మనం ఎవరైనా సరే కృతజ్ఞతా భావంతో ఒకరికి ఒకరం కానుకలు ఇచ్చి పుచ్చుకుంటాము. మనుషులే కాదు కాకులు కానుకలు ఇస్తాయి. కాకులు చిన్న చిన్న కానుకలు మన ఇంటి ముంగిట్లో ఒదిలి వెళ్ళటం ఆశ్చర్యమే. ఈ యధార్ధ ఘటన పశుపక్షుల్లో ఉండే కృతజ్ఞతా భావాన్ని కొత్త కోణం నుంచి చూపిస్తుంది. కాకుల మేధాశక్తి సాధారణ పక్షులకంటే భిన్నంగా ఉంటుంది. అవి మనిషి ముఖాన్ని గుర్తుపట్టి, దయను గుర్తించి, కృతజ్ఞతను వాటి చర్యల ద్వారా చూపిస్తాయి.
సియాటిల్ నగరంలో ప్రశాంతంగా ఉండే ఒక వీధి. అది 2011 వ సవంత్సరం. అక్కడ పెరుగుతున్న గాబి మాన్ అనే నాలుగేళ్ల పసిపిల్ల, ప్రతిరోజూ తన ఇంటి ముందు తచ్చట్లాడే కాకులకు తినుబండారాలు అందించేది. అది ఆట కాదు, హాబీ కాదు. ఆ చిన్నారి మనసులో కదలాడిన ఓ చిన్ని ప్రేమ.
మనిషి మనసును పసిగట్టే శక్తి మనుషులకే ఉంటుందని అనుకుంటాం, కానీ అడవిలో పెరిగిన జీవులకూ ఆ లోతు తెలుసు. కాకులు తెలివైన పక్షులు. వాటి కళ్ళలో ఒక నిశితమైన దృష్టి ఉంటుంది. మనిషి ముఖాన్ని గుర్తుపట్టే శక్తి, ప్రవర్తనను పరిశీలించే నైపుణ్యం. నల్లని రెక్కల మాటున దాగిన ఆ బుద్ధి, అవి గాబీని చాలా రోజులుగా గమనించాయి. తన అడుగుల శబ్ధాన్ని విన్నాయి. తన నిజాయితీని అర్థం చేసుకున్నాయి.. నెమ్మదిగా భయాన్ని వదిలి, సమీపానికి వచ్చాయి.
రోజులు గడిచాయి. గాబి కి కాకులకి ఆహారం వేయడం నిత్యకృత్యమైంది. ఒకరోజు గాబి ఒకటి గమనించింది. కాకులు తిరుగాడి వెళ్ళిన చోటే చిన్న చిన్న వస్తువులు కనిపించాయి. ఒక గాజు పూస, ఒక తుప్పు పట్టిన చెవికొక్కెం, బాటిల్ క్యాప్, చిన్న బొమ్మ ముక్క, గాజు పూస, బాటిల్ క్యాప్, చిన్న తాళాల గుత్తి, మెరిసే రాయి, ఇలా చిన్న చిన్న కానుకలు కనిపించాయి. అలా కాకులు ఇచ్చిన ప్రతీ కానుక గాబీ కి ఏవో కథలు చెప్పాయి . కాకులు గాబీ కి “నిన్ను చూస్తున్నాం. నిన్ను మర్చిపోలేదు” అని చెబుతున్నట్లు.
ఒకసారి గాబి తల్లి తన కెమెరా లెన్స్‌ను తోటలో పోగొట్టుకుంది. ఇంట్లోవారు ఎంత వెతికినా దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత, ఒక కాకి ఆ లెన్స్‌ను నోటిలో పట్టుకొని, ఇంటి గుమ్మం దగ్గర జాగ్రత్తగా పెట్టింది. అది కేవలం అనుకోని సంఘటన కాదు, అది ఒక ప్రాణి మరొక ప్రాణికి ఇచ్చే కృతజ్ఞత.
గాబి మాన్ కథ చదివినప్పుడు మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది: ప్రేమ అనేది కేవలం మాటల ద్వారా మాత్రమే చెప్పాలా? ఒక పసిపిల్ల చేసిన చిన్న పని, ఒక పక్షి జాతిని తన వైపు తిప్పుకుంది. శాస్త్రవేత్తలు ఏళ్ళ తరబడి అన్వేషించే అనుభవాన్ని, ఆమె ఏ ఆశా, ఏ ప్రణాళికా లేకుండా అనాయాసంగా సాధించింది.
చిన్న పిల్ల అయినా గాబి మాన్ ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చింది. నిరుపమానమైన దయకి, ఏ భాష అడ్డం రాదు, ఏ జాతి అడ్డం రాదు. ఒక చిన్నారి హృదయంలోని ప్రేమ, నల్లని రెక్కల పక్షులను స్నేహితులుగా మార్చింది. ఇది కథ కాదు, నిజం!
*








Add comment