మీజాన్‌సేన్ 2

ఈ సన్నివేశం చదివినప్పుడు మీకేమనిపించింది. బహుశా “ఇది బాగానే ఉంది కదా? చెప్పాలనుకున్న విషయాలు రచయిత చెప్పగలిగాడు కదా? ఇందులో లోపం ఏముంది?” అని మీకు అనిపించి ఉండచ్చు. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. కథలో ఈ భాగాన్ని చదివిన తరువాత, మీకు మిగిలిన కథ చదవాలి అన్న ఉత్సాహం, ఉత్సుకత ఎంతమాత్రం కలిగింది?

త భాగంలో మీకు మీజాన్‌సేన్ పరిచయం చేసి సెట్టింగ్ మొదలుకుని, వస్తువులు, వేషధారణ, కెమెరా కంపోజిషన్ (లైటింగ్, ఫ్రేమ్ మొదలైనవి) – ఇవన్నీ సరైన పాళ్లలో కలిస్తేనే ఆ సన్నివేశంలోకి జీవం వస్తుంది అని చెప్పాను. మీ కథని పాఠకులు చదవడం/వినడం కాకుండా ప్రేక్షకులుగా మారి చూసేలా చేసేందుకు ఈ మీజాన్‌సెన్‌లో పది అంశాలు ఉపయోగపడతాయని చెప్పి అందులో నేపథ్యాన్ని, అందులో ఉండే వస్తువులను వాడటం గురించి గత భాగంలో చెప్పాను. మిగిలిన అంశాలలో మూడింటిని ఈ రోజు చర్చిద్దాం. ఆ చర్చకు ఉపకరించేలా ఒక కథలో నుంచి తీసుకున్న ఈ క్రింది భాగాన్ని చదవండి –

<< ఆగంతకుడు

ఇన్‌స్పెక్టర్ వాసు ఆ పాత వేర్‌హౌజ్‌లోకి వెళ్లాడు. అక్కడంతా చీకటిగా, నిశ్శబ్దంగా ఉంది. ఆ పరిస్థితి అతనికి కొంత ఆందోళనకరంగా అనిపించడంతో అప్రమత్తంగానే కదిలాడు. జాగ్రత్తగా లోపలికి నడిచాడు. అప్పుడే అతనికి ఒక శబ్దం వినిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. అక్కడున్న పెట్టెల వెనుక ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. వాసు షాక్‌కు గురయ్యాడు. వెంటనే తన తుపాకీ బయటకు తీశాడు.

ఆ వ్యక్తి చూడటానికి ప్రమాదకరంగా ఉన్నాడు. వాసుకి కొద్దిగా భయం కలిగినా, ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. కొన్ని సెకన్ల పాటు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరూ మాట్లాడలేదు. ఆ వాతావరణం ఉత్కంఠతో నిండిపోయింది. అంతలో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవటం మొదలుపెట్టాడు. వాసు వేగంగా అతడిని వెంబడించాడు.

ఆ ఆగంతకుడు వేర్‌హౌజ్ మొత్తం కలియ తిరుగుతూ పరుగెత్తుతున్నాడు. ఆ దారిలో చాలా పెట్టెలు, ఏవేవో వస్తువులు అడ్డంగా ఉన్నాయి. అయినా వాటిని దాటుకుంటూ ఆ వ్యక్తి వాసు కంటే వేగంగా పరిగెడుతున్నాడు. అతడిని పట్టుకోవడానికి వాసు విశ్వ ప్రయత్నం చేశాడు కానీ ప్రతిసారీ ఆ ఆగంతకుడు చాలా లాఘవంగా తప్పించుకుంటున్నాడు. అతడిని ఎలాగైనా పట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు వాసు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది.

ఎంత ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఆ వ్యక్తి చీకట్లోకి పరుగెత్తి అక్కడ్నుంచి మాయమైపోయాడు. వాసు అక్కడికి చేరుకోని ఆ వ్యక్తి ఎటు వెళ్లాడో తెలియక ఆగిపోయాడు. అతనికి చాలా నిరాశగా అనిపించింది. చుట్టూ వెతికాడు కానీ ఎవరూ కనిపించలేదు. ఆ వేర్‌హౌజ్ మళ్ళీ నిశ్శబ్దంగా మారిపోయింది. అసలు ఏం జరిగిందో అర్థంకాక, వాసు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. >>

ఈ సన్నివేశం చదివినప్పుడు మీకేమనిపించింది. బహుశా “ఇది బాగానే ఉంది కదా? చెప్పాలనుకున్న విషయాలు రచయిత చెప్పగలిగాడు కదా? ఇందులో లోపం ఏముంది?” అని మీకు అనిపించి ఉండచ్చు. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. కథలో ఈ భాగాన్ని చదివిన తరువాత, మీకు మిగిలిన కథ చదవాలి అన్న ఉత్సాహం, ఉత్సుకత ఎంతమాత్రం కలిగింది? కథాంశం చూస్తే క్రైమ్ డ్రామా లాగా ఉంది. ఒక ఇన్స్‌పెక్టర్ ఒక చీకటి వేర్‌హౌజ్‌లో ఎవరినో అనుమానాస్పదంగా చూసి, అతడిని వెంబడించడం, ఆ ఆగంతకుడు తప్పించుకోవడం కథ. మామూలుగా ఇలాంటి కథాంశం పాఠకులలో చాలా ఉత్సుకతని రేకెత్తించాలి. టెన్షన్ కల్పించాలి. అలాంటిదేమీ పై కథలో కలగటంలేదు. నిన్న ముఖ్యమంత్రి కొత్త ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన చేశారు అన్న న్యూస్‌పేపర్ వార్తలాగా జరుగుతున్నది మాటల్లో నరేట్ చేసినట్లు అనిపిస్తోంది. కావాలంటే ఈ దృష్టితో మళ్లీ పై కథని చదవండి. మీకే అర్థమౌతుంది.

పైన కథని చెప్పిన విధానం కథని ముందుకు నడుపుతోంది, పాత్రలు ప్రాథమికంగా ఏం చేస్తున్నాయో కూడా తెలియజేజేస్తోంది, కానీ అది చాలా చప్పగా (Flat) అనిపిస్తోంది. ఎలాంటి భావోద్వేగాన్ని కలిగించలేకపోతోంది. దీనికి అనేక కారణాలు చెప్పుకోవచ్చు కానీ మనం మూడు ముఖ్యమైనవి చూద్దాం –

  1. పాత్రల భౌతిక కదలికలు (Movement & Gesture)

పైన ఇచ్చిన కథా భాగంలో ఉన్న ప్రధాన పాత్ర ఇనస్పెక్టర్ వాసుకి సంబంధించిన మూడు భౌతిక చర్యలను (physical activity) గమనిద్దాం.

>> జాగ్రత్తగా లోపలికి నడిచాడు

>> వేగంగా అతడిని వెంబడించాడు

>> చాలా ప్రయత్నించాడు

కథలో ఈ మూడు చెప్పారు కానీ అవి చాలా సాదా సీదాగా ఉన్నాయి. రచయితగారు చెప్పారు కాబట్టి నాకు అది తెలిసింది అన్నట్లు పాఠకులు దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు. కాకపోతే అన్నిసార్లు ఇలాంటి కథనం పని చెయ్యదు. ఇక్కడ వాడిన పదపంధాలు పాత్ర ఉద్దేశ్యాన్ని మాత్రమే చెప్తున్నాయే తప్ప, ఆ పనులు ఎలా జరిగాయో వివరించడం లేదు. అంటే ఏమిటి? ఇంకొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.

వాసు వేర్‌హౌజ్ దగ్గరకు వెళ్లాడు. అప్పుడు అతని మనసులో ఏం జరుగుతోంది? ఏం ఆలోచిస్తున్నాడు?

“ఇదేదో అనుమానాస్పదంగా ఉంది. లోపల ఎవరైనా ఉండే అవకాశం ఉంది. కాబట్టి నేను జాగ్రత్తగా లోపలికి వెళ్లాలి.” ఇలా అనుకుని, అనుకున్నట్టుగానే జాగ్రత్తగా నడిచాడు. ఇదీ జరిగింది. దీన్ని రచయిత పాఠకులకి ఎలా చెప్తున్నాడు “(వాసు జాగ్రత్తగా ఉండాలి అని అనుకుని) జాగ్రత్తగా లోపలికి నడిచాడు” అని చెప్తున్నాదు. కాకపోతే బ్రాకెట్‌లో ఉన్న మాటలు వదిలేసి చెప్పాడు. కానీ ఆ బ్రాకెట్‌లో ఉన్నదే రచయిత మనసులో ఉంది. పాఠకులకి కూడా అదే విషయం అర్థమౌతోంది. ఇది కథ చెప్పడం. వాసు జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నాడని చెప్పకపోయినా, జాగ్రత్తగా నడిచాడు అనడంలో ఆ ఆలోచన చప్పబడుతోంది. కానీ కథ చెప్ప కూడదని, ప్రదర్శించాలని కదా మనం చెప్పుకుంటున్నాం. సన్నివేశాన్ని దృశ్యరూపంలోకి తీసుకురావాలంటే ఇలా చెప్తే సరిపోదు. ఇలా చెప్పడం వల్ల పాత్రల భౌతిక చర్యలు చాలా సాదాసీదాగా మిగిలిపోతాయి.

మరేం చెయ్యాలి?

వాసు కదలిక ఎమిటో తెలుస్తోంది కానీ ఆ కదలికలు ఎలా ఉన్నాయో స్పష్టత లేదు. వాటిని వివరించాలి. ఉదాహరణకి ఈ క్రింది వాక్యాన్ని చూడండి –

>> వాసు ఏ మాత్రం చప్పుడు చెయ్యకుండా, వేటడానికి వెళ్తున్న పులిలా అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నాడు.

ఈ వాక్యం అతను జాగ్రత్తగా ఉండాలి అనుకున్న ఆలోచనని కాకుండా, జాగ్రత్తగా ఉండాలి అన్న ఆలోచన చర్యగా మారిన తరువాత అతను ఏం చేశాడో దాన్ని వర్ణిస్తూ ఆ విషయాన్ని తెలియజేస్తోంది.

తికమకగా ఉందా? చాలా సులువుగా అర్థమయ్యేలా చెప్తాను –

పాత్ర ఏం చేసిందో కాకుండా ఎలా చేసిందో చెప్పడం.

అది ఎలా చెప్పడం?

పాత్ర కదలికల గురించి చెప్పండి. శరీరంతో చేసే భౌతికమైన చర్యలను వర్ణించండి. ఉదాహరణకి కొన్ని వర్ణనలు/వాక్యాలు ఇస్తాను. ఆ వాక్యం ద్వారా ఎలాంటి ఎమోషన్ కమ్యూనికేట్ అవుతోందో చూడండి.

>> ఆ దృశ్యాన్ని చూడగానే అతను బిగుసుకుపోయి అలాగే నిలబడిపోయాడు.

>> అతని మాటల మధ్యలో ఆమె లేచి అటూ ఇటూ గబగబా నడిచింది.

>> ఆమె మాట్లాడుతున్నంతసేపు అతను తల దించుకుని, చొక్క చివర ఉన్న దారాలని తెంపుతూ ఉండిపోయాడు.

>> ఆమె తల తిప్పి నేలవైపు చూస్తూ గట్టిగా నిట్టూర్పు విడిచింది. వెంటనే కళ్లు తుడుచుకుని “ఆల్ రైట్! అలాగే చేద్దాం” అన్నది.

పై వాక్యాలు మాత్రమే చదివితే అవి నిర్దుష్టంగా రచయిత (నేను) అనుకున్న భావాన్నే మీకు కలిగించలేకపోవచ్చు కానీ, వాటిని ఒక సందర్భంలో (ఒక కథలో, నవలలో) ఉంచినప్పుడు, పాఠకులకు రచయిత కోరుకున్న భావోద్వేగం ఖచ్చితంగా కలుగుతుంది. అప్పుడు పాఠకులు రచయిత చెప్తే మాకు తెలిసింది అని కాకుండా, జరుగుతున్నది చూసి మేమే తెలుసుకున్నాం అని అనుకుంటారు. మనకి కావాల్సింది కూడా అదే.

  1. ముఖ కవళికలు, ప్రవర్తన (Expression & micro-behaviour)

ఇవి కూడా ఇంతకు ముందు నేను చెప్పిన చర్యలు లాంటివే. కానీ ఇంకొంచెం సూక్ష్మమైనవి. పైన ఇచ్చిన వాసు కథలో ఈ మూడు వాక్యాలను చదవండి.

>> వాసు షాక్‌కు గురయ్యాడు

>> ఎలాగైనా పట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు

>> అతనికి చాలా నిరాశగా అనిపించింది

వాసు అనే పాత్ర మనసులో కలిగిన భావోద్వేగాలను పేరు పెట్టి మరీ చెప్తున్నాడు రచయిత. ఇలా చెప్పడం వల్ల నాటకీయత దెబ్బతింటుంది. భావాలను నేరుగా చెప్పేయడం వల్ల పాఠకులకు వాటిని ఊహించుకునే అవకాశం ఉండదు — వాళ్లకి కేవలం సమాచారం మాత్రమే అందుతుంది.

నిజమైన భావోద్వేగాలు మనకు తెలియకుండానే మన శరీరం చేసే కొన్ని పనుల ద్వారా వ్యక్తమవుతాయి. శ్వాసలో మార్పు, కండరాల బిగింపు, చూపులో తీవ్రత, గుండే చప్పుడు మొదలైనవన్నీ అలాంటివే. ఒక్కోసారి ఈ మార్పులు ముఖ కవళికలలో కూడా కనిపిస్తాయి. వీటిని వివరించడం ద్వరా కూడా రచయిత పాఠకులకి పాత్ర మనసులో ఉన్న భావోద్వెగాన్ని నేరుగా చెప్పకుండా అండిచగలుగుతాడు. “అతను కంగారు పడ్డాడు”, “ఆమె అలసిపోయింది” అని నేరుగా చెప్పకుండా ఆ కంగారు, ఆ అలసట ఆ పాత్రల ముఖంలో ఎలా కనిపిస్తుందో చెప్పడం మంచి పద్ధతి. పెదవి బిగపట్టడం, కళ్ళు చిన్నవి చేసి చూడటం, మాట్లాడే ముందు గుటక మింగడం – ఇలాంటి ఎక్స్‌ప్రెషన్లు చదివినప్పుడు పాఠకులు ఆ పాత్రల మనసులో ఏముందో అర్థం చేసుకోగలుగుతారు. కొన్ని ఉదాహరణలు చూడండి –

>> శవం ముఖం మీద ఉన్న గుడ్డ తొలగించిన మరుక్షణం ఆమె కళ్లు మూసుకుంది. రెండు చేతులు తల మీద పెట్టుకుని, “భగవంతుడా” అని అరుస్తూ కింద కూలబడింది.

>> మాట్లాడినంతసేపు అతను ఆమె కళ్లలోకి చూడకుండా ఉండటానికి ప్రయత్నించాడు. మొబైల్ ఫోన్ ఈ చేతిలో నుంచి ఆ చేతిలోకి, ఆ చేతిలో నుంచి ఈ చేతిలోకి మారుస్తూనే ఉన్నాడు.

>> నవ్వి నవ్వి ఆమె ముఖం ఎర్రగా అయిపోయింది. పొట్ట చేత్తో పట్టుకుని, సోఫాలో నుంచి జారి కింద పడిపోయింది. ఒక చెయ్యి పొట్ట మీదే ఉంచుకుని, ఆపమన్నట్లు రెండో చేత్తో సైగ చేస్తూనే ఉంది.

  1. శబ్దం, నిశ్శబ్దం (Sound & Silence)

గతంలో రాసిన ఒక వ్యాసంలో పాఠకులకి ఇంద్రియానుభవాన్ని కలిగించండి అని చెప్పాను. ఇంద్రియానుభవం కలిగించడంలో దృశ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నా, ఆ తరువాత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినది శ్రవణానికే. కథ నడుస్తున్నప్పుడు ఆ సన్నివేశంలో ఎలాంటి శబ్దం వినిపిస్తోంది అనేది చెప్పడం లేదా చెప్పకపోవడం కూడా పాఠకుల పఠనానుభూతిని ప్రభావితం చేస్తుంది. పైన ఇచ్చిన ఇన్‌స్పెక్టర్ కథలో శబ్దాన్ని కేవలం ఒక ఖాళీని నింపే అంశంలా వాడారు.

>> (వెర్‌హౌజ్) నిశ్శబ్దంగా ఉంది

>> అతనికి ఒక శబ్దం వినిపించింది

>> వేర్‌హౌజ్ మళ్ళీ నిశ్శబ్దంగా మారిపోయింది

శబ్దం, నిశ్శబ్దం అనేవి వాడినా అవి ఎలాంటి భావోద్వేగాన్ని కలిగించని విధంగా వాడారు. ఈ కథలో శబ్దం ఉత్కంఠను కలిగించేలా వాడుకునే అవకాశం ఉంది. సస్పెన్స్ కథలలో శబ్దాల మధ్య ఉండే తేడా చాలా ఉత్సుకుతని కలిగిస్తుంది. ఆ అవకాశాన్ని రచయిత ఈ కథలో కోల్పోయినట్లే కదా!

శబ్దం గురించి ఏం రాయచ్చు? –

ప్రతిధ్వని: (పై కథలో) అది వేర్‌హౌజ్ కాబట్టి వాళ్లు పరుగెడుతున్న శబ్దం ఎలా ప్రతిధ్వనిస్తోందో చెప్పచ్చు.

నేపథ్య శబ్దాలు: బయటెక్కడో దూరంగా వినిపించే వాహనాల శబ్దమో, రైలు కూతనో, అదీ కాకపోతే కనీసం గాలి చేస్తున్న శబ్దం గురించి చెప్పచ్చు.

శబ్ద లక్షణం: శబ్దాన్ని వర్ణించడం. అది ఎలా అనిపిస్తోందో చెప్పడం. ఆ తీతివు పిట్ట అరుపు అతనికి వికారాన్ని కలిగించింది.

ప్రతిచర్యలు: వినిపించిన శబ్దానికి పాత్ర ఎలా స్పందించిందో చెప్పడం. ఉలిక్కిపడింది, మళ్లి వినడానికి చెవు దగ్గర చెయ్యి పెట్టుకుంది మొదలైనవి.

శబ్దం కన్నా ముఖ్యమైనది నిశబ్దం. నిశబ్దానికి కూడా రూపం ఉంటుంది. సస్పెన్స్, థ్రిల్లర్, హర్రర్ వంటి జాన్రా ఫిక్షన్‌లోనే కాదు, డ్రామా, లిటరరీ ఫిక్షన్‌లో కూడా నిశబ్దం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. కానీ నిశబ్దం అంటే ఏ చప్పుడు లేని నిశబ్దం ఎక్కడా ఉండదు. వ్యోమగామిగా అంతరిక్షంలోకి వెళ్లే వ్యక్తి కథ రాస్తుంటే కూడా అందులో శబ్దం ఉంటుంది. నిశబ్దంలో కూడా వినిపించే శబ్దాలు ఉంటయి. గడియారం టిక్ టిక్ అనడం, వర్షం పడటం, యంత్రం చేసే చిన్న శబ్దం, గాలి కదిలించిన పేపర్ చప్పుడు వంటివి ఉంటే ఆ కథ చదివిన పాఠ్కులకి ఆ అనుభవం సహజంగా అనిపిస్తుంది. అందాల్సిన అనుభూతి సరిగ్గా అందుతుంది. నిశబ్దం తరువాత వచ్చే శబ్దం ప్రభావం కూడా పరిశీలించదగినదే. రెండు నిముషాల నిశబ్దం తరువాత ఒక్కసారి సైరన్ మోగటంతో అందరూ ఉలిక్కిపడ్డారు. లాంటి వాక్యాలు అనుభూతిని ద్విగుణం, బహుళం చేస్తాయి.

గత భాగంలో నేపథ్యం, అందులో ఉండే వస్తువులు వాడంటం గురించి, ఈ భాగంలో పాత్రలు ప్రదరించి భౌతిక కదలికలు, పాత్ర శరీరంలో కనిపించే సూక్ష్మ కదలిక, శబ్దం (నిశబ్దం) గురించి మాట్లాదుకున్నాం.  ముగించ్చే ముందు ఇంకొక సలహా ఇస్తాను. కదలికలని కానీ, శబ్దాన్ని కానీ వర్ణించేటప్పుడు వీలైనంత కొత్త ఎక్స్‌ప్రెషన్ రాయటానికి ప్రయత్నం చెయ్యండి. అలా చేయటం వల్ల రచనకి కవితాత్మక ధోరణి వస్తుంది. ఈ పని కొంచెం జాగ్రత్తగా చేస్తే, త్వరగా పాఠకుల ఆదరణని, విమర్శకుల ప్రశంసని పొందుతారు.

ఉదాహరణకి –

>> ఎండకి ఆ రోడ్డు చుర్రెక్కింది

>> చీకట్లో అతను మెత్తగా అడుగులేశాడు

>> అతని గొంతు కంకర రాయిలా ఉంది

> ఆ హోరుగాలి అతని మనసు పుస్తకం లోని పేజీలను రెపరెప లాడిస్తోంది.

*

అరిపిరాల సత్యప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు