వణికే నీ రెండు చేతులు

ఎంతో మోసి ఉన్నాయి కాబట్టి, మరి

నీ చేతులు ఇప్పుడిలా,

ఖాళీగా, ఖాళీ గూళ్ళలా పీలికలై –

 

గుర్తుంది నాకు, నీ అరచేతులు మరిక

నా ముఖాన్ని పొదివి

పుచ్చుకుని, ముద్దాడి నవ్వినప్పుడు!

 

వానలో, మసక కాంతిలో, చిరుగాలిలో

గర్భస్థ శిశువు నిద్రలో

నవ్వే పెదాలు, ఆ చేతులు అప్పుడు!

 

ఎటువంటి చేతులు నీవి! చల్లగా తెల్లగా

వెన్నెల వలే, వానలో,

మసక కాంతిలో అరిచే పిచ్చుకల వలే!

*

ఎంతో మోసి ఉన్నాయి కాబట్టి, మరిక

నువ్విలా! మంచు

పరదాలలో నిండి, ఒరిగిపోయి, ఇక

 

ఏ తూము వద్దో పిచ్చుకై చచ్చిపోయి …

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

2

 

నిన్నే నమ్ముకున్న ఒక చేయి

 

నిన్ను నమ్ముకుంది ఒక చేయి. కళ్లు

తెరవని, అప్పుడే

పుట్టిన పిట్ట అది. కుక్కపిల్లది –

 

నీ చేయి, ఒక సముద్రం అనుకుందది –

గూడు కట్టుకుంది –

ఈ అని నవ్వింది. ఎంతో ఆడింది!

 

నిన్ను నమ్ముకుంది ఒక చేయి. ఒడ్డున

ఏరుకున్నవేవో మరి

దాచుకున్నది. అర్థమేవీ లేనివీ, మరి

 

చాలా చిన్నవి. ఎలా అంటే విశ్వమంత

చిన్నదైన, గవ్వలాంటి

హృదయాన్ని, నవ్వే ఒక ముఖాన్ని!

*

నిన్ను నమ్ముకుంది ఒక అరచేయి. విను

నిజం అది, మెడ మరి

ఉరితాడుని నమ్ముకున్నట్లు, నిన్నే

 

నమ్ముకుంది, ఒకే ఒక్క అరచేయి …

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

3

 

చేయి ఒక మనిషై పలుకరించినప్పుడు

 

మూలుగుతో జ్వరంతో నువ్వు మూలకి

వొణికిపోతే, ఆ చేయి

నీ చీకట్లలో, “ఎందుకిట్లా?” అని –

 

అమ్మ ఏడుస్తుంది. నాన్నా ఏడుస్తాడు –

కవిత్వం జవాబు కాదని

ఇంతియాజ్ బేగం కీ తెలుసు. ఎలా?

 

తొడలు చాపి, హృదయాన్ని మూసివేసి

వేగ పరిమితులు లేని,

రైలు శబ్దాన్ని వినడం ఎవరికి తెలుసు?

 

తల్లిలో కీచురాళ్లు. నీలో ఆ ప్రకంపనలు

ఇంతియాజ్ బేగం లో,

Menopause లో ఎండిన మరకలు –

 

Gaffar ఏడుస్తాడు. నాన్నా ఏడుస్తాడు

రాత్రి, ఒడిపై తలొంచి

తొడల మధ్య రోడ్ రోలర్ ని allow

 

చేసిన వాళ్ళూ ఏడుస్తారు. క్రమేణా ఇక

ఎండిపోతున్న రక్తంలో

పిల్లలూ, వాళ్ల కవిత్వం ఏడుస్తుంది –

 

మోకాళ్లు చచ్చిపోతాయి. కళ్లకి, శుక్లాల

ఆపరేషన్ అయ్యి,

దొడ్డికి పోలేక చచ్చిపోతారు, ఎవరో –

*

మూలకి, నీలో నువ్వు చచ్చిపోయి ఇక

Delirium లో ఏవో

గొణుగుతుంటే, ఒక అరచేయి, ఒకే

 

ఒక చేయి, నీ తలకొరివి పెడుతున్నట్లు!

***

 

శ్రీకాంత్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు