ఎడ్లబండికి రేడియో ….

ఇంతకీ ఏమిటీ రేడియో ప్రచార సభ అంటారా!

అది రెండువేల సంవత్సరం.

రేడియో స్టేషన్ ద్వారా ఏదైనా ప్రత్యేకంగా చేయాలని ఆనాటి స్టేషన్ డైరక్టర్ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారి ఆలోచన. ఆ ఆలోచనలోంచి పుట్టిందే ఈ రేడియో ప్రచార సభ. 

ఇందుకోసం వారి ప్రణాళిక ఏమిటంటే ఆకాశవాణి వరంగల్ కేంద్రం జిల్లాలోని ఒక మండల కేంద్రాన్ని ఎంచుకుంటుంది.

ఒకసారి ఆ ప్లేస్ ఎంపిక జరగగానే రేడియో కేంద్రం టీం  అక్కడి స్థానికులు, రైతాంగంతో  మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకుని, ఆయా రంగాల నిపుణుల చేత ఆ గ్రామం లేదా మండల కేంద్రంలో ప్రసంగాలు ఇప్పించి, ఆ తర్వాత వారికి, స్థానికులకు మధ్య ఒక సంభాషణ ఏర్పాటుచేసి ఆ సంభాషణను రికార్డు చేసి ఆ భాగాలన అనంతరం రేడియోలో ప్రసారం చేయటం. ఇది స్థూలంగా రేడియో ప్రచార సభ లక్ష్యం.దీనివలన రెండు ప్రయోజనాలు నేరవేరతాయి.

ఒకటి ఆ ప్రాంతవాసుల సమస్యలు కొంతవరకూ తీరతాయి. వారికో విశ్వాసం కలుగుతుంది.

అదివారికి లాభించే అంశమయితే, వారికి నెమ్మది నెమ్మదిగా రేడియో ప్రాధాన్యత తెలిసి,‌రేడియో కార్యక్రమాలు వినటం అలవాటు చేసుకుంటారు.

తద్వారా అది వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఆయుధం అవుతుంది.ఇది స్థూలంగా రేడియో ప్రచార సభ లక్ష్యం

అయితే ఈ క్యాంపెయిన్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అన్న అంశంపై చర్చ జరిగింది.

స్టేషన్ డైరక్టర్ మంగళగారి ఆదిత్యప్రసాద్ గారికో ఆలోచన వచ్చింది.అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి.

అందరికీ తెలిసిందే.

అదే నవంబర్ పన్నెండవతేదీనాడు గాంధీ మహాత్ముడికీ ఆకాశవాణికీ ఉన్న బంధం గురించి చాలామందికి తెలియదు.

స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీ మహాత్ముని భజనలు, ప్రసంగాలు ఆకాశవాణి ఆయావేదికల్లో రికార్డు చేసింది కానీ మహాత్ముడు ఆకాశవాణి ప్రాంగణంలో అడుగిడింది మాత్రం ఒకేఒక్కసారి

అది నవంబర్ పన్నెండవ తేదీ 1947 వ సంవత్సరం.

దేశవిభజన తరువాత హర్యానాలోని కాందిశీకుల శిబిరంలో ఉన్న శరణార్థులనుద్దేశించి ప్రసంగంచటానికి బ్రాడ్కాస్టింగ్ హౌస్( ఢిల్లీ ఆలిండియా రేడియో స్టేషన్)కు గాంధీజీ ఒకేఒక్కసారి విచ్చేశారు.ఆసందర్భాన్ని(నవంబర్ 12వ తేదీని) సమాచార ప్రసార మంత్రిత్వశాఖ జాతీయ ప్రజాసేవా ప్రసారదినోత్సవంగా ప్రకటించింది.

అలా రేడియో ప్రచారసభను నలభైరెండురోజులపాటు అంటే అక్టోబర్ రెండవతేదీ నుంచి నవంబర్ పన్నెండవతేదీ వరకు జరపాలని నిశ్చయించారు. ఈ రేడియోప్రచారసభ 2000 సంవత్సరం నుంచి 2004 వరకు ఐదుసంవత్సరాలపాటు నిరాటంకంగా సాగింది.

ఈ రేడియో ప్రచారసభకు పోస్టర్లను డిజైన్ చేశారు. ఒక నినాదాన్ని సృష్టించి దానికి గ్లామర్ కల్పించారు.

ఎడ్లబండికి రేడియో పెట్టండి..పసిడిపంటకు పట్టం కట్టండి”

ఆరోజుల్లో ఈ నినాదం వరంగల్ జిల్లా అంతటా మారుమోగిపోయింది.ఒక్కమాటలో చెప్పాలంటే రైతులకు ఆకాశవాణి అంటే ఎనలేని నమ్మకం ఏర్పడింది.వరంగల్ లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రం(ARS-Agriculture Research Station) ఖరీఫ్, రబీ రెండు సీజన్ లలో రైతుదినోత్సవాలను నిర్వహిస్తుండేది.రేడియో స్టేషన తరఫున ఒక స్టాల్ పెట్టేవాళ్ళం.అందులో శాస్త్రవేత్తలు రైతులకు సమాధానాలిచ్చిన కేసెట్ ను టేప్ రికార్డర్ లో ప్లే చేస్తుండేవాళ్ళం.రైతులు చాలా ఆప్యాయంగా మా స్టాల్ కు వచ్చి పలకరిస్తుండేవారు.

వాళ్ళకు ఆకాశవాణంటే ఒక భరోసా ఏర్పడింది. రైతుల ఫోనిన్ కార్యక్రమంలో శాస్త్రవేత్తల సమాధానాల కోసం ప్రతిరోజూ ఎదురుచూస్తుండేవారు.రేడియో కేంద్రం రైతులలో ఎంత  ప్రాచుర్యం పొందిందంటే, ఏదైనా సమస్య వస్తే తమ పంటకు పురుగు పట్టిందనో, తెగులు సోకిందనో చెబుతూ ఏంచేయాలో చెప్పమనేవారు.

మేము సాయంత్రం వారిని రేడియో వినమని చెప్పి వెంటనే వ్యవసాయ పరిశోధనా కేంద్రానికో, వ్యవసాయశాఖ కార్యాలయానికో ఫోన్ చేసి ఆ రైతు సమస్యకు పరిష్కారం చెప్పించేవాళ్ళం.అలా వరంగల్ కేంద్రం ఒక నమ్మకాన్ని రైతుల్లో సంపాదించుకుంది.

ఈ రేడియో ప్రచార సభ కేంపెయిన్ కు నేను, మిత్రుడు, ఆకాశవాణి వరంగల్ కేంద్రానికి కళ్ళు, చెవులు సమస్తం అయిన స్టెనోగ్రాఫర్(తరువాతి కాలంలో వరంగల్ రేడియో స్టేషన్ కు ఏస్ ప్రోగ్రామర్ అయ్యాడు)

అనిల్ ప్రసాద్, ఒక ఇంజనీరింగ్ మిత్రుడు, మా స్టాఫ్ కార్ డ్రైవర్ చందు వెళుతుండేవాళ్ళం.టీం లీడర్ మా డైరక్టర్ ఆదిత్య ప్రసాద్ గారు. 

రేడియో ప్రచార సభ మొదలుపెట్టడానికి ముందుగా ఉద్దీపన సమావేశం(pre cursor లాంటిది) సంగెం మండలంలో రైతులతో ఒక సమావేశం జరిగింది.అక్కడ గాంధీనగర్ రైతులు ఆళ్ళ వెంకట్రావుగారు, ఆయన మిత్రులు పాల్గొన్నారు.

వారితో పిచ్చాపాటి మాట్లాడుతుంటే మా డైరక్టర్ గారికి దీన్ని విస్త్రృతపరచి రేడియో ప్రచారసభ పెడితే బావుంటుందనిపించింది.అలా ఆయన మదిలో ఈ ఆలోచన పురుడు పోసుకుంది.

ఈ రేడియో ప్రచార సభ‌‌ క్యాంపెయిన్ పీరియడ్ లో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ముఖ్యశాస్త్రవేత్త డా.ఎల్.జలపతిరావుగారు మా వెన్నంటి ఉండేవారు.

అవసరమైనప్పుడు లీగల్ ఎక్స్పర్ట్, ఒక డాక్టర్ కూడా వస్తుండేవారు.మూఢనమ్మకాలను విడనాడండి అని చెబుతూ రెగ్యులర్ గా మేజిక్ ప్రదర్శనలుండేవి.

2000సంవత్సరంలో- 

నవంబర్ 12వ తేదీనాడు తొర్రూర్ లో  స్థానికంగా ఉన్న పాఠశాలల పిల్లలతోటి ఒక ర్యాలీ చేయించాము.వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.అది ఏర్పాటుచేయటానికి అక్కడ ఒకరోజు మేం వెళ్ళి ఏడెనిమిది పాఠశాలల యాజమాన్యాలను సంప్రదించాం.ఆరోజు ముఖ్య అతిథిగా ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారులు డా.నేరెళ్ళ వేణుమాధవ్ పాల్గొని పిల్లలను ఉత్సాహపరిచారు.

మా డైరక్టర్ గారి కోరికమేరకు పిల్లలందరు మేం రేడియో వింటాం.మా అమ్మా నాన్నల చేతకూడా వినేలా చేస్తాం అని ప్రతిజ్ఞ చేయటం విశేషం. 

ఇక్కడ ఒక విషయం చెప్పాలి.భారతదేశం కామన్వెల్త్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్(CBA) సభ్యదేశం.ప్రతి సంవత్సరం CBA ప్రసారరంగంలో అవార్డులను ప్రకటిస్తుంది.ఆ పోటీలో సభ్యదేశాలు తలపడతాయి.మేము చేసినటువంటి ఈ క్యాంపెయిన్ ని ఆ సంవత్సరం రిపోర్ట్ గా తయారుచేసి ముందుగా స్క్రీనింగ్ కోసం ఢిల్లీకి పంపితే అక్కడ మిగిలిన స్టేషన్ల ఎంట్రీలను కూడా పరిశీలించి వరంగల్ ఆకాశవాణి ఎంట్రీని ఎంపికచేశారు.అలా ఆ సంవత్సరం ఆ అవకాశం వరంగల్ స్టేషన్ కు దక్కింది. అవకాశం దక్కటమే కాదు.రెండవ బహుమతి దక్కించుకుంది కూడా.

Innovation in Management గా మా కష్టాన్ని CBA గుర్తించింది.అయితే 2001సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన  ఉగ్రవాదుల దాడి వలన బ్రిస్బేన్(ఆస్ట్రేలియా) లో జరగవలసిన అవార్డుల కార్యక్రమం రద్దయింది.కేంద్ర సమాచార ప్రసార మంత్రి విడిగా ఆకాశవాణి వార్షికపోటీల బహుమతుల కార్యక్రమంలో అందచేశారు.

జాతీయ ప్రసారదినోత్సవాన్ని మొదటిసారిగా జరిపింది దేశం మొత్తంలో ఆకాశవాణి వరంగల్ కేంద్రమే.ఆ విషయాన్ని అప్పటి కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి శ్రీమతి సుష్మాస్వరాజ్ తన అభినందన సందేశంలో పేర్కొనటం విశేషం.

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని రేడియో స్టేషన్లలో వరంగల్ కేంద్రానికో స్పెషల్ స్టేటస్ దక్కింది. అప్పుడే రేడియో స్టేషన్లన్నీ కమర్షియల్ రెవెన్యూ సంపాదించాలని డైరక్టరేట్ వారు తాఖీదు జారీ చేశారు.

నేను, మిత్రుడు అనిల్ ప్రసాద్ నా మోటార్ సైకిల్ మీద బట్టల షాపుల్ని,హాస్పిటల్స్, ఇంకా ఇతర వాణిజ్య సంస్థలను కలిసి మా రేడియో స్టేషన్ లో ప్రకటనలిస్తే వారి వ్యాపారానికి ఎంత లాభమో వివరిస్తుండేవాళ్ళం.

అలా ఒకరోజు ఉదయం నగరంలో పేరున్న ఒక బట్టల షాపుకు వెళ్ళాం.

అప్పుడు మాకు ఎదురైన అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.

*

"రేడియో" రాంబాబు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ రేడియో అనుభవాలు గొప్పగా ప్రజెంట్ చేస్తున్నారు.ఇవి చదివి నాటి రోజులు సింహావలోకనం చేసుకునేలా ఉన్నాయి.త్వరలో ఇది పుస్తక రూపంలో వస్తుందని ఆశిస్తున్నాను.మీకు, సారంగ యాజమాన్యానికి అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.