ఏటూరి నాగేంద్రరావు కవితలు రెండు

1
పజిల్ 
ఒక్కోసారి
మన మౌన మందహాసాలన్నీ
రాజకీయ చతురతలే!
ఎవరికి వారు
తమని తాము ఉన్నతీకరించుకొంటునప్పుడు
జీవిత సంగీతం
స్వరాలు మారక తప్పదు.
అప్పుడప్పుడూ నీ మనసు చెప్పిన
మాటను నువ్వినకపోతే
బతుకు పుస్తకంలోని
పేజీలు కూడా తడబడుతుంటాయి.
ఎవరు ఎవరికి
కాపలా కాస్తున్నారో అర్ధంకాక
కాలం పిచ్చిపాట పాడుకుంటుంది
అందులో
పదాలు పచ్చివే!
అర్ధాలు కూడా పిచ్చివే!
ఏదో ఒకరోజు
నువ్వు గమనించాల్సింది  ఒక్కటే!
మార్పు ఒక సత్యం.
అర్ధం ఒక అన్వేషణ.
కమిలిపోయిన నీ కళ్ళముందు
లోకమే
ఒక పిచ్చి పజిల్.
2
దయారహిత బాటసారి 
ఆట ఎపుడో మొదలైంది
ఎండిపోయిన రక్త కణాల మధ్య
మనసూ, దేహం
హింస కు గురౌతున్నప్పుడు
జరిగిన సంఘనటలన్నీ
ఒక్కొక్కటీ కళ్ళ ముందు
మెదులుతునప్పుడు
విప్పారిన నా కళ్ళలో
వింత దృశ్యం కనబడుతోంది
అది జ్వాలలా
చుట్టూ నర్తిస్తూ
నా వేదనను చూసి హేళన చేస్తుంటుంది.
ఒక్కోసారి కుటుంబ సభ్యుల
విసురులు విసుగులు కూడా
పిడుగుల్లా తగులుతాయి.
రాత్రుళ్లు కళ్ళ నిండా కనే
కలలు మాత్రమే సేద తీరుస్తాయి.
బొమ్మలా కదిలే నేను
నిశ్శబ్దాన్ని కావలించుకునే తిరుగుతాను.
జాగ్రత్తగా నన్ను నేనే
నాలో దాచిపెట్టుకొన్న
జీవన యాత్రలో
దయ రహిత బాటసారినే!
*

ఏటూరి నాగేంద్రరావు

నాకంటూ సాహిత్యరంగంలో గురువులెవరూ లేరు. చిన్నప్పటినుంచీ ఎక్కువగా పుస్తకాలు చదవడం, సమాజాన్ని నిశితంగా పరిశీలించడం అలవాటై రచనలను చేయడానికి ఉపక్రమించాను. అలా కాలేజీ మేగజైన్ లలో నా కవితలు ప్రచురించబడ్డాయి. ఆ ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా రాయడం మొదలెట్టాను.
ఈ క్రమంలో రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో
ఉద్యోగంలో చేరి ఉద్యోగ భాద్యతలు పాటు
సాహిత్యంలో కూడా నా బాధ్యతగా కవితలు
రాయటం మొదలెట్టాను.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవితలు చాలా బావున్నాయి… అభినందనలు సర్ 💐💐💐💐💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు