తిరనాళ

తోటరపాలెంలో తిరనాళ ధగధగద్దమాయంగా వుంది..ఊరి చివర్న పొలాల్లో ట్రాక్టర్ల మీద వరసగా నిలబెట్టి వున్న దేవుడి ప్రభలకి వేసిన లైట్లతో,ఆటి ముందు యాకోబు కొడుతున్న డప్పులతో దద్దరిల్లిపోతంది తిరనాళ.కర్రలతో కట్టిన స్టేజీ మీద రంగురంగుల సీరియల్ లైట్ల చమక్ చమక్‌ల మధ్య సినిమా పాటలు దుమ్ము రేగుతా వున్నాయి.నరసరావుపేట డాన్స్ ట్రూప్‌లు స్టేజీ ముందు,స్టేజీ ఎనకా హంగామా హంగామా చేత్తన్నారు.తిరనాళకి ఇరువైపులా నేల మీద పరుచుకొని వున్న రకరకాల బొమ్మల కొట్లు,తినుబండారాల కొట్లు,ఆడోళ్ళ సరంజామా కొట్లు,దేవుడి పటాల కొట్ల చుట్టూ జనాలు ఈగల్లా మూగివున్నారు.ఇసకేస్తే రాలనట్టు కిక్కిరిసిపోయున్న జనం తోసుకుంటా,రాసుకుంటా డాన్సింగ్ స్టేజీ కాడకి పోతా వున్నారు.తిరనాళ పెట్టిన పొలాల చుట్టూ,మధ్యలో అటూఇటూ పాతిన సరికబొంగులకి కట్టిన రంగురంగుల ట్యూబ్‌లైట్లు తిరనాళని ఆ చీకట్లో జిగేల్ జిగేల్మని మెరిపిత్తా వున్నయ్యి.

ఇంతలో ‘బావలు సయ్యా’పాట స్టేజీ మీద రంజుగా పుంజుకోవటంతో జనాల ఈలలు,కేకలు ఎక్కువయ్యాయి.తోపులాటలు ఎక్కువయ్యాయి.అమ్మాయిల్ని ఒత్తుకుందాం అని వచ్చిన కుర్రనాయాళ్ళు ఇదే సందని ఆ పనిలో పడ్డారు.నేనూ అందుకే వచ్చా గానీ నాకేమో గుండెలు చాల్తల్లేదు.చేతులేమో గులగులలాడతన్నయ్.చేతులు జాకెట్ల మీదకి పోనిద్దామంటే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి,చేతులు వణుకుతున్నయ్యి. అప్పటికీ ఇద్దరమ్మాయిల భుజాలు రాసుకుంటా పోయి,ఒక అమ్మాయికి తగిలేటట్టు నుంచున్నా.నా పక్కనున్నోడు ఇంతలో లటక్కన ఎదురుంగా వున్న అమ్మాయి జాకెట్టు మీద చెయ్యి పెట్టి,చపక్కన ఒత్తేసి, చటుక్కున జనంలో మాయమైపోయాడు.ఆ అమ్మాయి ఎనక్కితిరిగి,నాకేసి చూసి,నేను కాదని సైగలు చేత్తన్నా పట్టించుకోకోకుండా,అసయ్యంగా మొకం పెట్టి,ఏవో రెండు బూతు మాటలు తిట్టి,ఇద్దరు మనుషుల్ని తప్పించుకొని ముందుకు పోయింది. అసలే పల్లెటూరి మంద..దొరికామా..చెప్పేది వినకుండా..ఎనకా ముందు చూడకుండా ఎముకల్లో సున్నం కూడా మిగలకుండా కుమ్ముతారు.ఎందుకొచ్చిన గొడవ మనకి..ఆడ్నుంచి తప్పుకొని ఇవకాడకి వచ్చేసా.

చుట్టూ చూత్తే నన్ను లాక్కొచ్చిన సూరిగాడు,సత్తి గాడు,శాస్త్రిగాడు,సాంబగాడు అయిపు లేరు.ఆ నాయాళ్ళు ఏ రందిలో వున్నారో..అసలే సితనారపోళ్ళు.. పిలుద్దామంటే చెవుల్లో పాటల ధొని ఓ అని ఒకటేమొయిన..పక్కనోడు చెవిలో అరిచి చెప్పినా మాట వినపడేటట్టు లేదు.ఎతుక్కుంటా ఎతుక్కుంటా స్టేజీ ముందుకు పొయ్యా.స్టేజీ కాడ డ్యూటీ చేత్తా తెలిసిన కానిస్టేబుల్ వెంకట్రావు మాయ్య అవుపించాడు.

నా ఇళ్ళ కాడే ఆయన ఇళ్లు కూడా.బాగోదని పలకరింపుగా నవ్వా..ఆయన మనల్ని పట్టించుకునే పరిస్థితులలో లేడు..స్టేజీ మీద డాన్సు చేత్తన్న ఆడపిలకాయల మీద పడే మదపునాయాళ్ళని అదుపు చేసే పనిలో బిజీ మీద వున్నాడు.

ఆళ్ళని ఎతుకుతా,ఎతుకుతా వుంటే గుడ్డేటున సూరిగాడి పూలచొక్కా తిరనాళని దాటి బయట సరికతోపుల వైపు పోతా అవుపించింది.ఈ నాయాళ్ళు నన్నీడ వదిలేసి యాడకి పోతన్నార్రా అని ఆళ్ళ ఎనకీడితే పిల్లి లాగ నేనూ లగూ దీసా.తిరనాళ కాడ వుంటే తెలీటం లేదు గానీ బయట వెన్నెల విరగ్గాత్తా వుంది.కాత్త కళ్ళు అలవాటు పడితే ఎదుట మడిసి మట్టసంగా..బానే అవుపిత్తన్నాడు.ఏరీళ్ళు..ఆఁ..ఈ నాయాళ్ళు దూరంగా సరికతోపుల వైపు దారి తీత్తన్నారు.

సరికతోపుల్లో గుబురు చెట్లను తప్పించుకుంటా వెన్నెల నేల మీదకి కురుత్తా వుంది. కిందంతా ఇసక మీద రాలిన సరిక ఈనెలు,సన్నసన్న కొమ్మలు..మెత్తటి ఇసక వల్ల నడిచొచ్చే చప్పుడే వినపట్టంలా..ఈ నాయాళ్ళు పోతా పోతా తోపులో ఒకచోట ఆగారు.గుంపుగా చేరి సప్పుడు చెయ్యకుండా ఏందో ముందుకు చూత్తా వున్నారు. నేనూ ఎనకమాలగా పొయి చూసా..

ఆడ ఒక ఆడమడిసి,ఒక మగమడిసి పాముల్లాగ పెనేసుకొని ముద్దులు పెట్టుకుంటా వున్నారు.ఒకరి కౌగిట్టో మరొకరు ఈ లోకం మైమరచిపోయి వున్నారు.కాసేపు తాలనిచ్చి శాస్త్రిగాడు తోడేల్లాగ వాళ్ళ మీదకి దూకి, మగమడిసి కణతల మీద అరచేత్తో ఒక్క చరుపు చరిచాడు.ఆ మడిసి వాయ్యా..అని అరిచి కింద పడి,తగిలిన దెబ్బకి బిత్తరపోయి కళ్ళు తేలేసాడు.చురుగ్గా కదిలిన మిగతా ముగ్గరూ జేబుల్లోంచి గబక్కన ఏవో గుడ్డలు తీసి, ముందు ఆ మగమడిసి నోట్టో,తర్వాత ఆ ఆడమడిసి నోట్టో కుక్కేసారు.కళ్ళు తెరిచి మూసేంత లోపే జరిగిపోయిందిది.భయంతో బిగుసుకు పోయి..గడగడ వణికిపోతున్న ఆ ఆడమడిసి వోణీ లాగేసి పొడుగ్గా ముక్కలు ముక్కలుగా చించేసారు.గబగబా ఆడమడిసి చేతులు ఎనక్కి విరిచి,ఆ గుడ్డముక్కలతో గట్టిగా కట్టేసారు.మగమడిసి ప్యాంటు,చొక్కా బలంతాన విప్పేసి, ఒక సరికచెట్టుకి ఆనించి నిలబెట్టి, చేతులు ఎనక్కి విరిచి కట్టేసారు. గబగబా గతాగతామని ఆడి డొక్కల్లో సరిగ్గా నాలుగు పిడిగుద్దులు గుద్దారు.నొప్పి బరాయించలేక విలవిల్లాడుతూ..మూలుగుతా ఆడు చెట్టుకి సోలిపోయాడు.ఇద్దరెళ్ళి ఆ ఆడమడిసి చెరొక రెక్కా బలంగా దొరకబుచ్చుకున్నారు.ఒకడు ఆమె లంగా బొందులు లాగేత్తే, మరొకడు ఆమె జాకీటు చింపేసాడు.టపటపమంటా ఉక్సులు తెగుతా వచ్చేసిందది. లోపల లోబాడీ,లోచెడ్డీ తప్ప ఆమె ఒంటి మీద ఇంకేం లెవ్వు.’ వద్దన్నా..ఏం చేయొద్దన్నా..’ అన్నట్టు ఆమె తల అడ్డంగా తిప్పుతా..ధారాపాతంగా ఏడుత్తా.. ముంగాళ్ళ మీద వంగి కూచుంది.నోట్టో గుడ్డ వుండటంతో ఊఁ….ఊఁ…అనే తప్ప మాట రావడం లేదు.

వెన్నెల సరిగ్గా ఆమె వీపు మీద పడతా వుంది.తెల్లటి ఆ ఒంటి మీద వెన్నెల మిసమిసా మెరుస్తా ఆ ఒంటి మీద నిలవలేక జారిపోతా వుంది.ఆగలేక ఒకడు ఆమెని పైకి లేపి నుంచోబెట్టాడు.అబ్బ..తెల్లటి పాలరాతి విగ్రహంలా వుందా ఆడమడిసి.తొడలు పాలరాతి స్థంభాల్లా నునుపు తేలి జిగేల్ మంటున్నాయి..వయసులో మంచి పొంకం మీద వుండి, పొంగులు సవాల్ చేస్తన్నట్టు వున్నాయి.నాకే కన్ను చెదిరి,వెన్నులో జుమ్మని తీపరం పాకి, ప్యాంటులో కదలిక వచ్చింది.ఇక ఆ నాయాళ్ళకి ఎట్టుంటదో.. కళ్ళల్లో కామం కట్టలు తెంచుకోనుండదూ..కోరిక బుసలు కొడతా వుండదూ..ఆమె వాళ్ళ ఉద్దేశం గ్రహించినట్టు ఒక్కసారి విదిలించుకొని వాళ్ళ కాళ్ళ మీద పడిపోయింది. ఒక్కొక్కడి కాళ్ళ మీద పడి తలకాయ వంచి దండం పెడుతున్నట్టు చేస్తూ ప్రాధేయపడసాగింది.హృదయ విదారకంగా వున్న ఆ దృశ్యం చూత్తంటే నిగిడింది కాస్తా నీరసించి పడిపోయింది.ఊఁ..ఊఁ..అని ఆమి దీనంగా ఏడుత్తుంటే ఉస్సూరనిపిస్తా వుంది.

ఛ..ఒక అమ్మాయి ఒప్పుకోకుండా..ఆ అమ్మాయికి ఇష్టం లేకోకుండా ఆ అమ్మాయిని ముట్టుకోవడానికే ఇదిగా వుంటది కదా..మరి అట్టాంటిది బలవంతంగా ఏసుకోవాలనుకోవడం ఎంత ఘోరం..ఎంత లేకితనం..ముక్కూమొకం తెలీని ఒక ఆడమడిసిని,ఆమి లవర్‌ని కొట్టి,బలంతాన ఏసుకోవాలనుకోడం..అదీ ఆమి ఆ వజాన వద్దని కన్నీళ్ళతో కాళ్ళావేళ్ళా పడి ప్రాధేయపడుతుంటే మదం పట్టిన జంతువుల్లా మీద పడి బలాత్కారం చేయాలనుకోవడం ఇంకెంత ఘోరపాపం..ఛీ..ఛీ.. నికృష్టం.. వీళ్ళు మనుషులా..జంతువులా..జంతువులు కూడా ఇష్టం లేకుండా రతిలో పాల్గొనవు..వీళ్ళు జంతువుల కన్నా హీనంగా వున్నట్టున్నారు..ఛీ..నీయమ్మ..ఆ ఆడమడిసిని చూస్తంటే జాలి కలుగుతా వుందే..అయ్యో..ఎట్టా..

ఇంతలో ఒకడు ఆమెని కిందకి తోసి,ఆమె మీద పడ్డాడు.ఇంక చూస్తా ఆగలేక పోయా. ఏదయితే అది అయింది లెమ్మని” రేయ్..ఏందిరా మీరు చేత్తంది” అని అరుత్తా వాళ్ళ మధ్యలోకి దూకా..ఆమె మీద పడ్డోడు అదిరిపడి పక్కకు దొర్లాడు.మిగతావాళ్ళు ఉలిక్కిపడి నన్ను చూసారు.

”ఎవడ్రా నువ్వు ?”నలుగురూ ఒక్కసారే అన్నారు

ముందు సూరిగాడు పోల్చుకున్నాడు నన్ను.

”రేయ్..నువ్వెందుకు వచ్చావురా ఈడకి..?” అన్నాడాడు కళ్ళు పెద్దయ్యి చేసి నివ్వెరపోతా

“ఎవడ్రా ఈడు..నీకు తెలుసా ?”శాస్త్రి అడిగాడు సూరిగాడ్ని

“అదేన్నా..చీరాల నుంచి మనతో పాటు వచ్చాడే..ఆడు..” అన్నాడాడు.

శాస్త్రి నా వంక అనుమానంగా చూత్తా”రేయ్..గు_మూసుకోని చూస్తా వుండు..ఏవైనా ఎర్రిపూ_ వేషాలేవైనా ఏసావనుకో..గు_ పగిలిద్ది”అన్నాడు పళ్ళ మధ్య నాలిక మడతపెట్టి, పిడికిలి బిగించి నా దవడ మీద కొట్టబోయినట్టు చెయ్యి చూపిత్తా

“వాడేం చేత్తాడన్నా..పిరికిగొడ్డు..”అన్నాడు సూరిగాడు నాలిక బయటపెట్టి తేలిగ్గా ప్చ్ అంటా

నన్ను పక్కకు తోసేసి వాళ్ళ పని వాళ్లు కానియ్యడానికి రడీ అయ్యారు.నేను పక్కకు పొయ్యి జేబిలోంచి సెల్ తీసి వెంకట్రావు మాయ్యకి కాల్ చేసా.మాయ్య ఎత్తడంలా.. ఇటు చూత్తే ఆ అమ్మాయి నిగుడుకోని ఆళ్ళ చేతులు విదిలిచ్చుకుంటా ఆళ్ళని ఒకటేమొయిన ప్రాధేయపడతంది.’ఎహె లే నీ యమ్మ’అంటా వాళ్ళు ఆ అమ్మాయిని బలంతాన కిందకు తోసి పడుకోబెట్టడానికి చూత్తన్నారు.వాళ్లు చూస్తే నలుగురు.!నేను ఒక్కణ్ణి..!వాళ్ళతో పోరకాడినా వల్లకాదులెమ్మని జెప్పి,దడదడలాడతా సాయం కోసం తోపు బయటికి లగూ దీసా.

తోపు బయట ఆనుకోనుండే మట్టిరోడ్డు సముద్రానికి పోతుంటది.వాడరేవు సముద్రం కాడంటే జనాలు ఇరవై నాలుగ్గంటలూ తిరుగుతా వుంటారు.ఈడ వుంటారో..వుండరో..

అదృష్టం బాగుండి ఎవడో ఒక మోటర్ బైకు మీద వత్తా అవుపించాడు.ఆదుర్దాగ చేతులు చాచి రోడ్డుకు అడ్డం పడిపోయా..బైకు ఆపి ఏందన్నట్టు చూసాడతను.నల్లంగా ఎత్తుగా తుమ్మమొద్దులా ఆరడుగులు వున్నాడతను.రొప్పుకుంటా టూకీగా విషయం చెప్పా..

అతను గబుక్కున బైకు స్టాండ్ వేసి దిగి “ఎక్కడ తమ్ముడూ ఆళ్ళు..?”అన్నాడు భైకు టాంకు మీద వున్న కవరు జిప్పులోంచి టార్చీలైటు తీస్తా.ఆ నాయాళ్ళు వున్న దిక్కు చూయించా..

వెంటనే అటేపు తోపులోకి టార్చీలైటు వేసి”రేయ్..ఎవర్రా అది..నా కొడకల్లారా” అని అతను ఒక్క అరుపు అరిచేసరికి,క్యాట్‌బాల్ దెబ్బకి చెల్లాచెదురైన పిట్టల్లాగ ఆ నాయాళ్ళు ఎటోళ్ళటు పరుగు లంకించుకున్నారు.వెంటనే పడతాలెగుత్తా తోపులోకి పరిగెత్తాం ఇద్దరం.

ఆ ఆడమడిసిని ఆళ్ళు మొత్తం మొండిమొల చేసేసారు.ఒళ్ళంతా ఇసక,సరిక నూగు ఒత్తుకొని అతుక్కోనున్నాయి.జుట్టంతా ఊడిపోయి ఆగం ఆగంగా వుంది.లేచి కూచొని, మానానికి చేతులు అడ్డం పెట్టుకొని,వెక్కి వెక్కి ఏడుస్తా వుంది.ఏడ్చి ఏడ్చి కళ్ళ కాటుక కూడా కరిగి కారి బుగ్గల మీద చారికలు కట్టినియ్.ముందు ఆమె నోట్టో కుక్కిన బట్ట తీసేసి,కట్టేసిన చేతులు ఊడదీసి,లాగిపాడేసిన బట్టలు వెతికిచ్చాను.ఆ మగమడిసి కట్లు విప్పదీసాను.దెబ్బలు బాగా తగిలినట్టు వున్నాయి..అతను నుంచోలేక సాలిపోతన్నాడు.

ఇటు చూత్తే మోటర్ బైకోడు ఆ ఆడమడిసినే ఒక రకంగా చూత్తా వున్నాడు.అతని వాలకం చూత్తే ఏదో తేడా కొట్టింది నాకు.ఆ చిరు చీకట్లో నేను గమనించలేదు గానీ అతని కాడ్నుంచి సన్నగా మందు వాసన కొడతా వుంది.

ఇంతట్లోకి ఆ ఆడమడిసి నేనిచ్చిన బట్టలు వేసుకుంది.పైన వోణీ లేకపోతే నా చొక్కా విప్పదీసి ఇచ్చా.మగమడిసి కూడా ఈ లోపు బట్టలు వేసుకున్నాడు.

“పోదాం పదండి” అన్నా ఎందుకయినా మంచిదని

బైకోడు గబక్కన ఆ ఆడమడిసికి అడ్డంగా చెయ్యి పెట్టాడు.”మీరు పదండి..మేం వత్తాం” అన్నాడు విసురుగా

నాకు విషయం అర్థమైపోయింది.వీడు కూడా ఆళ్ళకు తోడుబోయిన తోడేలే..నేను పక్కకు కదిలే లోపే ఫట్ మని అతని పిడికిలి నా దవడను తాకింది.ఒక్క క్షణం కళ్ళ ముందు చీకటి కమ్మింది.చూత్తే నేలకి కరుచుకొని వున్నాను.

“అన్నా..తప్పన్నా..ఇది కరెక్టు కాదన్నా..”మెల్లగా ఓపిక తెచ్చుకొని పైకి లేత్తా అన్నాను. అతను వినిపించుకోకుండా నా కడుపులో గుద్దాడు.చుక్కలు కనపడుతుండగా అమ్మా అంటా కింద పడ్డా..అతను రెండడుగులు ముందుకు వేసి కాల్తో నన్ను కొట్టడానికి కాలు లేపాడు.థడ్ మని శబ్దమూ..తల పట్టుకొని ఆఁ..అంటా మోటర్ బైకోడు కింద పడటమూ జరిగిపోయాయి.అదిరిపడి చూత్తే చేతిలో సరిక కర్ర పట్టుకొని పళ్ళు పటపటా కొరుకుతా నిలబడి వున్నాడు ఆ మగమడిసి..!!

చురుగ్గా కదిలి అతనూ,నేనూ ఆ బైకోడి కాళ్ళూచేతులు పడేసిన పీలికల్తో గట్టిగా కట్టేశాం.

అరవకుండా నోట్టో గుడ్డ కుక్కేశాం.అలుపు తీర్చుకుంటా ఒక్క నిమిషం అట్టనే కూర్చుండిపోయాం.అతని చెయ్యిని కరుచుకొని,భయంతో వణికిపోతూ,సన్నగా ఏడుస్తున్న ఆమిని ఓదారుస్తున్నాడు అతను.

బైకోడి జేబులు తడిమితే కాసిని డబ్బులు అవుపడ్డాయి.రెండు నోట్లు నేనుంచుకొని మిగతాయి అతనికి ఇచ్చాను.అతను కాదనకుండా తీసుకున్నాడు.

“అన్నా..థాంక్సన్నా..” అన్నాడు.

ఎందుకొచ్చారు,ఏంది అని అడిగి మళ్ళా వాళ్ళని ఇబ్బంది పెట్టదలచుకో బుద్ది కాలేదు.

“ఏ ఊరు..?” అడిగా

“చీరాలేన్నా..వైకుంఠపురం..”

“………….”

“అన్నా..మేమిద్దరం లవర్స్ అన్నా..మా ఇంట్లో వాళ్ళు మా పెళ్ళికి ఒప్పకోలేదన్నా..కులాలు వేరు కదన్నా..అందుకే..”

“…………….”

“ మేమిద్దరం కలుసుకోని చానా కాలం అయిందన్నా..ఎట్నోకట్ట తిరనాళ నెపం మీద కలుసుకోవచ్చని ఇట్టా వచ్చాం అన్నా..మా దయిద్రం..ఇట్టా అయిద్దనుకోలేదు..”

పేలవంగా నవ్వాను.బైకోడ్ని ఆడే వదిలేసి అందరం సరికతోపు బయటకు వచ్చాం.

తోటరపాలెం సెంటర్లో తిరనాళకి వచ్చే జనాల్ని తీసకపోయే ఆటోలు చానా వున్నాయి.ఒక పెద్ద ఆటో చూసి జనాల మధ్యలో ఆళ్ళని కూర్చోబెట్టి పంపించేసా.వెళ్ళిపోయారు‌.

ప్రేమపక్షులు ఎగిరిపోయినియ్.ఇంక ఏం పరవాలేదు.ఇప్పటిదాక అల్లకల్లోలం అయిన నా గుండెలు నెమ్మదించినియ్.గుండెల్నిండా ఊపిరి పీల్చుకొని తలెత్తి చూసా.ఆకాశం నిర్మలంగా వుంది.చంద్రుడు అమాయకుడిలా వెన్నెలనవ్వులు చిందిస్తా వున్నాడు. అసలక్కడ ఏం జరగనట్టు ఈ రోజుటి రాత్రి నింపాదిగా దొర్లిపోతా వుంది.దూరాన వెలుగులు జిమ్ముకుంటా, హోరున పాటల్లోన తేలుతా వుంది తిరనాళ.దూరంగా సముద్రంలో అలలు విరిగి పడుతున్న చప్పుడు తెంపు లేకుండా వినిపిస్తా వుంది. చల్లగా వీస్తన్న చలిగాలి స్పర్శ ఇప్పుడు తెలుస్తా వుంది.

నోటి కాడ కూడు పాడుచేసానని ఈ నాయాళ్ళు నా మీద కచ్చ పెట్టుకోరు కదా.. లేనిపోయింది ఊళ్ళో కాపుకాసి కొట్టరు కదా..అసలికే సితనారపు నాయాళ్ళు..ఏమైనా చెయ్యగలరు..వెంకట్రావు మాయ్యకి జరిగిన విషయం చెప్పాలి..అవసరం అయితే ఈ నాయాళ్ళ మీద కంప్లయింటు ఇవ్వాలి..ఇంకోసారి ఇట్టాంటి చెత్తపూ_ పనులు చేయకుండా వుంటారు..అన్నట్టు ఆ మోటర్ బైకోడి సంగతేందో..?మాయ్యకి చెప్పి ఎవడ్నో ఒకడ్ని పంపాల ఆ తోపులోకి..అసలికే ఆడ గండుచీమలు ఎక్కువ..

మెల్లగా కాళ్ళకు కాళ్ళు కొట్టుకుంటా తిరనాళ మొగదాలకి పోయా.మోటర్ బైకు స్టాండు కాడ ఆ నాయాళ్ళ బైకులు వున్నాయా,లేవా అని వెతికా..వున్నాయి! వెంకట్రావు మాయ్య బైకు మీద వెనక అంకెల పళ్ళెం మీద ఇంగ్లిషులో ‘పోలీస్’ అని రాసి వుంటది. దాని కోసం వెతికా.. అదీ వుంది కాత్త ఎడంగా.మాయ్యకి మళ్ళీ కాల్ చేసా.. మోగుతుంది..ఎత్తడంలా..

ఎడంగా పోయి ఎదురుగా ఒక టీ పాక అవుపడితే అందులోకి పోయి..కాస్త మరుగ్గా.. మాయ్య బైకు అవుపడుతుండే చోటు చూసుకొని గొంతుక్కూర్చున్నా..మళ్ళా ఆ నాయాళ్ళ కళ్ళ పడకుండా..చలిగాలి గిచ్చుళ్ళు ఎక్కువయింది.అరచేతులు రుద్దుకుంటా ఒక టీ చెప్పా.

పాత పేపర్లు వుంటే చేతుల్లోకి తీసుకున్నా..నాలుగు రోజుల క్రితమియ్యి అనుకుంటా..

‘సముద్ర తీర ప్రాంతంలో పెరుగుతున నేరాలు’-

‘ఒంటరి జంటల మీద జరుగుతున్న దాడులు..గాయపరిచి డబ్బులు,నగలు దోచుకుంటున్న పోకిరిలు..గస్తీ పెంచిన పోలీసులు..సముద్ర తీరంలో నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్ళొద్దని జంటలకు హెచ్చరిక..’పేపరు పైకే చదివా..

“అవునయ్యా..ఈ మధ్య మరీ ఇక్కడ ఘోరంగా తయారయ్యింది పరిస్థితి..” అన్నాడు టీ ఇస్తా ముసలాయన

“ఇక్కడా..?”ఆశ్చర్యంగా అన్నాను కావాలని

“ ఇక్కడని ఏముందయ్యా?రమాపురం కాడ్నుంచి సూర్యలంక దాక ఇదే పరిస్థితి..”

“అవునా..ఇంతకు ‌ముందు లేదే ఇంత ఘోరం..”

“అవునయ్యా..ఈ మధ్యే పెచ్చుమీరారు.నలుగురైదుగురు సోంబేర్లు ఒక చోట చేరడం..ఆ ఫోనుల్లో బూతుబొమ్మలు చూడటం..ఇంక ఎదకొచ్చిన ఆంబోతుల్లా ఇదుగో ఇట్టా సముద్రం చూద్దామని వచ్చినోళ్ళ మీదో..ఒంటరిగా వచ్చి కుతి తీర్చుకునేవాళ్ళ మీదో పడి,ఆళ్ళని కొట్టి,సలపరం తీర్చుకొని,డబ్బులు,సెల్లులు,నగలు దె__డం అలవాటు చేసుకున్నారు నాయాళ్ళు.అటు సలపరం తీరతంది..ఇటు అవసరాలూ తీరతన్నయ్యి కదా తేరగా..ఒకడ్ని చూసి ఒకడు.. ఒకడ్ని చూసి ఒకడు..ఆ చివర్నుండి ఈ చివరకి పల్లెలన్నీ పాడయిపోయినియ్..ఒకర్నని అనలేం..”ముసలాయన నిట్టూర్చాడు.

“దెబ్బదిన్నోళ్ళయినా బయటకొచ్చి జరిగింది పోలీసోళ్ళకి చెప్పొచ్చు కదా తాతా”

“ఏమని చెపుతారయ్యా..ఆళ్ళని కుంగా కొట్టి,ఆడాళ్ళని పాడుచేసి,బట్టలన్నీ ఊడదీసి పట్టుకు పోతండే..ఇంక ఆళ్ళు మొండిమొలతో ఎట్టా వత్తారు బయటికి..? నానా చావు చచ్చి వచ్చినా పోలీసోళ్ళతో చావలేక గమ్మున మూసికొని పోతన్నారు..ఇంకా నయం..మొన్న వాడరేవు కాడ ఇట్టానే ఒకడు ఎదురుతిరిగాడని చావదె_గి దొరువులో పారదె_గారు.కుళ్ళి కంపు కొడుతుంటే అప్పుడు బయటకి తీసారు..ఇప్పుడింకా నయం..పోలీసులు గస్తీలు తిరగబట్టి కాత్త నయంగా వుంది.లేదంటే రోజుకో వార్త వచ్చేదే..”

నాకు ఒళ్ళు జల్లుమంది.ఒకేళ నేను చూడకపోతే ఆ ప్రేమపక్షుల పరిస్థితి ఏంది?ఏ గతి పట్టేదో ఊహించుకోవడానికే భయంగా వుంది.

“ఈ వచ్చే మాయదారి మందకు కూడా బుద్ధి లేదు..కుతి తీర్చుకోడానికి ఈడకే రావాలా..చావుని వెతుక్కుంటా…”ముసలాయన తనలో తనే గొణుక్కుంటున్నాడు.

అర్థరాత్రి దాటిపోయి చానాసేపు అవుతాంది.తిరనాళ మెల్లగా పలచపడతంది. కనీకనపడకుండా మంచు పడతా వుంది.ముసలాయన ఇంక టీకొట్టు కట్టేయడానికి సామాన్లు బొంకులోకి సర్దుకుంటన్నాడు.

ముసలాయన మాటలే బుర్రలో గిర్రున తిరుగుతా వున్నయ్యి..వెన్నుపూసలో జల్‌జల్ మని ఏదో తెలియని భయంపాము పాకుతా వుంది.

మళ్ళా మాయ్యకి ఫోన్ చేసా.ఎత్తడం లా.. _

*

చిత్రం: చరణ్ పరిమి 

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కధ,కధనం చాలా బావున్నాయి.అత్యంత సహజంగా కథను నడిపించారు.
    పాత్రలు,సన్నివేశాలు జీవితం చుట్టూ తారసపడేవే
    చాలా మంచి కథను అందించినందుకు ధన్యవాదాలు

  • ఛ..ఒక అమ్మాయి ఒప్పుకోకుండా..ఆ అమ్మాయికి ఇష్టం లేకోకుండా ఆ అమ్మాయిని ముట్టుకోవడానికే ఇదిగా వుంటది కదా..మరి అట్టాంటిది బలవంతంగా ఏసుకోవాలనుకోవడం ఎంత ఘోరం..ఎంత లేకితనం..ముక్కూమొకం తెలీని ఒక ఆడమడిసిని,ఆమి లవర్‌ని కొట్టి,బలంతాన ఏసుకోవాలనుకోడం..అదీ ఆమి ఆ వజాన వద్దని కన్నీళ్ళతో కాళ్ళావేళ్ళా పడి ప్రాధేయపడుతుంటే మదం పట్టిన జంతువుల్లా మీద పడి బలాత్కారం చేయాలనుకోవడం ఇంకెంత ఘోరపాపం.. ఈ ఒక్క విషయం అర్థమైతే ఎన్ని ఘోరాలకు జరగకుండా ఉండేవో కదా. చాలా బాగా రాశారు. ముఖ్యంగా ఆ మాండలీకపు భాష మరింత నేటివ్ వాతావరణాన్ని తెచ్చింది.

  • కధనం బావుంది. చివరిదాకా చదివించింది. సుపరిచితమైన జిల్లా వారు మాట్లాడే మాండలీకంలో నాకు తెలియని ఇన్ని కొత్తపదాలున్నాయా అని అబ్బురపరిచేలా.

    కథ ఏకాలానికి చెందినదో తెలియరాలేదు. కథలోని పాత్రలలో ఎవరితోనూ ఏకీభవించలేకపోయాను, విభేదించలేకపోయాను; ఇంత అస్తవ్యస్తంగా, వ్యవస్థారహితంగా సమాజం ఉండటానికి సంభావ్యత ఆంధ్రరాష్ట్రంలో ఇప్పుడైనా, ఎప్పుడైనా ఉండేదా అని దిగులుపడడం తప్ప.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు