నా చిత్రాలన్నీ నా లోపలి కలలే!

బొమ్మలు వేయడంలో ఉన్న సంతృప్తి, సంతోషం ఇంకే పని చేయడంలో  ఉండదు. అసలు వాటి కోసమే బొమ్మలు వేస్తాను కావచ్చు.

లభై వేల ఏళ్ళ క్రితంనాటి ఆస్ట్రేలియన్ అబార్జినల్ ఆర్ట్ ను తెలుగుదనానికి అన్వయించి వందలాది చిత్రాలు గీస్తున్న చిత్రకారుడు అన్నవరం శ్రీనివాస్. తెలంగాణలోని పూర్వ కరీంనగర్ జిల్లా కు చెందిన శ్రీనివాస్ మూడు దశాబ్దాలుగా చిత్రకళా రంగంలో వేలాది పెయింటింగ్సే కాకుండా కొన్ని వందల పుస్తకాలకు ముఖ చిత్రాలను వేశారు. తెలంగాణ ఉద్యమాన్ని చార్ కోల్ ద్వారా చిత్రిక పట్టారు. ఆయనకు మార్చి 28 2024 రోజున హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చిత్రలేఖన విభాగంలో ప్రతిభా పురస్కారం అందజేసింది. ఈ సందర్భంలో చిత్రకారుడైన అన్నవరం శ్రీనివాస్ తో ప్రముఖ కవి రచయిత బూర్ల వెంకటేశ్వర్లు సంభాషణ.

చిన్నతనంలో మీరు ఇతర పిల్లలకి భిన్నంగా ఉండేవారా?

చిన్నతనంలో ఎక్కువగా ఊహాలోకాల్లో ఎందుకు, ఏమిటి, ఎలా? లాంటి ప్రశ్నలు వస్తుండేవి. సైన్స్ ఆసక్తిగా ఉండేది. చేతివృత్తుల వారి పనులను, నైపుణ్యాన్ని అదే పనిగా గమనించేవాన్ని. ప్రకృతిని ఆస్వాదించేవాన్ని.

బొమ్మలు గీయాలని మొట్టమొదటిసారి ఎందుకు అనిపించింది?

నిజానికి నాకు తెలియకుండానే బొమ్మల ప్రపంచంలోకి ప్రవేశించాను. మా నాన్న టీచర్. అలాగే సైన్ బోర్డ్స్ రాస్తుండేవారు. ఆయిల్ కలర్స్‌తో సైన్ బోర్డులు రాసిన తర్వాత వాటికి కిరోసిన్‌లో కడగాలి. ఆ క్రమంలో కిరోసిన్ లో ముంచి మిగిలిన రంగులతో డోర్ల వెనకాల, స్టూల్స్ పైన, బోర్డ్ వెనుక వైపు చెట్టు, ఏనుగు, చేప, పక్షి లాంటి బొమ్మలు వేసేవాడు. నేను కూడా అలానే చేసేవాన్ని. బ్రష్ పట్టుకోవడం, తిప్పడం చేసేవాన్ని, ఆ రంగులను గమనించేవాన్ని. కలర్స్ ఒకటిగా ఉన్నప్పుడు ఒక రకంగా, వేరే రంగులతో ఉన్నప్పుడు మరో విధంగా కనిపించేవి. అలా రంగుల ప్రవర్తన నాకు ఆసక్తిని పెంచింది. అప్పుడు నా వయసు 6-7 సంవత్సరాలుండేది. అలా బొమ్మలు గీయడం క్రమక్రమంగా అలవాటు అయింది. బచ్చలి పండ్లతో, బొగ్గుతో గోడలపై బొమ్మలు వేసేవాన్ని. నోట్ పుస్తకాలను చిత్రాలతో నింపేవాన్ని. అది నాకు ప్రోత్సాహకంగా ఉండేది.

ఈ బొమ్మలు గీయడం మీకు తృప్తినిస్తుందా? మిమ్మల్ని సంతోష పెడుతుందా?

బొమ్మలు వేయడంలో ఉన్న సంతృప్తి, సంతోషం ఇంకే పని చేయడంలో  ఉండదు. అసలు వాటి కోసమే బొమ్మలు వేస్తాను కావచ్చు. చిత్రం వేస్తున్నంత సేపు ఆ ప్రాసెస్ సంతోషాన్నిస్తుంది. బొమ్మ దించిన తర్వాత సంతృప్తి ఉంటుంది. వ్యాయామం చేసిన తర్వాత శరీరం ఎలా రిలాక్స్ అవుతుందో చిత్రం వేసిన తర్వాత కూడా మనసు అలా రిలాక్స్ అవుతుంది. ఆ రోజు పరిపూర్ణం అయింది అనిపిస్తుంది.

మీ కళాతృష్ణను మీ కుటుంబం అర్థం చేసుకుందా?

మా తాత, బాపమ్మ చేతి వృత్తులు చేసేవారు. పెళ్లిల్లకు ఐరేని కుండలపై చిత్రాలు వేసేవారు. మా నాన్న ఆర్టిస్ట్, అన్నయ్య అన్నవరం దేవేందర్, ప్రముఖ కవి, అక్కయ్య అన్నవరం సుజాత, ప్రముఖ కవయిత్రి. అలా మా కుటుంబం సృజనకారులతో ఉంది. ఇంకో అక్కయ్య మనిమాల ఇలా అందరి  ప్రోత్సాహంతో బొమ్మలు వేసేవాన్ని. ఇప్పుడు నా భార్య కవిత, పిల్లలు నిహార్ నిశాంత్ లు నా చిత్రాలకు అభిమానులు. మా అమ్మ నా చిత్రాలు చూసినప్పుడు ఎనలేని ఆనందాన్ని పొందుతుంది.

చిత్రకారుడిగా మీ మొదటి విజయం ఏది?

2004లో ప్రముఖ కథా రచయిత తుమ్మేటి రఘోత్తమ రెడ్డి కోరిక మేరకు 70 ఏండ్ల క్రితం తెలంగాణలో ఒక ఉన్నత వర్గాల కుటుంబంలో జరిగే పెళ్లి ఊరేగింపు దృశ్యాన్ని చిత్రించాను. అప్పటి సమాజంలో ఒక పెళ్లిలో అన్ని కులాల వారి పాత్ర ఉండేది. అవన్ని నా బాల్యంలో గమనించిన దృశ్యాలే. మా ఊరి ప్రజలు, ఇండ్లను ఊహిస్తూ గీచినవి. 5×2 సైజ్ లో వేసిన ఈ చిత్రానికి చాలా గుర్తింపు వచ్చింది.

మీ మీద ఏ ఏ కళాకారుల ప్రభావం ఉంది?

పికాసో, విస్సెంట్ వాంఘా, మటీస్, ఎడ్వర్డ్ మంక్, పాల్ గాగిన్, గస్టవ్ క్లియ్ట్, మానే, మార్ చగల్, పాల్ క్లీ, మార్క్ రోత్కో మొదలైన ప్రపంచ చిత్రకారుల చిత్రాలు స్ఫూర్తినిస్తాయి.

చిత్రకళపై మీకు ఒక సమగ్ర దృక్పథం ఎప్పుడు ఏర్పడింది?

కళపై లోతైన అవగాహన కలిగి ఉండటం, కళాత్మక వ్యక్తీకరణలను అభినందించడం, చిత్రకళా చరిత్రను అధ్యయనం చేయడం, అందులో చరిత్రలో ఆది మానవుని నుండి అధునిక మానవుని వరకు వివిధ కాలాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, సాంస్కృతిక అంశాలు, వందల ఏళ్లలో వచ్చిన శైలులు, ఆయా కాలాల్లో చిత్రకారులు ఉపయోగించిన రంగులు, వేసిన పద్దతులు, చిత్రకళ తాత్వికతను అర్థం చేసుకోవడం వల్ల, నిరంతరం సమకాలీన చిత్రకళా పోకడలను గమనించడం వల్ల ఒక సమగ్ర దృక్పథం ఏర్పడుతుందని నేను అనుకుంటున్న.

దీని కోసం నేను చిత్రకళకు సంబంధించిన సమాచారాన్ని పుస్తకాల రూపంలో మీడియాలో లభించే సమాచారాన్ని అధ్యయనం చేయడం, ఆర్ట్ గ్యాలరీలు, మ్యూజియంల సందర్శించడం, చిత్రకారులను కలవడం, మనం వేసిన చిత్రాలను ప్రదర్శించడం, కళా విమర్శకుల ప్రతిస్పందన తెలుసుకోవడం జరుగుతోంది.

చిత్రాన్ని చూసినప్పుడు అందులోని సౌందర్యాత్మకతతో, సృజనాత్మకత, దాని వెనక ఉన్న తాత్వికతను , చిత్రం వేయడంలో ఉపయోగించిన పద్దతులు, ఉపయోగించిన రంగులు వంటి అనేక అంశాలును లోతుగా గ్రహించాలి. ఇది నేను గత 12 ఏళ్లుగా చేస్తున్న విధానం.

సమాజంలో కళాకారులు ఏ రకంగా భిన్నమైన వారు?

సమాజంలో కళాకారులు వారి కళల ద్వారా భావాలను వ్యక్తీకరిస్తారు. ఆలోచనలను రేకెత్తిస్తారు. మార్పును ప్రేరేపిస్తారు. సంస్కృతులను సుసంపన్నం చేస్తారు. కళాకారులు ఆయా కాలాల్లో సమాజం యొక్క విలువలను వారి ఆకాంక్షలను, పోరాటాలను ప్రతిబింబించే దర్పణాల లాంటివారు. సామాజిక పరిణామానికి విత్తనాలలాంటివారు. కళాకారుల కృషి, సృజనాత్మకతను, వైవిద్యాన్ని, అభ్యున్నతిని సుసంపన్నం చేస్తాయి. కళలు లేని సమాజం నిస్తేజమైనది.

మీరు పరిణతి చెందిన కాలం ఏది ?అది ఎలా జరిగింది.?

నేను పుట్టి పెరిగిన ప్రాంతమైన తెలంగాణ, ప్రజల సంస్కృతి ఆకాంక్షలు ప్రతిబింబించే చిత్రాలు వేస్తున్న క్రమంలో 2008లో ప్రఖ్యాత ఫిలిం మేకర్ బి. నర్సింగరావు గారు పరిచయం అయ్యారు. ఆయన నా చిత్రాలన్నీ పరిశీలించారు. నాటి నుంచి నేటి వరకు కళలకు సంబంధించిన విషయాలు ఎన్నింటినో నాతో చర్చిస్తూనే ఉంటారు. పద్దతులు, ప్రాముఖ్యత లాంటి అంశాలు నాకు బోధపడ్డాయి.

చిత్రకళలో ఏది ఆర్ట్, ఏది నాన్ ఆర్ట్ అనే విషయం ఇప్పటికీ సాధారణంగా చాలామందికి తెలియదు. చాలా నైపుణ్యం అనుభవం ఉన్నవారు మాత్రమే గుర్తించగలరు. ఇలాంటి విషయాలన్ని వీరి సంభాషణల్లో నాకు అవగతమైంది. నర్సింగరావు గారు నేను వేసే చిత్రాలన్ని ఎప్పటికప్పుడు చూసి అవసరమైన సలహాలు ఇస్తు ఉంటారు. వారితో పరిచయమైన తర్వాతి కాలాన్ని పరిణితి చెందిన కాలంగా చెప్పుకోవచ్చు.

ఏది చిత్రించాలి, ఏది చిత్రించకూడదు అని ఎలా నిర్ణయించుకుంటారు?

నా చిత్రాలు నా అంతర్గత భావాలు, నా ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలు, విలువలు, బాల్యస్మృతులను వ్యక్తం చేసేవిగా ఉంటాయి.  వాటికి విభిన్నమైనవి నా చిత్రాల్లో తక్కువ.  అవి figurative కావచ్చు, abstract గా కావచ్చు.

కళాకారుడుగా మీరు కనే కళలు ఏవి?

అందుకు కళాకారుల లాగే – ఇంకా విస్తృతంగా  చిత్రాలు వేయాలి.  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో, చిత్రాలకు ఆదరణ లభించాలి, భారతీయ సమాజంలో కళల పట్ల ఇంకా అవగాహన రావాలి, వాటిని ఆదరించాలి, ప్రోత్సహించాలి.

కళాకారుడుగా మీ ఎదుగుదల మీకు సంతృప్తిని ఇచ్చిందా?

ఒక చిత్రకారునిగా ఉండడం చాలా సంతోషంగా ఉంది.  ఎందుకంటే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే విధానం ఇతరులకంటే భిన్నంగా ఉంటుంది.  ప్రతి వస్తువులో సౌందర్యాత్మకతను చూడగలను.  ఇంద్రధనుస్సు, సీతాకోకచిలుక, నెమలి పింఛం నుండి గోడకు ఏర్పడ్డ మరకల్లో, మబ్బుల్లో, నీటి అలల పైన, చెట్టు బెరడు పైన ఉన్న ఆకృతులు కూడా అందంగా ఉంటాయి.  ఇక కళాకారునిగా ఎదుగుదల ఆకాశమే హద్దు లాంటిది.  ఒక దగ్గర సంతృప్తి పడితే ఒక సృజనాత్మకత ఆగిపోతుంది.  చిత్రకళ ఒక నది లాంటిది.  ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉండాలి.

భారతదేశంలో తెలంగాణ చిత్రకళా రంగ స్థాయి, స్థానం ఎలా ఉంది?

తెలంగాణాలో పూర్వకాలం నుండి చిత్రకళకు మంచి స్థానం ఉంది.  నిర్మల్ పేయింటింగ్ 14వ శతాబ్దం నుండి, నకాశీ చిత్రకళ (చేర్యాల్ పట చిత్రకళ) కూడా ఎంతో ప్రాచూర్యంలో ఉంది.  ఆధునిక భారతీయ చిత్రకళలో తెలంగాణా చిత్రకారులకు ప్రత్యేక స్థానం ఉంది.  ఇక్కడి నుండి చాలా మంది చిత్రకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవారు ఉన్నారు.  ఇక్కడి నుండి వచ్చే చిత్రాలలో తెలంగాణాతనం కనిపిస్తుంది.  హైదరాబాద్‌లో మ్యూజియాల నిర్వహణ, గ్యాలరీల ప్రదర్శనలు, ఫైన్ ఆర్ట్స్ కళాశాలలు బాగానే ఉన్నాయి.  ఇంకా చిత్రకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.  పాఠశాల స్థాయి నుండే కళలు, చిత్రలేఖనంలో శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉంది.

*

బూర్ల వెంకటేశ్వర్లు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు