కృతజ్ఞత గొప్ప వరం!

అడవి జీవులు మన మాటలు అర్థం చేసుకోకపోవచ్చు,  అవి మన మనసుని అర్థం చేసుకున్నట్లే వుంటాయి.  

నం ఎవరైనా సరే కృతజ్ఞతా భావంతో ఒకరికి ఒకరం కానుకలు ఇచ్చి పుచ్చుకుంటాము. మనుషులే కాదు కాకులు కానుకలు ఇస్తాయి. కాకులు చిన్న చిన్న కానుకలు మన ఇంటి ముంగిట్లో ఒదిలి వెళ్ళటం ఆశ్చర్యమే. ఈ యధార్ధ ఘటన పశుపక్షుల్లో ఉండే కృతజ్ఞతా భావాన్ని కొత్త కోణం నుంచి చూపిస్తుంది. కాకుల మేధాశక్తి సాధారణ పక్షులకంటే భిన్నంగా ఉంటుంది.  అవి మనిషి ముఖాన్ని గుర్తుపట్టి, దయను గుర్తించి, కృతజ్ఞతను వాటి చర్యల ద్వారా చూపిస్తాయి.

ఈ వ్యాసం ముఖ్యమైన కారణాలు రెండు, మనిషి హృదయంలోని స్వచ్ఛమైన దయ, జంతువుల మనసు  లోతుల్లో ఉన్న కృతజ్ఞతా భావన. ఈ రెండూ కలిసినప్పుడు పుట్టే అనుబంధం భాషకు అందనిది. గాబి మాన్ ఒక పసిపిల్ల. శాస్త్రవేత్త కాదు, పరిశోధకురాలు కాదు. అయినా ఆమె చేసిన చిన్న పని, మనిషికి జంతువుకు మధ్య ఉన్న దూరాన్ని చెరిపింది. కాకులు ప్రతిఫలంగా బహుమతులు తెచ్చాయి. అది కేవలం ప్రవర్తన కాదు, అది ఒక సంబంధం. ఈ వ్యాసం చదివిన తర్వాత మనం ఒక్కసారైనా ఆలోచిస్తాం, మన చుట్టూ ఉన్న జీవులను మనం ఎంత శ్రద్ధగా గమనిస్తున్నామని ? గాబి మాన్  ఉదంతం ఓ చిన్న నిదర్శనం.

సియాటిల్ నగరంలో ప్రశాంతంగా ఉండే ఒక వీధి. అది 2011 వ  సవంత్సరం. అక్కడ పెరుగుతున్న గాబి మాన్ అనే నాలుగేళ్ల పసిపిల్ల, ప్రతిరోజూ తన ఇంటి ముందు తచ్చట్లాడే కాకులకు తినుబండారాలు అందించేది. అది ఆట కాదు, హాబీ కాదు. ఆ చిన్నారి మనసులో కదలాడిన ఓ చిన్ని ప్రేమ.

పాఠశాల నుండి తిరిగొచ్చిన ప్రతిసారీ, గాబి తన చేతిలో వేరుశెనగలు తీసుకొని, నేలపై చల్లేది. తల్లితో నడుస్తూ కూడా, దారిలో పక్షులకు రొట్టె ముక్కలు వేసేది. ఆ క్షణాల్లో ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా తన చిన్ని హృదయంతో అలా చేస్తూ వెళ్ళింది. ప్రకృతి హృదయం ఇంకా అనిర్వచనీయమైనది.
 
మనిషి మనసును పసిగట్టే శక్తి మనుషులకే ఉంటుందని అనుకుంటాం , కానీ అడవిలో పెరిగిన జీవులకూ ఆ లోతు తెలుసు.

మనిషి మనసును పసిగట్టే శక్తి మనుషులకే ఉంటుందని అనుకుంటాం, కానీ అడవిలో పెరిగిన జీవులకూ ఆ లోతు తెలుసు. కాకులు తెలివైన పక్షులు. వాటి కళ్ళలో ఒక నిశితమైన దృష్టి ఉంటుంది. మనిషి ముఖాన్ని గుర్తుపట్టే శక్తి, ప్రవర్తనను పరిశీలించే నైపుణ్యం. నల్లని రెక్కల మాటున దాగిన ఆ బుద్ధి, అవి గాబీని చాలా రోజులుగా గమనించాయి. తన అడుగుల శబ్ధాన్ని  విన్నాయి. తన నిజాయితీని అర్థం చేసుకున్నాయి.. నెమ్మదిగా భయాన్ని వదిలి, సమీపానికి వచ్చాయి.

రోజులు గడిచాయి. గాబి కి కాకులకి ఆహారం వేయడం నిత్యకృత్యమైంది. ఒకరోజు గాబి ఒకటి గమనించింది.  కాకులు తిరుగాడి వెళ్ళిన చోటే చిన్న  చిన్న  వస్తువులు  కనిపించాయి. ఒక గాజు పూస, ఒక తుప్పు పట్టిన చెవికొక్కెం, బాటిల్ క్యాప్, చిన్న బొమ్మ ముక్క, గాజు పూస, బాటిల్ క్యాప్, చిన్న తాళాల గుత్తి, మెరిసే రాయి, ఇలా చిన్న చిన్న కానుకలు కనిపించాయి.  అలా కాకులు ఇచ్చిన ప్రతీ కానుక గాబీ కి ఏవో కథలు చెప్పాయి . కాకులు గాబీ కి “నిన్ను చూస్తున్నాం. నిన్ను మర్చిపోలేదు” అని చెబుతున్నట్లు.

ఒకసారి గాబి తల్లి తన కెమెరా లెన్స్‌ను తోటలో పోగొట్టుకుంది. ఇంట్లోవారు ఎంత వెతికినా దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత, ఒక కాకి ఆ లెన్స్‌ను నోటిలో పట్టుకొని, ఇంటి గుమ్మం దగ్గర జాగ్రత్తగా  పెట్టింది. అది కేవలం అనుకోని సంఘటన కాదు,  అది ఒక ప్రాణి మరొక ప్రాణికి ఇచ్చే కృతజ్ఞత.

గాబి మాన్ కథ చదివినప్పుడు మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది: ప్రేమ అనేది కేవలం మాటల ద్వారా మాత్రమే చెప్పాలా? ఒక పసిపిల్ల చేసిన చిన్న పని, ఒక పక్షి జాతిని తన వైపు తిప్పుకుంది. శాస్త్రవేత్తలు ఏళ్ళ తరబడి  అన్వేషించే అనుభవాన్ని, ఆమె ఏ ఆశా, ఏ ప్రణాళికా లేకుండా అనాయాసంగా సాధించింది.

అడవి జీవులు మన మాటలు అర్థం చేసుకోకపోవచ్చు,  అవి మన మనసుని అర్థం చేసుకున్నట్లే వుంటాయి.  
మనం జంతువులను సాధారాణమైనవి అని తోసిపుచ్చుతాం. కానీ అవి మనకంటే అనేక విషయాల్లో లోతైన జ్ఞానం కలిగి ఉంటాయి. ఒక కాకి ఒక మనిషి ముఖాన్ని గుర్తుపట్టి, తరాల తర్వాత కూడా ఆ స్మృతిని వారసులకు అందిస్తుందని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. అటువంటి జ్ఞాపకశక్తి, అటువంటి నమ్మకం ఆశ్చర్యంగా ఉంటుంది.

చిన్న పిల్ల అయినా గాబి మాన్ ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చింది. నిరుపమానమైన దయకి, ఏ భాష అడ్డం రాదు, ఏ జాతి అడ్డం రాదు. ఒక చిన్నారి హృదయంలోని ప్రేమ, నల్లని రెక్కల పక్షులను స్నేహితులుగా మార్చింది. ఇది కథ కాదు, నిజం!

*

విజయ నాదెళ్ళ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు