గజేంద్రమోక్షం                                

“ఇదిగో అమ్మాయ్! ముందే చెప్తున్నాను. తర్వాత నాకు తెలియదనకు. సెలవు పెట్టి ఆ రోజంతా ఇంట్లోనే ఉండాలి. మధ్యలో పేషెంట్లు, ఎమర్జెన్సీ కేసులంటే కుదరదు. ముందే ఆ ఏర్పాట్లేవో చేసుకో. పెళ్లైన వెంటనే నూతన వధువులు సౌభాగ్యం కోసం నోచుకునే నోము. చాలా నిష్టగా చెయ్యాలి. సెలవు లేదని, అదని, ఇదని ఆ నోము నోచుకోకుండా, యిప్పటికే ఆరునెలలు గడిపేసావు,. వచ్చేవారం ముహూర్తం బాగుంది. అడ్డు చెప్పడానికి వీలుకాదు” అని పదిరోజుల ముందే వంశీ నాన్నమ్మగారు, వంశీభార్య హరితను హెచ్చరించారు.

హరిత గైనిక్ స్పెషలిస్ట్. పెళ్లినాటికే పీహెచ్సీ డాక్టరుగా పనిచేస్తుంది. పి.హెచ్.సి.కి దగ్గరలో యిల్లు తీసుకొని రోగులకు అందుబాటులో ఉండడంతో, ఉద్యోగంలో చేరి సంవత్సరమే ఐనా, డాక్టరుగా మంచిపేరు తెచ్చుకుంది. ఆ నోముకోసం ఒకటి రెండుసార్లు అనుకున్నా ఏవో ట్రైనింగ్స్, మీటింగ్స్… యిలా గడిచిపోయింది. అందుకే వంశీ నాన్నమ్మగారు ఇంత గట్టిగా చెప్తున్నారు. హరిత కూడా ఈ ఒక్కరోజు సెలవుకు పర్మిషన్ తీసుకొని, ఇంకొక డాక్టరుకు తన విధులు అప్పగించింది.

వంశీ అమ్మానాన్నలు, తాతయ్య నాన్నమ్మలు, చెల్లెళ్ళు, ఇంకా బంధువులలోని ముత్తైదువులు హరిత అమ్మానాన్నలతో పాటు వచ్చి వున్నారు. ఇల్లంతా కోలాహలంగా ఉంది. ఉదయం నుండే నోము కార్యక్రమం జరుగుతూ ఉంది. వంశీ వాళ్ల వూరినుండే పురోహితులు వచ్చి నోము కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపిస్తున్నారు. మామూలుగా అయితే మూడు వారాలో, ఆరు వారాలో, తొమ్మిది వారాలో చేస్తారా నోమును. అలా చెయ్యడానికి హరితకు వీలుకాదు కాబట్టి, ఒక్కరోజులోనే ఆ కార్యక్రమాన్ని పూర్తిచెయ్యాలని ముందుగానే అనుకొని అన్ని వారాల పూజ ఆ ఒక్కరోజే చేయిస్తున్నారు. ఇంకొక్క గంట గడిస్తే, పూజా కార్యక్రమం అయిపోయి ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలిస్తే నోము పూర్తయిపోతుంది. ఉదయంనుండి ఉపవాస దీక్షలోనే ఉంది హరిత. పచ్చి మంచినీళ్లు కూడా నోట వేసుకోలేదు.

పూజ చేస్తుందే కాని, హరిత మనసు మనసులో లేదు. ఉదయం నుండి వీరేశు మాటలు చెవులలో పడుతూనే వున్నాయి. వీరేశు సత్యవతి భర్త. పెళ్లైన పదేళ్లలో ఎన్నో అబార్షన్లు జరగగా, ఇక పిల్లలు పుట్టరేమోనన్న ఆశ అడుగంటిపోయిన సమయంలో, డాక్టరుగా తను యిక్కడకు రావడం, సత్యవతిని తనిఖీ చేసి, గర్భం నిలిచేటట్లు మందులిచ్చి, నెలనెలా పరీక్షలు చేస్తూ, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి యెప్పటికప్పుడు చెబుతూ, ఇంకొక్క నెలరోజులలో పురుడు వస్తుందని చెప్పడం జరిగింది. అవసరమైతే సిజేరియన్ చెయ్యడానికి కూడా అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇంతలో యేమైందో? యిన్నిసార్లు వీరేశు ఇంటికి వస్తున్నాడు.

వీరేశు తనను పంపించమని ఇంట్లో వాళ్లను బ్రతిమలాడడం…”మా మనవరాలు సెలవు పెట్టింది. సెలవు రోజు కూడా ఇంటికి వచ్చి ఈ న్యూసెన్స్ ఏమిటి? పూజకూడా సరిగ్గా చేసుకోనియ్యరా?” అని వంశీ నాన్నమ్మగారు వాళ్ళమీద కోప్పడటం, పూజ చేస్తున్న హరిత చెవులలో పడుతూనే ఉంది.

ఏమైందని అడిగితే “ఆ! ఏమీలేదులే… ఈ కాలంలో చిన్ననొప్పులకే హడావిడి చేస్తుంటారు. తొలిచూలు ఒక రోజంతా నొప్పులు పడితే గాని కానుపవ్వదు. ఆ మాత్రం తెలియకుండానే పిల్లల్ని కన్నామా యేమిటి? నువ్వేమీ కంగారుపడకు. రేపు నువ్వెళ్లి పురుడు పొయ్యొచ్చులే. ఇప్పుడు పూజమీదే ధ్యాస పెట్టుకో. పూజమధ్యలో వేరే ఆలోచనలేమీ పెట్టుకోకూడదు. గౌరీదేవికి కోపమొస్తుంది. నీకు మంచిది కాదు” అనేసారు వంశీ నాన్నమ్మగారు.

ఇంతవరకు బాగానేవుండి, నెలరోజుల ముందే నొప్పులొస్తున్నాయంటే కారణమేమై వుంటుంది? లోపల బిడ్డ పరిస్థితి యేమిటి? ఈ బిడ్డ దక్కకుంటే ఆమె మరలా గర్భం దాల్చడం దాదాపుగా అసాధ్యం. ఇన్నాళ్ళ శ్రమా వృధాగా పోవాల్సిందేనా? పండంటి బిడ్డను ఎత్తుకుంటానని ఆశగా ఎదురు చూస్తున్న సత్యవతి ఆశ అడియాస కావాల్సిందేనా? ఏమైందో కనుక్కుందామంటే ఫోనుకూడా యివ్వడం లేదు. తొలిచూలుకి ఈమాత్రం నొప్పులు సహజమే అంటున్నారు. కాని సత్యవతికి ఎన్నో గర్భాలు పోయాక నిలిచిన గర్భమిది. ఇప్పుడెలా? ఏమి చెయ్యాలి? “అమ్మా! డాక్టరమ్మగారూ! పూజ యిక్కడ చేయాలి. అక్కడ కాదు” దేవీ విగ్రహానికి బదులు, నైవేద్యానికి పూజ చేస్తుంటే హెచ్చరించారు పురోహితులవారు. ఆలోచనల నుండి బయటపడింది హరిత.

పూజ చేస్తుంటే ఈసారి సత్యవతి భర్త వీరేశు మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి “పెద్దమ్మగారూ! మీ కాళ్లకు మొక్కుతా. నెలలు నిండకుండానే నొప్పులొస్తున్నాయని ఆసుపత్రికి వస్తే, బిడ్డ పరిస్థితి ప్రమాదంగా ఉంది పెద్దాసుపత్రికి తీసుకుపొమ్మన్నారు. అక్కడికి వెళ్లేలోపు తల్లి, బిడ్డ ప్రాణాలు దక్కుతాయన్న ఆశ లేదు. ఒక్కసారి డాక్టరమ్మగారిని పంపించండమ్మా! ఇన్నాళ్లూ డాక్టరమ్మే చూసింది. ఆయమ్మ సేతి సలవ. గర్భమిన్నాళ్లు నిలిచింది. ఇప్పుడు బిడ్డకు ప్రమాదమంటున్నారు. ఆయమ్మ సెయ్యి పడితే మా బిడ్డ మాకు దక్కుతుంది. మీ కాళ్ళకు మొక్కుతా! డాక్టరమ్మను పంపించి వాళ్లకు ప్రాణం పొయ్యండమ్మా”

బిడ్డ పరిస్థితి ప్రమాదంగా వుందన్నమాట వినగానే పరిస్థితి అర్థమైంది. అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యకపోతే బిడ్డ దక్కదు… తల్లి కూడా దక్కుతుందన్న నమ్మకం లేదు. ఈ ఆలోచన రాగానే, పంతులుగారు లేవకూడదని చెప్తున్నా, ఒక్కదుటున కూర్చున్న ఆసనం మీదనుండి లేచింది హరిత. వంశీ నాన్నమ్మగారు వెళ్లవద్దంటూ యెంత అడ్డు తగిలినా, చుట్టూ కూర్చున్న ముత్తైదువులంతా నోరెళ్లబెట్టి చూస్తున్నా, ఆగలేదు హరిత.

గది బయటకు వచ్చిన హరితను చూసి “అమ్మా మీరే వాళ్ళ ప్రాణాలు కాపాడాలి” అంటూ హరిత పాదాలు పట్టుకున్నాడు వీరేశు. “వీరేశూ పద” గేటు బయటకు నడిచింది హరిత. నుదుట పెద్ద కుంకుమబొట్టు, జడనిండా తురిమిన పూలు, ఒంటినిండా నగలు,  పట్టుచీరతో… పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళుతున్న హరిత, శిష్టరక్షణ కోసం బయలుదేరుతున్న అమ్మవారిలా ఉంది.

*

ఇంట్లో… వంశీ నాన్నమ్మ, అరుంధతమ్మగారు శివాలు తొక్కుతున్నారు. “అందుకే డాక్టర్ సంబంధం వద్దన్నాను. ఇప్పుడు చూశారా ఏమైందో? నా మనవడికన్నా వాళ్ళెవరో ఎక్కువయ్యారా మీ అమ్మాయికి? సుమంగళి నోము మధ్యలో ఆపేస్తే, నా మనవడికేదైనా ఐతే? మీకేమి పోతుంది? మీ అమ్మాయికేమి పోతుంది. మేము కదా బాధపడాలి? అయినా చదివించగానే సరిపోయిందా? మంచీ చెడూ నేర్పుకోవక్కర్లేదా? ఇలాగేనా పిల్లల్ని పెంచేది? మన సంప్రదాయాలకు విలువలేని చదువులూ ఒక చదువేనా?” హరిత తల్లిని కడిగిపారేస్తోంది అరుంధతమ్మ. వియ్యాలవారి చుట్టాలందరి ముందూ మాట్లాడలేక కళ్ళమ్మట నీళ్లు నింపుకుని మౌనంగా తలదించుకొని కూర్చుందామె.

*

గంట తర్వాత ఓటి డ్రెస్సుతోనే ఇంటికి వచ్చింది హరిత. అది చూసిన అరుంధతమ్మగారి కోపం నషాలానికి అంటింది. అనేమాట, అనకూడని మాట గ్రహించుకోకుండానే అందరి ముందూ తిట్టేస్తున్నారు. అవేవీ పట్టించుకోకుండా తిన్నగా బాత్రూంలోకి వెళ్లిపోయింది హరిత. దాంతో మరీ మండిపోయింది అరుంధతమ్మకి. దాంతో పంతం కూడా వచ్చింది. తప్పు చేశానని చెప్పకుండా ఇంట్లోకి రావడం…. మాట్లాడుతుంటే వినిపించుకోకుండా బాత్రూంలోకి వెళ్లిపోవడం…  అటో ఇటో ఇప్పుడే తేల్చేస్తాను అనుకుంటూ కోపంతో వూగిపోతున్నారావిడ. అవేవీ పట్టించుకోకుండా తలస్నానం చేసుకొని వచ్చి పూజ గదిలోకి వెళ్ళబోయింది హరిత.

“ఆగక్కడ. పూజ గదిలోనికి వెళ్లే అర్హత నీకులేదు. భర్త సౌభాగ్యంకన్నా పరాయివాళ్లే ఎక్కువైపోయారా నీకు? నా మనవడి పాదాలు పట్టుకొని, ఇంకెప్పుడూ ఇలా చెయ్యనని ప్రమాణం చేస్తేనే నువ్వు మా ఇంటి కోడలుగా ఉంటావు. లేకపోతే నీకు వాడికి యింక సంబంధం లేదు” తెగేసి చెప్పేసారావిడ. చుట్టూ చూసింది హరిత. తలదించుకొని తల్లి,తండ్రి… నిర్ఘాంతపోయి చుట్టాలు…

చిరునవ్వు నవ్వుకుంటూ…

“సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే

పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం

తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో

పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై…”

అరుంధతమ్మతో సహా అందరూ తెల్లబోయి చూస్తుంటే రాగయుక్తంగా పాడింది హరిత. “అమ్మమ్మగారూ! మీరు గజేంద్రమోక్షం చదువుతారు కదా! దీనర్థం తెలుసుకదా!” చిరునవ్వుతో అడిగింది.

“తెలియకేమి? గజేంద్రమోక్షం చదివితే ఎంతో పుణ్యం వస్తుందని చిన్నప్పటినుండి నేర్పించారు మావాళ్లు” తలెగరేసింది అరుంధతమ్మ.

“అయితే దానర్థం అందరికీ ఒకసారి చెప్పండి”

“గజేంద్రుడు పిలవగానే వచ్చి రక్షించాడు మహావిష్ణువు” ఈ మాత్రం కూడా తెలియదా అన్నట్లు చెప్పింది అరుంధతమ్మ

“ఎలా వచ్చాడు? భార్యకూ చెప్పలేదు. శంఖచక్రాలనూ ధరించలేదు. ప్రణయకలహంలో ఎత్తిపట్టిన లక్ష్మీదేవి కొంగునైన వదలలేదు. ఆ కొంగు పట్టుకునే పరిగెత్తుకుంటూ వచ్చాడు గజేంద్రుని రక్షించడానికి. అంతటి విష్ణుమూర్తికి తెలియలేదా భార్య కొంగును విడిచిపెట్టి రావాలని? అయినా వచ్చాడంటే దానర్థమేమిటి? ఆర్తితో అవసరమై పిలిచినప్పుడు, ముందూ వెనుకా చూడకుండా వారిని కాపాడాలని మనకు సందేశమివ్వడం లేదా ఈ గజేంద్రమోక్షంలో? చదవడమొక్కటే కాదు, దానిని అనుసరించాలని అంతర్గత భావం” మెత్తని స్వరంతో చెబుతున్న హరితను ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరితోపాటు అరుంధతమ్మ కూడా. ఇన్ని విషయాలు తెలుసా ఈ అమ్మాయికని.

“తపస్సు చేసుకుంటున్నాను కదా… అగస్త్య మహర్షి వచ్చినా లెక్కచేయనక్కరలేదని ఒక రాజు, అనుకోబట్టే కదా, శాపం పొంది గజరాజు రూపంలోకి రావాల్సి వచ్చింది? పూజ చేసుకుంటున్నాను కదా అని అవసరంలో ఉన్న వీరేశు భార్యను అలా వదిలేస్తే ఆ భగవంతుడు నన్ను క్షమిస్తాడా? కొద్దిగా ఆలస్యమైతే తల్లిబిడ్డ దక్కేవాళ్ళు కాదు. వాళ్లకేమైనా ఐతే ఆ బాధ్యత నాది కాదా? వాళ్లను కాపాడలేకపోయానన్న బాధ నన్ను జీవితాంతం దహించదా? ఆ కుటుంబం కడుపుకోత నా కుటుంబానికి మంచి చేస్తుందా? మీరే చెప్పండి అమ్మమ్మగారూ!” తన రెండు చేతులూ పట్టుకొని నెమ్మదిగానే అయినా, సూటిగా అడుగుతున్న హరితను సంభ్రమంగా చూసింది అరుంధతమ్మ.

తనెప్పుడూ వల్లెవేసిన గజేంద్రమోక్షం కొత్త అర్థాలతో కళ్ళముందు కనిపించింది. “పెద్దమ్మగారూ! మా కుటుంబాన్ని కాపాడండమ్మా. పెళ్లై పదేళ్లయినా ఒక్క కానుపూ నిలవలేదు. మూడు నాలుగు నెలలకే పోవడం. తట్టుకోలేక అది ప్రాణాలుకూడా తీసుకోబోయింది. పెద్దడాక్టర్ల దగ్గరకెళ్ళి వైద్యం చేయించుకునే స్తోమత లేనివాళ్ళం. దేవుడు మమ్మల్ని సల్లగా సూడబట్టి ఈ డాక్టరమ్మ మా వూరొచ్చింది. మా ఆడదానికి మందులిచ్చి నీళ్లు పోకుండా కాపాడింది. వచ్చే నెల రావాల్సిన నొప్పులిప్పుడే వస్తన్నాయి. ఏమైందో యేమో! ఒక్కసారి అమ్మగారిని పంపించండమ్మా. సచ్చి మీ కడుపున పుడతా” అని ఉదయం నుండి ఆ వీరేశు కాళ్ళావేళ్ళా పడుతూనే ఉన్నాడు.

“శుభమా అని మీ డాక్టరమ్మ సుమంగళీ వ్రతం నోచుకుంటుంటే ఏంటయ్యా నీ గోల! ఫోఫో” అని కసురుకుంది. “అయినా నాకు తెలియకడుగుతాను గాని, మీ ఊర్లో మా మనవరాలు ఒక్కర్తేనా ఏమిటి డాక్టరు? వేరే డాక్టర్లు ఎవరూ లేరా? వాళ్ళ దగ్గరికి తీసుకుపో” అని విసుక్కుంది. “లేదమ్మా వాళ్ళెవరూ ఆపరేషన్ చెయ్యలేరట. అమ్మగారు లేకపోతే తల్లీ,బిడ్డలిద్దరికీ ప్రమాదమట” అని అంటూ వున్నా “ఆ భగవంతుడు మన నుదుటున యేది రాస్తే అదే జరుగుతుంది. దానికి మనమేమి చెయ్యగలం” అని తూలనాడింది.

“ఒకవేళ ఆ తల్లీబిడ్డలకు యేమైనా అయితే… ఈ ఆలోచన రాగానే ఒక్కసారి గుండె జారిపోయింది అరుంధతమ్మకి. ఉదయం నుండి ఈ ఆలోచన తనకెందుకు రాలేదు? ఎంతసేపూ నోము నోయిస్తే పుణ్యమనుకుంది గాని, ఒక ప్రాణాన్ని కాపాడితే ఆ నారాయణుడు సంతోషిస్తాడని ఎందుకు గ్రహించలేకపోయింది? అన్నీ తనకే తెలుసన్న అహంకారంతో తన బుద్ధికి తెరలు కమ్మేసాయి. ఇంకా నయం. వద్దంటున్నా, ఎన్ని రకాలుగా అడ్డుపడినా వెళ్లి, ఆ తల్లిబిడ్డలను కాపాడి తన కుటుంబం, పాపం మూట కట్టుకోకుండా కాపాడింది హరిత. ఇటువంటి పిల్లనా యిన్ని మాటలన్నాను” మనసులోనే అనుకుంటూ పూజ గదిలోకి వెళ్లి దేవుడు ముందు లెంపలేసుకుంది తన తప్పును క్షమించమని.

దేవుడి గది నుండి బయటకు వచ్చి “చాలా గొప్పగా పెంచావమ్మా కూతురిని. మా అదృష్టం…. మా ఇంటి కోడలుగా వచ్చింది. నీ కూతురి విషయంలో మాట తూలినందుకు నన్ను క్షమించమ్మా” హరిత తల్లి శాంతి రెండుచేతులూ పట్టుకొని మనస్ఫూర్తిగా అడిగింది.

ఆ తర్వాత హరితను కౌగిలించుకొని “చిన్నదానివి. నిన్ను క్షమించమని అడగకూడదు. ఇన్నాళ్లూ అన్నీ నాకే తెలుసన్న అహంకారంతో బ్రతికాను. పూజలు వ్రతాలు చేస్తేనే పుణ్యం వస్తుందని నమ్మాను. కాని ఎదుటివారికి సాయం చేస్తే అదే భగవంతునికి పూజ అని తెలుసుకోలేకపోయాను. ఇన్నాళ్లకు నా కళ్ళు తెరిపించావు. మూర్ఖంగా నీకడ్డుపడినా, నిన్ను నిందించినా పట్టించుకోకుండా వెళ్లి రెండుప్రాణాలు కాపాడావు. ‘వైద్యో నారాయణో హరిః’ అనందుకే అన్నారు పెద్దవాళ్లు. ఇప్పుడు దానర్థం కూడా బాగా తెలిసింది. రేపు నువ్వు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు చెప్పు. గుడిలో పూజ చేయిద్దామని దాచిన పదివేల రూపాయలు పుట్టినబిడ్డకు బహుమతిగా యిచ్చి, మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని వీరేశును అడుగుతాను” అన్న అరుంధతమ్మ మాటలకు అక్కడందరి మనసులూ తేలికైపోయాయి.

*

మజ్జి భారతి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు