తిన్నని నేలబారు సరళరేఖ కాదు
ఎత్తుపల్లాల వొంపులెన్నో తిరిగి ….
ఋతువులెన్నో గడచి ;
కాలానికి వసంతాలు పూచి
వందేళ్ళుగా పరిఢవిల్లుతూ
రెండున్నర వేల మైళ్ళ పొడుగుతా
మానవ జీవనగాధల్ని విన్పిస్తూ
ప్రవహిస్తోన్న రోడ్డు …..
రూట్ 66 !
కరువుకాటకాలు ముంచెత్తిన
dust bowl కాలంలో
పడమటి తీరానికి చేర్చి
పట్టెడన్నం పెట్టిన అమ్మే కదా.
ఈ రూట్ 66 !
సెయింట్ లూయిస్ నించి షికాగో
మీదుగా …..
మిసిసిపి నదిని మీటుతూ,
హృదయానుభూతుల భూపాలరాగమై
లాస్ ఏంజెలిస్ కి దారులు తీసిన
అలల గిటారు గీతమే ఈ రూట్ 66!
నదుల్లానే రోడ్లు కూడా ……
నాగరికతకి వన్నెచిన్నెలద్దుతాయి.
మనుషుల్ని కలుపుతాయి !
అందుకే గావును
నూత్న గవాక్షాలు తెరుస్తూ
ఎప్పటికప్పుడు —
ఈ లోకాన్ని మరింత విశాలం
చేసే
పండువెన్నెల ప్రవాహం తానై
పరివ్యాప్తమౌతోంది రూట్ 66!
*








రూట్ 66 బావుంది
చాలా బాగుంది సర్.అభినందనలు 💐💐💐