Meditation

దిక్కులు పూర్తిగా వాటి ఉనికిని
గీతగీసుకోకముందే
ఏ పిలుపు అక్కరలేని అతిథిలా
నవ్వొచ్చి నా ముందు బాసీపట్టు వేస్తావు.

నా నిశ్శబ్దం అంతా
నువ్వెప్పుడో వెళ్తూ వెళ్తూ సృష్టించిన
విస్పోటనంతో నిండిపోతుంది.

మరపు చివరి కొమ్మ మీంచి లేచిన పక్షి,
మానిపోయిన గాయాన్ని
మాంజాతో కుట్టినట్టు
నిన్ను మళ్ళీ గుర్తు చేసి పైకెగురుతుంది.

ఊపిరి దారుల్లోంచి
పాదాల చివరంచువరకు
నీ పేరు
నేను ఎంచుకోని భక్తిపాటలా
పారుతూ ఉంటుంది.
ధ్యానం
శాంతినిప్రసాదించే మంత్రం కాదు
ఇప్పుడది
బతుకు దారి.

ఎత్తైన హిమాలయ పర్వతాల్లో
తప్పిపోయిన జపంలా
దూరంగా ప్రతిధ్వనిస్తూ,
అకారణంగా నొప్పిచ్చే
సూఫీ గీతంలా
నేను చేరలేని చోట్ల నుంచి
పాడుకుంటూ నువ్వొస్తావు.

నేనేమో
కొలతలకందని పాతగాయాన్ని
కొత్తగా మూస్తూ
ప్రతీ కుట్టును బిగిస్తూ
మరో పాఠం నేర్చుకుంటూ…

మరపు
మరణం.

ఊపిరి
ఊరటనిచ్చే నొప్పి.

ధ్యానం
నీ, నా పునర్జననం.

*

రవి వీరెల్లి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు