నది అంత మనిషి

1

నది అంత మనిషి

 

నిరాదరణ ఎడారుల్లో

నీటి చెమ్మ కోసం వెతుకుతాను

 

గొంతెండిన నా కోసం కాదు

మండిన కొన్ని గుండెల కోసం

 

ఈ ప్రపంచపు మహమ్మారి

ప్రేమరాహిత్యాన్ని తుంచడం కోసం

 

అనురాగపు ఆప్యాయతల

సాన్నిహిత్యాన్ని పంచడం కోసం

 

మనిషిని మనిషిగా

చెట్టును చెట్టుగా చూసే లోకం కోసం

 

విశ్వమానవ ప్రాముఖ్యాన్ని

గొంతెత్తి పాడుతాను

 

పూల పుప్పిడి రేణువులలో

తడిసి ముద్దవుతాను

 

నిదుర పాపల బోసి నవ్వుల

పసి మొహాలను

ఉయ్యాల్లో ముద్దాడుతాను

 

నేనో చాలా అత్యాశాపరున్ని

చిన్న ప్రేమవిత్తు విత్తి

అపార ప్రేమ తోటలను కోరుకుంటాను

 

నది అంత మనిషి ఎందుకు

పాయలు పాయలుగా

విడిపోయాడని దుఃఖ పడతాను.

 

2

అంత సులువు కాదు

అనుకుంటాం కాని మర్చిపోవడం

అంత సులువు కాదు

గుర్తు పెట్టుకోవడం బరువూ కాదు

 

నీ కోసం నేను ……

నా కోసం నువ్వు

కంసు పిట్టల్లా బతికాం చూడు

ఆ కాలాలే కమ్మనైనవి

 

ఎప్పుడైనా  ఎక్కడైనా నేను

ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు

నీ గురించి నువ్వు చెప్పు అన్నప్పుడు

వెంటనే నీవే గుర్తొస్తావు

 

నా గురించి నాకేం తెలుసు

నీకైతే బాగా తెలుసు

 

చెబితే  నమ్మవు కాని

నీ ధ్యాసలో పడి నేను

శ్వాసను కూడా మర్చిపోయా

 

నా బలమూ నువ్వే

నా బలహీనత నువ్వే అందుకేనేమో

నేను బతకలేకపోతున్నా

 

పగలూ రాత్రి ఒకే ప్రశ్న…

నన్ను పదేపదే తొలుస్తుంది

ఇద్దరం ఒక్కటై

ఒక్కటి మళ్ళీ…

ఇద్దరం ఎందుకయ్యాం?

 

ఇప్పటికి నీలం సందులో నేనొస్తుంటే

వీధిలో కొందరు గుర్తుపట్టి

మేడం బాగుందా అని అడుగుతున్నారు

 

ఏం చెప్పను ఎలా చెప్పను ఆ వీధికి

నీవు నేను  వేరని

మనం కలసి లేమని

మన దారులు  వేరని

 

సంతోషంతో ప్రారంభమైన

ప్రేమలన్నీ

విషాదంతో ముగుస్తాయట

 

విషాదంతో ముగిసిన వన్నీ

కాష్టంలోనే కాలుతాయా?

*

 

విశ్వనాథ రెడ్డి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సింప్లీ సూపర్. మనసులో దాగున్న ఇంకొక పొరను తాకింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు