రెండొందల గజాలు

“బాబూ! ఎస్.వి.ఎస్ హాస్పిటల్.. ఎస్.వి.ఎస్. బాబూ! నెక్ట్స్ ఏనుగొండ.. ఏనుగొండ. బాబూ.. తర్వాత స్టాప్ మీదే!”

హోమ్ సిక్‌తో ఇంటికి వెళ్తున్న ఇంటర్ పిల్లలతో అంటున్నాడు కండక్టర్. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ “లాస్ట్ అరగంట” అని అరిచినట్టుంది ఆ అరుపు.

ఏనుగొండ బస్టాప్ వచ్చింది. పెద్ద పెద్ద బ్యాగులు మోసుకుంటూ ఇంటర్ పిల్లలు, చిన్న చిన్న బ్యాగులతో మధ్యవయసున్న వాళ్లు దిగారు. బస్సు సగం ఖాళీ అయింది.

“రైట్‌.‌. రైట్” అని కండక్టర్ అరుపు వినిపించగానే డ్రైవర్ బస్సును కదిలించాడు.

“చూస్తివా అన్నా.. ఒక్కప్పుడు చిన్న ఊరు లాగా ఉంటుండే! అసలు బస్టాపే ఉండేడ్ది కాదు..”

“అవ్ రిక్వెస్ట్ స్టాప్ ఉంటుండే! ఇప్పుడు జమానా మారింది. పిఠాన పిర్యం అయినయ్ భూముల రేట్లన్ని”

డ్రైవర్, కండక్టర్ మధ్య మాటలు నడుస్తున్నాయి.

బస్సు కిటికీలో నుండి వెనక్కి వెళ్లిపోతున్న దృశ్యాలు చూస్తున్నాను. పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తున్నాయి. పక్కనే ‘గిరిధారి హామ్స్ – గజం మూడు లక్షలు మాత్రమే’ అనే హోర్డింగ్ కనిపించింది. నా చూపంతా దాని మీదికి మళ్ళింది. గజం కేవలం మూడు లక్షలే. ‘మూడు లక్షలు మాత్రమే!’ ఆ లైన్ రాజలింగం అంకుల్‌ని గుర్తు చేసింది.

ఎప్పటి రోజులవి! నవసామ్రాట్ నాగార్జున నటించిన ‘సూపర్’ సినిమా రిలీజైన రోజులు. ఎవరైనా ఇంత అన్నమో, కూరో వేస్తానంటే దాన్ని పట్టుకోవడానికి మా దగ్గర చిప్ప కూడా లేని గడ్డుకాలం.

మా నాన్న ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యి అప్పటికి రెండేళ్లు. ఆయన మంచితనమో, కోపమో కానీ, నాన్నతో పనిచేసేవాళ్లకి నాన్న నచ్చలేదు. ఎనభై వేల విలువ చేసే టికెట్ల ట్రేని మాయం చేశారు. నాన్నే తన సొంతానికి కాజేసాడని కంప్లైంట్ ఫైల్ చేశారు. అప్పుడింత టెక్నాలజీ లేదుగా! ఆర్టీసీలో విచారణ కన్నా ముందు మెమో ఇష్యూ చేస్తారు. ఎందుకు, ఏంటి అని అడగకుండా ఆరోపణ రాగానే ఉద్యోగం తీసేస్తారు. సంజాయిషీలు వినే ఓపిక, తీరిక ఎవరికుంటుంది? యూనియన్‌లో రాజకీయం జరిగిందని నాన్న తనపై ఆఫీసర్లకి చెప్పేలోపే లోలోపల అంతకన్నా పెద్ద రాజకీయాలు జరిగాయి. నాన్నకిచ్చిన మెమో కాస్త సస్పెన్షన్‌గా మారింది.

నాన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే కష్టమే! మా నాన్న అని చెప్పడం కాదు కానీ, జీవితంలో చాలా కష్టాలే పడి పైకొచ్చాడు. కొందరు ముక్కు మీద కోపం, ఆవేశం అంటారు. ఆత్మాభిమానం అని నాన్న అంటుంటాడు. నాన్న కెరీర్లో ప్రొమోషన్ల కన్నా సస్పెన్షన్లే ఎక్కువున్నాయి. చెప్పుకోవడానికి సముద్రం నీళ్లలాగా మాకు పెద్ద బలగమే ఉంది. కానీ ఎందుకూ పనికిరాదు‌. మంచి నీళ్ల చెరువులాగా కొంచం చేదోడువాదోడుగా ఉండే వాళ్లలో రాజలింగం అంకుల్ ఒకరు. మేమున్న పరిస్థితిలో కాస్త.. అహ.. ఇంకా ఎక్కువే అండగా నిలిచాడు.

“మాబ్నార్‌లో ఔటర్ రింగ్‌రోడ్ పడ్తాదంట అన్నా! ఇంత భూమి తీసి పెట్టుకుంటే మేలు. రేపు భవిష్యత్తులో శానా ప్లస్ అయితది. లక్షకే రెండొందల గజాలు..” అని నాన్నతో అన్నాడొకరోజు. అమ్మ, నేను చెవులన్నీ అటే పెట్టి వింటున్నాము.

మా నాన్న చిన్నగా ఓ నవ్వు నవ్వాడు. ‘మళ్లీ ఉద్యోగం తెచ్చుకోడం కోసం ఒక అప్పీల్ లెటర్ రాయాలి. అందుకోసం ఏ4 సైజు పేపర్ కొనాలి. అది కొనుక్కోడానికే దిక్కులేని నేను భూమి కొనాలా?’ అని ఆ నవ్వుకి అర్థం.

ఆ నవ్వులోని తాత్పర్యాన్ని అంకుల్ గ్రహించి, “అన్నా! నువ్వు దేని గురించి ఇంత ఆలోచిస్తున్నావ్? పోనీ నేను నీకు కొనిపెడ్తా” అన్నాడు.

అదేమైనా ఉప్పా, పప్పా? అప్పటికి అవి కొనడం కూడా మాకు గగనమే! అలాంటి మా నాన్నకి ఇలాంటి ఆఫర్ రావడం అద్భుతమే. భూమి విలువ, సొంత ఇంటి విలువ అప్పుడు తెలీదు. కానీ మా అమ్మ ముఖం, తన ఆసక్తి చూస్తే ఇదేదో మా జీవితంలో మార్పు తీసుకొచ్చేదే అనిపించింది. మళ్లీ మా నాన్నకి ఉద్యోగం వస్తుంది. మళ్లీ  నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కి వెళ్ళొచ్చు. ఈసారి పండక్కి కొత్తబట్టలు వేసుకోవచ్చు అనే ఆశలు ఎక్కువైపోయాయి.

“అన్నా! నెలనెలా నేను కడ్తా దాని మిత్తి పైసలు. నీకు ఉద్యోగం వచ్చినప్పుడు, నీకు వీలున్నప్పుడే ఇయ్యి. అసలు నువ్వు ఇయ్యకు. ఇంగో..” అంటూ నన్ను చూపిస్తూ “మన చిన్నోడు పెద్దోడయ్యాక ఇచ్చినా తీసుకుంటా! తొందరేం లేదు” అన్నాడు అంకుల్.

మా అమ్మ కళ్ళలో ఒక్కటే ఆశ. కానీ “ఒప్పుకో కదబ్బా! అన్న ఇంత మంచిగా చెప్తుండు” అని నాన్నతో చెప్పే స్వేచ్ఛ, ధైర్యం లేవు. నాన్న ఇవ్వలేదు.

మా నాన్న కన్నా పదేళ్లు చిన్నోడు రాజలింగం అంకుల్. అప్పుడెప్పుడో నాన్న జీవితంలో మా అమ్మ, నేను లేనప్పుడు తనకి జీవితం గురించి చెప్పి, ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం వచ్చేలా సాయం చేశాడు నాన్న. ఆయనకి నాన్నంటే ఇష్టం, గౌరవం. అందుకే రెండొందల గజాల భూమిని లక్ష రూపాయలకి ఇప్పిస్తానన్నాడు.

ఐదు రూపాయిలుంటే రూపాయి చక్కెర, రెండు రూపాయిల బ్లాక్ డైమండ్ చాయ్‌పత్తా, మూడు రూపాయల పాలు. ఇవి కొనుక్కుంటే ఒక పూట టీ మాకు. ఐదు రూపాయిలంటే మాకంత విలువ! అలాంటిది లక్ష రూపాయదంటే ఎంతో కూడా అంచనా వేయలేని వయసు నాది. సినిమా థియేటర్‌లో ఫ్యామిలీ సర్కిల్ టికెట్ ధర డెబ్భై ఐదు, లీటర్ పెట్రోల్ యాభై ఐదు, కిలో మటన్ రెండొందలు.. ఇవి అప్పటి రేట్లు. మరి లక్ష రూపాయలంటే మాటలా? ఏదో పేపర్లో చదివాను, అది చిన్న సినిమా హీరోల రెమ్యునరేషన్ అని.

నాన్న మేధావిలా బిల్డప్ కొడుతూ ఏదో ఆలోచిస్తున్నాడు. అంకుల్ చున్నీ మే బాబా పాన్ తీసి నాన్నకిస్తూ “కావాలంటే ప్రామిసరీ నోట్ రాసుకుందామన్నా!” అన్నాడు.

నాన్న పాన్‌ని చేతిలో పట్టుకొని “ఇవ్వన్నీ అవ్వని ముచ్చట్లు తమ్మీ! పుకట్లో అంత అగ్గువకి ఎవడైనా ఎందుకిస్తడు? బయట ఈ గలీజ్ క్రిమినల్ కొడుకులు తయారైన్రు. ఎహే! కాని పనులివన్నీ” అన్నాడు.

“మాబ్నార్‌లో.. అది కూడా అడివిలాంటి చోట రింగ్ రోడ్ ఏంది? అవ్వన్నీ బోగస్. ఈ రియల్ ఎస్టేట్ దందాలే ఇంత. నీలాంటి మంచోన్ని ముంచనీకే గివ్వన్నీ” అంటూ పాన్‌ని నోట్లో వేసుకున్నాడు నాన్న.

ఇదే సమయం అని తన ప్యాంటు జేబులోనుండి ఏదో ఒక పేపర్ తీసి చూపించాడు అంకుల్. ఏదో ప్రభుత్వం అప్రూవ్ చేసిన సర్టిఫికెట్ లేఔట్ అని చెప్పాడు. మా నాన్న దాన్ని చూడకుండానే జేబులోనే పెట్టుకో అని సైగ చేసి పాన్ ఉమ్మడానికి బైటికెళ్లాడు.

అంకుల్ నన్ను చూసి “ఏం హీరో! నువ్వైనా మీ డాడీకి చెప్పొచ్చుగా” అన్నాడు. అసలేం జరుగుతుందో కూడా పూర్తిగా అర్థం కాని పరిస్థితి నాది. దానికితోడు నాకు అర్థం కానీ లెక్కల పుస్తకం ముందేసుకుని కూర్చున్నా. ‘హా అంకుల్’ అని అనేలోపు నాన్నొచ్చాడు‌. అమ్మ వైపు చూసి చెంబులో నీళ్లు తేపో అని సైగ చేశాడు. అమ్మ లోపలికెళ్లింది.

నాన్న మళ్లీ అందుకుని “చూడు రాజలింగం! ఇక్కడ అదంతా జరగదబ్బా!” అన్నాడు అంకుల్‌ని చూస్తూ.

“అన్నా! నేను రెండు స్ధలాలు కొన్న కదా అన్నా! శానా అగ్వకే వచ్చింది. ఒకటి ఆ వాటర్ ట్యాంక్ దగ్గర, ఇంకోటి,   కొత్తగా స్కూల్ దగ్గర. ఇల్లు కూడా లేపిన. నా మాట కాదనకు తీసుకో! ఇప్పుడు చాలా తక్కువ. ఒక ఇరవై ఏండ్ల తర్వాత గజం మూడు, నాల్గు లక్షలన్న ఆశ్చర్యం లేదు” అన్నాడు.

అమ్మ నీళ్ల చెంబు తెచ్చి నాన్నకిచ్చింది. బాత్రూమ్ దాకా వెళ్లి నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలిస్తూ “ఏయ్ ఊకుండువయా! అంత పిరం అసలు కావులే” అని తేల్చేశాడు.

మా నాన్న మాటలు నాకే చిరాకు తెపిస్తున్నాయి. అంకుల్ చాలా ఓపికగల మనిషి. మంచోడు. అదేందో అంకుల్ ఇప్పిస్తుంటే తీసుకోవచ్చు కదా అనిపించింది. ఉప్పు, పప్పు దగ్గరి నుండి ఇంట్లో రేషన్ అంతా ఇచ్చినప్పుడు తీసుకున్నాంగా! ఇపుడు నాన్న ఎందుకిలా చేస్తున్నాడో?   నాకైతే అర్థం కావట్లేదు. అన్నీ తెలిసిన అమ్మకూ అర్థం కావట్లేదు.

“సర్లే అన్నా! నువ్వేదో పరేషాన్‌లో ఉన్నవ్. కొంచం నిమ్మళం అయినంక దీని గురించి ఆలోచించు” అన్నాడు అంకుల్. మా నాన్న మాట వరసకైనా సరే అన్నట్లు తలాడించలేదు.

అంకుల్ చిరునవ్వుతో మా అమ్మతో “అమ్మా! గృహప్రవేశానికి తప్పకుండా రావాలి” అని చెప్పి వెళ్ళిపోయాడు. మేము తప్పకుండా వస్తాం అని ఆయనకు తెలుసు! అయినా చెప్పడం ఆయన మంచితనం.

నాన్న ఏదో ఆలోచిస్తున్నాడు. ఆయన ఆత్మాభిమానానికి, ఆశకి మధ్యన ఏదో యుద్ధం జరుగుతున్నట్లు అనిపిస్తోంది. నాన్న పాన్ నమలకుండా ఆలోచిస్తున్నాడంటే అది చాలా సీరియస్ విషయం అని అర్థం. నాన్న ఒకసారి కిచెన్‌లోకి వెళ్ళిన అమ్మ వైపు, నావైపు, చెల్లె వైపు చూసి ఎందుకో కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకున్నాడు. ఆ కన్నీళ్లు ఇప్పటికీ ఎప్పటికీ నాకు అర్థం కాని మిస్టరీ. అంకుల్ అంతలా తీసుకోమని బలవంతం చేస్తున్నా నాన్నకు ఏం అడ్డం వచ్చి ఆపిందో తెలీదు.

అమ్మ నాన్నని అలానే చూస్తూ ఉంది. ఇంతకుముందు పోగొట్టుకున్న నాల్గొందల గజాల భూమి విషయం గుర్తొచ్చినట్టుంది. ఎన్నిసార్లు ఆ విషయాన్ని కథలు కథలుగా చెప్పిందో!

వెనకటికోసారీ ఇలాగే జరిగింది. నేను ఫస్ట్ క్లాస్, ఇంగ్లీష్ మీడియం చదివేటప్పటి మాట. మూడువేల రిమోట్ కార్లతో ఆడుకున్న కాలం అది. ఉగాది స్పెషల్ అంటూ బద్రి సినిమా పాటలు, సీన్లు తేజ ఛానల్‌లో ఒకటే ప్రసారం చేస్తున్నారు. అప్పటికి చెల్లెకి మూడు వారాల వయసంతే! అప్పుడూ ఇలానే నాన్న కొన్ని రోజులు ఇంట్లో ఉన్నాడు. అది టెంపరరీ సస్పెన్షన్.

నానమ్మ బతికున్నప్పుడు నాలుగువందల గజాల భూమి నాన్న పేరు మీద రాసిందట. నాన్న మాత్రం తనకున్న ఉద్యోగాన్ని, నన్ను, అమ్మని చూసుకొని ‘నాకేం తక్కువ, నాది నేను చూసుకుంటా’ అని చాలా బిల్డప్ కొట్టాడు. ఈ సంగతి అమ్మ నాకు చాలాసార్లు చెప్పింది. నానమ్మ తీసుకో తీసుకో అని చెప్పి చెప్పి కాలం చేసింది.

ఈ టెంపరరీ సస్పెన్షన్ వల్ల నాన్నకి ఆ భూమి సంగతి గుర్తొచ్చింది. కానీ అప్పటికే మా పెదనాన్న ఇంట్లో పది మంది సంతకాలు ఫోర్జరీ చేసి ఆ భూమిని అమ్ముకున్నాడన్న చావు కబురు చల్లగా తెలిసింది. నానమ్మ ఆలోచనే ఆలోచన! భవిష్యత్తులో మా నాన్న భూమిని అమ్మాలంటే తన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు సంతకాలు పెడితే తప్ప ఆ భూమి అమ్ముడుపోకుండా రాసింది. కానీ ఆమెకేం తెలుసు మా పెదనాన్న తెలివి? నాన్నమ్మ చచ్చి బతికిపోయింది.

మా నాన్నకి మబ్బులు విడిపోయాయి. పెదనాన్నతో గొడవైంది. ప్రయోజనం లేదు. నాన్నకి ఎవరూ న్యాయం చేయలేదు. నాన్న మళ్లీ కిందామీదా పడి ఉద్యోగం తెచ్చుకున్నాడు. అదంతా అప్పటి మాట! కానీ ఈసారి  ఆలా కాదు. ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు, అమ్మతో సహా!

ఇన్నాళ్లకి మళ్లీ భూమి విషయం వచ్చింది. ఇంతకు ముందు జరిగిన సంగతులు పట్టించుకోని అమ్మ నాన్న ఈ భూమి తప్పక తీసుకుంటాడనుకుంది. నాన్న మాత్రం కోర్టులో తీర్పు ఇచ్చే జడ్జిలాగా “ఉత్త ముచ్చటనే అదంతా! రెండువందల గజాలు లక్ష రూపాయిలంట. ఆ చెత్తలో, అడివిలో ఎవరుంటారు? రాజలింగం కూడా రెండు నెలలకి మళ్ల ఈడీడ్నే దిగుతాడు” అని దాటేశాడు.

అమ్మకు నాన్న ఎంత చెప్తే అంత! అమ్మ ఒక బలవంతమైన నవ్వుతో తలాడించింది. అమ్మ బాధ  పడుతుంది అని అర్థమైంది. కానీ నాన్న ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కాలేదు. భూముల ధర పెరుగుతుంది. కానీ ఆ ఏరియా ఎప్పటికీ అడివే!

‘బస్టాండ్.. బస్టాండ్’ అని కండక్టర్ అరిచాడు. ఊరొచ్చేసింది. కండక్టర్ నుంచి యాభై ఐదు రూపాయిల చిల్లర రావాలి. ఆ డబ్బుల కోసం చూస్తూ ఉంటే, “మా బామ్మర్ది ఎన్కటికి ఆడ రెండొందల గజాల భూమి లక్షకే కొన్నాడబ్బా! ఇప్పుడు దగ్గర దగ్గర రెండు, మూడు కోట్లకి పలుకుతుంది. వాళ్ళ ఏషాలు చూడాలె! అబ్బో..” అని డ్రైవర్‌తో అంటూ నా దిక్కు తిరిగాడు కండక్టర్.

“హా! ఎంతియ్యాలె? టికెట్ ఇవ్వమ్మా” అని పెన్‌తో టికెట్‌ని చింపుతూ, తన బ్యాగ్‌లో నుంచి చిల్లర తీస్తున్నాడు. “నేను ఇంకా అప్పటికి డ్యూటీకి ఎక్కలే! ఎక్కింటే కచ్చితంగా కొనేటోన్ని. హ్మ్! రాసి పెట్టుండాలి” అని ముగించాడు. నేను చిల్లర తీసుకొని బస్సు దిగి పాన్ షాప్ వైపు వెళ్ళాను.

పక్కకొచ్చి సిగరెట్ తాగుతున్నాను. 2005లో బడా కింగ్స్ తొమ్మిది రూపాయిలు. అప్పుడు నాకు అలవాటు, వయస్సు రెండూ లేవు. కానీ సిగరెట్ రేట్ తెలుసు. ఇప్పుడు అదే సిగరెట్ ఇరవై. ఇప్పుడు మా ఇంటి అద్దె తొమ్మిది వేలు. నాన్న సొంతిల్లు కొనలేదు. రాజలింగం అంకుల్ మాట విని ఆ భూమి ఎందుకు కొనలేదో నాకిప్పటికీ తెలీదు.

చాలామంది ఖర్చుల కోసం, అమ్మాయి పెళ్లిలో కట్నాల కోసం, అత్యవసరమని ఫీలయ్యే సందర్భాల్లో భూములు అమ్మేస్తుంటారు. చివరకి ఇలా కథలుగా చెప్పుకుంటారు.

*

అనుభవంలోనుంచి పుట్టిన కథే!

  • హాయ్ ఇమ్మానుయేల్! మీ గురించి చెప్పండి.

హాయ్! మాది మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం. నేను పుట్టి, పెరిగిందంతా అక్కడే! జర్నలిజంలో పీజీ చేశాను. ప్రస్తుతం సినిమారంగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాను. కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే రాశాను.

  • చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేవారా?

అంత ఎక్కువగా చదవలేదు. ఈమధ్య కాలంలోనే ఎక్కువగా చదువుతున్నాను. నేను సెలెక్టివ్ పాఠకుణ్ని. ఏదైనా కథ మొదటి ఆరు లైన్ల తర్వాత నాకు నచ్చకపోతే ఇంక ముందుకు వెళ్లను. కొన్ని కథలకు చదివించే గుణం బాగా ఉంటుంది. అవి పూర్తిగా చదువుతాను.

  • ఇది మీ తొలి కథ కదా! కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

నా వరకూ కథ అనేది Inspiration and Motivation of a Humankind. కథల ద్వారా కొత్త విషయాలు, కొత్త జీవితాలు, కొత్త దృక్పథాలు తెలుస్తాయి. నా దగ్గర చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి. అందులో ఇది మొదటి కథ. నా మిత్రుడు సాయివంశీ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ కథ రాశాను.

  • మీరు సినిమా రచన చేశాక కథారచన మొదలు పెట్టారు. రెండింటికీ ఏం తేడా గమనించారు?

నా వరకూ నాకు సినిమా స్క్రిప్ట్ రాయడం సులభంగా, కథ రాయడం కష్టంగా అనిపిస్తుంది. సినిమా స్క్రిప్ట్‌కి చాలా లెక్కలుంటాయి. మనం రాసింది రాసినట్టే తీయరు. అది సినిమాగా తయారయ్యే క్రమంలో చాలా టెక్నికల్ అంశాలు కలుస్తాయి. కథ అలా కాదు. మొత్తం బాధ్యత రచయిత మీదే ఉంటుంది. పాఠకుల్ని తన ప్రతిభతో కూచోబెట్టి కథ చెప్పాలి‌‌. ఎక్కడా బోరు కొట్టకూడదు. సినిమా స్క్రిప్ట్ రెడీమేడ్ బట్టలు కొనడమైతే, కథ రాయడం నేరుగా బట్ట కొని కుట్టించుకోవడం లాంటిది. బట్ట రంగు, నాణ్యత, మెరుపు వంటి ప్రాథమిక అంశాల నుంచే జనాన్ని ఆకట్టుకోవాలి.

  • సాహిత్య రచన ప్రభావం సినిమా రచన మీద ఉంటుందంటారా?

తప్పకుండా ఉంటుంది. అలా ఉండాలి కూడా! సాహిత్యం చదవకుండా సినిమా రచన చేస్తే అందులో చాలా విషయాలు లోపిస్తాయని నా అభిప్రాయం. మనం ఎవరి కథైతే తెర మీద చూపిస్తున్నామో, ఆ పాత్రల తాలూకు సామాజిక, ఆర్థిక అంశాలు తెలియాలంటే సాహిత్యం చదవాలి. భాష వాడకం తెలియాలంటే సాహిత్యంపై కొంతైనా అవగాహన ఉండాలి.

  • ఈ ‘రెండొందల గజాలు’ కథ మీ అనుభవమేనా?

అవును! ఇది నా అనుభవంలోనుంచి పుట్టిన కథే. ఈ మధ్య కాలంలో నా చుట్టూ ఉన్న కొందరు భూములు కొనడం, ఇళ్లు కట్టి గృహప్రవేశాలు చేయడం చూస్తున్నాను. ఆ టైంలో నా చిన్నప్పటి అనుభవం గుర్తొచ్చింది. అది నా మిత్రుడికి చెప్పాను. కథ రాయమని ప్రోత్సహించాడు. అలా ఈ కథ పుట్టింది.

  • ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?

నా బాల్యం నుంచి ఇప్పటిదాకా నేను చూసిన జీవితంలో చాలా విషయాలున్నాయి. అవన్నీ కథలవుతాయి. మెల్లగా ఒక్కొక్కటీ రాస్తాను.

*

సి.పి.ఇమ్మానుయేల్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Hello Emmanuel garu meru me jeevitham lo nundi chepina e story ni chala Baga narrate chesaru. Meeru munmundu elane me anubavalu panchukuntarani korukuntunam. E kathalo una chedhu anubavanni chala skilled ga narrate chesaru. Hope mundu mundu me katthalu cinema la marutundi ani korukuntunam. Ne jeevitha lakshyam cherukovalani ma oka korika. God bless you and your career growth.

  • తొలి కథ పొందికగా బాగుంది. నిజమే. పత్రికల్లో సాహిత్యం రాస్తే, సినిమాకు రాసేది సులభంగానే అనిపిస్తుంది. మరిన్ని కథలు రాయాలని కోరుకుంటున్నా బ్రో.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు