వెనక్కి తిరిగి చూడకు

వెనక్కి తిరిగి చూడకు.

 

తుఫాను ముగిసిన తర్వాత

అలసిపోయిన అలలు

ఒంటరి కన్నీటి నదులు

ఒక్కటొక్కటిగా కలిసి

ఉప్పునీరైన సముద్రం

సుడిగుండాల మధ్య తడబడి

పెను అలలతో పెనుగులాడి

ఒడ్డుకు చేరిన శిథిల పురాజ్ఞాపకం పడవ

 

భూమీ, సముద్రమూ, ఆకాశమూ చుట్టుముట్టిన చోట

దిక్కు తెలియక హతాశుడై పడిపోయిన ఒంటరి మనిషి

చెరిగిపోయిన పాదముద్రలు

ఎవరూ గీయని సైకత శిల్పం తీరం

కనురెప్పల మధ్య నిలిచిపోతాయేమో

ఇక వెనక్కి తిరిగి చూడకు!

 

దిగంతాలలో

సముద్రపు ఎడారిలోకి

అశ్రుబిందువులా మెల్లగా ఇంకిపోతున్న సూర్యుడు

ఏమీ పట్టనట్లు

ఎర్రటి జ్ఞాపకంలా పరుచుకున్న సముద్రం

దుఃఖంతో ఊపిరి ఉగ్గబట్టుకుని ఉద్విగ్నంగా

ఎటూ కదలని గాలి

మనసులో ముద్రలు వేస్తాయేమో

మళ్ళీ వెనక్కి మాత్రం చూడకు!

 

సముద్రం ఎప్పటికీ ఒంటరిది

కెరటాల చేతులు చాచి అర్ధించే బిచ్చగత్తె సముద్రం

ఏకాకి శిలలా

ఎదురుచూపులతో నిలబడిన తీరమూ ఒంటరే

 

వాన వెలిశాక

మబ్బుల మాటున

సగం చెదిరి వాలిపోయిన

ఇంద్రధనుస్సు ఒంటరి

తుఫానులో పడవలో

చేయిజారిన రొట్టెముక్కలా

సముద్రం పాలబడిన

విషాదపు సూర్యుడు ఒంటరి

 

అదిగో, అక్కడ గడ్డకట్టిన కన్నీటి చుక్కలా

ఒడ్డున కూలబడిన మనిషి కూడా ఒంటరే

ఇక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు!

 

వొంపులు తిరిగిన దారి నిన్ను పిలుస్తుంది

పర్వతాలు ప్రతిధ్వనులతో రారమ్మని పిలుస్తాయి

 

దుర్గమారణ్యం చేతులుచాచి

స్వాగతం పలుకుతుంది

కదిలే చెట్లకొమ్మలనుంచి రాలిపడే ఆకులు

వినీవినిపించకుండా

తెలియని రహస్యాలని గుసగుసలాడతాయి

 

తుఫాను జ్ఞాపకాలు

సముద్రంలో ఖననమైపోతాయి

పనికిరాని పడవ

దిగులు ఇసుకలో కూరుకుపోతుంది

పడవలో నీతో ప్రయాణం చేసిన మనిషి కూడా

ఏదో గమ్యాన్ని వెదుక్కుంటూ

ఎటో ఒకవైపు వెళ్ళిపోతాడు

 

ఇప్పుడు ఇక వెనక్కి తిరిగి చూడకు!

 

(రిచర్డ్ పార్కర్ కోసం..యాన్ మార్టెల్ నవల లైఫ్ ఆఫ్ పైలో, సముద్రంలో, తుఫానులో చిక్కుకున్న పడవలో నవలా నాయకుడు పై పటేల్ తో పాటు 227 రోజులు సహజీవనం చేసిన పులి పేరు రిచర్డ్ పార్కర్. మెక్సికో తీరం చేరాక, అన్ని రోజులు సముద్రంలో దారీతెన్నూ తెలియక అష్టకష్టాలతో, అంతకాలం పడవలో కలిసి ఉన్నాక, ఆ పులి, వెనక్కి తిరిగి చూడకుండా అడవిలోకి వెళ్ళిపోయిందనీ, అలా కనీసం వీడ్కోలు చెప్పకుండా వెళ్ళిపోవడం తనని బాధిస్తుందనీ పై పటేల్ అంటాడు. అతన్ని నేను మిస్ అవుతున్నానని చెప్పవచ్చా? అవును. నేను తనని మిస్ అవుతున్నాను. ఇంకా అతను నాకు కలలలో కనిపిస్తూనే ఉంటాడు. అవి చాలావరకూ పీడకలలు, ప్రేమతో కూడిన పీడకలలు…అంత అవమానకరంగా, కనీసం వీడ్కోలు సైతం చెప్పకుండా, ఒక్కసారంటే ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా, అతను నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోగలిగాడో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు. ఆ బాధ నా హృదయాన్ని ముక్కలు ముక్కలుగా కోసివేస్తుందని పై పటేల్ అంటాడు. రిచర్డ్ పార్కర్ ఒక ప్రతీక. అది పై పటేల్ ప్రతిరూపం కూడా కావచ్చు)

 

సుధాకిరణ్

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. చదివిందీ, ప్రస్తుతం ఉద్యోగ రీత్యా వుండేదీ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్ధిక అంశాల పైన, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పెను అలలతో పెనుగులాడి

    ఒడ్డుకు చేరిన శిథిల పురాజ్ఞాపకం పడవ

    కవిత బావుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.