అపనిందలు, అవమానాలు అలవాటయిపోయాయి ప్రభూ!
బిచ్చగత్తెను కదా, అపహాస్యం పాలవడం కొత్త కాదు. మిట్టమధ్యాహ్నం వేళ చెరువు గట్టున చతికిలబడి ఆకలితో జోలె విప్పి చూసుకుంటే నాలుగు మెతుకులు కంటబడ్డ రోజులెన్నని? ఆ పిడికెడు అన్నమ్మీద కూడా ఒక్కోసారి ఆకతాయిలు దుమ్ము చల్లి పోయేవాళ్ళు. నీరసంతో శోషొచ్చి చింతచెట్టు కింద కాసేపు కన్నంటితే “ఊరివాళ్ళ సొమ్ము తిని ఒళ్ళెరక్క నిద్ర పోతుంది” అనే బాటసారుల మాటలు గాలికి చెవినపడేవి.
***
నిరాదరణ గురించి ఏం చెప్పను? ఏ గౌరవాలకూ నాకు అర్హత లేదని అర్థమైంది, కానీ కారణాలు ఎన్నని ఊహించను? గత చరిత్రంటావా అంత గొప్పదేం కాదు. ఇళ్ళల్లో వస్తువులు, దుకాణాల్లో పళ్ళు ఏవి కనబడకపోయినా లోకుల చూపులు నన్నే వెతికేవి, ఎన్నో కళ్ళు నా ఆచూకీ కోసం కాపు కాసేవి. పాపం, వాళ్ళ కష్టం వాళ్ళది. నా ఆకలి, అసమర్థత నావి.
***
ఎంతో విలువైన ప్రాణాన్ని ఈ మట్టిముద్దలో నింపి పంపించావు నువ్వు. ఆ జీవశక్తిని కాపాడుకోవడం కూడా తెలీలేదు నాకు. ఏ ఇసుక నేలల్లో ఎంత వృథాగా ఒలకబోసుకున్నానో, మతిమాలి ఏ మధుపాత్రల్లోకి తుళ్ళిపడ్డానో! వెనక్కితిరిగి చూసుకుంటే దారితప్పిన మలుపు వరకూ చూపు ఆనదు. ఇతరులకి నేను చేసిన గాయాల పద్దు ఎక్కడో భద్రంగా రాసుకునే ఉంటారు. వాటినలా ఉండనివ్వు, నా ఒంటినిండా వేసిన బీటల లెక్కలు చెప్పి, ఎవర్నీ నొప్పించాలని మాత్రం లేదు. అసలిక్కడ ఇంకొన్నాళ్లు ఉండాలనే ఆశ కూడా లేదు. కొంతసేపు, కాదు కాదు, చాలా పొడుగాటి విరామం కావాలి.
ఏమో, మళ్ళీ వెళ్ళమని నీ ఆజ్ఞ అయితే కాదనలేను కానీ, ఈసారికి మాత్రం ఇంతే చేతనయింది.
నన్ను క్షమించు!
***








ఒక బిచ్చ గత్తె హృదయాన్ని ఎంత బాగా ఆవిష్కరించారో! ఈ జీవ శక్తిని కాపాడుకోవడం కూడా తెలియదు నాకు- ఇది చాలా ఆలోచింప చేసే వాక్యం.