అసలుసిసలు రోల్ మోడల్స్ ఎవరో…!

సోషల్ మీడియా రోల్ మోడెల్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీరు ఇద్దరు వేరు వేరు. ఎలా అంటే ఇద్దరి ఫోకస్ వేరేగా ఉంటుంది. రోల్ మోడెల్స్ తమకు తామే బ్రాండ్ గా ఉంటూ వాళ్ళు అనుసరించే విధానాలని తెలియచేస్తూ ఉంటారు. ఇక ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ తరువాత వేరే బ్రాండులని ప్రమోట్ చేస్తూ ఉంటారు. వీరిద్దరి ప్రభావం కూడా సమాజం మీద చాల ఎక్కువే ఉంటుంది అని కొన్ని స్టడీస్ చూపిస్తున్నాయి. వీరి వలన ఎవరికి వారికి స్వలాభం, ఇంకా సోషల్ మీడియా వ్యాపారులకి తప్ప, ఫాలోవర్లకి ఎక్కువ లాభం జరగటం లేదు
ఇంఫ్లుయెన్సర్ మార్కెటింగ్ హబ్ ప్రకారం 63% మంది కొనుగోలుదార్లు, బ్రాండ్ పంపించే మెసేజ్ కన్నా, ఇన్‌ఫ్లుఎయ్న్సర్ ఇచ్చే మెసేజ్ నే ఎక్కువ నమ్ముతున్నారట. అంటే ‘మా తల నూనే బాగుంది’ అని నూనే తయారు చేసిన వారు చెప్తే నమ్మరు కాని, ‘ఈ నూనే నేను ఇలా వాడాను, నాకు ఇలా ఫలితం వచ్చింది, ఇది ఇలా బాగుంది’ అని ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పినా దాన్ని నమ్ముతున్నారు. అమ్మేవారు ఇంఫ్లుయెన్సర్ల మీద ఖర్చు పెట్టిన ప్రతి ఒక రూపాయికి దాదాపు రూ.6.50 దాక లాభం వస్తున్నదట. పైగా పాత తరం వారి కన్నా కొత్త తరం వారే ఎక్కువగా ఈ పోకడలని అనుసరిస్తున్నారట. మరి ప్రభావం ఇంతగా ఉన్నప్పుడూ, ఒక్కొక్కరి బాధ్యత ఎంత ఉండాలి?
ఈ రెండు భూమికలు సమాజంపైన చాలానే ప్రభావితం చూపిస్తున్నాయి. ముఖ్యంగా అభిప్రాయాలు ఏర్పరచుకోవటంలో, కొన్ని పద్దతులు అలవరచుకోవటంలో, జనాలని సంఘటితం చేయటంలో. పాజిటివ్ ఎంతైతో ఉందో నెగటివ్ కూడా అంతే ఉంటున్నది. కొందరు సోషల్ మీడియా రోల్ మోడల్స్ గా ఉంటూనే చాలా అబ్యూసివ్ గా మాట్లాడుతూనో, లేదా కఠినంగా వ్యవహరిస్తూనో, లేదా ఒక వర్గం పట్ల అభిమానాన్ని చూపిస్తూ ఇంకో వర్గాన్ని అతి చులకన చేయటం వలన చాలా పక్షపాతం మరియు, అయోమయ స్థితి కూడా నెలకొంటున్నది. ఈ అయోమయంలో చాలా మంది సరైన వ్యవహారికాన్ని అలవర్చుకోలేకున్నారు. నా మీడియా నా ఇష్టం, నచ్చకుంటే పో అన్న ధోరణి సామాజిక నిర్లక్ష్యాన్ని చూపిస్తన్నది. ఫాలోవర్ల పట్ల కనీస బాధ్యత లేని ఎంతో కంటెంట్ రోజు వాళ్ళ మీదకి కమ్ముకుంటోంది.   పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్న చందాన అసలు రోల్ మోడెల్ స్ట్రాటెజీ ఏంటో తెలుసుకోకుండా చేతులు కాల్చుకుంటున్నారు. ఈ రోల్ మోడెల్స్ ఎంతవరకు రోల్ మోడెల్స్ అనేది తెలుసుకోలేకపోవటం. వాళ్ళ రోల్ మోడెలిజం వెనక ఉన్నది వాళ్ళ స్వంత అహంభావమో, స్వార్ధమో, మంచితనమో, సమానత్వమో ఫాలోవర్లు తెలుసుకోలేకపోవటం.
ఇక ఇన్‌ఫ్లుయెన్సర్ల విషయానికి వస్తే లైసెన్స్ లేని బిజినెస్ లా ఉంటుంది. ఎవరు ఏది ఎలా అయినా ప్రొమోట్ చేసేయొచ్చులా ఉంది. ముఖ్యంగా హెల్త్ పరమైన చిట్కాలు చెప్పే వారు. ఆర్ధిక విషయాలు ముఖ్యంగా స్టాక్ ఎక్ష్చేంజ్ సలహాలు.  ఈ మధ్య భారతంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఈ ఫిన్సుయెన్సర్లు (ఫైనాన్స్ + ఇన్‌ఫ్లుయెన్సర్ల) మూలంగా చాలా పెరిగిపోయింది అంట. వీళ్ళు ఫాలోవర్లని ఇన్‌ఫ్లుయెన్స్ చేయటంతో వాళ్ళు కూడా కొంటంతో, స్టాక్ డిమాండ్ పెరుగుతుంది. అలా డిమాండ్ పెంచి, అలా పెరగగానే వీళ్ళు అమ్మేసి సొమ్ము చేసుకుంటారు. దానితో వీళ్ళకి, అటు స్టాక్ ఎక్స్చేంజి వారికి, అటు ప్రభుత్వానికి కూడా లాభమే జరుగుతున్నది. నష్టపోయేది ఫాలోవర్స్ మాత్రమే. అందుకని ఇలాంటి చాలా మంది ఫిన్సుయెన్సర్లని సెక్యురిటీస్  అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) అదుపులోకి తీసుకుని వారు స్వాహా చేసినదంతా బయటకి తీయటం జరిగింది. ఇది ఫైనాన్స్ కే కాదు అన్ని వర్గాలకి వర్తిస్తుంది. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసేది చాలా మటుకు స్వలాభం కోసమే అని ఫాలోవర్లు తెలుసుకోలకపోవటం.
మొత్తంమీద, సమాజంపై సోషల్ మీడియా రోల్ మోడల్స్ ప్రభావం వారు ప్రోత్సహించే విలువలు, ప్రవర్తనలు,  సందేశాలపై ఆధారపడి ఉంటుంది. నా గోడ నా ఇష్టం, నా పోస్టు నా ఇష్టం అన్నట్లుగా కాకుండా, వీరు ప్రచారం చేసే సందేశాలను పలురకాల ఫాలోవర్లని , వారి మనస్తత్వాలని, వాటిపై పడే ప్రభావాన్ని కాస్త అంచనా వేసి సందేశాలను విమర్శనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా పోస్ట్ చేయటం అవసరం.
మంచి కన్నా చెడు ఎక్కువగా పాపులారిటీని తెచ్చుకుంటోంది కాబట్టి, ఈ మార్గాన్ని ఎన్నుకుని చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు తయారైపోతున్నారు.  సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా సానుకూల రోల్ మోడల్‌లను ప్రోత్సహించడం ద్వారానో,  హానికరమైన  అనైతిక ప్రవర్తనను నిరుత్సాహపరచడం ద్వారానో  కూడా బాధ్యత వహించవచ్చు. ఈ పద్దతి కొంచెంగా కొనసాగుతున్నా, ఫాలోవర్లదే అందరికన్నా అధిక బాధ్యత. తమకి నచ్చని వారిని ఫాలో అవుతూ పదే పదే వారిని దూషిస్తూ కామెంట్లు రాయటం వీరి చేస్తున్న అతి హీనమైన పని. ఏది ఫాలో అవాలి, ఎందుకు ఫాలో అవాలి అన్నది కూడా తెలుసుకోవటం ముఖ్యం. ఒకవేళ తమకు నచ్చనిది ఏదైనా ఉంటే అది అంతటితో మూసేయకుండా ఇంకో నలుగురికి తెచ్చి పంచటం వంటి చర్యలు ఇంకా సమాచారాన్ని వేగవంతం చేస్తాయి.  ఈ మొత్తం చత్రంలో చాలామంది భాగస్వాములున్నారు. ఎవరి సమన్వయం పాటించకపోతే దుష్ఫలితాలే ఎక్కువ.
*

విజయ నాదెళ్ళ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు