ఓర్హాన్ పాముక్ టర్కీ నుంచి 2006 లో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన ప్రజాదరణ గల, ప్రయోగాత్మక రచయిత. తను 1952లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో ఉన్నత వర్గ కుటుంబంలో జన్మించాడు.అక్కడే ఆర్కిటెక్చర్ చదివి మూడు ఏళ్ల తర్వాత వదిలి పూర్తి కాల రచనాకు జీవితం అంకితం చేశాడు. జర్నలిజం లో డిగ్రీ తీసుకున్నాడు. తన ముఖ్య రచనల్లో- “ది వైట్ కాజిల్,” “ది బ్లాక్ బుక్, ది న్యూ లైఫ్,” “మై నేమ్ ఈజ్ రెడ్,” “స్నో,” “ఇస్తాంబుల్: మెమోరీస్ ఆఫ్ ది సిటీ,” “అదర్ కలర్స్,” “ది మ్యూజియం ఆఫ్ ఇన్నోసెన్స్,” “ది రెడ్ హైర్డ్ గర్ల్,” “ది నయీవ్ అండ్ ది సెంటిమెంటల్ నావెలిస్ట్ మొదలగునవి” ఉన్నాయి.
పాముక్ రచనలు బాధాకర, కల్లోల కాలానికి స్పందనలు. పాశ్చాత్య సంస్కృతి నిరంతర దాడికి గురవుతున్న మూగజన వాణి. విమర్శకుడు ఊల్కెర్ గ్యుక్-బైర్క్ చెప్పినట్లు పాముక్ రచనలలో వస్తువుగా తూర్పు-పడమరల, దాని ఒట్టోమన్ గతం- పాశ్చాత్య తరహా వర్తమానాల మధ్య , పాత, కొత్త కాలాల్లో కళాకారుడు గురించిన నిర్వచనం, విశ్వాసం- మతయేతర జీవన విధానాల మధ్య తలెత్తే ఘర్షణలు ఉన్నాయి. పాత్రలకు డూప్ లను ఇచ్చి వారి వ్యక్తిత్వాలు మార్చడం ద్వారా చిత్రణ కష్టతరంగా చేస్తాడు.
“ది న్యూ లైఫ్” (నవ జీవనం) నవల బహుళ వ్యక్తిత్వాలను ఉత్సవంగా చూస్తుంది. ఒక వ్యక్తి కలలు, భౌగోళిక నియంతృత్వాన్ని తప్పించుకునే యత్నాలు కనిపిస్తాయి. నాయకుడి నిరంతర బస్సు ప్రయాణం ఊహకు రెక్కలు ఇస్తుంది. ప్రేమాన్వేషణ.హోలీ గ్రెయిల్ లేదా అమృత అన్వేషణకు తపన. అమర్త్యసేన్ దృష్టిలో పాశ్చాత్య అభివృద్ధి నమూనా కు సమమైన లేదా దాటిపోవాలనే ఎజెండా వల్ల అస్తిత్వం బానిసత్వం అవుతుంది. ఒక హేతుబద్ధ ఎంపికకు సంస్కృతి వర్గం, జాతి ,లైంగిక లేదా వృత్తిపర అస్తిత్వాలతో పాటు రాజకీయాల ప్రభావాన్ని గుర్తించాలి.
రచయిత ఈ నవల లో జాతీయ సంస్కృతికి , పాశ్చాత్య సంస్కృతి మధ్య ముక్కలైన టర్కీ ఆత్మను నవలలో చిత్రించాడు. ప్రశాంత స్థిర జీవితానికి, నిరంతర స్థిరత్వానికి, భద్రత -అభివృద్ధికి పాత, కొత్త- సామాజిక వ్యవస్థల మధ్య, ప్రకృతితో సాన్నిహిత్యం -టెక్నాలజీ వల్ల పెరిగే పరాయికరణల మధ్య సంఘర్షణ ఈ నవలలో కనిపిస్తుంది.
నవలలో నాయిక జనాన్, ఉస్మాన్ అనే ఒక యువ ఆర్కిటెక్చర్ విద్యార్థితో కొత్త జీవితం కోసం టెర్రర్ ఎదుర్కొన్న మెహ్మెత్ గురించి చెబుతుంది. ఆమె పట్ల క్షణకాలంలో తరగని ప్రేమను అనుభవించిన ఉస్మాన్ ఆమె కోసం వెతుకుతూ ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళతాడు. ఆమె ఒక పుస్తకంలో వర్ణించిన నవజీవనం కోసం ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలుసుకుంటాడు. ఆ అద్భుతమైన పుస్తకం ఏది అనేది ఒక మిస్టరీగా మిగులుతుంది. ఆ పుస్తకం చదివిన ఉస్మాన్ మారిపోతాడు. దానిని చదివినందుకు చావును ఎదుర్కొనేందుకు సిద్ధమా అని జనాన్ అడగగా ఉస్మాన్ తాను సిద్ధమే అంటాడు.
నవలలో సంఘటనలు ఊహ-కల్పనల మధ్య సరిహద్దుల్లో జరుగుతాయి. జనాన్, మెహ్మెట్ లపై కాల్పులు జరిపి ఒక వ్యక్తి మాయమవుతాడు. ఆస్పత్రికి వెళ్ళిన ఉస్మాన్ కు ఎవరూ అలా గాయపడినట్లు కనిపించదు. ఆమెను నూతన ప్రపంచాన్ని వెతికే క్రమంలో ఉస్మాన్ ఒక ప్రమాదంలో తన దగ్గర డబ్బులు లేక ఒక శవం జేబులో నుంచి డబ్బులు తీసుకోవడం, పలు సంఘటనలు ,వ్యక్తులని చూస్తాడు. తాను ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండాలని, మరొకరిలా ఉండాలని భావిస్తాడు. ఒక ప్రమాదంలో చావు తప్పి, చీకటిని స్వర్గంగా తలచి, తన జీవితం తనకు కనపడిందని , పుస్తకం చదివి తెలుసుకునాన్నని, ఇదే చావు అయితే మరల పుట్టానని, జ్ఞాపకం, గతం లేకుండా కొత్త జీవిని అని ఉస్మాన్ భావిస్తాడు.
పాముక్ రచనా శైలిలో మామూలు జీవిత వర్ణన లో కవితాత్మకత చూస్తాడు. ఉస్మాన్ నిశ్శబ్దం పిలుపు విని ఈ బస్సులు, రాత్రులు, పట్నాలు రహదారులు, వంతెనలు, ముఖాలు, రాత్రులు మింగే గద్ద లాంటి ఒంటరితనం, తిరిగిరాని కాలం, దృశ్యానికి చిక్కే పదం ఎందుకని ఆలోచిస్తాడు.
ఒక ప్రమాదంలో గాయపడి సిరినియార్ పట్టణంలో చికిత్స పొందుతాడు. రాత్రి ప్రయాణాన్ని రచయిత అద్భుతంగా వర్ణిస్తాడు. ఫుట్బాల్ అభిమాని, తన బ్యాగ్ నుంచి తినిబండారం తీసుకుని నోట్లో కుక్కుకునే ముసలమ్మ, ముందు సీట్లో కిటికీని బలమైన తాకిడికి ముద్దు పెట్టుకున్నప్పుడు తాను కల కనేది ప్రేయసి కాదని గ్రహించే హై స్కూల్ కుర్రాడు రెండు ప్రపంచాల మధ్య తోటలో మరొకరై విహరించ కోరుతారు. ఈ పుస్తకం ఇస్తాంబుల్ నగరం జనం గురించి అవగాహన ఇస్తుంది. బస్సు ప్రమాదంలో వీడ్కోలు తరుణంలో కనిపించే దేవత ‘కాపాడే దేవత’ లేదా ‘మృత్యు దేవత’ కావచ్చు
మెహ్మెత్ , జనాన్, ఉస్మాన్ వరుసగా ఒకరి కోసం మరొకరు వెతుకుతుంటారు. మెహ్మెత్ నిజానికి డాక్టర్ ఫైన్ కుమారుడు అయిన నహిత్. తన కొడుకు ఒక పుస్తకం చదివి మారిపోవటంతో తట్టుకోలేక తండ్రి అతనిపై డిటెక్టివ్ లను పెడతాడు. తన కొడుకు కుటుంబం, వ్యాపారం , ఆస్తి అన్నీ వదులుకొని వెళ్ళడం పాశ్చాత్య కుట్రగా భావించి ఆ సంస్కృతి మీద కసితో ఉంటాడు. ఉదారవాదానికి, ఆ సంస్కృతికి తగు తరుణంలో బుద్ధి చెబుతానంటాడు.
రచయిత దృష్టిలో అసలు సమస్య తూర్పు- పశ్చిమాల మధ్య విభజన, ఇస్లాం లేదా పేదరికం కాదు. ప్రజల్లో అవమానం వల్ల కలిగే అసహనం, పరస్పర అవగాహన లేక పోవడం వల్ల, తమ గొంతులు వినిపించలేని పరిస్థితి వల్ల వచ్చింది. భారత దేశంలో కూడా పాత వ్యవస్థ నచ్చని జనం ప్రాణాలకు తెగించి కుల, మత జాతులు దాటి ప్రేమ వివాహాలకు లేదా సమరశీల పోరాటాలకు దిగుతున్నారు.
నవల లో పుస్తక ప్రభావంలో లేదా అశాంతి వల్ల ఒకరు తన వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకోవచ్చు అని రచయిత చూపిస్తాడు. ఉస్మాన్ మెహ్మెత్ గా అస్తిత్వాన్ని మార్చుకొని డాక్టర్ ఫైన్ కు దగ్గర అవుతాడు. తన పేరు ఉస్మాన్ మీద చెలామణి అవుతున్న నహిత్ ( మెహ్మెత్) కోసం అన్వేషిస్తాడు. నహిత్ పుస్తకం కాపీలు తయారుచేసి అందరికీ పంచుతుంటాడు .అతడు మొదట జనాన్ ను ప్రేమించి తరువాత ఆమె ప్రభావం నుంచి తప్పుకొని ప్రశాంతంగా ఉన్నందుకు అసలు ఉస్మాన్ అసూయపడతాడు. నహిత్ ఇలియాస్ మెహ్మెత్ కొత్త జీవితం ,నవలోకం కోసం పుస్తకాన్ని దాటి చూడటం అనవసరం అనుకుంటే నిజమైన ఉస్మాన్ తన ప్రశ్నలు వదులుకోక నవజీవన అన్వేషిగా కొనసాగుతాడు.
నహిత్ (మెహ్మెత్ ) ను కథకుడు ఉస్మాన్ నిర్మూలించి అది తన అసూయ వల్ల కాక నహిత్ ఆశను కోల్పోవడం వల్ల చేశానని తన్ను తాను సమర్థించుకుంటాడు. డాక్టర్ ఫైన్ ను కలిసినా తన చర్య గురించి చెప్పడు .తన పాత జీవితం లోకి తిరిగి వచ్చి, ప్రేమించిన జనాన్ పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిందని తెలిసి , తాను మళ్లీ చేసుకుని సగటు జీవిగా తయారవుతాడు. నహిత్ మీద లేచిన చెయ్యి తన మీద మాత్రం లేవదు. నిజానికి బాహ్య జగత్తులో ఆదర్శం లేదా కీర్తి లేదా చావుకు దారులు ఎన్నో ఉంటాయి. పాశ్చాత్య దేశాల వాణిజ్యీకరణ వల్ల పాత సంస్కృతి జ్ఞాపకాలు లేకుండా పోవడం ప్రజలకు బాధ కలిగిస్తుంది. పాత ప్రపంచమనేది కుర్దిష్ గెరిల్లాలు చురుగ్గా ఉన్న ప్రాంతాల్లోనే ఉంటుంది.
ఉస్మాన్ కు గతంలో ఒంటెల వ్యాపారిగా ఉండి , నేడు కవితలు రాస్తూ , వేలాది చాక్లెట్ల పై కవర్లు సేకరించే ఒక వృద్ధుని నుంచి జ్ఞానోదయం అవుతుంది. ఆ వృద్ధుడు ఉస్మాన్ కు జీవితమంటే ప్రమాదం, అదృష్టం ప్రేమ, ఒంటరితనం, ఆనంద విషాదాలు, కాంతి, చావు, మందమైన సంతోషమని వివేక బోధ చేస్తాడు. ఉస్మాన్ జీవిత అర్థం కోసం వెదికి తన దేశంలో వ్యక్తిగత లక్ష్యం నేరమని , బాల్యంలో చదువు వల్ల పుస్తక ప్రభావానికి లోను అయినందుకు, కథలో నీతి లేకుండా తన కథ వ్యక్తిగతమైనదని కన్నీరు కార్చుతాడు. జరగబోయే ప్రమాదం తెలుసుకొని చావు దేవతను , అనివార్య అంతాన్ని, కొత్త లోక ప్రవేశాన్ని ఊహిస్తాడు.
సామన్ హషేమిపూర్ అనే విమర్శకుడు నవలలో స్వీయ గతంలోని విషాద అసంబద్ధత, నేటి విషాద అసంబద్ధతల మధ్య చిక్కిన టర్కీ నే అసలు హీరో అని, ఇది ప్రపంచ ఆర్థిక జాతీయవాద వ్యతిరేకంగా రాసిన నాగరికమైన, కఠినమైన, వినోదభరిత విమర్శ అని అభిప్రాయపడ్డాడు. ఏంజెల్ గుర్రియా క్వింటానా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పాముక్ పాశ్చాత్య ప్రపంచాన్ని లేక గతించిన ఒట్టోమన్ సంస్కృతిని బానిసలా అనుకరించడం పరిష్కారం కాదు. వీటి గురించి కొంత చేయాలి, ఏదో ఒక దానికి ఎక్కువగా చెంది ఉండటం గురించి ఆందోళన ఉండరాదు అన్నాడు.
తాను రాసిన పుస్తకాలు లాంటివి చదవాలని, తన పట్ల, అందరి పట్ల కోపం వల్ల, మార్పు కోసం, ఇస్తాంబుల్ లో తాము ఆనుభవిస్తున్న జీవితం తాము, ప్రపంచం తెలుసు కోవాలని, సాహిత్యం పట్ల నమ్మకం వల్ల,పేపర్, పెన్ను, ఇంకు అంటే ఇష్టం , ఉద్వేగం, అలవాటు వల్ల, తన్ను చదవాలని కోరుకోవడం వల్ల, మొదలు పెట్టిన పని ముగించాలని,గ్రంథాలయాల అమరత్వం పై పిల్ల తరహా నమ్మకం, జీవిత అందాలను,సంపదలను మాటల్లో మార్చి ఉత్సాహం, కథను రాయాలని, , తాను కలలో లాగా చేరలేని ప్రదేశముందనే ఊహను తప్పించుకోవడానికి, సంతోషంగా ఉండటానికి రాశానని తన నోబెల్ బహుమతి ఉపన్యాసంలో ఓర్హాన్ పాముక్ చెప్పాడు.
*








Add comment