సమాజపు గారడీలో ఓడిపోయిన దొమ్మరులు

గారడీ విద్యలు లేదా సాముగరిడీలు లేదా సర్కస్ ఫీట్ల వంటి సాహసోపేతమైన శారీరక విన్యాసాలు ప్రదర్శిస్తూ ప్రజలకు వినోదాన్ని పంచే దొమ్మరులు దక్షిణ భారత దేశంలోని విశిష్టమైన సంచార జాతిగా గుర్తింప బడ్డారు. ఆదిమ జాతులు, కులాలు, తెగలపైన విస్తృతంగా పరిశోధన చేసిన ఎడ్గర్ ధరస్టన్, H.A. స్టూవర్ట్ వంటి మానవ శాస్త్రవేత్తలు ప్రారంభంలో వీరి జీవన విధానంపై పరిశోధన చేశారు. స్టూవర్ట్ ఉత్తర భారత్ లోని ‘డోన్’ తెగతో వీరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించాడు. దొమ్మరులు తెలుగు, మరాటీ, హిందీ మాట్లాడతారు. సంచార జీవితంలో వీరి భాష వివిధ భాషల సమ్మేళనంగా ఏర్పడింది. దొమ్మరి భాషలో ‘సిరగడు సొంచుతున్నాడు’ అంటే ‘అబ్బాయి వెళ్తున్నాడు’ అని అర్ధం. అమ్మాయిని ‘సిరగ’ అని, అన్నం ని ‘మెస’ అని, ఇంటిని ‘కరవం’ అని, పోలీసులను ‘పూడోల్లు’ అని, మంచాన్ని ‘కిట్లం’ అని అంటారు. వీరు ఎక్కువగా కర్ణాటక సరిహద్దుగా గల రాయలసీమ ప్రాంతంలో నివసిస్తూ గారడీ విద్యలు ప్రదర్శిస్తూ కోస్తాంధ్ర, తెలంగాణా లోని కొన్ని జిల్లాలలో, పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడులలో కూడా సంచరిస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా నివసిస్తూ ఉండడం వలన కడప జిల్లాలో ఒక ఊరికి ‘దొమ్మరి నంద్యాల’ అనే పేరు ఒచ్చింది. కడప జిల్లాలోని జమ్మల మడుగు, ప్రొద్దుటూరు, గూడెంచెర్ల, అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో వీరు ఒకప్పుడు ఎక్కువగా నివసించేవారని తెలుస్తుంది. పుష్పగిరిలో దొరికిన మధ్య యుగాల నాటి శాసనం వీరి ఆవాసాలను ‘వీడులు’ అని పేర్కొంది. వీరు దేవాలయాలకు దానం చేసినట్టు వారికి పేరు చివర ‘నాయుడు’ ‘రెడ్డి’, రాజు’ అనే కుల నామం ఉన్నట్టు ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. దొమ్మరుల ప్రస్తావన మధ్య యుగాలనాటి శాసనాలు, సాహిత్యంలో కూడా కనిపిస్తుంది. సాహిత్య గ్రంధాలలో సమాజంలో వింత వింత పనులు చేస్తూ ప్రజలకు, వినోదాన్ని, ఉత్సాహాన్ని కలిగించే వారిలో విప్రవినోదులు, వీరముష్టి వారితోపాటు దొమ్మరి వారు ఒకరని పేర్కొనడం విశేషం.

దొమ్మరుల పుట్టుపూర్వోత్తరాల గురించి కొన్ని కధనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కధ ప్రకారం ఒక దొమ్మరి  కుటుంబంలో పుట్టిన మగబిడ్డ వలన తమ వంశం నాశనం అవుతుందనే అపోహతో వారు ఆ బిడ్డను ఒక యాచకుడికి అప్పగిస్తే అతడు బిడ్డని పాడుబడ్డ బావిలో వెయ్యగా బిడ్డ ఏడుపు పార్వతి, పరమేశ్వరుల చెవిని పడుతుంది. వారు ఆ బిడ్డకు కుమ్మరి ఇంట్లో ఒక మట్టి బిక్షాపాత్ర, దానిలోకి ప్రతి ఇంటి నుంచి అన్నం దొరికేలా ఆశీర్వదిస్తారు. అయితే ఆ అబ్బాయి ఒకచోట నుంచి మరో చోటికి తిరిగే బిచ్చగాళ్ళు ప్రదర్శించే గారడీ విద్య నేర్చుకుంటాడు. అతని ‘ఉంపుడుగత్తె’ ద్వారా పుట్టిన సంతానమే దొమ్మరులు.

మరొక కధ ప్రకారం ఒక రెడ్డి కులస్తుడి భార్య ఆడపిల్లకు జన్మనిస్తే తల్లీ బిడ్డల్ని పురుటి సమయంలో ఉంచడానికి ఒక గుడిసెను ఏర్పాటు చేస్తారు. అయితే ఆ రెడ్డిగారి సోదరి బాలింతరాలిని, పుట్టిన పాపని ఇతరులు కులహీనులుగా పరిగణించే విధంగా చేస్తుంది. రెడ్డి కూడా తన ఆస్తిని తన మరొక భార్య సంతానానికి ఇచ్చి పుట్టిన పాపకి మాత్రం ఒక డప్పు, కర్ర గుంజ, ఒక తాడు మాత్రమే ఇస్తాడు. పాప వాటితో గారడీ విద్య నేర్చుకుని బతకడానికి వేశ్యావృత్తిని ఎంచుకుంది.

‘సాలువ పక్షి’ అనేది పౌరాణిక ప్రాధాన్యతగల దోమ్మరుల తెగ చిహ్నం అని చెబుతారు. వారి తెగ పెద్దను ‘మట్లి గురు’ అని పిలుస్తారు. ఆయన ఆద్యాత్మికంగా పూజారి వంటివాడే కాక భౌతికపరమైన అంశాలలో కూడా వారి కులపెద్ద వంటివాడు. వారికి అన్ని అంశాలలో వారికి సర్వాధికారి. అంతర్గత వివాదాలలో తీర్పులిస్తాడు. కడప జిల్లా చిట్వేలు కేంద్రంగా ఆయన పనిచేస్తాడు. చిట్వేలు కి ‘మట్లి’ అనే పేరు కూడా ఉంది. అక్కడ ఒకప్పుడు ఒక రాజుండేవాడు. ఆయన ఒకసారి తన ప్రజల్లో శారీరక విన్యాసాలు చేసేవారినందర్నీ ‘పోలేరిగాడు’, ‘రెడ్డి దొమ్మర’ అనే దొమ్మరివారి ప్రతినిధుల ద్వారా పిలిపించి వారికి తమ కళలో పోటీ పెట్టి రాజుని మెప్పించిన వ్యక్తికి ఒక బంగారు ఉంగరం ప్రదానం చేసి ఆ వ్యక్తిని వారసత్వ ప్రాతిపదికన వారికి కుల పెద్దగా గురువుగా నియమించాడు. రాజును మెప్పించి ఉంగరంతో కులపెద్దగా నియమించబడిన వ్యక్తికి సంబంధించిన వారసులు చిట్వేలు కేంద్రంగా దొమ్మరివారికి గురువుగా కొనసాగడాన్ని చిట్వేలు శాసనం వివరిస్తుంది. దొమ్మరి కులపెద్దలకు ‘రెడ్డి’, ‘నాయుడు’, ‘నాయక్’ వంటి పేర్లు కూడా ఉన్నాయి. నెల్లూరు మాన్యువల్ లో దొమ్మరివారికి గతంలో గొన్ని గ్రామాలలో మిరాసి హక్కు ఉండేదని, అలాగే వారిపైన ‘దొమ్మర లింగడ వీర కనికి’ అనే పేరుతో పన్ను విధించేవారని తెలియజేస్తుంది. తర్వాత కాలంలో వేంకటగిరి సంస్థానం కూడా వారిపై ‘దొమ్మర తఫ్రీక్’ అనే పన్ను విధించేవారని తెలుస్తుంది. ఈ కధ లంబాడీల పుట్టుపూర్వోత్తరాలను తెలిపే కధకు దగ్గరగా ఉంటుంది. దొమ్మరుల్లో రెడ్డి దొమ్మరులు, ఆరె దొమ్మరులు అనే రెండు తెగలవారున్నారు. రెడ్డి దొమ్మరుల భాష తెలుగు కాగా, ఆరే దొమ్మరుల భాష మరాటీ. ఆరే దొమ్మరులు సంచార జీవితం గడపగా రెడ్డి దొమ్మరులు స్తిరంగా ఒకచోటే ఉంటారు. దొమ్మరులకు ప్రత్యేకంగా భాష లేకపోయినప్పటికీ వారికి సంచారజీవనంలో వివిధ భాషల సమ్మేళనంతో తమదైన భాష, యాస ఏర్పడ్డాయి.

మద్రాసు ప్రెసిడెన్సీ లో జమీందారు హయాంలోని గ్రామాల్లో నివసించే దొమ్మరులు తాము జమీందారు బిడ్డలమని చెప్పుకుంటారు. బహుశా ఆ జమీందారు వారిని పోషించినవారై ఉండవచ్చు. వీరికి నేర స్వభావం ఉంటుందని తాము సంచరించే గ్రామాలవారు నమ్ముతారు. స్త్రీలు దువ్వెనలు, చాపలు, బుట్టలు అమ్మడానికి గ్రామాల్లో తిరిగేటప్పుడు అక్కడి ఇళ్ళ పరిస్తితులను గమనించి మగవాళ్ళకు సమాచారం అందిస్తారు అని వినికిడి. మద్రాసు ప్రెసిడెన్సిలోని నేరస్త జాతుల గురించిన సమాచారంలో దొమ్మరులు కూడా ఉన్నారు. దొమ్మరులకు కొరచ(ఎరుకల)వారితో, లంబాడీ వారితో కంచం పొత్తు, మంచం పొత్తు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే వారు తప్పిపోయిన ఇతరుల పిల్లలను, ‘శీలం’ కోల్పోయి కుల బహిష్కృతులైన స్త్రీలను తమ కులంలో కలుపుకుంటారనే అభిప్రాయం ఉంది. వీరి ఇంటిపేర్లలో కొన్ని తెలుగు సమాజంలోని ఇతర కులాల ఇంటి పేర్ల మాదిరి ఉంటే, మరికొన్ని పేర్లు ప్రత్యేకంగా ఉంటాయి. ‘అంజ గంటి’, ‘గగ్గరి’, ‘నాటక రాణి’, ‘మన్నేపల్లి’, ‘అన్నపరెడ్డి’, ‘పూల’, ‘సాలవ పక్షి’, ‘మాదాసు’, ‘పెద్ది’, ‘దొమ్మరాజు’ మొదలైన ఇంటిపేర్లు దొమ్మర్లకు ఉంటాయి.

స్త్రీలకు గారడీ విద్యలో మగవాళ్ళతో సమానంగా తర్ఫీదు ఇచ్చి శారీరక పరిపుష్టితో విన్యాసాలు సమర్ధవంతంగా చెయ్యగలిగే వారిని వేశ్యావృత్తిలోనూ, బసివిగానూ ఉండడానికి అనుమతించి ఆ విద్యల్లో నేర్పరితనం లేనివారిని పెళ్లి చేసుకోడానికి దొమ్మర్లు ప్రోత్సహిస్తారు. అందువల్లనే కాబోలు దొమ్మరి స్త్రీలకు ‘శీలం’ అనేది అటూ ఇటుగా ఉంటుందనే అభిప్రాయం సమాజంలో ప్రబలంగా ఉంది. వారిలో వ్యభిచారం సర్వసాధారణం అనీ, వారు ‘దేవవేశ్య’ గా చెప్పబడే ఊర్వశి సంతానం అనే ఒక కధ ప్రచారంలో వుంది. స్త్రీల వేషధారణ ఇతరులకంటే భిన్నంగా ఉంటుంది. అందమైన శరీర నిర్మాణంతో బాటు వారు ధరించే ఆభరణాలు వేరుగా ఉంటాయి. వీరు తమ కుటుంబంలో పుట్టిన పెద్ద కూతురిని ‘బసివి’ గా మారుస్తారని తెలుస్తుంది. దేవుడి పేరున గ్రాస్తులకు శారీరక అవసరాలు తీర్చడం, గ్రామాల్లో జరిగే జాతరలు, కొలుపులలో పాల్గొనడం ‘బసివి’ పని. బసివిరాలు దొమ్మరుల పెళ్ళితంతులో ముఖ్య పాత్ర వహించి పెళ్ళికూతురి మెడలో తాళి కడుతుంది. అలాగే స్త్రీ తాను వ్యభిచారం చెయ్యడానికి మొగ్గుచూపితే కులపెద్దల నుంచి అనుమతి ఉంటుంది. వారి వివాహ బంధం సులువుగా, మార్పులకు వీలుగా ఉంటుంది. ఇతర కులస్తుడితో ప్రేమ వ్యవహారం వలన స్త్రీ గర్భవతి అయినప్పటికీ అతడు ఆమెను పెళ్లి చేసుకోడానికి అంగీకరించనప్పుడు కులపెద్దలు ఆ స్త్రీని కులం నుంచి బహిష్కరిస్తారు. అయితే ఆమె వెంట్రుకలలో కొన్ని కుచ్చులు కత్తిరించి, ఆమె నాలుక చివరన బంగారు కడ్డీతో కాల్చి, విభూతి మింగించి పాప పరిహారం చేసి ఆమె తిరిగి వేరేవాళ్ళను వివాహం చేసుకోడానికి గానీ, వ్యభిచారిగా ఉండడానికి గానీ అనుమతిస్తారు. రాయలసీమ ప్రాంతం దొమ్మరి స్త్రీలు గతంలో బాగా పలుకుబడి, డబ్బు ఉన్న పాలెగాళ్ళకు ‘ఉంపుడుగత్తెలు’ గా ఉండేవారని, అప్పుడు వారి సామాజిక, ఆర్ధిక హోదా బాగుండేదని, రాజులూ, జమీందారులూ పోయాక పోషణ కరువై వారి పరిస్థితి రానురానూ దిగజారిపోయిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

దొమ్మరి స్త్రీలు కొమ్ము దువ్వెనలు, చెక్క దువ్వెనలు తయారు చెయ్యడంలో నేర్పరులు. దొమ్మరి స్త్రీ పురుషులిద్దరూ శారీరక విన్యాసాలు, గారడీ విద్యలు ప్రదర్శించడంలో నేర్పరులని వీరికి పేరు. ప్రాణాలకు తెగించి గ్రామాలలో వారు ప్రదర్శించే సర్కస్ ఫీట్లకు మంచి స్పందన ఉంటుంది. స్త్రీలు, చిన్న పిల్లలు కూడా రకరకాల శారీరక విన్యాసాలతో పాటు తాడుపైన నడుస్తూ నాట్యం చెయ్యగల నేర్పరులు. వీరి ప్రదర్శనను ‘దొమ్మరాట’ అంటారు. 1891 మద్రాస్ జనాభా లెక్కల్లో వీరు ఈత చాపలు, వెదురు బుట్టలు అల్లి ఇతరులకు అమ్మగా వచ్చిన డబ్బుతో జీవనం గడుపుతారని, కొందరు పందుల వ్యాపారం చెయ్యగా మరికొందరు వ్యవసాయం చేస్తారని పేర్కొన్నారు. ఎక్కువగా గారడీ విద్యలు చేస్తూ సంచార జీవితం గడిపే వీరు గాడిదల్ని పెంచుతూ వాటిపై తమ సామాన్లు వేసుకుని ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణం చేస్తుంటారు. వీరి ఇళ్ళ నిర్మాణం ఎరుకల వారి ఇళ్ళ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. తాటాకు గుడిసెలే వీరి నివాస గృహాలు. దొమ్మరులు అన్ని రకాల జంతువుల మాంసాన్ని తింటారు. పురుషులు పిట్టల్ని, పిల్లులను, నక్కలను వేటాడతారు. ఆహార సేకరణలో భాగంగా చేపలు పడతారు. స్త్రీ, పురుషులిద్దరూ మద్యం సేవిస్తారు.

సామాజిక హోదా పరంగా చూసినప్పుడు దొమ్మరులు మాల, మాదిగల కంటే కొంచెం పైమెట్టులో ఉంటారని సామాజిక వేత్తలు అంటారు. సాంకేతికంగా కూడా వీరు Most Backward Castes(MBC) జాబితాలో చేర్చబడ్డారు. హిందూ మతంలో కొందరు వైష్ణవాన్ని అనుసరిస్తే మరికొందరు శైవాన్ని పాటిస్తారు. పూర్వం దొమ్మరి విద్యలకు ప్రజల నుంచి, పాలకుల నుంచి పోషణ ఉండడంవలన జనానికి వినోదం పంచేవారిగా వీరికి సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం, ఆర్ధిక వెసులుబాటు ఉండేదని చరిత్ర చెబుతుంది. మధ్య యుగాల్లో వీరు మిరాసీదార్లుగా, పన్ను చెల్లించగలిగే స్థితిలో ఉండడాన్ని చూస్తాం. అలాగే దొమ్మరి స్త్రీలు కూడా ‘భోగ స్త్రీలు’ గా గుర్తింపు పొందారు. అయితే ప్రస్తుతం దానికి పూర్తిగా భిన్నమైన స్తితిలో సమాజం చేత నిర్లక్ష్యానికి, చీత్కారానికి దొమ్మరులు గురౌతున్నారని చెప్పొచ్చు. వారి విద్యను సమాజం పట్టించుకోవడం లేదు. వారు తయారు చేసి అమ్మే దువ్వెనలు, చాపలు, బుట్టలు ఉపయోగించే ప్రజల శాతం గ్రామాల్లో కూడా తరిగిపోతుంది. సమాజంలో ‘దొమ్మరి’ అనే పేరు అవమానకరమైన పదంగా భావించబడుతుంది. వారి స్త్రీలను సమాజం హీనంగా చూడడంతో కొందరు దొమ్మరులు కులం పేరు చెప్పుకోవడం లేదు. వారు గౌరవప్రదమైన జీవితం కోసం పరితపిస్తూ తమ వేష భాషల్లో కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేసుకుంటున్నారు. వారు పేర్ల చివర చేర్చుకున్న ‘రెడ్డి’, ‘నాయుడు’, ‘రాజు’ అని సమాజంలో ‘అగ్ర’ కులాలుగా భావించబడే పేర్లను పెట్టుకోవడం అందులో భాగంగానే పరిగణించాలి. ఆధునిక సమాజంలో జనాన్ని మోసం చెయ్యడానికి రకరకాల విన్యాసాలతో గారడీ చేసేవాళ్ళు అడుగడుగునా పెరిగిపోయిన సందర్భంలో సంచార జీవులైన దొమ్మరుల సంప్రదాయ గారడీ విద్యకు గుర్తింపు ఎక్కడ? ఒకరకంగా వారే సమాజం చేసే వింత గారడీలో చిక్కుకు పోయారనిపిస్తుంది.

*

చల్లపల్లి స్వరూప రాణి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Dommarla gurinchi vraasina vyaasam baavundi. Puttupoorvotharala vishleshana aadhaaralatho vraasaaru. Vruthulannitinee prapancheekarana naashanam chesthundi
    Thank you madam

  • Madam meru ma cast (dommara) pi raasina kathalo maku teliyani yenno vishayalu me dwara telusu kunnamu, ma generation vallu samajam lo andaritho anni vishayalalo pooti thatwanni pradarshistunnaru.okate bhadakara vishayam undi, adi yemitante memu kastapadi M.A.B.Ed, lanti post గ్రాడ్యుయేషన్ chesi yedo oka pani chesi sampadinchina ma వ్యభిచారం dwarane sampadhincharu ani e samaajam antundi, ee dhorani maarali madam. dhanyavadalu.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు