అపరిచితులమైనా ఆత్మీయులమే!

నిరాశా నిస్పృహలతో

ఒక వ్యక్తి కూర్చున్నాడు

ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు

కాని నిరాశా నిస్పృహల గురించి తెలుసు

అందుకే ఆ వ్యక్తి వద్దకు వచ్చాను

నేను నా చేయి చాచాను

నా చేయి పట్టుకుని అతడు

లేచి నిలబడ్డాడు

నేనెవరో అతడికి తెలియదు

నేను చేయి చాచిన సంగతి అతడికి తెలుసు

మేమిద్దరమూ కలిసి నడిచాము

మా ఇద్దరిలో ఒకరి గురించి మరొకరికి తెలియదు

కలిసి నడవడం మాత్రం మాకు తెలుసు

ప్రముఖ కవి వినోద్ కుమార్ శుక్లా రాసిన ఈ కవిత నాకీ మధ్య చెవుల్లో  గింగురుమంటోంది. చెట్ల నుంచి రాలుతున్న ఆకులు, కాళ్ల క్రింద నలిగిపోతున్న నేల, రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటున్న వ్యక్తి మాటలు, రెడ్ లైట్ వద్ద పరుగెత్తుకుంటూ వచ్చి చప్పట్లు కొట్టుకుంటూ అడుక్కుంటున్న హిజ్రాలు, ఎన్నో మైళ్ల నుంచి సైకిల్ తొక్కుతూ ఏదో చిరుద్యోగం కోసం వస్తున్న అభాగ్యులు నన్నే పలకరిస్తున్నారేమో అనిపిస్తోంది. ఎక్కడెక్కడో చిందుతున్న రక్తం నాలో ప్రవహిస్తున్నట్లుంది. ఎవరెవరో పాదాల అడుగుల్లో నా పదధ్వనులు వినిపిస్తున్నాయి.

అపరిచితులు కూడా

నా బంధువులే

వారెవరో నాకు తెలియదు

కాని వారు నాకు ఆత్మీయులు

నాకెవరెవరు తెలియదో కూడా

నాకు తెలియదు

అంతరూ ఆత్మీయులే

నాకు మనుషులే తెలుసు..

అన్న శుక్లా నాకు ఎందరో అపరిచితుల్ని గుర్తు చేస్తున్నాడు. జంతర్ మంతర్ వద్ద నడుచుకుంటూ వెళుతుంటే నినదిస్తున్న వారెవరో తెలియదు.కాని గొంతులు ఎక్కడో విన్నట్లున్నాయి. రాంలీలా మైదాన్ వేదికపై మాట్లాడుతూ “రాజ్యాంగాన్ని కాపాడడానికి సమయం ఎక్కువగా లేదు.”అని ప్రసంగిస్తున్న భయభ్రాంత నేతల్ని రోజూ చూస్తూనే ఉన్నాను. వారెవరూ నాకు వ్యక్తిగతంగా పరిచితులు కారు. ఒకప్పుడు ఉద్యమకారులు పిడికిళ్లు బిగిస్తూ పోలీసువ్యానుల్లోకి ఎక్కేవారు.ఇప్పుడు రాజకీయనాయకులు కూడా పిడికిళ్లు బిగిస్తున్నారు.

ఎందుకో  నాకు జర్మనీ కవి మార్టిన్ నీమోల్లర్  గుర్తుకు వచ్చాడు. పిల్లల డాక్టర్, సాధుస్వభావి డాక్టర్ రామనాథంను హత్య చేసినప్పుడు వేసిన పోస్టర్లలో ఆయన కవిత్వాన్ని ప్రచురించారు.

“వారు కమ్యూనిస్టుల కోసంవచ్చినప్పుడు నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను కమ్యూనిస్టును కాదు. వారు సోషలిస్టుల కోసం వచ్చినప్పుడు నేను మాట్లాడలేదు.ఎందుకంటే నేను సోషలిస్టునుకాదు..”అని కొనసాగే ఈ కవిత చివరకు

“వారు నా కొరకు వచ్చారు. కాని నా కోసం మాట్లాడేందుకు ఇప్పుడెవరూ మిగల్లేదు” అన్న వాక్యాలతో ముగుస్తుంది. ప్రస్తుతం దేశంలో  ప్రతిపక్షాల పరిస్థితీ అదే విధంగా ఉన్నది. తమను రక్షించమని వారు సామాన్యుడిని వేడుకుంటున్నారు.

కాని సామాన్యుడి కోసం ఎవరు గొంతెత్తారు..ఎన్ని వేలమంది ఆదివాసీలు ఇవాళ ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైళ్లలో మ్రగ్గుతున్నారు.. ఎవరు మాట్లాడారు వారికోసం.. ఎందుకు నగరాలు వారిని వెలివేశాయి? వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి?

అడవిలో వారి చంద్రుడు అనాగరికుడు కదా

పున్నమి వెన్నెల కాంతిలో

ఈ సారి ఆదివాసీలు

గుమిగూడేందుకు

భయపడ్డారు..

చెట్ల చీకట్లలో దాక్కున్నారు..

హంతక నగరం

నాగరిక విద్యుత్ కాంతుల్లో

వెలిగిపోవడం చూసి

బాధపడ్డారు..

అని వినోద్ కుమార్ శుక్లా  రాసిన వాక్యాల అంతరార్థమేమిటి?

ఆదివాసీలే కాదు.ఇవాళ ప్రతి ఒక్కరూ తమ నేల తమదేనా? అని ప్రశ్నించుకుంటున్నారు.దేశ భక్తుడుగా నన్ను నేను నిరూపించుకోవాల్సిన సమయం  కూడా ఆసన్నమైంది. నాకు నేను అపరిచితుడుగా మారుతున్నానా? నేను అసలు ఈ దేశవాసినా?లేక చొరబాటుదారునా? వినోద్ కుమార్ శుక్లా అన్నట్లు ఎందుకో దేశం చొరబాటుదారుల దేశంలా కనిపిస్తోంది.

ఇంటినుంచి బయటకు వెళ్లాలన్న

హడావిడిలో ఎంతో దూరం వచ్చానంటే

అంతటా చొరబాటుదారులున్నారని

చెబుతున్నారు

చొరబాటుదారుల దేశం!

 

నేను మారిపోయానో లేదో

అని నా ముఖం నా వైపుకు చూస్తోంది

నేను తెలివిగా నా  ముఖాన్ని ఫోటో తీసుకున్నాను

నేను మరొకడినని  భావించినా

గుర్తించాలి కదా మరి!

కూరగాయల మార్కెట్ లో

నిలుచుని

నన్ను విద్రోహిగా ముద్ర వేయకుండా ఉండాలంటే

ఏఏ కూరగాయలు కొనగూడదో

ఆలోచిస్తున్నా..

నేనెప్పుడూ వెళ్లిపోతూ కనిపిస్తాను

నా వీపును నేను ఎంతో బాగా గుర్తిస్తాను.

ఇవాళ చొరబాటుదారులంతా సమూహంగా కాకపోతే ఒక్కొక్కర్నీ విడదీసి ఊచకోత కోస్తారేమో..ఇవాళ పాదాలు సమూహంగా నడవకపోతే వాటిని నరికివేస్తారేమో అని భయంవేస్తోంది.

నేను నా స్వంత పాదాలతో

నడవడంలేదు

ప్రతి ఒక్కరి పాదాలతో

నడుస్తున్నాను

ప్రతి ఒక్కరి కళ్లతో చూస్తున్నాను

నేను నిద్ర లేచినప్పుడు

అందరి నిద్రలోంచి

మేలుకుంటున్నాను

నేను నిద్రిస్తున్నప్పుడు

అందరి కనురెప్పల క్రింద

నిద్రిస్తున్నాను

నేను ఒక పెద్ద సమూహాన్ని

అందరిలో నేను ప్రతి ఒక్కరిని

నా కోసం వెతుకుతూ వెళ్లకు

నన్ను కనిపెడితే

అందర్ని కనిపెట్టాకే

నేను కనపడతాను

బహుశా నన్ను కనిపెట్టలేవేమో

నా బదులు నీవు చూసిన

తొలి వ్యక్తిని కలుసుకుంటే చాలు

నన్నుకలుసుకున్నట్లే.

ఛత్తీస్ ఘడ్ లోని రాయపూర్ లో నివసిస్తున్న వినోద్ కుమార్ శుక్లా కొన్ని దశాబ్దాలుగా తనను  సమూహ గర్జనలో తొక్కివేయకుండా కాపాడుకునేందుకు మౌనం పాటిస్తున్నారు.  “ ప్రజల ఊరేగింపులో మాట్లాడాలా, లేదా మాట్లాడుతూ  మౌనం పాటించాలా” అన్న మీమాంస అతడిని పట్టి పీడిస్తోంది.

ఇవాళ వ్యక్తి మౌనం సమూహ మౌనమే. సమూహ గర్జన వ్యక్తి గర్జనే. అందరు ఒకరికొకరు అపరిచితులైనా ఆత్మీయులే !

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “ఛత్తీస్ ఘడ్ లోని రాయపూర్ లో నివసిస్తున్న వినోద్ కుమార్ శుక్లా కొన్ని దశాబ్దాలుగా తనను సమూహ గర్జనలో తొక్కివేయకుండా కాపాడుకునేందుకు మౌనం పాటిస్తున్నారు. “ ప్రజల ఊరేగింపులో మాట్లాడాలా, లేదా మాట్లాడుతూ మౌనం పాటించాలా” అన్న మీమాంస అతడిని పట్టి పీడిస్తోంది.

    ఇవాళ వ్యక్తి మౌనం సమూహ మౌనమే. సమూహ గర్జన వ్యక్తి గర్జనే. అందరు ఒకరికొకరు అపరిచితులైనా ఆత్మీయులే !”

    “కాని సామాన్యుడి కోసం ఎవరు గొంతెత్తారు..ఎన్ని వేలమంది ఆదివాసీలు ఇవాళ ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైళ్లలో మ్రగ్గుతున్నారు.. ఎవరు మాట్లాడారు వారికోసం.. ఎందుకు నగరాలు వారిని వెలివేశాయి? వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి?”

    చాలా బాగా పరిచయం చెసారు కృష్ణుడు గారూ.

    “ఆదివాసీలే కాదు.ఇవాళ ప్రతి ఒక్కరూ తమ నేల తమదేనా? అని ప్రశ్నించుకుంటున్నారు.దేశ భక్తుడుగా నన్ను నేను నిరూపించుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. నాకు నేను అపరిచితుడుగా మారుతున్నానా? నేను అసలు ఈ దేశవాసినా?లేక చొరబాటుదారునా? వినోద్ కుమార్ శుక్లా అన్నట్లు ఎందుకో దేశం చొరబాటుదారుల దేశంలా కనిపిస్తోంది”

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు