నవలల పోటీ- మా అనుభవాలు కొన్ని!

చదువు-ఆన్వీక్షికి సంయుక్తంగా నిర్వహించిన ఉగాది నవలల పోటీ – ఒక పరిశీలన

తెలుగు సాహితీ ప్రపంచంలో ఆన్వీక్షికి ప్రచురణలు, చదువు యాప్ ద్వారా మేము చేస్తున్న కృషి సాహితీ ఆభిమానులందరికీ తెలిసిందే. గడిచిన ఐదేళ్లలో నూట పాతిక పైగా పుస్తకాలను ప్రచురించి, యాభై మందికి పైగా యువ రచయితలను తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన ప్రచురణ సంస్థ ఆన్వీక్షికి.

క్రమంగా కనుమరుగైపోతున్న తెలుగు పాఠకుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనూ మొదలైన యాప్ – చదువు. ఇప్పటికే పాతిక వేల మంది సాహిత్యాభిమానులు చదువు యాప్ వినియోగిస్తున్నారు.

తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా మరుగునపడిపోతున్న నవల అనే ప్రక్రియకు మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో చదువు-అన్వీక్షికి సంయుక్తంగా ఉగాది నవలల పోటీ నిర్వహించిన సంగతి మీకు తెలిసిందే.

ఇప్పటివరకూ మేము చేసిన వివిధ పనుల్లానే, ఈ పోటీని కూడా సాహిత్య ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే ఒక పరిశీలనగా, ఎకడమిక్ ఎక్సర్‌సైజ్‌గా చూడాలనేదే మా ప్రయత్నం.

ముందుగా ఈ నవలల పోటీలో పాల్గొన్న రచయితలకు మా ధన్యవాదాలు. మా మొదటి ప్రయత్నానికి ఇంతటి ఆదరణ ఉంటుందని మొదట్లో ఊహించలేదు. వందకి పైగా నవలలు ఈ పోటికి రావడం చాలా సంతోషం కలిగించిన విషయం. ఈ పోటీకి సంబంధించిన ఫలితాలు ఉగాదికల్లా తెలియచేస్తాం. కాకపోతే దానికంటే ముందు, అసలు ఈ నవలల పోటీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అందరికీ తెలియచేయాలనే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.

ఇక ఇప్పుడు దాదాపు ఈ పోటీ ఫలితాలు ప్రకటించే సమయం వచ్చేసింది కాబట్టి, ఈ పోటీలో పాల్గొన్న రచయితలు, వారి నవలల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను పరిశీలించే ప్రయత్నం ఇది.

  1. ఉగాది నవలల పోటీ – కొన్ని ఆసక్తికరమైన విషయాలు

అత్యధికంగా జాన్రా ఫిక్షన్ విభాగంలో 49% నవలలు, లిటరరీ ఫిక్షన్ విభాగంలో 42% నవలలు, యంగ్ అడల్ట్ విభాగంలో 9% నవలలు వచ్చాయి. (యంగ్ అడల్ట్ విభాగంలో వచ్చిన అతి కొద్ది నవలలు కూడా ప్రీ టీన్స్ – అంటే చిన్న పిల్లలను ఆకట్టుకునే నవలలే ఎక్కువ)

తెలుగులో ఒక పాతికేళ్ళగా నవల అనే ప్రక్రియ పూర్తిగా వెనుకబడింది. కవిత్వం, కథాసంకలనాలే ఎక్కువగా రావడానికి కారణాలు కొత్తగా వెతకనక్కర్లేదు. నవల రాయడానికి పడాల్సిన శ్రమ, అందుకు తగ్గ గుర్తింపు, రాసిన నవలను ప్రచురించుకోడానికి అవకాశాలు లేకపోవడం లాంటి ఎన్నో కారణాలు తెలుగు సాహిత్యం పరిచయం ఉన్న ఎవరికైనా తెలుసు. గత ఐదేళ్ళలో కొత్త పాఠకులు పుట్టుకొస్తున్నారు. వాళ్లు ముఖ్యంగా నవలల మీదే ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కసారి ఇన్‌స్టాగ్రాంలో తెలుగు పుస్తకాల మీద వస్తున్న మీమ్స్, రీల్స్ చూస్తే కొత్త, యువ పాఠకులు నవలలే ఎక్కువ చదువుతున్నారన్న విషయం మీకే తెలుస్తుంది.

మేము ప్రచురణ రంగంలో కృషి చేస్తున్నాం కాబట్టి మాకు ఎంతో కొంత ఈ విషయం మీద అవగాహన ఉంది. అలాగే కొత్తగా రాయాలనుకుంటున్న యువ రచయితలు కూడా నవల మీద ఆసక్తి చూపిస్తున్నారని అర్థమవుతోంది. అందుకు సాక్ష్యంగానే ఈ పోటీల్లో పాల్గొన్న వాళ్ళల్లో యాభై ఏళ్ళకు మించిన వాళ్లు 71% ఉండగా ముప్ఫై ఐదేళ్ల లోపు వాళ్లు 18% ఉన్నారు. 36-50 లోపల వాళ్లు కేవలం 11% మాత్రమే ఉండడం ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. కొత్తవాళ్లు నవలపై మళ్ళీ ఆసక్తి చూపించడం ఉత్సాహం కల్పించింది కూడా.

ఇకపోతే 74% రచయితలు ఇది వరకు నవల రాసిన అనుభవం ఉన్నవాళ్ళు, మిగిలిన 26% రచయితలకు ఇది తొలి నవల. ఇది కూడా ఎంతో ఉత్సాహం కలిగించే విషయమే!

  1. రచనా శైలి

ముందే చెప్పినట్టు ఆన్వీక్షికి, చదువు ద్వారా మేము చేపట్టిన చాలా పనులు కొంత ఎకడమిక్ ఇంట్రస్ట్‌తోనూ, స్టాటిస్టికల్ డాటాతోనూ చేస్తాము కాబట్టి, రచయితల రచనా శైలి గురించి కూడా కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తే, ఆయా రచయితలకే కాకుండా ఓవరాల్‌గా తెలుగు సాహిత్య రంగానికి కూడా కొంత ఉపయోగం ఉంటుందని మేము ఈ ప్రయత్నం చేశాం.

గమనిక: ఈ అంశాలు అన్ని అన్ని నవలలకు వర్తించవు. కాకపోతే ఎక్కువ శాతం నవలల్లో కనిపించిన కొన్ని లోటుపాట్లని తెలియచేసే ఒక ప్రయత్నం.

2.1    చుక్కలు చూపించిన మూడు చుక్కలు

ఈ పోటీకి వచ్చిన నవలలు చదివిన వారందరూ బాగా చదువరులే. మాకందరికీ బాగా ఇబ్బంది కలిగించిన అంశం … గురించి మీకు చెప్పాలంటే… కొంచెం సేపు మీరు ఓపిక పట్టాల్సిందే … ఎందుకో అని …. ఈ పాటికి … మీకు తెలిసే ఉండాలి.

అసలు ఈ మూడు చుక్కలు ఎక్కడ్నుంచొచ్చాయో, అవి తెలుగు సాహిత్యాన్ని ఎందుకు ఇలా కబళించి వేశాయో దేవుడికే తెలియాలి.

ఈ మూడు చుక్కలని ఇంగ్లీష్ లో ఎలిప్సిస్ అంటారు.

The ellipsis also known informally as dot dot dot) is a series of dots that indicates an intentional omission of a word, sentence, or whole section from a text without altering its original meaning.

ఎలిప్సిస్ అనబడే ఈ మూడు చుక్కల వాడకం (అబ్యూజ్) ఇంకే ప్రపంచ భాషల్లోనూ ఉండదేమో. మాట మాటకూ, వాక్యం వాక్యం మధ్యలో ఈ మూడు చుక్కలు చదివే వారికి ఎంత చికాకు పుట్టిస్తుందో (కనీసం మాకైతే అలా అనిపించింది) మాటల్లో చెప్పలేం.

మాటల్లో చెప్పలేనిది. చెప్పాల్సిన అవసరం లేనిది ఈ ఎలిప్సిస్ ద్వారా చాలా అద్భుతంగా చెప్పొచ్చు. ఎక్కడో చోట పాత్ర నోట మాట రాని ఉద్వేగాన్ని ఈ మూడు చుక్కల ద్వారా మనం తెలియచేయొచ్చు.

ఈ విధంగా…

On the other hand, he might just kiss me right now, tonight, right here by my door … there’s still a chance … I mean we are pressed up against each other’s bodies beneath this moonlight … and of course, it would be a terrible mistake … but it’s still such a wonderful possibility that he might actually do it right now … that he might just bend down … and …and

Eat Pray Love అనే నవలలో వచ్చే ఒక పారాగ్రాఫ్ ఇది. ఇక్కడ తప్ప మరో చోట ఆ రచయిత మూడు చుక్కలను వాడలేదు. ఇక్కడ ఆ అవసరం ఉంది కాబట్టి వాడాల్సి వచ్చింది.

మరొక ఉదాహరణ:

‘IDEAS,’ she said. ‘Oh, as for ideas…’

‘Well?’ I hazarded, ‘as for ideas…?’

పై వాక్యాల్లో కూడా వాటి అవసరం తప్పకుండా తెలుస్తోంది. అలా కాకుండా అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి వాక్యంలో మూడు చుక్కలు చొప్పించడం సరైన పద్ధతి కాదేమోనని మా అభిప్రాయం.

చదవడంలో సమస్య పక్కన పెడితే ఈ మూడు చుక్కల పద్ధతితో రాసే రచయితలు ఒక్కోసారి రెండు చుక్కలు, ఇంకోచోట నాలుగు చుక్కలు, ఇలా ఇష్టమొచ్చినట్టు రాయడంతో పుస్తకం డిజైన్ చేసేవాళ్లకి, ప్రూఫ్ రీడింగ్ చేసేవాళ్లకి చుక్కలు కనిపిస్తాయి. ఒకవేళ వాడక తప్పదంటే కనీసం అన్ని చోట్లా మూడు చుక్కలు వాడం, మూడు చుక్కల తర్వాత ఒక స్పేస్ వదలడం లాంటివి చెయ్యాలి.

2.2    కళ్ళముందు సినిమా రీలులా తిరిగిన గతం

ఆశ్చర్యంగానే ఉంది కానీ, వచ్చిన నవలల్లో దాదాపు నలభై నుంచి యాభై శాతం నవలలు ఫ్లాష్‌బ్యాక్ పద్ధతి ద్వారా కథ రివీలయ్యే నవలలే! ఒక ఛాప్టర్ ద్వారా ఏదో ఒక పాత్రను పరిచయం చేయడం, ఆ పాత్రకు ఏదో ఒకటి జరగడం, ఇక ఆ పాత్ర కూర్చుని ఆలోచనల్లోకి వెళ్లిపోతుండగా ఆ పాత్రకు గతం మొత్తం సినిమా రీలుగా తిరిగి మనకి ఫ్లాష్‌బ్యాక్‌ ద్వారా కథ రివీలయ్యే విధానం తప్పేమీ కాదు. సినిమాల్లోనూ, ఎన్నో గొప్ప నవలల్లోనూ ఈ ఫ్లాష్‌బ్యాక్ విధానంలో చెప్పబడ్డాయి. ఫ్లాష్‌బ్యాక్ విధానంలో కథ చెప్పాలంటే, అందుకు పాఠకులకు ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో తెలుసుకోగలిగిన గతం గురించి ఆసక్తి కలిగించాలి.

వచ్చిన చాలా నవలల్లో అటువంటి ఏ నేపథ్యం కల్పించకుండానే గతంలోకి వెళ్ళడం గమనించాం. ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి. ఒక పాత్ర తను పుట్టినప్పట్నుంచీ తన గతాన్ని గుర్తు చేసుకోవడం కథకి అవసరం లేకపోయినా, ఆ పాత్రకు, కథకు అవసరమైన మేరకు గతాన్ని చెప్పే అవకాశం ఉన్నా కూడా పూర్తిగా ఆ పాత్ర బయోగ్రఫీ (పుట్టుక నుంచీ) మొత్తం చెప్పడం ద్వారా కథ మొదట్లోనే పాఠకుడి ఆసక్తి కోల్పోయే అవకాశం ఉంది.

వచ్చిన నవలల్లో చాలా వరకూ ఫ్లాష్‌బ్యాక్ టెక్నిక్‌ ద్వారా కథని తెలియచేయడమే తప్ప, కథని నడపడం జరగలేదు. ఆ కారణంగా కొన్ని మంచి కథాంశాలున్న నవలలు కూడా పేలవంగా నడిచాయి.

పాఠకుల మీద ఇన్ఫర్మేషన్ డంప్ చేయడం కంటే కథనం చేసే పద్ధతిలో అవసరమైన విషయాలను ఒక్కొక్కటిగా మెల్లగా చెప్పుకుంటూ పోవడం చాలా మంచి పద్ధతేమో.

నవల ఇలాగే రాయాలి అని ఎక్కడా ఒక నియమావళి లేదు కానీ, పైన చెప్పిన రెండు విషయాలు ఎక్కువ నవలల్లో మేము కామన్‌గా గమనించిన ఒక విషయం. అందుకే మేము గమనించిన ఈ విషయం అందరితో పంచుకోవాలనిపించింది.

కానీ కొన్ని నవలల్లో ఫ్లాష్‌బ్యాక్ టెక్నిక్‌కి ఎంతో సమర్థవంతంగా ఉపయోగించి ఎక్కడ ఎంత చెప్పాలో, ఎంత రివీల్ చెయ్యాలో చేసుకుంటూ కథ మీద ఆసక్తి కలిగించేలా కథనం చేసిన వాళ్లు కూడా ఉన్నారు.

2.3    World Building or the lack of it

మేము గమనించిన మరొక ముఖ్య విషయం – నవలలో స్థల కాలాదులను పాఠకులకు తెలియచేయడంలోని నేర్పు కొరవవడం.

మేము చదివిన కొన్ని నవలలు పూర్తిగా చదివిన తర్వాత కూడా అసలు ఆ కథ ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో తెలియకపోవడం కొంత నిరాశ కలిగించింది.

అయితే ఆ విషయాలను చెప్పాలనే ప్రయత్నంలో కొంతమంది రచయితలు చాప్టర్ మొదట్లోనే ఫలానా తేదీ, ఫలానా చోటు అని రాయడం కూడా చూశాం. ఇది కూడా గొప్ప టెక్నిక్ కాదు అని మా అభిప్రాయం. కథలోనే ఇమిడిపోయేలా (ఉదా: “సాయంత్రం ఏడయింది. ఊరంతా చిత్రలహరి చూడ్డానికి వెంకట్రావు ఇంటిలో కూర్చుని ఉన్నారు.” అని రాసినప్పుడు మనం చెప్పకుండానే కథలో కాలం మనకి సులభంగానే తెలుస్తుంది.)

అలాగే మనకి తెలిసిన ప్రపంచాన్నే వేరే విధంగా ప్రతిపాదించినప్పుడు కూడా ఒకరకమైన ఇబ్బంది ఎదురవుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం జరుగుతున్న కథలో – హైదరాబాద్ పక్కనే ఉన్న అడవిలోని రాజమందిరం – అని ఉంది అనుకోండి, హైదరాబాద్ పక్కన మనకి తెలియని ఈ అడవి ఎక్కడ, రాజమందిరం ఎక్కడా అని పాఠకులు డిస్‌కనెక్ట్ కావొచ్చు. అలాగే ఒక పాత్ర హైటెక్ సీటీ నుంచి తిరిగి వస్తూ పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో అతని శవాన్ని లోయలో ఉన్న అడవి మృగాలు ఎత్తుకెళ్ళాయి అని రాసామనుకోండి, హైటెక్ సిటీ – అడవి – ఆడవి మృగాలు – ఇవన్నీ పాఠకుడిక తెలియని ఒక ప్రపంచాన్ని ఊహించుకోలేక ఇబ్బందిలోకి నెట్టేయొచ్చు. అందుకే మనం చెప్తున్న కథని ఒక కాలంలో, ఒక స్థలంలో ప్లేస్ చెయ్యడమనేది నవలా రచనలో చాలా ముఖ్యమైన టెక్నిక్. ఇది చాలా నవలల్లో లేకపోవడం మేము గమనించాం.

2.4    బాగా మొదలై…

         ఇదంత చెప్పుకోదగ్గ విషయం కాదు కానీ, ప్రస్తావించదగిందే. కొన్ని నవలలు అద్భుతంగా మొదలయ్యాయి. కానీ చాలా పేలవంగా ముగిశాయి. అందుకు కారణాలేంటో ఆయా రచయితలకే తెలియాలి. బాగా వచ్చే అవకాశం ఉన్న కొన్ని నవలలను మేము తిరిగి రాయమని కోరిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. కొంతమంది మేము రాసేది ఇంతే, ఇంక మేమీమీ చెయ్యలేము అన్నారు. అలాగే కొంతమంది ఎడిట్ చేసి పంపించారు. ఎలాగైనా కొన్నైనా మంచి నవలలు పాఠకుల ముందుకు తీసుకొద్దామనే మా ఈ ప్రయత్నం.

  1. కథా వస్తువు

ఈ పోటీల్లో మాకు బాగా సంతోషం కలిగించిన విషయం – కథ వస్తువులో విస్తృతమైన వైవిధ్యం.

ఈ పోటీకి వచ్చిన నవలల్లో ఫెమినిస్ట్ నవలలున్నాయి. అద్భుతమైన రియలిస్టిక్ క్రైం థ్రిల్లర్స్ ఉన్నాయి. ప్రేమ కథలు, కుటుంబ కథలు, టైం ట్రావెల్, నిధుల కోసం అన్వేషణ, క్రిమినల్ ట్రైబ్స్ సెటిల్మెంట్స్ కి సంబంధించిన చరిత్ర ఉంది, జోగిణి వ్యవస్థ గురించి ఆసక్తి కరంగా రాసిన నవల ఉంది, నిధుల అన్వేషణ, ఫాంటసీ నవలలు, దెయ్యాల కథలు, దేవుడితో సంబాషణలు, రంగస్థల నటులు, నవలా కారుల కథలు, చరిత్రలో జరిగే కథలు, చంద్రుడు మీద జరిగే కథలు, ఇప్పుడు ఇక్కడ మన కళ్ళముందు జరిగే కథలు, అమెరికాలో, గల్ఫ్‌లో జరిగే కథలూ, పధ్నాలుగేళ్ళ పిల్లాడి కథా ఉంది, డెబ్భై ఏళ్ళ పైబడ్డ వాళ్ల కథా ఉంది – ఇలా చెప్పుకుంటూ పోతే కథా వస్తువు విషయంలో చాలా వైవిధ్యం ఉంది.

మేము భవష్యత్తులో మళ్లీ ఈ పోటీలు నిర్వహించే అవకాశం ఉంటుందో లేదో తెలియదు కానీ, ప్రతి సంవత్సరం ఇలాంటి నవలల పోటీలు మరికొన్ని జరిగితే తెలుగులో మంచి నవలలు వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాలు ఎవరు కల్పిస్తారో కాలమే సమాధానం చెప్పాలి.

మా దృష్టిలో ఒక మంచి నవల తెలుగు సాహిత్యాన్ని (ముఖ్యంగా కొత్త పాఠకులను చదివేలా చేయడం, పాత వాళ్లకు మళ్ళీ చదవడమంటే ఆసక్తి కలిగించడం) పూర్తిగా మార్చెయ్యగలదు. అటువంటి నవల రావాలంటే ఇలాంటి ప్రయత్నాలు ఇంకా ఇంకా జరగాలని మా ఆకాంక్ష.

  1. నవలల పోటీకి మేము పాటించిన కొన్ని నియమ నిబంధనలు

ఈ నవలల పోటీ మేము ప్రకటించినప్పుడు, మాకు నవలలు వర్డ్ డాక్యుమెంట్ రూపంలో మండలి ఫాంట్, 14 సైజులో మాత్రమే పంపించాలని అడిగాం. ఎనభై శాతం వరకూ వర్డ్ డాక్యుమెంట్‌లో వచ్చినప్పటికీ చాలావరకూ మండలి ఫాంట్‌లో పంపించలేదు. ఇది చాలామందికి విచిత్రంగా కూడా అనిపించింది.  మేము ఇలానే ఉండాలని ఎందుకు కోరుకున్నామంటే, రాసిన కథ ఎంత ముఖ్యమో, ఆ కథని ప్రజెంట్ చేసే విధానం కూడా అంతే ముఖ్యం. మన కథ ఎంత బావున్నా, విడిపోయిన వాక్యాలు, కంటికి ఇంపుగా లేని ఫాంట్లతో ఉన్న నవలని చదవడం కష్టం. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న మండలి ఫాంట్‌లో రాయడం ద్వారా ఆ డాక్యుమెంట్‌ని ఎక్కడైనా, ఎవరైనా సులభంగా చదువుకోవచ్చు. ఎడిట్ చేయోచ్చు. అలాగే పుస్తకాన్ని పేజ్ లేఅవుట్ చేయడం కూడా యూనికోడ్ ఫాంట్స్‌లో ఉంటే పని సులభం అవుతుంది.

అదే అనూ ఫాంట్స్ లాంటి ప్రొప్రయటరీ ఫాంట్స్ ఒక చోట ఓపెన్ అయితే మరొక చోట ఓపెన్ కావు. ఆ ఫాంట్స్ ద్వారా ఎన్నో ఉపయోగాలున్నా, ప్రస్తుత పరిస్థుతులకు అవి అనుగుణం కాదు. అందుకే PDF ద్వారా వచ్చిన నవలలను, లేదా యూనికోడ్ ఫాంట్స్ ఉపయోగించని నవలలను, అలాగే చేతి రాతతో పంపించిన నవలలను మేము పరిశీలించలేదు. అప్పటికీ అలా పంపించిన వారిని తిరిగి యూనికోడ్ ఫాంట్స్ ఉపయోగించి, వర్డ్ డాక్యుమెంట్‌లో పంపించమని కోరినా కొంతమంది పంపలేదు. అలాంటి నవలలను ఈ పోటీలో పరిగణించలేదు.

తెలుగులో పుస్తకాలు ప్రచురించడం తక్కువైపోతున్నా ఈ సమయంలో ప్రచురణకర్తలకు సౌలభ్యంగా ఉండేలా తమ కటెంట్‌ని పంపించే బాధ్యత రచయితలదే అని తెలియచేయడం కూడా ఆ నవలల పోటీ ప్రధాన ఉద్దేశం.

ఇవి మేము ఈ నవలల పోటీలో వచ్చిన నవలల గురించి ముఖ్యంగా పరిశీలించిన కొన్ని అంశాలు.

ఈ నవలల పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మా ధన్యవాదాలు. ఉగాది రోజున ఫలితాలు వెలువడతాయి.

ముగించే ముందు, చదువు, ఆన్వీక్షికి గురించి తెలియని సాహితీ అభిమానులకు మా గురించి ఒక చిన్న పరిచయం.

  1. ఆన్వీక్షికి ప్రచురణలు – చదువు ఈ బుక్/ఆడియో బుక్ యాప్ – ఒక పరిచయం

2018, డిశెంబర్

పుస్తకాలు చదవడం, కథలు రాయడం ఇష్టమున్న కొంతమంది తెలుగు రచయిత మిత్రులమైన మాకు, మా స్వంత పుస్తకాలను ప్రచురించుకునే సమయంలో ఒక క్లిష్టమైన ప్రశ్న ఎదురైంది – తెలుగులో వెయ్యి పుస్తకాలు అమ్మడం కష్టమా? అనే ఆ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో మేము చాలా సమస్యలు గుర్తించాం. అది బుక్ డిజైనింగ్‌లో ఉన్న సాంకేతిక సమస్యలు (ఇంకా అడోబి పేజ్‌మేకర్ లాంటి ఔట్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ వాడకం, తెలుగు ప్రచురణలో అత్యధికంగా ఉపయోగంలో ఉన్న అను ఫాంట్స్ వాడడంలోని అనేక ఇబ్బందులు, బుక్ లేఅవుట్‌, కవర్ పేజ్‌ డిజైనింగ్‌లో ఇంకా వాడుకలో ఉన్న పాత పద్ధతులు లాంటివి), కొత్త పాఠకులను ఆకట్టుకునే ఎంట్రీ పాయింట్ లిటరేచర్ లేకపోవడం, పుస్తకాల అమ్మకాల విషయంలో కూడా వివిధ రకాల సమస్యలు ఉండడం మేము గమనించాం. వీటన్నింటికీ మాకు తోచిన పరిష్కారాలు మేము ఆలోచించాం. ఇలా చేస్తే బావుంటుందని కొంతమందికి చెప్పిచూశాం. కానీ చివరికి చెప్పడం సులభం, చేయడం కష్టం అని మాకూ అనిపించింది. ఆ కష్టాలేవో మనమే పడదాం. మనం పరిష్కారం అనుకుంటున్నవి మనం ఉపయోగంలో పెడితే తప్ప మరొక నలుగురికి నమ్మకం కుదరదని అర్థం చేసుకుని, మేము 2018 డిశెంబర్‌లో ‘ఇన్ ది మూడ్ ఫర్ లవ్’ అనే ప్రేమ కథల సంకలనాన్ని ప్రచురించాం. ఆ పుస్తకం వారం రోజుల్లోనే వెయ్యి పుస్తకాలు అమ్ముడై మాకు ఎంతో ఉత్సాహాన్ని కలుగచేసింది. పుస్తకం డిజైన్‌ చేయడంలోనూ, మార్కెటింగ్ చేయడంలోనూ, గతంలో ఎప్పుడూ చేయని కొన్ని ప్రయోగాల ద్వారా ఆ పుస్తకాన్ని ఎంతో విజయవంతంగా కొత్త పాఠకుల దృష్టికి తీసుకెళ్లాం.

2019, మే

‘ఇన్ ది మూడ్ ఫర్ లవ్’ పుస్తకం ద్వారా మాకు పుస్తక ప్రచురణలోని ఎన్నో అంశాల గురించి కొంత క్లారిటీ వచ్చింది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరికింది అనిపించింది. ఇందులో నేర్చుకున్న పాఠాల ద్వారా మనమే మరికొన్ని పుస్తకాలు ప్రచురిస్తే బావుంటుందనే ఆలోచనతో నేను, మహీ, వందన, సత్యదేవ్ కలిసి ‘ఆన్వీక్షికి’ అనే ప్రచురణ సంస్థను స్థాపించాం. ’సోల్ సర్కస్’, ‘సినిమా కథలు’ పుస్తకాల ద్వారా మొదలైన ఆన్వీక్షికి ప్రచురణ సంస్థ, 2019 ఆఖరుకల్లా పదిహేను పుస్తకాలు పైనే ప్రచురించి, పుస్తకం ప్రింటింగ్, లే అవుట్, కవర్ పేజ్ డిజైన్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ లాంటి ఎన్నో విషయాల్లో కొత్త దారులు వెతుక్కుంది. అలా మొదలైన మా ప్రచురణ సంస్థ 2022 కల్లా దాదాపు 75కి పైగా పుస్తకాలు ప్రచురించి, తెలుగు ప్రచురణ రంగంలో అతి కొద్ది కాలంలోనే ప్రముఖ ప్రచురణ సంస్థగా నిలిచింది. ఆ ప్రయాణంలో మాకు బాలా రెడ్డి, అనురాగ్ చౌదరి లాంటి మరికొంత మంది మిత్రులు మాతో చెయ్యి కలిపారు.

2022, డిశెంబర్

ప్రపంచ వ్యాప్తంగా పుస్తకాలు చదివే అలవాట్లు కొత్త పుంతలు తొక్కుతున్న విషయాన్ని మేమూ గ్రహించాం. అమెరికా, చైనా లాంటి దేశాల్లో పుస్తకాలు చదివేవాళ్ళు యాభై శాతం మొబైల్ ఫోన్, టాబ్లెట్ల ద్వారా ఈ బుక్స్ చదవడం, ఆడియో బుక్స్ వినడం వైపుగా మొగ్గుచూపుతున్నారు. తెలుగులో అటువంటి ప్రయత్నాలు కొన్ని జరిగాయి (దాసుభాషితం, స్టోరీ టెల్). కానీ ఎక్కడో అది పూర్తి స్థాయి ప్రయత్నంగా మాకు అనిపించలేదు. బి.పి పడాల, నేను, మహీ కలిసి చదువు అనే ఈ బుక్ యాప్ తయారు చేసే పనిలో ఉండగానే సంజయ్ అనే మిత్రుడు ఈ బుక్, ఆడియో బుక్ యాప్ తయారు చేద్దామనే ఆలోచనతో మమ్మల్ని సంప్రదించారు. డిశెంబర్ 2022 లో చదువు ఈ బుక్ యాప్ తెలుగు పాఠకులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. అప్పట్నుంచి ఇప్పటివరకూ వేలాది కథలు, వందలాది పుస్తకాలు, వేల గంటల ఆడియో బుక్స్ చదువు యాప్‌లో అప్‌లోడ్ చేశాం. ఇప్పటికి పాతికవేలమంది దాకా తెలుగు పాఠకులు చదువు యాప్ ద్వారా కొన్ని లక్షల పేజీల కథలు/నవలలు చదివారు. ఈ సమయంలోనే తెలుగు సాహిత్యంలో మేము చేస్తున్న మా ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉగాది నవలల పోటీని ప్రకటించాం.

ఉగాది నవలల పోటీ ప్రకటించిన సమయంలో మేము చాలా చర్చించుకున్నాం. తెలుగులో ఇప్పుడు నవలలు రాసే పరిస్థితి దాదాపుగా లేదు. తానా, ఆటా సంస్థలు రెండేళ్లకొకసారి నిర్వహించే నవలలపోటీలు, స్వాతి లాంటి వీక్లీ పత్రికలు నిర్వహించే సీరియల్ పోటీలు తప్పితే మరెక్కడకైనా నవలలు పంపించుకునే అవకాశం దాదాపుగా లేదు. కథలైతే ఏదో ఒక పత్రికలోనో, వెబ్ మ్యాగజైన్‌లోనో, లేదా తమ తమ బ్లాగులు, సోషల్ మీడియా వాల్స్‌ మీద ప్రచురించిన కథలను కొన్నాళ్లకు కలెక్ట్ చేసి ఒక పుస్తకంగా రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ కథలు ఇది వరకే ఎక్కడో దగ్గర ప్రచురితం కావడం వల్ల ఆ రచయిత కథల పుస్తకం వచ్చినప్పుడు కొద్దిమందైనా ఆసక్తి చూపే అవకాశం ఉంది. కానీ కొత్తగా నవల రాయాలనుకునే వారికి ఆ సౌకర్యం లేదు. ఏదో ఒక నవలల పోటీల్లో బహుమతి పొందకుండా ఈ రెండు దశాబ్దాలలో పాపులర్ అయిన నవలలు అతి తక్కువ.

మేము ఆన్వీక్షికి ద్వారా బాలాజీ ప్రసాద్ రచించిన ‘యోధ’, ‘మాన-భంగం’ అనే రెండు నవలలు ప్రచురించాం. అవి అంతకుముందు ఎక్కడా నవలల పోటీలో కానీ, ఏ పత్రికలో కానీ ప్రచురింపబడని నవలలు. అలాగే బ్రహ్మ బత్తులూరి అనే రచయిత రాసిన ‘మీలో ఒకరి కథ’ అనే నవల, విజయ్ శేఖర్ ఉపాధ్యాయుల రాసిన ‘సీతాపహరణం’, చంద్రశేఖర్ ఇండ్ల నవల ’ఎర్ర గబ్బిలాల వేట’ ప్రచురించాం.

అలాగే మల్లిఖార్జున్ తన ప్రచురణ సంస్థ అజ్జు పబ్లికేషన్స్ ద్వారా ’అమ్మ డైరీలో కొన్ని పేజీలు, ఛాయా ద్వారా ప్రసాద్ సూరి ప్రచురించిన రెండు నవలలు ’మై నేమ్ ఈజ్ చిరంజీవి’, ‘మై రావణ’ వచ్చాయి.

ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళండరూ పాతిక ముప్ఫై వయసు వారే. అంటే కొత్తగా వస్తున్న రచయితలు నవల వైపు కూడా మొగ్గు చూపుతున్నారనే విషయం కొంత అర్థమైంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవన్నీ ఎంతో కొంత పాఠకుల ఆదరణ పొందిన నవలలే. ‘యోధ’ నవల రెండు నెలల్లో వెయ్యి కాపీలు అమ్ముడయ్యాయి. ఇప్పుడు రెండో ఎడిషన్ మార్కెట్ లో ఉంది. ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ ఈ మధ్యనే మూడో ఎడిషన్ ప్రింటయింది. సీతాపహరణం, ఎర్రగబ్బిలాల వేట కూడా రెండో ఎడిషన్ వచ్చాయి.

అంటే ఒక కొత్త జెనెరేషన్ నవలలు రాయాలని ఆసక్తి చూపుతోంది. పాఠకులు కూడా వాటిని ఆదరిస్తున్నారు. (తెలుగులో వెయ్యి కాపీలు అమ్ముడవడం కష్టమనుకునే స్థాయి నుంచి చూస్తే కొత్త రచయితల నవలలు ఇలా రీప్రింట్ ‍కి వెళ్లడం అనేది పెద్ద విషయమే!)

ఈ విషయాలన్నీ గమనించే మేము ఉగాది నవలలపోటీ ప్రకటించాం.

అలాగే నవల అనగానే కథాంశం పరంగా అన్ని రకాల వాటికీ సమాన అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో లిటరరీ ఫిక్షన్, జాన్రా ఫిక్షన్, యంగ్ అడల్ట్ ఫిక్షన్ అనే మూడు విభాగాలుగా పోటీలకు నవలలను అహ్వానించాం.

ఇది ఇప్పటి వరకూ జరిగిన సంగతి.

చూద్దాం. రాబోయే రోజుల్లో తెలుగు పాఠకులకు మళ్ళీ సాహిత్యాన్ని దగ్గరచేసే నవలలు వస్తాయో రావో కాలమే సమాధానం చెప్తుంది. ఏదేమైనా నవలే తెలుగు సాహిత్యాన్ని గట్టెక్కిస్తుందని మా గట్టి నమ్మకం. ఆ ప్రయత్నంలో భాగంగా మేము చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకూ సఫలమవుతుందో కూడా కాలమే చెప్తుంది.

ధన్యవాదాలు.

చదువు-ఆన్వీక్షికి ఉగాది నవలల పోటీ నిర్వాహక బృందం

 *

వెంకట్ శిద్ధారెడ్డి

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి సూచనలు చేశారు. రచయితలవుతున్నవాళ్లు, రచయితలమునుకుంటున్నవాళ్లు తప్పనిసరిగా గమనంలో ఉంచుకోవాల్సిన విషయాలు.

  • సర్ (వెంకట్ శిద్దారెడ్డి గారు) మీరు వ్రాసిన దానికి నేనే జవాబు.
    మన్యం జిల్లా కురుపాం లో పుట్టి పెరిగిన నేను డిగ్రీ సమయంలొ యండమూరి, మల్లాది, కొమ్మినేని, యద్దనపూడి వంటి నవలలు చదవటానికి ఆకాశం లో చుక్కను తేవటం అంత కష్టం వుండేది.
    మా ఊరులో దొరికేవి కావు.మా పల్లె నుండి రైల్ ప్రయాణం యే తిరుపతి కి పది సంవత్సరాలు కు ఒకసారి వెళ్ళటమే అటువంటపుడు వైజాగ్ రైల్ స్టేషన్ బుక్ షాప్ లో కొనుక్కొని ఆ ఒక్కటి ఊరు అంతా పంచేవాడని.
    ఇప్పుడంటే అమెజాన్, ఆన్వీక్షికి వంటి online platforms వచ్చాయి.

    నవల వ్రాద్దమనే కుతూహలం తో ఒక ఇరవై పేజీలు వ్రాస్తే ,విజయవాడ ప్రింటర్స్ వారు కు పంపితే వారి పేరు మార్చి వేసుకుంతరనే భయం ఉండేది.

    నవల చదవటానికి చదువు అప్ (పూర్తిగా డిపెండ్ కాకుండ కొన్ని సార్లు),
    పబ్లిషింగ్ కు దైర్యంగ మీ వంటి వారు రావటం వలన నా వంటి నవలా ప్రియులకు అదృష్టం.

    ఇక ఆర్థిక పరంగా మీకు ఇది నష్టమే కావచ్చు కానీ మీ సాహిత్య సేవ వృధా పోదు.
    ఇది నా స్వయం అభిప్రాయం.

    ధన్యవాదములు.

  • ఈ సమాచారం, వివరణ వల్ల మీ అనుభవాలతో పాటు, తెలుగులో వర్తమాన నవలా రచన తీరు తెన్నులు తెలిసే అవకాశం కలిగింది.మీ పట్టుదల, కృషి అభినందనీయం.

  • పొరపాట్లు దిద్దుకునేలా చక్కని పాయింట్స్ చెప్పారు. తెలుగు లిటరేచర్‌‌లో చదువు, అన్వీక్షికి చేస్తున్న కృషి ఎంతో గొప్పది. నవలల పోటీల్లో పాల్గొన్న రైటర్స్ తమ నవలల్లో దొర్లిన కొన్ని పొరపాట్లను మునుముందు చెయ్యకుండా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చదువు, అన్వీక్షికీ లకు గుండెడు బధాయిలు.

  • చాలా థాంక్స్ అండీ. ఈ విధంగా మీరు పడిన ఇబ్బందులు, నవలలు రాసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియ చేసినందుకు. ఇన్నాళ్ళూ కుటుంబ కుటుంబ పరిస్థితుల వలన పునః ప్రారంభించిన ఈ ప్రయాణం వయసు, ఆరోగ్యం సహకరించక పోయినా “చదువు, అన్వీక్షికీ” నుండి వెలువడుతున్న నాణ్యమైన సాహిత్యం చూసి స్పందించాను. జస్ట్ గ్రేట్!

  • కొత్తగా సాహిత్యం లోకి వచ్చే వాళ్లకు
    సుదీర్ఘ కాలంగా సాహిత్య వ్యాసంగంలో ఉన్నవాళ్లకు
    ఓ గైడ్ సమకూర్చారు.
    ధన్యవాదాలు సార్

  • బాగుంది కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. నిర్వాహకులకు అభినందనలు.

  • నవలా రచన గురించి మీరు చెప్పిన విషయాలు ఔత్సాహికులకే కాదు…లబ్ధ ప్రతిష్ఠులకు ఉపయుక్తం.
    ఐతే ఎలా రాసినా,ఏం రాసినా రీడబిలిటీ ముఖ్యం .
    పాఠకుల ను నవలా పఠనం వైపు నడిపించే క్రమంలో మీరు రచయితలను ప్రోత్సహించడం చాలా హర్ష నీయం.
    ఈ యజ్ఞాన్ని ఇలాగే కొనసాగించితే సంతోషం.
    మీ క్రృషి ప్రశంసనీయం… ధన్యవాదాలు

  • మంచి సమాచారాన్ని అందించారు. ముఖ్యంగా నెలల్లోనే కాదు, రచనలలో దొర్లే పొరపాట్లను వ్యాకరణ పరంగా గాని, కథా పరంగా గాని దొర్లే
    పొరపాట్లను చక్కగా విశదీకరించారు. రైటర్స్ అందరికీ ఇది ఉపయోగకరమైన వ్యాసము. అన్విక్షి కి , చదువు యాప్ ల ద్వారా సాహిత్య సేవ చేయడం, ఇలా పోటీలు నిర్వహించటం ద్వారా మీరు, మీ మిత్ర బృందం చేస్తున్న కృషి అభినందనీయం. భవిష్యత్తులో కూడా మీరు ఇలాంటి పోటీలు నిర్వహించ గలరని ఆశిస్తున్నాను. బలమైన సత్ సంకల్పానికి దైవ సహకారం ఎప్పుడూ ఉంటుంది.

  • సారంగలో ఈ వ్యాసం1వ తేదీన చదివాను…

    ఈ సూచనలు వర్థమాన రచయితలే కాదు సీనియర్ నవలా రచయితలు కూడా భద్రపరుచుకో దగిన అత్యంత ప్రయోజనాంశాలు.

    హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏

  • నవలా రచన గురించి చాలా ఉపయుక్తంగా ఉండే సమాచారం.దీనిని బట్టి అర్థం ఐంది.అన్వీక్షి నవలా పోటీ నిర్వాహకుల నిబద్దత.ఎంత సునిశితంగా పరిశీలించి ఈ సూచనలు చేసారో.
    ఐతే ఈ సూచనలు ఔత్సాహిక రచయితలకు మాత్రమే కాదు లభ్ద ప్రతిష్టులకు శిరోధార్యం.
    మీకు అనేక ధన్యవాదాలు

    • జాన్రా ఫిక్షన్ అంటే genre అనా?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు