యానం

రచయిత: జయమోహన్

 

“ఇది ఇప్పట్లో కదిలేలా లేదు” అని గూగుల్ చూస్తూ చెప్పాడు రామ్.

లక్ష్మీ స్టీరింగ్ మీద వేళ్ళతో తాళం వేస్తోంది. ఆమె కంగారుగానో చిరాకుగానో ఉన్నప్పుడు ఆమె వేళ్ళకు ఆ తాళం అసంకల్పిత చర్యలాగా మారిపోతుంది. మామూలుగానే మలయాళీలందరికీ  వేళ్ళలోనే  తాళం ఉంటుంది. చెండెమద్దెల, తిమిలడోలు, దాయంబక, ఇడక్కా అంటూ వాళ్ళ సంస్కృతిలో  తాళానికి సంబంధించిన వాయిద్యాలెక్కువ.

రోడ్డు ఆగిపోయిన కార్లతో నిండిపోయుంది. వాళ్ళ కారుకు  రెండు వైపులా కార్లు. కుడి వైపు ఉన్న కార్లో గడ్డం కింద కప్పలాగా చుబుకం ఉబ్బిపోయి ఉన్న యాభై ఏ‌ళ్ళ తెల్లవాడు డ్రైవర్ సీట్లో కూర్చుని, పక్కనే  కూర్చోని ఉన్న అదే రకం గడ్డం, మెడ ఉన్న లావుపాటి ఆమెతో నిర్విరామంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎడమ వైపున్న కారు కొంచం ముందుకు ఆగుంది. అందులో ఒక నల్లవాడున్నాడని వాడి తల మీదున్న జుట్టు చెప్తోంది.

రామ్ సహనం కోల్పోయి కాళ్ళు ముందుకు చాచి చేతులు పైకెత్తి కొంచం నీలిగి ఒ‌ళ్ళు విరుచుకున్నాడు. వెనుక సీట్లో ముకుంద్, శ్రుతి ఇద్దరు బ్లాంకెట్ కప్పుకుని నిద్రపోతున్నారు. సన్నగా వాళ్ళ గురక వినపడుతోంది.

“ఏం చూపిస్తోంది” అని అడిగింది లక్ష్మి.

“ఇప్పుడేగా చూశాను… లాక్డ్… అసలు కదలటమే లేదు…”

“ఏం చేద్దాం?”
“ఏం చేయలేము… కదిలే వీల్లేదు. మనమే కాదు మనలా వేలాదిమంది రోడ్డు మీద ఇలా చిక్కుకుని ఉన్నారు అనుకుని కొంత సాంత్వన పొందాల్సిందే…”

“దాని వల్ల ఏమౌతుంది?” అని పెదవి విరిచింది లక్ష్మి.

“ఇంతమంది ఇలా నిలబడిపోయున్నారంటే  ఏదో ఒకటి చేస్తారు”

“ఎవరు?”

అతను ఏమీ చెప్పలేదు.

“వెయ్యిమంది వెళ్ళాల్సిన రోడ్డు… ఉన్నట్టుం‍డి లక్షమంది రోడ్డుమీదకెక్కితే ఎవరేం చెయ్యగలరని?” అని అంది.

“ఏదో ఒకటి చెయ్యాలిగా?”

“యాక్సిడెంట్ అయితే హెలికాప్టర్‍లో వచ్చి ఎయిర్ లిఫ్ట్ చేసేస్తారు… ఇది అలాంటిదని కూడా అనిపించడంలేదు.”

కార్లు కొద్దిగా కదిలాయి. ఇదో  చిన్న ఊరట.  స్తబ్ధుగా ఉన్న మనసు, కాలం అన్నీ చైతన్యానికి నోచుకున్నట్టు.

ఆ కదలడం ఎక్కువ సేపు కొనసాగలేదు. మళ్ళీ స్తబ్ధత. “ప్చ్” అని చికాకు పడింది లక్ష్మి. వేళ్ళు మళ్ళీ తాళం వేశాయి. ముందున్న జుట్టును తీసి వెనక్కి వేసుకుని సర్దుకుంది.

రామ్ మళ్ళీ నీలిగి ఒళ్ళు కదిలించాడు “మూడు గంటలు రోడ్డుమీద కదలకుండా ఉన్నాము” అని అన్నాడు.

“ఈ రోడ్డుమీద నెలకొక యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది” అంది లక్ష్మి. “ఎయిట్ లేన్ రోడ్డు… ఎక్కడ చూసినా (ఫ్రైయోవర్లు…) ఫ్లైఓవర్లు… అయినా ఎందుకు బ్లాక్ అవుతుందో”

“కావాలనే రోడ్డును బ్లాక్ చేస్తుంటారేమో… కొన్ని సార్లు పిచ్చెక్కిపోతుంది… అప్పుడు యాక్సిలేటర్ మీద గట్టిగా నొక్కి కార్లను గుద్దుకుంటూ కార్లమీద ఎక్కి తొక్కించుకుంటూ వెళ్ళిపోవాలనేంత కోపం వస్తుంది” అని అన్నాడు రామ్‌.

ఆమె ఆశ్చర్యపోవడమో, అతనికేసి తిరిగి చూడటమో చెయ్యలేదు. తనముందు బారులు తీరి ఆగిపోయున్న కార్లను మౌనంగా చూస్తూ ఉంది.

“వంద సార్లయినా యాక్సిలేటర్ నొక్కుంటాను. ఒక సెకండు ఏదో అలా వచ్చి వెళ్ళిపోతుంది… మనసు ఒక మెషిన్‍-హ్యాండ్‍లాగా మారిపోయి కాలును ఆపేస్తుంది”

ఆమె అతనికేసి తిరిగి చూడలేదు.

“పిల్లలు కూడా గుర్తుకు రారు అలాంటప్పుడు. నా గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచనే రాదు… ఆ క్షణంలో జీవించాలన్న ఆతృత మాత్రమే… అదే మౌలికమైనది అనుకుంటాను. అన్ని ప్రాణులకూ అదేగా మూలాధారం?”

కార్ చిన్న శబ్దంతో ముందుకు కదిలింది. వెనక సీట్లో శ్రుతి నిద్రలో మెల్లగా మూలుగుతూ చిన్నగా కదిలి పడుకుంది.

“అయితే ఎందుకు ఆ సూసైడల్ ఆలోచన వస్తుంది? అప్పుడు అనుకుంటాను… సమస్యలంటూ ఏమీ లేవు కదా. అదేనేమో సమస్య. సమస్యలే లేకపోతే జీవితం విసుగ్గా మారిపోతుంది. ఆ విసుగే పెద్ద సమస్యగా బుర్రను తొలిచేస్తుంది. అనారోగ్యాల్లాంటి ఇబ్బందులో, ఆర్థిక సమస్యలో ఏదో ఒకటి ఉంటే అదే మనుగడని నింపేస్తుంది. వాటితో ఈదులాడే ఆటలో మునిగినప్పుడు బాధపడుతూ, తేలినప్పుడు రిలీఫ్ ఫీల్ అవుతూ జీవితం గడిచిపోతుంది” అని అన్నాడు.

ఎందుకు ఇలాంటివి చర్చిస్తాము అని అనిపించింది. అయితే ఇలాంటివి చర్చించడంవల్లే మనుగడ సాగిస్తున్నాం అన్న భావన కలుగుతుంది. “విసుగు మానసిక రోగంగా మారుతుందా అంటే మారుతుంది. ఇప్పుడు కార్లు నూరు మైళ్ళ స్పీడుకు చేరుకున్నాక వాటికున్న అతి పెద్ద సమస్య గాలి వల్ల కలిగే అడ్డే. గాలి ఒక గోడలా ఘనపదార్థంలా అయిపోతుంది. కారు దాన్ని ఛేదింౘుకుంటూ ముందుకు సాగాలి”

లక్ష్మి గియర్ రిలీజ్ చేసుకుని మళ్ళీ కొంచం ముందుకు నడిపింది.

“ఇండియాలో అయుంటే ఈ పాటికి హారన్‍ల మోతతో గందరగోళం చేసేసుండేవాళ్ళు. ఇక్కడేమో కార్లలోపల కూర్చుని బూతులు తిట్టుకుంటూ  ఉంటారు. బయటంతా ప్రశాంతంగా ఉంది” అన్నాడు రామ్. “ఇన్‍ఫ్యాక్ట్ అదే సమస్య. ఈ డిసిప్లిన్, క్రమపద్ధతి, నిశ్శబ్దం… ఇవే మనిషిని మానసికరోగిని చేస్తుంది… హైదరాబాద్‍లా అరిచి విరుచుకుపడి గోల చేసేస్తే సగం సమస్య సాల్వ్ అయిపోతుందేమో…”

ఆమె పట్టించుకోకుండా ఉండటంతో, పలు రంగుల్లో మసకచీకట్లో మిణుగురుల్లా మెరుస్తూ సాగుతున్న కార్లను చూస్తూ “ఇక్కడ కార్లకు కూడా మానసిక రుగ్మత ఉందేమో అనిపిస్తుంది… హారనే కొట్టకుండా ఉంటే కార్లకు డిప్రషన్ వచ్చేస్తుంది…” అని అన్నాడు.

అతను ఆమె వైపునుండి తలతిప్పి బయటకు చూస్తూ మాట్లాడాడు. “ఒక యాక్షన్ సినిమాలో డయలాగ్ గుర్తొస్తోంది… ఒక్కో కారూ ఒక్కో బాంబు… ఒక్కసారిగా పేలకుండా కొంచం కొంచంగా పేలడమే ఆ ఎంజిన్‍ యొక్క ఆపరేషన్…” మెల్లగా నవ్వి “అమెరికాలో కార్లు పేలి చెల్లాచెదరవ్వని యాక్షన్ సినిమాలే ఉండవు. కనీసం నాలుగైదు కార్లు పేలిపోవడాన్ని ప్రతిరోజూ స్క్రీన్‍లో చూసేస్తుంటాం” అని అన్నాడు.

లక్ష్మి “ఇప్పుడేంటి గూగుల్ ట్రాఫిక్ స్టేటస్” అని అడిగింది.

అతను చూసి “అలానే ఉంది… పాజిటివ్‍గా ఏం లేదు… అవును యాక్సిడెంటే అయింది” అని అన్నాడు.

“నేను అదే అనుకున్నాను” అని అంది.

ఆమె ముఖానికేసి చూశాడు. ఆమె రోడ్డుమీద ఆగిపోయున్న కార్లనే చూస్తోంది.

“నిజానికి ఈ కారే సమస్య… అమెరికాలో జనం వాళ్ళ జీవితంలో సగం సమయాన్ని కార్లలోనే గడిపేస్తారు… దేశం చాలా పెద్దది. ఇళ్ళు పెద్దవి… అయితే జీవించేది చాలావరకు ఈ చిన్న చిన్న కార్లలోనే…” అతను నవ్వి “విచిత్రంగా ఉంది. సైన్స్ ఫిక్షన్‍లా ఊహించుకోవచ్చు. జనం ఇలా చిన్నచిన్న ఫైబర్ బుడగల్లో ముడుచుకుపోయి జీవితాలను గడిపేస్తారు అని మూడువందలేళ్ళ క్రితం మనం ముత్తాతలతో చెప్పుంటే పగలబడి నవ్వేసుంటారు…”

కారు మెల్లగా పాకుతోంది. ఆ చిన్న చిన్న కదలికలే కొంత ఓదార్పును ఇస్తున్నాయి. అతను మాట్లాడటం ఆపేశాడు. ఇరువైపులా ఉన్న రెండు కార్లు అలానే అనుసరిస్తున్నాయి. ఇప్పుడు ఎడమ వైపు కార్లోని నల్లవాడి ముఖం కనిపించింది. మధ్యవయస్కుడు. సన్నటి మీసం పెట్టుకుని ఉన్నాడు.

“కార్లలో కూర్చుని చాలా వేగంగా ఎంతెంతో దూరాలు వెళ్ళిపోతున్నట్టు అనుకుంటు ఉంటాం… మనం ఎక్కడికీ వెళ్ళడంలేదు… ఈ ఫైబర్ గొట్టంలోనే కూర్చుని ఉన్నాము. విండోస్‍లో సీన్ మారుతోంది అంతే”

మళ్ళీ కదలిక ఆగిపోయింది.

“నేను ఏ ముహూర్తాన అన్నానో మరి” అని అతను నవ్వాడు.

ఆమె నవ్వలేదు.

“చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో కార్లంటే పిచ్చి. ఏ బ్రాండ్ కారైనా సరే దూరంనుండి చూసినా గుర్తు పట్టేసేవాణ్ణి. సొంతంగా ఒక కారు కొనుక్కోవాలన్న కల తీవ్రంగా ఉండేది… ఇప్పుడు నేను ద్వేషించేది ఏదైనా ఒకటి ఉందంటే అది కారు మాత్రమే… అయితే ఈ కార్లోనే ఉద్యోగానికి వెళ్ళాలి… కార్లోనే తిండి, నిద్ర… కార్లో షిట్‍కొట్టే సౌకర్యంమాత్రమే రాలేదు… లిమజీన్‍లో అది కూడా ఉందట”

“ఎన్ని కార్లు బాబోయ్” అని సన్నటి స్వరంతో చిరాగ్గా గొణిగింది లక్ష్మి.

“లాంగ్ వీకెండ్ వస్తే చాలు అందరూ రోడ్లమీద పడతారు” అన్నాడు రామ్. “సరేలే, మనమైనా అంతేగా! వేరే దార్లేదు. ప్రతి లాంగ్ వీకెండుకూ వీళ్ళు ఏదో ఒకటి ప్లాన్ చేసి మనమీద రుద్దేస్తారు… ఎంజాయ్ చేస్తారో లేదో, ఇది స్కూల్లో ఒక ప్రెస్టిజ్ ఇష్యూలా మారిపోయింది”

“వాళ్ళకూ బోర్డమే పాపం”

“యా… అమెరికాకున్న జాతీయ సమస్య బోర్డమే… పనిలో నిమగ్నం అయిపోవాలి, లేదా డబ్బు ఖర్చుపెట్టాలి… సంపాయించు, ఖర్చుపెట్టు… రెండే రెండు మార్గాలు మాత్రమే”

లక్ష్మి స్టీరింగ్‍నుండి చేతులు తీసేసి చాతీకి అడ్డంగా చేతులు కట్టుకుంది. కార్ మెల్లగా ముందుకు కదులుతున్నట్టు తోచింది. అయితే అది భ్రాంతి మాత్రమే, కదలటంలేదు.

ఆమె “రామ్” అని అన్నదిగానీ గొంతు పైకి రాలేదు. గొంతు సవరించుకుంటూ “రామ్, నీతో మాట్లాడాలి” అని అంది.

“ఏంటి కొత్తగా? మాట్లాడుతూనే ఉన్నాంగా?”

“ఐయామ్ ప్లానింగ్ టు లీవ్”

రామ్ “గూగుల్ అప్పట్నుండి అలానే చూపిస్తోంది… ఏ మార్పూ లేదు” అని అన్నాడు.

“నేనేం చెప్తున్నానో వింటున్నావా?”

“ఏంటి?”

“చెప్పాను కదా? నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను”

“ఎక్కడికి?”

ఆమె అతనికేసి సూటిగా చూసి “ఏం తెలియని ఇడియట్‍లా నటించకు… నేను చెప్తున్నది ఏంటో నీకు తెలుసు” అని అంది.

అతనికి అప్పుడు వెలిగింది. హఠాత్తుగా మనసు మొద్దుబారిపోయింది.

“ప్రభాకర్ ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చెయ్యాలి అని అడుగుతున్నాడు. ఎక్కువ రోజులు వెయిట్ చెయ్యలేడంట. వస్తున్నావా లేదా అని అడుగుతున్నాడు. నేను వస్తానని చెప్పేశాను”

అతను భుజాలు సడలిపోయాయి. ఏదో శక్తి బలంగా సీట్లో అదిమేస్తున్నట్టు అతని ఒళ్ళు సోలిపోయింది.

“ఇప్పుడు నీకు మలయాళపోడు కావాల్సి వచ్చింది… ఈ వయసులో… నీకంటే ఎనిమిదేళ్ళు చిన్నవాడు…”

“షటప్… అవన్నీ నీకెందుకు?”

“నువ్వు ఫూల్‍వి… వాడికి సరైన ఉద్యోగమైనా లేదు… నీ జీతంలో సగంకూడా రాదు వాడికి”

“ఇదిగో చూడు, మనం దీని గురించి చాలానే మాట్లాడేశాం”

“సరే, పో”

“ఓకే”

“కారును ముందుకు నడుపుతున్నట్టు ఏదో చేసింది ఆమె. అయితే ముందున్న కార్ల బారు కదల్లేదు”

“వెనక ఇద్దరున్నారుగా… వాళ్ళనేం చేస్తావు?”

“హాస్టల్లో వేసేద్దాం”

“రైట్… అయితే ఆ విషయం వాళ్ళతో నువ్వే మాట్లాడు”

“నేనెందుకు మాట్లాడాలి?”

“మరి నేను మాట్లాడాలా? లేచిపోవాలనుకుంటున్నది నువ్వు”

“షటప్… ఏం మాట్లాడుతున్నావు? ఎవరు లేచిపోతున్నది? నేను లీగల్‍గా విడిపోతున్నా”

“అదే… ఆ విషయమే నీ పిల్లలకు చెప్పు”

“నీ పిల్లలు కారా?”

“నా పిల్లలు కూడా… నేను విడిచివెళ్ళిపోతున్నట్టయితే అప్పుడు నేనే వాళ్ళతో చెప్పేవాడిని”

“ఏలైన్‍తో నీకు రిలేషన్‍షిప్ ఉండేది కదా దాని గురించి చెప్పొచ్చుగా?”

“ఎందుకు చెప్పాలి? నేను విడిచి వెళ్ళానా ఏంటి?”

“నువ్వొక దుర్మార్గుడివి… నువ్వు ఛీట్ చేశావు… నేను నిజాయితీగా చెప్తున్నాను”

“యెస్, అదే నిజాయితీతో నువ్వే వాళ్ళతో చెప్పు అనే అంటున్నా”

ఆమె మళ్ళీ స్ట్రీరింగ్ పట్టుకుని దాని మీద తాళం వెయ్య సాగింది.

“ఇప్పుడు నువ్వు జంకుతున్నావుకదా, నేను అందుకే జంకాను. నేను వాళ్ళను ఫేస్ చెయ్యలేను”

ఆమె పెదవి విరిచి ఏదో గొణిగింది.

“ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లలు వాళ్ళు… అయితే వాళ్ళు తెల్లవాళ్ళు కారు. ‌వాళ్ళ సర్కిలంతా దాదాపుగా ఇండియన్సే… మనం వాళ్ళను అలానే పెంచాం…”

“నేను ఎలాగూ చెప్పేస్తాను…”

“చెప్పు… నీవల్ల అయితే చెప్పు. అన్నీ నువ్వనుకున్నట్టు సరిగ్గా జరిగి ఇదంతా ఒక కొలిక్కి వస్తే మంచిదేగా?” అని అన్నాడు రామ్.

కార్ మళ్ళీ మెల్లగా కదలసాగింది. అర్ధగంటకు పైనే మెల్లగా పాక్కుంటూ వెళ్ళింది. ఈ కదలికే లేకపోయుంటే కారును పగలగొట్టుకుని బయటకు ఎగిరిపోయుంటాము అని అనిపించింది అతనికి.

మళ్ళీ కార్ ఆగినప్పుడు ఆమె నుదుటి మీద నీలి రంగులో నరాలు బిగుసుకొని ఉండటం చూశాడు.

“లుక్, సమస్య వాళ్ళు కారు, మనమే. నువ్వు చెప్తే వాళ్ళు దాన్ని మామూలుగా తీసుకోలేరు. వాళ్ళ చదువు, భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది. ఇలాంటివి తెల్లవాళ్ళు పెద్దగా పట్టించుకోరేమో. మనం పట్టించుకుంటాం. ఏ గిల్ట్ ఫీలింగూ లేకుండా మనం బతకలేము” అని అన్నాడు రామ్.

ఆమె నిట్టూరుస్తూ  తేలిక పడింది. తలను స్టీరింగ్ మీదకు వంచింది, నిద్ర ముంచుకొస్తున్నదానిలా.

“మన పేరెంట్స్ కూడా ఏమీ సంతోషంగా బతకలేదు. మా అమ్మ అన్నిట్నీ భరిస్తూనే బతికింది… నాకోసం. ఆ రాతే మనకైనా. ఎందుకంటే మనం ఇండియన్స్… అమెరికాకు వచ్చి కార్లో కూర్చున్నంతమాత్రాన మనం లిబరేట్ అయిపోము”

“లిబరేషన్” ఆమె నిట్టూరుస్తూ చెప్పింది.

“అవును, లిబరేషనే… బాండ్ ఉంటే లిబరేషన్ లేదు… బాండ్‍ని వదులుకోవడమే లిబరేషన్… ఆప్యాయత, ప్రేమ అన్ని రకాల సెంటిమెంట్ల నుండీ విడుదల… ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫ్రీడమ్ అంటే లోన్లీనెస్… తెల్లవాళ్ళకు ఆ తెగింపు ఉంది. మనకు లేదు. మనం పిరికి వాళ్ళం. మనం దేన్నీ వదులుకోలేం. అయితే మనకు విడుదల కూడా కావాలి… మనకు తెలిసిన విడుదలంతా డే డ్రీమింగ్ మాత్రమే”

“నేను వెళ్ళడంలేదు…” అని అంది. “పిల్లలకు చెప్పడం నా వల్ల కాదు. కనీసం వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళేంతవరకైనా”

“గుడ్” అన్నాడు అతను మందహాసంతో.

“అయితే నేను ప్రభాతో తిరుగుతాను… అతనితో గడుపుతాను”

“యూ…” అంటూ ఆమె వైపుకు తిరిగి చెయ్యెత్తాడు అతను.

“మ్మ్…” అని గద్దించింది.

అతను చెయి దించాడు. ఒళ్ళు ‌వణికిపోతూ పిచ్చెక్కినవాడిలా తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. అయితే పక్కనున్న కారు అతి దగ్గరగా నిల్చుని ఉంది. నిశ్చేష్టుడిలా తల పట్టుకున్నాడు.

“ఇటువైపు నాకూ దిగడం వీలు కాదు…” అని అంది ఆమె.

రామ్ ఏమీ మాట్లాడలేదు.

“ఇదొక్కటే మార్గం… నేను అతనితోనూ ఉంటాను. నువ్వన్నది కరెక్ట్. అతనికి నా డబ్బు అవసరం. నేను చెప్పే కండిషన్‍కు ఒప్పుకుంటాడు”

“గో టు హెల్” అని అన్నాడు రామ్.

“థేంక్యూ” ఆమె చిన్నగా నవ్వుకుంది. ఆమె లోపటి ప్రతీకార భావం బయటికి సంతోషంగా మొహం మీద ప్రతిఫలించింది.  వెలిగిపోతున్న ముఖంతో ముందుకు డ్రైవ్ చేస్తోంది.

అతను ఆమె వైపు చూడ్డం తప్పించుకోడానికి పక్కకెటో  చూశాడు. తెల్లవాడు ఇంకా  పక్కసీటు ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు.

“ఒక సీక్రెట్ ఉంటే మంచిదే… లైఫ్ చాలా ఆసక్తికరంగా మారిపోతుంది”  అంది లక్ష్మి.

“షిట్” అన్నాడు అతను.

ఆమె కారును మెల్లగా నడుపుతోంది. రోడ్డుకేసి చూస్తున్న ఆమె ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది. కారు చాలాసేపట్నుండి నడుస్తున్నట్టు అనిపించింది.

మళ్ళీ ఆగింది.

“ఏం చెప్తోంది గూగుల్” అడిగింది లక్ష్మి.

అతను చూసి “ఏమీ అప్డేట్ లేదు… ఎంత టైమ్ పడుతుందో తెలియట్లేదు” అని అన్నాడు.

***

మూలం:, యానం, February 3, 2024

யானம் (சிறுகதை)

రచయిత వివరాలు: జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దంపట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.

ఈమెయిల్: jeyamohan.writer@gmail.com

 

అవినేని భాస్కర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు