జ్ఞాపకాల సన్నజాజులు

రైలు పరుగెడుతుంటే నా మనసు అంతకన్నా వేగంగా పరుగులు తీస్తోంది. రైలు కిటికీలోంచి తల తిప్పకుండా చెట్టూపుట్టలని కళ్ళతో చూస్తున్నా, మనసు మాత్రం అక్కయ్యపాలెం వీధులలో తిరిగేస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంత ఆనందం ఉద్వేగం నేను అనుభవించలేదు. విశాఖ వదలి వెళ్ళాక మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత నగరంలో అడుగుపెట్టడం నన్ను ఒకపట్టాన కుదురుగా కూర్చోనివ్వట్లేదు. నా ఆలోచనలను భగ్నం చేస్తూ ఎక్కడో ఫోన్ గట్టిగా మోగడంతో ఉలికిపడ్డాను. ఎదురుగా కూర్చున్న అమ్మాయి ఫోన్ తీసి-

“నాన్నా వేణుగోపాలస్వామి గుడి దగ్గరకు వచ్చేక ఫోన్ చేస్తాను. ఆ అవును, కాబ్ లో వచ్చేస్తాను, నువ్వు మళ్ళీస్టేషన్ కి రావడం ఎందుకు? …” మాట్లాడుతూ ఉంది.

ఆ అమ్మాయి అక్కయ్యపాలెంలోని వేణుగోపాలస్వామి గుడి గురించేనా మాట్లాడుతోంది, అడిగెయ్యమని నా మనసు తొందరపెడుతోంది. ఫోన్ లో తను మాట్లాడడం ఆపగానే ఆగలేక పలకరించాను.

“మీరు విశాఖకేనా వెడుతోంది?” అడిగాను.

“ అవునండీ, మీరు కూడా విశాఖకేనా?” అంది ఆ అమ్మాయి. అవునంటూ తల ఊపి

“ చాలా ఏళ్ళ క్రితం దొండపర్తిలో ఉండేవాళ్ళం. నా చదువు అంతా అక్కడే జరిగింది. అక్కయ్యపాలెం వీధులలో తెగ తిరిగేవాళ్ళం. పెళ్ళి అయి ఊరు దాటాక దాదాపు పాతికేళ్ళ తరువాత మళ్ళీ ఇదే విశాఖపట్నం రావడం. ఎన్నిసార్లు అనుకున్నా కుదరనే లేదు. మావారి ఉద్యోగం వల్ల ఎంతసేపు నార్త్ లోనే తిరిగేవాళ్ళం. అమ్మానాన్నా ఉన్నన్ని రోజులూ పాపం వాళ్ళే నా దగ్గరకు వచ్చేవారు.  ఏదో ఒక ఇబ్బంది వల్ల ఒకసారి కూడా రాలేకపోయాను” అన్నాను.

ఇదంతా నేను అత్యుత్సాహంతో చెప్పేసాక

‘అయ్యో ఒక ప్రశ్న వేసినందుకు ఇదంతా ఈవిడ నాకెందుకు చెప్తోంది’ అని ఆ అమ్మాయి అనుకుందేమో అనిపించి కాస్త సిగ్గుపడ్డాను. అలాగా అన్నట్టు తలూపి చెవులలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని పాటలు వినడంలో మునిగింది తను. నేను  కిటికీలోంచి బయటకు చూస్తూ గతపు రోజుల తీయని తలపులలో మునిగిపోయాను.

*

“ఇల్లు ఖాళీ చెయ్యమన్నారు కదా ఇంటివాళ్ళు. ఏమైనా చూసారా? పది సార్లు చెప్పించుకుంటే ఏం బావుంటుంది” అంటోంది అమ్మ నాన్నకు కాఫీ అందిస్తూ.

“ చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎక్కడ వెతకను, పిల్లలకి స్కూలుకి దగ్గరగా ఉండాలి. అద్దె కూడా తక్కువ ఉండేలా చూసుకోవాలి. మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఎన్ని ఆలోచించాలి” అన్నారు నాన్న.

“ ఈసారైనా కాస్త వాకిలీ, పెరడూ మొక్కలూ ఉండే ఇల్లు చూసుకుని దిగుదాం. ఈ కొంపలో గాలాడట్లేదు అసలు” అంది అమ్మ.

“అవునులే సొంతింటి వాళ్ళకి ఒకటే ఇల్లు. అద్దెకున్న వారికి ఎన్ని ఇళ్ళో, అవీ మనసుకు నచ్చినవి. ఇది వరకు ఒక పెద్దమనిషి ‘తెలివైనవాడు అద్దెకుంటాడు, తెలివి తక్కువ వాడు ఇల్లు కట్టుకుంటాడు’ అన్నాడుట”

అంటూ నవ్వారు నాన్న.

“ చాల్లెండి సంబడం. అంటే ఇక ఎప్పటికీ మనకి సొంతిల్లు ఉండదని చెప్తున్నరా కొంపదీసి” అంది అమ్మ.

నాన్న ఎప్పట్లాగే చిరునవ్వే సమాధానంగా ఇచ్చారు.

ఇప్పుడున్న ఇంటి నుండి స్కూలుకి వెళ్ళడానికి ఒక అరగంట నడక. నేను స్కూలుకు నడిచి వెడుతూ దారిలో నాకు నచ్చిన ఇళ్ళను చూస్తూ సెలక్ట్ చేసుకునేదాన్ని. అవీ స్కూలుకు మరింత దగ్గరగా ఉన్నవాటిని మాత్రమే పరిశీలనగా చూసేదాన్ని. ఇప్పుడు ఉంటున్న ఇల్లు పెంకుటిల్లు కాబట్టి డాబా ఉన్న ఇల్లు అయితే హాయిగా డాబా మీద ఆడుకోవచ్చు, వేసవిలో డాబా మీద పడుకుని నక్షత్రాలను లెక్కపెట్టచ్చు. ఇలా నా ఆలోచనలు సాగేవి.

నాకు నచ్చిన ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయి వాటిలోకి మేము మారిపోయినట్టు ఊహించుకునేదాన్ని. ఇంటి ముందు, వెనుక బాగా ఖాళీ స్ధలం ఉన్న ఇళ్ళు, కాయలు నిండుగా ఉన్న జామచెట్లు ఉన్న ఇళ్ళు నా కలలోకి తరచూ వచ్చేవి.

అప్పుడు నేను నాలుగో తరగతో మూడో తరగతో చదివేదాన్ని. నాన్న అద్దెఇళ్ళ కోసం విపరీతంగా గాలించడం మొదలుపెట్టారు. నేను స్కూలుకు వెళ్ళేడప్పుడు తిరిగి వచ్చేడప్పుడు టులెట్ బోర్డు కోసం వెతికేదాన్ని. చిన్నపిల్లను కావడంతో ఇళ్ళ దగ్గర కాసేపు ఆగి అదే పనిగా చూస్తుంటే కొందరు నా బుగ్గలు పుణికి

“ ఏం కావాలి పాపా? ఏ స్కూల్లో చదువుతున్నావు” అని అడిగేవాళ్ళు.

నేను సిగ్గుపడుతూ జవాబు చెప్పి ఇంటికి తుర్రుమనేదాన్ని. ఇక అమ్మకి నాకు నచ్చిన ఖాళీ అయిన ఇళ్ళ గురించి చెప్తూ వర్ణించి వర్ణించి ఊదరగొడుతుంటే అమ్మ నవ్వేది. అవన్నీ నాన్నకు చేరవేస్తే నాన్న నన్ను దగ్గరకు తీసుకుని ముద్దు చేసేవారు.

అలా నా దృష్టిని ఒక ఇల్లు ఆకర్షించింది. మొన్న శనివారం చూసినపుడు లేని ‘టు లెట్ బోర్డు’ ఇవాళ సోమవారం స్కూలుకి వెడుతుంటే కనబడింది. ఆ ఇంటి ముందర నుండే రోజూ వెడుతున్నా సరిగ్గా గమనించలేదు అనుకున్నాను. బహుశా టు లెట్ బోర్డు లేకపోవడం వల్ల కావచ్చును. నాకు ఇల్లు విపరీతంగా నచ్చేసి సాయంకాలం నాన్న రాగానే వెంట పెట్టుకుని వెళ్ళాను. అది వరుస గదులతో ఉన్న నాలుగు గదుల ఇల్లు.  ముందున్న వరండాకి సగం వరకూ గోడ ఆ పైన ఇనుపగ్రిల్స్ బిగించి ఉన్నాయి. వరండాలో కూర్చుంటే చక్కగా గాలి వేస్తుంది. ఆ వెనుక రెండు గదులు. ఆ తరువాత వంటిల్లు. వంటింటి పైన రేకులు పరచి ఉన్నాయి. ఆ వెనక పెరడు చూస్తే మతి పోయింది. ఎన్ని మొక్కలు, చెట్లు ఉన్నాయో. పెరట్లో ఒక మూలగా నుయ్యి కూడా ఉంది కాబట్టి నీళ్ళకి ఇబ్బంది లేదు. ఇప్పుడు మేమున్న ఇంట్లో నుయ్యి లేదు. మునిసిపల్ కుళాయి మాత్రం ఉంది. ఎక్కువ నీళ్ళు కావలసి వస్తే పక్కింటి నూతికి వెళ్ళి నీళ్ళు మోసుకునేవాళ్ళం.అమ్మకి ఈ ఇల్లు వీపరీతంగా నచ్చేస్తుంది అనుకున్నాను. నాకైతే ఆనందానికి అవధులు లేవు. ఆ మూడు వాటాల ఇంట్లో ఒక భాగంలో ఇంటివాళ్ళు ఉండి, మిగిలిన రెండు వాటాలు అద్దెకు ఇస్తున్నారు.

నాన్న ఇంటి ఓనరుతో కాసేపు మాట్లాడాక నేనూ నాన్నా ఇంటికి వచ్చేసాం. అమ్మానాన్నా ఏదోసుదీర్ఘ చర్చలో మునిగిపోయారు. అదేమిటో నాకు అర్ధం కాలేదు. పూలమొక్కలున్న ఇల్లు అనగానే అమ్మ ఎగిరిగంతేస్తుందని అనుకున్న నాకు, నాన్నతో అంతసేపు చర్చించడమేమిటో  పట్టుబడలేదు. నాన్న మరోసారి ఆ ఇంటి ఓనరుతో వివరంగా మాట్లాడి వచ్చానని అమ్మతో అంటుండగా విన్నాను.

“ అయితే పరవాలేదంటారా? వాళ్ళు దానికి ఒప్పుకున్నారా?” అని అడిగింది అమ్మ ఆశ్చర్యంగా.

“ మరీ ఎక్కువ ఆలోచించకు, మంచివాళ్ళలాగే ఉన్నారు” అన్నారు నాన్న.

అదేమిటో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నా నేను అడగలేదు.

ఎందుకంటే అన్నిట్లోనూ కలగజేసుకుంటూ ప్రశ్నలు వేస్తుంటే

“ చిన్నపిల్లవి నీకెందుకు పెద్దవాళ్ళ విషయాలు, పెద్ద బయలుదేరింది పెద్దాపేరక్క”

అంటూ ఇదివరకొకసారి గట్టిగానే మొట్టికాయలు పడ్డాయి.

మొత్తానికి ఒక పది రోజులలో ఆ కొత్తింట్లోకి మారిపోయాం. నా ఆనందానికి అంతులేదు. డాబా మీదకి

వంద సార్లు ఎక్కి దిగుతూ తెగ తిరిగేస్తున్నాను. అమ్మ కాళ్ళు నెప్పెడతాయని తెగ తిడుతూ ఉంది. అయినా మనం వినిపించుకునే రకమైతే కదా. నాకు ఒకటే దిగులేమిటంటే నేను ఆడుకోవడానికి ఇంటి ఓనరుకు పిల్లలు లేరు. కానీ కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి పక్క వాటాలో లలితకుమారి అనే అమ్మాయి ఉండేది. నాకన్నా పెద్దది కావడంతో నాతో మాట్లాడేది కానీ ఆడేది కాదు. నేనే సెలవల్లో బ్రతిమాలి లూడో చైనీస్ చెక్కర్స్ ఆడమని బ్రతిమాలేదాన్ని. తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా  ఆడడంతో నాకు ఆనందంగా ఉండేది.

నాన్నకి జాగ్రత్త ఎక్కువ.

“ఇక మీదట మీ ఇల్లు ఎక్కడ అని ఎవరైనా అడిగితే దొండపర్తి కుమ్మరివీధికి ఎదురు వీధిలో అని చెప్పాలి సరేనా” అంటూ నాన్న కొత్త చిరునామా నా చేత వల్లె వేయించారు. నేను ఎప్పుడైనా తప్పిపోతే ఇంటి చిరునామా చెప్పగలిగేలా ఉండాలని నాన్న అభిప్రాయం. నేను ఏడో తరగతికి వచ్చాక  కొన్ని విషయాలు కాస్త అర్ధమవడం మొదలైంది.

అమ్మ అప్పుడప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళతో గొంతు తగ్గించి

“ అవును మన వాళ్ళు కాదు. కానీ వాళ్ళు అవి తినరు,  మానేసారు. చాలా మంచి వాళ్ళు”

అంటూ ఇల్లుగలవాళ్ళ కోసం మంచిగా చెప్పేది.

నాకు అప్పుడు అర్ధమైంది. వాళ్ళు మాంసాహారులు. మేము శాఖాహారులం . మరి వాళ్ళు అవన్నీ వండుకుంటే అమ్మకి ఇబ్బంది కదా. మేము పాతింట్లో ఉన్నపుడు కూడా ఎక్కడి నుండైనా ఆ వాసన వస్తే అమ్మ తెగ చిరాకు పడిపోయేది.

నేను అమ్మతో

“ అమ్మా మా క్లాసులో రమేష్ లేడూ… వాళ్ళు గుడ్లు తింటారుట” అని ఎప్పుడైనా అంటే

“ తప్పు . అలాంటివి మనింట్లో మాట్లాడకూడదు” అని అమ్మ మెత్తగా మందలించింది.

ఎందుకు మాట్లాడకూడదో  అప్పుడు నా చిన్నబుర్రకు అర్ధం కాలేదు. అమ్మకు ఇష్టం లేనట్టుందని సరేనన్నాను.

నేను చదివిన బడిలో ఏడవ తరగతి వరకే ఉండడంతో నన్ను మరో స్కూల్లో జాయిన్ చేసారు. ఆ స్కూలుకి కుమ్మరివీధి గుండా శంకరమఠం జంక్షన్ తో పాటూ బివికె కాలేజ్ జంక్షన్  దాటుకుని వెళ్ళాలి. అప్పట్లో ఎక్కడికైనా నడిచే వెళ్ళేవాళ్ళం కనుక ఆ దూరమసలు కష్టమనిపించేది కాదు. నేను వెళ్ళే దారిలోనే ఇద్దరు ముగ్గురు స్నేహితురాళ్ళు కలవడంతో అందరం కబుర్లు చెప్పుకుంటూ స్కూలుకి వెళ్ళేవాళ్ళం. అసలు నడిచినట్టే తెలిసేది కాదు.  ఆ స్కూల్ లో మెట్రిక్ మాత్రమే ఉండేది కాబట్టి  మెట్రిక్యులేషన్ పరీక్షకి కట్టాను.

మేము కొత్తగా దిగిన  అన్నపూర్ణమ్మగారింట్లో వీధిగేటు నుండి డాబా మీదకు పాకిన సన్నజాజి పందిరి రెండు పెద్ద గిన్నెల నిండుగా పూలు పూసేది. చిన్నక్కకి బాగా ఓపికెక్కువ. ఆ సన్నజాజి మొగ్గలన్నీ కోసి రెండు మూడు మూరల దండలల్లేది. అవి తీసుకెళ్ళి నేను అన్నపూర్ణమ్మగారికి, అదే  ఇంటి ఓనరమ్మకి ఇచ్చేదాన్ని.

ఆవిడ చూసి మురిసిపోతూ

“ ఆడపిల్లలుంటే ఇంటి కళే వేరు. ఇలా చక్కగా పూలు కోసి కట్టేవారు ఇంతకు మునుపు ఎవరూ లేక పూలన్నీ వాడి రాలిపోయేవి” అంటూ పదే పదే చెప్పేవారు. ఆవిడ అందులోంచి చిన్న ముక్క తీసుకుని మిగిలిన దండ మాకే ఇచ్చేసేవారు. అలాగని ఆవిడకు చూపకుండా మేము తీసుకునే వాళ్ళం కాదు. ఆ మిగిలిన దండ నేనూ చిన్నక్కా అమ్మా పెట్టుకోగా మిగిలిన దండను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి చుట్టుపక్కల వారికి నేనే ఇచ్చేదాన్ని. పెళ్ళై వేరే ఊర్లో ఉన్న  పెద్దక్క పెద్దపండక్కి వచ్చినపుడల్లా సన్నజాజి పందిరిని చూసి తెగ సరదా పడిపోయేది.

“ అమ్మా ఈ ఇంట్లో పూలకు లోటు లేదు. ఇది అన్నపూర్ణమ్మగారిల్లు కాదు పూలలోగిలి “ అంటూ నవ్వేది.

అప్పుడప్పుడు అన్నపూర్ణమ్మగారిని అడిగి పెరట్లోని కనకాంబరాలూ, మరువం దవనం ఏరి దండ అల్లితే ఆ సువాసనలతో ఇల్లూ వాకిలీ గుబాళించిపోయేది. చిన్నక్క ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తుంది. పూలదండ కూడా మొగ్గలు  దగ్గర దగ్గరగా పెట్టి అల్లి, చాపలా చుట్టి నీళ్ళు చిలకరించేది. కాసేపటికి  పూలు విచ్చుకున్నాక దండ పూలబంతిలా కనబడేది . కాస్త ఎండ ఉన్నప్పుడే మొగ్గలు కోసేవాళ్ళం ఎందుకంటే చీకట్లు అలుముకున్నపుడు కొన్ని మొగ్గలు కనబడవు, అదీ కాక మొగ్గలతో దండ అల్లడం సులువుగా ఉంటుంది. ఆలస్యంగా కోస్తే

“ సందెవేళ పూలు కొయ్యకూడదు. మొక్కలు నిద్రపోతాయి” అంటూ అమ్మ కూడా మెత్తగా చివాట్లేసేది.

*

రైలు కుదుపుతో ఆగడంతో ఉలికిపడి జ్ఞాపకాలలోంచి బయటపడ్డాను. విజయవాడ స్టేషన్ వచ్చినట్టుంది. ఒకటే హడావిడి మొదలైంది. ఎదురుగా ఉన్న అమ్మాయి రైలు దిగి వెళ్ళి ఏదో కొని తెచ్చుకుంది. నన్ను చూసి నవ్వి

“ అయ్యో మీకు ఏమైనా కావాలా? అడగడం మరచాను “ అంది.

ఏమీ వద్దనట్టు తలూపాను.

“ మీరు విశాఖలో ఎక్కడకు వెడుతున్నారు?” అనడిగింది.

నేను చెప్పి

” మీరు అక్కయ్యపాలెంలో ఉంటారా?” అడిగాను. అడిగాక నా ఆత్రుతకు నాకే నవ్వొచ్చింది.

ఆ అమ్మాయి చిన్న ఆశ్చర్యార్ధకంతో నన్ను చూసి

“ అవునండీ. వేణుగోపాలస్వామి గుడి పక్క వీధిలోనే మా ఇల్లు. మీకు తెలుసా ఆ ఏరియా?” అంది.

“ మేము దొండపర్తిలో ఉండేవాళ్ళం. నా చదువంతా అక్కడే, నేనూ అమ్మా వేణుగోపాలస్వామి గుడికి చాలాసార్లు వచ్చేవాళ్ళం. ఇదంతా పాతికేళ్ళ క్రితం” అన్నాను.

ఆ అమ్మాయి నిద్రపోవడానికి సన్నాహాలు చేసుకోవడం మొదలుపెట్టింది. మా బోగీలో అందరూ ఇంకా కబుర్లలో మునిగి ఉండి, ఇప్పుడిప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్నారు.

నా బెర్త్ పై పడుకున్నాను. నిద్ర రావట్లేదు. అప్పటి జ్ఞాపకాలు ముసురుకుంటూనే ఉన్నాయి. ఎంత బావుండేవి ఆ అందమైన రోజులు.

*

అప్పట్లో కుష్టువ్యాధిగ్రస్తులు గుంపులుగుంపులుగా ఇంటింటికీ వచ్చి ధర్మం చెయ్యమంటూ అడిగేవారు. చాలా మంది తమకు ఎక్కడ వ్యాధి అంటుకుంటుందో అని దూరంగా పెట్టి వారికి ఏమీ ఇచ్చేవారు కాదు. వాళ్ళలో కొందరికి చేతివేళ్ళు సగమే ఉండేవి. మిగిలినది వ్యాధి తినేసిందని నాన్నని అడిగితే చెప్పారు. పాపం కొందరికి ముక్కు చప్పిడిగా ఉండేది. ఒక్కోసారి ఒకరు కర్రతో చేసిన మూడుచక్రాలబండిలో కూర్చుంటే మరొకరు ఆ బండిని తోసుకుంటూ వచ్చేవారు. అలా ఒకరికొకరు వారిలో వారు సహాయం చేసుకునేవారు. నాకు ఇదంతా వింతగా ఉండేది.

“ వాళ్ళు ఎక్కడ ఉంటారు నాన్నా? వాళ్ళకి ఇళ్ళు ఉంటాయా? ఏ పనులు చేస్తారు వాళ్ళు” ఇలా నా ప్రశ్నలు సాగేవి.

“ వాళ్ళకి ఎవరూ పనులు ఇవ్వరమ్మా. జబ్బు అంటుకుంటుందని భయం. అందుకే వాళ్ళు ఇలా యాచకవృత్తిలోకి దిగారు” అన్నారు నాన్న.

వాళ్ళని అంతలా పరిశీలించే అవకాశం నాకు దొరకడానికి ఒక కారణం ఉంది.

అన్నపూర్ణమ్మగారు వాళ్ళకి వారానికోసారి మధ్యాహ్నం పూట భోజనాలు పెట్టేవారు. ప్రతి గురువారం   రామకృష్ణగారు అంటే అన్నపూర్ణమ్మగారి భర్త, చీటీల మీద అంకెలేసి ఉదయం నుండి వచ్చిన వారికి ఒకొక్క చీటీ ఇచ్చేవారు. వాళ్ళు చీటీలు తీసుకెళ్ళి మధ్యాహ్నం ఆ చీటీ చూపించి భోజనం చేసేవారు. ఉదయం ఏడు గంటల నుండి పది పదకొండు గంటల వరకూ చీటీల పంపకాలు జరిగేవి. బహుశా ఎంత మందికి మధ్యాహ్నం భోజనం వండాలో తెలుసుకోవడానికి ఈ ఏర్పాటు అయుంటుంది. బంధువులొచ్చి అప్పుడప్పుడు వచ్చి వంటలో ఆవిడకు సహాయం చేసేవారు.

పెరట్లో కర్రలపొయ్యి మీదకి పెద్ద గిన్నె ఎక్కించి కూరలన్నీ వేసి కమ్మగా సాంబారు కాచేవారు. ఆ పక్కనే మరో పెద్ద గుండిగలో అన్నం వండేవారు. వీధి వాకిట్లో అందరూ వరుసగా చీటీలు పట్టుకుని కూర్చుంటే వడ్డనచేసేవారు. మొదట్లో అమ్మ ఇదంతా  కటకటాలలోంచి వింతగా చూసేది. ఆ తరువాత తను కూడా కూరలు తరగడం లాంటి పనులు చేసేది. ఒకోసారి వడ్డనకు కూడా సాయం పట్టేది. ప్రతి గురువారం ఇంట్లో ఒక పండుగ హడావిడి ఉండేది. నాన్న ఈ విషయంలో మాత్రం ఏమీ అనేవారు కాదు.

నాన్నకు పక్కింటి వాళ్ళతో బాతాఖానీ పెట్టడం అసలు నచ్చదు. అవసరమైనపుడు మాత్రమే ఇరుగు పొరుగుతో మాట్లాడాలి అనేవారు. అలాగని మరీ మాటామంతీ లేకుండా ఉండకూడదు, కాస్త స్నేహంగా ఉండాలి అని ఆయన భావన. అనవసరమైన గొడవలు వస్తే మళ్ళీ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందని ఆయన భయమేమో. కానీ అమ్మకి ఎలా పొద్దుపోవాలి?, అందుకే నాన్న లేనపుడు మాత్రమే వాళ్ళతో మాట్లాడేది. అమ్మ మృదుస్వభావి కాబట్టి ఎప్పుడూ ఏ మాట తేడా వచ్చేది కాదు. అప్పట్లో బియ్యం ఏరుకుంటూనో పప్పులు చెరుగుతూనో అందరూ  పెరట్లోనో వాకిట్లోనో చేరి కబుర్లు కష్టసుఖాలు చెప్పుకునేవారు. ఇక వేసవి వస్తే ఆవకాయ కోసం మామిడిముక్కలు తరుక్కోవడం దగ్గర నుండి ఊరగాయ కారాలు దంపించుకోవడం వరకూ బోలెడు హడావిడి. పెరట్లో ఇంటి వాళ్ళకి ఒక పెద్ద రోలు ఉండేది . ఒకరిద్దరు రోకలి పోటేస్తే ఒకరు కింద కూర్చుని జల్లించేవారు. అలా ఊరగాయలతో వేసవి కాలం ఇట్టే గడిచిపోయేది.

వేసవికి పెద్దక్క వస్తే నేను, పక్కింటి లలితకుమారి స్టీల్ కేన్ నిండా చెరుకురసం దగ్గరుండి చేయించుకొచ్చేవాళ్ళం. మండుటెండవేళ ఐసుముక్కలు వేసి నిమ్మకాయ పిండిన ఆ చెరుకురసం అమృతంలా ఉండేది. ఆనాడు బాగా డబ్బున్నవాళ్ళ దగ్గర తప్ప ఫ్రిజ్ ఎవరికీ ఉండేది కాదు. అందుకే అప్పుడప్పుడు ఐసుముక్కలు తెచ్చుకుని నిమ్మరసం కలుపుకుని తాగేవాళ్ళం. వేసవిలో కుండలో నీళ్ళు తాగితే ఎంతో హాయిగా ఉండేది. కుండ చుట్టూ తడిగుడ్డ కడితే నీళ్ళు మరింత చల్లగా ఉండేవి.

రాత్రులు అయితే కబుర్లు చెప్పుకుంటూ డాబా మీద పడుకునే వాళ్ళం. బాగా వేడిగా ఉంటే పడుకోవడానికి పైకి వెళ్ళే రెండు గంటల ముందు డాబా మీద నీళ్ళు చల్లేవాళ్ళం. కిటికీలకు వట్టివేళ్ళ చాపలు కట్టి నీళ్ళు చల్లితే చల్లగాలి సువాసనతో పలకరించేది. ఏ ఋుతువుకు ఆ పూలు పూస్తూ పెరడు రంగులమయంగా ఉండేది. వేసవిలో మల్లెమొక్క రోజూ గిన్నెడు పూలు పూసేది. వాటితో ఒక మూరెడు దండ వచ్చేది.

శంకరమఠంలో తరచూ హరికథా కాలక్షేపం ఉండేది. వాటికి అమ్మతో నేను కూడా వెళ్ళి ఆసక్తిగా వినేదాన్ని. కొంచెం అర్ధం అయేది కానీ మధ్యలో నిద్ర ముంచుకొచ్చేది. నాన్న మాత్రం ఆఫీసు, ఇల్లు తప్ప మరెక్కడికీ కదిలేవారు కాదు. అమ్మకు సినిమాలు ఇష్టం కావడంతో పక్కింటి సరస్వతిగారితో రహస్యంగా సినిమాలకు వెళ్ళేది.

మేము అమ్మకు సహకరించే వాళ్ళం.

అమ్మ “ఆయనకు సినిమాలూ షికార్లూ ఇష్టముండవు వదినగారూ, నాకేమో విపరీతమైన పిచ్చి” అని అన్నపూర్ణమ్మగారితో అంటూ ఉండేది.

ఆవిడ “మీ పని ఆయనకు తెలియకుండా కానిస్తున్నారుగా” అంటూ అమ్మను ఆట పట్టించేవారు.

అలా సుమారు పదేళ్ళకు పైగా ఆ ఇంట్లో ఉన్నాం. ఆ పదేళ్ళు మా కోసం వాళ్ళు నాన్ వెజ్ మానుకున్నారు.

ఆవిడా అమ్మా అక్కచెల్లెళ్ళలా ప్రేమగా ఉండేవారు. తోబుట్టువుల ప్రేమ తెలియని అమ్మ, ఆవిడలో తోబుట్టువుని చూసుకునేదేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అప్పటి రోజులలో వేరు కులస్తుల నడుమ అంత గాఢ స్నేహాలు ఉండేవి కాదు.

మాగన్నుగా ఎప్పుడు నిద్రలోకి జారిపోయానో తెలీదు. రైలు కుదుపుకి మెలకువ వచ్చింది. అప్పుడప్పుడే తెలతెలవారుతోంది. కానీ ఇంకా చీకటిగానే ఉంది.

*

 

రెండేళ్ళ క్రితం అనుకోకుండా నా స్కూల్ ఫ్రెండ్ అనుపమ హైద్రాబాద్ వచ్చింది. అప్పుడే మా వారికి హైదరాబాద్ కు ట్రాన్ఫరై రెండు నెలలైంది. అక్కడ మేము ఇల్లు కొనుక్కున్నాం, ఇల్లంటే ఈ కాలంలో అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ అనే అనుకోవాలి. స్ధలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవడం ఈ రోజుల్లో ధనవంతులకు మాత్రమే సాధ్యం. నేను మా ఫ్లాట్ బాల్కనీలో చిన్న చిన్న కుండీలలో వేసిన పూలమొక్కలు చక్కగా సర్దుకున్నాను. అక్కడే ఒక గోడకి వెర్టికల్ గార్డెన్ అమర్చుకుని ఆకుకూరలు పెంచుతున్నాను. అనుపమ నా బాల్కనీ తోట చూసి చాలా ముచ్చటపడిపోయింది.  నేను అన్నపూర్ణమ్మగారి ఇల్లు, అక్కడ పూలమొక్కలు గుర్తు చేసుకుంటూ తనటువైపు వెళ్ళిందేమో అనడిగాను.

“అబ్బో అడక్కు తల్లీ. వీధులన్నీ మారిపోయి పెద్దపెద్ద ఇళ్ళున్న స్ధలాలన్నీ అపార్ట్ మెంట్లుగా మారిపోయాయి. అసలేవీ గుర్తుపట్టేలా లేవు. అన్నపూర్ణమ్మగారిల్లు మాత్రం అలాగే ఉంది. కానీ రంగులవీ బాగా వెలిసిపోయాయనుకో” అంది.

“నువ్వు ఆ ఇంటికి తరచూ వచ్చేదానివి కదా. లోపలకి వెళ్ళి ఒకసారి ఆవిడని పలకరించి పెరడు కూడా చూడలేకపోయావా” అన్నాను ఆత్రుతగా.

“ సరేలే, నేను ఏదో ఫంక్షన్ కు వెళ్ళడానికి విశాఖ వెళ్ళాను . అలా కేబ్ లో ఆ వీధి గుండా వెడుతూ చూసాను.

అయినా నన్ను వాళ్ళెక్కడ గుర్తు పడతారు. ఎప్పుడో పాతికేళ్ళ నాటి మాట” అంది.

అదుగో అప్పటి నుండీ నా జ్ఞాపకాల ఇంటిని చూడాలని మరింతగా తహతహ మొదలైంది. ఆ ఇల్లు అలాగే చెక్కుచెదరకుండా ఉందనే ఆనందం నన్ను కుదిపేసింది. పోనీ ఫోన్ నంబర్ ఉన్నా ఒకసారి అన్నపూర్ణమ్మగారిని పలకరిద్దును. ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ఆవిడ భర్త పోయారనే వార్త మాత్రం ఎవరో చేరవేసారు.

అనుకోని అదృష్టం కలిసి వచ్చినట్టు లలితకుమారి వాళ్ళ అబ్బాయి పెళ్ళి శుభలేఖ నాకు అందింది. తనూ నాతో టచ్ లో లేదు. ఎలా నా అడ్రస్ సంపాదించిందో మరి, చాలా ఆశ్చర్యమనిపించింది. అనకాపల్లిలో పెళ్ళి. పెళ్ళికూతురిది అనకాపల్లి అని శుభలేఖలో ఉంది. శుభలేఖలో ఫోన్ నంబర్ కు ఎన్నిసార్లు చేసినా ఎవరూ ఎత్తలేదు. అన్నీ కలిసొచ్చాయని విశాఖపట్నం బయలుదేరాను. ముందుగా విశాఖ వెళ్ళి అన్నపూర్ణమ్మగారిని చూసి అప్పుడు  అనకాపల్లి పెళ్ళికి వెళ్ళచ్చని నా ప్లాన్.

విశాఖలో రైలు దిగగానే కాబ్ ఎక్కి  క్షేమంగా చేరినట్టు మావారికి ఫోన్ చేసాను. ముందే బుక్ చేసుకున్న డాల్ఫిన్ హోటల్ లో దిగి ఫ్రెష్ అయ్యాను. ముందు వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందామనుకున్నాను అలాగే శంకరమఠానికి కూడా వెడదామనుకున్నాను. కానీ మనసు ఆగలేనని మారాం చేయడంతో “దొండపర్తి కుమ్మరివీధి” అని చెప్పి ఎదురుగా కనబడ్డ ఆటో ఎక్కాను.  మునుపటిలా రిక్షాలు లేవు. అవన్నీ ఎప్పుడో కనుమరుగై ఆటోలే వాటి స్ధానం ఆక్రమించాయి. విశాఖ వీధుల గుండా వెడుతుంటే అంతా కొత్తకొత్తగా ఉంది. పాతికేళ్ళలో నగరం చాలా మారిపోయింది. అప్పటి కిళ్ళీబడ్డీల  స్ధానంలో పెద్ద పెద్ద షాపులు వెలిసాయి. రోడ్లన్నీ కార్లతో మోటార్ బైకులతో నిండిపోయి హడావిడిగా ఉన్నాయి. ఆటో గతుకుల కుదుపులతో ముందుకు సాగుతుంటే జాగ్రత్తగా నడపమని డ్రైవర్ ను హెచ్చరించాను.

డైమండ్ పార్క్ చూడగానే చిన్నగా నవ్వుకున్నాను. పార్కు పెద్దగా మారలేదు, అలాగే ఉంది. అప్పుడప్పుడు నాన్న నన్ను అక్కడకు తీసుకొచ్చిన జ్ఞాపకం కనులలో కదలాడింది. శ్రీసూర్య ధియేటర్ ఎదురు వీధిలోకి ఆటో మలుపు తిరిగింది. ఆ సినిమా హాలుకే అమ్మ సినిమా చూడడానికి వెళ్ళేది. సినిమాహాలు ఏమైనా మార్పు చేసుంటారా అని మనసులో అనుకున్నాను.

ఇక నేను వెళ్ళాల్సిన వీధి దగ్గర పడుతుంటే ఉద్వేగంతో మనసంతా ఏదోలా అయింది.

“బాబూ నెమ్మదిగా వెళ్ళు. మళ్ళీ ఇల్లు దాటిపోతాం” అన్నాను. ఆటో నెమ్మదిగా కదులుతోంది.

నిజమే అనుపమ చెప్పినట్టు ఎత్తుగా అపార్ట్ మెంట్లు వరుసగా నిలబడి ఉన్నాయి.

వీధి చివర ఉండే పెద్ద పెద్ద చెట్ల జాడ లేదు.

‘ ఏదీ ఇల్లు దాటిపోయానా, అన్నపూర్ణమ్మగారి ఇల్లు కనబడదే… అదేంటి వీధి చివరకు వచ్చేసాను?ఎడం వైపుకు తిరిగితే టి. ఎస్.ఎన్. కాలనీ వచ్చేస్తుంది’ ఒకసారి ఉలికిపడ్డాను.

“ బాబూ ఆటో మళ్ళీ వెనక్కి తిప్పి, వీధి మధ్యలోకి వెళ్ళగానే ఆపు. నాకు కావలసిన ఇల్లు కనబడలేదు.

ఆటో దిగి చూస్తాను” అన్నాను.

నా ఆలోచనల ప్రవాహంలో పడి సరిగ్గా గమనించలేదనుకుంటాను.

ఆటో దిగి డబ్బులు ఇచ్చేసి చుట్టూ చూసాను. ఎక్కడున్నానో నాకేమీ అర్ధం కాలేదు. వీధిలో ఒకసారి ఆ చివర నుండి ఈ చివరకు నడిస్తే ఆ ఇల్లు దొరుకుతుందేమో అనుకుంటూ, అటుగా వెడుతున్న ఒక అతడిని ఆపి

“బాబూ అన్నపూర్ణమ్మగారి ఇల్లు ఎక్కడా?” అడిగాను.

అతడు వింతగా అర్ధం కానట్టు నా ముఖంలోకి చూస్తుంటే

“అదే ఆవిడ భర్త పేరు రామకృష్ణగారు. వాళ్ళకి పిల్లల్లేరు” అంటుంటే

“ ఓహ్ ఆవిడా, అదిగో ఎదురుగా ఉన్న అపార్ట్ మెంట్ లో వాచ్ మేన్ ని అడగండి చూపిస్తాడు” అన్నాడు.

‘అదేమిటి అన్నపూర్ణమ్మగారిల్లు అడిగితే ఇతడు అక్కడ అడగమంటున్నాడు, అంటే నా జ్ఞాపకాల పూలగుత్తి అయిన ఇల్లు లేదా, అపార్ట్ మెంటు ఆ ఇంటిని కూడా మింగేసిందా’ నాలో ఒక సన్నని బాధ మొదలైంది.

మనసు చిక్కబట్టుకుని అతడు చూపిన వైపు చూసాను.

“శివశంకర్ హోమ్స్” అని అపార్ట్ మెంటుపై రాసి ఉంది. అక్కడ పార్కింగ్ ప్లేస్ లోని చిన్న గదిలో ఉన్న వాచ్  మేన్  దగ్గరకు వెళ్ళి అడిగాను.

ఆ అబ్బాయి నా వివరాలడిగి దగ్గరుండి మొదటి అంతస్తుకి తీసుకెళ్ళి చూపించి కిందకు వెళ్ళిపోయాడు.

నేను కాలింగ్ బెల్ నొక్కి  నిలబడ్డాను. ఐదు నిముషాల తరువాత తలుపు నెమ్మదిగా తెరచుకుంది.

అస్ధిపంజరంపై చర్మం కప్పినట్టు ఉన్న ఒక పెద్దావిడ దళసరి కళ్ళజోడులోంచి నన్ను పరీక్షగా చూస్తూ

“ ఎవరూ?, ఎవరు కావాలి?” అన్నారు. ఆవిడ మాట కూడా స్పష్టంగా లేదు.

ఇంతలో ఆవిడ వెనుక నుండి పనమ్మాయి అనుకుంటా వచ్చి

“ ఎవరు కావాలండీ?” అడిగింది.

నేను నా వివరం చెప్పి అన్నపూర్ణమ్మగారి గురించి అడిగాను.

“ ఈవిడేనండీ, ఆవిడకు సరిగ్గా కనబడదు.వినబడదు. ఈ మధ్య బాగా జబ్బు చేసినప్పటి నుండి ఆవిడ ఎవరినీ సరిగ్గా గుర్తుపట్టట్లేదు కూడా” అంది. నాలో సన్నగా మొదలైన బాధ లోపల చిక్కబడుతోంది.

నేను స్ధాణువులా మాటామంతీ లేకుండా  గుమ్మంలో అలా నిలబడిపోయాను.

కళ్ళలోంచి ఎందుకు కన్నీరు చిప్పిల్లుతోందో  తెలీదు. ఆ అమ్మాయి నా కళ్ళలోని నీటిని వింతగా చూస్తూ ఉంది.

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

పద్మావతి రాంభక్త

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Reminiscence!

    చాలా చక్కగా ఉంది.కథాంశం యూనివర్సల్, narration సహజం గా హృద్యం గా ఉంది.

    Especially mention of

    కిటికీలకు వట్టి వేళ్ల చాపలు,కుండ కి తడి క్లాత్,
    డాబా మీద నీళ్లు చల్లటం,శంకరమఠం లో హరికథా కాలక్షేపం, పెరట్లో పూల మొక్కలు..et al .. are really cool.

    Overall, it’s nice. కథనం బావుంది.
    సీక్వెల్ రాయచ్చు with the point of amnesia/ dementia. ..!

    👍🏻

  • Very nice and heart touching… Reminds me of my days in Vizag and incidentally we too lived in that area near Sankarmat and diamond park. I am sure anyone of our age would easily connect to your beautiful narration as the situation is the same irrespective of the city.

  • నడివేసవిలోకి …. సన్నజాజుల సువాసనల తోడుగా… కథ నడక బాగుంది… అభినందనలు..

  • కథ ఆద్యంతం చదివింపజేసేంది..నిర్మాణం,ఎత్తుగడ ,ముగింపు బాగా వచ్చాయి…మొత్తంగా కథ బాగుంది

    • ధన్యవాదాలు పాయల మురళీకృష్ణగారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు