సాయంబండ

సాయంబండ మా రంగస్థలం. ఒక వైపు జొన్న కల్లాలు, మరో వైపు పెసర కల్లాలు ఇంకో వైపు గడ్డి వాములు, పక్కనే కందివాములు, ఒక వైపు కర్మకాండలూ, మరో వైపు కుల పంచాయితీలు జరిగేవి

‘అయ్యా! సాపీరయ్య కొడుకు రాములు ‘ఆటో తిరగబడి చనిపోయిండు రా’ అంది. ఆమెకు ఫోన్ చేయడంరాదు. నేను చేస్తే ఎత్తి నాలుగు మాటలు మాత్రం బట్వాడా చేయడం నేర్చుకుంది. ఈవార్త మాత్రం నాకు అన్నం సహించకుండా చేసింది. బడిలో రాములు నాకు నాలుగేళ్ళు సీనియర్. అక్కడ తప్ప మిగతా సమయంలో ఆయన లోకంలోనే ఉండేవాడు.  రాములు ఊరి పొలిమేర గుండు దగ్గర వాళ్ళ పొలం లోనే పుట్టాడు పెరిగాడు. మళ్ళీ ఊరిలోకి వచ్చినా ఎవరితో కలిసేవాడు కాదు. ఒక్కసారిగా రాములు లోకం కళ్ళ ముందు సుడులు తిరిగింది.

ఉండడానికి హై వే పక్కన ఉన్నా అభివృద్ధికి మా ఊరు ఆమడ దూరం లోఉంది .  అక్కడ  ఇంచు ఇంచూ నా బాల్యం లో భాగం కనుక ప్రతి డొంకా, వాగూ, వంకా నాలో సజీవంగా ఉన్నాయి. పడమటి దిక్కు ఈదుల చెరువు, దాని కట్ట కింద దొరి బాయి దానికి ఆనుకునే జాతీయ రహదారి మీద ఒంటి మావిడి చెట్టు. దక్షిణం దిక్కు సాయంబండ, తూర్పు వారగా పెద్దబండ. పడమటి దిశగా పీతిరి జాలు. దాని మత్తడి దాటితే బండ దాని పక్కనే పొలాల మధ్య రాములు వాళ్ళ అయ్య సాపీరయ్య ఇల్లు. మాకూ రాములు వాళ్ళ ఇంటికీ మధ్య పీతిరి జాలు.  పాడి చేను మధ్యలో ఎత్తైన మట్టి దిబ్బ మీద రాములు వాళ్ళ రెండు దూలాల ఇండ్లు ఒకదాని ముందు మరొకటి వారగా ఉండేవి. ఆ ఇంటికి తూర్పు దిక్కుగా పొలాలు పడమర దిక్కు స్మశాన వాటిక, బండకు సమాంతరంగా వాళ్ళకు ఉన్న రెండెకరాల పొలం.

ఆ ఊరిలో మూడు బల్లపరుపు బండలు అందులో నాకూ సాయం బండకూ విడదీయరాని బంధం ఉంది.  నాకే కాదు ఊరి బాల్యానికీ ఆ గుర్తులు ఉన్నాయి. ఊరిలో పెద్దబండ, చిన్న బండ , సాయం బండలు మూడు సామాజిక దొంతరల లా ఉండేవి. ఈశాన్యం దిక్కున ముత్యాలమ్మ గుడి దాని పక్కన చిన్నబండ దానికి ఆనుకునే పెద్దమ్మ గుడి, అది దాటితే పెద్దబండ దాని వారగా వాగు. మా ఊరిలో ఉన్న మూడు బండలు మూడు భిన్న ప్రపంచాలు. అందులో పెద్దబండ పెద్దింటి కులాలది అయితే చిన్న బండ, సాయంబండ మావి. అయితే  మా ఊరు ఎప్పుడు పుట్టిందో తెలియదు గానీ ఆ బండ మా బ్రతుకు బారాన్ని మొత్తం మోసింది. ఊరిలో ఎవరి పంట అయినా పొలాల నుండి బండ మీద కళ్ళం లో సాగు అయ్యాక నే  ఇంట్లోకి చేరేవి. మిగతా బండల మీదకు మాకు ప్రవేశం లేదు కాబట్టి ‘సాయమ్మ బండ’  మా బ్రతుకులో భాగం అయ్యింది. ఎందుకంటె మా కష్టాలూ కన్నీళ్ల బరువు అదే మోసింది.  మా కడుపులు  ఎండినా నిండినా సాయమ్మ బండకు తెలియకుండా జరిగేది కాదు. ఇంట్లో ఉన్న ఉప్పూ, పప్పూ, అక్కడే అందరూ ఆరబెట్టుకునే వాళ్ళు . ఒక పక్క రోకళ్లతో వడ్ల దంపుల్లూ, మరో పక్క తాటికల్లు మండవా  ఉండేవి. రోలు బయట పడితే  కడుపు బయట పడుద్ది అనేది మా అమ్మ.ఇంటికి ఇంటికీ మధ్య తడికెలు బస్తాలు ఆదెరువు అయినకాడా ఈ పట్టింపులకు అక్కడ తావేలేదు. మాకే కాదు వాడ కట్టు అందరికీ సాయంబండ మాత్రమే   రోలు. అది కేవలం బండ మాత్రమే కాదు మాబ్రతుకు. చీకటి తోనే చెంబట్క పోయిన కాన్నించి సాయంత్రం కల్లం దాన్యం మొదలు  కైగూలి ఇటికి చేరిన దాకా మా ఇండ్లకీ బండకీ బ్రతుకులు గాను గెద్దులా తిరిగేవి. ఊరికి బండకీ  బొడ్డు తాడులా ఒక బంధం ఉండేది.

మా ఇల్లు కాలనీకి చివర ఉంటది. గొడ్డూ గోదం పొలాల లోకి పోకుండా రెండు పెద్ద దుంగలు పంగల కర్ర లాగా భూమిలో పాతి ఉండేవి. అది దాటితే మల్లీడి వారి మడులు. రెండు పెద్ద దుగాలు. మధ్యలో పిల్ల కాలువ. కాలువలో నీళ్ళ లో ఎన్నెద్ర పూలు . ఆ ఆకు పలకలకు రాస్తే నల్లగా నిగ నిగలాడేవి మట్టిపలకలు. ఆ దుగాల మధ్య పారే నీళ్ళ లో చిన్న చిన్న  కప్ప, పరక పిల్లలు. నల్ల గుత్తలు తిరిగేవి. ఆ దుగం దాటగానే పీతిరి జాలు అలా ముక్కు మూసుకొని  మత్తడి దాటితే బండ .      ‘సాయమ్మ అనే దేవత పేరు మీదుగా అది సాయంబండ అయ్యింది’ అని అందరూ చెబుతుండేవారు. సాయంబండ మాకు  రంగస్థలం. ఒక వైపు జొన్న కల్లాలు, మరో వైపు పెసర కల్లాలు ఇంకో వైపు గడ్డి వాములు, పక్కనే కందివాములు, ఒక వైపు కర్మకాండలూ, మరో వైపు కుల పంచాయితీలు జరిగేవి. సజ్జ,జొన్న కంకులు బండమీద ఆరబోసి రాగాల లేదా పట్టుగర్ర లతో లయబద్దంగా కూని రాగం తీస్తూ బాదుతూ ఉండేవారు. మరొక వరి కల్లం, పడుగు పరిచి  బంతిదోలి గడ్డి పక్కకు నెట్టి వడ్ల తూరుపాల.కల్లం ఊడ్చుకునే ఆడోల్లు. మరోవైపు దాన్యం కొలుస్తూ పొలిగలుగా అంటూ లయబద్దంగా కుండ తో దాన్యం బండ్ల ఎత్తడం.  వచ్చే పంట, పోయే పంట. అసలు ఆ బండకు తీరికే ఉండేది కాదు.

బండ పక్కనే ఉన్న జాలు ఇప్పుడు పూర్తిగా ఎండి పోయింది గానీ ఒకప్పుడు ఊరిలో ఉట్టిగుడ్డ, ముట్టుగుడ్డ, సచ్చిన ఎలుక, పిల్లి, కుక్క పెద్ద పెద్ద జంతు కళేబరాలు అందులోనే ఉండేవి. ఇంత దుర్గంధాన్ని తన కడుపులో ఎలా దాచుకుందో ఆ జాలు. దాని  నిండా చచ్చిన పశువు డోలకలు వాటి మీద  పీతిరి గద్దలు తారాడుతూ ఉండేవి. అసలు అది జాలా లేక కళేబరమా అర్ధం అయ్యేది గాదు. జాలు కట్ట మీద ఈత చెట్లు, పక్కనే కంసాలి వాళ్ళ గోరీలు. పక్కనే ఉన్న తాడి చెట్లు. వట్టితునకలు, దోసకాయ వొరుగులు ఆరబెట్టుకొని కొందరు. జాలు కింద తర్వాత ఉన్న వాగులో ఉతికిన బట్టలు ఆరబెట్టుకోవడం.పగలంతా సంతలా ఉండే బండ రాత్రి మాత్రం నక్కలకు స్థావరం అయ్యేది.  పండు వెన్నల్లో పచ్చటి తంగేడు పూల మధ్య  కల్లం దగ్గర కాపలా దార్ల ముచ్చట్ల, కాగుతున్న చలిమంట ఒక వైపు నక్కల అరుపులతో బండ తెల్లారేది.

మా ఊరి చెరువు అలుగు నుండి నీరు వంకలూ డొంకలూ  తిరిగి పంటకాలువ జాలులో కలిసేది. జాలు మత్తడి నుండి నీళ్ళు  రాతి బండను కాలువలాగా తొలిచి చాకల బీళ్ల దాకా పారేది.

మా ఊరు మరీ చిన్నది కాదు పెద్దదీ కాదు. జాతీయ రహదారి పక్కనే ఉన్నా ఆ ఊరికి ఏ చరిత్రా లేదు. కాకుంటే మా ఊరి సాపీరయ్య చరిత్ర చిన్నది మాత్రం కాదు. సాపీరయ్య కు పొలాల మధ్య ఇల్లు తో బాటు రోడ్ మీద తాటాకు గుడిసె చెప్పుల షాపు ఉంది. షాపు ఉంది కాబట్టి ఆయన సాపీరయ్య అయ్యాడు. రాములు కుటుంబం అందరిలా ఊరి లో ఉండదు. జాలు దాటాక వచ్చే సాయం బండ దిగువున వాళ్ళకు రెండెకరాల పొలం ఉంది. రాములు అయ్య సాపీరయ్య ఆరడుగుల వీరబావుడి లా ఉంటాడు.ఎత్తాటి మనిషి ఉబికి వచ్చే ఎర్రటి కనుగుడ్లు, బట్ట తల బాణ పొట్ట, చేతికి దండె కడాలు,ఇత్తటి పొన్ను కర్ర,ముంజేతికి కంకణం.ఆయనకు ఆ ఊరిలో రెండు ప్రపంచాలు ఒక షాపు రెండు బావి సేద్యం.అంతకు మించి అడుగు కూడా మందుకు వేయడు తన కుటుంబాన్ని వేయనీయడు. దానికి కారణం ఆయన ఎవరినీ అంత తేలికకగా నమ్మడు.

చిన్నప్పుడు బడి లేనప్పుడు పన్రాయి మీద ఆయన చేసే చెప్పుల మరమ్మత్తులు తదేకంగా చూసే వాణ్ని. మూరెడు పొడవు పనికత్తి,  దారానికి కొవ్వు పూసి సన్నని ఆరెను మిగ్ పాపలో గుచ్చి ఒడుపుగా దింపితే చూపుడు వేలునుంచి దిగిందా అనేటట్లు ఉండేది. పొద్దంతా ఆయనకు పనే లోకం. మఖ్మల్ గుడ్డ అంత నునుపుగా ఉండే తోలుతో అందమైన కిర్రు చెప్పులు చేసేవాడు. మధ్య మధ్యలో తెగిన పాత చెప్పులకు ఉంగటాలు సీలలతో మరమ్మత్తులు చేసేవాడు. ఆయన ఊరు నుండి పాడిచేను పొలాలలోకి ఎప్పుడు ఎందుకు మారోడో తెలియదు గానీ ఆయన ఆ చేనులోనే రెండు దూలాల బెంగుళూరు పెంకుల ఇల్లు కట్టుకున్నాడు.  చుట్టూ వ్యవసాయ భూమి. నాలుగు మామిడి చెట్లు . పొలం గట్ల మీద తాటి వనం, ఇంటి పక్కనే మోటబాయి. పొలం చుట్టూ పచ్చటి పసుపు పేరుపులా తంగేడు పూల బంధంలా. ఇంటి పక్కనే పెద్ద లంద అందులో ఊనేసిన తోళ్ళు. రాములు అమ్మ భూదేవి ఆమె బిగ్గరగా నవ్వగా ఏడవగా ఎవరూ చూడలేదు. తంగేడుచెక్క కొట్టి ఆ చెక్కను సాయం బండమీద ఎండ బెట్టడం.వంట మధ్య మధ్యలో మోటబాయి మీద మోట తోలడం ఆమె పని.  బండమీద తంగేడు చెక్క తీసి ఆరబోసే వాళ్ళు, ఎండ బెట్టిన  తంగేడు చెక్క తోళ్ళకి పెట్టేవాడు సాపీరయ్య. రెండు దున్న పోతులతో మోట తోలుతూ, తత్వాలు పాడుతూ సేద్యం చేసేవాడు.  ఇంట్లో కోళ్ళు, కుందేళ్ళు ,కొన్ని మేకలు.

సాపీరయ్య బ్రతుకు సకల సౌకర్యాల మధ్య ఉండేది. ఉన్న రెండెకరాలు కాలానికి అనుగుణంగా  మూడు పంటలూ పండించేవాడు. నాలుగు మామిడి చెట్లు పొలం మధ్యలోనే ఉండేవి. అక్కడ ఒక వైపు ఉల్లినారు. ఇంకో పక్క కూరగాయల పందిళ్ళు, ఆ ఇంటికి కరెంటు లేదు. కానీ ఎత్తాటి మట్టి దిమ్మ మీద పొడవాటి కర్ర మీద  చుట్టూ అద్దాలు ఉన్న పెద్ద లాంతారు ఉండేది. ఆ వెలుగు అటు పొలం ఇటు  బండదాకా ఉండేది. చిమ్మ చీకట్లో దూరంగా ఎత్తుగా వెలిగే ఆ దీపం సముద్రపు ఒడ్డున లైట్ హౌస్ లా కనిపించేది.   పిండార బోసిన వెన్నల్లో పచ్చటి తంగేడు పూల మధ్య నిశ్శబ్దంగా ఆ వొంటరి ఇల్లు. ఆ వాతావరణం లో సాపీరయ్య నీడలో పెరిగిన బాల్య యవ్వనం రాములుది. ఎప్పుడన్నా దీపంలో గ్యాసునూనె  అయి పోతే  చిన్న లాంతరు పట్టుకొని బండ దిగి, జాలు కత్తవ దాటి పొలాల మధ్య అర్ధ రాత్రి అపరాత్రి అనకుండా నడిచి వచ్చేది రాములు తల్లి భూదేవి. విరబోసిన జుట్టు కాటుక నలుపు సాయ. మేము అత్తా అనేవాళ్ళం ఆమెను. అర్దరాత్రి అపరాత్రి అనుకోకుండా చిన్న లాంతారు పట్టుకొని ఊరిలోకి వచ్చేది. పని అయ్యాక మా ఇల్లు దాటి చీకట్లో చేల మధ్య అదృశ్యం అయ్యేది.

రాములు తండ్రి  సాపీరయ్య ఏక్ తార మీద తత్వాలు పడేవాడు.  ఎప్పుడన్నా అది మీటుతూ ఊరిలోకి వచ్చేవాడు. ఆ పొలాల మధ్య ఎప్పుడు కట్టుకున్నారో నాకు తెలియదు, నాగరికత అంటని బ్రతుకులు, నిప్పు కోసం అగ్గెపెట్టే అవసరం కూడా ఉండేది కాదు. తాగడానికి చేదబాయి. సొరకాయ బుర్ర, నీళ్ళకి తోలు తిత్త, జకుముఖి సంచి దాంట్లో ఒక ఇనుప కడ్డీ పలుకురాయి రెండిటి మధ్య బూరుగు దూది పెట్టి అగ్గి రాజేసేవాడు. ఆ ఇంట్లో దీపానికి గ్యాసు నూనె అయిపోతే తప్ప ఊరు అవసరం వాళ్ళకు కలిగేది కాదు. ఆ ఇంట్లో  నుంచి ఆగకుండా పొగ దూరంగా కనిపించేది . ఇంట్లో పని అయ్యాక  రాలిన మామిడి కాయలను ఒక గంపలో ఎత్తుకొని బడి ముందు కూర్చునేది బూదేవి.

ఒక వైపు చెప్పుల షాపు ఇంకోవైపు మోట గొట్టి సేద్యం చేసేవాడు. ఏక్ తార మీటుతూ అస్పష్టంగా తన నోటికి వచ్చిన  రాగాలు తీసేవాడు రాములు తండ్రి. ఆయన ఒక పట్టాన ఎవరినీ నమ్మేవాడు కాదు. తన కుటుంబాన్నీ ఎవరితో కలవనిచ్చేవాడు కాదు. సొరకాయ బుర్ర తో చేసిన ఏక్ తార నే ఆయన లోకం.  ఆయన ఏ పాటలు  ఏ తత్వాలు పాడే వాడో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆశ్రమ మునుల బ్రతుకు నేను ఆ కుటుంబం లో చూసా. బాయి గిలక, పని రాయి మోత లతో అలరారే ఇంట్లో ఎండిన మామిడి ఆకుల అలికిడి మధ్య ఆయన తత్వాలు తీతువు పిట్టతో పోటీ పడేవి.

భూదేవి జాలు కట్ట మీద ఉన్న ఈతాకు తెచ్చి ఆరబెట్టి చాపలు పొరకలు అల్లేది. చెప్పులు, చాపలు, ఇంట్లో ఒక వైపు పెద్ద గుమ్మి. గుమ్మి నిండా వడ్లు. ఎండాకాలంలో జాలు కింద మావు తో చేపలు.ఈదుల్లో కల్లు. ఈత పొరకలతో  ఇల్లు మొత్తం ఒక చిన్న పాటి కుటీర పరిశ్రమలా ఉండేది. స్వయం సమృద్ధి గల ఇల్లుఅది. పచ్చటి తంగేడు వనంలో కొరత తెలియని  కొట్లాట లేని ఇల్లు అది.  మా ఊరి బైరాగి సాపీరయ్య.

సాపీరయ్య మోట బొక్కెన మూలపడ్డది. రాములు ఇంటి నిట్టాడి కూలింది.సొరకాయ బుర్ర,తోలుతిత్తి అందమైన కిర్రు చెప్పులు ఆయన తోనే అంతం అయ్యాయి. ఊరు ఊరంతా సాపీరయ్య అంతటి  పనిమంతుడు ఇక రాడేమో అన్నారు.ఆయన తర్వాత కొడుకు మల్లయ్య చెప్పులు కుడుతున్నాడు కానీ వాళ్ళ అయ్యలాగ పని మంతుడు కాదు.పాత చెప్పులకు ఉంగటాలు మాత్రం చేయగలడు. కొత్త చెప్పులు చేయగలిగినా ప్లాస్టిక్ రంగుల మెరుపుల ముందు తన తాటాకు పందిరి ముందుకు జనాలు రావడమే లేదు.

సాపీరయ్య అవతనం తోనే పొలంలో దీప స్థంభం ఆరింది. జాలు, బావి ఎండి పోయింది. పొలంలో వ్యవసాయం అటకెక్కింది. ఒకనాడు ఆటల పాటలతో అలరారిన సాయంబండ అవసరం తగ్గిపోయింది. జాలు మత్తడి పోసి ఏళ్ళు అయ్యాయి.చాకలి బీడులో చెలిమె పూడి పోయింది. ఏక్ తార తత్వాలనూ సాయంబండ రొదనీ తన తోబాటే తీసుకొని పోయాడా ఆయన అనిపిస్తది.

తండ్రి పోయాక విస్తాపితుడు అయ్యాడు రాములు. మిగిలిన సంసారాన్ని ఊరిలోకి మార్చాడు. గూడు మారినా మనిషి మారలేదు. కనీసం తన  పాలోల్లతో నూ కలిసేవాడు కాదు. ఆయనది సాపీరయ్య కన్నా లోతయిన అన్వేషణ. తనదైన లోకం.కొత్త బట్ట కట్టేవాడు కాదు. నలుగురి నడిచిన బాట నడిచేవాడు కాదు. ఇప్పటికీ ఆయన మర్మం విడిచి ఎవరితోనూ మాట్లాడడు. కేవలం ఒక్క మనిషి పట్టేంత ఇల్లు అతనే కట్టుకున్నాడు. అయ్య జ్ఞాపకంగా సొరకాయ బుర్ర, ఏక్ తార ఉట్టికి ఎలాడ దీసాడు. కొంచం మగతగా ఉండేవాడు. కారణం సాపీరయ్య బంధనాల మధ్య పెరిగిన పెంపకం. పరుల నీడ సోకని లోకం. పొలంలో ఇల్లు వదిలి ఊరిలోకి వచ్చాక భూదేవి కూడా ఎక్కువ కాలం బ్రతక లేదు. సడీ సప్పుడు లేకుండా ఆమె పాతింటి పక్కనే ఉన్న మట్టి పొరల్లోకి పోయింది. రాములు పొలం నుండి ఊరిలోకి మారినా మనిషి మాత్రం మారలేదు.

పొద్దున్నే కాసింత సద్ది టిఫిన్ లో వేసుకొని ఖమ్మం అడ్డా మీద కూలీకి పోయేవాడు. అడ్డా పక్కనే అద్దాల మధ్య మెరుస్తున్న అందమైన చెప్పుల షాప్ లు ఆయన్ని ఎక్కిరించేవి. ఆ షాపును చూసిన ప్రతిసారీ తోళ్ళ బాయి, తంగేడు చెక్క, లందే యాదికి వచ్చేది. తాతల నాటి నుండి అబ్భిన విద్య తన అయ్యతోనే పోయింది. దానికి కారణాలు వెతికే అంతటి శక్తి తనకు లేదని మాత్రం తెలుసు. అంతెందుకు తనకన్నా పెద్దోడు అన్నకు కూడా ఆ విద్య అబ్బలేదు. అలా అని బడి చదువుకు కూడా అబ్బలేదు. కస్టపడి ఇంటర్ దాకా చదవగలిగాడు. వాళ్ళ అయ్య పోయాక ఇంటర్ తో ఆపిన చదువు ఏపని దొరికితే ఆపనిలోకి మారేటోడు.  దగ్గరగా చూస్తే ఆయన వంట్లో రక్త మాంసాల కన్నా ఇసుక, సిమెంట్ పేరి ఉండేది. తెల్లగా పాలిపోయిన ఒళ్ళు. తోళ్ళబాయి పక్కనే పాడుబడ్డ ఒంటరి ఇల్లు. కన్నవాళ్ళు పోయాక రాములు బ్రతుకు మరీ ఇరుకు అయ్యింది. తనకు ఇష్టం లేకున్నా అక్కబిడ్డతో లగ్గం, మేనమావ వరస తనను మరీ పలసన చేసేది. తన్నేది, రక్కేది, కొట్టేది, ‘ఆ పెళ్లి  పాడుగాను తనను అరిగోస పెట్టింది’ అనేవాడు దగ్గరి వాళ్ళతో. ఆయనకు పెళ్లి కౌటుంబిక వ్యవహారం నచ్చేది కాదు. అసలు పొలం వదిలి ఎప్పుడూ బయటకి రాని రాములు నగరంలో కూలీ పని మరింత బయపెట్టేది. బ్రతుకు బండి నడవాల కాబట్టి ఇల్లుదాటాడు. కొన్నాళ్ళకి రాములుకి బిడ్డ, చంటి పిల్లను వదిలేసి భార్య ఎటో పోయింది. పసిపిల్లతో మళ్ళీ ఒంటరి యుద్ధం. ఇప్పుడు బిడ్డ కోసం అయినా మరింత జాగ్రత్త గా ఉండేవాడు. రోజు కూలీ సరిపోవడం లేదని హోటల్ లో పారేసిన కాలిన బూడిద బస్తాలో తెచ్చి అమ్మేవాడు. ఆధునికత అంటని రాములు వరి పొట్టు అమ్ముకోవచ్చు కానీ కాలిన వరిపొట్టు బూడిద కూడా అమ్ముకోవచ్చు అనే వ్యాపార సూత్రం ఆయనకు ఎలా అబ్బిందో !? బూడిద కూడా అమ్ముకోవచ్చు అనే వ్యాపార సూత్రాన్ని ఆయనే కనిపెట్టాడా ?

లోకం రీతి రివాజు తెలియని రాములు తండ్రి పాత్రలోకి మారాడు. కట్టుకున్నది బిడ్డను కని వదిలేసి పోయింది. పసిపిల్లతో మళ్ళీ ఒంటరి యుద్ధం. ఎన్నడూ తన ఒంటరి జీవితం మీద రంది పడలేదు. ఒక్క కన్నీటి చుక్క రాల్చగా చూడలేదు. బ్రతుకు యుద్ధమూ ఆపలేదు. ఆధునికత వాసన గిట్టని మనిషి రాములు. పొలంలో మోటబావి నడిసినంత కాలం పారే పంటకాల్వ లా ఉండేవాడు. ఇప్పుడు ఆయన బాల్యం ఒక కలలా మాయం అయ్యింది. బండపక్కన జాలులా ఆయన గతమూ ఎండి పోయింది. తెగిన ఏక్తార తీగెలా గతానికీ వర్తమానానికీ బాంధవ్యాలు తెంపుకున్నాడు. రాములు బెరుకు మనిషి. అతనిది సాపీరయ్య లోకం కన్నా లోతయినది. ఆధునికత వాసన గిట్టని మనిషి.ఈ మధ్యనే తల్లి లేని బిడ్డ పెళ్లి కూడా చేసాడు.మనవడు కూడా పుట్టాడు.బిడ్డ అత్తవారి ఇంటికి పోయాక మళ్ళీ ఒంటరి చుక్కలా మిగిలాడు.

సాపీరయ్య కోడుకు బ్రతుకు సాఫీగా సాగుతున్న సమయంలో ఒక సాయంత్రం నగరంలో పని అయ్యాక ఆ రోజు అమ్మాల్సిన బూడిద బస్తా నెత్తిన ఎత్తుకొని ఆరోజు కూలి  డబ్బులు పాంట్ లోపలి జేబులో వేసి దానికి ఒక పిన్నీసు పెట్టి దొరికిన ఆటో లో ఇంటి దారి పట్టాడు. వానయినా పిడుగయినా జాలు మత్తడి ఉదృతంగా పారినా అర్దరాత్రి అపరాత్రి అని తెలియకుండా తిరిగిన రాములు విశాలమైన రోడ్ మీద మాత్రం ఎప్పుడూ తడబడే వాడు. భయం, ఒక అనిశ్చితి తెలియని ఒక పెనుగులాట ముఖ్యంగా నగరం ఆయనను బాగా బయపెట్టింది. బయలు దేరిన రాములు ఆటో ఎదురుగా వస్తున్న బర్రెను గుద్ది తిరగ బడ్డది .అనకొండ నాలుకలా సాగిన రాములు నిర్జీవిగా మిగిలాడు. వొంటరి రాములు అంతమ నడక లో ఊరు ఊరంతా జాలు పక్కన బండ కింద బొందల గడ్డ ఆయన పారాడిన బాల్యం లోకి శాశ్వతంగా మట్టి పొరల్లోకి పోయాడు.

సాపీరయ్య వైభవోపేత గతం కూడా గతంలో కలిసింది. తంగేడు పూల వనం కూడా సాపీరయ్య తోనే పోయింది.పచ్చటి పొలాల మధ్య పారాడిన బాల్యం రాములు యాది. సాయం బండ,దిమ్మె మీద దీపం. సాపీరయ్య, భూదేవి పక్కనే రాములు జ్ఞాపకం విశ్రమించింది. రాములు పోయాక బావి దగ్గరకు పోయా. మట్టి దిబ్బ, ఎండిన మామిడి చెట్ల మధ్య జిల్లేళ్ళు.పసుపు ఆరబోసినట్టు  తంగేళ్ళు, రాములు నవ్వులా గునుగుపూలు  పూలు తంగేడు చెక్క ఉన్నంత కాలం మోటబావి నడిచినంత కాలం రాములు కాలికి చెప్పు అవసరం లేకుండా గడిచింది. రాములు అంతరంగం తెలియకున్నా అతని ముగింపు నన్ను వెంటాడుతూనే ఉంది. నాకెందుకో అక్కడ ఉండబుద్ది కాలేదు. పల్లేరు గాయల మధ్య విసురుగా బండ దాటి మత్తడి మీదుగా ఇంటికి వచ్చా ఎదురుగా రాములు పిండపాతాలం ముందు జంగమయ్య శంఖం ఊదుతూ నడుస్తున్నాడు. నేను నగరం దిశగా  తిరుగు ప్రయాణం అయ్యా.

*

 

గుర్రం సీతారాములు

పుట్టెడు పేదరికంలోంచి వచ్చి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మకమైన ఇఫ్లు నుంచి డాక్టరేట్ అందుకున్న బుద్ధిజీవి గుర్రం సీతారాములు. సామాజిక సాంస్కృతిక పోరాటాల మీదా, ప్రతిఘటన రాజకీయాల మీద సునిశితమైన అవగాహన వున్న కల్చరల్ క్రిటిక్-- బహుశా, తెలుగులో ఆ భావనకి సరైన నిర్వచనం అతనే.

15 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నన్ను కథకుణ్ణి చేసి బొడ్డుకోసి పేరుపెట్టిన సారంగ కు కృతజ్ఞతలు. ఇది కథొ కాదో నాకు తెలియదు.నేను చూసిన బ్రతుకు ఇది. అయితే రాములు ఆయన తండ్రి సాపీరయ్య బ్రతుకు కథంత చిన్నది కాదు, నవల అంత విస్తారమైనది. నా ఊరి బాల్యం సాయంబండ మీద సేదతీరింది.సేద అనడం కంటే బ్రతుకు యుద్ధం చేసింది. నాగరికత వాసన ఎరగని చెమ్మ ఆరని బ్రతుకులు ఇవి. ఇందులో లోపాలు నిర్మొహమాటంగా చెబితే నేర్చుకుంటా…
    థాంక్స్ అఫ్సర్….

    • సార్ మీరు పంపిన సందేశం ఇరోజు
      మాదిగ జాతి సంస్కృతి ఇనాటి తరానికి బాగా అర్థం అవుతుంది సారు మీరు గ్రేట్ సార్ డాక్టర్ గుర్రం జాషువా అంతటి వారు కావాలి సార్

  • ఒక తరం ముందుకు పోయి కొన్ని జీవితాలను తాకినట్టు, వారితో మాట్లాడినట్టు ఉంది.

  • గ్రామాలలో సబ్బండ కులాలు ఒక కంచంలో తిని, ఒకే మంచంలో పండినట్టు గొప్ప రొమాంటిక్ గా రాసేవాళ్ళకి తెలుగు కదా సాహిత్యంలో కొదవ లేదు. అక్కడ ఉండే రెండు మూడు ప్రపంచాల గురించిన ఎరుక ఉన్న కధ ‘సాయం బండ’. ఇందులో సాపీరయ్య కేవలం కుల వృత్తి చెయ్యడం వలన ఆత్మగౌరవాన్ని పొందలేదు. మిగిలిన కులాలకు దూరంగా ఉండి ఓ పక్క చెప్పులు కుట్టడంతో పాటు, చెప్పుల షాపు పెట్టుకోవడం, మరో పక్క రెండెకరాల భూమి సంపాదించి దాన్ని సాగు చెయ్యడం వలన అతడు గ్రామంలోని ఇతర పెత్తందారీ కులాల పీడన నుంచి బయటపడ్డాడు. ఇది వీరయ్య ప్రయత్నపూర్వకంగా సాధించిన విజయం. ప్రపంచీకరణ వలన కునారిల్లిపోతున్న కుల వృత్తుల మీద కధలు వచ్చాయి గానీ కుల వృత్తితో పాటు తన కుటుంబానికంటూ ఓ ప్రత్యేక ఆర్ధిక వ్యవస్థనీ, స్వయం పాలననీ ఏర్పాటుచేసుకునే వీరయ్యలు కూడా గ్రామాల్లో ఉంటారు. వారిది ఓ పెద్ద పెనుగులాట. ఆ పెనుగులాటని గుఱ్ఱం సీతారాములు ‘సాయం బండ’ లో కళ్ళముందు నిలిపాడు. ఇలాంటి కధలు ఇంకా రావాలి. కధకుడు సీతారాములుకి అభినందనలు…

  • సీతారాములు గారు… మీరు కథ రాయడం చాలా సంతోషం. మొదటి కథ కదా. లోపాలు ఉంటాయి ఫర్వాలేదు.
    1. మీ ఊరి అనుభవాలన్నీ ఒకేసారి ఒకే కథలో ఇరికించాలనుకున్నారనుకుంటా….
    ఇందులో చాలా కథలున్నాయి. ముఖ్యంగా మూడు కథలు ఒకే చోట రాశారు.

    సాయం బండ కథ వేరే.
    సాపీరయ్య కథ వేరే.
    మళ్ళీ కొడుకు కథ వేరే.

    వాళ్ళతోనే కాకుండా ఇంకా మీ నోస్టాల్జియా ఊరితో ఉంటుంది కదా. అది ఇంకో కథ అవుతుంది.

    వాస్తవానికి ఇందులో నవలకు కావాల్సినంత విషయం ఉంది.
    మొత్తానికి మంచి ప్రయత్నం చేశారు. ఇంకా మంచి కథలు రాయాలి మీరు. కంగ్రాట్స్.

    • థాంక్ యు మామ్..మొదటి ప్రయత్నం. కొన్ని తప్పులు కూడా చేశా చూసిన జీవితం అంతా ఒక దగ్గర పోగేసే ప్రయత్నం చేశా. ముందు ముందు సరి చేసుకుంటా. ఇది పలు వ్యక్తిత్వాల సమాహారం ఇంకా నా కథలోకి రాలేదు. నవల గా రాయాలి అనే ఆలోచన చాలా కాలంగా అనుకుంటూనే ఉన్నా. రాములు కథ కన్నా సాయం బండ భూమిక గా ఈ సిరీస్ రాయాలి అని ఆలోచన.

      • మొదట ఈ కథ చదివినప్పుడు నాకు ఏమనిపించిందో మీ వాఖ్య చూశాక స్పష్టమయింది. నాకు చెప్పడం రాలేదు.

  • డాక్టర్: గుర్రం సీతరాములు గారు ఈ కథలో బివోద్వేగాలు,జీవితాన్ని పిండిన పసర వాసనలు పిండారాపోశారు. కవిత్వం దట్టించి కథను నడిపించినతీరు , అద్బతమైన నడకతో ఊరుంబడీ జీవితాన్నీ ఆవిష్కరించారు. సాంస్కృతిక,సాహిత్య ,రాజకీయ వ్యాసాలు ఇంతకు ముందు డాక్టర్ సీతారాములు గారువి అనేకం చూశాను, ఈ కథ చదివిన తర్వాత తెలుగు నేలపై మరో గొప్ప కథకుడు వచ్చాడనిపీస్తుంది ————
    యశ్ పాల్

  • డాక్టర్ గుర్రం సీతారాములు గారూ !

    పెత్తందారీ కులాల పీడన నుంచి బయటపడి విజయం సాధించిన వీరయ్య గురించి రాసిన మీకు నెనర్లు . . .

    ప్రపంచీకరణ వలన కునారిల్లిపోతున్న కుల వృత్తుల మీద కధ “ సాయం బండ “కధ అంటూ చక్కగా విశ్లేషిస్తూ స్పందించిన చల్లపల్లి స్వరూపరాణి గారికి నెనర్లు అనడం ఉత్తుత్తి నోటిమాటలవుతాయి. అంతకు మించినదేదో అనాలని ఉంది మా గొరుసన్న సాయం తీసుకుని.

    బతకడానికే నానా తిప్పలు పడే మనం బతుకమ్మ ఎట్లా ఆడతాం బిడ్డా ! ( “ పాలపిట్టల పాట “ కధ ). అందరిలా బతుకమ్మ ఆడుకోలేని కడజాతి ఆడపడచుల హృదయ వేదనను ఎంతో ఆర్తిగా బతుకమ్మ పాత్ర గురించి రాసినోడు;

    అప్పులు తీర్చలేక ఉరి పెట్టుకుని రైతులు చచ్చిపోతున్న ఊరవతల ఊడల మర్రిచెట్టుని, బ్రహ్మరాక్షసిని వధించిన పరశురాముని లా, చేతిలో గండ్రగొడ్డలి పట్టుకుని మొదలు దాకా నరికిన ఎకరం భూమి రైతు, అప్పులు పాలైన రైతు నారాయణ ( “ ఊరవతల ఊడల మర్రి “ కధ ) గురించి రాసినోడూ చందు.

    తన జీవిత భాగస్వామి తులసి తల్లి పేరును తన పేరుతో కలుపుని తెలుగు కధా సాహిత్య రంగంలో తన వంతు సేద్యం చేస్తున్నోడు చందు తులసి. తన గురించి మరిన్ని వివరాలు కావాలంటే మాయమ్మ ” గజయీతరాలు ” గొరుసన్నను అడగండి.

    ~ గొరుసన్న గారి తంపులమారి రావయ్య

    • థాంక్స్ రాములన్న ఎక్కడన్నా మంచి వాక్యం కనిపిస్తే ఇది పదిమందికి చేరాలి అనే మీ తపన నాకెప్పుడూ ముచ్చట. మొదటి సారి రాసిన కథ. కొన్ని లోపాలు మిత్రుల ద్వారా తెలుసు కున్నా
      రాబోయే రోజుల్లో సరి చేసుకుంటా

  • చాలా బాగుంది. ఎన్నివేల మంది రాములు ఇలా అంతర్ధానమైపోతున్నారో నిశ్శబ్దంగా!

  • మొత్తం చదివించేలా రాసావ్….బాగుంది సీత .. సాహితీ స్రుజన కూడా వంటకం లాంటిదే … ఐటంస్ ఎక్కువ ఉన్నాయని కుమ్మరియ్యొద్దు .. కూరనో, స్వీటో ..దానికి తగ్గట్టు వెయ్యాలి … be as good chef 🙂

  • మిత్రుడు సీతారాములు గారికి ..ఈ రోజు మీ కధ( మన ఊరి కధ) చదివా మన మిత్రుడు మహర్షి పంపటముతో …నా బాల్యాన్ని , లోతైన జ్ఞాపకాలు తట్టి లేపారు …ఆధునిక సమాజములో కొట్టుకుపోతున్న నాకు ..మీ కధ చదవగానే కళ్ళు చెమర్చాయి …మనిషి జీవన విధానము,భాద్యత మరియు విధి రాత అద్భుతముగా రాసారు …అన్ని వాస్తవాలే …నేను బాల్యములో విన్న భాష.చూసిన పరిసరాలు గుర్తుకు వచ్చాయి …ఒక అద్భుతమైన కధ….ఇంకా చెప్పాలని వుంది ..

    • థాంక్స్ రాజు సర్. మహర్షి అన్నకు నేనే చెప్పా మీకు పంపమని.ఈ సందర్భంగా నాన్న శేషం రాజు సర్ (తక్కువ కాలమే అయినా నాకు చదువు చెప్పారు) యాదికి వచ్చారు. అద్భుతమైన విద్వత్ ఆయన సొంతం.ఆయన మీద చిన్న మోనోగ్రాఫ్ రాసుకోలేక పోయామే అని బాధ ఉంది. మనం ఎంత ఆధునిక సమాజం లో ఉన్నా పుట్టిన ఊరు మూలాలు మన తోనే ఉంటాయి.కావాల్సింది వాటిని తట్టి లేపడమే. మీది నాది ఒకే ఊరు, బడి, గుడి,ఒకే కథ ఆ కథే మనల్ని మర్చి పోకుండా చేస్తాయి.రాములు మరణం నన్ను అంతగా కదిలించింది.నా కథ మీబాల్యాన్ని తట్టి లేపింది అంటే నా లక్ష్యం నెరవేరింది అనిపిస్తోంది.

  • మన బతుకులు బరువనుకున్న…
    కానే కాదు… ఒక అలిసిన ఇసుర్రౌత్ లాగా తిరుగుతూనే ఉండే జీవితాలు. మనకు బరువు కాదు.

    సాపిరయ్య రెండు చక్రాలు అనే భూదేవి అమ్మ మరియు రాములును నిల్వున పాతేసింది… సాయం బండ ఎన్ని వినోదాలు చూసిందో అన్నీ బరువెక్కిన బాధలు కూడా మోసింది… ఆ సాయం బండ ఈ నాటి సీతన్న కళ్ళలో తిరిగే కన్నీరుకు నిదర్శనమని. గుర్తొస్తుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు