కలలు కనడం కవులు రహస్యంగా సాధన చేసే ఒకానొక భాష. ఆ స్వప్నాలు నిజమవ్వాలన్న బలమైన తపనే వాళ్ళ అక్షరాల్లో పలికే ఉద్వేగమంతా. గోపాల్ ఆ సాధననెన్నడూ వదులుకోని మనిషిలా కనిపిస్తాడు. సత్యమూ స్వప్నమూ పెనవేసుకునే తావుల్లో ఒక శుభ్రప్రపంచం కోసం తపనపడే కవిలా ఎదురొస్తాడు. అతని కవిత్వంలో వ్యక్తిగతమూ సామాజికమూ అన్న భేదం లేదు. ప్రపంచమంటే తనని మినహాయించుకుని చూసే చూపు లేదు. ఈ కంచె దాటితే తన పరిధిలోకి రాదన్న లెక్కలు చూపెట్టడు. అయినవాళ్ళు, కానివాళ్ళన్న గీతలు గీసుకోడు. అందుకే అతని కవిత్వంలో అమ్మ పాలు తాగిన రోజుల జ్ఞాపకాల నుండి, శతాబ్దాల కిందటే మాయమై సమాధుల్లో నిద్రించే మనుషుల కన్న కలల వరకూ అన్నీ కనపడతాయి.
గాథాసప్తశతి కాలం నాటి అమ్మాయెవరో తెల్లవారుఝాము కలలో కనపడింది అన్నప్పుడైనా, ముందు తరాల మనుషుల కలలు నెరవేర్చడం కంటే చెప్పుకోదగ్గ నాగరికత ఏముందని ప్రశ్నించినా అతని కలల ప్రస్తావనల్లో కనపడేది దురాశ లాంటి కోరిక కాదు. జరిగితే బాగుండునని ఊహగా వచ్చిపోయే ఆలోచన మాత్రమే కాదు. మనుషులమై పుట్టినందుకు జీవితం ఇలా కదా ఉండాలీ, అన్న ఆలోచన నిరంతరం సలిపేస్తున్నప్పుడు అనివార్యంగా నిద్రని ఆక్రమించే కలలనే అతను కవిత్వం చేసుకున్నాడు.
ఆ జీవన సౌఖ్యానికి తన ఇల్లు, పిల్లలు మాత్రమే ఆధారమనుకోలేదు. అనుకుంటే బహుశా అమ్మ లాలి దగ్గరే, నాన్న పద్యం దగ్గరే, ఆమె+నేను అంటే కవిత అంటూ ఆలితో జీవితం దగ్గరే ఆగిపోయేవాడేమో. కానీ ఉంటున్న సమాజం, సమాజాల్ని పొదువుకున్న ప్రపంచం, అన్నీ బాగుండాలని, అన్యాయాలు ప్రశ్నించబడాలని, అప్పుడే శాంతి పరిఢవిల్లుతుందని ఇతని నమ్మకం.
“పక్షులు ఆకాశానికి ఖండఖండాలు చేసి పంచుకోలేదు/ అడవిలో ఏ జంతువూ స్వతంత్ర రాజ్య ప్రకటన చెయ్యలేదు/ ఏ చేపా రాజై సముద్రానికి గోడలు కట్టలేదు” – అని గుర్తు చేసుకుని, మనిషెందుకిట్లా విధ్వంసం బారిన పడ్డాడని బెంగటిల్లడం ఈకాలపు ఇరుకు జీవితాలకి ఊరికే అలవడే లక్షణం మాత్రం కాదు.
ఒక జాతిగా మనుషులు పోగొట్టుకున్నదేదో ఈ కవికి తెలుసు. పోయినదేమిటో తెలిసి తడుముకునే మనిషికి, పొందాల్సినదాని పట్ల స్పష్టత ఉంటుంది. వదిలేసుకున్న ఆ జీవకాంతిని ఈ కవి ఊహల్లో తిరిగి నిండుగా నింపుకున్నాడు. వదిలివచ్చిన ఊరి మొదట్లోని రావిచెట్టుకి కట్టిన జ్ఞాపకాల జాజరను, ఇన్నేళ్ళైనా తన అక్షరాల్లో నిమురుకుంటూనే ఉన్నాడు. ప్రైవేటీకరణ గురించి తన ప్రశ్నలు తను వేశాడు. చనిపోయినవాళ్ళు తిరిగొస్తే, ఎర్ర ధర్నా చేస్తే బాగుండునంటూ, ఉన్నవాళ్ళకెవ్వరికీ ఆ మాత్రం ధైర్యం, పౌరుషం లేవన్న నిష్టూరం పలికించాడు. అతని ఆగ్రహం భయపెట్టదు, అకారణమనిపించదు. అర్థమవుతుంది. ఇట్లాంటి గొంతులు ఈ కొన్నైనా ఉన్నందుకే ఈ కాసిన్ని ప్రశ్నలైనా భద్రజీవితాలకు ఎదురవుతున్నాయని గుర్తు చేస్తుంది. సమాజంలో మిగిలిన ఈ కాస్త కదిలికా అన్యాయాన్ని అట్లా వదిలేయలేని గొంతుల సమిష్టి ఫలమేనేమో కదా అన్న ఆలోచననిస్తుంది.
పిల్లలకు లోకపు చీకటీ వెలుతురూ పరిచయమయ్యాక పక్షులూ పాటలూ చంద్రుణ్ణీ పిలిచే చేతులు మాయమవుతాయని – తెలిసి పలికిన స్వరం ఈ కవిత్వానిది. అందుకే పెద్దయిపోయిన ఈ పిల్లాడు తన కవిత్వంతో పిట్టల్ని మళ్ళీ పిలుచుకున్నాడు. చందమామని ఊరి చివరనున్న కొండకి కిరీటంలా అమర్చుకున్నాడు. వదలని రాగాలై బ్రతుకు తీవెని పెనవేసుకున్న పాటల్ని, పద్యాల్ని కవిత్వంలో అలవోకగా కలుపుకున్నాడు. వేటగత్తెలా మారి ప్రాణాలు లాగేసే సముద్రపు పాటనీ, గుంపులుగా సాగిపోయే సీతాకోకల పాటనీ, వెన్నెలరాత్రుల లాలిపాటనీ, కపర కపర చీకట్లో ఏటి నీళ్ళ ఎక్కిళ్ళ పాటనీ, గట్టిగా రాగం తీయడమే పద్యమని నమ్మిన అమాయకపు కొడుకు జ్ఞాపకాల నుండీ నాన్న పాటనీ, వెంటాడే రాగాలతో కవిత్వం చేశాడు. ఇవి ప్రయత్నంతో కవితల్లో చొప్పించగల పాటలు కావు. ఆ పాటలు పాడిన మనుషులు, ఆ పాటలను విన్న సందర్భాలు మనిషి అస్తిత్వంలో ఏకమైతే తప్ప ఇన్ని కవితల్లో వాటినిట్లా తీసుకురావడం అసాధ్యం.
గోపాల్ కవితలు విడివిడిగా చదివితే ఎలా అర్థమవుతాయో నేను చెప్పలేను. కానీ అన్నిటినీ ఇలా సంపుటిగా చదవమని అతను నాకిచ్చినప్పుడు మాత్రం, రాజకీయాన్నైనా ఏకాంతపు రాత్రులనైనా, మట్టినైనా మనుషులనైనా, అడవులనైనా అన్యాయాలనైనా హృదయానికి హత్తుకుని స్పందించే గుణమొకటి మారలేదని నేను గమనించాను. ఈ గాలి, ఈ నేల, ఈ నీరు ఇక్కడ అందరికీ సమానంగా అందాలని తపించే హృదయమొకటి గోపాల్‌లో అహరహం స్పందిస్తూ ఆరోగ్యంగా ఉంది.
“ఎండకు యే చెట్టుకిందకెళ్ళినా / కుల ధృవీకరణ పత్రం అడగదు
మతమో వర్ణమో చూసి /భూమి గింజను పొదువుకోదు..”
మరి మనుషులకెందుకు ఈ వైషమ్యాలు అంటూ ప్రశ్నించే గోపాల్ గొంతొకటి ఈ పుస్తకంలో నేను పదే పదే గమనించాను. అది ఉత్త మాట అనుకునేందుకు వీల్లేదు. రక్తసంబంధాలున్న ముందరి తరాల వాళ్ళనే కాదు, మెసపుటోనియా మనిషిని, సింధూ నదీ తరంగాల్లో తడిసిన మనిషిని కూడా గుర్తు చేసుకోగల నమ్మశక్యం కాని ప్రేమ ఒకటి ఇతని కవిత్వంలో మనుషుల పట్ల చూశాన్నేను. అట్లాంటి ఒక వెర్రి ఆరాటం లేకపోతే, ఈ ప్రపంచం గోపాల్ కే కాదు, ఎవ్వరికీ ఇలా ఉండేది కాదు. తోటి మనిషి పట్ల గోపాల్ చూపించే ఈ అక్కరే యుగాలుగా మానవాళిని నడిపిస్తున్న బ్రతుకుపాట.
“తొల్లిటి మానవుడి రక్తమాంసాల కొనసాగింపే నువ్వూ నేనూ” అన్న మాట తెలియని మనుషులం కాదు కానీ, మర్చిపోతాం. ఆ స్పృహ కలిగి, ఆ నిజం పదే పదే మననం చేసుకుని లోకాన్ని చూడటం అలవరచుకుంటే తప్ప, మహామహా యుద్ధాలేవో సమసిపోయి “ఏ సూచికలూ అంచనా కట్టలేని సంతోషం” ఒకటి రూపు కట్టదు. గోపాల్ ఆరాటమంతా అట్లాంటి సంతోషాన్ని గుప్పెట పట్టడం; ఆ సంతోషపు ఆచూకీ పట్టివ్వగల నిండుకుండల్లాంటి మనుషులను కూడగట్టడం.
*








Tqq, manasa
చాలా మంచి విషయాలు ప్రస్తావించారు మేడం. గోపాల్ సార్ కవిత్వంలో ఒక ఆకర్షణ ఉంటుంది. ఒక్కసారి చదివిన కవితలు మళ్ళీ మళ్ళీ వెంటాడుతాయి
Tqq
చాలా మంచి విషయాలు ప్రస్తావించారు మేడం. గోపాల్ సార్ కవిత్వంలో ఒక ఆకర్షణ ఉంటుంది. ఒక్కసారి చదివిన కవితలు మళ్ళీ మళ్ళీ వెంటాడుతాయి. మంచి వ్యాసం రాసిన మీకు వ్యాసంలోని అంశాలకు కారణం అయిన గోపాల్ సార్ కు అభినందనలు