ప్రేమ
పూల మాల కాదు
హృదయాల ప్రకటన కాగితం
కన్నీటి గీతమూ కాదు
కాలాన్ని ప్రశ్నించే నినాదం
ప్రేమలో కులాన్ని పట్టిచూస్తే
అది ప్రేమెలా అవుతుంది?
ప్రేమిస్తూ ప్రేమిస్తూ
ప్రేమకు భూమిని వెలకడితే
ఆ హృదయం వొక రిజిస్ట్రేషన్ పత్రం
ప్రేమలో
డబ్బుచూపుతో మాట్లాడటానికి
మనసేమైన అంగట్లో సరుకా?
అధికారపు పదగట్టనల కింద నలిగే పువ్వు కాదది
ఆలింగనాల ఆలవాలం ప్రేమ
ప్రేమలో గెలుపు
పూల తేరులో ఊరేగే ఉత్సవం
ప్రేమ సుందరమైన కలల ఎన్నిక.
ప్రేమ దేశంలో
మురికి ఈగలు ముసిరినప్పుడు
రాజ్యాంగానికి ముప్పువాటిల్లినప్పుడు
నేలపై గుండెలునిండిన ప్రేమ
న్యాయం కోసం పోరాటాన్ని పాడుతుంది
కుట్రల వలలో
ప్రేమ చిక్కినప్పుడు,
దోపిడీ చేతుల్లో
ప్రేమ బందీ అయినప్పుడు
ప్రేమగళ్ల మనుషుల మౌనం మహా నేరం కదా!
కులాన్ని కాల్చేసి
జాతి ఐక్యతకు పూనే
సత్యమే ప్రేమ.
ప్రేమే సత్యం
ఆశపడటమే
నేరమయిన దేశంలో
ప్రేమించడం ప్రతిఘటనైన చోట
ప్రేమకోసం
ఉద్యమించే ప్రేమికులు విప్లకారులు
ప్రేమ రాజకీయాలకంటే పెద్దదేమి కాదు
ప్రేమే నిజమైన రాజకీయం.








కవిత బావుంది తమ్ముడు
ప్రేమ నిజమైన రాజకీయం.👌
💐💐
శుభాకాంక్షలు