నూరు కలాలు

రాయడం మొదలుపెట్టిన రోజు నుంచే మనిషి అంధుడిగా ఉండటం ఆగిపోతుంది.

రేఖ గాఛి ఆ ఇంట్లో చిన్న కూతురు. ఆమె బంగ్లాలో ఆనర్స్‌తో పట్టభద్రురాలైంది. వివిధ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతోంది. ప్రాథమిక పాఠశాల ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేసుకుంది. కొద్దిరోజుల్లో పరీక్షకు హాజరు కావాలని లేఖ వచ్చింది.

ఆమె మిత్రులు సహధ్యాయులలో  చాలామంది కూడా ఇలాంటి పరీక్షలు రాస్తున్నారు. ఫలితాలు వచ్చినప్పుడు రేఖ పేరు ఎంపికయిన వారి జాబితాలో ఉంది. తర్వాత ఇంటర్వ్యూను కూడా తను విజయవంతంగా పూర్తి చేసింది.

ఇంటర్వ్యూలో తండ్రి వృత్తి గురించి అడిగారు. దరఖాస్తులో ఆమె “వ్యవసాయం” అని రాసింది. తాటి చెట్లను కోసి రసం తీసే పనిని ఇంగ్లీషులో ఎట్లా చెప్పాలో తెలీక చెప్పలేక, తడబడుతూ వ్యవసాయం అని చెప్పింది.

ఆమెకు కొలగాఛి ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగం వచ్చింది. ఆఫీసుల చుట్టూ తిరగడం అనేక కార్యాలయ లాంచనాల్ని పూర్తిచేయడం అయిపొయింది.

ఆమె తండ్రి ఇరవై వరకే అంకెల్ని లెక్క పెట్టగలడు. అంతకు మించి చదవడం, రాయడం నేర్చుకోలేదు. ఒక కన్ను కనిపించని అమ్మమ్మ ఇంటి మూలన ఉండేది. శరీరం బలహీనంగా, నడవలేక, రోజంతా పాన్ నములుతూ గడిపేది. దగ్గరికి వెళ్ళినప్పుడు మెల్లిగా సున్నితంగా మాట్లాడేది. అప్పుడప్పుడు తన వంగిపోయిన నడుముతో రేకుల షెడ్ నుంచి ఇంట్లోకి వెళ్ళేది.

తన పేరు ఎంపిక జాబితాలో చూసిన వెంటనే, రేఖ గాఛి అమ్మమ్మ కాళ్ళు మొక్కేందుకు పరుగెత్తింది.

పాఠశాలకు వెళ్లే ముందు రేఖ గాఛి  తాఖుమా దగ్గరకు వెళ్లి పాదాలు తాకింది.

ఆ రోజు స్కూలుకు వెళ్ళాల్సిన రోజు.

 ఉదయాన్నే స్నానం చేసి సిద్ధమయింది. మీ  పాఠశాలలో ఎంతమంది విద్యార్థులున్నారు తాఖుమా అడిగింది. వంద వరకు ఉండొచ్చు. చుట్టుపక్కల వున్న ముస్లింలు, చేపలుపట్టే వాళ్ళ పిల్లలు, కొంతమంది బాగ్ది, నమశూద్ర పిల్లలు, ఒకరిద్దరు ఘోష్ కుటుంబాల వాళ్ళు అంది రేఖ గాఛి.

తకుమా వంద ‘పెన్నులు’ కొనుక్కు పొ అంది.

స్కూలుకు వెళ్ళే ముందు మళ్ళీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది రేఖ.  ‘పెన్నులు (కలాలు)  తీసుకున్నావా?” ఆమె మృదువుగా అడిగింది.

“లేదు.”

“ఎందుకు తీసుకోమన్నానో అడగలేదే!”

అవును ఎందుకు అడిగింది రేఖ గాఛి.

వేల సంవత్సరాలుగా మన వాళ్లు రాయలేకపోయారు, కళ్ళు ఉన్నా అంధుల్లా ఉన్నారు. ఇతరులు రాసింది నిజమని నమ్మాల్సి వచ్చింది. ఆ వేల సంవత్సరాల చీకటిని చెరిపేయాలంటే ప్రతి ఒక్కరూ కలం పట్టాలి. స్వంతంగా రాయాలి, అందుకే ప్రతి పిల్లవాడికీ ఒకటి ఇవ్వు. ఇస్తూ ఈ మాటలు తప్పకుండా చెప్పు.

త్వరగా వెళ్లి రా!  ఆలస్యం అవుతుంది వెళ్ళు” అంది.

సాయంత్రం పాఠశాల నుంచి వచ్చి, కందిలి దీపం వెలుతురులో చదువుకోవడానికి కూర్చుంది రేఖ. అలసటతో ఎప్పుడో కొద్ది సేపట్లో నిద్రలోకి జారుకుంది.

అప్పుడు ఆమె కలం పాళీ ఎగరడం మొదలైంది.

అది ఎత్తుకు ఎగిసినప్పుడు, దూరం నుంచి చూస్తే ఆకాశమంతా ఒక పెద్ద పాము కమ్మేసినట్టు  అనిపించింది. చీకటి కమ్ముకుంది. తుపాను వచ్చింది. తరువాత కుండపోత వర్షం…  నల్లటి సిరా చుక్కల వర్షం.

దేవాలయాలు, మసీదులు, చర్చిల పాత గ్రంథాల పేజీలు గాలిలో ఎగిరిపోయాయి. ఆ నల్లటి  సిరా, విశ్వమంతా చెల్లాచెదురైన ఆ పేజీలపై ఉన్న ప్రతిదాన్ని తుడిచేసింది.

అప్పుడు రేఖ, ఒక మత్తులో ఉన్నట్టుగా వాటిపై పరుగెత్తింది. ఆమె అడుగుపడిన చోటల్లా తెల్లటి ఖాళీ పేజీలు వెలిసాయి.

పిల్లలు చేతుల్లో కలాలు పట్టుకుని ఆమెను అనుసరించారు. ఆ పేజీలపై కూర్చుని, ఒక కొత్త చరిత్రను రాయడం ప్రారంభించారు.

రాయడం మొదలుపెట్టిన రోజు నుంచే మనిషి అంధుడిగా ఉండటం ఆగిపోతుంది.

*

బెంగాలి మూలం: కల్యాణి ఠాకూర్ చరల్ 

ళ్యాణి ఠాకూర్ చరాల్ భారతీయ దళిత స్త్రీవాద సాహిత్యంలో ఒక శక్తివంతమైన స్వరం. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆమె కవయిత్రి, వ్యాసకర్త, సంపాదకురాలు, సామాజిక ఉద్యమకారిణిగా గుర్తింపు పొందారు. దళితుల జీవన వాస్తవాలు, మహిళల అణచివేత, కులవ్యవస్థ క్రూరత్వం, సామాజిక అసమానతలను ఆమె తన రచనల్లో గాఢంగా ప్రతిబింబించారు. “చరాల్” అనే పదాన్ని ఆమె స్వయంగా తన పేరుకు జోడించుకోవడం ద్వారా దళిత అస్తిత్వాన్ని గర్వంగా ప్రకటించారు.ఆమె కవిత్వంలో తిరుగుబాటు  స్వరం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం పోరాట భావన స్పష్టంగా కనిపిస్తాయి. బెంగాళీ దళిత సాహిత్య ఉద్యమంలో ఆమె ఒక ముఖ్యమైన స్వరంగా నిలిచారు. ఆమె రచనల్లో చండాలిని వంటి కవితా సంపుటాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. కులవివక్షకు వ్యతిరేకంగా, అట్టడుగు వర్గాల మనుగడ కోసం ఆమె కలం నిరంతరం పోరాడింది.

‘నేను చండాలిని
చరిత్ర నా ముఖంపై ఉమ్మేసినా
నా నరాల్లో ఇంకా అగ్నే ప్రవహిస్తోంది’.

….

‘నేను రాస్తున్నాను
ఎందుకంటే
మౌనం నన్ను నెమ్మదిగా చంపుతోంది

నా అక్షరాలే నాకు ఊపిరిగా మారిపోయాయి’ అంటూ ఆమె గొప్ప కవిత్వం రాసారు. ఆమె తన కృషితో బెంగాలీ దళిత సాహిత్య ఉద్యమానికి బలమైన స్వరాన్ని అందించారు.

 దళిత మహిళా అనుభవాలను ప్రధాన స్రవంతి సాహిత్య చర్చల్లోకి లాక్కొచ్చారు. మటువా సాహిత్యం, దళిత చరిత్ర, ఉపేక్షిత సమాజాల సంస్కృతిని తన రచనల ద్వారా సంరక్షించారు.

ఇంగ్లీష్ అనువాదం: శ్రిష్టి దత్త చౌదరి

వారాల ఆనంద్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు