ఉమ్మనీటి కొలనులో ఈత – “ఇంకా సగం”

ఆకాశం రేఖల ఒడ్డున

నేను, నేల, నింగి

సమాంతర ప్రయాణి ‘కులం’ “   — జి. సత్య శ్రీనివాస్.

నేనో మట్టి సోకినోడ్ని’ అన్న సత్య శ్రీనివాస్ ఒక నిత్య సంచారి. అంతర్ముఖుడు. అన్నీ యిచ్చే పచ్చదనాల ప్రకృతిని కళ్లకూ ఇంటికీ అద్దుకుని జీవిస్తున్న అసలైన ప్రకృతి ప్రేమికుడు.

‘మార్పు అనివార్యం. కాని మార్పు అసహజంగా వున్నప్పుడు మనస్తాపం చెందుతాను. బహుశా ఆ ఉద్వేగం నుంచి వచ్చినదే ఈ ‘ఇంకా సగం’ సీక్వెల్’ అంటున్నాడు.

దురాశతో చొరబడిపోతున్న మనిషి కారణంగా వస్తున్న మార్పులను తట్టుకోలేని అడవి చేస్తున్న రోదనలనూ ప్రకంపనలనూ తన కవిత్వపు sophisticated రికార్డర్ తో నిశ్శబ్దంగా రికార్డ్ చేస్తున్నాడు . కాలికింద పడిన ఎండుటాకు గలగలల్నీ, ‘తుమ్మ కొమ్మలకి అంటిపెట్టుకున్న గూళ్ల ఊళ్లో రేయింబవళ్లను జతకలిపి పలికించే పక్షికూతల జుగల్ బందీ’నీ మట్టిమీద సూర్యచంద్రుల స్పర్శనూ వినీ తాకీ మనసుకు పట్టించుకునీ అక్షరాల్లోకి ఒంపి మనకు అందించాడు “ఇంకా సగం” సీక్వెల్ లో. సంచార జీవనమే తనకూ తన కవిత్వానికీ ఉన్న వారధి అని చెప్తున్నాడీ కవి.

సత్య శ్రీనివాస్ ప్రకృతి ఆరాధన తను తిరిగే ప్రదేశాలను exotic గా చూసే రకం ఆరాధన కాదు. అతని కవిత్వం చదువుతుంటే ఎట్టి పరిస్థితిలోనూ ఏ చోటులోనూ అతనొక టూరిస్ట్ కాలేడని ఇట్టే అర్థమౌతుంది. చెట్టూ నేలా గాలీ నీరూ అడవీ అన్నీ తనే. ఏవీ తననుంచి వేరుకాదు. నగరంలోనే బతుకుతున్నా సరే అడవికి అతను లోపలివాడే. మనసులో అడవిని పెంచుకుంటున్నవాడు. వృత్తిరీత్యా తను వివిధ ప్రదేశాలు తిరిగినప్పుడు ప్రకృతిని పురుగూ పుట్టా పిట్టలతో సహా, అక్కడ బతికే మనుషుల రెక్కల కష్టాలతో సహా, మైనింగ్ మాఫియాలూ ఇసుక మాఫియాల జేసీబీ చప్పుళ్లతో సహా నిశితంగా గమనిస్తాడు. నిన్న తను చూసినదానికీ నేడు చూస్తున్నదానికీ కొన్ని చోట్లలో చాలా అసహజంగా అనూహ్యంగా వస్తున్న మార్పులు తనను కదిలిస్తాయి. తను చేసిన ప్రయాణాల నెమరువేతలో ప్రకృతీ, విధ్వంసమూ, పర్యవసానంగా మనిషి పడుతున్న అవస్థా .. ఇవన్నీ ప్రేమా తాత్వికతా ఆవేదనా ఆగ్రహాలుగా మారి ‘కొండ కింది గూటి గొంతుకలు పలికే పరిభాష’ను అందుకుని ఒక కొత్త అభివ్యక్తిని వెదుక్కున్న కవిత్వంగా బయటకు వస్తాయి. చివరకు తన ప్రయాణాలన్నీ ‘ఉమ్మనీటి కొలనులోని ఈతలే’… నంటాడు.

సెందురూడా, నదింతే, జీనుభాయి గువ్వగూడు, ఇంకా సగం అనే నాలుగు భాగాలుగా విభజించబడి వున్న ఈ కవితా సంపుటిలో ఒకొక్క భాగంలో వున్న కవితలన్నిటికీ ఒక ఏకసూత్రత వుంటుంది.

“సెందురూడా” అనే భాగంలోని కవిత్వం అతను నగరంలో తిరిగిన ప్రదేశాలను నెమలీకల మెత్తదనంతో తాకుతుంది. పాత స్నేహాలతో ‘అప్పుడప్పుడు కలుద్దాం, మున్ముందు ఫేస్ బుక్ లు అప్ డేట్ అవుతాయి’ అని కరచాలనం చేస్తుంది. తనకిష్టమైన ‘కొన్ని మిగిలివున్న పచ్చని చివరి మజిలీ వాటికల’ను, అందులోని ఆప్తులను ‘వాళ్ల మట్టిమీద మన తడి అరికాలి రేఖలు ఇంకుతున్నట్టు’ స్పర్శిస్తుంది. “నదింతే” విభాగం దిక్కుమాలిపోతున్న నదీమతల్లి గురించిన వలపోత. “జీనుభాయి గువ్వగూడు” విభాగంలోని కవితలు అడవికి ప్రత్యేకం. గువ్వలనూ గూళ్లనూ, అడవి భాషనూ (literal గా కూడా), అడవి గింజలనూ, ‘వెదురు బుట్టలో కూర్చుని ఆలోచనల్ని అల్లుకుంటూ తన గూడులో తానే నిర్వాసితుడైనట్టు’ గా వుండే అడవి మనుషులనూ … అందరినీ పరామర్శిస్తాయి. “ఇంకాసగం” తన ఇంట్లోనూ మనసులోనూ నివాసం వున్న చెట్లచుట్టూ పూలచుట్టూ కుటుంబం చుట్టూ పరిభ్రమిస్తూ ‘ఎప్పటికైనా ఇల్లుని కవిత్వ పొదరిల్లుగా అమర్చాలని’ ఒక్కొక్క పుల్లా ఏరుకొచ్చే పిట్టలా శ్రమిస్తుంది. (“పక్షులు ముక్కున తీసుకున్న గరిక పరకల్లా నేను రోజూ కొన్ని అక్షరాల్ని ఏరుకుంటా ఇంటిని అక్షర మాలగా కూర్చాలని”. – ‘ప్రతిబింబం’ కవిత) ఈ విభాగంలోని కవితలన్నీ నిజంగానే గిజిగాడి గూళ్లకు మల్లే నిశితంగా శ్రద్ధగా అల్లబడ్డాయి.

***

‘సెందురూడా సెందురూడా’ రెండు కవితల్లోనూ రైలు కట్టమీద సగం తెగిన సెందురుడు విషాదభరితమైన బతుకు చిత్రాన్నంతటినీ ఆక్రమిస్తాడు.

ఉత్తరాల కాలపు ముత్యాలవంటి రాతల్లోనుంచో లేదా పక్షుల అడుగుల గుర్తుల్లాంటి వంకరటింకర గీతల రాతల్లోనుంచో రాలిన ఆప్యాయతలకు, ఆ రాసిన చేతికే వుండే ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం వుంటుంది. ఉత్తరం రాయటం, అందుకోవటం తెలిసిన తరానికి బహుమతి ఈ కవిత.

చిన్ననాటి ఉత్తరాల దొంతరలు

పురాతనింటి దూలానికి వెళ్లాడుతూ

మిగిలిపోయిన

వుబుసుపోని గాలికబుర్ల మూటల్లా

దర్శనమిస్తాయి…

వైర్లెస్ కాలంలో

అప్పుడప్పుడు

పాత ఉత్తరాల్ని

పక్షుల గాలాక్షరాలతో

చదువుకుంటాను

నాలోని తీగ మీద

కనిపించకుండా కూర్చున్న వాళ్ల అనుబంధాన్ని

నెమరేస్కుంటూ‘…

ఈ కవితకు కాంట్రాస్ట్ గా

“ఇప్పుడు

నేలగంధం లేనిచోట

వేప పువ్వు ఒక

ఎస్.ఎం.ఎస్. టెక్స్ట్”… అనటంలో మొబైల్ ఫోన్లో నుంచి ఆన్లైన్ మీడియా ఉగాది శుభాకాంక్షల హోరు వినిపిస్తుంది.

పట్నం నుండి వస్తున్న

అభివృద్ధి నియాన్ కాంతి

అడవి గూటిని పెకలించడానికి వచ్చే

ఎలక్షన్ మ్యానిఫెస్టో నాలుక లాగుంది”…

“రహదారులెంట

ఇసుకలారీల్లో ఆవిరైపోతున్న

తడిలా

చంద్రుడు

ఒక్కో చుక్కా రాల్చుకుంటూ

రోడ్లకి టైర్లముద్రల ముగ్గులేస్తూ

ప్రాణంలేని గాలిబుడగలా

పయనిస్తున్నాడు”

అభివృద్ధి పేరుతో జరిగే విధ్వంసపు పాలిటిక్స్ ను కవిత్వంలో ఇంత గాఢంగా వ్యక్తపరిచినందుకు సత్య శ్రీనివాస్ ను ఎంతైనా అభినందించాల్సిందే. వ్యాసాల్లో పర్యావరణం గురించి రాయటం జనంలో చైతన్యాన్ని కలిగిస్తుంది. కానీ స్లోగన్స్ ఏవీ లేకుండా నిఖార్సైన పర్యావరణ స్పృహను చిక్కని కవిత్వంలో కూడా చూడవచ్చని ‘ఇంకా సగం’ రుజువు చేస్తుంది. పర్యావరణం పట్ల ప్రేమనూ, ప్రకృతి విధ్వంసం పట్ల చైతన్యాన్నీ కలిగించటం కోసం ఈ కవితలు స్కూల్ సిలబస్ లో కవిత్వం విభాగంలో పాఠాలుగా పెట్టదగినవి. పై కవితను పిల్లలకిచ్చి టీకా తాత్పర్యాలు రాయమంటే, అడ్డదిడ్డంగా అడవులను నరికి మైనింగ్ చెయ్యటానికి అనుమతులిచ్చే ప్రభుత్వాల బండారాలు బైట పడవూ! దీనికంటే వనజీవి రామయ్య గురించి పాఠం చెప్పటం సులువుగా హాయిగా వుంటుంది. (వనజీవిని తక్కువచెయ్యటం కాదు సుమా, ఆయన చెప్పేదీ చేసేదీ వ్యక్తిగత స్థాయిలో చక్కని నీతి. దాని విలువ దానికి ఎప్పటికీ వుంటుంది.)

‘నదింతే’ కవితలోని sweep నదీ ప్రవాహాన్ని భౌతిక, అభౌతిక స్థాయిల్లో కళ్లముందు నిలిపే పదచిత్రాలుగా ప్రవహిస్తుంది. ఈ రెండు “నదింతే” కవితల్లో నది ఒక మలుపులో “తూర్పారబట్టిన మబ్బుకంకుల కుప్ప”గా ఆహ్లాదపరిస్తే మరో మలుపులో “రైతు కళ్లలో నీటిపొరల గుట్ట”గా “ఆత్మహత్యల గోరీలపై పొగమంచు సాంబ్రాణి” గా భయపెడుతుంది.

”నదింతే, కదిలితే తప్ప ప్రాణం పొందని పచ్చటి బుడగ..

నదింతే, తారు రోడ్డుకి అంటుకుపోయిన వెన్నెల రూపాయి..

నదింతే, వలసొచ్చిన బీజం, ప్లాస్టిక్ పాక, ఆకలాకాశం..

నదింతే, ఉనికిని రాసుకుంటున్న ఇసుక గోడ…

నదింతే,

నిన్న.. చూపుల మైదానం, కొండలోయల కరచాలనం, వంకవాగుల కలయిక.

నేడు.. ఇసుక హోరు, నీటిపోరు, దోపిడీ సరుకు.

రేపు.. యేటి ఒడ్డున ఒంటరి వృక్షం, చిట్లిన నరాలపై చెమటచుక్క, యుద్ధఢంకా.”

మొన్నటి వరకూ అందంగా సాగిన నది గతీ, నేడు కొందరి దురాశ నదికి చేస్తున్న క్షతీ, శుభ్రమైన నది కోసం రేపటి మనుషుల ప్రతిక్రియా ఇంత క్లుప్తంగా వ్యక్తమైనాయి.

సత్య శ్రీనివాస్ తన పొదరిల్లులాంటి ఇంటి వర్ణన చేస్తుంటే ఆ యింటి పచ్చదనాన్ని హారతిగా అద్దుకోవాలనిపిస్తుంది. తన

మొక్కల గూటిలో

గూటి నుండి

గూటికి చేరే దారి తప్పడం

చాలా కష్టం’ … (సంపెంగ పూ రేఖల వాకిలి)

ఇలా ఈ కవిత్వంలోనుంచి కోట్ చేసుకుంటూ పోవటం భావ్యం కాదు. ఎవరికి వారు చదువుకుంటూ ఈ దృశ్యాలను సొంత కళ్లతో చూసుకోవాల్సిందే.

అతను పేర్చిన పదాలు కళ్లముందు కట్టే చిత్రాలు. ఒకసారి ఆ చిత్రాలు ఒకదానివెంట ఒకటి ఒద్దిగ్గా పేర్చబడి ఒక దృశ్యాన్ని పరిపూర్ణంగా చూపిస్తే (ఉదాహరణకు ‘ఇంకా సగం’ భాగంలోని కవితలు, ‘అల్లిక’ లాంటి కవితలు), మరోసారి కొన్ని వాక్యాలు తేలిగ్గా, మరికొన్ని వాక్యాలు కళ్ళు నొప్పెట్టి వర్షించేంత గాఢంగా తికమకగా కోపంగా వుంటాయి. (ఉదాహరణకు ‘చెకుముకి రాళ్లడవి’, ‘కాకిమట్టి’ కవితలు. (‘నేలని నమ్ముకున్న పాదాలకంటిన మట్టి వలస పోయింది. అందుకే వర్షపు తడి పాదాల గుర్తులు గడప చేరవు’). కొండపోడు గూటిని కళ్లలోకి ఆవిష్కరించుకుంటేనే, ‘లిపిలేని భాష’ను శ్రద్ధగా వింటేనే ‘జీనుభాయి గువ్వ గూడు’ విభాగంలోని కవితలు సరిగ్గా అర్థం అవుతాయి.

ఇంతకూ, సత్య శ్రీనివాస్ కవితల్లోని కవిత్వాన్నీ అకవిత్వాన్నీ విడదీసి చూడగల సామర్ధ్యం నాకు లేదుగానీ ఈ కవితలు నా మనసుకెక్కాయి. చదివి, వొంటపట్టించుకోవలసిన రిలవెంట్ కాంటెంపొరరీ కవితా సంపుటి ‘ఇంకా సగం’ అని నాకనిపించినది ఇక్కడ పంచుకుంటున్నాను. ఉదయాల్లో సాయంత్రాల్లో ‘ఇంట్లో కరెంటు దీపాలు వెలిగించుకుంటారు వాకిలి కిటికీ రంగుని లోనికి రానియ్యకుండా… నేల ముంగిట తరం మారింది’ అంటున్న సత్య శ్రీనివాస్ కవిత్వాన్ని ఇప్పటి తరం వాళ్లు తప్పక చదవాలి.

చివరగా, విలువైన ప్రకృతి కవిత్వాన్ని రాసిన సత్య శ్రీనివాస్ ను ఎంతగా అభినందించాలో ఆ మొక్కల గూటిని అంత అందంగా నిర్మించటానికీ, అనుభవాలను నెమరేసుకుని కవిత్వం రాసుకుందికి తగిన ప్రశాంతతను సమకూర్చటానికీ తోడుపడిన తన పెంటి పక్షిని కూడా అంతే అభినందించాలి.

*

 

 

 

 

 

 

 

ల.లి.త

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు