స్టేజి 

ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆర్టీసీ బస్సు రంగు మారుతుంది. అలా పెయింట్ మీద మరో పెయింట్ మరకలతో ఓ పల్లె వెలుగు బస్సు కొమ్మలకు విరగకాసిన పనస పండ్లలా నిండుగా వచ్చి ఆగింది. అప్పటికీ ఉక్కపోతకు చెమటలు కక్కుతున్న నలుగురు ప్యాసింజర్లు జగిత్యాల దగ్గర బస్సెక్కారు. లోపల నీట్ గా ఖరీదైన డ్రెస్ లో ఉన్నాయన దుమ్ముకి కర్చీఫ్ అడ్డంపెట్టుకుని విసుక్కుంటున్నాడు. వెనక సీట్ లో కూర్చున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ “డర్టీ జర్నీ. ఇంత దారుణమైన రోడ్లతో ఈ దేశం…” అని బయటికి అంటూ ఏదో గులుక్కున్నాడు. ఓటేసేటప్పుడు ఏమైందీ ఆలోచన ? పక్కకే కూర్చున్న ఓ ఊరి సర్పంచ్ అలాగే గులుక్కున్నాడు. వారిద్దరి వాదనలు మొదలెట్టుకున్నారు.

పాలు అమ్మే ఒకావిడ డబ్బాల్లున్న గంపతో ఎక్కగానే, పచ్చిపచ్చి వాసన బస్సంతా పాకింది. కండక్టర్ టికెట్ మిషిన్ తో ఎక్కగానే ఆడవాళ్లంతా తమ ఆధార్ కార్డులు రెఢీ పెట్టుకొని ఉన్నారు. బస్సు వర్షాకాలంలో పడ్డ గుంతల్లోంచి…చంద్రమండలం మీదకి పంపిన రోబో లాగా పడుతూ లేస్తూ పరుగులాంటి నడకతో వెళుతుంది.

కూర్చున్న వాళ్లు గాక…నిలుచున్న వాళ్ళు ఒకరి మీద ఒకరు పడి పోతూ చేతులెత్తి రాడ్లు పట్టుకున్న వారి చెమట కంపుని ఊపిరి బిగపట్టుకొని ఆస్వాదిస్తున్నారు.

“ఛ…ఒక్కొక్కడు దున్నపోతు లాగున్నారు, అసలు జరగడం లేదు,” సీటు దొరక్క నిల్చున్న ఒక స్లీవ్లెస్ పాప బయటకనేసింది.

“బర్రెలొచ్చినయ్ జరుగుండ్రి” అని కూసాడు ఎవడో.

పంటి కింద పెదవిని బిగపెట్టుకొనున్నా కూడా నవ్వు ఆపుకోలేక పోయారు కొందరు. సెంట్ కొట్టుకున్న స్లీవ్లెస్ కి ఒళ్లు మండింది.

ఇంతలో ఒకాయన బస్సు వెనకాల పరిగెడుతూ వస్తూ స్టాప్…స్టాప్…హోల్డాన్ అని బస్సు వీపు మీద గట్టిగా చరుస్తున్నాడు. కొంత మందికి వినిపించినా బస్సు ఆపే ప్రయత్నం చేయలేదు. అతను మాత్రం పరిగెడ్తూ ఫాలో అవుతూనే ఉన్నాడు.

గొప్పగా జరిగే పెళ్లిళ్లకు మాత్రమే ఫోటో షూట్ చేసే ఓ తెల్ల గడ్డపు ఫోటోగ్రాఫర్ మాటిమాటికి చేతివాచీ చూసుకుంటున్నాడు.

‘అవతల మినిస్టర్ గారి ఇంట్లో బర్త్ డే  ఫోటోలు తీయాలి. లేకపోతే నాకు కేకు తినిపిస్తారు‘, అని మనసులో అనుకున్నాడు.

“నాకు ఏసీ లేకపోతే చచ్చిపోతున్నట్టుగా ఉంటుంది,” పక్కావిడతో అంది ఒంటి పిర్ర మీద కూర్చున్న ఓ పట్టు చీరావిడ.

“ఓయ్…బుద్ధుందా. నా మీద పడుతున్నావ్. సరిగ్గా నిల్చో లేవా,” అరిచింది ఇంజనీరింగ్ చదివే అమ్మాయి నిల్చున్న సర్పంచ్ మీదికి.

హోల్డాన్…అతని మాట చిన్నగా వినబడుతుంది. పరిగెత్త లేక అలిసిపోయి అరుస్తున్నాడు.

“అయ్యో పాపం బస్సాపండి” అన్నారెవరో.

కండక్టర్ కిటికీలోంచి చేయి బయటకు పెట్టి బస్సును కొడితే, డ్రైవర్ కి అర్థమై సడన్ బ్రేక్ వేసాడు.

కొనపిర్ర సీటావిడ దబ్బున కిందపడింది.

సర్పంచ్ ఎగిరి ముందు సీట్లో పడితే బంగారు తొడుగు పన్ను బయటకు వచ్చింది. అతని బరువుకు చదువుకుంటూ కూర్చున్న ఒక స్టూడెంట్ ఎగ్జామ్ ప్యాడ్ విరిగిపోయింది.

“జీవితంలో బస్సెక్కి ఎరుగను. కాలు బయట పెడితే కారులో తప్ప,” సెల్ఫోన్లో గారాలు పోతున్నా ఓ అమ్మాయి, ఆ కుదుపుతో సెల్ ఫోన్ కిందపడి రెండు ముక్కలయింది.

బస్సు ఆగినా వెంటనే ఆ వ్యక్తి ఆదుర్దగా బస్సెక్కి…

“ఈ బస్సు ఏ ఊరికి వెళ్తుంది ?,” అడిగాడు.

దాంతో చీమలపుట్టలో బుసకొడుతున్నట్టుగా అయ్యాడు కండెక్టర్ నాగరాజు. చిరాకుతో, “ఇది గంగలకు పోయి గోదాట్ల తేలుతోంది,” అన్నాడు.

“అవునా…గోదారికి ఓ టికెట్టివ్వండి,” అడిగాడు అమాయకంగా.

ఆ మాటకి కండక్టర్ చల్లబడి నవ్వుకున్నాడు.

బస్సు మళ్ళీ కదిలింది.

కొత్తగా పెళ్లైన జంటలో మొగుడు బస్సు మీద ఓ జోక్ చెప్పనా అన్నాడు. ఆవిడ అతను జోక్ చెప్పకముందే కిలకిలా నవ్వుతుంది.

అతను తన ముత్తాతల కాలం నాటి జోక్ మొదలెట్టాడు,”ఒకడు ఇంకొకడికి పదివేల రూపాయలు అప్పు ఇచ్చాడు. చాలా సంవత్సరాల నుంచి ఆ అప్పు తీర్చట్లేదు. అడుగుదామన్న ఆ ఇంకో వ్యక్తి కనపడట్లేదు. అనుకోకుండా ఓ రోజు బస్సులో కలిసి ప్రయాణం చేస్తున్నారు.

“నా పదివేలు ఎప్పుడు ఇస్తావ్” అని అతను

“ఇప్పుడు నా దగ్గర లేవు” అని ఇంకో అతను.

“కానీ చాలా ఏళ్లు అవుతోంది. వడ్డీ ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం అసలు ఇవ్వు”

“ఇప్పుడు లేవన్ననా” గద్రాయించాడు. అప్పుడే బస్సు లోకి నలుగురు గజదొంగలెక్కారు.

అది చూసి “అప్పిచ్చిన వాడా ఇదిగో నీ పదివేలు” అని ఇచ్చాడతను.

“నాకొద్దు నీ దగ్గరే ఉంచుకో” అన్నాడు అప్పిచ్చిన వాడు.,” ఆమె కిలకిల నవ్వుతూనే ఉంది.

కొంతమంది వినలేక చెవులకు హెడ్సెట్ పెట్టుకున్నారు.

మొగుడు మాత్రం ఆపట్లేదు,

“అది చూసిన గజదొంగ వాళ్ళ దగ్గరకు వచ్చి, విషయం తెలుసుకుని, నీ దగ్గరి ఐదువేలు అతనికిచ్చేయి. ఇప్పుడు అతని దగ్గరున్న ఐదువేలు, నీ దగ్గరున్న ఐదువేలు కలిపి నాకిచ్చేయండి అన్నాడు గజదొంగ,” అంటూ ఆమె తో పాటు అతనూ గట్టిగట్టిగా నవ్వాడు.

“యే..ఛీ. ఆపు…నువ్వు నీ దిల్ కి బాత్ జోకులు. పదివేల కోట్ల అప్పు ఎగ్గొట్టడం జోక్ అయిపోయింది మీకు,” ఫోన్లో బూతులు తిట్టాడు బ్యాంక్లో పని చేసే వ్యక్తి.

ఇన్డైరెక్ట్ గా అన్నా కూడా, ఆ ఆలుమొగుల్లు అది ఆర్టీసీ బస్సనీ…

చుట్టూ జనం ఉన్నారని మర్చిపోయారు.

బస్సులోనే పడకగదిని చూపించడం అందరికీ ఎబ్బెట్టుగా ఇబ్బందిగా ఉంది.

వెనక సీట్లల్లో ఉన్న ఒకతను ఫోన్లో బిగ్గరగా అరుస్తున్నాడు.

“నేను…మార్కెట్ కమిటీ చైర్మన్ ని మాట్లాడుతున్నాను. డిపో మేనేజర్ గారేనా, సాబ్ మీ వాళ్లు మరి ఘోరంగా తయారయ్యారు. మేము ఎక్కిన రాజధాని బస్సు టైర్ పంచర్ అయితే డొక్కు ఆర్టీసీ బస్సులో ఎక్కించాడు మీ డ్రైవర్! ఈ బస్సులో హైదరాబాద్ చేరేసరికి ఆరు నెలలు పడుతుందేమో,” కాస్త కోపంగా.

అవునవును అన్నట్టుగా అతనితోపాటు ఎక్కిన మిగతా రాజధాని వాళ్లు.

“వాడెవడో కారును ఓవర్ టేక్ చేయబోతుంటే జరిగిన తతంగం ఇదంతా. కాస్త నెక్స్ట్ స్టాప్ లోనైనా వేరే బస్సు చూడండి. అసలే లేడీస్ కు బస్సు ప్రయాణం ఫ్రీ ఉన్న దాంట్లో ఎక్కించి చచ్చారు, పక్క జిల్లాలో ఉన్న తల్లిగారింటికి కూరల కోసం పచ్చడ్ల కోసం కూడా ఎక్కి కూర్చున్నారు. సిటీలో తప్పా నిజానికి ఎంత మందికి  ఉపయోగం,” విసుగ్గా ఫోన్ కట్ చేసాడు.

“ఇంట్లో ఆడాళ్లను ఏనాడు కనీసం బయటికీ తీస్కపోయిన మొఖం కాదు, గానీ ఇప్పుడు ప్రభుత్వం ఫ్రీ ఇస్తుంటే ఎందుకో ఇంత మంట. ఫ్రీ ఇస్తున్నారని ఓ తిరుగుతూనే ఉంటామా ? అంత ఖాళీ గా ఉన్నామా ?? లేక సిటీలో మాత్రమే ఆడాళ్లు పనికి పోతారు అనుకుంటున్నారా ? అయినా ఎంత సేపు ఆడాళ్లకి ఇచ్చిన పథకాలపైనే ఏడిసస్తారెందుకో!” బస్సులో పాలమ్మే ముసలమ్మ గుల్గుంది.

అప్పటి వరకు ఒళ్ళో పడుకొనున్న మూడు నెలల పిల్లాడు ఒక్కసారిగా గుక్కపెట్టి ఏడ్వడం మొదలెట్టాడు. పంజాబీ డ్రెస్ వేసుకున్న తల్లి ఎంత ఓదార్చిన పిల్లాడి ఏడ్పు మానటం లేదు.

బస్సు ఒక స్టేజి దగ్గర ఆగింది.

ఒక్కతే బిచ్చగత్తె ఎక్కింది.

నిండు గర్భిణిలా ఉంది, ఒక చంకలో రెండేళ్ల పాప, మరోచేతిలో ఓ ముల్లె. ఆమె ఎక్కగానే అదోరకం వెగటు వాసన… చిరిగిన చీర. చంకలోన్న పాపకి నిక్కర్ తప్ప ఏమీ లేదు.

సాఫ్ట్వేర్ అబ్బాయి ముక్కు మూసుకున్నాడు.

ఆమె నిల్చుంది…

కనీసం కింద కూర్చోడానికి కూడా బస్సులో స్థలం లేదు. ఎవరైనా లేచి సీటు ఇస్తారేమో అని చుట్టూ చూసింది. ఇంత ఇరుకు బస్సులో అడుక్కోడానికి వచ్చిందేమొనని ఆమెను గమనించి మొఖాలు తిప్పుకున్నారు.

బస్సు స్టార్ట్ అయింది…

ఆ జర్క్ కి సడన్గా రాడ్డుని పట్టుకుంది. కడుపులో కలుక్కుమంది. నొప్పికి నోరు తెరిచింది కానీ అరవ లేక ఆపుకుంది.

ఎత్తయిన పొట్టతో ఆమెకు నిల్చోవడం కష్టంగా ఉంది. అది గమనించట్లేదు కొందరు, గమనించిన వాళ్లు ఏమి తెలియనట్లు ఉన్నారు. కానీ రాడ్డు పట్టుకున్నప్పుడు చిరిగిపోయిన రవికలోంచి ఎండిపోయినట్టుగా ఉన్న ఒక స్తన్యం బయటకు వచ్చింది.

ఆ దృశ్యం ఫోటోగ్రాఫర్ కంటపడింది. కెమెరాకి ఫ్లాష్ లేకుండానే క్లిక్ మనిపించాడు. చిన్నగా, విజయగర్వంతో నవ్వుకున్నాడు.

“ఎస్…దీనమ్మ ఎనిమిదేళ్లుగా రాయల్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో పాల్గొంటున్నాను. ఈ ఫోటో తో 5 లక్షల అవార్డు గోల్డ్ మెడల్ తన్నుకుంటూ వస్తాయి,” అనుకున్నాడు.

అవతల పక్కన ఆమెను ఒక్కసారిగా చూపులతోనే తడిమాడు షార్ట్ ఫిలిం డైరెక్టర్. అతను ఎదురుచూస్తున్న గెటప్ ఆ బిచ్చగత్తె లో చూసి “వావ్” అనుకున్నాడు. తను తీయబోయే సినిమా ‘బానిస‘ కి హీరోయిన్ పాత్ర ఇలాగే చిత్రీకరించాలనుకున్నాడు.

ఇంకో సీట్లో పేదరికం మీద కథ రాయడానికి ఈమనే ప్రేరణ తీసుకుంటున్నాడు అక్కడున్న ఒక రచయిత. సరిగ్గా కుదురుతే కథ లేకపోతే చిన్నగా చేసి ఓ కవితనైనా రాయాలి అనుకుంటున్నాడు అక్షరాలను మెదట్లోనే పేరుస్తూ. ‘రాజధాని బస్సులో ఉన్నంత సేపు ఏం రాయడానికి తోచలేదు. అది పంక్చర్ అవడం బెటరైంది, ఎక్కించిన పల్లె వెలుగు ఇంత మంది లేడీస్ తో ప్రయాణం ఇలాంటి సీన్స్ కనబడితే ఆ మజానే వేరు’ లోలోపల మురిసిపోయాడు.

మొన్నటి నుండి మథనపడ్తూ, “అబ్బా…ఇదేదో బాగుందే,” పైకి అనలేదు కానీ కూర్చున్న ఓ ఫ్యాషన్ డిజైనర్ ఇన్నర్ ఫీలింగ్. ఇటీవలే తను అతుకుల బొంతలా తయారు చేసిన జాకెట్ కి బిచ్చగత్తె వేసుకున్న చినిగిన చీరలోని డిజైనే వేసి పంపాలనుకుంటుంది. ‘లేడీస్ కి ఫ్రీ కాబట్టి, రోజుకో బస్సు ఎక్కినా వంద డిజైన్లు దొరకబట్టొచ్చు కదా’ మనసులో నవ్వుకుంటూనే, “డిజైన్ దొరికింది కాబట్టి తొందరగా నా స్టాప్ వస్తే బాగుండు.” అనుకుంది.

బస్సు స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఎగిరిపడ్తున్నప్పుడు కడుపులో నొప్పి పుట్టి, పొట్ట బరువుకి కాళ్ళు లాగుతున్నాయి. చంకలో ఉన్న పాప పాల కోసం ఒక్కసారిగా ఏడ్వడం మొదలెట్టింది. కొంత మందికి ఆ ఏడుపు చిరాకు కల్గించింది.

అప్పటికే మూడు నెలల బాబు ఏడుపు కూడా తోడై చెవులు మూసుకున్నారంతా.

కాస్త నెమ్మదిగా వంగి ముల్లెను కిందపడేసింది. దానిపై కూర్చోవాలి అనుకుంది కానీ నిండైన కడుపుతో ఇబ్బంది పడుతుంది. చినిగిన రవిక లోంచి నిల్చునే పాలిచ్చింది. ఇదంతా సీట్లో కూర్చున్న ఒక అబ్సర్డ్ ఆర్టిస్ట్ వంగి వంగి మరీ ఆమె భంగిమలు రకరకాలుగా అబ్జర్వ్ చేస్తూ కళ్ళతోనే ముద్రించుకున్నాడు.

“ఇవి పెయింటింగ్స్ గా వేసి ఫ్రేమ్ గా కట్టి బాంబే హోటల్స్ లో ఎగ్జిబిషన్ గా పెడితే, పాతిక లక్షలు ఎటూ పోవు,” అనుకున్నాడు.

ఇలా ఎవరికి వారు మనసులో ఆమె శరీరాన్ని లాభాపేక్షంతో చూస్తూ లక్షలు సంపాదించాలనే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఆమెకు తెలీదు ఇంత జరుగుతుంది అని, తెలిసినా కూడా అప్పుడు ఆమె అడిగేది కూర్చోడానికి ఓ సీటే.! అక్కడ ఎవరిని అడుగుదామనుకున్నా, అన్ని చదువుకున్న ముఖాల్లాగే ఉన్నాయి, అవి చూసే భయం కలిగింది ఆమెకి.!

ఒంటి పిర్ర మీద కూర్చున్నామే మాస్క్ ఉన్నా కూడా చీర కొంగుతో ముక్కు కప్పుకుంది.

కొత్తగా పెళ్లయిన అబ్బాయి… బిచ్చగత్తె పరిస్థితి చూసి లేచి నిల్చుని సీటు ఇద్దామనుకున్నాడు. కాని అతని భార్య కళ్ళతోనే హెచ్చరించింది. అతని చెయ్యి పట్టుకుని భుజం మీద తల ఆనిచ్చి నిద్ర నటిస్తోంది.

స్లీవ్ లెస్ పాప…ఆమె తనకు దగ్గరగా నిల్చునందుకు అసహ్యంగా చూస్తూ వెనక్కి తిరిగింది. ఎదురుగా పన్ను విరిగిన సర్పంచ్ పళ్లికిలించాడు.

సాఫ్ట్వేర్ అతను,”ఇలాంటి జర్నీ జీవితంలో మళ్ళీ చేయకూడదు. అసలిక్కడ ఉండకూడదు. కొత్తగా వచ్చిన యూ.ఎస్. హెల్పింగ్ హాండ్స్ ప్రాజెక్ట్ రాగానే, ఆన్ సైట్ చెక్కెయ్యాలి,” గులుక్కున్నాడు.

‘స్త్రీలకు‘ అని రాసి ఉన్న సీట్లలో ఎక్కువగా ఆడవాళ్లే ఉన్న అక్కడక్కడా సీట్ దొరకిడం లో కూడా అదృష్టం ఉండాలనే ముఖ గర్వంతో మగవాళ్ళు కూడా ఉన్నారు.

మినిస్టర్ కాన్వాయ్ వెళ్తుంటే కాసేపు బస్సు ఆగింది. మళ్ళీ కదిలింది. పల్లె వెలుగు బస్సులో ఎంపీ ఎమ్మెల్యేలకు రిజర్వ్ చేయబడినది సీట్లలో ఇద్దరు గొర్రె పిల్లలతో కూర్చున్నారు.

బస్ స్లో గా వెళ్తుంది. గాలి మాత్రం తాకనట్టుగా ఉక్కపోత, మూడు నెలల పిల్లాడు ప్రతి పది నిమిషాలకొకసారి గుక్కపెట్టి ఏడుస్తున్నాడు, తోడుగా బిచ్చగత్తె వెగటు వాసన. అందర్లో అసహనం ఎక్కువైంది. వరుసగా ఉన్న పెద్ద స్పీడ్ బ్రేకర్లకి డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేసాడు. బిచ్చగత్తే పట్టుకున్న రాడ్ పట్టుతప్పి…దబ్బున తూలిపడబోయింది. అప్పటి వరకు మూడు నెలల పసిగుడ్డు ఏడుస్తుంటే పంజాబీ డ్రెస్సులో పాలివ్వడానికి ఇబ్బందిగా ఉందని తల్లి ఊరుకుంటే… బిచ్చగత్తే తూలి వాళ్ల మీద పడబోయి ఆగింది. అలా వంగినప్పుడు ఆమె స్తన్యపుమొన అనుకోకుండా ఆ పిల్లాడు నోటి దగ్గరికి రాగానే…పాలు పడ్డాయి…ఏడ్పు ఆపాడు.! భయంగా వెంటనే రవిక సర్దుకొని తన బిడ్డను గట్టిన పట్టుకుంది బిచ్చగత్తే. పంజాబీ డ్రెసావిడ కోపడుతుందేమొనని అనుకుంటే, పిల్లాడు పెదాలు చప్పరిస్తూ ఏడ్పాపడంతో రిలాక్స్ గా ఫీల్ అయ్యింది. మిగితా వాళ్లు కూడా అతను ఏడ్పాపడం ఒక రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. కానీ బస్సులో కొందరు ఆ దృశ్యం చూసి…వికారంగా మొహం పెట్టారు. కొందరు లొట్టలు వేస్తూ చూసారు.!

స్పీడ్ బ్రేకర్ల వల్ల మళ్లీ కడుపు లో నొప్పి పుట్టింది.

బిచ్చగత్తె వెంటనే బస్సాపండి అన్నది కాస్త నిస్సత్తువగానే. చుట్టూ ఉన్నవాళ్ళంత గట్టిగా అరిచారు బస్సాపమని.

బస్సాగలేదు.

మరో సారి బస్సాపమంది గట్టిగానే.

కండక్టర్ చూసి,

“నీ స్టేజి ఇంకా రాలేదమ్మా,” అన్నాడు.

అయినా సరే ఆపమంది.

స్టేజి రాకముందు ఎందుకని కండక్టర్ అడిగేలోపే హెడ్ సెట్ తీసేసి,

“దిగనివ్వండి. మీకేం ప్రాబ్లమ్ ?” కండక్టర్ వైపు సీరియస్ అయ్యింది కారు ఖరాబై ఎక్కినావిడ ముక్కు మూసుకుంటూ.

కండక్టరు కిటికీలోంచి బస్సును కొట్టగానే డ్రైవర్ కాసేపటికీ పక్కకు ఆపాడు. చంకలో పాపని గట్టిగా పట్టుకుంది. బస్సు బ్రేక్లకి కిందపడున్న ముల్లె కాళ్ల మధ్యలోంచి ముందుకు జరిగింది. ఆమె అందుకోలేక పోతుంది. సాఫ్ట్వేరతను కాలుతో ముల్లెను తన్నినట్టు జరిపాడు ఆమె వైపు, తర్వాత బూట్లను పేపర్ తో తూడ్చుకున్నాడు. ఆమె ముల్లెను మెల్లిగా అందుకోబోతుంటే చక్ మని ఫ్లాష్ వచ్చింది. అందరూ వెనక్కి చూసారు, ఫోటోగ్రాఫర్ దిక్కులు చూసాడు.

బిచ్చగత్తె చంకలో పాపను, ముల్లెను పట్టుకొని కిందికి దిగింది. వెనక నుండి మార్కెట్ కమిటీ ఛైర్మన్ మళ్లీ బస్సెందుకు ఆపారంటూ అరుస్తున్నాడు.

బస్సు ఫ్రీ ఇచ్చి రోడ్ల గురించి ఆలోచించని ప్రభుత్వాల మీద ఆమెకు కోపం లేదు, మానవత్వంని ఆది మానవుని స్టేజిలోనే వదిలేసి బస్సులో ‘ముందుకు పోతున్న’ మునుషుల మీదనే కోపం వచ్చిన కూడా ఏం చేయలేదు. కన్నీళ్లు రాల్చుకుంటూ ఆపిన స్టేజ్ దగ్గర దిగిపోయింది.

“పాపం…కిందపడబోయినప్పుడు పిండం జారిపడిందా…” అని మనసులో అనుకుంటూ కిటికీలోంచి ఆమెను చూసాడు కండక్టర్.

ఆమె చిరుగుల చీర వెనక…సన్నటి రక్తధారలు!

Email:  kvmanpreetam@gmail.com

చిత్రం: స్వాతి పంతుల

మన్ ప్రీతం

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ చాలా బాగా రాసారండి. ఇప్పుడున్న పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చిత్రించారు. నరేషన్, పాత్రలు, చెప్పిన విధానం చాలా బాగుంది.Congratulations.

  • ఇంకాస్త పెద్దగా ఉంటె ఇంకా బాగుండు అన్పించింది. కథ చివర్లో గుండె చివుక్కుమంది. గ్రేట్ రైటింగ్.

  • Reader ni kuda bus lo kurchopettaaru sir. Direct ga Indirect ga konni cheppina vidhaanam baagundi.

    ‘బస్సు ఫ్రీ ఇచ్చి రోడ్ల గురించి ఆలోచించని ప్రభుత్వాల మీద ఆమెకు కోపం లేదు, మానవత్వంని ఆది మానవుని స్టేజిలోనే వదిలేసి బస్సులో ‘ముందుకు పోతున్న’ మునుషుల మీదనే కోపం” correct ga chepparu sir.

  • Very realistic and heart touching. Difference in artistic nature of an artist and human nature of same artist is explained in many versatile ways (sometimes artists & human nature both collides even, somehow that becomes an another story).

    I really liked characters that got established by story cotinuation itself and none of the characters have a name.! Good attempt and master class story on human nature in current days.

  • ‘ ఆమె చిరుగుల చీర వెనక…సన్నటి రక్తధారలు!’
    చదివిన తర్వాత కండ్లల్లో కన్నీటి ధారలు అప్రయత్నంగా రాసాగాయి. Very well written brother.

  • కథ బాగుందండి. కొన్ని పచ్చి నిజాలు కచ్చిగా చెప్పారు. మనిషిలోని సెన్సిటివిటీ కంటే నీచత్వం, స్వార్థం మీద ఎక్కువ ఫోకస్ చేసారు అన్పించింది. మీ నరేషన్ ఈ సారి కొత్తగా అన్పించింది. Keep writing.

  • కథ చాలా బాగుంది,ప్రస్తుత పరిస్థితిని కళ్లముందు చూపించారు. పాత్రల వర్ణన ,వారి ఆలోచన విధానము,వ్యాపార ఆలోచన,వ్యక్తిని చూసే దృష్టికోణం వాస్తవంగా వుంది.ముగింపు గుండెను తడిచేసింది. మన్ ప్రీతం కు అభినందనలు.

  • జుగుప్సాకరమైన సన్నివేషాలు, ఒళ్లు గుగుర్పాటు పొడిచేటట్టువంటి ఓ భయం కలిగింది. ఏం కథ ఇది…వాహ్! రాసినందుకు అభినందనలు 🎉👏

  • సర్ కథ చాలా అద్భుతంగా ఉంది. మనిషిలో కరువైన మానవత్వాన్ని కళ్ళకు కట్టినట్టు రాసి చూపించారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు