ప్రపంచ భాషగా తెలుగు నిలబడుతుందా?!

దశాబ్ది కాలంగా పెరుగుతున్న అమెరికా తెలుగు సమూహాలలో ప్రపంచ భాషగా తెలుగుని నిలబెట్టుకోవాలనే ఆకాంక్ష తీవ్రంగానే వుంది. అనేక చోట్ల జరుగుతున్న తెలుగు సభల్లోనూ, రచయితల సమావేశాల్లోనూ ఈ ఆకాంక్షకి ఆచరణ రూపం ఇస్తే బాగుణ్ణు అనే భావన గట్టిగానే వ్యక్తమవుతోంది. దీన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత అమెరికాలో జాతీయ స్థాయిలో వున్న పెద్ద తెలుగు సంఘాలకు వుంది.

తానా నిర్వహిస్తున్న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సభకి విశిష్ఠ అతిథి గా ఆహ్వానించినందుకు  ధన్యవాదాలు. ఈ సభలో ఎందరో పెద్దలున్నారు. తెలుగు భాషా సంస్కృతుల పట్ల విశేషమైన ప్రేమనీ, గౌరవాన్ని వివిధ రూపాల్లో కనబరుస్తున్న తోటకూర ప్రసాద్ గారు ఈ సభ నిర్వహిస్తున్నందుకు సంతోషం. ఈ సందర్భంగా నేను అడగాలనుకున్న సూటి ప్రశ్న: పరిశోధనా భాషగానో, ప్రపంచ భాషగానో  తెలుగు నిలబడుతుందా?!

1

ప్రశ్నకి సమాధానం చెప్పడానికి కనీసం ఏడు దశాబ్దాల పైబడి అమెరికాలోని వివిధ యూనివర్శిటీలలో ప్రయత్నం జరుగుతూనే వుంది.

1950 లోనే ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో తెలుగు బోధనా భాషగా ప్రవేశపెట్టారు. కచ్చితంగా అదే దశకంలో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో భద్రిరాజు కృష్ణమూర్తి గారు తెలుగు క్రియా పదాల మూలాల మీద పరిశోధన చేసి, డాక్టరేట్ తీసుకున్నారు. ఇంకో పదేళ్ళకి కార్నెల్ యూనివర్సిటీ నుంచి తెలుగు వాక్యం మీద పరిశోధనకు చేకూరి రామారావు గారు డాక్టర్ అయ్యారు.

అదే సమయంలో విస్కాన్సిన్ యూనివర్సిటీలో అబ్బూరి వరద రాజేశ్వర రావు గారు తెలుగు భాషా కోర్సులు చెప్తున్నారు. అదే యూనివర్సిటీలో ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త జీ. ఎల్. ఎన్. రెడ్డి గారు తెలుగు చెప్పడమే కాకుండా, అమెరికాలాంటి చోట తెలుగు బోధనకి కావల్సిన పాఠ్య పుస్తకాలని రూపొందించారు. ఇంకో పదేళ్ళకి వెల్చేరు నారాయణ రావు గారు అక్కడే తెలుగు పాఠాలు చెప్తూ, సాహిత్య అనువాదాల వైపు దృష్టి మళ్లించారు. ఇంకో పదేళ్ళకి తెలుగు పరిశోధన మరింత విస్తరించి, మీడియా గురించి, విజయనగర చరిత్ర గురించీ, హిందూ-ముస్లింల కథనాల గురించి, తెలుగులో స్వీయ చరిత్రల గురించి పరిశోధన వ్యాపించింది. ఇవన్నీ చిన్న విజయాలేమీ కాదు!

అయితే, ఇప్పటి నా ప్రశ్న గతం గురించి కాదు, వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి!

2

ఇంత చరిత్ర వున్నా, అమెరికన్ యూనివర్శిటీలలో ఇప్పటికీ తెలుగుని పూర్తిస్థాయి బోధనా భాషగా లేకపోవడం ఇప్పటి విషాదం.

నేను గతంలో పాఠాలు చెప్పిన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో చిరకాల మిత్రులు తోటకూర ప్రసాద్ గారి చొరవతో ఎక్కువగా డాలస్ తెలుగు సమూహం సహకారంతో 2007 లో తెలుగు భాషా కోర్సులు ప్రవేశపెట్టారు. అంటే, 1950 తరవాత 2007 కి గాని తెలుగు వైపు దృష్టి మళ్లించే అవకాశం ఈ యూనివర్సిటీకి దక్కలేదు. అదీ, అమెరికన్ ప్రభుత్వం సహాయంతో కాదు, కేవలం మన తెలుగు సమూహంలోని కొందరు భాషా ప్రేమికుల వల్ల అది సాధ్యపడింది. ఆ తరవాత నిధుల కొరత వల్ల ఆ కార్యక్రమం కూడా మూలనపడింది.

కానీ, తొమ్మిదేళ్ల పాటు ఆ యూనివర్సిటీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులకు పాఠాలు చెప్పిన అధ్యాపకుడిగా నాకు గొప్ప అనుభవాలు మిగిలాయి. కొంతమంది పరిశోధకులకి శిక్షణ ఇచ్చానన్న తృప్తీ మిగిలింది తప్ప, తెలుగు భాషని శాశ్వత కోర్సుగా నిలబెట్టే సౌకర్యాలు లేకపోవడంతో అదంతా అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇప్పటికీ ఆ యూనివర్సిటీ విద్యార్థుల నుంచి పెద్ద సంఖ్యలో నాకు ఉత్తరాలు వస్తుంటాయి- తెలుగు భాష ని మళ్ళీ ఎప్పుడు కోర్సుగా మొదలు పెడతారు అని.

ఒక్క టెక్సాస్ నుంచి మాత్రమే కాదు, ఇలాంటి విన్నపాలు గత కొద్ది కాలంగా వివిధ రాష్ట్రాల నుంచి వస్తూనే వున్నాయి. అమెరికన్ తెలుగు వాళ్ళల్లోని కొత్త తరంలో ముఖ్యంగా అండర్ గ్రాడ్ విద్యార్థులలో భాషా సంస్కృతుల పట్ల పెరుగుతున్న ఆసక్తిని మనం పట్టించుకోవాల్సిన సమయం వచ్చింది.

ఇంకో వైపు నుంచి ఆలోచిస్తే, మాస్టర్స్, పీ ఎచ్ డీ స్థాయిలలో కూడా తెలుగు భాషని ముఖ్యమైన source గా తీసుకొని పరిశోధనలు చేయాలనే ఆసక్తి పెరుగుతోంది. వివిధ యూనివర్శిటీలలో దక్షిణాసియా భాషల్లో ప్రధానంగా సంస్కృతం, బెంగాలీ, హిందీ, ఉర్దూ, తమిళం లాంటి కొన్ని భాషలలొ మాత్రమే పరిశోధనకు పూర్తిస్థాయి సౌకర్యాలున్నాయి. నిజానికి అమెరికాలో అత్యధికులు మాట్లాడే భాషగా గుర్తింపు పొందిన తెలుగులో కూడా ఇలాంటి పరిశోధనలకు అపారమైన అవకాశాలున్నాయి. తెలుగు భాషని ఆధారంగా తీసుకొని ఇప్పటివరకూ భాషా శాస్త్రంలోనో, సాహిత్యంలోనో జరుగుతూ వచ్చిన పరిశోధనలు ఇప్పుడు అంథ్రోపాలజీ, మతం, తులనాత్మక సాహిత్యం, సంగీతం, నృత్యం, మీడియా వంటి రంగాలలో ఆసక్తిని పెంచవచ్చు. ఎమ్మే, పీ ఎచ్ డీ స్థాయి కోర్సులలో ఇప్పటికే తెలుగుకి సంబంధించిన అధ్యయన అంశాల మీద ఆసక్తి పెరుగుతోంది. గత పదేళ్ళలో ముఖ్యంగా మీడియాతో పాటు మతపరమైన అధ్యయనాల్లో తెలుగుని విస్తృతంగా వినియోగించవచ్చన్న ఆలోచన బలపడుతోంది.

3

మెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో సిలికానాంధ్ర మన బడితో పాటు స్థానికంగా మా బడి, పాఠశాల వంటివి స్కూలు విద్యార్థులకు తెలుగు భాష నేర్పే కృషి విజయవంతంగా చేస్తున్నాయి. ఇది చాలా అవసరమైన కృషి. అయితే, యూనివర్సిటీ స్థాయిలో తెలుగు భాష కోర్సులు సాధించే లక్ష్యాలు భిన్నంగా వుంటాయి. దశాబ్ది కాలంగా పెరుగుతున్న అమెరికా తెలుగు సమూహాలలో ప్రపంచ భాషగా తెలుగుని నిలబెట్టుకోవాలనే ఆకాంక్ష తీవ్రంగానే వుంది. అనేక చోట్ల జరుగుతున్న తెలుగు సభల్లోనూ, రచయితల సమావేశాల్లోనూ ఈ ఆకాంక్షకి ఆచరణ రూపం ఇస్తే బాగుణ్ణు అనే భావన గట్టిగానే వ్యక్తమవుతోంది. దీన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత అమెరికాలో జాతీయ స్థాయిలో వున్న పెద్ద తెలుగు సంఘాలకు వుంది.

మన సాంస్కృతిక ప్రాధాన్యాన్ని జాతీయ స్థాయిలోనో, అంతర్జాతీయ స్థాయిలోనో ఆత్మగౌరవంతో నిలబెట్టే సాధనం భాష మాత్రమే! ఈ ఎరుక మనలో ఎంత బలంగా నాటుకుంటే అంతగా మన సమూహాలు బలపడతాయి! భాష విలువని గుర్తించిన రోజున యూనివర్సిటీ స్థాయిలో పరిశోధన భాషగా తెలుగు నిలబడుతుంది. అదే తెలుగుని ప్రపంచ భాషగా కూడా నిలబెడుతుంది.

*

అఫ్సర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మాతృభాషకన్న! మాతృదేశముకన్న!
    మధురమైనదేది? మానవులకు!
    స్వర్గమైన నేమి సౌఖ్యంబులొనగూర్చు?
    తల్లిభాష కన్న! తల్లికన్న!
    చాలా విశ్లేషణాత్మకంగా వివరించారు. అభినందనలు సర్!

  • మీ తపన చాలా మంచిది. ప్రపంచ భాషగా తెలుగు నిలబడితే అంతకంటే కావాల్సింది ఏముంది సార్. అయితే దానికన్నా ముందు, ఇక్కడ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషకు పట్టిన దుస్థితి గురించి చెప్పుకోవాలి. అసలు పట్టించుకునేవారే లేరే. అంతా మాతృభాషా విముఖులైన పాలకుల ఇష్టారాజ్యం. వాళ్లకు చెప్పేవాళ్లెవరు? కవిత, కథ, వ్యాసం ఇంకా అనేకానేక రూపాల్లో తెలుగు మార్మోగుతోంది. మరో కోణంలో విద్యార్థికి తెలుగు ఎంత అవసరమో చెప్పేవాళ్ళు లేరు. ఇలాగే కాలం కొనసాగితే మన ఈ పోగుపడుతున్న రచనలు చదివే వాళ్ళు ఎవరు? మాతృభాషలో విద్యాబోధన సాగితే సహజ నైపుణ్యాలు ద్విగుణీకృతం అవుతాయన్న ఘోష, ఘోషగానే మిగిలి పోతుండడం ఎంత విషాదం!?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు