, ఏవో ఆశలు, ఆరాటాలతోనో ఏమీ చెయ్యలేను నేను. ఒకవేళ చేయాల్సి వచ్చినా నా మనసు చాలా వ్యతిరేఖిస్తుంది. దుఃఖిస్తుంది. నేనొక ఫ్రీసోల్.’ ఆపాడు.
‘మీరేమీ అనుకోకపోతే మీరు జీవితంలో అత్యంత ప్రాధాన్యతనిచ్చే అంశం ఏంటో చెప్తారా’ అడిగాడు.
ఆ సందర్భంలో సమాధానం చెప్పడానికి కాస్త తటపటాయించినా చివరకు చెప్పింది.
‘నేను కెరియర్ లో పైస్థాయికి వెళ్లాలి. చాలా డబ్బులు సంపాదించుకుని జీవితంలో స్థిరపడాలని వుంద’ని.
‘చిన్నప్పటి నుంచి నేనింతే. ఎప్పుడూ ఏదో సాధించాలన్న అన్ రెస్ట్. కానీ అదేంటో తెలియదు. ఒక పని పూర్తి చేసిన తర్వాత ఆ సంతృప్తి కొద్ది రోజులు కూడా వుండదు. దీంతో ఒక లక్ష్యం తర్వాత మరోటి పెట్టుకుంటూ, దానివెంట పరుగులు తీస్తూ వుండటం అలవాటు చేసుకున్నా. ఎక్కువ డబ్బు, పేరు సంపాదించుకుంటే ఈ వెంటాడే అసంతృప్తి నుంచి బయటపడతానేమో అనిపిస్తుంది. బట్ గాట్ స్టక్ సమ్ వేర్. నన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు నన్ను చాలా మెటీరియలిస్టిక్ అంటారు. కానీ నేను మోర్ రియలిస్టిక్.’ ఉద్వేగంగా వివరిస్తోంది.
విన్నట్టు తలూపాడు. తనకు పూర్తిగా వ్యతిరేకం.
‘మీరు ట్రీ హగ్గింగ్ చేశారా ఎప్పుడైనా?’ అడిగాడు యాంగ్. లేదన్నట్టు అడ్డంగా తలూపింది.
‘ఒకసారి ట్రైచెయ్యండి. మనసు కాస్త ప్రశాంతంగా వుంటుంది. స్ట్రెస్ తగ్గించే శక్తి దానికుంది’ అన్నాడు.
చెట్టు దగ్గరికెళ్లి మౌనంగా దాన్ని హత్తుకుని కళ్లు మూసుకుంది. ఎన్నోయేళ్ల నుంచి తనలో దాచుకున్న శాంతిని ఆ కౌగిలి తనకు ధారపోసినట్టు ఏదో తెలియని సంపూర్ణత సౌ ని కమ్మేసింది.
కొండలు, లోయలు, స్వచ్ఛమైన గాలి, ఎత్తైన కాలిబాటలో నడక. ఊహ తెలిశాక ప్రశాంతత అంటే ఏమిటో తొలిసారి అనుభవానికొచ్చిన క్షణం. ఆ క్షణం పూర్తిగా జీవించిందామె.
మరి కొంత సేపు నడిచి అక్కడ వున్న ఏకైక రెస్టారెంట్ కు చేరుకున్నారు. ఛాయ్ బిస్కట్స్ ఆర్డర్ చేసి కూర్చున్నారు. ఇంతలో యాంగ్ తన పాకెట్ బుక్ లోంచి రెండు పేజీలను చించి సౌ ముందు పెట్టాడు.
‘చిన్నప్పటి నుంచి మీకు బాగా గుర్తున్న మెమొరీస్ , ఎప్పుడు తలుచుకున్నా ఆనందంగా అనిపించే పది విషయాలను ఇందులో రాయండి’ అన్నాడు.
యాంగ్ ని గైడ్ గా చూడటం మానేసి స్నేహితుడిగా ఎప్పుడో అంగీకరించేసింది సౌ మనసు. అందుకే అతను చూపుతున్న చొరవకు ఎలాంటి వ్యతిరేఖతా ఆమెలో లేదు.
కాగితంలో పది హ్యాపీ మూమెంట్స్ ని రాసి అతనికి ఇచ్చింది. చదివి ఆ కాగితాలను లోపల పెట్టుకున్నాడు. ‘ఏదో విశ్లేషిస్తానన్నారూ?’ అడిగింది సౌ.
‘ఇప్పుడు కాదు. ఒకరోజు వెయిట్ చెయ్యండి’
మళ్లీ నడక ప్రారంభించారు. పైకెళ్తున్న కొద్దీ దారి మరింత నిలువుగా వుంటోంది. యాంగ్ వేగాన్ని ఆమె అందుకోలేక ఆయాసపడుతోంది. హైదరాబాద్ నుంచి వచ్చి నడవలేక తనలాగే అవస్తపడుతున్న మరో యువతితో దారిలో మాటల్లో పడింది. యాంగ్ ని తనకోసం వెయిట్ చెయ్యవద్దని , గుడి వద్ద కలుసుకుంటానని చెప్పింది. ఇక అక్కడినుంచి నిలువుగా మెట్లు ప్రారంభమయ్యాయి. ఆగి ఆగి నడుస్తుండటంతో మరింత వెనుకబడి ఒక్కతే అయ్యింది. ఇప్పటివరకు తన జీవితం, కెరియర్ కోసం ఊపిరాడని ఆరాటం, డబ్బుకోసం,అదిచ్చే సెక్యూరిటీ కోసం నాలుగేళ్ల లివిన్ రిలేషన్ లో వున్న వ్యక్తిని వదులుకోవడం ..ఇవన్నీ మనసులో తిరగడం ప్రారంభించాయి. అవున్నిజమే.. సంతోషంగా వుండటానికి అవేవీ అవసరం లేదని ఇక్కడి వాళ్లను, మరీ ప్రత్యేకంగా యాంగ్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. అస్సలు వురుకులు పరుగులు లేని జీవితాలు. ఉన్నదాంతో సంతోషపడే మనసులు. అందరూ చాలా ఆరోగ్యంగా కూడా వున్నారు. టెక్నాలజీ ఇంకా వారి జీవితాలను పూర్తిగా ఆధీన పరుచుకోక పోవడం ఒక రకంగా వరం.
ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నదల్లా ఒక రాతిపై వున్న వస్తువును చూసి అప్రయత్నంగా ఆగిపోయింది. గ్లవ్స్ పై పైన్ చెట్టు ఆకులను వుంచి పడిపోకుండా మరో చిన్నరాయి దానిపై పెట్టివుంది.కింద ఒక చిన్న కాగితం. తీసి చూసింది.
‘ఇవి మీకోసమే…చేతుల వెచ్చదనం కోసం. ఆత్మశోధనతో మనసు ఇప్పటికే వేడెక్కిందని అనిపిస్తోంది నాకు’ -యాంగ్.
చిరునవ్వుతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి. ప్రతి అవసరాన్నీ నోరు తెరచి అడగక ముందే గ్రహిస్తాడు.
ఆకులతో సహా గ్లవ్స్ ని, కాగితాన్ని తీసుకుని బ్యాక్ ప్యాక్ లో దాచుకుంది. యాంగ్ కి ఎందుకో ఎట్రాక్ట్ అవుతోంది తను. బహుశా అతడి మొహంలో వున్న ప్రశాంతతకు కావచ్చు. దాంతోపాటే తన ప్రవర్తన, ఆలోచనా విధానం , ఇంకా ఆ నవ్వినట్టు కనిపించే కళ్లు. అవును ఆ కళ్లంటే చాలా ఇష్టం తనకు.
గుడి ముందు వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎదురొచ్చాడు యాంగ్. బ్యాగ్ లాకర్ లో పెట్టేసి గుడి లోకి వెళ్లారు. ఎంట్రన్స్ లోనే ఒక పెద్ద రాయి, అందులో బొటనవేలు పెట్టగలిగేంత నొక్కులాంటి చిన్న గుంట వుంది. కళ్లు మూసుకుని మూడు అడుగుల ముందునుంచి సరిగ్గా బొటనవేలు ఆ గుంట లో పెట్టగలిగితే కోరిన కోర్కెలు నెరవేరుతాయో లేదో తెలిసిపోతుందంట. యాంగ్ చెప్పాడు. ఈ థమ్సప్ గేమ్ సౌ కి నచ్చింది. ‘నేనెప్పుడూ సంతోషంగా వుండాలి’ అనుకుంటూ కళ్లు మూసుకుని బొటనవేలిని పెట్టింది. కరెక్టుగా వేలు అందులోకి వెళ్లడంతో, ఎందుకో తెలియని సంతోషంతో మనసు గంతులేసింది. కోరిక నెరవేరిపోతుందని కాదు. సరిగ్గా టార్గెట్ రీచ్ అయినందుకు. అక్కడ గుడిలో భౌద్దగురువు విగ్రహంతో పాటూ రాజు ఫోటో కూడా వుండటం చూసింది. రాజంటే ఎంత గౌరవమున్నా దేవుడిలా కొలవడం మూర్ఖత్వం అనిపించింది. దేవుడంటేనే తనకు నమ్మకం లేదు మరి.
తిరుగు ప్రయాణం మరింత కష్టంగా వుంది. కాళ్లు పట్టులేక జారిపోతున్నాయి. యాంగ్ ఆమె చేతిని జాగ్రత్తగా పట్టుకుని ఆసరా ఇస్తూ నడిపించాడు.
‘నేను నడవగలను. మీకెందుకు శ్రమ’ అంది సౌ మొహమాటంగా.
‘ ఇతరులకు సహాయం చెయ్యడంలో ఒక సంతృప్తి వుంటుంది. ఎప్పుడైతే దయ, కరుణ అనసరం వచ్చినప్పుడు మనసులో పుట్టుకొస్తాయో ఆక్షణం మన జీవితపరమార్థం మనకు తెలిసిపోయినట్టే’ అన్నాడు.
ఇక ఆమె అడ్డు చెప్పలేదు. వొచ్చినప్పటి నుంచీ చుట్టూ జరుగుతున్నదంతా, చూస్తున్నదంతా చిన్నప్పుడు టీవీలో చూసిన ఫెయిరీటేల్ లా వుంది.
పారో తిరిగొచ్చే సరికి సాయంత్రం నాలుగు గంటలైంది. విపరీతంగా కాళ్లు నొస్తున్నాయి. అక్కడినుంచి నేరుగా భూటాన్ సాంప్రదాయ భోజనం అందించే రెస్టారెంట్ కు వెళ్లి పైన్ ప్లేట్లలో మాంసంతో రెడ్ రైస్ తిన్నారు. రాత్రి హోటల్ కి వెళ్లేముందు చెప్పాడు యెంగ్. రేపు పునాక వెళ్తున్నాం. మా ఇల్లు కూడా అక్కడే. ఉదయాన్నే చిమీ లఖాంగ్ చూద్దాం అని.
‘మీకు అభ్యంతరం లేకుంటే మధ్యాహ్న భోజనం మా ఇంట్లోనే’ అన్నాడు. ‘సరే’ అనేసింది సౌ.
అక్కడి వాతావరణం ఆమెకు ఆసక్తికరంగా వుంది. వారి అలవాట్లు, వారి ఆహార్యం.. అన్నీ. ఇంటికి వెళ్తే వారి సంస్కృతిని మరింత దగ్గరగా పరిశీలించవచ్చని ఆమెకు అనిపించింది.
ఉదయం ఏడు గంటలకు టాక్సీ డ్రయివర్ తో వచ్చాడు యాంగ్. ఉదయం చాలా మంచు కురుస్తుందని, అందుకే కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతున్నట్టు సంజాయిషీ ఇచ్చాడు. పారో నుంచి పునాక లోని లఖాంగ్ చేరుకోవడానికి నాలుగు గంటల ప్రయాణం. దారిలో రెండుచోట్ల ఆపి టీ తాగుతూ, భూటాన్ టెంపుల్ మ్యూజిక్ వింటూ పునాక చేరుకున్నారు. ఈసారి ప్రయాణం విసుగ్గా అనిపించలేదు. సంగీతాన్ని ఆస్వాదిస్తూ, మధ్య మధ్యలో ఆ దేశం గురించిన అనుమానాలను నివృత్తి చేసుకుంటూ కాలం గడిపేసింది సౌ.
చిమీ లఖాంగ్ లోనికి ప్రవేశించగానే ఒక రకమైన అనీజీనెస్. ఈ గుడి గురించి నిన్నరాత్రే గూగుల్ చేసి చదివింది. కానీ నేరుగా చూస్తుంటే అక్కడి వాతావరణం ఇబ్బందికరంగా అనిపిస్తోంది. గుడి గోడలమీద మేల్ ప్రయివేట్ ఆర్గాన్ పెయింటింగ్స్ వున్నాయి. పిల్లల కోసం దంపతులు దేవుడికి సమర్పించడానికి చెక్కతో తయారు చేసిన ఫాలిసెస్ అమ్ముతున్నారక్కడ. లోపల వాటిని సమర్పించి మొక్కుకుంటే తమను చెడు సోకదని, సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆ దేశప్రజలు నమ్ముతారట. గుడిలోపల వెండి హ్యాండిల్ వున్న ఫాలిస్ తో అక్కడి పూజారి తలమీద కొట్టి ఆశీర్వదిస్తున్నాడు.
అక్కడి స్థానిక మహిళలే కాదు. విదేశీయులు కూడా సంతానం కోసం గుడి చుట్టూ తిరుగుతున్నారు. ప్రదక్షిణ పూర్తయ్యాక అక్కడున్న బోన్ డైస్ ని రోల్ చేస్తే ఏడాదిలోగా గర్భం దాల్చే అవకాశం ఎంతుందో లెక్కించి చెబుతున్నారు పూజారులు. ఈ గుడికి వచ్చి మొక్కుకుంటే ఖచ్ఛితంగా పిల్లలు పుడతారని, తమ రాణి కూడా సంతానం కోసం ఈ గుడిని సందర్శించాకే వారసుడు కలిగాడని యాంగ్ చెప్పాడు.
అవన్నీ వింటుంటే ఆమెకు వింతగా వుంది. వారి పూజా విధానాల గురించి ఎప్పుడూ వినకపోవడంతో గుడిలోపల జరుగుతున్నవన్నీ మిస్టీరియస్ గా కనిపిస్తున్నాయి.
అక్కడినుంచి యాంగ్ ఇంటికి అరగంట ప్రయాణం.
యాంగ్ ఇల్లు చాలా చిన్నది. కారు దిగగానే యాంగ్ తల్లి మర్యాదగా లోనికి ఆహ్వానించింది. లోపల రెండు డాగ్స్. ఇక్కడి వాళ్లకు పెట్స్ అంటే చాలా ప్రేమ అనుకుంది. ప్రతి రెస్టారెంట్ లో పెట్ డాగ్స్ వున్నాయక్కడ. యాంగ్ తల్లి నేలపై కార్పెట్ వేసి పైన్ ప్లేట్లు, గిన్నెల్లో అన్నం కూరలు పెట్టింది. వంటలు చాలా రుచిగా వున్నాయి. వారి తోటలో పండించిన కూరగాయలట. భూటాన్ మిర్చి ఎంత కారమో చూడాలని కాస్త కొరికింది సౌ. జివ్వుమంటూ తలకెక్కింది కారం. ఎన్ని నీళ్లు తాగినా కారం తగ్గలేదు. ఆ కారం వల్ల సరిగ్గా అన్నం కూడా తినలేక పోయింది. ఎండిన చీజ్ ముక్కలు, పచ్చివక్కలతో కూడిన తాంబూలం ప్లేట్ ని వారి ముందు పెట్టి బయటకెళ్లింది యాంగ్ తల్లి.
తింటూ వుంటే, ‘మాదేశం, మా ఆహారం నచ్చిందా మీకు’ అడిగాడు.
‘చాలా నచ్చింది. రెండుమూడు రోజులు కాస్త అన్ రెస్ట్ గా వున్నా రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కామ్ నెస్ నా నరనరాల్లోకీ ఇంకిపోతోంది. చాలా ప్రశాంతంగా, ఏ బాదరబందీ లేకుండా వుండటం…ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మళ్లీ మళ్లీ రావాలని వుంది. ఈ సంస్కృతి గురించి లోతుగా అధ్యయనం చేయాలని వుంది’ మనస్ఫూర్తిగా చెప్పింది సౌ.
‘మళ్లీ రావడం కాదు. ఇక్కడే వుండిపోవచ్చుగా?’
‘ఎలా? పనులు, ఉద్యోగం…’ ఇంకా ఏదో చెప్తుంటే మధ్యలోనే ఆపేశాడు.
‘కనీసం ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకోకుండా ఉరుకుల పరుగుల జీవితాలు దేనికి. సౌందర్యా! మీది ఎంత అందమైన పేరు. పూర్తిగా పిలవడం కూడా కష్టమని కుదించేశారు. పది నిముషాల కంటే ఎక్కువసేపు బాత్ టబ్ లో కూర్చుంటే మీ అబ్సెన్స్ తో ఎక్కడో పనులు జరగడం ఆలస్యమైపోతాయని ఆదుర్దా. మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. మీలో ఏదో తెలియని అసంతృప్తి. కానీ వినండి. ఎన్ని చేసినా, మరిన్ని చేయాలని ఎంత తపన పడినా, చివరికేం మిగలదు. మొన్న మీకు సంతోషాన్నిచ్చిన కొన్ని మూమెంట్స్ ని రాయమని అడిగాను గుర్తుందా? ఒకటి రెండు మినహా మీరు రాసిన మీ సంతోష సమయాలన్నీ ప్రకృతిలో మిమ్మల్ని మీరు మర్చిపోయి గడిపిన క్షణాలే. ట్రీహగ్గింగ్ చేసుకున్నప్పుడు మీకు అర్థమయ్యే వుండాలి. ప్రకృతి ముందు మనమెంత అల్పులమో. మీరు స్వచ్ఛమైన గాలి కూడా పీల్చడం లేదని గుర్తించండి’ చెప్పుకుపోతున్నాడు యాంగ్.
ఎప్పుడూ నవ్వినట్టు కనిపించే యాంగ్ కళ్లు ఇప్పుడు తీక్షణంగా వున్నాయి.
మౌనంగా అతనికేసే చూస్తూ వింటోందామె.
‘ఇక్కడే వుండిపోండి. నా కోసం. గైడ్ గా నేను చాలా మందిని చూస్తాను. కుటుంబసభ్యుల్లా కలిసిపోతాం.. వున్నన్నాళ్లూ. తర్వాత మర్చిపోతా. కానీ మీరు భూటాన్ లో అడుగుపెట్టిన క్షణం మిమ్మల్ని చూడగానే చాలా యేళ్లనుంచి మనం ఒకరికొకరం పరిచయస్తులమన్నట్టు అనిపించింది. అనురాగం పుట్టింది. ఎందుకో చెప్పలేను. టైగర్స్ నెస్ట్ వెళ్తున్నప్పుడు మీరే నా జీవిత భాగస్వామని, నా కోసమే వచ్చారని అనిపించింది. నాకదో సెంటిమెంటల్ ప్లేస్. అక్కడ మీతో కలిసి నడవటం అద్భుతమైన అనుభూతి. మీరు ఏదో తెలియని అసంతృప్తితో అలజడిగా వుండటం చూసి నాకేమనిపించిందో తెలుసా. జీవితాంతం మీతో వుంటూ మిమ్మల్ని సంతోషంగా వుంచాలని. టైగర్స్ నెస్ట్ గుడిలో మీకీ విషయం ప్రమాణపూర్వకంగా చెప్పాలని అనిపించింది. జీవితాన్ని మీరు చూసే కోణంలో మార్పు తీసుకురావాలని అనిపించింది. నా దగ్గర డబ్బు లేదు. సంపాదించాలన్న కోరికా లేదు. బేసిక్ అవసరాలు తీర్చుకోవడానికి సరిపడా సంపాదన చాలు నాకు. దానికి ఈ గైడ్ ఉద్యోగం సరిపోతుంది. మనం సృష్టించిన కృత్రిమత్వాన్ని నిజమనుకుంటూ ఎన్నాళ్లు కాలం గడపడం. మనకేం కావాలో తెలుసుకునే లోపే జీవితం ముగిసిపోతుంది. ఇక్కడికి వచ్చేయండి. కాలుష్యంలేని ప్రకృతిలో, కల్మషం తెలియని మనుషుల మధ్య మీకు మీరే రాణిలా బ్రతకండి. మీకు నేను, నాతో గడపబోయే జీవితం ఇష్టమైతే నేను ప్రాణంగా ప్రేమించే పైన్ చెట్ల సాక్షిగా పెళ్లి చేసుకుందాం. ఎందుకంటే మన వీడ్కోలుతో నేను మిమ్మల్ని మరవడం అసాధ్యం.’ మనసులో మాట నిజాయితీగా బయటపెట్టాడు.
అతనంత ఎక్స్ ప్రెసివ్ కాదు.. ఆమె అంగీకరిస్తుందో, తిరస్కరిస్తుందోననే ఆదుర్దా. అయినా చెప్పకుండా వుండటం అతనివల్ల కాలేదు. ఈ అవకాశం తప్పిపోతే ఆమెను ఇక జీవితంలో కలవలేడన్న వాస్తవం అతనికి తెలుసు. చెప్పాల్సిందంతా చెప్పేసి ఆమె సమాధానం కోసం చూస్తున్నాడు. ఏం సమాధానం వినాల్సి వస్తుందోనన్న ఆందోళనతో అతడి మొహం కందిపోయి వుంది.
లేచి వెళ్లి యాంగ్ పక్కనే కూర్చుని భుజంపై చెయ్యేసింది.
‘యాంగ్! రిలాక్స్. నిజమే. నేను ఇక్కడికొచ్చేవరకు యాంత్రికంగా బ్రతికేశాను. ఈ జీవితం నాకు పరిచయం లేనిది. ఇప్పటి వరకు ఎంత మిస్సయ్యానో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. జీవితాన్ని ఎలా మలుచుకోవాలో, ఎలాంటి జీవితాన్ని ఎంపిక చేసుకోవాలో మన చేతుల్లోనే వుంది. కానీ ప్రేమ అలా కాదు. ఎవరి మీద ఏ క్షణంలో ప్రేమ పుడుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నానో లేదో నేను చెప్పలేను. కానీ ప్రేమ పుట్టడానికి పునాదిగా మీరంటే మంచి అభిప్రాయమే వుంది. నాక్కొంచెం టైమ్ కావాలి’ మృదువుగా చెప్పింది.
సరిగ్గా రెండు నెలల తర్వాత, నిక్ స్వచ్ఛంద సంస్థ తరపున పని చేయడానికి వర్క్ పర్మిట్ తీసుకుని పారో ఎయిర్ పోర్టు లో దిగిన సౌందర్య ను రిసీవ్ చేసుకున్నాడు యాంగ్ చిన్. ఎన్నోయేళ్లు దూరమై తిరిగి కలిసినట్టు చూడగానే గట్టిగా కావలించుకుంది. మెడచుట్టూ చేతులేసి నవ్వుతున్న యాంగ్ కళ్లలోకి చూస్తూ
‘నాకిప్పుడేం కోరికలు, ఎక్స్పెక్టేషన్స్ లేవు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కూడా నేను రాలేదు. ఐ బిలాంగ్ టు దిస్ ప్లేస్ అనిపించించింది. తిరిగెళ్లిన రోజు నుంచి ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్. ఇండియా లోనూ, అమెరికా లోనూ ఇమడలేక పోయాను. చిన్నప్పటినుంచి పెరిగిన వాతావరణమే అయినా, ఊపిరాడలేదు. స్వేచ్ఛగా బ్రతకాలని, స్వచ్ఛంగా బ్రతకాలని అన్పించింది.ఇక్కడే ఇంకొన్ని రోజులు గడపాలని వచ్చేశా. ఈ కొండలు, లోయలు, స్వచ్ఛమైన గాలి, ఈ కామ్ నెస్..అన్నీ మిస్ అయ్యా. నిద్ర పట్టలేదు. నిక్ కి కాల్ చేసి భూటాన్ లో నాకు వుద్యోగం కావాలని చెప్పేశా. జీతం కూడా ఎక్కువేమీ ఇవ్వక్కర్లేదని, నెల ఖర్చులకు ఇస్తే చాలని చెప్పేశా.
భూటాన్ మీద చాలా ప్రేమ పుట్టింది. ఈ సంవత్సరం రోజులు పూర్తిగా ఎక్స్ ప్లోర్ చేస్తా. మీరే నా గైడ్. ఈసారి తిరిగెళ్లాక ఈ ప్రాంతాన్ని కాక మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ వస్తే ఆ తర్వాత మీకోసం వచ్చేస్తా, శాశ్వతంగా’. ఎక్సయిటింగ్ గా చెప్తున్న సౌందర్య వైపు, ఆమె చేతులకున్న తన గ్లవ్స్ వైపు అనురాగంతో చూస్తూ వుండిపోయాడు యాంగ్.
యస్! యూ బిలాంగ్ టు దిస్ ప్లేస్. వియ్ బిలాంగ్ టు ద మైటీ నేచర్…టూ ఈచ్ అదర్ అనుకుంటూ.
*








[…] జీవులకు ఒక గైడ్ని లాంటిది ఈ “ఊర్ధ్వతలం” […]