అతి నవీన మామూలు కథకుడు

రేష్ కథలు కూడా రాస్తాడు. నిశ్శబ్ద పేరుతో తెచ్చిన కవిత్వమూ, లేదా అత్యంత పదునైన అతని సోషల్ మీడియా పోస్టులతో బాటు వైవిధ్యమైన కథలు కూడా రాస్తాడని ‘పేరు లేను వెన్నెల’ కథల పుస్తకం నిరూపించింది. సృజనకారుడిగా నరేష్ ఏ ఒక్కరి లాంటివాడూ కాదు. వింత ఆకర్షణ ఉన్న వ్యక్తి. అతనిదొక పంథా. కొంత విచిత్రమైన స్వభావం కలిగిన వాడు. కనుకనే అతని రచనల్లోనూ ఆ విభిన్నత కు బోలెడంత ఆస్కారం ఉంటుంది. మనకి ఎదో చురుక్కుమంటుంది.

ఇది తొమ్మిదో పదో కథలున్న చిన్న పుస్తకం. కానీ ఇది కలిగించే భావసంచలనం చాలా పెద్దది. కథల నేపథ్యమూ, పాత్రల ప్రవర్తన, వాటి మాటలు– వీటన్నింటి మధ్యా కథ ముందుకు నడిచే తీరు మనకొక కొత్త అనుభవాన్నైతే కలిగిస్తాయి. అంతేనా ? ఏ రచయితైనా ‘కొత్త’ అనిపిస్తే చాలా ? అప్పటిదాకా మనమున్న మానసిక ప్రపంచాన్ని ఒక్క కుదుపుకు గురిచేసి ‘అమ్మో ఇదేంటి. ఇలా రాశాడేమిటీ’ అనిపిస్తే సరిపోతుందా ? నేను అవునూ కాదూ అనే రెండింటిలో ఎదో ఒక వేలు పట్టుకోలేకపోయాను. బొమ్మా బొరుసా అంటే తేల్చుకోలేకపోయాను. సాహిత్య కాలం గురవుతున్న పరిణామ విపరిణామ క్రమాల కూడలిలో నిలబడి తన గొంతు విప్పుతున్న వాడు నరేష్. ఒక్కో కథా ఒక్కో ఊహాతీత రహస్య పేటిక తెరుస్తున్న స్థితికి గురిచేస్తాడు.

‘ఆలాపన’ అని ఒక కథ ఉంది. సాంత్వనకీ ప్రేమకీ తేడా ఏమిటీ ? ఆ రెండింటికీ సెక్స్ కీ ఉన్న సంబంధమేమిటి ? వైవాహిక జీవితం అంటే అవన్నీ కలిపి చేసిన చక్కటి ‘ప్యాకేజీనా’ ? ఇలా సాగుతాయి సంభాషణలు. స్త్రీపురుష సంబంధాల పట్ల ఈ రచయిత మనకేం అభిప్రాయం కలిగించదలుచుకున్నాడూ అన్న ఒత్తిడికి గురవుతాం. ఈ పరిస్తితి గతంలో చాలా మంది రచయితలు కలిగించినదే. చలమో, కోకునో, బుచ్చిబాబో ఇంకొకరో, ప్రతీ రచయితా ఆ సంఘర్షణే చిత్రిస్తాడు. నచ్చినట్టు వయిలిన్ వాయించే వ్యక్తి కోసం తన మనోశరీర ధర్మాలని చాలా ఇష్టంగా ధారపోసే ‘రాగ’ అనే వేశ్యతో రచయిత మాట్లాడే మాటల్ని ఈ కథలో చదివితీరాలి. ఆమెని ఉమర్ఖయాం రుబాయీలతో, రెడ్ స్టార్ ఓవర్ చైనాతో పోల్చడం మనం జీర్ణం చేసుకునేందుకు సమయం పడుతుంది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన శృంగార సన్నివేశ ఘట్టం కోసం రచయిత ప్రదర్శించిన సంగీత పరిజ్ఞానం విస్మయపరుస్తుంది. మూలంలో నరేష్ కవి కదా ? దాని ప్రభావం అన్ని కథల్లోనూ కనబడుతుంది.

ఇంకొక కథ కల. శింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో పొలం పోగొట్టుకుంటున్నప్పటి యాతన చిత్రించిన కథ. ఆ పొలం కోసం ప్రాణాలు పణం పెట్టే రైతుల కోసం వచ్చిన అన్నల కథ. మనకి ఇందులో రాఘవ అన్న పాత్ర నరేషేనా అనిపిస్తుంది. ఒత్తిడిమయ ఉద్యోగ ప్రపంచంలో బతికే సగటు మనుషుల్ని అచీవర్స్ గా కాకుండా ‘కెరీర్ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న’ వాళ్ళుగా చూసే పాత్ర రాఘవది. అందరూ ‘యాక్టివిస్ట్’ మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలంటుందీ పాత్ర. సామాజిక సేవా తత్వం ఉన్న పాత్ర. సమాజమూ కుటుంబమూ వ్యవసాయమూ లాంటివెంత ప్రభావవంతమైనవో తెలిపే కథ. ఇంత గొప్ప భావనలున్న కథానాయకుడిలో ఆత్మహత్య చేసుకోవాలనిపించే లక్షణం ఏమిటి ? ఈ కథాంశ చర్చలోకి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎందుకు వస్తాడు ?  పాత్ర చిత్రణల్లో అమితమైన ప్రతిభ ఎంత కనబడుతుందో అంత సంక్లిష్టత కూడా ఉంది. ఒక జంఝాటం. ఊగిసలాట. నిర్వ్యాపకత్వం. ఎవరిమీదమో ఒకరకమైన కసి కోపం. నిస్సహాయతా, నివురుగప్పిన నిప్పు వంటి అసహ్యం. మనం ఆరోగ్యవంతమైన కథా వాతావరణంలోనే ఉన్నామా లేమా ? మంచి కథల్నే చదువుతున్నామా లేదా ? నరేష్ మీద అప్పటికే మనకి ఉన్న ఒక రకమైన అభిమానం ఈ కథల్నీ ‘భలే ఉన్నాయనిపిస్తున్నాయా’ ? ఇలా మనల్ని ఇబ్బందిపెట్టే కథలివి. ఇవి కొత్త మనోవైజ్ఞానిక ప్రదేశాలకు మనల్ని తీసుకెళ్ళే కథలు. ఇందులోని విపరీత ప్రవర్తనలు తప్పా ఒప్పా అన్న బేరీజు చాలా నిష్ప్రయోజనమైన పని. రావిశాస్త్రి అల్పజీవో, బుచ్చిబాబు ఇంకొక కథో, ఇంకొకరి ఇంకొక పాత్రో ఎప్పుడూ వ్యక్తావ్యక్తాలకి (Conscious- Subconscious) మధ్య  ఒక పెనుగులాటకి గురైన మనస్తత్వాలెన్నో ఉంటాయి. నరేష్ పాత్రలూ అంతే. ఇవి ఏ ‘కాంప్లెక్స్’ కి గురవుతున్నాయంటే మనం చాలా మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల సహాయం తీసుకోవల్సి ఉంటుంది. ఇదంతా కొద్దిగా పెద్ద వ్యవహారమే.

నరేష్ రాసిన కథలన్నీ అలానే ఉన్నాయి. హాయిగా ఏమాత్రమూ లేవు. చదివాక ఒక చిర్నవ్వు పులుముకోలేము. అలా అని గంభీరమైన విషాద నైరాశ్యాలకీ తావు లేదు. ఒక అసంబద్ద అనునయానికి లోనవడం మనకి తెలుస్తోందో లేదో కూడా తేలడం కష్టం. సాజిదా అలియాస్ సల్మా చక్కటి (?) ప్రేమ కథ. హిందూ ముస్లిం ప్రేమ కథ. బురఖాలోంచి కనిపించే అందమైన సాజిదా కళ్ళవంటి కథ. తొలిప్రేమ గొప్పదనాన్ని చెప్పే కథ. ఒక ఫోటోగ్రాఫర్ తను చేజార్చుకున్న చిన్ననాటి ప్రేయసిని మరొక వ్యక్తిలో చూసుకున్నప్పటి నిజమైన ‘చాంచల్యం’ ప్రదర్శితమైన కథ. కథానాయుకుడిది స్తితప్రజ్ఞత అనుకుంటాం కానీ కాదు. అక్కడక్కడా ‘సరూపరాణి హాండ్ ఇచ్చాక ఊళ్ళోనే మరో అమ్మాయిని చేసుకుని’ లాంటి వాక్యాలు పనికింద రాళ్ళలా తగిలినా ఈ కథ అద్భుతంగా సాగుతుంది.

ఈ హేండ్ ఇవ్వడం, ఫకింగ్ బుల్షిట్ లాంటి పద ప్రయోగాలు ఆధునికత తెలియజేస్తాయనుకుంటే పొరబాటే. అయితే ఎన్ని రకాలుగా రాసినా అన్ని విధాలుగా ఈ ప్రేమ కథలెప్పుడూ ఇంత ఎందుకు నచ్చుతాయో ఎవరికన్నా తెలుసా ? తెలిస్తే వినాలని ఉంటుంది. నరేష్ లో అంత గొప్ప ప్రేమాస్పదమైన మెత్తటి హృదయం ఉంది. ఆ హృదయానికి ఎదురెళుతున్న మెదడూ ఉంది. ఈ రెండింటి సౌకుమార్యం పై ఆధునిక జీవనావసరాలను అధిగమించలేని వాస్తవిక విషమ పరిస్తితుల ప్రభావం ఉంది. మనుషుల మధ్య భౌతిక దూరం ప్రేమ మీద ప్రభావం చూపిస్తుందని రాసిన రచయిత ‘ప్రేమలో పూర్తిస్థాయిని చేరుకోవడానికి సెక్స్ కచ్చితమైన అవసరంగా మారి ఉంటుందా.

ప్రేమకీ సెక్స్ కీ తేడా ఉంటుందనీ ప్రేమంటే గొప్పదనీ, సెక్స్ చెత్త అని చెప్పే / నమ్మే వాళ్ళ మీద జాలేసింది’ (ఒక ముక్కోణపు ప్రేమ కథ) లాంటి వాక్యాలు రాయడం శుద్ద అనవసరం. అతని కథాగమనాన్ని ఇలాంటివి పక్కదారి పట్టిస్తాయి. ఇవే కాదు ఈ కథల్లో సిగరెట్లు, మందు, శరీర భాష వినియోగించడానికి తెలియని ఉత్సాహం ప్రదర్శితమయ్యింది. భౌతికంగా ఇవి చెప్పదలుచుకున్న అరాచకత్వం అంతర్గతంగా చెప్పిన సున్నితమైన విషయాల్లో, మాటల్లో కనబడదు. ఆ ఒరిజినాలిటీ గల వ్యక్తిత్వం వలన ఈ కథలు గాలికి కొట్టుకుపోకుండా నిలబడతాయి. ఒక ముక్కోణపు ప్రేమ కథ నిడివిలో చాలా పేద్ద కథ. చెప్పింది మాత్రం చాలా తక్కువ. బ్రివెటీ సాధించిన అద్భుతం ‘రహస్యం’ అనే కథ. టైటిల్ కథ నడిపిన తీరు మెచ్చుకోదగ్గది.

నరేష్ ఎందుకు బాగా నచ్చుతాడు నాకు అనే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వేసుకుంటాను. అప్పుడు అతని దృక్పథ స్పష్టత కనిపిస్తుంది నాకు. సామాజిక విషయాల పట్ల అతని చింతన వచనంలో కనిపించినంత కాంతివంతంగా ఇతర ప్రక్రియల్లో వెతకబుద్ది కాదు. కథలో అతన్ని మరుగున పెట్టే కృత్రిమత్వం కొంత ఉంది. అతడు రాతల్లో చూపే బాధ్యతకి వ్యాసమే గొప్ప ఉదాహరణ. కథే ఈ రచయితను చాలా చాకచక్యంగా లొంగ దీసుకుంటుంది. నిర్మాణపరంగా కథకుండే సౌందర్యం అది. అయినా సరే నరేష్ ఏం రాసినా చదవకుండా ఉండగలగడం కష్టం. ఎందుకంటే అతని శైలి ఎంత సమ్మోహనమో కథా వస్తువులంత నవీనమైనవి. నరేష్ అతి నవీన మామూలు కథకుడు. పేరు కనబడదు గానీ అతని కథలన్నీ అతగాని కథలే !

పేరులేని వెన్నెల (కథలు) రచన : నరేష్ కుమార్ సూఫీ, పేజీలు: 135, వెల : రూ. 150, ప్రతులకు: ఛాయ ప్రచురణలు, 7093165151

*

 

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అతని కథల గురించి నాకైతే తెలీదు. కవిత్వాన్ని, కధల్నీ శరవేగంతో చదివీ, సమీక్షించి రసం పిండి తాగమని వొంపేస్తుంటాడీ శ్రీరామ్ పుప్పాల. ఇతన్ని పట్టుకోవాలంటే ఇదొక్కటే దారి. ఇతనికింకో శ్వాస లేదు. ధ్యాస లేదు. కవిత్వాన్ని,కవుల్నీ ప్రేమించడం మినహా. ఇతను సమీక్షించిన పుస్తకమేదైనా ఆగమేఘాల మీద కొనుక్కొచ్చి చదవవలసిందే

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు