ఉదారి నారాయణ గారి జీవిత విశేషాలు, సాహితీ ప్రయాణాన్ని పరిశీలించినప్పుడు ఆయన ఆదిలాబాద్ అడవుల ఆకుపచ్చని ఊపిరి పీల్చుకుని, ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి పరిశోధనా స్థాయి వరకు సాగిన ప్రయాణం సాహితీ ప్రపంచంలో ఒక విశిష్టమైన సంతకం. కె.శివారెడ్డి గారి ‘ఆసుపత్రి గీతం’పై ఎం.ఫిల్, ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత స్పృహ’పై చేసిన పరిశోధనలు ఆయన భావజాలానికి, అధ్యయన కృషికి నిదర్శనాలు.
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా వేలాది మంది విద్యార్థులకు అక్షర జ్ఞానాన్ని అందిస్తూనే, ప్రవృత్తిగా అక్షరాన్ని ఆయుధంగా మలిచారు. ‘ఆకుపచ్చని ఏడారి’ నుంచి ‘యాలైంది’, ‘మాగి పొద్దు’, ‘మళ్లీ మనిషిలోకి’ వరకు ఆయన కవితా సంపుటులన్నీ ప్రాంతీయ అస్తిత్వాన్ని, నేల మట్టి వాసనను, మానవీయ ఆర్ద్రతను గుబాళించాయి. ‘ఆదిలాబాద్ జిల్లా సాహిత్య చరిత్ర’ను గ్రంథస్థం చేసి మాతృనేల సాహిత్య వారసత్వాన్ని పదిలపరిచిన చరిత్రకారుడు ఉదారి. కవిత్వంతో పాటు నానీలు, నాటికలు, కథలు, సాహిత్య వ్యాసాల ప్రక్రియల్లో కలం పట్టి సృజనశీలతను చాటారు.
సాహితీ మిత్ర మండలి, దళిత రచయితల వేదిక, తెలంగాణ రచయితల వేదిక వంటి సంస్థల్లో బాధ్యతలు నిర్వహిస్తూ సాహిత్యోద్యమాలకు నాయకత్వం వహించారు. అలిశెట్టి ప్రభాకర్ స్మారక పురస్కారం, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్య స్మారక బహుమతులు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం భాషా పురస్కారం మరియు తెలంగాణ సారస్వత పరిషత్తు అవార్డు వంటి అనేక గౌరవాలు ఆయన అక్షర తపస్సుకు దక్కిన పురస్కాలు.
వీరు తమ తండ్రి కీ.శే. ఉదారి నాగదాసు గారి జ్ఞాపకార్థం 2000వ సంవత్సరం నుండి కవితల పోటీలను, 2019 నుండి కవితా సంపుటి పోటీలను నిర్వహిస్తూ, కవులను సత్కరిస్తూ తనవంతు సాహిత్య సేవను కొనసాగిస్తున్నారు.
అక్షరాన్ని మనిషి వైపు, మట్టి వైపు నడిపించిన బహుముఖ సాహితీ మూర్తి ఉదారి నారాయణ గారు తాజాగా రాసిన ‘కలిసి రావాలి’ కవితపై విశ్లేషణ “సారంగ” పాఠకులకు ప్రత్యేకం.
సాహిత్య ప్రక్రియలో, ముఖ్యంగా ఆధునిక వచన కవిత్వంలో వస్తువు, శిల్పం, రూపం అనేవి విడదీయరాని మూలస్తంభాలుగా నిలుస్తాయి. కవి అనుభవంలోకి వచ్చిన సత్యం లేదా ఆంతరంగికంగా అనుభవించిన ఆర్ద్రత కవితకు వస్తువు లేదా హృదయమైతే, ఆ వస్తువుకు ఒక బాహ్య ఆకృతిని ఇచ్చేది రూపం లేదా శరీరం అవుతుంది. అయితే కేవలం వస్తువు, రూపాలు ఉన్నంత మాత్రాన ఒక రచన ఉత్తమ కవిత్వంగా రూపాంతరం చెందలేదు. ఎంచుకున్న ముడిసరుకు లాంటి వస్తువును సాధారణ వచన స్థాయి నుండి నూతన అనుభూతి స్థాయికి తీసుకెళ్లే నిర్మాణ నైపుణ్యమే శిల్పం.
అనవసర పదాలు లేకుండా తక్కువ పదాలలో ఎక్కువ భావాన్ని ఇమిడ్చే సంక్షిప్తత, ప్రతీకలు, బింబాలు, ఉపమానాల సార్థకత, మరియు లయబద్ధమైన పాదాల విరుపు కలగలిసినప్పుడే కవిత్వానికి జీవకళ చేకూరుతుంది. ఈ శిల్ప నియమాలను లోతుగా పరిశీలిస్తూ డా. ఉదారి నారాయణ గారు రాసిన ‘కలసి రావాలి’ కవితను, దాని పరిణామ రూపాన్ని విశ్లేషించుకోవాల్సి ఉంది.
‘కలసి రావాలి’ వస్తువు, ఆత్మీయమైన అనురాగం, గురువు లేదా జ్యేష్ఠుని పట్ల ఉన్న ప్రేమాస్పదమైన ఆరాధనా భావాన్ని ఆవిష్కరించడంలో అత్యంత బలమైనది. ఎలాగో చూద్దాం.
__________________________
కలసి రావాలి
అతని ముందు
గుండెను గుమ్మరిచ్చి
మాటలను కుప్పబోసి
కండ్లారా చూడటానికి
అతన్ని కలిసి రావాలి.
అతని వాత్సల్యపు చూపులకు
ఒడలంతా సువాసనల తీగ అయ్యేదాకా,
అనుభవాల కొలిమిలో
పదునెక్కిన ముచ్చట్లు వింటూ
కాలపు జారుడుబల్లపై
సమయాన్నంతా ఒంపేయాలి.
అతని దయామయ హస్తాలు
తల నిమిరిన మరుక్షణమే—
ముడుచుకున్న చేతులు
విరబూసిన పూలకొమ్మలై ఊగుతాయి;
ఒక్కసారిగా ప్రాణశక్తి లేచి రంకె వేస్తుంది.
జారుతున్న అడుగులకు ఊతమై
నిలిచిపోతున్న శ్వాసకు ప్రాణవాయువై
ఒడిదుడుకుల వేళ
గౌరవాల పూలు చల్లినవాడు!
అతన్ని కలిసి సుఖదుఃఖాలను
తలపోసుకొని రావాలి.
మృత్యువు వాకిట్లో ఒరిగే లోపే,
పర్వతాలు దర్వాజాను మూసేసినా
సముద్రాలు హోరెత్తుతున్నా—
రేపనక, నేడనుకుంటూనే వెళ్ళిరావాలి.
అతను
అమాంతం నాలోకి ప్రసరించేదాకా
కలిసి రావాలి…
ఆ జీవిత సారాంశాన్నంతా
నాలోకి వంచుకొని రావాలి!
-ఉదారి నారాయణ
___________________________
పై కవితలోని అభివ్యక్తి సౌందర్యాన్ని, ప్రతీకలను పరిశీలిస్తే శిల్పసౌందర్యం స్పష్టంగా ఆవిష్కృతమవుతుంది. “ఒడలంతా సువాసనల తీగ అయ్యేదాకా” అనే పంక్తిలో భౌతికమైన చూపును ఆత్మగతమైన పరిమళంతో ముడిపెట్టి, అనుభూతిని దృశ్య స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ సువాసనల తీగ అనేది ఆత్మీయుని సమక్షంలో పొందే ఆంతరంగిక వికాసానికి ప్రతీక. “అనుభవాల కొలిమిలో పదునెక్కిన ముచ్చట్లు” అనే చోట, కొలిమి, పదునెక్కడం అనే లోహ సంబంధిత ధాతువులను అనుభవజ్ఞుని సంభాషణలకు వర్తింపజేసి, ఆ మాటలు జీవిత సత్యాలనే ప్రాణశక్తితో కూడుకున్నవని చాటిచెప్పడం జరిగింది. అలాగే, “ముడుచుకున్న చేతులు విరబూసిన పూలకొమ్మలై ఊగుతాయి” అన్న ఉపమానం సంకోచానికి గురైన హస్తాలు ఆత్మీయ స్పర్శ లభించగానే ఆనందంతో, సృజనాత్మకతతో వికసిస్తాయని లలితంగా వర్ణించింది. ‘ప్రాణవాయువు’ అనే పద ప్రయోగంతో శైలికి నిండుదనం, నిలకడ సమకూరాయి.
కవిత ముగింపులో “ఆ జీవిత సారాంశాన్నంతా నాలోకి వంచుకొని రావాలి” అనే రూపకంలో జ్ఞానాన్ని, అనుభవాన్ని ఒక ద్రవపదార్థంగా భావించి, ఆ మహా మనీషి ఉనికినే తనలోకి ఒంపుకోవాలనే తపనను వ్యక్తపరచడం ద్వారా కవితకు ఒక దివ్యమైన పరమార్థం లభించింది.
ఈ కవితా నిర్మాణం కేవలం కొన్ని విడి పంక్తుల సమాహారం కాదు; ఒక చరణం నుండి మరొక చరణానికి తార్కికంగా సాగిన ఆంతరంగిక ప్రయాణం.
మొదటి చరణంలోని ‘భేటీ అవ్వాలనే సాధారణ సంకల్పం’, రెండవ చరణంలోనికి వచ్చేసరికి ఆయన చూపుల వల్ల ఒడలంతా పరిమళించే మానసిక స్థితికి, ముచ్చట్లు వినే జ్ఞానార్జనకు చేరుకుంటుంది. మూడవ చరణంలో శ్రవణం దాటి, ఆ దయామయ హస్తాల ‘స్పర్శ’ లభించి, ముడుచుకున్న స్థితి పూలకొమ్మగా మారి ప్రాణశక్తి వికసిస్తుంది. నాలుగవ చరణంలో ఆ ప్రాణశక్తికి కారణమైన ఆయన రక్షణ, ఊత కర్తవ్యం వ్యక్తమై, అనుబంధం మరింత బలపడుతుంది. ఐదవ చరణంలో మృత్యువు, పర్వతాలు, సముద్రాలు వంటి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వెళ్లాల్సిందేననే ఆత్రుత వ్యక్తమై, ఆ ఆత్రుతే చివరి చరణంలో “ఆయన జీవిత సారాంశాన్ని తనలోకి ఒంపుకోవాలి” అనే అత్యున్నత ఆత్మసమీకరణతో కవితకు పరిపూర్ణతను అందిస్తుంది.
ఈ కవితలోని వస్తువు కవితకు హృదయమైతే, శిల్పం దాని ఆత్మ, రూపం దాని శరీరం. వస్తువు ప్లస్ రూపం మాత్రమే ఉంటే అది సాధారణ వచనం అవుతుంది; శిల్పం ప్లస్ రూపం మాత్రమే ఉంటే భావం లేని శబ్ద చమత్కారంగా మిగిలిపోతుంది. కానీ ఈ ‘కలసి రావాలి’ కవితలో సంక్షిప్తత, ప్రతీకాత్మకత, ఉపమాన సార్థకత, చరణాల మధ్య ఉన్న అనుసంధానత వస్తువును, శిల్పాన్ని ఒకే తాటిపైకి తెచ్చి, వచన కవిత్వ రూపంలో ఒక శ్రేష్ఠమైన కావ్యానుభూతిగా నిలిపాయి.
అనుభూతిని ప్రాణవాయువుగా, భావార్ద్రతను కవిత్వ బింబంగా మలిచి… మట్టి పరిమళాలు వెదజల్లుతూ, మనస్సులను తడిపే మరిన్ని మంచి కవితలు డాక్టర్ ఉదారి నారాయణ గారి కలం నుండి వెలువడాలని ఆశించడం తప్పు కాదు కదా!
*








నా విశ్లేషణ ప్రచురించినందుకు సంపాదకులు అఫ్సర్ గారికి, వారి టీం కు ధన్యవాదాలు
నా మీద ప్రేమతో నా కవిత్వాన్ని, నన్ను నా సాహిత్య జీవితాన్ని పరిచయం చేసిన ఆత్మీయ కవి మిత్రులు కొమ్మవరపు విల్సన్ రావు గారికి హృదయ పూర్వక ధన్యవాదములు. సారంగ పత్రిక ఎడిటర్ అఫ్సర్ గారికి ధన్యవాదములు.
ఉదారి నారాయణ గారు నాకు 1993 నుండి సాహితి మిత్రులు.DTF ఉపాధ్యాయ సంఘంలో ఇరువురం పనిచేయడం వల్ల వారితో స్నేహం మరియ బలపడింది వారు తన కవితలలో పేద ప్రజల ముఖ్యంగా దళితుల ఆదివాసీల పరిస్థితులను జీవన విధానాన్ని పాఠక లోకంలోకి తీసుకురావడానికి కృషి చేస్తూనే ఉన్నారు
ఇలాంటి కవిమిత్రులు దొరకడం సంతోషదాయకం