1917లో సోవియట్ యూనియన్‌కి అధినేతగా మారిన తర్వాత లెనిన్ తన దేశంలోని రచయితల్ని పిలిపించారు. ‘ఇప్పటిదాకా మీరు చాలా రచనలు చేశారు. ఇప్పుడు పిల్లల కోసం రచనలు చేయండి. వారికోసం ప్రత్యేకంగా పుస్తకాలు రాయండి’ అన్నారు. ఆ రకంగా రష్యన్ సాహిత్యాన్ని బాలలకు అందించేందుకు అడుగు వేశారు. దేశచరిత్ర అంటే రాజులు, యుద్ధాలు, కట్టడాలు మాత్రమే కాదని, దేశచరిత్ర కళలతో ముడిపడి ఉంటుందనేది వాస్తవం. జనం ఆ కళల్ని తమవిగా చేసుకొని, అందులో మిళితమై తమ జీవనవిధానాలను తీర్చిదిద్దుకుంటారు.
సాహిత్యం-సినిమా.. ఒకటితో మరొకటి మిళితమైన అంశాలు. సాహిత్యానికున్న చరిత్ర దొడ్డది. సినిమా చరిత్ర వందేళ్లది. మొదటి నుంచి సినిమాలకు సాహిత్యం ఊతంగా నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా తెలుగు సినిమా విషయంలో ఇది చాలా ముందు నుంచే అమల్లో ఉంది. యద్ధనపూడి, యండమూరి, మల్లాది లాంటివారి నవలలు సినిమాలుగా మారాయని చెప్పడం దగ్గరే ఎక్కువమంది ఆగిపోతున్నారు కానీ, అంతకు ఎన్నో ఏళ్ల ముందు నుంచే సాహితీకారులు సినిమాల్లో కీలకంగా వ్యవహరించారు.

చలం, తాపీ ధర్మారావు, శ్రీశ్రీ, త్రిపురనేని గోపీచంద్, ఆరుద్ర, దాశరథి, సినారె వంటి సాహితీవేత్తలు సినిమాల్లో మాటలు, పాటల రచయితలుగా ఘనస్థాయిలో నిలిచారు. కోడూరి కౌసల్యాదేవి రాసిన ‘చక్రభ్రమణం’ నవల 1964లో ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాగా మారిందనేది అందరికీ తెలిసిందే. నవల ఆధారంగా వచ్చిన తొలి తెలుగు సినిమా ఇదేనని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అయితే మొక్కపాటి నరసింహశాస్త్రి రాసిన ‘బారిష్టర్ పార్వతీశం’ నవల ఆధారంగా అదే పేరుతో 1940లోనే సినిమా వచ్చింది. ఆ లెక్కన నవల ఆధారంగా వచ్చిన తొలి తెలుగు సినిమా ఇదేనని మనం అనుకోవాలి. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆర్థికంగా పరాజయం పొందడంతో ఈ చిత్రం గురించి ఎవరికీ పెద్దగా తెలియలేదు.
తెలుగు నవలలను సినిమాలుగా మలచిన దశ తెలుగులో కొంతకాలం నడిచింది. ఆ సమయంలో యద్దనపూడి, యండమూరి రాసిన నవలలు పాఠకులను విశేషంగా ఆకట్టుకొని అనంతరం సినిమాలుగా మారి జనాన్ని అలరించాయి. మల్లాది వెంకట కృష్ణమూర్తి, పొత్తూరి విజయలక్ష్మి, కోలపల్లి ఈశ్వర్, మానస, బొల్లిముంత శివరామకృష్ణ, మల్లిక్ రచనలు సైతం సినిమాలుగా వచ్చాయి. 1970 నుంచి మొదలైన ఈ పరంపర 1990ల దాకా కొనసాగింది. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు అడపాదడపా తప్ప ఈ ప్రయత్నం పెద్దగా జరగలేదు. గుడిపాటి వెంకటాచలం, రెంటాల నాగేశ్వరరావు, శ్రీరమణ రాసిన కథలు సినిమాలుగా వచ్చాయి. వాటికి ఆర్ట్ సినిమాలన్న ముద్ర వేయడం గమనార్హం.
ఈ పరిస్థితి మారాలన్న ఆలోచన, తెలుగు సాహిత్యం-సినిమా ఒకచోట చేరాలన్న తపన చాలాకాలం నుంచి అనేకమందిలో ఉంది. ఈ మేరకు ప్రయత్నాలు సైతం జరిగాయి. ‘ఆన్వీక్షికి’ ప్రచురణ సంస్థ ఈ దిశగా కృషి చేసింది. సినిమాల్లోని వారికి సాహిత్యాన్ని చేరువ చేసింది. ఆ క్రమంలో అనేకమంది సినీ ప్రముఖులు తెలుగు పుస్తకాలపై ఆసక్తిని కనబరిచారు. యువరచయితలు ఏం రాస్తున్నారని, తెలుగు సాహిత్యంలో సినిమాలు తీయదగ్గ కథలెక్కడ ఉన్నాయని పరిశీలిస్తున్నారు. కొత్తగా ఒక పుస్తకం విడుదలైతే దాన్ని కొని, చదివి, రచయితను అభినందిస్తున్నవారూ ఉన్నారు. పుస్తకాల రచనతో మొదలుపెట్టి సినిమా రచయితలుగా మారుతున్నవారూ పెరుగుతున్నారు. ఇదంతా ఉత్సాహకరమైన వాతావరణం.
ఈ సమయంలో తెలుగు కలెక్టివ్ సభ్యులు, ది సైకిక్ ఫిల్మ్‌మేకర్ సభ్యుల సంయుక్త నిర్వహణలో ఫిబ్రవరి 14న హైదరాబాదులో ‘ఏకం’ పేరిట భారీ సమ్మేళనాన్ని నిర్వహించారు. సాహిత్యం, సినిమాలను కలగలిపి, సినిమా నిపుణులు, సాహిత్యకారులతో చర్చలు జరిపి, ఒకరి భావాలు మరొకరు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తమ తమ అనుభవాలను పంచుకొని ఔత్సాహికుల్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది. సుమారు మూడు వేల మంది దాకా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిలో 90 శాతం యువకులు, ఔత్సాహికులు. కొత్తగా సాహిత్యాన్ని చదవాలని, కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నవారు. వారిలో తొలిసారి తెలుగు పుస్తకం చదివేవారూ ఉన్నారు. వారందరికీ ఏకం చక్కటి వేదికగా మారింది. ఉదయం 9కి మొదలైన కార్యక్రమం రాత్రి 9 గంటల దాకా సాగింది. వచ్చినవారిలో సగం మంది కార్యక్రమం ముగిసేదాకా అక్కడే ఉన్నారు. వారంతా ఆ కార్యక్రమాన్ని ఆసాంతం ఆనందించారు.
ఈ కార్యక్రమంలో అనేక విశేషాలున్నాయి. సాహిత్యం, సినిమాల్లో దిగ్గాజలైన కాళోజీ నారాయణరావు, జంధ్యాల, సిరివెన్నెల సీతారామశాస్త్రి పేర్లతో ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. సినీ, సాహితీ ప్రముఖులతో సంభాషణలు ఏర్పాటు చేశారు. రామ్‌గోపాల్ వర్మ, తనికెళ్ల భరణి, వివేక్ ఆత్రేయ లాంటి వారు వచ్చి తమ అనుభవాలను అక్కడ వివరించారు. వారితోపాటు యువరచయితలు, సినిమా దర్శకులు, ఔత్సాహికులు, కంటెంట్ క్రియేటర్స్ వేదికనెక్కి తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. సాహిత్యరంగానికి చెందిన వాసిరెడ్డి నవీన్, పెద్దింటి అశోక్‌కుమార్, వేంపల్లె షరీఫ్, అరిపిరాల సత్యప్రసాద్, అనిల్ డ్యానీ, ఉమ నూతక్కి, సమ్మెట ఉమాదేవి, అపర్ణ తోట, రష్మానుద్దీన్ షేక్, మహమ్మద్ గౌస్ తదితరులు హాజరై సాహిత్యానికి సంబంధించిన అంశాలను వివరించారు. 
వచ్చినవారు వినడం వెళ్లిపోవడం అనే పద్ధతిలో కాకుండా ఔత్సాహికుల కోసం ఇక్కడ వర్క్‌షాపులు ఏర్పాటు చేశారు. పుస్తకాల ముఖచిత్ర రూపకల్పన గురించి ప్రముఖ చిత్రకారుడు ‘అన్వర్’ ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహించగా, పుస్తకం ప్రచురించేందుకు అవసరమైన అంశాలపై అజు పబ్లికేషన్స్ నిర్వాహకురాలు యర్రం శ్వేత వర్క్‌షాప్ నిర్వహించారు. ‘ఫిక్షన్ రైటింగ్’ అనే అంశంపై రచయిత, ప్రచురణకర్త వి.మల్లికార్జున్ తన వర్క్‌షాప్‌లో వివరించగా, సినిమాలకు చెందిన మేకింగ్, ఇతర అంశాలపై వర్క్‌షాప్‌లు జరిగాయి. తమ కథలను సినిమాలుగా మలుచుకునేందుకు యువ దర్శకులకు తోడ్పడేవారు, నటులుగా, సాంకేతిక నిపుణులుగా సినీరంగంలోకి ప్రవేశించేందుకూ అవసరమైనవారూ అక్కడ అందుబాటులో ఉన్నారు. వారందరూ ఒకరి ఆలోచనలు, అనుభవాలు మరొకరితో పంచుకున్నారు. ఇక్కడితో ‘ఏకం’ అయిపోలేదు. సాయంత్రం నుంచి రాత్రి దాకా యువత అంతా కలిసి ఆడుతూ, పాడుతూ ఆనందించారు. భయాలను వదిలి సంతోషంగా గడిపారు. ఆ ప్రాంగణమంతా కృషితోపాటు ఖుషీ కూడా వెల్లివిరిసింది.
ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడం వెనుక నిర్వాహకుల శారీరక, మానసిక శ్రమ ఎంతో ఉంది. నెలల ముందు నుంచే ఈ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారన్న విషయం తెలుస్తోంది. ఆదిత్య అన్నావఝల, కవనమాలితోపాటు వారి మిత్రులు, ఇతర బృందం కలిసి ఎక్కడా ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. నిమిషం తీరిక లేకుండా పనులు చేశారు. ఆ కష్టమంతా కార్యక్రమం విజయానికి తోడ్పడింది.
ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు తెలుగులో జరగాలి. తెలుగు సాహిత్యం మరింత మందికి చేరేందుకు తోడ్పడాలి. ఇతర భాషలతో సమానంగా తెలుగు సాహిత్యం అంతర్జాతీయ స్థాయికి చేరాలి. ఇటువంటి ఉత్సాహకరమైన వాతావరణం ఉంటే అది తప్పకుండా సాధ్యం అనిపిస్తుంది.
*








నేనూ హాజరయ్యాను.
యువతీ యువకులతో “T Works ప్రాంగణమంతా కోలాహలంతో నిండిపోయింది.
పుస్తకాల అమ్మకాలకు, టీ షర్ట్స్ వగైరాలకు కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. మూడు నాలుగు ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి.
రామ్ గోపాల్ వర్మ గారు, తనికెళ్ల భరణి గారు, పెద్దింటి అశోక్ గారు, వేణు ఉడుగుల గారు….లాంటి అనేకమంది హేమాహేమీలు,సెలబ్రిటీలు రావడం చాలా సంతోషం అనిపించింది.
ఎక్కడ చూసినా పండగ వాతావరణం,రంగు రంగుల సీతాకోకచిలుకల లాంటి అమ్మాయిలు అబ్బాయిలతో కళకళలాడింది.
వాలంటీర్లు,నిర్వాహకులు చాలా చెమటోడ్చి అందర్నీ కోఆర్డినేట్ చేశారు.
ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడానికి పూనుకోవడం పెద్ద సాహసం అని చెప్పాలి.
ఏకం అనే టైటిల్,సంగీతం సాహిత్యం మేళవించి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా చాలా గొప్ప విషయం.
నిర్వహణలో చిన్న చిన్న లోపాలు కనిపించాయి. అవి సహజం కూడా!
అంతమంది రావడం నాకైతే ఆశ్చర్యం అనిపించింది. బహుశా నిర్వాహకులు కూడా ఊహించి ఉండరు.అందుకే అందరికీ కుర్చీలు సమకూర్చలేకపోయారు నిలబడి చూడాల్సి/వినాల్సి వచ్చింది.
రామూ గారు మాట్లాడుతున్నప్పుడు సరిగా వినపడలేదు… మూడు వేదికల మీద కార్యక్రమాలు ఏకకాలంలో నిర్వహించడం వల్ల ఓ గందరగోళ వాతావరణం అయితే ఉండింది.
వర్క్ షాప్ కు తగినంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్లనో, మరే కారణం వల్లనో రెండు సెషన్స్ నిర్వహించలేదు(Screen Writing&Life cycle of book)
అన్వర్ గారి సెషన్ కు పట్టమని పదిమంది కూడా లేరు.
పరిచయకర్తలుగా వ్యవహరించిన వాళ్ళ అనుభవరాహిత్యం కొట్టవచ్చినట్లు కనపడింది. Q&A లోనైతే సోది ఎక్కువ- డైరెక్ట్ ప్రశ్నలు తక్కువ అన్నట్లుగా అనిపించింది. ఒక ఔత్సాహికుడు Etv Win నితిన్ చక్రవర్తి గారిని ప్రశ్నలు అడిగాడు. తర్వాతి సెషన్ లో మళ్లీ దూసుకొచ్చి ప్రశ్నలు అడిగాడు. నాకనిపించింది ఏంటంటే ఆ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తున్న మైక్ పట్టుకున్న వాలంటీర్ అతనికి ఫ్రెండ్ ఏమో అని 🤣
ఏదేమైనా EKAM లాంటి అద్భుతమైన కాన్‌సెప్ట్ తో సంగీతం&సాహిత్యం మేళవింపు గ్రేట్.ఇలాంటివి ఇంకా చాలా చాలా జరగాలి.