విముక్తి  

వీధుల్లో నడుస్తున్నప్పుడు

కిటికీలోనుంచి

తలుపు చాటు నుంచి

వాళ్లు చూస్తున్నప్పుడు

నా చేతులకు బేడీలు ఉన్నట్టు అనిపించేది

చాలాకాలం ఆ చూపులు నన్ను వేధించినవి

 

రాజకీయాలు ఘర్షణలు

నా దారికి అడ్డం పడ్డది నిజమే

వాళ్లు నన్ను చూసి భయపడినప్పుడల్లా

నేనే ఎక్కువగా భయపడేది

అప్పుడు నా పక్కన ఎవరూ లేరు

నన్ను సమర్థించి సవరించే

సత్య స్థలం కాదు అది

వలలో పడ్డది చాపల తర్వాత నేనే

హౌరా లారీలు కొంగలు ఒకపక్క

నేను చెరువు ఒకపక్క

ఒడ్డున వలలు తలలు దించుకొని ఉన్నాయి

అలుగెల్లిన దుఃఖంతో

గుండె చెరువు అయింది

 

కులం తీసివేతలు తప్ప

కులం కూడికలు లేని వాన్ని

పాలన లేని కులం

పాదులేని తలం

పాలుకొచ్చినయి

విసిగిపోయిన నన్ను చూసి

కాలమే అప్పుడప్పుడు

నన్ను ఇంకో దారి గుండా నడిపించేది

 

అక్కడ చదివింది విన్నది

నిశ్శబ్దంగా నన్ను ఆవరించి

నన్ను నాలో పులిమి

నన్ను నన్నుగా చేసినవి

చెట్టు పుట్ట చెరువు

ఎగిరే పక్షిని ఎదగా మార్చి

నన్ను మరో లోకానికి దగ్గరగా చేసినవి

 

నాతో కలసి ఉంది

అమ్మ తర్వత చెరువు

చెరువు చూట్టు వున్న  బోరలు

తల పైన అమ్మ చెయ్యి

ఆకాశంలా ఉండేది

కోనేటి మూలకు పడుకున్నప్పుడు

ముని స్వప్నంలా నిశబ్ధవేడుక

ఒంటరిగా వొచ్చిన నన్ను

ఏకాంతన్ని చేసింది

 

ఒడ్డు మీద తిరుగుతున్న నాకు

వెన్నెలే దారి చూపింది

పూర్వ చింతనకు పూసిన

పాటి పరిమళం

నాకు దర్శనం ఇచ్ఛిన ఎరుక

మెల్ల మెల్లగా నా చెతికి ఉన్నట్టు ఆనిపించే

బెడిల నుంచి….

నిశ్శబ్ధం కొన్ని అక్షరాలు కలిపి

నన్ను విముక్తం  చేసినవి

మునాసు వెంకట్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు