‘మిగ్రే మొదటికేసు’ నవల గురించి:
జస్టిన్ మినార్డ్ రాత్రి రోడ్డుమీద నడుస్తూ వెళ్తూంటే ఒక భవంతి కిటికీలోంచి సహాయం కోసం ఒకమ్మాయి కేక వినిపిస్తుంది. ఆ అమ్మాయిని ఎవరో కిటికీనించి వెనక్కి లాగడం కనపడుతుంది. వెంటనే తుపాకీ శబ్దం వినిపిస్తుంది. అది వినిపించగానే అప్పటిదాకా ఆ ఇంటిముందున్న కారు అక్కణ్ణించి వేగంగా వెళ్ళిపోతుంది. మినార్డ్ వెళ్ళి తలుపు కొడితే ఆ ఇంటి బట్లర్ వచ్చి అతన్ని తిట్టి బయటికి గెంటేస్తాడు. మినార్డ్ అక్కణ్ణించి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి , పోలీస్ సెక్రటరీ జూల్స్ మిగ్రేకు ఫిర్యాదు చేస్తాడు. మిగ్రే అతన్ని తీసుకుని ఆ ఇంటికి వెళ్ళడంతో కథ మొదలౌతుంది. నిజంగా అక్కడ నేరం అంటూ ఏమన్నా జరిగిందా, జరిగితే దానికి బాధ్యులెవరు అనేవి పెను ప్రశ్నలకింద మారతాయి.
మొత్తం పారిస్‌లో నడిచే ఈ కథలో, ఇరవైయవ శతాబ్దపు మొదటిరోజుల్లో పారిస్ నగర వాతావరణాన్ని అక్కడి సమాజాన్ని మన కళ్ళముందు నిలబెడతాడు రచయిత. అరోజుల్లో రాచరిక భూస్వాముల జీవనం, అక్కడి పోలీస్ వ్యవస్థ, నేర వ్యవస్థ అన్నీ మనకు పరిచయం చేస్తాడు.
మొదటి అధ్యాయం – రిపోర్ట్
నల్లటి ఇనపకమ్మీ ఒకటి అడ్డంగా వేసి ఆ గదిని రెండుగా చీల్చారు. వచ్చిన జనం కూర్చోడానికి ఓ వైపు నల్లరంగు బెంచీ ఒకటి వేశారు. ఆ బెంచీని నోటీసులు అంటించిన తెల్లటి గోడకు ఆనించారు. ఇంకో వైపు డెస్కులు, సిరా బుడ్లు పెట్టిన స్టాండ్‌లు. గదంతా నలుపు తెలుపు రంగుల్లో ఉండేట్టు గూళ్ళ నిండా నల్లటి లావు ఫైళ్ళు. బొగ్గులతో పని చేసే నాలుగు కాళ్ళ భారీ సైజు స్టవ్ కూడా ఆ గదిలో ఉంది. ఆ స్టవ్ మీది చిమ్నీ నిటారుగా పైకెళ్ళి అక్కడ నించి ఒక పెద్ద వంపు తిరిగి సీలింగ్‌ను తాకుతూ ఎదురుగా ఉన్న గోడలోకెళ్ళి మాయమైంది.
ఇలాంటి స్టవ్‌లు పల్లె ప్రాంతాల్లో ఉండే రైల్వే స్టేషన్లలో కనపడతాయి. చలికాలంలో గదిని వేడిగా ఉంచేందుకు అలాంటి స్టవ్‌లు వాడతారు.
ఓ మూల లుకేర్ అనబడే బొద్దు మొహం కానిస్టేబుల్ చొక్కా గుండీలు తీసేసి నిద్ర కోసం ప్రయత్నిస్తున్నాడు. సమయం రాత్రి ఒంటి గంట దాటి ఇరవై ఐదు నిమిషాలైందని అక్కడి గోడమీది నల్లంచు గడియారంలోని ముళ్ళు చూపిస్తున్నాయి. లోపల గదిలో ఉన్న ఒకే ఒక గాస్ లైటు అప్పుడప్పుడూ టపటపా కొట్టుకుంటోంది. ఆ భారీ సైజు స్టవ్ కూడా కారణం లేకుండా అప్పుడప్పుడూ ఝమ్మని శబ్దం చేస్తోంది.
ఆగి ఆగి అపుడపుడూ వినిపిస్తోన్న టపాకాయల చప్పుడు, టాంగా టాక్సీ మీటరు పడ్డ శబ్దం, స్టేషన్ ముందునించి వెళ్ళే ఏటవాలు రోడ్డు మీద ఎవడో తాగుబోతు నడుస్తూ పాడే పాట రాత్రి నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తున్నాయి.
ఎడమవైపు ఉన్న డెస్కు మీద కూచుని సెయింట్ జార్జెస్ పోలీస్ స్టేషన్ సెక్రెటరీ ఒక స్కూలు పిల్లవాడిలా పెదాలు కదిలిస్తూ కొత్తగా జారీ చేసిన ఫ్రెంచి పోలీసు గజెట్ ఏకాగ్రతతో చదువుతున్నాడు. పుస్తకం మొదటి పేజీ మీద ఊదా రంగు ఇంకులో ‘జె.మిగ్రే’ అని రాసి ఉంది.
ఆ రాత్రి అప్పటికే మూడుసార్లు పోలీస్ సెక్రెటరీ లేచి వెళ్ళి స్టవ్‌లో బొగ్గుల్ని సరి చేసి వచ్చాడు. ఓరకంగా చెప్పాలంటే ముందు ముందు ఆ స్టవ్ అతన్ని అనుసరిస్తుంది. ఇలాటి స్టవ్‌నే అతను ఫ్రెంచి డిటెక్టివ్ ఆఫీస్‌లో పనిచేసేటప్పుడు చూస్తాడు. ఆ తరువాత కొన్నేళ్ళకు అక్కడనించి బదిలీ అయి అతను ఫ్రెంచి పోలీసు సెంట్రల్ ఆఫీస్‌లో డిటెక్టివ్ ఛీఫ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నప్పుడు సెంట్రల్ హీటింగ్ సిస్టం ఉన్నా కూడా పాత పోలీస్ స్టేషన్‌నించి ఇదే స్టవ్‌ని తెచ్చుకుని తన గదిలో పెట్టుకుంటాడు.
ఆరోజు తారీఖు ఏప్రిల్ 15, 1913వ సంవత్సరం. అప్పట్లో ఫ్రెంచి పోలీస్ సెంట్రల్ ఆఫీస్‌ను ‘సుర్తి’ అనే పిలిచేవారు. ఆ రోజు పొద్దున పక్క దేశం ప్రెసిడెంట్ తన మందీ మార్బలంతో పారిస్‌లోని లాంగ్ ఛాంప్ స్టేషన్‌కు వస్తే ఆయనకు స్వాగతం పలకడానికి ఫ్రెంచి ప్రెసిడెంటు స్వయంగా వచ్చాడు. రోడ్డుకు రెండుపక్కలా జెండాలు రెప రెపలాడిస్తూ ప్రజలు నిలబడి ఉంటే, భారీగా అలంకరించిన గుర్రపు బగ్గీల్లో అతిథులను కూర్చోబెట్టి రిపబ్లికన్ గార్డ్స్ కవాతుతో పారిస్ ప్రధాన వీధులు బాయిస్ స్ట్రీట్, శాంజ్ ఎలీసే స్ట్రీట్‌ల గుండా ఊరేగింపు జరిగింది.
ఫ్రెంచి సైన్యం కూడా కవాతు చేసింది. ఓప్రా హౌస్‌లో సంగీత కచేరితో పాటూ రంగులు విరజిల్లే టపాకాయలు పేల్చి గొప్ప ప్రదర్శన జరిపారు. అక్కడకొచ్చిన జనాల కేకలు సద్దుమణగడం ఇప్పుడే మొదలైంది.
పోలీసులు మాత్రం పనితో ఉక్కిరిబిక్కిరైపోయారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముందుగా కొంతమందిని అరెస్టు చేసినా మరీ ప్రమాదకరమైన నేరగాళ్ళతో ముందస్తు ఒప్పందాలు చేసుకున్నా చివరి క్షణంలో తీవ్రవాదులు దాడి చెయ్యొచ్చననే సమాచారం ఉండడంతో పోలీస్ శాఖ అంతా క్షణక్షణం భయపడుతూ గడిపింది.
ఆ అర్థరాత్రి సమయాన రోష్ ఫుకో స్ట్రీట్‌లో ఉన్న సెయింట్ జార్జెస్ పోలీస్ స్టేషన్‌లో మిగ్రే, లుకేర్ మాత్రమే కూర్చుని ఉన్నారు.
బయటినుంచి గబగబా అడుగుల చప్పుడు వినిపిస్తే తలపైకెత్తి చూసారిద్దరు. తలుపు తెరుచుకుంది. ఒక యువకుడు చప్పున లోపలికొచ్చి తన మొహాన పడుతున్న పెట్రోమాక్స్ లైటు వెలుగుకి కళ్ళు చిట్లించుకుంటూ మిగ్రేకు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు.
“ఛీఫ్ ఇన్‌స్పెక్టర్ మీరే కదా!” అంటూ ఆయాస పడుతూ అడిగాడు.
“కాదు, నేను ఆయన సెక్రెటరీని” అన్నాడు మిగ్రే కుర్చీలోనే కూర్చుని.
ఆ క్షణంలో మిగ్రేకు తెలీదు ఈ కేసే తన మొట్టమొదటి కేసు అవబోతోందని.
ఎదురుగా నిలబడి ఉన్నతను బక్కపలచగా నాజూగ్గా ఉన్నాడు. బంగారు రంగు జుట్టు, నీలం రంగు కళ్ళు, గులాబి రంగు శరీర ఛాయ. నల్లటి సూటు మీద పసుపుపచ్చ కోటు వేసుకుని ఒక చేతిలో చార్లీ చాప్లిన్ పెట్టుకునే బౌలర్ హ్యాట్ చేతిలో పెట్టుకుని ఇంకో చేత్తో వాచిపోయి ఉన్న తన ముక్కును అదే పనిగా రుద్దుకుంటున్నాడు.
“పోట్లాట ఏమన్నా జరిగిందా?”
“లేదు, ఎవరో ఒక అమ్మాయి కేకలు వేస్తూంటే సహాయం చేద్దామని వెళ్ళాను.”
“ఎక్కడ జరిగిందీ సంఘటన?”
“చాప్తల్ రోడ్‌లో ఉండే ఒక పెద్ద భవంతిలో. మీరు వెంటనే నాతో వస్తే మంచిది. వాళ్ళు నన్ను బయటికి తోసి తలుపేశారు.”
“ఎవరు?”
“ఆ ఇంట్లో ఉండే బట్లరో, అటెండరో అనుకుంటాను.”
“మొదటినించి చెప్పండి? అసలింత రాత్రివేళ మీరు చాప్తల్ రోడ్‌లో ఏం చేస్తున్నారు?”
“నేను నా పని ముగించుకుని ఇంటికెళ్తున్నాను. నా పేరు జస్టిన్ మినార్డ్. నేను లోమారూ మ్యూజిక్ కంపెనీలో ఫ్లూటు వాయిస్తాను. మా ఇల్లు ఆంగ్యాన్ స్ట్రీట్‌లో సరిగ్గా పెటిపరీసియన్ పత్రికాఫీసుకు ఎదురుగా ఉంటుంది. సాయంత్రం క్లిచీ స్ట్రీట్‌లోని క్లిచీ రెస్టారెంట్‌లో మా కచేరీ ఉండింది. ఎప్పటిలానే బల్లూ స్ట్రీట్‌లోంచి నడుచుకుంటూ చాప్తల్ రోడ్‌లోకి వచ్చాను.”
పోలీస్ సెక్రెటరీ మిగ్రే తన అలవాటు ప్రకారం జాగ్రత్తగా అన్ని వివరాలు రాసుకుంటున్నాడు.
“సగం దూరం వచ్చేటప్పటికి వీధంతా ఖాళీగా ఉండటం గమనించాను. ఒక ఇంటి ఎదురుగా దెదియాన్ బౌటన్ కారు ఆపి ఉండటం చూసాను. ఇంజిన్ ఆన్‌లోనే ఉంది.బూడిద రంగు లెదర్ జాకెట్ వేసుకుని మొహం ఏమాత్రం కనపడకుండా పెద్ద కళ్ళద్దాలు పెట్టుకుని ఒకడు డ్రైవరు సీట్లో కూర్చుని ఉన్నాడు. నేను నడుచుకుంటూ కారు పక్కకు వచ్చేటప్పటికి, ఆ ఇంట్లోని రెండో అంతస్తు కిటికీ టక్కున తెరుచుకుంది.”
“ఇంటి నంబర్ గుర్తుందా?”
“17-A, ఎవరిదో బాగా డబ్బుండే వాళ్ళ ఇల్లు. ఆ ఇంటికి మామూలు గేటుతో పాటూ గుర్రపు బగ్గీ పట్టే పెద్దగేటు ఇంకోటి ఉంది. రెండో అంతస్తులోని ఆ కిటికీలోంచి తప్ప వేరే ఏ కిటికీలోంచి కూడా ఇంట్లోని లైట్లు వెలగడం కన్పించలేదు. ఎడమవైపు చివరినించి రెండో కిటికీ అది. నేను తల పైకెత్తి చూద్దును కదా! ఒకమ్మాయి ఆకారం కిటికీలోంచి బయటకు వంగి ‘హెల్ప్ , హెల్ప్’ అని అరుస్తోంది.”
“అప్పుడు మీరేం చేశారు?”
“ఆ గదిలో ఉన్న వాళ్ళెవరో ఆమెని కిటికీ దగ్గరనించి లాగేశారు. ఆవెంటనే తుపాకీ పేలిన శబ్దం వినపడింది. కారు కదిలిన శబ్దం వినపడి నేను వెనక్కి చూస్తే అప్పటిదాకా అక్కడ రోడ్‌లో ఆగివున్న కారు స్పీడుగా అక్కణ్ణించి వెళ్ళిపోయింది.”
“కారు ఇంజిన్ శబ్దం మీకు తుపాకీ శబ్దంలా విన్పడిందేమో?”
“ఆ అవకాశం లేదు. నేను వెంటనే వెళ్ళి ఇంటి బెల్లు కొట్టాను.”
“మీరప్పుడు ఒంటరిగా ఉన్నారా?”
“అవును.”
“మీ దగ్గర గన్ ఉండిందా?”
“లేదు.”
“అసలు ఏం చేద్దామనుకున్నారు?”
“అంటే?”
ఆ ప్రశ్న అతన్ని ఎంత ఇబ్బందిపెట్టిందంటే సమాధానం చెప్పలేకపోయాడు. మూతిమీద ఎర్రటి మీసం, మొహంమీద అక్కడక్కడా వెంట్రుకలు లేకపోతే అతన్ని పదహారేళ్ళ పిల్లాడనుకునే ప్రమాదం లేకపోలేదు.
“ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా తుపాకీ పేలిన శబ్దం వినపడుండాలి కదా?”
“లేదనుకుంటా!”
“ఆ ఇంట్లోవాళ్ళు తలుపు తెరిచారా?”
“వెంటనే తెరవలేదు. మూడుసార్లు బెల్లు కొట్టాల్సి వచ్చింది. ఇంకా తీయకపోతే తలుపును కాలితో తన్నటం మొదలుపెట్టాను. చివరికి లోపల్నించి అడుగుల శబ్దం వినిపించింది. మొదట తలుపుకుండే గొలుసు తీసిన శబ్దం తర్వాత గడియ తీసిన శబ్దం వచ్చింది. వరండాలో లైటు లేదు, కానీ ఇంటి బయట పెట్రోమాక్స్ లైటు వేలాడదీసివుంది.”
పోలీసు స్టేషన్‌లో గడియారం, సమయం ఒంటిగంటా నలభై ఏడు నిమిషాలు అయినట్టు చూపిస్తోంది. మాటిమాటికీ జస్టిన్ మినార్డ్ ఆందోళనగా ఆ గడియారం వైపు చూస్తున్నాడు. “పొడుగాటి మనిషొకడు బట్లర్‌లు వేసుకునే నల్ల సూటు వేసుకునొచ్చి నీకేం కావాలంటూ అడిగాడు.”
“సూటు వేసుకుని వచ్చాడా?”
“అదే కదా!”
“ప్యాంటు వేసుకుని టై కట్టుకుని మరీ?”
“అవును.”
“అయినా ఇంట్లో ఎక్కడా లైట్లు వెలగడం లేదంటారు?”
“రెండో అంతస్తులోని ఆ గదిలో తప్ప.”
“మీరు అతన్ని ఏమని అడిగారు?”
“గుర్తు లేదు. లోపలికెళ్ళడానికి ప్రయత్నించాను.”
“దేనికి?”
“నేనే లోపలికెళ్ళి చూద్దామనుకున్నాను. వాడు అడ్డంగా నిలబడ్డాడు. నేను కిటికీలోంచి అరిచిన అమ్మాయి గురించి చెప్పాను.”
“అతనేం చేశాడు?”
“కోపంగా నన్నో చూపు చూసి బలమంతా ఉపయోగించి నన్ను పక్కకు తోశాడు.”
“అప్పుడు?”
“నేనేదో ఉన్నదీ లేనిదీ ఊహించుకుంటున్నానని తాగేసి ఉన్నానని ఏదేదో పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. అప్పుడు చీకట్లోంచి ఏదో గొంతు వినపడింది. మొదటి అంతస్తు హాల్లోంచి వచ్చినట్టనిపించింది.”
“ఏమని?”
“లూయీస్ తొందరగా రా! అంటూ.”
“ఆ తర్వాత?”
“వాడు నన్ను మళ్ళీ గట్టిగా ఒక్క తోపు తోశాడు. నేను తట్టుకున్నాను. మొహం మీద గుద్దాడు. ఆ దెబ్బకి తలుపుకవతల బోర్లాపడ్డాను. అలానే నా మొహం మీదే తలుపేసాడు.”
“రెండో అంతస్తులో లైటు ఇంకా అలానే వేసుందా?”
“లేదు.”
“కారు వెనక్కొచ్చిందా?”
“లేదు, మనం వెంటనే బయలుదేరి వెళ్తే మంచిదేమో కదా?”
“మనమా? అంటే మీరుగూడా నాతో రావాలనా?”
అతని మొహం మీద నాజూకుతనానికీ అతను చూపిస్తున్న తెగువకూ మధ్య కనిపిస్తున్న వైరుధ్యం చూడ్డానికి కొంత తమాషాగా ముచ్చటగా ఉంది.
“దెబ్బలు తింది నేనే కదా? ఫిర్యాదు చెయ్యాల్సింది నేనే కదా?”
“అవును, అది మీ హక్కు.”
“కానీ ఫిర్యాదు రాసివ్వడమనేది తరవాత కూడా చెయ్యొచ్చు కదా?”
“ఇంటి నంబరు ఏమన్నారు?”
“17 – A.”
మిగ్రే నొసలు చిట్లించాడు, ఆ నంబరు ఎక్కడో విన్నట్టుంది. గూట్లోంచి ఒక ఫైలు తీసి తిరగేశాడు. ఫైలుమీది పేరు చదివి ఇంకొంచెం నొసలు చిట్లించాడు.
మిగ్రే మోకాళ్ళ దాకా ఉండే పొడుగాటి టైల్ కోటు వేసుకోనున్నాడు. మొట్టమొదటిసారి అతను ఆ కోటంటూ వేసుకోడం. పక్కదేశం ప్రెసిడెంటు పర్యటన సందర్భంగా ఎవరినైనా సెక్యూరిటీగా రమ్మంటూ పిలిచే అవకాశం ఉంది కాబట్టి సహాయక శాఖల్లో ఉండే పోలీసులతో పాటూ అందరూ పూర్తి యూనిఫారం వేసుకుని రావాలని ఆఫీస్ మెమో వచ్చింది.
షాపులో కొనుక్కున్న ఆ రెడీమేడ్ లేత పసుపుపచ్చ రంగు కోటు, జస్టిన్ మినార్డ్ వేసుకున్న కోటు రెండూ ఒకేలా ఉన్నాయి.
“రండి వెళదాం. లుకేర్! ఎవరైనా నాగురించి అడిగితే కొద్దిసేపట్లో వస్తానని చెప్పు.”
మిగ్రే కొంచెం పరాగ్గా ఉన్నాడు. ఫైలుమీద చదివిన ఆ పేరు అతన్ని ఇబ్బంది పెడుతోంది.
మిగ్రే వయసు ఇరవై ఆరేళ్ళు. అప్పటికి పెళ్ళై కేవలం ఐదు నెలలైంది. నాలుగేళ్ళ క్రితం పోలీసు ఉద్యోగంలో చేరినప్పటినించి ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్, రైల్వే స్టేషన్, డిపార్ట్‌మెంట్ స్టోర్ లాంటి పెద్దగా ప్రాముఖ్యత లేని చోట్ల పని చేశాడు. సెయింట్ జార్జెస్ పోలీస్ స్టేషన్‌లో ఛీఫ్ ఇన్‌స్పెక్టర్‌కు సెక్రెటరీగా చేరి ఒక సంవత్సరమే అయ్యింది.
అసలు విషయం ఏమిటంటే ఆ ప్రాంతంలో అందరికంటే పలుకుబడి ఉన్న కుటుంబం హౌస్ నంబర్ 17-A, చాప్తల్ రోడ్‌లో ఉంటుంది.
‘జాందో బాల్తజార్ : బాల్తజార్ కాఫీ’ – పెద్ద బూడిద రంగు అక్షరాల్లో మెట్రో స్టేషన్లలో పారిస్ అంతటా గోడల మీద ఈ పేరు రాసుంటుంది. పారిస్ వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ ‘బాల్తజార్ కాఫీ’ అని రాసున్న నాలుగు గుర్రాల బగ్గీలు కనపడతాయి.
మిగ్రే రోజూ తాగేది కూడా బాల్తజార్ కాఫీ. అతను ఓప్రా స్ట్రీట్‌లోకి ఎప్పుడు వెళ్ళినా పక్కనే ఉన్న తుపాకీలు మరమ్మత్తు చేసే దుకాణం దగ్గర నిలబడి బాల్తజార్ షాపులోంచి వచ్చే కాఫీ పౌడరు సువాసనలు పీల్చకుండా తిరిగిరాడు.
రాత్రి వాతావరణం చల్లగా నిర్మలంగా ఉంది. స్టీప్ స్ట్రీట్‌లో ఒక్క ప్రాణీ కనపడ్డం లేదు, టాక్సీలు అసలే లేవు. ఆ రోజుల్లో మిగ్రే కూడా జస్టిన్ మినార్డ్‌లాగే సన్నగా ఉండేవాడు. వాళ్ళిద్దరూ పక్కపక్కన రోడ్డుమీద నడుస్తూంటే ఇంకా పూర్తిగా ఎదగని టీనేజి పిల్లల్లా ఉన్నారు.
“మీరు తాగి లేరు కదా?”
“నాకు తాగుడలవాటు లేదు. డాక్టర్లు వద్దన్నారు.”
“మీరు చూసినప్పుడు కిటికీ తెరిచి ఉందని ఖచ్చితంగా చెప్పగలరా?”
“నూటికి నూరుశాతం.”
తనంతట తాను ఒక కేసు డీల్ చేయడం మిగ్రేకు ఇదే మొదటిసారి. పారిస్‌లోకెల్లా విలాసవంతమైన జీవితం గడిపే పోలీస్ ఛీఫ్ ఇన్‌స్పెక్టర్, తన పై అధికారి ఐన లెబ్రేకు సాయంగా మిగ్రే అనేక సార్లు రైడ్‌లకు వెళ్ళాడు. వాటిల్లో నాలుగుసార్లు రైడుకు వెళ్ళింది, అక్రమ సంబంధాల కేసుల్లో సాక్ష్యాలు సేకరించడానికి.
రోష్ ఫుకో రోడ్డులానే చాప్తల్ రోడ్డు కూడా వీధి వీధంతా ఖాళీగా ఉంది. జాందో – బాల్తజార్ ఇల్లు ఆ చుట్టుపక్కల కనిపించే ఇళ్ళన్నిటిలోకి ఖరీదైన భవంతి. కానీ ఇంట్లో ఒక్క లైటు కూడా వేసిలేదు.
“మీరు ఆ కారు చూసింది ఎక్కడ?”
“సరిగ్గా ఇక్కడే!”
జస్టిన్ మినార్డ్ కారు పార్క్ చేసి ఉందంటూ చూపించిన స్థలం ఆ ఇంటి గేటు ముందర లేదు, రోడ్‌లో ఇంకొంచెం ముందుకు ఉంది. అప్పటికే అతను ఇచ్చిన సమాచారంతో బుర్ర వేడెక్కిపోయిన మిగ్రే ఒక అగ్గిపుల్ల వెలిగించి కిందికి వంగి ఆ చెక్క పేవ్‌మెంట్‌ను పరీక్షించడం మొదలుపెట్టాడు.
“ఇక్కడ చూడండి!” అంటూ ఉత్సాహంగా మినార్డ్ నేలమీద కనపడ్డ నల్లటి ఆయిల్ మడుగును చూపించాడు.
“అసలు మీరు నాతో ఇక్కడికి రావటం సరికాదు.”
“వాడు మొహం మీద గుద్దింది నన్నే కదా!”
మిగ్రేకు ఇదంత తేలిక వ్యవహారంలా అనిపించలేదు. ఇంటిబెల్లు కొట్టడానికి చెయ్యి పైకెత్తినప్పుడు మిగ్రే ఛాతీ బిగుసుకుంది. ఏ అధికారంతో ఇక్కడికి వచ్చారని అడిగితే ఏం చెప్పాలా అని ఆలోచించాడు. అతని దగ్గర వారంట్ లేదు. అదీకాకుండా అర్ధరాత్రి సమయం. కేవలం ఒక ముక్కు వాచిన మనిషి ఇచ్చిన సాక్ష్యంతో ఇక్కడ నేరం జరిగిందని ఆరోపించగలడా తను? జస్టిన్ మినార్డ్‌లానే మిగ్రే మూడుసార్లు బెల్ కొట్టాల్సివచ్చింది. కానీ తలుపు కాల్తో తన్నాల్సిన అవసరం రాలేదు. లోపల్నించి గొంతు వినపడటానికి సమయం పట్టింది.
“ఏం కావాలి?”
“పోలీస్!” కొద్దిగా గొంతు సరిచేసుకుంటూ సమాధానం ఇచ్చాడు మిగ్రే.
“ఒక నిముషం ఆగండి. తాళం తీసుకొస్తాను.”
లోపల్నించి క్లిక్‌మంటూ శబ్దం వినిపించింది. ఇంట్లో కరెంటుంది. క్లిక్‌మన్న శబ్దం తర్వాత వాళ్ళు ఎడతెరిపి లేకుండా ఎదురు చూడాల్సివచ్చింది.
“అది వాడే” అన్నాడు గొంతు గుర్తుపట్టిన మినార్డ్.
చైను తప్పించి గడియ తీసిన శబ్దం అయ్యింది. నిద్రమొహం వేసుకుని ఉన్న మనిషి చూపులు మిగ్రే మీదుగా జస్టిన్ మినార్డ్ వైపుకు వెళ్ళి అక్కడే ఆగిపోయాయి.
“ఓహ్! వీణ్ణి పట్టుకున్నారా?” అన్నాడా మనిషి. “మీ మీద కూడా ఏవో ట్రిక్కులు ప్రదర్శించుంటాడు.”
“మేం లోపలికి రావొచ్చా?”
“అవసరం అనుకుంటే రండి. ఇల్లంతా నిద్రలోంచి లేచి కూచోకుండా మెల్లగా మాట్లాడండి. ఈ పక్కగా రండి.”
ఎడంపక్కనున్న మూడు చలవరాతిమెట్లు ఎక్కిన తర్వాత రెండు నగిషీపెట్టిన అద్దాల తలుపులు, తలుపులకవతల స్థంభాలతో కనపడుతోన్న పెద్దహాలు కనపడ్డాయి. అలాంటి ధనవంతుల ఇంట్లోకి అడుగుపెట్టటం అదే మొదటిసారతనికి. ఆ ఇల్లు ఎంత విశాలంగా భారీగా ఉందంటే అతనికి మంత్రిగారి ఆఫీసు గుర్తుకొచ్చింది.
“మీ పేరు లూయీ కదా?”
“మీకెలా తెలుసు?”
అలా అడుగుతూనే లూయీ డ్రాయింగ్ రూమ్‌లోకెళ్ళే తలుపు కాకుండా బట్లర్ పాంట్రీలాగా ఉన్న గదిలోకి వెళ్ళే తలుపు తెరిచాడు. లూయి అప్పుడే నిద్రలేచి వచ్చినట్టున్నాడు, తన బట్లర్ యూనిఫార్మ్‌లో కాకుండా పూల కాలరున్న తెల్ల చొక్కాతో పాటు అప్పుడే తొడుక్కున్నట్టుగా కనపడుతున్న ప్యాంటులో ఉన్నాడు.
“సారు ఇంట్లో ఉన్నారా?”
“పెద్దసారా? వారబ్బాయా?”
“పెద్దసారు.”
“పెద్దసారు ఫెలిసియెన్ ఇంటికింకా రాలేదు. వాళ్ళబ్బాయి రిచర్డ్ ఈపాటికి పడుకుని చాలాసేపయి ఉంటుంది. ఓ అరగంట క్రితమే ఈ తాగుబోతు…”
లూయీ పొడుగ్గా భారీగా ఉన్నాడు. ఓ నలభై ఐదేళ్ళు ఉండొచ్చు. పొద్దున చేసిన గడ్డం మీద వెంట్రుకలు మొలకలెత్తటం మొదలైంది. కళ్ళు బాగా నల్లగా ఉన్నాయి. అతిగుబురుగా ఉన్న కనుబొమ్మలు.
ఇంకసలు విషయంలోకి దూకెయ్యాలనుకుని గట్టిగా ఊపిరి పీల్చి అడిగాడు మిగ్రే “నేను రిచర్డ్‌గారితో మాట్లాడాలి.”
“ఆయన్ను లేపాలా?”
“లేపండి.”
“మీ ఐడీ చూపిస్తారా?”
మిగ్రే చూపించాడు.
“మీరు ఈప్రాంతంలో చాలారోజుల్నించి పని చేస్తున్నారా?”
“పది నెలలైంది.”
“సెయింట్ జార్జెస్ పోలీస్ స్టేషన్‌లోనే కదా పనిచేస్తున్నారు?
“అవును.”
“అయితే మీకు లెబ్రేగారు తెలిసుండాలే?”
“నేను ఆయనకే రిపోర్ట్ చేస్తాను.”
మాటల్లో బెదిరింపు ఏ మాత్రం దాచిపెట్టే ప్రయత్నం చెయ్యకుండా యథాలాపంగా అన్నాడు లూయీ “ఆయన నాకు బాగా తెలుసు. పార్టీకి ఇక్కడికాయన ఎప్పుడొచ్చినా దగ్గరుండి అన్నీ నేనే చూసుకుంటాను” కావాలని రెండు క్షణాలు ఏం మాట్లాడకుండా ఆగాడు. చూపులు ఎక్కడో ఉన్నాయి.
“రిచర్డ్ సారును లేపాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా?”
“ఉంది.”
“మీ దగ్గర వారెంటు ఉందా?”
“లేదు.”
“మరీ మంచిది. ఇక్కడే వెయిట్ చెయ్యండి.”
గదిలోంచి బయటకి వెళ్ళబోయేముందు అలమర్లోంచి గంజిపెట్టి ఇస్త్రీచేసిన తెల్లచొక్కా, నల్లని టై, చొక్కాకు వేసుకునే కాలరు బయటికి తీసి అక్కడ తగిలించి ఉన్న కోటు వేసుకున్నాడు.
ఆ బట్లర్ పాంట్రీలో ఒకే ఒక కుర్చీ ఉంది. మిగ్రే, జస్టిన్ మినార్డ్ కూర్చోకుండా నిలబడ్డారు. నిశ్శబ్దం వాళ్ళను పూర్తిగా చుట్టుముట్టింది. ఇల్లంతా మసక వెలుగుతో కూడుకున్న చీకటిలో మునిగివుంది. వాతావరణం గంభీరంగా ఉంది. భయం పుట్టిస్తున్నట్టుంది.
రెండుసార్లు తన గొలుసు గడియారం జేబులోంచి తీసి చూసుకున్నాడు మిగ్రే. మళ్ళీ అదే గండు మొహం పెట్టుకుని లూయీ వచ్చేటప్పటికి ఇరవై నిమిషాలు గడిచింది.
“మీరు నా వెనకాలే రండి!”
మినార్డ్ మిగ్రేను అనుసరించడానికి ప్రయత్నించాడు. లూయి అతనివైపు తిరిగి అడిగాడు, “నిన్ను కాదు రమ్మంది! నువ్వేమన్నా పోలీసువా?”
మిగ్రేకు ఇబ్బందిగా అనిపించింది. పాలిపోయిన మొహం వేసుకుని ఉన్న మినార్డ్‌ను ఇక్కడ వదిలేసివెళ్ళడం సరికాదు అనిపించింది. పాంట్రీ గోడలకు నల్లటి చెక్క అమర్చిఉండటంతో చూడ్డానికి చీకటి గుయ్యారంలా ఉందాగది. పిల్లి గడ్డం బట్లర్ లూయీ వెనక్కొచ్చి జస్టిన్ మినార్డ్‌ను చావగొడతాడేమోనన్న అనుమానం వచ్చింది.
మిగ్రే లూయీని అనుసరిస్తూ పెద్ద స్తంభాలున్న ఆ విశాలమైన హాలు దాటి ఎర్రటి కార్పెట్ పరిచి ఉన్న మెట్లెక్కాడు.
అక్కడక్కడా పసుపుపచ్చ ఫిలమెంట్‌లతో బలహీనంగా వెలుగుతున్న బల్బులు తప్ప ఆ మొదటి అంతస్తు చాలా మటుకు చీకటితో నిండివుంది. మెట్లెక్కిన వెంటనే ఒక హాలుంది. అక్కడున్న ఒక గది తలుపు మటుకు హాల్‌లోకి తెరిచి ఉంది. గదిలోంచి వస్తున్న వెలుగు వెనక నించి ప్రతిఫలిస్తూంటే నైట్ గౌను వేసుకుని అక్కడ నిలబడివున్నాడు ఒక మనిషి.
“మీరు నాతో మాట్లాడాలన్నారట. లోపలికి రండి. లూయీ, ఇంక ఈయన్ని నాకొదిలేయ్!” అన్నాడతను.
ఆ గదిలో కూచుని చదువుకోడానికి వీలుగా సోఫాలు, పుస్తకాల అలమరాలూ ఉన్నాయి. గోడలకు లెదర్ కవరింగ్ చేసి ఉంది. హవానా సిగార్ వాసనతో బాటూ మిగ్రే గుర్తుపట్టలేని ఇంకేదో వాసనతో ఆ గదిలోని గాలి నిండి ఉంది. ఓ పక్క సగంతెరిచిన తలుపులోంచి పడకగదిలోని భారీ సైజు మంచం దానిమీద అస్తవ్యస్తంగా ఉన్న పరుపు కనపడుతున్నాయి.
రిచర్డ్ జాందో – బాల్తజార్ తన డ్రెస్సింగ్ గౌను కింద పైజామా వేసుకుని ఉన్నాడు. కాళ్ళకు రష్యన్ లెదర్ చెప్పులున్నాయి.
అతని వయసు ముప్ఫయ్ ఏళ్ళుండొచ్చు. నల్లటి జుట్టు. మీద వంకర ముక్కు అంటూ లేకపోతే అతి సాధారణమైన మొహం.
“లూయీ చెప్పాడు. మీరు ఈ ఏరియా పోలీస్ స్టేషన్‌నించి వచ్చారట!”
నగిషీ చెక్కిన సిగరెట్ బాక్స్‌ను అతిథి వైపు తోశాడతను. మిగ్రే వద్దన్నాడు.
“మీరు సిగరెట్ తాగరా?”
“లేదు, పైపు అలవాటుంది.”
“క్షమించాలి, నాకు పైపునించి వచ్చే వాసన పడదు. అందుకని మిమ్మల్ని పైపు తాగమని అడగలేను. ఇక్కడికి వచ్చే ముందు మావాడు లెబ్రేకు చెప్పే వచ్చి ఉంటారు, కదా?”
“లేదు.”
“ఓహ్, పోలీసు పద్ధతులు సరిగా తెలీనందుకు మీరు క్షమించాలి. లెబ్రే మా ఇంటికి తరచూ వస్తూంటాడు. అఫ్ కోర్స్, పోలీస్ అధికారిగా కాదనుకోండి. ఇక్కడ కల్సిన వాళ్ళెవ్వరూ అతన్ని ఛీఫ్ ఇన్‌స్పెక్టర్ అనుకోరు. చాలా సరదా మనిషి, వాళ్ళావిడ కూడా చాలా కలుపుగోలుగా ఉంటుంది. ఇప్పుడు విషయానికొద్దాం, టైం ఎంతయ్యుంటుందో?” తన వాచికోసం వెతుక్కుంటున్నట్టు నటించాడు.
మిగ్రే జేబులోంచి బండగా ఉండే తన వెండి గొలుసు వాచీ బయటికి తీశాడు.
“రెండూ ఇరవై ఐదు.”
“ఈ కాలంలో ఉదయం ఐదుగంటలకే వెలుగు వచ్చేస్తుంది, కదా? నాకెలా తెలుసంటే నేను రోజూ అదే టైంలో బులోన్య పార్కుకు గుర్రపుస్వారీకని వెళ్తాను. సాయంత్రం చీకటిపడ్డప్పటినించి పక్కరోజు ఉదయం దాకా ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమయం చాలా విలువైనది అని నేననుకుంటాను.”
“అంతే అనుకోండి, కానీ…”
రిచర్డ్ జాందో, మిగ్రే మాటలకు అడ్డం వచ్చాడు “నేను ఆ విషయం మీకు గుర్తు చేయడానికే ప్రస్తావించానని మీరర్థం చేసుకోవాలి. మీరు వయసులో చిన్నవారు. బహుశా ఉద్యోగంలో ఈ మధ్యనే చేరి ఉంటారు. మీ పోలీస్ ఛీఫ్‌కు నేను దగ్గరి స్నేహితుడినవటం మీరు మీ అదృష్టంగా భావించాలి. ఇలా నా ఇంట్లోకి అడుగుపెట్టడానికి మీకు సరైన కారణం ఉండే ఉంటుందని నేననుకుంటున్నాను. లూయీ నాకంతా చెప్పాడు. మా వాడు బయటికి తోసేసిన మనిషి, ప్రమాదకరమైన వాడనడంలో నాకేం అనుమానం లేదనుకోండి. బట్ లెట్ మీ టెల్ యూ సమ్ థింగ్ యంగ్ మాన్, ఇక్కడికి రావడానికి రేపు పొద్దుటిదాకా మీరు ఆగి ఉండొచ్చు. అవునా? అక్కడ కూర్చోండి.”
అతను మాత్రం అటూ ఇటూ తిరుగుతూ బంగారు రంగు టిప్ ఉన్న ఈజిప్షియన్ సిగరెట్ తాగుతున్నాడు.
“నేను మీరు నేర్చుకోవాల్సిన చిన్న పాఠం చెప్పేశా కాబట్టి, టెల్ మీ నౌ! మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?”
“పైనున్న పడక గది ఎవరిది?”
“ఐ బెగ్ యువర్ పార్డన్, ఏమన్నారు?”
“క్షమించాలి. ప్రస్తుతానికి నాకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకోండి!”
“చెప్పాల్సిన అవసరమా?” రిచర్డ్ ఆశ్చర్యం నిండిన మొహంతో రెట్టించాడు.
మిగ్రే చెవులు బీట్‌రూట్ రంగులోకి మారాయి. “కొంత సేపటి క్రితం ఆ బెడ్‌రూమ్‌లోంచి తుపాకీ పేలిన శబ్దం వినిపించింది.”
“ఏమిటి, ఏమిటి మీరనేది? మీకు బుర్ర సరిగ్గానే పనిచేస్తోందా? ఊరంతా ఊరేగింపులు, ఉత్సవాలు జరుగుతున్నాయనుకోండి! మీకు మందు మోతాదైతే ఎక్కువ కాలేదు కదా?”
మెట్లమీద అడుగుల చప్పుడు అయ్యింది. తలుపు కొద్దిగా తెరిచి ఉంది. ఓ కొత్త ఆకారం మెట్లెక్కి హాల్‌లోకి అడుగుపెట్టింది. ఆ ఆకారం నీడ ‘పారిసియన్ లైఫ్’ పత్రిక ముఖచిత్రంలా ఉంది. వచ్చినాయన టైల్ కోటు వేసుకుని స్కార్ఫ్ మెడకు కట్టుకుని ఓప్రా హ్యాట్ తల మీద పెట్టుకుని ఉన్నాడు. దృఢంగా ఉన్నాడు ముసలాయన. మూతిమీదున్న సన్నటి మీసం వంకీలు తిరిగి ఉంది. మీసానికి రంగు పూసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది.
లోపలికి రావాలా వద్దా అని ఆలోచిస్తూ ఆశ్చర్యంతో బహుశా భయంతో కూడా నిండిన మొహంతో ఆయన తలుపు బయటే తచ్చాడుతున్నాడు.
“నాన్నా! లోపలికి రండి. ఇది వినండి. వింటే పడిపడి నవ్వుతారు. ఈ పెద్ద మనిషి మన లెబ్రే దగ్గర పనిచేస్తాడు.”
చూడ్డానికి ఏదో తేడాగా ఉంది. రిచర్డ్ తండ్రి – ఫెలిసియెన్ జాందో బాల్తజార్ తాగిలేడు కానీ ఆయన కదలికలు, కవళికలు కొంత విచిత్రంగా ఉన్నాయి. ఒకచోట స్థిమితంగా నిలబడకుండా కలవరంతో అటూ ఇటూ కదులుతున్నాడు.
“మీరు లూయీను చూసారా?” అడిగాడు కొడుకు.
“కిందెవరితోనో ఉన్నాడు” అని సమాధానం ఇచ్చాడు ఆయన.
“అదే చెప్పేది! ఇంతకుముందు ఎవడో దాదాపు తలుపులు బద్దలు కొట్టినంత పనిచేసి మన ఇంటి లోపలికి రావడానికి ప్రయత్నించాడు. వాడు తాగుబోతో లేకపోతే విల్జీఫ్ పిచ్చాసుపత్రినించి తప్పించుకున్న పేషంటో అయ్యుంటాడు. లూయీ కిందికి వెళ్ళి వాణ్ణి అడ్డుకోడానికి నానా ఇబ్బందులూ పడ్డాడు. ఇప్పుడేమో ఈ పెద్ద మనిషి …” ప్రశ్నార్థకంగా మిగ్రే వైపుచూశాడు.
“మిగ్రే.”
“ఆ… ఈ మిగ్రే గారు, ఈయన మన లెబ్రే దగ్గర సెక్రెటరీ అట. ఇక్కడికొచ్చి నన్ను ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమిటి మీ ప్రశ్న చెప్పండసలు?”
“ఈ గది పైనుండే పడక గది ఎవరిది?”
మిగ్రే, ఫెలిసియెన్ మొహంలో ఆందోళనను గమనించాడు. అక్కడి వాతావరణంలో బరువు స్పష్టంగా తెలుస్తోంది. వచ్చినప్పటినించి ఆ పెద్దమనిషి తన కొడుకు వైపు అదో రకమైన అణకువగా భయం భయంగా చూస్తున్నాడు. నోరెత్తడానికి కూడా కొడుకు అనుమతి కావాలన్నట్టు మాట్లాడే ధైర్యం చేయడంలేదు.
“మా చెల్లెలిది” అంటూ పొడిగించాడు రిచర్డ్. “చాలా?”
“ఆమె ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారా?” అడుగుతూ మిగ్రే, కొడుకు మొహంలోకి చూడకుండా నేరుగా తండ్రి మొహంలోకి చూశాడు. కానీ మళ్ళీ కొడుకే సమాధానం ఇచ్చాడు “లేదు, ఆమె అన్సీవల్‌లో ఉంది.”
“ఏమన్నారూ?”
“మా ఎస్టేట్ ఉంది కదా, నేవాలో!”
“అంటే అప్పుడు ఆ గదిలో ఎవరూ లేరంటారు!”
“నాకు తెల్సిందదే” అంటూ వ్యంగ్యంగా “గదిలోకి మీరే స్వయంగా వెళ్ళి చూసుకోవచ్చు! రండి, తీసుకెళ్తాను. తన పక్కన ఇంత మంచి పనిమంతుడ్ని ఉంచుకున్నందుకు మావాడు లెబ్రేను కూడా మెచ్చుకునే అవకాశం నాకిచ్చిన వాళ్ళవుతారు. ఇలా రండి.”
మిగ్రే ఊహించని విధంగా ఫెలిసియెన్ జాందో బాల్తజార్ కూడా భయం భయంగా రిచర్డ్‌ని అనుసరించాడు.
“ఇదే మీరడిగిన గది. అదృష్టం కొద్దీ తాళం వేసి లేదు.”
మిగ్రే లైటు ఆన్ చేశాడు. గోడలన్నీ నీలంరంగు పట్టుపరదాల చాటున ఉన్నాయి. ఫర్నిచర్ అంతా లక్క పూత పెట్టిన ఖరీదైన తెల్లటిచెక్కతో చేసుంది. గదిలోని ఇంకో తలుపు పక్కగదిలోకి తెరుచుకుని ఉంది. అది స్నేహితులని కలవడానికి, కూర్చుని చదువుకోడానికి వాడే ప్రైవేట్ స్టడీ. వస్తువులన్నీ ఎక్కడుండాల్సినవి అక్కడ వాటి జాగాలో సర్దినట్టు కనపడుతోంది.
“వెతకండి, మిమ్మల్ని నిజంగా బతిమాలుకుంటున్నాను. పోలీసులు ఇలా తనగదంతా తోడిపోశారని తెలిస్తే మా చెల్లెలు లీస్ ఎంత సంతోషిస్తుందో!”
ఏం పట్టించుకోకుండా మిగ్రే కిటికీ దగ్గరకి వెళ్ళాడు. కిటికీకి ఉన్న సిల్కు పరదాలు గోడ మీద పరదాల కంటే ముదురు రంగులో ఉన్నాయి. అవి బయటినించి వచ్చే వెలుగును తగ్గించడానికి వాడే దళసరి పరదాలని తీసేటప్పుడు అర్థం అయ్యింది. పరదాలోని కొంత భాగం కిటికీలో చిక్కుకుని ఉండటం గమనించాడు మిగ్రే.
“సాయంత్రం నించి ఇక్కడికెవరూ రాలేదు కదా?” అడిగాడు.
“పనిమనుషులు ఎవరైనా వచ్చి ఉండొచ్చు”
“చాలామంది ఉన్నారా, పని చేసేవాళ్ళు?”
“మరీ?” అన్నాడు కొద్దిగా చిరాగ్గా రిచర్డ్. “జెర్మైన్, మారీ. వాళ్ళు కాక లూయీ భార్య, ఆమె వంట కూడా చేస్తుంది, ఇంకా బట్టలు ఉతికి ఇస్త్రీ చేయడానికి ఒకామె, పెళ్ళైంది కాబట్టి ఇక్కడుండదు. పొద్దునపూట మాత్రమే వచ్చెళుతుంది.”
ఫెలిసియెన్ ఇద్దర్నీ మార్చి మార్చి చూస్తున్నాడు. “అసలేం జరుగుతోంది ఇక్కడా?” చివరికడిగాడు ఆయన గొంతు సరిచేసుకుంటూ.
“అదే నాకూ సరిగ్గా తెలీడం లేదు. ఈ మిగ్రేగారినడగండి” అన్నాడు రిచర్డ్.
“కొంతసేపటి క్రితం మీ ఇంటి ముందునించి నడిచివెళ్తున్న మనిషికి హఠాత్తుగా ఈ కిటికీ తెరుచుకోవడం, కిటికీలోంచి ఒక ఆడమనిషి సహాయం కోసం అరవడం కనిపించింది.”
తండ్రిగారు చేతి కర్రపిడిని గట్టిగా పట్టుకోవడం మిగ్రే గమనించాడు.
“అలానా, ఆ తర్వాత?” అడిగాడు రిచర్డ్.
“ఆమెను ఎవరో కిటికీలోంచి వెనక్కి లాగారు. వెంటనే ఒక తుపాకీ పేలిన శబ్దం వినపడింది.”
“నిజమా?” రిచర్డ్ జాందో మిగ్రే వైపు వెక్కిరిస్తున్నట్టు చూసి పరదాల చాటున బులెట్ కోసం వెతికినట్టు నటించాడు.
“ఇందులో నాకు అర్థం కాని విషయం ఏమిటంటే మిగ్రేగారూ, మిగ్రే… మీ పేరదే కదా! ఈ నేరారోపణ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సిన ప్రాథమికమైన జాగ్రత్తను మీరసలు పట్టించుకోలేదు. పైవాళ్ళకు సమాచారం అందించకుండా మీరే నేరుగా ఇక్కడికి పరిగెత్తి రావటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలంత గొప్ప ఊహాశక్తి కలిగిన ఆ రోడ్డు మీది మనిషి గురించి మీరు ఏమన్నా తెలుసుకున్నారా, లేదా?”
“అతను ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు.”
“అతను మా ఇంట్లోకి వచ్చి కూర్చోడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ముందూ వెనకా ఆలోచించకుండా మీరు ఇక్కడకి పరిగెత్తుకొచ్చారని నాకనిపిస్తోంది. అలా చేతిలో వారంట్ కూడా లేకుండా వచ్చి ఒక పౌరుడికి ఉండే ప్రాథమిక హక్కులను భగ్నం చేయడమే కాకుండా అనుమానాస్పదమైన ప్రవర్తన ఉన్న ఒక వ్యక్తిని కూడా నా ఇంట్లోకి తీసుకొచ్చారు. ఎటూ వచ్చారు కాబట్టి మీ పని మీరు పూర్తి చేసుకుని రిపోర్ట్ తీసుకెళ్ళి మా లెబ్రే ముందు పెట్టండి. మీరు ఈ మంచం మీద ఎవరూ పడుకోలేదని కూడా ఖరారు చేసుకోవాలి కదా!” అంటూ మంచం మీది దుమ్ము పడకుండా పైన పరిచిన శాటిన్ బట్టను పక్కకి లాగాడు. పరిచిన దుప్పటి పరిచినట్టుగానే ఉంది. ఒక్క ముడత కూడా లేదు. దిండ్లు కూడా ఎక్కడివక్కడే ఉన్నాయి.
“మీకు కావాల్సినంతసేపు ఇక్కడే ఉండండి. ప్రతి మూలా వెతకండి. భూతద్దం కూడా తెచ్చుకుని ఉంటారు కదా!”
“ఆ అవసరం లేదండీ.”
“ఐయామ్ సారీ, మా వాడు లెబ్రే ద్వారా కాకుండా పోలీస్ వ్యవహారాలతో నా పరిచయం నవలల వల్లనే. తుపాకీ పేలిందని కదా మీరనేది? ఎక్కడో ఒకచోట శవం కూడా ఉండుంటుంది. రండి, కలిసి వెతుకుదాం! ఈ బట్టల అలమరలో ఉందేమో? ఎవరికి తెలుసు?”
ఒక్కసారిగా అలమర తలుపులు టపీమంటూ తీసాడు. అక్కడ హాంగర్‌ల మీద బట్టలు తప్ప ఇంకేం లేవు.
“ఇదుగో, ఇక్కడ మా చెల్లెలు లీస్ చెప్పులు, షూస్ ఉన్నాయి. దానికి చెప్పులంటే పిచ్చి. మీకు కనపడుతోంది కదా? ఇప్పుడు తన స్టడీ రూమ్‌లోకి పోదాం!” అతని మొహంలో ఒత్తిడి కనపడుతోంది. రాను రానూ మాటల్లో వ్యంగ్యం పెరుగుతోంది.
“ఈ తలుపు? ఇది అమ్మ చనిపోయినప్పటినించి మూసి ఉంది. కావాలంటే హాల్‌లో నించి దాన్లోకి వెళ్ళొచ్చు. రండి, లేదు… లేదు మనం వెళ్ళాల్సిందే!”
మిగ్రే ఆ పీడకలలో ఇంకో అరగంటసేపు గడిపాడు. రిచర్డ్ వెనకాల వెళ్ళడం తప్ప అతనికి వేరే దారేమీ లేదు. రిచర్డ్ దాదాపు ఆజ్ఞాపిస్తున్నాడు. వాళ్ళ నాన్న ఫెలిసియెన్ జాందో బాల్తజార్ తల మీదినించి తీయకుండా ఉంచిన ఓప్రా హ్యాట్, మెడలో స్కార్ఫ్, బిగుతుగా పట్టుకున్న చేతికర్రతో సహా వెనకాలే వస్తూంటే ఇల్లంతా వెతకడం, వ్యవహారమంతా కొద్దిగా గగుర్పాటు పుట్టించేట్టువుంది.
“లేదు, మనం అప్పుడే కిందికి వెళ్ళడం లేదు. పైన ఇంకో అంతస్తు ఉందని మీరు మర్చిపోతున్నారు. అక్కడ పనివాళ్ళ క్వార్టర్స్ ఉన్నాయి.”
అక్కడ కారిడార్‌లో లైట్లు ఉండీ లేనట్టుగా ఉన్నాయి. సీలింగ్ ఏటవాలుగా ఉంది. రిచర్డ్ వరసగా ప్రతి గది తలుపు కొడుతున్నాడు.
“జెర్మైన్, తలుపు తీ! పర్లేదు, నువ్వు నైట్ డ్రెస్సులో ఉన్నా పర్లేదు. పోలీసులు వచ్చారు.”
సగం నిద్రలో లేచిన మొహంతో బొద్దుగా ఉన్న ఒకమ్మాయి వచ్చి తలుపు తీసింది. ఆమె వెంటే వచ్చిన ముతక వాసన ముక్కుపుటాలను సోకింది. పరుపు మీది తేమ కనపడుతోంది. డ్రెస్సింగ్ టేబుల్ మీద జుట్టు చిక్కుకుని ఉన్న దువ్వెన ఉంది.
“నీకు గన్ పేలిన శబ్దం వినపడిందా?”
“ఏంటీ?”
“ఎన్ని గంటలకు పడుకున్నావు?”
“పదిగంటలకు పైకి వచ్చాను.”
“కానీ నీకేం వినపడలేదు.”
రిచర్డ్ ఒక్కడే ప్రశ్నలన్నీ అడుగుతూ పోతున్నాడు.
“మారీ తలుపు తీ… లేదు, లేదు, పర్లేదు, తీ…”
ఒక పదహారేళ్ళ అమ్మాయి నైట్ డ్రెస్ మీద కోటు వేసుకుని ఆపాదమస్తకం వణికిపోతూ వచ్చి నిలుచుంది.
“నువ్వు తుపాకీ పేలిన శబ్దం విన్నావా?”
“తుపాకీనా?”
“నీకేవన్నా పెద్ద శబ్దం వినపడిందా?”
“లేదు, ఏమైంది?”
“మీకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా మిగ్రేగారూ?”
“ఆమెదేవూరో తెలుసుకోవాలనుకుంటున్నాను.”
“మీదేవూరు మారీ?” అడిగాడు రిచర్డ్.
“అన్సీవల్.”
“జెర్మైన్ ఎక్కడ నించి వచ్చింది?”
“ఆమె కూడా అన్సీవల్ నించే.”
“లూయీ?”
“అందరూ అన్సీవల్‌నించే మిగ్రే గారూ!” సమాధానం ఇచ్చాడు రిచర్డ్ నిర్లక్ష్యంగా. “మీకస్సలు ఏం తెలిసినట్టు లేదు. మాలా సొంత ఊళ్ళల్లో ఎస్టేట్లు ఉండే వాళ్ళు పనివాళ్ళందరినీ అదే ఊళ్ళనించి తెచ్చుకుంటారు.”
“ఈ పక్కగది ఎవరిది?”
“లూయీ వాళ్ళావిడది.”
“లూయీ ఎక్కడ పడుకుంటాడు?”
“అతను కింద పాంట్రీలో పడుకుంటాడు.”
ఆవిడ తలుపు తీయడానికి కొంత సమయం తీసుకుంది. పొట్టిగా చామనఛాయలో బాగా లావుగా ఉంది. అలిసిపోయినట్టున్న కళ్ళు. “ఏందిదంతా? లూయీ ఎక్కడ?” చిరాగ్గా అడిగిందామె.
“కిందున్నాడు. చెప్పు, నీకేమన్నా తుపాకీ పేలిన శబ్దం వినిపించిందా?”
ఆమె గొణుక్కుంటూ వాళ్ళిద్దరినీ తరిమినంత పని చేసింది. రిచర్డ్ మిగతా తలుపులు కొడుతూ తెరిపిస్తూ వెళ్ళాడు. కొన్ని ఖాళీ గదులు, కొన్ని పాత సామాన్లు పెట్టి ఉన్నవి. మిగ్రే అటక కూడా ఎక్కిచూశాడు. అక్కణ్ణించి మొదటి అంతస్తుకు దిగి వెళ్ళి తండ్రీకొడుకుల గదులు చూడాల్సి వచ్చింది.
“ఇంకా డ్రాయింగ్ రూములున్నాయి. లేదు, లేదు, అవికూడా మీరు చూడాల్సిందే.”
రిచర్డ్ టింగు-టింగు మంటూ శబ్దం చేసే క్రిస్టల్స్ వేలాడుతున్న భారీ గ్లాస్ షాండలీయర్ లోని లైట్లను ఆన్ చేశాడు.
“శవమే లేదా? ఎవ్వరి ఒంటిమీదా దెబ్బలు కూడా కనపడ్డం లేదా? ఇల్లంతా చూశారా? సెల్లార్‌లోకి కూడా వెళ్ళి చూస్తారా? ఇప్పుడు టైం మూడున్నర అయ్యింది, చూసుకున్నారా?”
రిచర్డ్ పాంట్రీ తలుపు తెరిచాడు. అక్కడ జస్టిన్ మినార్డ్ కుర్చీలో కూర్చుని ఉంటే ఖైదీని కాపలా కాస్తున్నట్టు లూయి ఒక మూల నిల్చుని ఉన్నాడు.
“ఈ అబ్బాయేనా గన్ శబ్దం వినింది? అతని ముఖారవిందం చూడటం సంతోషంగా ఉంది. మిగ్రేగారూ! బలవంతంగా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించినందుకు అనవసర ఆరోపణలు చేసినందుకు ఇంక నేను మీమీద కంప్లైంట్ ఇవ్వొచ్చు అనుకుంటా?”
“చెయ్యండి, మీకు ఆ హక్కు ఉంది.”
“సరే, ఇంక మీకు గుడ్ నైట్! లూయి వీళ్ళను తీసుకెళ్ళి కొంచెం బయట వదిలిపెట్టు.”
పెద్దాయన జాందో నోరు తెరిచాడు కానీ శబ్దం బయటికి రాలేదు.
మిగ్రే “థాంక్ యూ వెరీ మచ్!” అని మాత్రం అనగలిగాడు.
లూయి వాళ్ళ వెనకాలే వచ్చి బయటకు సాగనంపి ఇంటి తలుపుకు గొళ్ళెం వేసాడు.
మిగ్రే, మినార్డ్ కొంత అయోమయంలో కొద్దిపాటి ఆందోళనతో ఉన్నారు. ఇంటి బయటికొచ్చి చాప్తల్ రోడ్‌లో పేవ్‌మెంటు మీద నిలబడ్డారు. మిగ్రే ఇంత జరిగినా ఏదో ఒక ఆధారం చేజిక్కించుకోవాలనో ఏమో పక్కకు తిరిగి అక్కడ నేల మీదున్న ఆయిల్ మడుగు వైపు దృష్టి సారించాడు.
“ఒట్టు. నేను తాగడం మానేసాను.”
“నమ్ముతున్నాను.”
“నాకు పిచ్చేమీ లేదు.”
“ఖచ్చితంగా లేదు.”
“ఈ గొడవ వల్ల మీరు ఇబ్బందుల్లో పడబోవట్లేదు కదా? నాకేదో లీలగా వినిపించింది…”
తను కొత్తగా కొనుక్కుని వేసుకున్న టైల్ కోటు మిగ్రేకు ఆ నడిరాత్రి సమయాన భుజాల కింద కొద్దిగా బిగుతైనట్టు అనిపించింది.
రచయిత జార్జెస్ సిమినోన్ గురించి:
ఇరవైయవ శతాబ్దంలో అత్యంత పాఠకాదరణ పొందిన రచయితల్లో ప్రముఖుడు, ఫ్రెంచి రచయిత జార్జెస్ సిమినోన్. తన పేరుతో 192 నవలలు, ఇంకో 200 నవలలు రకరకాల కలం పేర్లతో రాశాడు. బెల్జియంలో జన్మించిన 1989లో కాలం చేసేటప్పటికి ఆయన రాసిన పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల కాపీలకు పైగా అమ్ముడుపోయాయి. ఈయన పుస్తకాల ఆధారంగా 171 సినిమాలు, టెలివిజన్ చిత్రాలు తీశారు. నవలలుకాక కథలు, నాలుగు స్వీయ చరిత్రలు, తన జ్ఞాపకాల ఆధారంగా ఇంకో ఇరవై పుస్తకాలు రాశారు.
ఆయన సృష్టించిన డిటెక్టివ్ ‘జూల్స్ మిగ్రే’ పాత్ర అత్యంత ప్రజాదరణ పొందింది. మిగ్రే ప్రధాన పాత్రగా 75 నవలలు, 28 కథలు రాశారు. షెర్లాక్ హోమ్స్, పోయిరో పాత్రలలా పాఠకుల మనస్సులో నిలిచిపోయిన పాత్ర మిగ్రే. మిగ్రే నవలల్లో ఏదీ 200 పేజీలకంటే మించదు. రచనాశైలి సరళంగా ఉంటుంది.
ఇంగ్లీష్ అనువాదకురాలు రాస్ స్వాట్జ్ గురించి:
రాస్ స్వాట్జ్, ఫ్రెంచినించి ఇంగ్లీష్‌లోకి వందకు పైగా పుస్తకాలను అనువదించింది. ప్రపంచవ్యాప్తంగా అనువాదాల మీద అనేకానేక వర్కుషాపులు నిర్వహించింది. ఈ మధ్యనే TILT పేరుతో ఛాయ, అజు పబ్లికేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన తెలుగు నించి ఇంగ్లీష్ అనువాదపు ఆరునెలల వర్క్ షాప్‌కు ఆధ్వర్యం వహించింది. యూకే ట్రాన్స్‌లేటర్స్ అసోసియేషన్, బ్రిటిష్ సెంటర్ ఫర్ లిటరరీ ట్రాన్స్‌లేషన్ , ఇంగ్లీష్ పెన్‌లాటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల్లో బాధ్యతాయుతమైన అనేక పదవుల్ని పోషించింది. ప్రస్తుతం బ్రిస్టల్ ట్రాన్స్‌లేషన్ సమ్మర్ స్కూల్‌కి ఆమె డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
(త్వరలో ఛాయాద్వారా విడుదల అవుతోంది)








Add comment